2010–2019
క్రీస్తునందు ఏకముగా ఉన్నాము
అక్టోబర్ 2018


క్రీస్తునందు ఏకముగా ఉన్నాము

ప్రభువు యొక్క కార్యములో నా ప్రియమైన సహచరులారా, సంఘములోనికి క్రొత్త స్నేహితులను ఆహ్వానించుటలో మనం మరింత శ్రేష్ఠముగా చేయగలము మరియు శ్రేష్ఠముగా చెయ్యాలని నా నమ్మకం.

ప్రియమైన సహోదరీ సహోదరులారా, శుభ మధ్యాహ్నం! నా మాతృభాషయైన బ్రెజీలియన్ పోర్చుగీసులో “బోవా టార్డ్!” అని మేము చెప్పునట్లుగా, మన ప్రియమైన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క దర్శకత్వములో యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ఈ అద్భుతమైన సర్వసభ్య సమావేశములో మీ అందరితో కూడి వచ్చినందుకు నేను ధన్యునిగా భావిస్తున్నాను. మనం జీవించుచున్న ఈ కడవరి దినాలలో భూమిపైన ఆయన సేవకుల ద్వారా ప్రభువు యొక్క స్వరమును వినుటకు మనలో ప్రతి ఒక్కరం కలిగియున్న గొప్ప అవకాశానికి నేను ఆశ్చర్యపడుచున్నాను.

చిత్రం
అమెజాన్ నది
చిత్రం
అమెజాన్ నది రెండు మార్పిడి చెందుతున్న నదుల చేత ఏర్పడింది

నా స్వదేశమైన బ్రెజిల్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధ అమెజాన్ నది ఒకటి, అది ప్రపంచములోనే అతిపొడవైన, పెద్దదైన నదులలో ఒకటి. అది సాలిమోస్ మరియు నీగ్రో అనే రెండు వేర్వేరు నదులతో ఏర్పడినది. ఆసక్తికరముగా, ఆ నదులు చాలా భిన్నమైన జన్మస్థలములు, వేగములు, ఉష్ణోగ్రతలు, రసాయన మిశ్రమములు కలిగియుండుట వలన నీళ్ళు ఒకటిగా కలియుటకు ముందు అవి రెండు కలిసి అనేక మైళ్ళు ప్రవహిస్తాయి. అనేక మైళ్ళ తరువాత, చివరకు నీళ్ళు ఒకటిగా కలిసిపోయి, ఒక్కొక్కటిగా అవి మొదట ఉన్నవాటికి భిన్నముగా వేరే నదిగా మారును. ఈ భాగములు కలిసిన తరువాత మాత్రమే, అమెజాన్ నది చాలా శక్తివంతముగా మారి, అది అట్లాంటిక్ మహాసముద్రాన్ని సమీపించినప్పుడు, సముద్రపు నీటిని వెనుకకు తోయుట వలన మంచి నీటిని అనేక మైళ్ళ వరకు సముద్రములో కనుగొనవచ్చును.

చిత్రం
అమెజాన్ నది నీళ్ళ యొక్క కలయక

ఒక గొప్ప అమెజాన్ నదిని ఏర్పరుచుటకు సాలిమోస్ మరియు నీగ్రో నదులు కలిసి ప్రవహించిన అదేవిధానములో, యేసు క్రీస్తు యొక్క సంఘములో దేవుని పిల్లలు వేర్వేరు సామాజిక పూర్వపరాలు, సాంప్రదాయాలు మరియు సంస్కృతులనుండి కూడివచ్చి, క్రీస్తునందు ఒక అద్భుతమైన పరిశుద్ధుల సమాజమును ఏర్పరుస్తారు. చివరకు, మనం ఒకరినొకరు ప్రోత్సహించుకొని, బలపరచుకొని, ప్రేమించినప్పుడు, ఈ లోకములో మంచికి ఒక గొప్ప శక్తిగా ఏర్పడుటకు మనం జతకలుస్తాము. యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, మంచితనము అనే నదిలో ఐక్యముగా ప్రవహించుచు, దప్పిగొన్న ఈ లోకానికి సువార్త యొక్క “తాజా నీటిని” మనం అందించగలుగుతాము.

