2010–2019
పరిశుద్ధాత్మ మీకే విధంగా సహాయపడగలదు?
April 2017 General Conference


పరిశుద్ధాత్మ మీకే విధంగా సహాయపడగలదు?

పరిశుద్ధాత్మ హెచ్చరించును, పరిశుద్ధాత్మ ఆదరించును, మరియు పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును.

ఈమధ్య ఒక సోమవారం సాయంత్రము, నా భార్య లీసా, నేను మా పొరుగున ఉన్న ఒక చిన్న కుటుంబమున్న ఇంటివద్ద ఆగాము. మేమక్కడ ఉండగా, ఆ కుటుంబము వారి తొమ్మిది సంవత్సరాల కొడుకు పాఠము సిద్ధపరిచాడని మాకు చెప్తూ, మమ్మల్ని కుటుంబ గృహ సాయంకాలము కోసం ఉండమని ఆహ్వానించారు. అవును, మేము ఉన్నాము!

ప్రారంభ పాట, ప్రార్థన, మరియు కుటుంబ వ్యవహారము తరువాత, తొమ్మది సంవత్సరాల వాడు తాను వ్రాసుకొన్న పాఠములో చేర్చబడిన జ్ఞానోదయము కలిగించే ప్రశ్నను చదవటం ద్వారా ప్రారంభించాడు: “పరిశుద్ధాత్మ మీకేవిధంగా సహాయపడగలదు?” ఈ ప్రశ్న అడుగుట ప్రతి ఒక్కరు ఆలోచనలు మరియు మెళకువలు పంచుకొన్నప్పుడు, అర్థవంతమైన కుటుంబ చర్చ ప్రారంభమైంది. మా బోధకుని పాఠ్య సిద్ధపాటు మరియు అతడి మంచి ప్రశ్న చేత నేను ఆకట్టుకోబడ్డాను, అది మరలా నాలో పదే పదే కదిలించింది.

చిత్రం
చేతితో వ్రాయబడిన కుటుంబ గృహ సాయంకాల పాఠము

అప్పటినుండి, నన్ను నేను ప్రశ్నించుకోసాగాను, “పరిశుద్ధాత్మ మీకే విధంగా సహాయపడగలదు?”---ఎనిమిది నిండుతూ బాప్తీస్మము కొరకు సిద్ధపడుచున్న ప్రాథమిక పిల్లలు, బాప్తీస్మము కొరకు సిద్ధపడుచున్న, మరియు ఇటీవల బాప్తీస్మము పొంది మరియు పరిశుద్ధాత్మ వరమును పొందిన వారికి ప్రత్యేకంగా సంబంధించు ఒక ప్రశ్న. అది ఇటీవల మార్పుచెందిన వేలమందికి సంబంధించినది.

“పరిశుద్ధాత్మ మీకే విధంగా సహాయపడగలదు?” ఆలోచించమని, మనలో ప్రతిఒక్కరిని, ప్రత్యేకంగా ప్రాథమిక పిల్లలను నేను ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రశ్నను నేను ధ్యానించినప్పుడు, నా బాల్యము నుండి ఒక అనుభవముపై నేను వెంటనే ప్రతిఫలించాను. ఇది పన్నెండుమంది అపొస్తలుల కోరమునకు నా పిలుపు తరువాత ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ కు సంబంధించినది మరియు దానిని ఆయన సంఘ మాసపత్రిక వ్యాసములో నా జీవితం గురించి వ్రాసిన దానిలో చేర్చారు. 1 ఈ వృత్తాంతమును మీలో కొందరు వినియుండవచ్చు, కాని అనేకమంది వినియుండరు.

