లేఖనములు
మోషే 5


5వ అధ్యాయము

(1830 జూన్–అక్టోబరు)

ఆదాము హవ్వలు పిల్లలను కనిరి—ఆదాము బలి అర్పించి దేవుని సేవించెను—కయీను, హేబేలు పుట్టిరి—కయీను ఎదిరించి, దేవుని కంటే సాతానును ఎక్కువ ప్రేమించి, నాశనపుత్రుడయ్యెను—నరహత్య, దుష్టత్వము వ్యాపించెను—ఆదినుండి సువార్త ప్రకటించబడెను.

1 దేవుడును ప్రభువైన నేను వారిని బయటకు వెళ్ళగొట్టిన తరువాత, నేను ఆజ్ఞాపించిన విధముగా ఆదాము పొలము దున్నుట మొదలుపెట్టి, భూజంతువులన్నిటిని పాలించి, తన ముఖపు చెమట వలన తన ఆహారము తినెను. తన భార్యయైన హవ్వ కూడా అతనితో పనిచేసెను.

2 ఆదాము తన భార్యను కూడినప్పుడు, ఆమె అతనికి కుమారులను, కుమార్తెలను కనెను, వారు అభివృద్ధిచెంది భూమిని నింపుట మొదలుపెట్టిరి.

3 అప్పటినుండి, ఆదాము కుమారులు కుమార్తెలు పొలమును దున్నుటకు, మందను కాచుటకు ఆ దేశములో ఇద్దరిద్దరుగా విడిపోయిరి, వారు కూడా కుమారులను, కుమార్తెలను కనిరి.

4 ఆదాము, అతని భార్యయైన హవ్వ ప్రభువు నామమున ప్రార్థించగా, ఏదేను తోట మార్గమునుండి ప్రభువు స్వరము వారితో మాట్లాడుటను వారు వినిరి, కానీ వారాయనను చూడలేదు; ఏలయనగా వారు ఆయన సన్నిధి నుండి వేరుచేయబడిరి.

5 వారి దేవుడైన ప్రభువును ఆరాధించి, తమ మందలో తొలిచూలున పుట్టిన వాటిని ప్రభువుకు అర్పణగా తేవలెనని ఆయన వారికి ఆజ్ఞలిచ్చెను. ఆదాము ప్రభువు ఆజ్ఞలకు లోబడియుండెను.

6 అనేక దినములైన తరువాత ప్రభువు దూత ఆదాముకు ప్రత్యక్షమై—నీవెందుకు ప్రభువుకు బలులను అర్పించుచున్నావని అడిగెను. అందుకు ఆదాము—నేనెరుగను, కానీ ప్రభువు నన్నాజ్ఞాపించెనని చెప్పెను.

7 అప్పుడు దూత—ఇది తండ్రి యొక్క అద్వితీయ కుమారుని త్యాగమును పోలియున్నది, ఆయన కృపాసత్య సంపూర్ణుడైయున్నాడనెను.

8 కాబట్టి, నీవు చేయు సమస్తము కుమారుని నామములో చేయవలెను, నీవు పశ్చాత్తాపపడి నిరంతరము కుమారుని నామములో దేవునికి ప్రార్థన చేయవలెను.

9 ఆ దినమున తండ్రిని గూర్చియు, కుమారుని గూర్చియు సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మ ఈ విధముగా చెప్పుచు ఆదాము మీదకు వచ్చెను—ఆదినుండియు, ఇకమీదట ఎప్పటికీ తండ్రి యొక్క అద్వితీయ కుమారుడను నేనే, నీవు పతనమైతివి గనుక నీవును, సర్వమానవాళియు, కోరికగల ప్రతివాడును విమోచింపబడును.

10 ఆ దినమున ఆదాము దేవుని స్తుతించి ఆత్మవశుడై భూలోకపు కుటుంబములన్నింటిని గూర్చి ప్రవచించుట మొదలుపెట్టి ఇట్లనెను: దేవుని నామము స్తుతించబడును గాక, ఏలయనగా నా అపరాధము వలన నా కన్నులు తెరువబడినవి మరియు ఈ జీవితములో నేను ఆనందము కలిగియుందును, మరలా శరీరమందు దేవుని చూచెదను.