చిత్రం
దేవుని యొక్క మిగిలిన పిల్లలతో కలిసి క్రొత్త సభ్యులు
చిత్రం
పరిశుద్ధుల యొక్క సమాజము ఏర్పడెను

యేసు క్రీస్తును అనుసరించుటకు విశ్వాసములోను, ఉద్దేశములోను ఐక్యమగునట్లు మనం ఒకరినొకరు ఏవిధంగా బలపరచుకొని, ప్రేమించగలమో మనకు బోధించుటకు ప్రభువు తన ప్రవక్తలను ప్రేరేపించెను. పౌలు ఇలా బోధించాడు, “క్రీస్తు లోనికి బాప్తీస్మము పొందిన వారు క్రీస్తును ధరించుకొనియున్నారు. . . : ఏలయనగాయేసు క్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.1

బాప్తీస్మము వద్ద రక్షకుని అనుసరిస్తామని మనం వాగ్దానము చేయునప్పుడు, క్రీస్తు నామమును మనపైకి తీసుకొనుటకు సమ్మతిస్తున్నామని తండ్రి యెదుట మనం వాగ్దానము చేస్తున్నాము.2 మన జీవితాలలో ఆయన దివ్యమైన గుణాలను పొందుటకు మనం ప్రయాసపడినప్పుడు, ప్రభువైన క్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా మనం ఇంతకుముందు ఉన్నదానికంటే భిన్నంగా అవుతాము, మరియు అందరిపట్ల మన ప్రేమ సహజంగా పెరుగుతుంది.3 ప్రతి ఒక్కరి సంక్షేమము మరియు సంతోషము కొరకు మనం నిజమైన అక్కర కలిగి ఉంటాము. మనం ఒకరికొకరం సహోదరులు మరియు సహోదరీలవలె, దివ్వమైన పుట్టుక, గుణాలు మరియు సామర్థ్యమును కలిగిన దేవుని పిల్లల వలె చూస్తాము. ఒకరినొకరు సంరక్షించుకొనుటకు, ఒకరి భారాలను మరొకరు భరించుటకు కోరిక కలిగియుంటాము. 4

దీనిని క్రొత్త నిబంధన అపొస్తలుడైన పౌలు దాతృత్వముగా వర్ణించాడు.5 మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన మోర్మన్ “క్రీస్తు యొక్క నిర్మలమైన ప్రేమగా”6 దీనిని అభివర్ణించాడు, అది మిక్కిలి మహోతృష్టమైనది, ఘనమైనది, మరియు ప్రేమ యొక్క శక్తివంతమైన రూపము. మన ప్రస్తుత ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు క్రీస్తు యొక్క ఈ నిర్మలమైన ప్రేమ యొక్క ప్రత్యక్షతను పరిచర్య చేయుటగా ఇటీవల వర్ణించారు, అది రక్షకుడు చేసిన విధంగా ఇతరులను ప్రేమించి, సంరక్షించుటకు మరింత ఏకాగ్రతగల, పరిశుద్ధమైన విధానము.7

యేసు చేసినట్లే ఇటీవల పరివర్తన చెందిన వారిని మరియు మన సంఘ కార్యక్రమములకు హాజరగుటకు ఆసక్తి చూపించుటకు మొదలు పెడుతున్నవారిని ప్రోత్సహించుట, సహాయము చేయుట, బలపరచుట అనే భావములో ప్రేమ, సంరక్షణల యొక్క ఈ సూత్రమును మనం పరిగణిద్దాము.

