లేఖనములు
అబ్రాహాము 4


4వ అధ్యాయము

భూలోక సృష్టిని దానిపైన జీవరాశులను దేవుళ్ళు ప్రణాళిక చేసిరి—ఆరు దినముల సృష్టి కొరకు వారి ప్రణాళికలు వివరించబడినవి.

1 ప్రభువు ఇట్లనెను—మనము క్రిందికి వెళ్ళెదము. ఆదియందు వారు క్రిందికి వెళ్ళి, వారు అనగా దేవుళ్ళు భూమ్యాకాశములను సృజించిరి.

2 భూమి సృజించబడిన తరువాత అది శూన్యముగా, నిర్మానుష్యముగానుండెను, ఎందుకనగా వారు భూమిని తప్ప మరిదేనిని సృజించలేదు; చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుళ్ళ ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

3 వారు (దేవుళ్ళు)—వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.

4 వారు (దేవుళ్ళు) వెలుగును అవగాహన చేసుకొనిరి, ఏలయనగా అది ప్రకాశవంతముగానుండెను; వారు వెలుగును వేరుపరచిరి లేదా చీకటినుండి అది వేరగునట్లు చేసిరి.

5 దేవుళ్ళు వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరుపెట్టిరి. అస్తమయమునుండి ఉదయము వరకుగల సమయానికి రాత్రి అని పేరుపెట్టిరి; ఉదయము నుండి అస్తమయము వరకుగల సమయానికి వారు పగలు అని పేరుపెట్టిరి; పగలు, రాత్రి అని వారు పేరుపెట్టిన దానికి ఇది మొదలు లేదా ఆరంభము.

6 దేవుళ్ళు—జలముల మధ్యనొక విశాలము కలిగి అది ఆ జలములను, ఈ జలములను వేరుపరచును గాక అని పలికిరి.

7 దేవుళ్ళు విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరచునట్లు విశాలమును ఆజ్ఞాపించిరి; వారు ఆజ్ఞాపించిన ప్రకారమాయెను.

8 దేవుళ్ళు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టిరి. అది అస్తమయము నుండి ఉదయమువరకు జరుగగా దానికి వారు రాత్రి అని పేరుపెట్టిరి; ఉదయము నుండి అస్తమయము వరకు జరుగగా దానికి పగలని పేరుపెట్టిరి; వారు రాత్రి పగలని పేరుపెట్టుట ఇది రెండవ పర్యాయము.

9 దేవుళ్ళు—ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకయని ఆజ్ఞాపించగా, వారు ఆజ్ఞాపించిన ప్రకారమాయెను;

10 దేవుళ్ళు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిరి; జలరాశికి వారు సముద్రములని పేరు పెట్టిరి, అవి లోబడియుండుటను దేవుళ్ళు చూచిరి.

11 దేవుళ్ళు—గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను మొలిపించునట్లు భూమిని సిద్ధపరచెదమనిరి; వారు ఆజ్ఞాపించిన ప్రకారమాయెను.

12 తమ జాతి ప్రకారము గడ్డి దాని విత్తనము నుండి గడ్డిని, చెట్టు దాని విత్తనమునుండి చెట్టును మొలిపించునట్లు వారు భూమిని తయారు చేసిరి; తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు, వాటి విత్తనములు ఆ జాతినే మొలిపించునట్లు భూమిని చేసిరి; అవి లోబడియుండుటను దేవుళ్ళు చూచిరి.

13 వారు దినములను లెక్కించిరి; అస్తమయము నుండి ఉదయము వరకు వారు రాత్రి అని పేరుపెట్టిరి; ఉదయము నుండి అస్తమయము వరుకు వారు పగలని పేరుపెట్టిరి; ఇది మూడవ పర్యాయము.

14 దేవుళ్ళు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను ఏర్పాటు చేసిరి; అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములను సూచించుటకు వాటిని ఏర్పాటు చేసిరి.

15 భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ విశాలమందు అవి జ్యోతులైయుండుటకు వాటిని ఏర్పాటు చేయగా ఆ ప్రకారమాయెను.

