చేతి పుస్తకములు మరియు పిలుపులు
4. యేసు క్రీస్తు యొక్క సంఘములో నాయకత్వము మరియు సలహాసభలు


“4. యేసు క్రీస్తు యొక్క సంఘములో నాయకత్వము మరియు సలహాసభలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“4. యేసు క్రీస్తు యొక్క సంఘములో నాయకత్వము మరియు సలహాసభలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
వార్డు సలహాసభ సమావేశము

4.

యేసు క్రీస్తు యొక్క సంఘములో నాయకత్వము మరియు సలహాసభలు

4.0

పరిచయము

సంఘములో నాయకుడిగా, ప్రభువు యొక్క అధికారిక సేవకుల చేత మీరు ప్రేరేపణ ద్వారా పిలువబడ్డారు. “నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చు” పరలోక తండ్రి యొక్క కార్యములో సహాయం చేసే విశేషాధికారము మీకు ఉంది (మోషే 1:39).

4.2

సంఘములో నాయకత్వము యొక్క సూత్రాలు

ఆయన భూలోక పరిచర్యలో, రక్షకుడు తన సంఘము కొరకు నాయకత్వం యొక్క మాదిరిగా నిలిచారు. ఆయన ముఖ్య ఉద్దేశ్యం తన పరలోక తండ్రి చిత్తాన్ని నేరవేర్చడం మరియు ఇతరులు ఆయన సువార్తను అర్థం చేసుకుని జీవించడంలో సహాయం చేయడం (యోహాను 5:30; మోషైయ 15:7 చూడండి).

మీ పిలుపు యొక్క బాధ్యతలను తెలుసుకోవడానికి మరియు నెరవేర్చడానికి మీకు సహాయం చేసేందుకు ప్రభువు యొక్క మార్గదర్శకత్వాన్ని కోరండి.

4.2.1

ఆధ్యాత్మికంగా సిద్ధపడండి

యేసు తన భూలోక నియమితకార్యము కొరకు ఆధ్యాత్మికంగా తననుతాను సిద్ధం చేసుకున్నారు (లూకా 4:1–2 చూడండి). ప్రార్థన, లేఖనాల అధ్యయనం మరియు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా పరలోక తండ్రికి దగ్గరవ్వడం ద్వారా మీరు కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడతారు.

మీరు నాయకత్వం వహించు వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు దేవుడు మిమ్మల్ని చేయమని పిలిచిన పనిని ఎలా నెరవేర్చాలో అర్థం చేసుకోవడానికి బయల్పాటును వెదకండి.

ఆత్మీయ బహుమానాలను కోరుకునే వారికి వాటిని ప్రసాదిస్తానని కూడా ప్రభువు వాగ్దానం చేశారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8 చూడండి).

4.2.2

దేవుని పిల్లలందరికీ పరిచర్య చేయండి

యేసువలె మీరు సేవ చేసే జనులను ప్రేమించండి. ఆయన ప్రేమతో మీరు నింపబడవలెనని “హృదయము యొక్క పూర్ణ శక్తితో” ప్రార్థన చేయండి (మొరోనై 7:48).

వ్యక్తులు వారి పరివర్తనను మరింతగా పెంచుకోవడానికి, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి సహాయపడండి. వారు తమ తదుపరి విధిని పొందినప్పుడు నిబంధనలు చేయడానికి సిద్ధపడేందుకు వారికి సహాయపడండి. వారు చేసిన నిబంధనలను పాటించడానికి మరియు పశ్చాత్తాపం యొక్క దీవెనలలో పాలుపంచుకోవడానికి వారిని ప్రోత్సహించండి.

4.2.3

యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధించండి

నాయకులందరూ బోధకులే. బోధకునిగా రక్షకుని మాదిరిని అనుసరించడానికి కృషి చేయండి (Teaching in the Savior’s Way; 17వ అధ్యాయం చూడండి). మీ మాటలు మరియు క్రియల ద్వారా, యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని మరియు ఆయన సువార్త సూత్రాలను బోధించండి (3 నీఫై11:32–33; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:12–14 చూడండి).

లేఖనాల నుండి మరియు కడవరి దిన ప్రవక్తల మాటల నుండి బోధించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 52:9 చూడండి).

మీరు ఒక సంఘ సమావేశానికి లేదా ప్రోత్సాహ కార్యక్రమానికి అధ్యక్షత్వం వహించడానికి పిలువబడినా లేదా నియమించబడినా, బోధన జ్ఞానవృద్ధి చేయునదిగా మరియు సిద్ధాంతపరంగా సరైనదిగా ఉండునట్లు నిర్ధారించుకోండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:21–23 చూడండి).

4.2.4

నీతియుక్తముగా అధ్యక్షత్వము వహించండి

అధ్యక్షత్వము వహించు ప్రతీ అధికారి యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేస్తారు (3.4.1 చూడండి). ఈ నిర్మాణం ప్రభువు పనిని చేయడంలో బాధ్యత మరియు జవాబుదారీతనము యొక్క క్రమాన్ని మరియు స్పష్టమైన మార్గాలను అందిస్తుంది.

