లేఖనములు
అబ్రాహాము 1


అబ్రాహాము గ్రంథము

ప్రాచీన పత్రాల నుండి జోసెఫ్ స్మిత్ చేత అనువదించబడెను

ఐగుప్తులోని సమాధుల నుండి తేబడి, మా హస్తగతమైన కొన్ని ప్రాచీన గ్రంథముల అనువాదము. ఐగుప్తులోనుండగా అబ్రాహాము వ్రాసిన రచనలు అబ్రాహాము గ్రంథముగా పిలువబడెను, అవి ప్రాచీన పత్రాలపై అతని స్వహస్తముతో వ్రాయబడెను.

1వ అధ్యాయము

గోత్రజనక క్రమము యొక్క దీవెనలను అబ్రాహాము కోరెను—కల్దీయుల దేశములోని అబద్ధ యాజకులచేత అతడు హింసించబడెను—యెహోవా అతడిని రక్షించును—ఐగుప్తు యొక్క ఆరంభము, ప్రభుత్వము వివరించబడినవి.

1 కల్దీయుల దేశమందు, నా తండ్రి నివాస స్థలములోనుండగా వేరొక నివాస స్థలము పొందుట నాకు అవసరమని అబ్రాహాము అను నేను తలంచితిని;

2 నాకు గొప్ప ఆనందము, సమాధానము, విశ్రాంతి దొరికినందువలన, నా పితరుల దీవెనల కొరకు మరియు వాటిని నిర్వహించుటకు నేను నియమించబడు హక్కుకొరకు నేను ఆపేక్షించితిని; నీతిననుసరించి నడుచుకొనువాడనై, గొప్ప జ్ఞానము గలవానిగా, నీతికి గొప్ప అనుచరునిగా, మరింత జ్ఞానమును కలిగియుండుటకు, అనేక జనములకు తండ్రిగా, సమాధానకర్తయగు అధిపతిగానుండుటకు, ఉపదేశములు పొందుటకు, దేవుని ఆజ్ఞలను పాటించుటకు కోరిక కలిగియుండి, పితరులకు చెందిన హక్కును కలిగియుండి న్యాయముగా నేను వారసుడను మరియు ప్రధాన యాజకుడనైతిని.

3 నా పితరులనుండి అది నాకు ప్రోక్షించబడినది; ఆది కాలమునుండి అది పితరులనుండి వచ్చినది, ఆదినుండి లేదా భూమి పునాది వేయబడక మునుపు నుండి ప్రస్తుత కాలము వరకు, జ్యేష్ఠత్వాధికారము లేదా ప్రథముడైన ఆదాము లేదా మన మొదటి తండ్రి యొక్క హక్కు నా పితరుల ద్వారా నాకు వచ్చెను.

4 తన సంతానమును గూర్చి పితరులకు దేవుడు చేసిన నియామకము ప్రకారము నా యాజకత్వ నియామకము కొరకు నేను ఆపేక్షించితిని.

5 అన్య దేవతలను పూజించుటకు నా పితరులు వారి నీతినుండి, వారి దేవుడైన ప్రభువు వారికిచ్చిన పరిశుద్ధ ఆజ్ఞలనుండి తొలగిపోయిరి మరియు నా మాటను వినుటకు పూర్తిగా తిరస్కరించిరి;

6 ఏలయనగా వారి హృదయములు కీడు తలపెట్టెను, మరియు ఎల్కానా దేవత, లిబ్నా దేవత, మహమక్రా దేవత, కొరాషు దేవత, ఐగుప్తు రాజైన ఫరో దేవత తట్టు పూర్తిగా తిరిగిపోయెను;

7 కాబట్టి వారు తమ పిల్లలను ఈ మూగ ప్రతిమలకు బలిగా అర్పించుటకు తమ హృదయాలను అన్యజనుల యొక్క బలి వైపుకు త్రిప్పుకొనిరి, నా మాటను ఆలకించక ఎల్కానా యాజకుని చేతివలన నా ప్రాణము తీయజూచిరి. ఎల్కానా యొక్క యాజకుడు ఫరోకు కూడా యాజకుడైయుండెను.

8 ఈ సమయములో ఐగుప్తు రాజైన ఫరో యొక్క యాజకుని ఆచారమేమనగా, కల్దీయుల దేశములో నిర్మించబడిన బలిపీఠముపై పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను ఈ వింత దేవతలకు బలిగా అర్పించుట.

9 ఆ యాజకుడు ఫరో దేవతకు, షగ్రీలు దేవతకు ఐగుప్తీయుల ఆచారము ప్రకారము బలి అర్పించెను. షగ్రీయుల దేవత సూర్యుడు.

