2010–2019
ఇదే సరైన సమయము
అక్టోబర్ 2018


ఇదే సరైన సమయము

మీ జీవితంలో మీరు దేని గురించైనా ఆలోచించవలసి ఉంటే దానికిదే సరైన సమయము.

అనేక సంవత్సరాల క్రితం, ఒక వ్యాపార నిమిత్తం ప్రయాణానికి సిద్ధపడుతున్నప్పుడు, నాకు గుండెల్లో నొప్పి ప్రారంభమైంది ఆందోళనతో నా భార్య నాకు తోడుగా రావాలనుకుంది. విమానంలో అడుగుపెట్టగానే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యేలా నొప్పి ఎక్కువైంది. విమానం దిగినప్పుడు, అక్కడినుండి నేరుగా స్థానిక ఆసుపత్రికి వెళ్ళాము, అక్కడ అనేక పరీక్షలు జరిగిన తర్వాత, ప్రయాణం కొనసాగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని వైద్యులు చెప్పారు.

మేము విమానాశ్రయానికి తిరిగివచ్చి, మా అంతిమ గమ్యస్థానం చేరుకోవడానికి విమానం ఎక్కాము. మేము దిగుతుండగా, విమానచోదకుడు నేనెవరో తెలుపమని అంతస్సంచార వ్యవస్థలో అడిగాడు. విమాన సహాయకుడు దగ్గరకు వచ్చి, వారికి అత్యవసర ఫోను పిలుపు అందిందని, నన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్ళడానికి అంబులెన్సు బయట వేచియుందని నాతో చెప్పాడు.

అంబులెన్సు ఎక్కి, మేము వెంటనే స్థానిక అత్యవసర విభాగానికి వెళ్ళాము. అక్కడ మేము ఆందోళన చెందుతున్న ఇద్దరు వైద్యులను కలిసాము, నాకు వ్యాధి నిర్థారణ తప్పుగా జరిగిందని, నిజానికి నా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టిందని, దానికి వెంటనే వైద్య చికిత్స చేయాలని వారు వివరించారు. అనేకమంది ఈ పరిస్థితులో బ్రతకరని వైద్యులు చెప్పారు. ఇంటినుండి చాలా దూరంగా ఉన్నామని తెలిసి, ఇటువంటి ప్రమాదకర పరిస్థితులకు మేము సిద్ధంగా ఉన్నామో లేదో అనుకున్న వైద్యులు మా జీవితంలో మేము దేని గురించైనా ఆలోచించవలసి ఉంటే, దానికిదే సరైన సమయమని చెప్పారు.

ఆందోళన చెందుతున్న ఆ క్షణంలో తక్షణం నా దృష్టికోణం పూర్తిగా మారిపోవడం నాకు బాగా గుర్తుంది. కొన్ని క్షణాలకు ముందు అతిముఖ్యము అనిపించిన వాటిపై ఇప్పుడు ఆసక్తి లేదు. ఈ జీవితపు సౌకర్యాలు, సంరక్షణలకు దూరంగా నిత్య దృష్టికోణం వైపు---కుటుంబం, పిల్లలు, నా భార్య, చివరిగా నా స్వంత జీవితాన్ని అంచనా వేసే ఆలోచనల వైపు నా మనస్సు పరుగుపెట్టింది.

మేము వ్యక్తులుగా, కుటుంబంగా ఎలా ఉన్నాము? మేము చేసిన నిబంధనలకు, ప్రభువు ఆశించిన దానికి అనుగుణంగా మేము జీవిస్తున్నామా లేక తెలియకుండానే అత్యంత ముఖ్యమైన వాటినుండి మమ్మల్ని దూరం చేసేలా ఈ లోకపు విచారాలను మేము అనుమతించామా?

ఈ అనుభవం నుండి నేర్చుకోబడిన ముఖ్యపాఠం గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: లోకం నుండి ఒక అడుగు వెనక్కి వేసి, మీ జీవితాన్ని అంచనా వేయండి. లేక వైద్యుడు చెప్పినట్లు, మీ జీవితంలో మీరు దేని గురించైనా ఆలోచించవలసి ఉంటే దానికిదే సరైన సమయము.