అధ్యక్షత్వము వహించు ఒక అధికారి అధ్యక్షత్వము వహించడానికి తాత్కాలిక నియామకాన్ని మరొక వ్యక్తికి అప్పగించవచ్చు.

సంఘ నిర్మాణము, సమావేశం లేదా ప్రోత్యాహ కార్యక్రమానికి అధ్యక్షత్వము వహించే నాయకుడు ప్రభువు యొక్క ఉద్దేశాలు నెరవేరేలా చూస్తారు. ఇలా చేయడంలో, నాయకుడు సువార్త సూత్రాలు, సంఘ విధానాలు మరియు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును అనుసరిస్తాడు.

అధ్యక్షత్వము వహించడానికి పిలుపు లేదా నియామకము దానిని పొందే వ్యక్తిని ఇతరుల కంటే ఎక్కువ ప్రాముఖ్యముగా లేదా విలువైన వానిగా చేయదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:109–10 చూడండి).

ప్రభువు యొక్క సంఘములో ఏదైనా నిర్మాణములో అధ్యక్షత్వము వహించాలని ఆశించడం సరికాదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–37 చూడండి).

4.2.5

బాధ్యతను అప్పగించండి మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించండి

రక్షకుడు తన శిష్యులకు అర్థవంతమైన నియామకాలు మరియు బాధ్యతలను ఇచ్చారు (లూకా 10:1 చూడండి). వారికి అప్పగించిన పనికి లెక్క చెప్పే అవకాశాన్ని కూడా ఆయన కల్పించారు (లూకా 9:10 చూడండి).

నాయకుడిగా, మీరు ఇతరులకు బాధ్యతలను అప్పగించడం ద్వారా వారు ఎదగడానికి సహాయపడవచ్చు. దేవుని పని చేయడంలో సభ్యులందరినీ నిమగ్నం చేసేందుకు కృషి చేయండి.

అప్పగించడం వల్ల మీ సేవ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దేనిని అప్పగించాలనే దాని గురించి ఆత్మ యొక్క మార్గదర్శకత్వం కోసం వెదకండి, తద్వారా మీరు మీ అత్యధిక ప్రాధాన్యతలపై దృష్టి పెట్టవచ్చు.

4.2.6

నాయకులుగా మరియు బోధకులుగా ఉండడానికి ఇతరులను సిద్ధం చేయండి

సంఘ పిలుపులు లేదా నియామకాలలో ఎవరు సేవ చేయవచ్చో పరిశీలిస్తున్నప్పుడు, ప్రార్థనాపూర్వకముగా ఉండండి. ప్రభువు తాను పిలిచిన వారిని అర్హులుగా చేస్తారని గుర్తుంచుకోండి. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వినయంగా ప్రభువు సహాయాన్ని కోరుకుంటారు మరియు యోగ్యులుగా ఉండేందుకు కృషి చేస్తారు.

4.2.7

సమావేశాలు, పాఠాలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను స్పష్టమైన ఉద్దేశాలతో ప్రణాళిక చేయండి

స్పష్టమైన ఉద్దేశాలను కలిగి ఉండే సమావేశాలు, పాఠాలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయడంలో ఆత్మ యొక్క మార్గదర్శకత్వం కోసం వెదకండి. ఈ ఉద్దేశ్యాలు వ్యక్తులను మరియు కుటుంబాలను బలపరచాలి, వారిని క్రీస్తుకు దగ్గరగా తీసుకురావాలి మరియు దేవుని రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును సాధించడంలో సహాయపడాలి (1 మరియు 2వ అధ్యాయం చూడండి).

4.2.8

మీ ప్రయత్నాలను అంచనా వేయడం

నాయకుడిగా మీ బాధ్యతలను మరియు ఆధ్యాత్మిక వృద్ధిని క్రమం తప్పకుండా సమీక్షించండి. మీరు నాయకత్వం వహించే వారి వృద్ధిని కూడా పరిగణించండి.

నాయకుడిగా మీ విజయం ప్రధానంగా దేవుని పిల్లలు యేసు క్రీస్తు యొక్క నమ్మకమైన శిష్యులుగా మారడంలో సహాయపడేందుకు మీ నిబద్ధత చేత కొలవబడుతుంది. ఆత్మ మీ ద్వారా పనిచేస్తుందని మీరు భావించినప్పుడు ప్రభువు మీ ప్రయత్నాలకు సంతోషిస్తున్నారని మీరు తెలుసుకోవచ్చు.

4.3

సంఘములో సలహాసభలు

ఆయన కార్యమును చేయడంలో కలిసి సలహాలివ్వాలని ప్రభువు తన సంఘ నాయకులను ఆదేశించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 41:2–3 చూడండి). సలహాసభ సభ్యులు దేవుని పిల్లల అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని తీర్చడంలో సహాయపడడానికి ప్రణాళిక చేస్తున్నప్పుడు వారు బయల్పాటును పొందేందుకు సలహాసభలు అవకాశాలను అందిస్తాయి.