10 ఓలిషెము మైదానమునకు ప్రధాన ద్వారమునొద్దనున్న ఫోతీఫరు కొండగా పిలువబడే కొండమీదనున్న బలిపీఠముపై ఫరో యాజకుడు పసివానిని కృతజ్ఞతార్పణముగా బలిచ్చెను.

11 ఇప్పుడు ఈ యాజకుడు ఈ బలిపీఠముపై ఒకేసారి ముగ్గురు కన్యకలను బలి ఇచ్చెను; వారు హాము గర్భవాసమునుండి పుట్టిన వారసులలో ఒకడైన ఒనిటా కుమార్తెలు. ఈ కన్యకలు తమ సుగుణము వలన బలిగా అర్పించబడిరి; కొయ్య లేదా రాతి ప్రతిమలకు వారు సాగిలపడుటకు ఇష్టపడలేదు, కాబట్టి ఈ బలిపీఠముమీద వారు చంపబడిరి మరియు అది ఐగుప్తీయుల ఆచారము ప్రకారము జరిగెను.

12 అప్పుడు ఈ బలిపీఠము మీద ఆ కన్యకలను చంపిన విధముగా నన్ను కూడా చంపవలెనని ఆ యాజకులు నన్ను బలాత్కారముతో బంధించిరి; ఈ బలిపీఠమును గూర్చి మీరు తెలుసుకొనునట్లు, ఈ గ్రంథము ఆరంభములోనున్న చిత్రమును చూడమని నేను మీకు సూచించుచున్నాను.

13 అది కల్దీయులు కలిగియున్న విధముగా పరుపు ఆకారములో చేయబడెను, అది ఎల్కానా, లిబ్నా, మహమక్రా, కొరాషు దేవతలు మరియు ఐగుప్తు రాజైన ఫరోను పోలిన దేవత ముందు నిలబెట్టబడెను.

14 ఈ దేవతలను గూర్చి మీకు అవగాహన కలుగునట్లు, ఆరంభములోనున్న చిత్రములలో వాటి ఆకారమును నేను మీకు ఇచ్చితిని, ఆ విధమైన చిత్రములు కల్దీయులచేత రహ్లీనస్ అని పిలువబడెను, అది రహస్యలిపిని సూచించును.

15 నన్ను బలిగా అర్పించి నా ప్రాణమును తీయుటకు నాపై వారు తమ చేతులనెత్తగా, ఇదిగో నేను నా దేవుడైన ప్రభువుకు నా స్వరమెత్తి మాట్లడగా, ప్రభువు విని ఆలకించి, సర్వశక్తుని దర్శనముతో ఆయన నన్ను నింపెను మరియు ఆయన సన్నిధి దూత నా ప్రక్కన నిలిచెను, వెంటనే నా కట్లు విప్పెను;

16 ఆయన స్వరము నాతో ఇట్లనెను—అబ్రాహామా, అబ్రాహామా, ఇదిగో నా పేరు యెహోవా, నేను నీ మాట విని, నిన్ను విడిపించుటకు, నీ తండ్రి ఇంటనుండి మరియు నీ బంధువులందరినుండి నీవెరుగని ఒక క్రొత్త దేశమునకు నిన్ను తీసుకొని వెళ్ళుటకు క్రిందకు దిగివచ్చితిని;

17 ఎందుకనగా వారు ఎల్కానా దేవత, లిబ్నా దేవత, మహమక్రా దేవత, కొరాషు దేవత మరియు ఐగుప్తు రాజైన ఫరో దేవతను పూజించుటకు తమ హృదయాలను నా నుండి త్రిప్పివేసిరి; కాబట్టి వారిని దర్శించుటకు, నా కుమారుడవైన అబ్రాహామా, నీకు విరోధముగా తన చేతినెత్తి నీ ప్రాణము తీయగోరిన వానిని నాశనము చేయుటకు నేను దిగివచ్చితిని.

18 ఇదిగో, నేను నీ చేయి పట్టుకొని నడిపించెదను; నీపై నా నామమును, నీ తండ్రి యొక్క యాజకత్వమును కూడా ఉంచుటకు నిన్ను నా ఆధీనములో ఉంచుకొనెదను మరియు నా శక్తి నీమీద నుండును.

19 నోవహుతో ఉన్నవిధమగా అది నీతో ఉండును; కానీ నీ పరిచర్య ద్వారా భూలోకములో నా నామము తెలియజేయబడును, ఏలయనగా నీ దేవుడను నేనే.

20 ఇదిగో, పోతీఫరు కొండ కల్దీయుల ఊరను పట్టణములో ఉండెను. ప్రభువు ఎల్కానా యొక్కయు, దేశ దేవతల యొక్కయు బలిపీఠములను పగులగొట్టి, వాటిని పూర్తిగా నాశనము చేసెను మరియు యాజకుని మొత్తగా వాడు చచ్చెను; కల్దీయుల దేశములో మరియు ఫరో న్యాయస్థానములో కూడా గొప్ప వేదన కలిగెను; ఫరో రాజవంశపు రక్తసంబంధము వలన రాజైన వానిని ఈ ఫరో సూచించును.

