లేఖనములు
మోషే 6


6వ అధ్యాయము

(1830 నవంబరు–డిసెంబరు)

ఆదాము సంతానము ఒక జ్ఞాపకార్థ గ్రంథమును వ్రాయుదురు—నీతిమంతులైన ఆయన సంతానము పశ్చాత్తాపమును బోధింతురు—హనోకుకు దేవుడు తననుతాను ప్రత్యక్షపరచుకొనును—హనోకు సువార్తను ప్రకటించును—రక్షణ ప్రణాళిక ఆదామునకు బయలుపరచబడెను—అతడు బాప్తిస్మమును, యాజకత్వమును పొందెను.

1 ఆదాము దేవుని స్వరమును ఆలకించి, తన కుమారులకు పశ్చాత్తాపపడమని చెప్పెను.

2 ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనెను, అతనికి సేతు అని పేరుపెట్టెను. ఆదాము దేవుని నామమును మహిమపరచెను; ఏలయనగా కయీను చంపిన హేబేలునకు బదులుగా దేవుడు నాకు మరియొక సంతానమును అనుగ్రహించెనని అతడు అనెను.

3 దేవుడు సేతునకు తననుతాను ప్రత్యక్షపరచుకొనగా, అతడు వ్యాజ్యమాడక తన సహోదరుడైన హేబేలు వలె అంగీకారమగు బలిని అర్పించెను. అతనికి కూడా ఒక కుమారుడు కలుగగా వానికి ఎనోషు అని పేరు పెట్టెను.

4 అప్పుడు ఈ నరులందరు ప్రభువు నామమున ప్రార్థించుట మొదలుపెట్టగా ప్రభువు వారిని ఆశీర్వదించెను;

5 ఒక జ్ఞాపకార్థ గ్రంథము వ్రాయబడెను, అది ఆదాము భాషలో లిఖించబడెను, ఏలయనగా దేవుని నామమున ప్రార్థించిన వారందరికి ప్రేరేపణాత్మ చేత వ్రాయుటకు అనుమతి ఇవ్వబడెను;

6 స్వచ్ఛమైన, అపవిత్రం కాని భాష కలిగియుండి, వారిద్వారా వారి కుమారులకు పఠించుట, లిఖించుట నేర్పించబడెను.

7 ఆదియందున్న ఈ యాజకత్వమే లోకాంతమునందు కూడా ఉండును.

8 ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన కదిలింపబడగా ఆదాము ఈ ప్రవచనమును పలికెను, దేవుని సంతానము యొక్క వంశావళి లిఖించబడెను. ఆదాము వంశావళి గ్రంథము ఈలాగు చెప్పుచున్నది: దేవుడు మానవుని సృజించిన దినమున అతడిని దేవుని స్వరూపములో సృజించెను;

9 ఆయన తన దేహమునకు ప్రతిరూపముగా పురుషునిగాను, స్త్రీనిగాను వారిని సృజించెను; వారు సృజించబడి, దేవుని పాదపీఠము పైనున్న ప్రదేశములో జీవాత్మలుగా మారిన దినమున ఆయన వారిని ఆశీర్వదించి, అతనికి ఆదాము అని పేరు పెట్టెను.

10 ఆదాము నూట ముప్పదేండ్లు బ్రతికి తన పోలికలో తన స్వరూపమునందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను.

11 షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిదివందల యేండ్లు మరియు అతడు కుమారులను కుమార్తెలను కనెను;

12 ఆదాము బ్రతికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

13 షేతు నూట అయిదేండ్లు బ్రదికి, ఎనోషును కని, అతని దినములన్నిటియందు ప్రవచించెను, అతని కుమారుడైన ఎనోషుకు దేవుని మార్గములను బోధించెను; కాబట్టి ఎనోషు కూడా ప్రవచించెను.

14 ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

15 భూమి మీద నరుల సంతానము అసంఖ్యాకముగానుండెను. ఆ దినములలో మనుష్యులపై సాతాను గొప్ప ఏలుబడిచేయుచూ వారి హృదయాలలో క్రోధము రేపెను; అప్పటినుండి యుద్ధములు, రక్తపాతము కలిగెను; రహస్యకార్యముల వలన, అధికారము కొరకు చంపుటకు నరుడు తన స్వంత సహోదరునికి విరోధముగా లేచెను.

