లేఖనములు
మోషే 4


4వ అధ్యాయము

(1830 జూన్–అక్టోబరు)

సాతాను ఏవిధముగా అపవాది ఆయెను—అతడు హవ్వను శోధించును—ఆదాము హవ్వలు పతనమగుదురు మరియు లోకములోనికి మరణము ప్రవేశించును.

1 దేవుడును ప్రభువునైన నేను మోషేతో ఈ విధముగా పలికితిని: నా అద్వితీయ కుమారుని నామములో నీవు ఆజ్ఞాపించిన ఆ సాతాను, ఆదినుండి ఆవిధముగానే ఉండెను, అతడు నా యెదుటకు వచ్చి ఇట్లనెను—చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము, నేను నీ కుమారుడనై యుందును, ఒక్క ఆత్మయు నశింపకుండ సమస్త మానవాళిని నేను విమోచించెదను, నేను దానిని తప్పక చేయుదును; అయితే నీ ఘనతను నాకిమ్ము.

2 కానీ ఇదిగో నా ప్రియ కుమారుడు, ఆదినుండి నాకు ప్రియుడై ఎన్నుకోబడినవాడు నాతో—తండ్రీ, నీ చిత్తము నెరవేరును గాక, మహిమ ఎప్పటికీ నీకే కలుగును గాక అని పలికెను.

3 కాబట్టి, సాతాను నా యెడల తిరుగుబాటు చేసి, దేవుడును ప్రభువునైన నేను నరునికిచ్చిన స్వతంత్రతను నాశనము చేయుటకు చూచెను, అంతేకాక నా శక్తిని వానికి ఇవ్వవలెనని కోరెను; నా అద్వితీయ కుమారుని శక్తివలన అతడు పడద్రోయబడునట్లు నేను చేసితిని;

4 అబద్ధములకు తండ్రిగా, నరులను మోసపుచ్చుటకు మరియు గ్రుడ్డివారిగా చేయుటకు, నా స్వరము వినని వారందరిని అతని చిత్తప్రకారము చెరపట్టుటకు అతడు సాతానుగా, అపవాదిగా మారెను.

5 దేవుడును ప్రభువునైన నేను చేసిన భూజంతువులలో సర్పము యుక్తిగలదైయుండెను.

6 సాతాను దానిని సర్పము యొక్క హృదయములో ఉంచెను, (ఏలయనగా అతడు అనేకులను తన వైపునకు త్రిప్పుకొనెను) మరియు అతడు హవ్వను మోసపుచ్చుటకు చూచెను, ఏలయనగా దేవుని మనస్సును అతడు యెరుగకుండెను, అందువలన లోకమును నాశనము చేయుటకు అతడు చూచెను.

7 అతడు ఆ స్త్రీతో—ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. (అతడు సర్పము యొక్క నోటిద్వారా మాట్లాడెను)

8 అందుకు ఆ స్త్రీ—ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;

9 అయితే నీవు చూచుచున్న తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు—మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.

10 అందుకు సర్పము—మీరు చావనే చావరని ఆ స్త్రీతో చెప్పెను;

11 ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.

12 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునైయుండుట చూచినప్పుడు, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను.

13 అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి.

14 చల్లపూటను వారు తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన ప్రభువు స్వరమును వినిరి; ఆదామును అతని భార్యయు దేవుడైన ప్రభువు ఎదుటకు రాకుండా తోటచెట్ల మధ్యన దాగుకొనుటకు వెళ్ళిరి.

15 దేవుడును ప్రభువునైన నేను ఆదామును పిలిచి—నీవెక్కడున్నావు? అని అడిగితిని.

16 అందుకతడు—నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగానుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను.

17 దేవుడును ప్రభువైన నేను ఆదాముతో—నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని, నీవట్లు చేసిన యెడల నిశ్చయముగా చచ్చెదవని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగితిని.

18 అందుకు నరుడు—నాతోనుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను.

19 అప్పుడు దేవుడును ప్రభువైన నేను స్త్రీతో—నీవు చేసినది ఏమిటని అడిగితిని. అందుకు స్త్రీ—సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.

20 దేవుడును ప్రభువైన నేను సర్పముతో—నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు;

21 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగజేసెదను; అతడు నిన్ను తలమీద కొట్టును, నీవు అతడిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

22 దేవుడును ప్రభువైన నేను స్త్రీతో—నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో నీవు పిల్లలను కందువు, నీ భర్త యెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పితిని.

23 దేవుడును ప్రభువైన నేను ఆదాముతో—నీవు నీ భార్య మాట విని, తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు దాని పంట తిందువు.

24 అది ముండ్ల తుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును, నీవు పొలములోని పంట తిందువు.

25 నీవు నేలకు తిరిగి చేరువరకు—ఏలయనగా నీవు నిశ్చయముగా చచ్చెదవు—నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పితిని.

26 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి; దేవుడును ప్రభువైన నేను అనేకులైన స్త్రీలలో మొదటి స్త్రీని ఈ విధముగా పిలిచితిని.

27 దేవుడును ప్రభువైన నేను ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించితిని.

28 దేవుడును ప్రభువైన నేను నా అద్వితీయ కుమారునితో ఇట్లు చెప్పితిని—ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను; కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని,

29 దేవుడును ప్రభువైన నేను అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలోనుండి అతని పంపివేయుదును;

30 దేవుడును ప్రభువైన నా జీవముతోడు, నా మాటలు వ్యర్థము కానేరవు, ఏలయనగా అవి నా నోటినుండి బయలువెళ్ళిన తరువాత అవి తప్పక నెరవేరవలెను.

31 కాబట్టి నరుని వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టితిని.

32 (ఇవి నా సేవకుడైన మోషేతో నేను పలికిన మాటలు మరియు అవి నా చిత్తప్రకారము సత్యమైనవి; నేను వాటిని నీతో పలికితిని. నమ్మినవారికి తప్ప నేను నీకాజ్ఞాపించువరకు వాటిని ఏ మనుష్యునికి చూపకుండా నీవు చూచుకొనుము. ఆమేన్.)