11 అతని భార్యయైన హవ్వ వీటన్నిటిని విని, ఆనందించి ఇట్లనెను—మనము అపరాధము చేయనియెడల మనమెన్నటికీ సంతానము కలిగియుండకపోవుదుము మరియు మంచి చెడులను, మన విమోచనానందమును, విధేయులందరికి దేవుడు అనుగ్రహించు నిత్యజీవమును యెరుగకపోదుము.

12 ఆదాము హవ్వలు దేవుని నామమును స్తుతించి, సమస్తమును వారి కుమారులు, కుమార్తెలకు తెలియజేసిరి.

13 సాతాను వారి మధ్యకు వచ్చి—నేను కూడా దేవుని కుమారుడనని చెప్పెను;వీటిని నమ్మకుడని అతడు వారిని ఆజ్ఞాపించెను; వారు దానిని నమ్మలేదు, వారు దేవుని కంటే సాతానును ఎక్కువ ప్రేమించిరి. అప్పటినుండి నరులు శరీరానుసారులు, ప్రకృతిసంబంధులు, దయ్యములవంటి వారగుట మొదలుపెట్టిరి.

14 దేవుడైన ప్రభువు ప్రతిచోట గల నరులను తన పరిశుద్ధాత్మ ద్వారా పిలిచి, పశ్చాత్తాపపడవలెనని వారిని ఆజ్ఞాపించెను;

15 కుమారునియందు నమ్మికయుంచి, తమ పాపములకు పశ్చాత్తాపపడిన వారందరు రక్షింపబడుదురు; నమ్మక, పశ్చాత్తాపపడని వారందరు నాశనమగుదురు; ఈ మాటలు స్థిరమైన శాసనముగా దేవుని నోటనుండి బయలువెళ్ళెను; కాబట్టి అవి నెరవేర్చబడవలెను.

16 ఆదాము, అతని భార్యయైన హవ్వ దేవుని ప్రార్థించుట మానలేదు. ఆదాము తన భార్యయైన హవ్వను కూడాగా, ఆమె గర్భవతియై కయీనును కని—ప్రభువునుండి నేనొక కుమారుని పొందితిని, గనుక అతడు ఆయన మాటలను తృణీకరించడని చెప్పెను. కానీ ఇదిగో, కయీను—నేను తెలుసుకొనుటకు ప్రభువు ఎవరు? అని పలికెను.

17 ఆమె మరలా గర్భవతియై అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు ప్రభువు స్వరమును ఆలకించెను. హేబేలు గొఱ్ఱెల కాపరి, కానీ కయీను భూమిని సేద్యపరచువాడు.

18 కయీను దేవునికంటె ఎక్కువ సాతానును ప్రేమించెను. సాతాను—ప్రభువుకు ఒక అర్పణ అర్పించుమని వానికాజ్ఞాపించెను.

19 కొంతకాలమైన తరువాత, కయీను పొలము పంటలో కొంత ప్రభువుకు అర్పణగా తెచ్చెను.

20 హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ప్రభువు హేబేలును, అతని అర్పణను లక్ష్యపెట్టెను;

21 కానీ కయీనును, అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. సాతాను ఇది యెరిగియుండెను, ఇది అతనికి సంతోషము కలిగించెను. కయీనుకు మిక్కిలి కోపమువచ్చి, అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనెను.

22 అందుకు ప్రభువు కయీనుతో—నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి?

23 నీవు సత్క్రియ చేసినయెడల అంగీకరించబడుదువు. నీవు సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును, మరియు సాతాను నిన్ను కోరుచుండెను; నీవు నా ఆజ్ఞలను పాటిస్తే తప్ప, నేను నిన్ను అప్పగించెదను, అప్పుడు అతని వాంఛను బట్టి నీకు జరుగును. నీవు వానిని ఏలుదువు;

24 ఏలయనగా ఇకనుండి అతని అబద్ధములకు నీవు తండ్రిగానుందువు; నీవు నాశనపుత్రునిగా పిలువబడుదువు; ఏలయనగా లోకము రూపింపబడక మునుపు నీవు కూడా జీవించియుంటివి.

25 రాబోవు కాలమందు నిన్ను గూర్చి ఈవిధముగా చెప్పబడును—ఈ హేయక్రియలన్నియు కయీను నుండి వచ్చినవి; ఏలయనగా దేవుని నుండి పొందిన గొప్ప ఉపదేశమును అతడు తిరస్కరించెను; మరియు నీవు పశ్చాత్తాపపడని యెడల ఈ శాపమును నేను నీమీద ఉంచెదననెను.

