లేఖనములు
అబ్రాహాము 3


3వ అధ్యాయము

అబ్రాహాము ఊరీము తుమ్మీము ద్వారా సూర్య చంద్ర నక్షత్రములను గూర్చి నేర్చుకొనును—ఆత్మల యొక్క నిత్యస్వభావమును గూర్చి ప్రభువు అతనికి బయలుపరచును—భూలోకమునకు ముందు జీవితము, పూర్వ నియామకము, సృష్టి, విమోచకుని ఎంపిక, నరుని రెండవ స్థితిని గూర్చి అతడు నేర్చుకొనును.

1 అబ్రాహాము అను నేను ఊరీము తుమ్మీమును కలిగియుంటిని, వాటిని నా దేవుడైన ప్రభువు కల్దీయుల ఊరను పట్టణములో నాకిచ్చెను;

2 నక్షత్రములను నేను చూడగా అవి బహుగొప్పగానుండెను, వాటిలోనొకటి దేవుని సింహాసనమునకు సమీపముగానుండెను; దానికి సమీపములో గొప్పవి అనేకము కలవు;

3 మరియు ప్రభువు నాతో ఇట్లనెను—ఇవి ప్రధానమైనవి; మొదటి దాని పేరు కోలబ్, అది నాకు సమీపములో నున్నది, మీ దేవుడైన ప్రభువును నేనే; నీవు నిలబడియున్న దాని క్రమమునకు చెందిన వాటన్నిటిని పరిపాలించుటకు దీనిని నేను ఏర్పరచియున్నాను.

4 ఊరీము తుమ్మీము ద్వారా ప్రభువు నాతో చెప్పినదేమనగా, కోలబ్ యొక్క కాలము మరియు ఋతువుల ప్రకారము దాని భ్రమణములలో అది ప్రభువు కాలము ప్రకారమున్నది; ఆయన లెక్క ప్రకారము ప్రభువుకు ఒక భ్రమణము ఒక దినముతో సమానము, నీవు నిలబడియున్న దానికి నియమించబడిన కాలము ప్రకారము అది వెయ్యి సంవత్సరములు. కోలబ్ లెక్కింపు ప్రకారము ఇది ప్రభువు కాలము యొక్క లెక్కింపు.

5 ప్రభువు నాతో ఇట్లనెను: తక్కువ వెలుగు కలిగి రాత్రిని ఏలే గ్రహము పగటిని ఏలుదానికంటే చిన్నది, కాలము లెక్కించుటను బట్టి అది నీవు నిలుచున్న భూమికంటే పైగా లేదా ఎక్కువగానున్నది, ఏలయనగా అది నెమ్మదిగా కదులుచున్నది; అది ఒక క్రమములో ఉన్నది, ఎందుకంటే అది నీవు నిలబడియున్న భూమికంటే పైన ఉన్నది, కాబట్టి దాని కాలపు లెక్క ప్రకారము భూమికంటె తక్కువ రోజులు, నెలలు, సంవత్సరములు కలిగియున్నది.

6 మరియు ప్రభువు నాతో ఇట్లనెను—అబ్రాహామా, ఈ రెండు వాస్తవాలు యథార్థమైనవి, ఇదిగో నీ కన్నులు వాటిని చూచెను; కాలముల లెక్కింపు మరియు నిర్ణీత కాలము గూర్చి, అవును నీవు నిలబడియున్న భూమి యొక్క నిర్ణీతకాలము, పగటిని ఏలుటకు నియమింపబడిన పెద్దజ్యోతి యొక్క నిర్ణీతకాలము, రాత్రిని ఏలుటకు నియమింపబడిన చిన్నజ్యోతి యొక్క నిర్ణీతకాలము గూర్చి తెలుసుకొనుటకు నీకు అనుగ్రహింపబడెను.

7 చిన్నజ్యోతి యొక్క నిర్ణీతకాలము, దాని కాలము యొక్క లెక్కింపు నీవు నిలబడియున్న భూమి కాలము యొక్క లెక్కింపుతో పోల్చినప్పుడు ఎక్కువగానుండును.