ఈ క్రొత్త స్నేహితులు లోకసంబంధమైన విషయాలను విడిచిపెట్టి యేసు క్రీస్తు సువార్తను పూర్తిగా అంగీకరించి, సంఘములో చేరుతుండగా, వారు ఆయన ద్వారా తిరిగి జన్మించి, ఆయన శిష్యులౌతారు.8 వారికి బాగా తెలిసిన ఒక లోకమును విడిచిపెట్టి, పూర్ణ హృదయముతో యేసు క్రీస్తును అనుసరించుటకు ఎంచుకొని, శక్తివంతమైన అమెజాన్ నది లాంటి ఒక క్రొత్త నదిలో చేరుతారు-ఆ నది మంచికి, నీతికి నిర్భయమైన బలమైయుండి దేవుని సన్నిధి వైపు ప్రవహించును. అపొస్తలుడైన పేతురు దీనిని “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు” 9 అని వర్ణించెను. ఈ క్రొత్త స్నేహితులు ఈ క్రొత్త నదిలో కలిసినప్పుడు, పరిచయములేని వాతావరణములో మొదట వారు తప్పిపోయిన వారిగా భావించవచ్చును. ఈ క్రొత్త స్నేహితులు దాని స్వంత జన్మస్థలములు, ఉష్ణోగ్రతలు, రసాయన మిశ్రమములు కలిగియున్న ఒక నదిలో కలుస్తున్నట్లు కనుగొంటారు--ఆ నది స్వంత ఆచారములు, మత క్యాలెండరు, సంస్కృతి మరియు పదజాలమును కలిగియున్నది. క్రీస్తునందు ఈ క్రొత్త జీవితము వారికి మహత్తైనదిగా అనిపించవచ్చు. వారు మొదటిసారి “ కు.గృ.సా, ” “ బి.యు.క,” “ఉపవాస ఆదివారము,” “మృతుల కొరకు బాప్తీస్మము” “త్రిలేఖన సమ్మేళనము” మొదలగు పదములను వినినప్పుడు వారేవిధంగా భావిస్తారో ఒక్క క్షణం ఆలోచించండి.

వారెందుకు సంఘానికి చెందనివారుగా భావించవచ్చునో గ్రహించుట సులభము. అటువంటి పరిస్థితులలో, “ఈ సంఘములో నాకొక స్థానమున్నదా? యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధల సంఘమునకు నేను సరిపోతానా? నేను నిజంగా ఈ సంఘానికి చెందుతానా? సంఘానికి నేను అవసరమా? నాకు సహాయపడి, సహకరించుటకు సమ్మతిగల క్రొత్త స్నేహితులను నేను కనుగొంటానా?” అని వారు తమను తాము ప్రశ్నించుకొనవచ్చును.

నా ప్రియమైన స్నేహితులారా, అటువంటి సందర్భాలలో శిష్యత్వము యొక్క బహుదూరపు ప్రయాణములో వేర్వేరు స్థానాలలో ఉన్న మనము మన క్రొత్త స్నేహితులను ఆహ్వానించి, వారితో సహవాసము చేసి, సువార్త జ్ఞానములో, అభివృద్ధిలో వారెక్కడున్నా సరే వారిని అంగీకరించి, సహాయము చేసి, ప్రేమించి మన జీవితాలలో వారికి చోటు కల్పించాలి. ఈ క్రొత్త స్నేహితులందరు దేవుని యొక్క అమూల్యమైన కుమారులు, కుమార్తెలు.10 వారిలో ఒక్కరిని కూడా మనం కోల్పోలేము ఎందుకంటే అమెజాన్ నది దానిలోకి ప్రవహించుచున్న పిల్లకాలువలపైన ఆధారపడియున్నట్లుగా, ఈ లోకములో మంచికి బలమైన శక్తిగా మారుటకు వారికి మనమెంత అవసరమో, వారు మనకు అంతే అవసరము.

మన క్రొత్త స్నేహితులు దేవునిచేత పొందిన ప్రతిభలను, ఉత్సాహాన్ని, మంచితనాన్ని వారితో సంఘమునకు తీసుకొనివస్తారు. సువార్తపట్ల వారి ఉత్సాహాము సంక్రమించేది కాగలదు, తద్వారా మన స్వంత సాక్ష్యములకు పునర్జీవమిచ్చుటలో మనకు సహాయపడగలదు. జీవితము మరియు సువార్త పట్ల మన అవగాహనకు ప్రత్యేక దృక్పథాన్ని కూడా వారు తీసుకొనిరాగలరు.

