లేఖనములు
మోషే 8


8వ అధ్యాయము

(1831 ఫిబ్రవరి)

మెతూషెల ప్రవచించును—నోవహు, అతని కుమారులు సువార్తను ప్రకటించుదురు—గొప్ప దుష్టత్వము ప్రబలును—పశ్చాత్తాపపడమనే పిలుపు నిర్లక్ష్యము చేయబడెను—జల ప్రళయము చేత సర్వశరీరులు నాశనము చేయబడుదురని దేవుడు శాసనము చేయును.

1 హనోకు జీవించిన దినములన్నియు నాలుగు వందల ముప్పదేండ్లు.

2 తన గర్భమునుండి (నోవహు ద్వారా) భూ రాజ్యములన్నియు ఉద్భవించునని మెతూషెల ప్రవచించెను, అతడు తననుతాను మహిమపరచుకొనెను.

3 తన గర్భమునుండి (నోవహు ద్వారా) భూ రాజ్యములన్నియు ఉద్భవించునని మెతూషెల ప్రవచించెను, అతడు తననుతాను మహిమపరచుకొనెను.

4 అప్పుడు దేశములో గొప్ప కరువు సంభవించెను, దేవుడు భూమిని బాధాకరమైన శాపముతో శపించెను, దానిలోని నివాసులు అనేకులు మృతిబొందిరి.

5 మెతూషెల నూట ఎనుబది యేడేండ్లు బ్రదికి లెమెకును కనెను;

6 లెమెకును కనిన తరువాత మెతూషెల ఏడువందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను, కుమార్తెలను కనెను;

7 మెతూషెల బ్రతికిన దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

8 లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని,

9 భూమిని ప్రభువు శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.

10 లెమెకు నోవహును కనిన తరువాత ఐదువందల తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను, కుమార్తెలను కనెను;

11 లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది ఏడేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

12 నోవహు నాలుగువందల యాబదేండ్లు గలవాడై యాపెతును కనెను; నలుబది రెండేండ్ల తరువాత యాపెతు తల్లివలన అతడు షేమును కనెను, మరియు ఐదువందల యేండ్లు గలవాడై హామును కనెను.

13 నోవహు అతని కుమారులు ప్రభువు మాటను విని, ఆలకించిరి, వారు దేవుని కుమారులని పిలువబడిరి.

14 ఈ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత వారికి కుమార్తెలు పుట్టినప్పుడు, నరుల కుమారులు ఆ కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి.

15 ప్రభువు నోవహుతో ఇట్లనెను—నీ కుమారుల కుమార్తెలు అమ్ముడుపోయిరి; నరుల కుమారులపై నా కోపము రగులుకొనుచున్నది, ఏలయనగా వారు నా మాటను ఆలకించరు.

16 అప్పుడు నోవహు ప్రవచించి, ఆదియందు ఉన్న విధముగా దేవుని విషయములను బోధించెను.

17 ప్రభువు నోవహుతో ఇట్లనెను: నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు, ఏలయనగా సర్వశరీరులు మృతినొందుదురని వారెరుగుదురు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగును; నరులు పశ్చాత్తాపపడని యెడల, వారి మీదకు నేను జలప్రళయమును పంపెదను.

18 ఆ దినములలో బలాత్కారులు భూమి మీద నుండిరి మరియు వారు నోవహు ప్రాణము తీయజూచిరి; కానీ ప్రభువు నోవహుతో నుండెను మరియు ప్రభువు శక్తి అతని మీదనుండెను.

19 హనోకుకు ఇవ్వబడిన విధముగా ప్రభువు నోవహును తన క్రమమునకు నియమించి, అతడు వెళ్ళి ఆయన సువార్తను నరుల సంతానమునకు ప్రకటించవలెనని ఆజ్ఞాపించెను.

20 వారు పశ్చాత్తాపపడవలెనని నోవహు నరుల సంతానముతో చెప్పెను; కానీ వారు అతని మాటలను ఆలకించలేదు;

21 అతని మాటలు వినిన తరువాత వారతని యొద్దకు వచ్చి ఇట్లనిరి: ఇదిగో మేము దేవుని కుమారులము; మేము నరుల కుమార్తెలను వివాహమాడలేదా? మేము తినుచు, త్రాగుచు, వివాహము చేసుకొనుచు, వివాహమునకిచ్చుచు నుండలేదా? మా భార్యలు మాకు పిల్లలను కనిరి, పూర్వపు మనుష్యులవలె వారు బలవంతులు, గొప్ప యోధులు. మరియు వారు నోవహు మాటలను ఆలకించలేదు.

22 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ప్రతివాడును తన హృదయము యొక్క తలంపులలోని ఊహయందు హెచ్చించుకొనెననియు, అది ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు దేవుడు చూచెను.

23 అప్పుడు నోవహు ప్రకటించుటను కొనసాగించి—నా మాటలకు చెవియొగ్గి, ఆలకించుడి;

24 నమ్మి మీ పాపముల కొరకు పశ్చాత్తాపపడి, మన పితరులవలె దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందెదరు, తద్వారా మీకు సమస్తమును ప్రత్యక్షపరచబడును; దీనిని మీరు చేయని యెడల, జలప్రళయము మీ మీదకు వచ్చునని చెప్పెను; అయినప్పటికీ వారు ఆలకించలేదు.

25 దానికి నోవహు సంతాపము నొందెను, ప్రభువు భూమి మీద నరుని సృజించినందుకు అతని హృదయము నొప్పింపబడెను మరియు అది అతనికి హృదయవేదన కలుగజేసెను.

26 అప్పుడు ప్రభువు ఇట్లనెను: నేను సృజించిన నరులును నరులతోకూడా జంతువులును ప్రాకెడి జీవులును ఆకాశ పక్ష్యాదులును భూమి మీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు, వాటిని చేసినందుకు నోవహు సంతాపము నొందెను; అతడు నాకు ప్రార్థన చేసెను; ఏలయనగా వారు అతని ప్రాణమును తీయజూచిరి.

27 ఆ విధముగా నోవహు ప్రభువు దృష్టిలో కృపను పొందెను; ఏలయనగా నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునైయుండెను; నోవహు దేవునితో కూడా నడిచినవాడు, అతని ముగ్గురు కుమారులైన షేము, హాము, యాపెతు కూడా నడిచిరి.

28 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, అది బలాత్కారముతో నిండియుండెను.

29 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనియుండిరి.

30 దేవుడు నోవహుతో-సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది, గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోపాటు నాశనము చేయుదుననెను.