4.4

ప్రభావవంతమైన సలహాసభల సూత్రాలు

4.4.1

సలహాసభల యొక్క ఉద్దేశాలు

సభ్యులు విధులను పొందడానికి మరియు అనుబంధ నిబంధనలను పాటించడానికి సహాయపడాలని సలహాసభలు ప్రత్యేకంగా నొక్కి చెప్తాయి.

4.4.2

సలహాసభల సమావేశాలకు సిద్ధపడుట

అధ్యక్షత్వములు మరియు సలహాసభలు క్రమం తప్పకుండా సమావేశమవ్వాలని ఆశించబడింది. సలహాసభల సమావేశాలను ప్రణాళిక చేయడంలో ఈ నాయకులు ప్రభువు యొక్క నడిపింపును వెదకుతారు. ఏమి చర్చించాలో నిర్ణయించడంలో వారు సలహాసభ సభ్యుల అభిప్రాయాలను కూడా కోరుకుంటారు.

చర్చకు సంబంధించిన విషయాలను నాయకులు సలహాసభ సభ్యులకు ముందుగానే తెలియజేస్తారు. సలహాసభ సభ్యులు ఈ విషయాల గురించి అంతర్దృష్టులను పంచుకోవడానికి సిద్ధమవుతారు.

4.4.3

చర్చ మరియు నిర్ణయాలు

సలహాసభ సమావేశంలో, నాయకుడు (లేదా నాయకుడు నియమించిన వ్యక్తి) పరిగణించబడుతున్న విషయాన్ని వివరిస్తాడు. తర్వాత నాయకుడు ప్రశ్నలు అడగడం మరియు ఆలోచనలు కోరడం ద్వారా, సలహాసభ సభ్యులందరి మధ్య చర్చను ప్రోత్సహిస్తాడు.

సభ్యులు సలహాలను పంచుకుంటారు మరియు ఒకరినొకరు గౌరవంగా వింటారు. వారు ప్రభువు చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ప్రేరణ మరియు ఐక్యత యొక్క ఆత్మ ప్రబలంగా ఉండగలదు.

స్త్రీలు మరియు పురుషులతో కూడిన సభలో, నాయకుడు ఇరువురి నుండి అంతర్దృష్టులు మరియు ఆలోచనలను కోరుకుంటాడు. స్త్రీలు మరియు పురుషులు తరచుగా అవసరమైన సమతుల్యతను అందించే విభిన్న దృక్కోణాలను కలిగి ఉంటారు.

నాయకుడు సలహాసభ చర్చలకు మార్గదర్శకత్వం వహిస్తాడు. అయితే, అతను లేదా ఆమె మాట్లాడడం కంటే ఎక్కువగా వినాలి.

చర్చ తర్వాత, నాయకుడు చర్య యొక్క క్రమమును నిర్ణయించవచ్చు లేదా అదనపు సమాచారం మరియు నడిపింపును కోరుతూ నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు.

4.4.4

ఐక్యత

సలహాసభ సభ్యులు కోరిక మరియు ఉద్దేశ్యంలో పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో ఏకం కావాలని కోరుకుంటారు. వారు తమ చర్చలు మరియు నిర్ణయాలలో ఐక్యత కోసం ప్రయత్నిస్తారు.

4.4.5

చర్య మరియు జవాబుదారీతనం

సలహాసభ సభ్యులు తమ పనిని చాలా వరకు సలహాసభ సమావేశాలకు ముందు మరియు తరువాత చేస్తారు. సమావేశాల సమయంలో, వారు నిర్ణయాలను అమలు చేయడానికి ప్రణాళికలను అభివృద్ధి చేయడంలో ప్రేరేపణను కోరుకుంటారు. సలహాసభ నాయకుడు ఈ ప్రణాళికలకు సంబంధించిన నియామకాలను నెరవేర్చడానికి సభ్యులను ఆహ్వానిస్తారు.

సలహాసభ సభ్యులు వారి నియామకాలపై నివేదికను అందిస్తారు. పురోగతికి సాధారణంగా నిరంతర శ్రద్ధ మరియు తదుపరి నియామకాలు అవసరం.

4.4.6

గోప్యత

సలహాసభతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు నాయకులు వివేచనను ఉపయోగిస్తారు. వారు సాధారణంగా ఈ సమాచారాన్ని పంచుకోవడానికి సభ్యుని అనుమతి కోరుకుంటారు.

సలహాసభ నాయకుని నుండి నియామకాల‌ను పూర్తి చేయడానికి అవసరమైతే తప్ప, సభ్యులు సలహాసభ వెలుపల వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు.

కొన్ని విషయాలు మొత్తం సభ ముందుకు తీసుకురాలేనంత సున్నితమైనవి.