మన క్రొత్త స్నేహితులు యేసు క్రీస్తు సంఘములో ఆహ్వానించబడి, ప్రేమించబడునట్లు భావించుటకు మనమేవిధంగా సహాయము చేయగలమో మనకు చాలాకాలంగా నేర్పించబడింది. వారి జీవితములు అంతటా బలంగా, విశ్వాసంగా ఉండుటకు వారికి మూడు విషయాలు అవసరము:

మొదటిది, వారి యెడల యధార్థమైన ఆసక్తి కలిగి, వారు నిరంతరము ఆధారపడగల నిజమైన నమ్మకమైన స్నేహితులు, అనగా ఎవరైతే వారిని ప్రోత్సహిస్తు సహాయపడుతూ, వారి ప్రశ్నలకు జవాబిస్తారో అటువంటి సహోదర, సహోదరీలు సంఘములో వారికి అవసరము. సంఘ సభ్యులుగా మనకు ఎటువంటి బాధ్యతలు, నియమితకార్యములు లేదా సమస్యలు ఉన్నప్పటికి సంఘ ప్రోత్సాహకార్యక్రమాలు, కూడికలకు హాజరౌతున్నప్పుడు మనం అప్రమత్తముగా ఉండి, క్రొత్తవారి కొరకు వెదకాలి. ఈ క్రొత్త స్నేహితులు స్వీకరించబడిన వారిగా, ఆహ్వానించబడిన వారిగా భావించుటలో సహాయపడుటకు చక్కని సంబోధన, యధార్థమైన చిరునవ్వును చిందిస్తు, పాడుటకు ఆరాధించుటకు వారి ప్రక్కన కూర్చొనుట, వారిని ఇతర సభ్యులకు పరిచయము చేయుట వంటి సాధారణమైన పనులు మనము చెయ్యగలము. ఇటువంటి మార్గాలలో కొన్నింటి ద్వారా మన క్రొత్త స్నేహితులకు మన హృదయాలను తెరచినప్పుడు, పరిచర్య చేయు ఆత్మతో మనం పని చేస్తున్నాము. రక్షకుని వలె మనం వారికి పరిచర్య చేసినప్పుడు, మన సంఘములో వారు అపరిచితులుగా భావించరు. వారు సంఘమునకు చెందిన వారిగా భావించి, క్రొత్త స్నేహితులను చేసుకొంటారు, మరి ముఖ్యముగా మన నిజమైన సంరక్షణ ద్వారా రక్షకుని ప్రేమను భావిస్తారు.

రెండవది, క్రొత్త సభ్యులకు ఒక నియమితకార్యము---అనగా ఇతరులకు సేవ చేసే అవకాశము అవసరము. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క మహత్తరమైన విషయాలలో ఒకటి సేవ చెయ్యడం. మన విశ్వాసము బలంగా ఎదుగుటకు ఇది ఒక విధానము. ప్రతి క్రొత్త స్నేహితుడు అటువంటి బాధ్యతకు అర్హుడు. బిషప్పు మరియు వార్డు సలహామండలి వారి బాప్తీస్మము తీసుకున్న వెంటనే నియమిత కార్యమును అప్పగించుటకు ప్రత్యక్షంగా బాధ్యత కలిగియున్నప్పటికీ, అనధికారికంగా లేదా సేవ చేసే ప్రాజెక్టుల ద్వారా ఇతరులకు సేవ చేయుటలో మనకు సహాయపడుటకు మన క్రొత్త స్నేహితులను ఆహ్వానించుటకు మనల్ని ఏదీ నిరోధించదు.