8 ఎక్కడ ఈ రెండు వాస్తవాలు ఉండునో, అక్కడ వాటిపై మరొక వాస్తవము ఉండును, అదేమనగా కాలము యొక్క లెక్కింపు మరింత ఎక్కువగల మరొక గ్రహము అక్కడ ఉండును;

9 కాబట్టి నీవు కోలబ్ దగ్గరకు వచ్చేసరికి ఒక గ్రహము యొక్క కాలపు లెక్కకు మించిన మరొక గ్రహముండును, ఆ కోలబ్ ప్రభువు కాలము యొక్క లెక్కింపు ప్రకారమున్నది; నీవు నిలబడియున్న దాని క్రమమునకు చెందిన గ్రహములన్నిటిని పరిపాలించుటకు కోలబ్ దేవుని సింహాసనమునకు దగ్గరగా ఏర్పరచబడినది.

10 దేవుని సింహాసనమును నీవు సమీపించు వరకు వెలుగునిచ్చుటకు గల నక్షత్రములన్నిటి యొక్క నిర్ణీత కాలమును తెలుసుకొనుటకు నీకు అనుగ్రహించబడెను.

11 కాబట్టి, మనుష్యులు ఒకనితోనొకడు మాట్లాడునట్లు అబ్రాహాము అను నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడితిని; తన హస్తకృత్యములను గూర్చి ఆయన నాతో చెప్పెను;

12 ఆయన నాతో—నా కుమారుడా, నా కుమారుడా (ఆయన హస్తము చాపబడియుండెను), ఇదిగో వీటన్నిటిని నేను నీకు చూపెదననెను. ఆయన తన చేతిని నా కన్నులపై ఉంచగా, ఆయన హస్తకృత్యములను నేను చూచితిని, అవి అనేకముండెను; అవి నా కన్నుల యెదుట విస్తరింపగా వాటి అంతమును నేను చూడలేకపోతిని.

13 ఆయన నాతో—ఇది షినేహా అని చెప్పెను, అనగా సూర్యుడు. ఆయన నాతో—కోకబ్ అని చెప్పెను, అనగా నక్షత్రము. ఆయన నాతో—ఒలియ అని చెప్పెను, అనగా చంద్రుడు. ఆయన నాతో—కోకబీమ్ అని చెప్పెను, అది ఆకాశమందున్న నక్షత్రములను లేదా గొప్ప జ్యోతులన్నిటిని సూచించును.

14 ప్రభువు నాతో ఈ మాటలు చెప్పినప్పుడు అది రాత్రియైయుండెను: వీటివలె నిన్నును, నీ తరువాత నీ సంతానమును నేను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను; నీవు లెక్కింప శక్యముకానీ ఇసుక రేణువులవలె నీ సంతానపు సంఖ్య ఉండును.

15 ప్రభువు నాతో—అబ్రాహామా, ఈ మాటలన్నిటిని నీవు ప్రకటించుటకు నీవు ఐగుప్తుకు వెళ్ళకమునుపు ఈ సంగతులను నేను నీకు చూపుచున్నాననెను.

16 రెండు సంగతులు ఉండి, వాటిలో ఒకటి రెండవ దానికంటే ఉన్నతముగా ఉండిన యెడల, వాటికంటే ఉన్నతమైన సంగతులు ఉండును; కాబట్టి నీవు చూచియున్న కోకబీములన్నిటిలో కోలబ్ గొప్పది, ఎందుకనగా అది నాకు సమీపములోనున్నది.

17 ఇప్పుడు, రెండు సంగతులు ఉండి, ఒకదానికంటే ఉన్నతముగా రెండవది మరియు భూమికంటే ఉన్నతముగా చంద్రుడు ఉండినయెడల, దానికంటే ఉన్నతముగా ఒక గ్రహము లేదా ఒక నక్షత్రము ఉండును; ఆయన చేయ సంకల్పించిన దానిని తప్ప మరి దేనిని దేవుడైన ప్రభువు చేయకుండును.

18 అయినప్పటికీ ఆయన గొప్ప నక్షత్రమును చేసెను; అదేవిధముగా, రెండు ఆత్మలు ఉండి, ఒక ఆత్మ రెండవ ఆత్మకంటే ఎక్కువ మేధస్సు కలిగియుండి, అవి ఒకదానికంటే మరొకటి ఎక్కువ మేధస్సు కలిగియున్నప్పటికీ వాటికి ఆరంభము లేదు; అవి సృష్టికిముందు ఉండెను, వాటికి అంతము లేదు, అవి సృష్టి తరువాత కూడా ఉండును, ఏలయనగా అవి నోలామ్ లేదా నిత్యమైనవి.