నాకు 11 సంవత్సరాలప్పుడు, మా నాన్న, మరియు నేను మా యింటికి దగ్గరున్న కొండలలో ఒక వేడి వేసవి రోజున పైకి ఎక్కాము. నాన్న, నిటారైన కాలిబాటను ఎక్కినప్పుడు, కాలిబాట ప్రక్కన ఒక పెద్ద రాయి నుండి మరొక దానిపై నేను గెంతాను. పెద్ద రాళ్ళలో ఒకదానిని ఎక్కటానికి ఉద్దేశిస్తూ, నేను దాని పైకి కష్టముగా ఎక్కుట ప్రారంభించాను. నేను అలా చేసినప్పుడు, “ఆ రాయి మీదకు ఎక్కవద్దు. కాలిబాటపై మనము వెళదాము,” అని చెప్పుచు మా నాన్న నా బెల్టుతో నన్ను పట్టుకొని, త్వరగా నన్ను క్రిందకు దింపాడు.

కొన్ని నిముషాల తరువాత, కాలిబాట నుండి క్రిందకు చూసినప్పుడు, నేను ఎక్కాలనుకొన్న అదే రాయిపైన ఎండలో కాచుకుంటున్న పెద్ద తాచు పామును మేము చూసాము.

తరువాత మేము యింటికి వెళ్ళుచుండగా, నేను అడగాలని నాన్న ఎదురుచూస్తున్నాడని నాకు తెలుసు. “అక్కడ పాము ఉందని మీకు ఎలా తెలుసు?” నేను అడిగాను, నా ప్రశ్న పరిశుద్ధాత్మ గురించి మరియు పరిశుద్ధాత్మ మనకు ఏవిధంగా సహాయపడగలదు అనే చర్చకు దారి తీసింది. ఆ రోజు నేను నేర్చుకొన్న దానిని నేను ఎన్నడూ మరచిపోను.

పరిశుద్ధాత్మ నాకు ఎలా సహాయపడిందో మీరు చూసారా? నా ప్రాణమును కాపాడునట్లు, పరిశుద్ధాత్మ యొక్క మిక్కిలి నిమ్మళమైన స్వరమును మా నాన్న విన్నందుకు నేనెల్లప్పుడు కృతజ్ఞత కలిగియున్నాను.

పరిశుద్ధాత్మ గురించి మనకు తెలిసినదేమిటి

“పరిశుద్ధాత్మ మీకే విధంగా సహాయపడగలదు?” అన్న ప్రశ్నను మనమింకా పరిశీలించక ముందు, పరిశుద్ధాత్మ గురించి ప్రభువు బయల్పరచిన దానిలో కొంత సమీక్షిద్దాము. మనము చూడగల అనేక నిత్య సత్యములున్నాయి, కానీ ఈరోజు నేను కేవలము మూడు ముఖ్యమైనవి పేర్కొంటాను.

మొదటిది, పరిశుద్ధాత్మ దైవసమూహము యొక్క మూడవ సభ్యుడు. మనము ఈ సత్యమును మొదటి విశ్వాస ప్రమాణములో నేర్చుకుంటాము: “మనము నిత్య తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు, మరియు పరిశుద్ధాత్మయందు విశ్వసించుచున్నాము.”2

రెండవది, ఆధునిక లేఖనములో వివరించబడినట్లుగా, పరిశుద్ధాత్మ ఆత్మ స్వరూపి: “తండ్రి మనుష్యుని వలె స్పర్శనీయమైన మాంసము, ఎముకలను కలిగియున్నాడు, కుమారుడు కూడా అలా ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ మాంసము, ఎముకలను కలిగిలేడు, కాని ఆత్మ స్వరూపి. ఆవిధంగా కాని యెడల, పరిశుద్ధాత్మ మన మధ్య నివసించదు.”3 భౌతిక శరీరాలను కలిగియున్న, తండ్రి మరియు కుమారుని వలె కాకుండా, పరిశుద్ధాత్మ ఆత్మ శరీరమును కలిగియున్నది. పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వాగ్దానము, మరియు ఆదరణకర్త కలిపి, పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన ఇతర పేర్లు మరియు మనకు పరిచయమైన వాటిని ఈ సత్యము స్పష్టపరచును. 4

మూడవది, పరిశుద్ధాత్మ వరము హస్త నిక్షేపణ ద్వారా వచ్చును. బాప్తీస్మము తరువాత ఈ విధి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కొరకు మనల్ని అర్హులుగా చేయును.5 ఈ విధిని నెరవేర్చుటకు, యోగ్యతగల మెల్కీసెదకు యాజకత్వము గలవారు తమ చేతులను, వ్యక్తుల తలపై ఉంచి, అతడు లేక ఆమెను పేరుతో పిలిచి6, వారి యాజకత్వము పేరు చెప్పి, మరియు యేసు క్రీస్తు నామములో యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యుడిగా నిర్ధారిస్తారు, మరియు ముఖ్యమైన ఈ వాక్యమును ఉచ్చరిస్తారు: “పరిశుద్ధాత్మను పొందుము.”