మూడవది, క్రొత్త స్నేహితులు “దేవుని యొక్క మంచి వాక్యముతో పోషించబడాలి. ”11 మనం బోధనలను చదివి, వారితో చర్చించి, కథల యొక్క సందర్భమును చెప్పి, కష్టమైన పదములను వివరించుట ద్వారా వారు లేఖనములను ప్రేమించి, బాగా తెలుసుకొనుటకు వారికి మనం సహాయపడగలము. క్రమబద్ధమైన లేఖన పఠనము ద్వారా స్వకీయ నడిపింపును ఏవిధంగా పొందాలో కూడా మనం వారికి బోధించగలము. అదనముగా, క్రమబద్ధముగా ఏర్పాటు చేయబడిన సంఘ కూడికలు, ప్రోత్సాహకార్యక్రమాలు లేని వేరే సమయాలలో మన క్రొత్త స్నేహితులను వారి గృహాలలో కలుసుకోగలము మరియు మన గృహాలకు ఆహ్వానించగలము, తద్వారా పరిశుద్ధుల సమాజము యొక్క శక్తివంతమైన నదిలో కలియుటకు వారికి సహాయపడగలము.

దేవుని కుటుంబములో సభ్యులు అగుటకు మన స్నేహితులు చేసుకొను సర్దుబాట్లు, సవాళ్ళను గుర్తించి, మన జీవితాలలో అటువంటి సవాళ్ళను మనమేవిధంగా జయించామో మన సహోదరీ, సహోదరులుగా వారితో పంచుకోగలము. వారు ఒంటరిగా లేరని, ఆయన వాగ్దానాలయందు విశ్వాసాన్ని సాధన చేస్తే దేవుడు వారిని దీవిస్తాడని వారు తెలుసుకొనుటకు ఇది వారికి సహాయపడును. 12

సాలిమోస్ మరియు నెగ్రో నదులు కలిసినప్పుడు, అమెజాన్ నది శక్తివంతమైనదిగా, బలమైనదిగా మారుతుంది. అదేరీతిలో, మనము మన క్రొత్త స్నేహితులు నిజంగా కలిసినప్పుడు, యేసు క్రీస్తు యొక్క సంఘము ఇంకా బలమైనదిగా, స్థిరమైనదిగా మారుతుంది. అనేక సంవత్సరాల క్రితం మా స్వదేశములో యేసు క్రీస్తు యొక్క సువార్తను స్వీకరించినప్పుడు, ఈ క్రొత్త నదిలో కలియుటకు మాకు సహాయము చేసిన వారందరికి నా ప్రియమైన భార్య రోసానా మరియు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాము. ఆ సంవత్సరాలన్నింటిలో, ఈ అద్భుతమైన జనులు నిజంగా మాకు పరిచర్య చేసారు మరియు నీతియందు నిరంతరము ప్రవహించుటకు మాకు సహాయము చేసారు.

పశ్చిమార్ధ గోళములో ఉన్న ప్రవక్తలకు ఏవిధంగా నిత్యజీవమునకు ప్రవహించే మంచితనము యొక్కఈ క్రొత్త నదిలోనికి క్రొత్త స్నేహితులు కలిసి విశ్వాసముగా ప్రవహించేలా చెయ్యాలో తెలుసు. ఉదాహారణకు, మన కాలమును చూచియుండి, అదేవిధమైన సవాళ్ళను మనం ఎదుర్కొంటామని తెలిసి,13 మోర్మన్ గ్రంథములోని తన రచనలలో మొరోనై క్రొత్తగా పరివర్తన చెందిన వారికి సహాయము చేయుటకు కొన్ని ముఖ్యమైన చర్యలను పొందుపరచెను:

“మరియు వారు బాప్తీస్మమును కొరకు అంగీకరించబడియుండి పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రేరేపించబడి శుద్ధి చేయబడిన తరువాత, వారు క్రీస్తు యొక్క సంఘ జనుల మధ్య లెక్కింపబడిరి; మరియు వారిని సరియైన మార్గమందు ఉంచుటకు, వారిని నిరంతరము ప్రార్థన యందు మెలకువగా ఉంచుటకు, వారి విశ్వాసము యొక్క ఆది మరియు అంతము అయిన క్రీస్తు యొక్క యోగ్యతలపైన మాత్రమే ఆధారపడుచూ, వారు జ్ఞాపకము చేసుకొనబడి, దేవుని మంచి వాక్యము ద్వారా పోషింపబడునట్లు వారి పేర్లు తీసుకొనబడినవి.