26 కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అప్పటినుండి ప్రభువు మాటనైనను, ప్రభువు యెదుట పరిశుద్ధముగా నడిచిన తన తమ్ముడైన హేబేలు మాటనైనను వినలేదు.

27 కయీను మరియు అతని సహోదరులను గూర్చి ఆదాము, అతని భార్య దుఃఖించిరి.

28 కయీను అతని సహోదరులలో ఒకని కుమార్తెను వివాహము చేసుకొనెను, వారు దేవునికంటె సాతానును ఎక్కువ ప్రేమించిరి.

29 సాతాను కయీనుతో ఇట్లనెను—నేడు నీ తమ్ముడైన హేబేలును నీ చేతులకు అప్పగించెదను; నా కంఠము మీద ప్రమాణము చేయుము మరియు దీనిని చెప్పిన యెడల నీవు చచ్చెదవు; వారు చెప్పకుండునట్లు నీ సహోదరుల తలలమీద సజీవుడైన దేవునితోడు ప్రమాణము చేయుము; వారు దీనిని చెప్పిన యెడల నిశ్చయముగా చచ్చెదరు; నీ తండ్రికి తెలియకుండునట్లు దీనిని చేయుము.

30 సాతాను తన ఆజ్ఞలను పాటించమని కయీనుతో ప్రమాణము చేయించుకొనెను. ఈ సంగతులన్నియు రహస్యముగా జరిగెను.

31 మరియు కయీను ఇట్లనెను—నిజముగా నేను మహానును, ఈ గొప్ప రహస్యమునకు అధిపతిని, లాభము పొందునట్లు నేను చంపెదను. కాబట్టి కయీను అధిపతియైన మహాను అని పిలువబడెను మరియు దుష్టత్వమందు అతడు అతిశయపడెను.

32 కయీను పొలములోనికి వెళ్ళి తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు ఇంకను పొలములోనుండగా, కయీను తన తమ్ముడైన హేబేలు మీదపడి అతడిని చంపెను.

33 కయీను—నేను స్వతంత్రుడను; నా తమ్ముని మందలు నా వశమగునని తాను చేసిన దానియందు అతిశయపడెను.

34 మరియు ప్రభువు—నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు—నేనెరుగను. నా తమ్మునికి నేను కావలివాడనా? అనెను.

35 ప్రభువు—నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.

36 కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండా నీవు శపించబడుదువు.

37 నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరివైయుందువనెను.

38 అందుకు కయీను ప్రభువుతో ఇట్లనెను—నా తమ్ముని మందల నిమిత్తము సాతాను నన్ను శోధించెను. నా అర్పణను కాక అతనిది నీవు అంగీకరించితివి గనుక నేను కోపము తెచ్చుకొంటిని; నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.

39 నేడు ప్రభువు యెదుటనుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడితిని; దిగులుపడుచు భూమి మీద నేను దేశదిమ్మరినైయుందును; కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నా పాపముల వలన నన్ను చంపును, ఏలయనగా ఈ సంగతులు ప్రభువు యెదుట దాచబడలేదు.

40 అందుకు ప్రభువునైన నేను అతనితో—ఎవడైనను నిన్ను చంపిన యెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగునంటిని. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతడిని చంపకయుండునట్లు ప్రభువైన నేను అతనికి ఒక గురుతు వేసితిని.

41 అప్పుడు కయీను ప్రభువు సన్నిధిలోనుండి పంపివేయబడి, ఏదేనుకు తూర్పుదిక్కున నోదు దేశములో తన భార్యతోను, తన సహోదరులలో అనేకులతోను కాపురముండెను.

42 కయీను తన భార్యను కూడినప్పుడు, ఆమె గర్భవతియై హనోకును కనెను, అతడు అనేకమంది కుమారులను కుమార్తెలను కనెను. అతడు ఒక ఊరు కట్టించి, ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకు అను పేరు పెట్టెను.

43 హనోకుకు ఈరాదు, ఇతర కుమారులు కుమార్తెలు పుట్టిరి. ఈరాదు మహూయాయేలును, ఇతర కుమారులను కుమార్తెలను కనెను. మహూయాయేలు మతుషాయేలును, ఇతర కుమారులను కుమార్తెలను కనెను. మతూషాయేలు లెమెకును కనెను.