16 షేతు బ్రతికిన దినములన్నియు తొమ్మిదివందల పన్నెండేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

17 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను. ఎనోషు మరియు మిగిలిన దేవుని జనులు షులోను అనబడు ప్రదేశమునుండి బయటకు వచ్చి వాగ్దానదేశములో నివసించిరి, దానికి అతడు తన కుమారుని పేరైన కేయినాను అని పేరు పెట్టెను.

18 కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి అనేకమంది కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

19 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను; మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిదివందల నలుబది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

20 మహలలేలు అరువది అయిదేండ్లు బ్రదికి యెరెదును కనెను; యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

21 యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను; హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. యెరుదు హనోకుకు దేవుని మార్గములను బోధించెను.

22 ఆదాము కుమారుల వంశావళి ఇదియే, అతడు దేవుని కుమారుడైయుండి, దేవుడే అతనితో మాట్లాడెను.

23 వారు నీతి బోధకులైయుండిరి, వారు మాట్లాడి, ప్రవచించి, పశ్చాత్తాపపడమని ప్రతిచోట ఉన్న మనుష్యులందరికి చెప్పిరి; మనుష్యకుమారుల మధ్య విశ్వాసము బోధింపబడెను.

24 యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువది రెండేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

25 హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

26 హనోకు ఆ దేశములో జనులమధ్య ప్రయాణించెను; అతడు ప్రయాణించినప్పుడు, పరలోకమునుండి దేవుని ఆత్మ దిగివచ్చి అతనిపై నిలిచెను.

27 పరలోకమునుండి ఒక స్వరము ఈలాగు చెప్పగా అతడు వినెను: నా కుమారుడవైన హనోకు, ఈ జనులకు ప్రవచించి, వారికి ఈలాగు చెప్పుము—పశ్చాత్తాపపడుడి, ఏలయనగా ప్రభువు ఈవిధముగా సెలవిచ్చుచున్నాడు: ఈ జనుల యెడల నేను కోపముతో ఉన్నాను, నా ఉగ్రత వారికి విరోధముగా రగులుకొనెను; ఏలయనగా వారి హృదయములు కఠినపరచబడెను, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు బహుదూరము చూడలేవు;

28 నేను వారిని సృష్టించిన దినమునుండి అనేకములైన ఈ తరములన్నింటిలో వారు త్రోవ తప్పి, నన్ను తృణీకరించి, అంధకారములో తమ ఆలోచనలను చేయుచుండిరి; తమ హేయకార్యములందు హత్యలను ప్రణాళిక చేయుచూ వారి తండ్రియైన ఆదాముకు నేనిచ్చిన ఆజ్ఞలను పాటించలేదు.

29 కాబట్టి వారు ముందుగా ప్రమాణములు చేసుకొని, తమ ప్రమాణముల వలన వారికి వారే మరణమును తెచ్చుకొనిరి; వారు పశ్చాత్తాపపడని యెడల వారి కొరకు నేను ఒక నరకమును సిద్ధపరచియున్నాను;

30 ఇది లోకారంభములో, దాని యొక్క పునాది వేయబడినప్పటినుండి నా నోటిద్వారా నేను ఇచ్చియున్న ఒక శాసనము, దీనిని నా సేవకులైన మీ తండ్రుల నోటిమాట ద్వారా నేను ఇచ్చితిని, ఇది లోకము యొక్క అంచుల వరకు పంపబడును.

31 హనోకు ఈ మాటలు వినిన తరువాత ప్రభువు యెదుట నేలపై సాగిలపడి, ప్రభువుతో—నేను నీ కృపను పొందుట ఏల, నేను బాలుడను, జనులందరు నన్ను ద్వేషించుచున్నారు; ఏలయనగా నేను నోటిమాంద్యము కలవాడను; కాబట్టి నేను నీ దాసుడనా? అనెను.

32 అందుకు ప్రభువు హనోకుతో ఇట్లనెను—నీవు వెళ్ళి నేను నీకాజ్ఞాపించినట్లుగా చేయుము, ఏ మనుష్యుడు నీకు హాని తలపెట్టడు. నీ నోటిని తెరువుము, అది నింపబడును, నేను నీకు మాట్లాడు శక్తిని అనుగ్రహించెదను, ఏలయనగా సర్వశరీరులు నా చేతులలో ఉన్నారు మరియు నా దృష్టికి మేలైన దానిని నేను చేయుదును.