21 ఈ ఐగుప్తు రాజు హాము గర్భవాసము నుండి పుట్టిన వారసుడు మరియు పుట్టుకతో కనానీయుల రక్తమును పంచుకొని పుట్టినవాడు.

22 ఐగుప్తీయులందరు ఈ వారసత్వము నుండి పుట్టినవారు, కాబట్టి కనానీయుల రక్తము దేశములో సంరక్షించబడినది.

23 ఐగుప్తు దేశము మొదట ఒక స్త్రీచేత కనుగొనబడెను, ఆమె హాము కుమార్తె మరియు ఐగుప్తా యొక్క కుమార్తెయైయున్నది, కల్దీయుల భాషలో ఇది ఐగుప్తును సూచించును, ఇది నిషేధించబడిన దానిని సూచించును;

24 ఈ స్త్రీ ఆ దేశమును కనుగొనినప్పుడు అది నీటమునిగియుండెను, తరువాత ఆమె తన కుమారులను ఆ దేశమునందు స్థిరపరిచెను; ఆవిధముగా హామునుండి ఆ జాతి ఉద్భవించెను, అది ఆ శాపమును దేశములో నిలిపియుంచెను.

25 ఇప్పుడు హాము కుమార్తెయైన ఐగుప్తా యొక్క జ్యేష్ఠకుమారుడైన ఫరోచేత ఐగుప్తు యొక్క మొదటి ప్రభుత్వము నెలకొల్పబడెను, అది పితృస్వామ్యక్రమమైనదై హాము ప్రభుత్వ విధానము ప్రకారము ఉండెను.

26 ఫరో నీతిమంతుడు గనుక తన రాజ్యమును స్థాపించి, మొదటి గోత్రజనకుని పరిపాలనా దినములలో చేయబడిన పరిపాలనలో అనగా ఆదాము పరిపాలనలో, అంతేకాక తన తండ్రియైన నోవహు పరిపాలనలో మొదటి తరములలో పితరులచేత నెలకొల్పబడిన క్రమమును శ్రద్ధగా అనుకరిస్తూ తన దినములన్నిటిలో వివేకముతో, న్యాయముగా తన జనులకు తీర్పుతీర్చెను. నోవహు భూలోక దీవెనలతోను జ్ఞానపు దీవెనలతోను వానిని దీవించెను, కానీ యాజకత్వము విషయములో వానిని శపించెను.

27 ఇప్పుడు హాము ద్వారా నోవహు నుండి యాజకత్వము పొందితిమని ఫరోలు ఇష్టపూర్వకముగా ఆరోపించినప్పటికీ, ఫరో ఆ హక్కును పొందజాలని వంశక్రమమునకు చెందెను గనుక, నా తండ్రి వారి విగ్రహారాధన చేత నడిపించివేయబడెను;

28 కానీ ఇకమీదట నేను నా వంశావళిని సృష్టి ఆరంభమువరకు వివరించుటకు ప్రయత్నించెదను, ఏలయనగా గ్రంథములు నా యొద్దకు వచ్చియున్నవి, నేటివరకు వాటిని నా యొద్ద ఉంచుకొనియున్నాను.

29 ఇప్పుడు, ఎల్కానా యాజకుడు మొత్తబడి చచ్చిన తరువాత, దేశములో కరువు వచ్చునని కల్దీయుల దేశమును గూర్చి నాకు చెప్పబడిన సంగతులు నెరవేర్చబడెను.

30 ఆ ప్రకారమే కల్దీయుల దేశమంతటా కరువు వ్యాపించెను, కరువు వలన నా తండ్రి తీవ్రముగా బాధింపబడెను, నా ప్రాణము తీయవలెనని నాకు విరోధముగా తలపెట్టిన కీడును గూర్చి ఆయన పశ్చాత్తాపపడెను.

31 కానీ యాజకత్వ హక్కును గూర్చి గోత్రజనకులైన పితరుల గ్రంథములను నా దేవుడైన ప్రభువు నా స్వహస్తములలో భద్రపరిచెను; కాబట్టి పితరులకు తెలుపబడిన విధముగా సృష్టి ఆరంభమును గూర్చి, గ్రహములు, నక్షత్రములను గూర్చిన జ్ఞానమును కూడా ఈ దినము వరకు నేను భద్రపరచియున్నాను, నా తరువాత వచ్చు నా సంతానము యొక్క ప్రయోజనము కొరకు ఈ సంగతులలో కొన్నింటిని ఈ గ్రంథములో వ్రాయుటకు నేను ప్రయత్నించెదను.