19 ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను: ఒకదాని కంటే మరొకటి ఎక్కువ మేధస్సు గల రెండు ఆత్మలు కలవు, ఈ రెండు వాస్తవాలు యథార్థమైనవి; వారికంటే మేధస్సు కలిగిన వేరొకరు ఉండును, నీ దేవుడును ప్రభువునైన నేను వారందరి కంటే ఎక్కువ మేధస్సు కలిగియున్నాను.

20 ఎల్కానా యాజకుని చేతులలో నుండి నిన్ను విడిపించుటకు నీ దేవుడైన ప్రభువు తన దూతను పంపెను.

21 వారందరి మధ్య నేను నివాసముంటిని; కావున నా చేతులతో చేయబడిన కార్యములు ప్రకటించుటకు ఇప్పుడు నేను క్రిందకు దిగి నీ యొద్దకు వచ్చితిని, అన్నింటికి మించిన నా జ్ఞానము వాటియందున్నది, ఏలయనగా పైన ఆకాశమందును, క్రింద భూలోకమందును మొదటినుండి నీ కన్నులు చూచిన సమస్త మేధస్సుపై సమస్త జ్ఞానముతోను, ఆలోచనతోను నేను పరిపాలన చేయుచున్నాను; నీవు చూచిన సమస్త మేధస్సుగల వారి మధ్యకు ఆదియందు నేను క్రిందికి దిగి వచ్చితిని.

22 ఇప్పుడు ప్రభువు లోకము రూపింపబడక మునుపు ఏర్పాటు చేయబడిన మేధస్సును అబ్రాహాము అను నాకు చూపించెను; వీరందరి మధ్య ఘనులు, గొప్పవారు అనేకులు ఉండిరి;

23 ఈ ఆత్మలు మంచివని చూచి, వారి మధ్య నిలుచుండి, దేవుడు ఇట్లనెను: వీరందరిని నేను నా అధికారులుగా చేయుదును; ఏలయనగా ఆత్మలుగా ఉన్నవారి మధ్య ఆయన నిలుచుండెను, వారు మంచివారని ఆయన చూచెను; ఆయన నాతో—అబ్రాహామా, నీవు వారిలో ఒకడవు; నీవు పుట్టక మునుపే నీవు ఎన్నుకోబడితివి అనెను.

24 అక్కడ దేవుని పోలిన ఒకడు వారి మధ్య నిలబడియుండెను, అతనితోనున్న వారితో అతడు ఇట్లనెను—మనము క్రిందికి వెళ్ళెదము, ఏలయనగా అక్కడ స్థలమున్నది, ఈ పదార్థములను మనము తీసుకొని వెళ్ళెదము, వీరందరు నివాసముండుటకు మనము ఒక భూలోకమును చేయుదుము;

25 వారి దేవుడైన ప్రభువు వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని వారు గైకొందురో లేదోనని మనము వారిని పరీక్షించెదము;

26 ఎవరైతే మొదటి స్థితిలో విధేయులైయుందురో వారికి మరింత ఇవ్వబడును; ఎవరైతే తమ మొదటి స్థితిలో విధేయులుగానుండరో వారు మొదటి స్థితిలో విధేయులైయున్న వారితో ఆ రాజ్యములో మహిమను కలిగియుండరు; ఎవరైతే రెండవ స్థితిలో విధేయులైయుందురో వారి శిరస్సులపై మరింత మహిమ నిరంతరము ఇవ్వబడును.

27 అందుకు ప్రభువు ఇట్లనెను—నేనెవరిని పంపవలెను? అప్పుడు మనుష్య కుమారుని పోలిన ఒకడు—నేనున్నాను, నన్ను పంపుము అని పలికెను. మరియొకడు—నేనున్నాను, నన్ను పంపుము అని పలికెను. అందుకు ప్రభువు—నేను మొదటి వానిని పంపెదననెను.

28 రెండవ వానికి ఆగ్రహము కలిగి తన మొదటి స్థితిని నిరూపించుకొనలేదు; ఆ దినమందు అనేకులు అతడిని వెంబడించిరి.