33 ఈ జనులతో చెప్పుము: మిమ్మును సృజించిన దేవుడైన ప్రభువును సేవించుటకు నేడే మీరు ఎన్నుకొనుడి.

34 ఇదిగో నా ఆత్మ నీమీదనున్నది, కాబట్టి నీ మాటలన్నిటిని నేను నిర్దోషమైనవిగా యెంచెదను; పర్వతములు నీ యెదుట పారిపోవును, నదులు వాటి మార్గమునుండి మరలును; నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము; కాబట్టి నాతో నడువుము.

35 ప్రభువు హనోకుతో మాట్లాడి ఈలాగు సెలవిచ్చెను: నీ కళ్ళకు మంటిని రాసుకొని వాటిని కడుగుకొనుము, నీవు చూచెదవు మరియు అతడు ఆవిధముగానే చేసెను.

36 దేవుడు సృజించిన ఆత్మలను అతడు చూచెను; సహజ నేత్రములకు కనిపించని సంగతులను కూడా అతడు చూచెను; అప్పటినుండి ఆ దేశములో—ఈ జనులకొరకు ఒక దీర్ఘదర్శిని ప్రభువు పుట్టించెనను మాట ప్రచారములోనికి వచ్చెను.

37 అప్పుడు హనోకు దేశములోని జనుల మధ్యకు వెళ్ళి, కొండలపై, ఎత్తైన ప్రదేశములపై నిలబడి, బిగ్గర స్వరముతో మాట్లాడుచూ వారి కార్యములకు విరోధముగా సాక్ష్యము పలికెను; అతని వలన వారందరు అభ్యంతరపడిరి.

38 వారు అతని మాటలు వినుటకు ఎత్తైన స్థలములకు వచ్చి గుడారములు వేయువారితో ఇట్లనిరి: దీర్ఘదర్శిని చూచుటకు మేము అక్కడకు వెళ్ళెదము, మీరు ఇక్కడ నిలిచియుండి గుడారములను వేయుడి, ఏలయనగా అతడు ప్రవచించుచుండెను మరియు దేశములో ఒక వింత కలిగెను; మన మధ్యకు ఒక పిచ్చివాడు వచ్చియుండెను.

39 వారతని మాటలు వినినప్పుడు ఎవడును అతడిని పట్టుకొనలేదు; అతని మాటలు వినిన వారందరికి భయము కలిగెను; ఏలయనగా అతడు దేవునితో నడిచెను.

40 మహిజ అను పేరుగల వాడు అక్కడకు వచ్చి అతడిని-నీవు ఎవరు? ఎచ్చటనుండి వచ్చుచున్నావో మాతో స్పష్టముగా చెప్పుమని అడిగెను.

41 అందుకతడు వారితో ఇట్లనెను-నేను నా పితరుల దేశమైన కెయినాను దేశమునుండి వచ్చితిని, అది ఈ దినము వరకు నీతిగల దేశమైయున్నది. నా తండ్రి దేవుని త్రోవలన్నిటిని నాకు బోధించెను.

42 అప్పుడు కయినాను దేశమునుండి తూర్పు సముద్రము వెంబడి నేను ప్రయాణము చేయగా నేనొక దర్శనమును చూచితిని; ఇదిగో నేను చూడగా ఆకాశము తెరువబడి, ప్రభువు నాతో మాట్లాడి నాకొక ఆజ్ఞనిచ్చెను; కాబట్టి, ఈ కారణము వలన ఆజ్ఞను గైకొనుటకు నేనీ మాటలను చెప్పుచున్నాను.

43 హనోకు తన ప్రసంగమును కొనసాగించెను: నాతో మాట్లాడిన ప్రభువే పరలోకమునకు దేవుడు, మరియు అతడు నా దేవుడును మీ దేవుడునైయున్నాడు, మీరు నా సహోదరులు, మీరెందుకు మీలో ఆలోచన చేయుచు పరలోక దేవుని తృణీకరించుచున్నారు?

44 ఆయన పరలోకమును సృష్టించెను; భూమి ఆయన పాదపీఠము; దాని పునాదియు ఆయనదే. ఇదిగో ఆయన దానిని వేసెను, దానిపైన మనుష్య సమూహమును తీసుకొని వచ్చెను.

45 మన పితరులకు మరణము కలిగెను; అయినను వారిని అనగా అందరిలో ప్రథముడైన ఆదామును మనమెరిగియున్నాము, దానిని మనము నిరాకరించలేము.