16 దేవుళ్ళు రెండు గొప్పజ్యోతులను అనగా, పగటిని ఏలుటకు పెద్దజ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్నజ్యోతిని ఏర్పాటు చేసిరి; చిన్నజ్యోతితో నక్షత్రములను కూడా ఉంచిరి;

17 భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుళ్ళు ఆకాశ విశాలమందు వాటినుంచిరి.

18 దేవుళ్ళు వారు ఆజ్ఞాపించినవి లోబడువరకు వాటిని కనిపెట్టుకొనియుండిరి.

19 అప్పుడు అస్తమయమునుండి ఉదయము వరకు అది జరుగగా రాత్రి ఆయెను; ఉదయమునుండి అస్తమయము వరకు జరుగగా అది పగలు ఆయెను; ఇది నాలుగవ పర్యాయము.

20 దేవుళ్ళు—జీవము కలిగి చలించువాటిని సమృద్ధిగా పుట్టించుటకు జలములను సిద్ధపరచుదమనిరి; పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునట్లు చేయుదుమనిరి.

21 దేవుళ్ళు వాటివాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటిని పుట్టించుటకు జలములను సిద్ధపరచిరి; దానిదాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించిరి. అవి లోబడియుండునని, వారి ప్రణాళిక మంచిదని దేవుళ్ళు చూచిరి.

22 మరియు దేవుళ్ళు ఇట్లనిరి: వాటిని మేము దీవించెదము మరియు అవి ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములను లేదా జలరాశిని నిండించునట్లు చేయుదుము; పక్షులు భూమి మీద విస్తరించునట్లు చేయుదుము.

23 అప్పుడు అది అస్తమయము నుండి ఉదయము వరకు జరుగుగా దానికి రాత్రి అని పేరుపెట్టిరి; ఉదయము నుండి అస్తమయమువరకు జరుగగా దానికి పగలని పేరుపెట్టిరి; ఇది అయిదవ పర్యాయము.

24 దేవుళ్ళు వాటివాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటివాటి జాతి ప్రకారము పశువులను, ప్రాకెడి జీవులను, అడవి జంతువులను భూమి పుట్టించుటకు భూమిని సిద్ధపరచిరి; వారు పలికిన ప్రకారమాయెను.

25 దేవుళ్ళు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి జీవిని పుట్టించుటకు భూమిని ఏర్పాటుచేసిరి; అవి లోబడియుండునని దేవుళ్ళు చూచిరి.

26 మరియు దేవుళ్ళు తమలోతాము ఆలోచన చేసి, ఇట్లనిరి—మనము క్రిందికి వెళ్ళి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము; సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుటకు వారికి మనము అధికారమిచ్చెదము.

27 కాబట్టి దేవుళ్ళు క్రిందికి వెళ్ళి, తమ స్వరూపమందు నరుని సృజించిరి, దేవుళ్ళ స్వరూపమందు వారిని సృజించిరి, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించిరి.

28 దేవుళ్ళు—మనము వారిని దీవించెదమని పలికిరి. దేవుళ్ళు—వారు ఫలించి, అభివృద్ధిపొంది, విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనునట్లు, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలునట్లు మనము చేయుదమనిరి.

29 దేవుళ్ళు ఇట్లనిరి: ఇదిగో భూమి మీద పుట్టబోవు విత్తనములిచ్చు ప్రతి చెట్టును, ఫలములు గల ప్రతి వృక్షమును, విత్తనములుగల వృక్షఫలములను వారికిచ్చెదము; అవి వారికి ఆహారమగును.

30 భూమి మీదనుండు జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు మనము జీవమునిచ్చెదము, పచ్చని చెట్లన్నిటిని వాటికి ఆహారముగా ఇచ్చెదము, ఆవిధముగా ఇవన్నియు ఏర్పాటు చేయబడును.

31 దేవుళ్ళు—మనము పలికిన వాటన్నిటిని చేసి, వాటిని ఏర్పాటు చేయుదము; ఇదిగో అవి మిక్కిలి లోబడియుండుననిరి. అప్పుడు అస్తమయమునుండి ఉదయము వరకు ఇది జరుగగా దానికి రాత్రి అని పేరుపెట్టిరి; ఉదయము నుండి అస్తమయము వరకు ఇది జరుగగా దానికి పగలని పేరు పెట్టిరి; వారు ఆరవ పర్యాయము లెక్కించిరి.