మన జీవితాలను అంచనావేయడం

ఈ జీవితపు కల్లోలాల నుండి బయటపడి, నిత్యవిలువ గల విషయాలపై దృష్టిపెట్టడాన్ని మరింత కష్టతరం చేస్తూ ఎప్పటికప్పుడు పెరుగుతున్న పరధ్యానాలచేత అధిగమించబడి, సమాచారం చేత ముంచెత్తబడుతున్న లోకంలో మనం జీవిస్తున్నాము. త్వరితగతిని మారుతున్న సాంకేతికతల ద్వారా ఆసక్తి రేకెత్తించు ముఖ్యాంశాలతో మన అనుదిన జీవితాలు ముట్టడించబడుతున్నాయి.

ఆలోచించుటకు సమయాన్ని తీసుకొనకపోతే, ఈ వేగవంతమైన వాతావరణం మన అనుదిన జీవితాలమీద, మనం చేసే ఎంపికల మీద చూపే ప్రభావాన్ని మనం గ్రహించలేకపోవచ్చు. క్రొత్తపోకడలు, వీడియోలు, మన ఆసక్తిని ఆకర్షించుటకు చేయబడిన ముఖ్యాంశాలతో మూటగట్టబడిన సమాచారంతో మన జీవితాలు మ్రింగివేయబడవచ్చు. ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉన్నప్పటికీ, వీటిలో అనేకం మన నిత్యవృద్ధితో సంబంధం లేనివైయుంటాయి, అయినప్పటికినీ అవి మనం మన మర్త్య అనుభవాన్ని చూసే దృష్టిని రూపిస్తాయి.

లోకము యొక్క ఈ పరధ్యానాలను లీహై దర్శనములో ఉన్నవాటితో పోల్చవచ్చు. ఇనుపదండాన్ని గట్టిగా పట్టుకొని మనము నిబంధన బాటలో ముందుకు వెళ్తున్నప్పుడు, గొప్ప మరియు విశాలమైన భవనం నుండి “తమ వ్రేళ్ళను చూపుతూ ఎగతాళి చేయుచున్న” వారిని మనము విని, చూస్తాము (1 నీఫై 8:27). అలా చేయడం మన ఉద్దేశం కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ కల్లోలమేమిటో చూడాలని మనము ఆగి, అటువైపు దృష్టి మరల్చుతాము. మనలో కొంతమంది ఇంకా స్పష్టంగా చూడడానికి ఇనుపదండాన్ని వదిలి, దగ్గరకు కూడా వెళ్ళవచ్చు. ఇతరులు “వారిని ఎగతాళి చేయువారిని బట్టి” (1 నీఫై 8:28) పూర్తిగా దారి తప్పిపోవచ్చు.

“మీ హృదయములు. . . ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున. . . జాగ్రత్తగా ఉండుడి,” (లూకా 21:34) అని రక్షకుడు మనల్ని హెచ్చరించారు. అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఎన్నుకోబడ్డారని ఆధునిక బయల్పాటు మనకు గుర్తుచేస్తుంది. వారు ఎన్నుకోబడలేదు, ఎందుకనగా వారి హృదయాలు లోక విషయములపైన ఎంతగానో ఉంచబడెను. . . మనుష్యుల సన్మానములను వారు కోరెదరు (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:35; 34 వచనము కూడ చూడుము). మన జీవితాలను అంచనా వేయడం, లోకము నుండి ఒక అడుగు వెనక్కి వేసి నిబంధన బాటలో మనమెక్కడ నిలిచామో ఆలోచించడానికి, అవసరమైతే ఇనుపదండాన్ని స్థిరంగా పట్టుకొని ముందుకు దృష్టిసారించేలా నిర్థారించడానికి కావలసిన సర్దుబాట్లు చేసుకోవడానికి మనకు అవకాశాన్నిస్తుంది.