44 లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను; వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవదాని పేరు సిల్లా.

45 ఆదా యాబాలును కనెను; అతడు పశువుల కాపరులు, గుడారములో నివసించువారికి మూలపురుషుడు; అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారను సానికను వాడుక చేయువారందరికి మూలపురుషుడు.

46 మరియు సిల్లా తూబల్కయీనును కనెను, అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.

47 లెమెకు తన భార్యలతో-ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి, నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువానిని చంపితిని.

48 ఏడంతలు ప్రతిదండన కయీను కోసము వచ్చిన యెడల, లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను;

49 కయీనువలె లెమెకు సాతానుతో నిబంధన చేసుకొనెను, దానివలన సాతానుచేత కయీనుకు ఇవ్వబడిన ఆ గొప్ప రహస్యమునకు అధిపతియై, అతడు మహాను అధిపతి అయ్యెను; మరియు వారి రహస్యము యెరిగినవాడై హనోకు కుమారుడైన ఈరాదు ఆదాము కుమారులకు దానిని తెలియపరచెను;

50 కాబట్టి లెమెకు కోపము తెచ్చుకొని అతడిని చంపెను, లాభముపొందుటకు కయీను తన తమ్ముడైన హేబేలును చంపిన విధముగా కాక, ప్రమాణము కొరకు అతని చంపెను.

51 ఏలయనగా కయీను దినములనుండి ఒక రహస్యకూడిక ఉండెను, వారి కార్యములు అంధకారమందుండెను, వారిలో ప్రతివాడు తన సహోదరుని యెరిగియుండెను.

52 కాబట్టి ప్రభువు లెమెకును, అతని ఇంటివారిని, సాతానుతో నిబంధన చేసుకొనిన వారందరిని శపించెను; వారు దేవుని ఆజ్ఞలను గైకొనలేదు, అది దేవునికి కోపము కలిగించెను, ఆయన వారికి సహాయము చేయలేదు, వారి కార్యములు హేయమైనవి, అవి మనుష్య కుమారులందరి మధ్య వ్యాపించసాగెను. అది మనుష్య కుమారుల మధ్యనుండెను.

53 మనుష్య కుమార్తెల మధ్య ఈ సంగతులు మాట్లాడబడలేదు, ఎందుకనగా లెమెకు ఈ రహస్యమును తన భార్యలతో చెప్పగా వారు జాలిపడక అతనికి విరోధముగా లేచి ఈ సంగతులను ఇతర ప్రాంతములో ప్రకటించిరి;

54 కాబట్టి, లెమెకు కొట్టబడి, వెలుపలకు తరిమివేయబడెను, అతడు చావకుండునట్లు మనుష్యకుమారుల మధ్యకు రాలేదు.

55 ఆ విధముగా చీకటి కార్యములు మనుష్య కుమారులందరి మధ్య వ్యాపించసాగెను.

56 దేవుడు నేలను కఠినమైన శాపముతో శపించెను మరియు దేవునికి దుష్టుల యెడల, ఆయన చేసిన మనుష్య కుమారులందరి యెడల కోపము కలిగెను;

57 ఏలయనగా ఆయన మాటను వారు ఆలకించలేదు, లోకము పునాది వేయబడక మునుపునుండి సిద్ధపరచబడి, మధ్యస్థకాలములో వచ్చునని ఆయన ప్రకటించిన ఆయన అద్వితీయ కుమారునియందు నమ్మికయుంచలేదు.

58 ఆ విధముగా దేవుని సముఖము నుండి పంపబడిన పరిశుద్ధ దూతలచేత, ఆయన స్వరముచేత మరియు పరిశుద్ధాత్మ వరముచేత ఆదినుండి సువార్త ప్రకటించబడుట ప్రారంభించబడెను.

59 ఈవిధముగా పరిశుద్ధ విధి ద్వారా సమస్తము ఆదాముకు నిర్ధారించబడెను, సువార్త ప్రకటించబడెను, లోకాంతము వరకు అది దానిలో ఉండునని ఒక శాసనము పంపబడెను; మరియు ఆ విధముగానే జరిగెను. ఆమేన్.