46 ఏలయనగా దేవుని వ్రేలుచేత ఇవ్వబడిన విధానమును అనుసరించి మనమొక జ్ఞాపకార్థ గ్రంథమును వ్రాసితిమి; అది మన భాషలో ఇవ్వబడెను.

47 హనోకు దేవుని మాటలు పలుకగా, జనులు వణికి అతని సముఖమున నిలువలేకపోయిరి.

48 అతడు వారితో ఈలాగు చెప్పెను: ఆదాము పతనము వలన మనము జన్మించితిమి; అతని పతనము వలన మరణము కలిగెను; శ్రమను, బాధను పొందువారిగా మనము చేయబడితిమి.

49 ఇదిగో సాతాను నరుల సంతానము మధ్యకు వచ్చియున్నాడు, అతడిని పూజించమని వారిని శోధించుచున్నాడు; మనుష్యులు శరీరానుసారులు, ప్రకృతిసంబంధులు, అపవాదిసంబంధులై దేవుని సన్నిధినుండి త్రోసివేయబడిరి.

50 కానీ నరులందరు పశ్చాత్తాపపడవలెనని దేవుడు మన పితరులకు తెలిపెను.

51 ఆయన మన తండ్రియైన ఆదామును పిలిచి తన స్వరముతో—నేను దేవుడను; లోకమును, శరీరముతో నరులు జీవించుటకు మునుపు వారిని నేను సృష్టించితినని చెప్పెను.

52 ఆయన అతనితో ఈలాగు సెలవిచ్చెను: నీవు నా తట్టు తిరిగి, నా మాట ఆలకించి, నమ్మి నీ అపరాధములన్నింటి నిమిత్తము పశ్చాత్తాపపడి, నరుల సంతానమునకు రక్షణ కలుగుటకు ఆకాశము క్రింద ఇవ్వబడు ఏకైక నామము అనగా యేసు క్రీస్తు—నా అద్వితీయ కుమారుని నామమందు నీటిలో బాప్తిస్మమును పొందిన యెడల నీవు పరిశుద్ధాత్మ వరమును పొందెదవు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు, ఆయన నామమున సమస్తమును అడుగవలెను మరియు నీవు ఏది అడిగినను అది నీకు అనుగ్రహించబడును.

53 మన తండ్రియైన ఆదాము ప్రభువుతో మాట్లాడి—నరుడు ఎందుకు పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొందవలెను? అని అడిగెను. అందుకు ప్రభువు ఆదాముతో ఈలాగు సెలవిచ్చెను: ఏదేను తోటలో నీవు చేసిన అపరాధమును నేను క్షమించియున్నాను.

54 అందువలన దేవుని కుమారుడు మొదటి దోషమునకు ప్రాయశ్చిత్తము చేసెనని, దాని ద్వారా తండ్రుల యొక్క పాపములకు పిల్లలు ఉత్తరవాదులు కారని, లోకము పునాది వేయబడినప్పటినుండి వారు పాపము నుండి విడుదల పొందిరి అను మాట చుట్టుప్రక్కల జనులమధ్య ప్రాచుర్యము పొందెను.

55 ప్రభువు ఆదాముతో మాట్లాడి ఈలాగు సెలవిచ్చెను: నీ సంతానము పాపమందు జన్మించిన విధముగా, వారు పెరిగి పెద్దవారైనప్పుడు వారి హృదయాలలో పాపము పుట్టును, వారు చేదును రుచి చూచెదరు, తద్వారా మంచి బహుమానమును వారు తెలుసుకొందురు.

56 మంచి చెడులకు గల బేధమును తెలుసుకొనుటకు వారికది ఇవ్వబడెను; కాబట్టి వారికి వారే ప్రతినిధులైయున్నారు మరియు నేను నీకు వేరొక ధర్మశాస్త్రమును, ఆజ్ఞను ఇచ్చియున్నాను.

57 కాబట్టి దీనిని నీ పిల్లలకు బోధించుము, తద్వారా ప్రతిచోట ఉన్న మనుష్యులందరు పశ్చాత్తాపపడవలెను, లేనియెడల వారు దేవుని రాజ్యమును పొందలేరు, ఏలయనగా అపవిత్రమైనది ఏదియు అక్కడ ఉండజాలదు లేదా ఆయన సన్నిధిలో ఉండజాలదు; ఏలయనగా ఆదాము భాషలో ఆయన పేరు పరిశుద్ధుడు, ఆయన అద్వితీయ కుమారుని పేరు మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు, నీతిమంతుడైన న్యాయాధిపతి, ఆయన మధ్యస్థకాలములో వచ్చును.