ఇటీవల, ప్రపంచవ్యాప్త యువజన భక్తి కార్యక్రమములో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు లోకము నుండి ఒక అడుగు వెనక్కి వేసి, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఒక వారం రోజులు ఉపవాసం చేయమని యువతను ఆహ్వానించారు. మరియు నిన్న సాయంత్రము, ఆయన స్త్రీల యొక్క సర్వసభ్య సమావేశములో భాగముగా సహోదరీలకు అదేవిధమైన ఆహ్వానమిచ్చారు. అప్పుడు ఆయన యువతను వారెలా భావించారు, ఏమి ఆలోచించారు లేక ఎలా ఆలోచించారనే దానిలో తేడాలను గమనించమని అడిగారు. ఆ తర్వాత, “మీ పాదాలు నిబంధన బాటలో స్థిరంగా నాటుకున్నాయని నిర్థారించడానికి ప్రభువుతో కలిసి క్షుణ్ణంగా జీవితాన్ని అంచనా వేయండని” ఆహ్వానించారు. వారి జీవితాల్లో మార్చవలసినవి ఏవైనా ఉన్నట్లయితే, “మార్చడానికి ఇదే సరైన సమయము”1 అని వారిని ప్రోత్సహించారు.

మన జీవితాల్లో మార్చవలసిన వాటిని అంచనా వేయడంలో, మనల్ని మనం ఒక ఆచరణాత్మక ప్రశ్న అడగవచ్చు: ఏవిధంగా మనము ఈ లోకపు పరధ్యానాల నుండి పైకెదిగి, మన ముందున్న నిత్యత్వపు దర్శనంపై దృష్టి నిలుపగలము?

2007 లో “మంచిది, చాలామంచిది, ఉత్తమమైనది,” అనే పేరుతో ఇచ్చిన సమావేశ ప్రసంగంలో అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ గారు, అనేక విరుద్ధమైన లోకపు అక్కఱల మధ్య మన ఎంపికలకు ఏవిధంగా ప్రాధాన్యతనివ్వాలో బోధించారు. “చాలామంచివి లేక ఉత్తమమైనవి ఎంచుకోవడానికి కొన్ని మంచివాటిని మనము వదిలివేయాలి, ఎందుకంటే అవి యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని వృద్ధి చేసి మన కుటుంబాలను బలపరుస్తాయని” 2 ఆయన ఉపదేశించారు.

ఈ జీవితంలో ఉత్తమమైన విషయాలు యేసు క్రీస్తు పైన మరియు ఆయన ఎవరు, ఆయన తో మనకు మధ్య గల సంబంధమేమిటనే నిత్య సత్యాలను గ్రహించడం పైన కేంద్రీకరించబడతాయని నేను చెప్పదలిచాను.

సత్యమును వెదకండి

రక్షకుడిని తెలుసుకోవడానికి మనము ప్రయత్నించినప్పుడు, మనమెవరము, ఇక్కడ ఎందుకున్నామనే ప్రధాన సత్యాలను మనం విడిచిపెట్టకూడదు. “ఈ జీవితము దేవుని కలుసుకొనుటకు సిద్ధపడు సమయమైయున్నది,” “నిత్యత్వమునకు సిద్ధపడుటకు మనకు ఇవ్వబడిన సమయమిది” ( ఆల్మా 34:32–33). (అని అమ్యులెక్ మనకు గుర్తుచేస్తున్నాడు. బాగా తెలిసిన నిబంధన మనకు గుర్తుచేసినట్లుగా, “మనము ఆత్మీయానుభవం పొందుతున్న మానవులం కాదు. మానవానుభవం పొందుతున్న ఆత్మీయ జీవులం.” 3

మన దైవిక మూలాలను గ్రహించడం, మన నిత్యవృద్ధికి ఆవశ్యకమైనది మరియు ఈ జీవితపు పరధ్యానాల నుండి మనల్ని విడిపించగలదు. రక్షకుడు ఇలా బోధించారు:

“మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు;

“అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” (యోహాను 8:31–32).

అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఇలా ప్రకటించారు, “ఈ లోకంలో ఏ మానవుడైన సాధించగల గొప్ప విషయమేదనగా, ఏ ప్రాణి యొక్క మాదిరియైనను ప్రవర్తనయైనను తాను పొందిన జ్ఞానమును సందేహింప జేయలేనంత సమగ్రంగా, పరిపూర్ణంగా తనకుతాను దైవిక సత్యముతో పరిచయం కలిగియుండడమే ఈ లోకంలో మనిషి సాధించగల అతిగొప్ప విజయం.”4

నేటి ప్రపంచంలో అన్నివైపుల నుండి సత్యమనేది వ్యక్తిగత వ్యాఖ్యానానికి సంబంధించిన భావనగా దావా వేయబడుతూ, సత్యము మీద వాదన తారాస్థాయికి చేరుకుంది. యౌవనుడైన జోసెఫ్ స్మిత్‌కు తన జీవితంలో నెలకొనియున్న గందరగోళము, వివాదముల వలన ఎవరు తప్పో, ఎవరు ఒప్పో అని ఏదైనా ఒక నిర్దిష్టమైన ముగింపుకు రావడం అసాధ్యమయింది (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8 చూడుము). ఈ వాగ్వివాదము మరియు అభిప్రాయముల కలకలము నడుమ (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10 చూడుము) అతడు సత్యమును వెదకుతూ దైవిక నడిపింపును ఆశించాడు.

ఏప్రిల్ సమావేశంలో, అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు, “సత్యము పైన దాడి చేసే మనుష్యుల తత్వాలు మరియు అనేక స్వరముల గుండా సరైనది కనుగొనగలమనే నిరీక్షణను మనం కలిగియుండాలంటే, బయల్పాటు పొందడాన్ని మనం తప్పక నేర్చుకోవాలి.”5 సత్యస్వరూపియగు ఆత్మపై ఆధారపడడం మనం నేర్చుకోవాలి, “లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు” (యోహాను 14:17).

ఈ లోకం వేగంగా ప్రత్యామ్నాయ వాస్తవాలవైపు తిరుగుతుండగా, “ఆత్మ సత్యమును పలుకును మరియు అబద్ధమాడదు. అందువలన అది వస్తువులను గూర్చి అవి వాస్తవముగా ఉన్నట్లు, వాస్తవముగా ఉండబోవునట్లు పలుకును. కావున మన ఆత్మల యొక్క రక్షణ నిమిత్తము ఈ సంగతులు మనకు స్పష్టముగా విశదపరచబడెను” (జేకబ్ 4:13() అని చెప్పిన జేకబ్ మాటలను మనం గుర్తుంచుకోవాలి.

లోకం నుండి ఒక అడుగు వెనక్కి వేసి మన జీవితాలను అంచనా వేయుచుండగా, మనం చేయవలసిన మార్పుల గురించి ఆలోచించే సమయమిదే. మన మాదిరియైన యేసు క్రీస్తు మరొకసారి దారిచూపారని తెలుసుకోవడంలో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఆయన మరణము మరియు పునరుత్థానమునకు ముందు, తన దైవిక పాత్రను గ్రహించడానికి తన చుట్టూ ఉన్నవారికి ఆయన సహాయపడుచుండగా, ఆయన వారితో “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను” (యోహాను 16:33). ఆయన గురించి నేను యేసు క్రీస్తు నామమున సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), HopeofIsrael.lds.org.

  2. Dallin H. Oaks, “Good, Better, Best,” Liahona, Nov. 2007, 107.

  3. Often attributed to Pierre Teilhard de Chardin.

  4. Teachings of Presidents of the Church: Joseph F. Smith (1998), 42.

  5. Russell M. Nelson, “Revelation for the Church, Revelation for Our Lives,” Liahona, May 2018, 96.