పరిశుద్ధాత్మ మీకేవిధంగా సహాయపడగలదు?

పరిశుద్ధాత్మ గురించి మూడు ముఖ్యమైన సత్యముల సాధారణ సమీక్ష తరువాత, మన మొదటి ప్రశ్నకు తిరిగి వెళదాము: “పరిశుద్ధాత్మ మీకేవిధంగా సహాయపడగలదు? ”

పరిశుద్ధాత్మ హెచ్చరించును

నా బాల్యకాల అనుభవములో వివరించినట్లుగా, భౌతిక మరియు ఆత్మీయ అపాయములను ముందుగా మీకు హెచ్చరించుట ద్వారా పరిశుద్ధాత్మ మీకు సహాయపడగలదు. జపానులో ప్రాంతీయ అధ్యక్షత్వములో నేను సేవ చేస్తుండగా పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరించు పాత్రను మరలా నేను నేర్చుకున్నాను.

ఈ సమయమందు, నేను జపాను సెండై మిషను యొక్క అధ్యక్షుడు రీడ్ టాటియోకాతో సన్నిహితంగా పనిచేసాను. మామూలు మిషను వాడుకలో భాగముగా, అధ్యక్షుడు టాటియోకా తన మిషనులో దక్షిణ భాగములో మిషనరీ నాయకుల కోసం ఒక సమావేశమును ప్రణాళిక చేసాడు. సమావేశానికి కొన్నిరోజులకు ముందు, నిర్దేశించబడిన స్వల్ప సంఖ్యలో ఎల్డర్ మరియు సహోదరి నాయకులకు బదులుగా, నాయకత్వ సమావేశమునకు ఆ జోన్ మిషనరీలందరిని ఆహ్వానించుటకు, తన హృదయములో ముద్ర వేయబడినట్లు అధ్యక్షుడు టాటియోకా భావించాడు.

తన ఉద్దేశమును ప్రకటించినప్పుడు, ఈ ప్రత్యేక సమావేశము అందరికి ఉద్దేశించింది కాదు కాని మిషను నాయకులకు మాత్రమేనని మిగిలిన వారు అతనికి గుర్తుచేసారు. అయినప్పటికిని, తాను పొందిన ప్రేరేపణను అనుసరించుటకు, బదులుగా సాధారణ సమావేశమును ప్రక్కకు పెట్టుటకు, ఆ సమావేశానికి ఫక్షుమా పట్టణముతో కలిపి, అనేక తీర ప్రాంత నగరాలలో సేవ చేస్తున్న మిషనరీలందరిని అతడు ఆహ్వానించాడు. నియమించబడిన దినమున, 2011, మార్చి 11, కొరియామా పట్టణ లోతట్టు నగరములో మిషనరీలు విస్తరించబడిన మిషను సమావేశము కొరకు కలిసి సమావేశమయ్యారు.

సమావేశ సమయములో, జపాను సండై మిషను ఉన్నచోట జపాను ప్రాంతమును 9–0 పరిమాణపు భూకంపము మరియు సునామి తాకాయి. దురదృష్టవశాత్తు, మిషనరీలు కూడుకొన్న వాటిని కలిపి---అనేక తీరప్రాంత పట్టణాలు ---నాశనమయ్యాయి మరియు గొప్ప ప్రాణ నష్టము సంభవించింది. ఫక్షుమా పట్టణము తదుపరి అణు ఘటనను అనుభవించింది.