“మరియు ఉపవాసముండుటకు, ప్రార్థన చేయుటకు, వారి ఆత్మల యొక్క క్షేమమును గూర్చి ఒకనితో నొకడు మాట్లాడుటకు సంఘము తరచుగా కూడుకొనెను.”14

ప్రభువు కార్యములో నా ప్రియమైన సహచరులారా, సంఘములోనికి క్రొత్త స్నేహితులను ఆహ్వానించుటలో మనం ఇంకా బాగా చెయ్యగలము మరియు బాగా చెయ్యాలి. ఈ వచ్చే ఆదివారము నుండే మనం ఇంకా ఎక్కువగా స్వీకరించుటకు, అంగీకరించుటకు, వారికి సహాయకరముగా ఉండుటకు మనమేమి చెయ్యగలమో ఆలోచించాలని నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. సంఘ కూడికలలో, ప్రోత్సాహకార్యములలో క్రొత్త స్నేహితులను ఆహ్వానించుటకు మీ సంఘ నియమితకార్యములు అడ్డుపడకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే ఈ ఆత్మలు దేవుని దృష్టిలో అమూల్యమైనవి మరియు కార్యక్రమాలు, ప్రోత్సాహకార్యాల కంటే మరింత ముఖ్యమైనవారు. రక్షకుడు చేసినట్లే మనం కూడా నిర్మలమైన ప్రేమతో నింపబడిన హృదయాలతో మన క్రొత్త స్నేహితులకు పరిచర్య చేసినప్పుడు, మన ప్రయత్నాలలో ఆయన మనకు సహాయం చేయునని ఆయన నామములో నేను మీకు వాగ్దానము చేయుచున్నాను. రక్షకుడు చేసినట్లుగా, మనం నమ్మకమైన పరిచర్య చేసేవారిగా ఉన్నప్పుడు, మన క్రొత్త స్నేహితులు బలంగా, అంకితభావముతో అంతము వరకు నమ్మకముగా ఉండుటకు వారికి కావలసిన సహాయాన్ని వారు కలిగియుంటారు. దేవుని యొక్క శక్తివంతమైన జనులుగా మనం అవుతున్నప్పుడు వారు మనతో కలుస్తారు మరియు యేసు క్రీస్తు సువార్త యొక్క దీవెనలు ఎక్కువగా అవసరమున్న లోకమునకు మంచినీటిని ఇచ్చుటలో మనకు సహాయపడతారు. ఈ దేవుని పిల్లలు “ఇకమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా,”15 భావిస్తారు. ఆయన స్వంత సంఘములో రక్షకుని సన్నిధిని వారు గుర్తిస్తారని నేను మీకు వాగ్దానము చేస్తున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు చాచిన బాహువులతో వారు స్వీకరించబడేంత వరకు సమస్త మంచితనము యొక్క ఊటలోనికి ఒక నదివలే మనతో ప్రవహించుటను వారు కొనసాగిస్తారు, “మీరు నిత్యజీవమును పొందెదరు,”16 అని తండ్రి చెప్పుటను వారు వింటారు.

ఆయన మిమ్మును ప్రేమించినట్లే ఇతరులను ప్రేమించుటకు ప్రభువు సహాయమును వెదకమని నేను మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. మోర్మన్ ఇలా బోధించెను: “అందువలన నా ప్రియమైన [సహోదరీ] సహోదరులారా, ఆయన కుమారుడు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులైన వారందరి పైన ఆయన ఉంచిన ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని, హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి. ”17 ఈ సత్యములను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను మరియు దీనిని యేసు క్రీస్తు నామములో చేస్తున్నాను, ఆమేన్.