58 కాబట్టి ఈ సంగతులను నిస్సంకోచముగా ఈలాగు చెప్పుచు నీ పిల్లలకు బోధించమని నేను నీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను:

59 అపరాధము వలన పతనము కలిగెను, ఆ పతనము మరణమును కలిగించును మరియు ఈ లోకములో నేను చేసిన నీరు, రక్తము, ఆత్మ వలన మీరు జన్మించి తద్వారా మంటి వలన జీవాత్మ అయ్యిరి, అదేవిధముగా మీరు పరలోక రాజ్యములో నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను తిరిగి జన్మించి, రక్తముచేత అనగా నా అద్వితీయ కుమారుని రక్తముచేత శుద్ధిచేయబడవలెను; తద్వారా మీరు సమస్త పాపమునుండి శుద్ధచేయబడి, ఈ లోకములో నిత్యజీవపు మాటలను, రాబోవు లోకములో నిత్యజీవమును అనగా అమర్త్యపు మహిమను ఆనందించగలరు;

60 ఏలయనగా నీటివలన మీరు ఆజ్ఞను గైకొందురు; ఆత్మవలన మీరు నీతిమంతులుగా తీర్చబడుదురు, రక్తము వలన మీరు శుద్ధిచేయబడుదురు;

61 కాబట్టి పరలోకపు గ్రంథము; ఆదరణకర్త; నిత్య మహిమ యొక్క శాంతికరమైన విషయాలు; సమస్తమునకు జీవమునిచ్చి, సమస్తమును జీవింపజేయు అన్ని విషయాల సత్యము; సమస్తమును యెరిగియుండి, జ్ఞానము, కరుణ, సత్యము, న్యాయము, తీర్పు ప్రకారము సర్వాధికారమును కలిగియుండి, మీయందు నిలిచియుండుటకు అది మీకివ్వబడెను.

62 ఇప్పుడు నేను మీతో చెప్పునదేమనగా—మధ్యస్థకాలములో రాబోవు నా అద్వితీయ కుమారుని రక్తము ద్వారా సమస్త మానవాళికి ఇవ్వబడిన రక్షణ ప్రణాళిక ఇదియే.

63 సమస్త విషయాలు వాటి పోలికచొప్పున ఉన్నవి, లౌకికమైన సంగతులు, ఆత్మీయమైన సంగతులు సమస్తము నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుటకు సృజించబడి, చేయబడినవి; పైన పరలోకమందున్న సంగతులు; భూమి మీద ఉన్న సంగతులు, భూమిలోపల ఉన్న సంగతులు, భూమి క్రిందనున్న సంగతులు, పైన మరియు క్రిందనున్నవి; సమస్తము నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.

64 ప్రభువు మన తండ్రియైన ఆదాముతో మాట్లాడినప్పుడు, ఆదాము ప్రభువుకు మొరపెట్టెను మరియు ప్రభువు ఆత్మ అతడిని కొనిపోయెను, అతడు నీటిలోనికి కొనిపోబడి, నీటిలోపల ముంచబడి, నీటినుండి బయటకు తేబడెను.

65 ఆవిధముగా అతడు బాప్తిస్మము పొందినప్పుడు దేవుని ఆత్మ అతనిపైకి దిగివచ్చెను, ఆవిధముగా ఆత్మమూలముగా జన్మించి, అంతరంగ పురుషునియందు అతడు ఉత్తేజము పొందెను.

66 ఆకాశమునుండి ఒక స్వరము—అగ్నితోను, పరిశుద్ధాత్మతోను నీవు బాప్తిస్మము పొందితివని చెప్పుటను అతడు వినెను. ఇకనుండి నిరంతరము తండ్రిని, కుమారుని గూర్చిన సాక్ష్యము ఇదియే;

67 దినములకు ఆరంభమైనను, సంవత్సరాలకు అంతమైనను లేదా నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఉన్నవాని క్రమము చొప్పున నీవున్నావు.

68 ఇదిగో నా వలె నీవును దేవుని కుమారుడవైయున్నావు, కాబట్టి అందరు నా కుమారులైయుందురు. ఆమేన్.