ఆ రోజు మిషనరీలు సమావేశమైన చోట, సమావేశ గృహము భూకంపముచేత నాశనమైనప్పటికిని, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించుట ద్వారా, అధ్యక్షుడు మరియు సహోదరి టాటియోకా, మిషనరీలందరు క్షేమంగా సమావేశమయ్యారు. వారు అపాయమునుండి, సునామి మరియు అణు పతనము యొక్క నాశనము నుండి మైళ్ళ దూరముగా ఉన్నారు.

పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను మీరు ఆలకించినప్పుడు---భావనలు చాలా తరచుగా నెమ్మదిగా మరియు నిశ్శబ్దమైనవి---ఆత్మీయ మరియు తాత్కాలిక అపాయము నుండి ఎప్పటికి తెలియకుండా తీసివేయబడవచ్చు.

సహోదర, సహోదరిలారా, ఆయన మా నాన్నకు మరియు అధ్యక్షుడు టాటియోకాకు చేసినట్లుగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని హెచ్చరించుట ద్వారా మీకు సహాయపడును.

పరిశుద్ధాత్మ ఆదరించును

“పరిశుద్ధాత్మ మీకేవిధంగా సహాయపడగలదు?” అనే ప్రశ్నకు జవాబిచ్చుట కొనసాగించుటకు, ఆదరణకర్తగా ఆయన పాత్రను మనము ఇప్పుడు విశ్లేషిద్దాము. మన జీవితాలలో ఊహించని సంఘటనలు విచారమును, నొప్పిని, మరియు నిరాశను కలిగిస్తాయి. అయినప్పటికిని, పరిశుద్ధాత్మ తన ముఖ్యమైన పాత్రలలో ఒకటైన---ఆదరణకర్త, వాస్తవానికి ఆయన పేర్లలలో ఒకటి. యేసు క్రీస్తు నుండి ఈ శాంతికరమైన, అభయమిచ్చు మాటలు ఈ పరిశుద్ధ పాత్రను వివరించును, “నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, మీకనుగ్రహించును.” 7

ఇంకా వివరించుటకు, అనేక సంవత్సరాల క్రితం అమెరికా, కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ నుండి చిన్న కమ్యూనిటీకి తరలి వచ్చిన ఐదుగురు కొడుకులుగల ఒక కుటుంబము యొక్క నిజమైన వృత్తాంతమును నేను పంచుకొంటాను. ఇద్దరు పెద్ద కుమారులు ఉన్నత పాఠశాల క్రీడలు ఆడటం మరియు స్నేహితులు, నాయకులు, మరియు శిక్షకులు---విశ్వాసులైన సంఘ సభ్యులు అనేకులతో సహవాసము చేయటం ప్రారంభించారు. ఈ అనుబంధాలు, పెద్దవాడైన ఫెర్నాండో, మరియు అతడి చిన్న తమ్ముడి బాప్తీస్మమునకు దారితీసాయి.

తరువాత ఫెర్నాండో ఇంటినుండి దూరముగా వెళ్ళాడు, అక్కడ అతడు తన విద్యను కొనసాగించాడు మరియు కళాశాల ఫుట్ బాల్ ఆడాడు. అతడు తన కళాశాల ప్రియసఖి, బేలీను దేవాలయములో వివాహము చేసుకున్నాడు. ఫెర్నాండో మరియు బేలీ తమ పాఠశాల చదువు ముగించిన తరువాత, వారు తమ మొదటి బిడ్డ---ఒక బాలిక యొక్క జననము కోసం ఎదురుచూస్తున్నారు. కాని ఫెర్నాండో మరియు బేలీ ఇంటికి తిరిగి వచ్చే ప్రక్రియ యందు, బేలీ మరియు ఆమె సహోదరి, రహదారిలో ప్రయాణిస్తుండగా, అనేక వాహనాలు చేర్చబడిన విషాదకరమైన ప్రమాదములో చిక్కుకున్నారు. బేలీ, ఆమెకు పుట్టని కుమార్తె తమ ప్రాణాలు కోల్పోయారు.

చిత్రం
ఫెర్నాండో మరియు బేలీ

ఫెర్నాండో అదేవిధంగా, బేలీ తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల యొక్క బాధ ఎంత లోతుగా ఉన్నప్పటికిని, దాదాపు వెంటనే వారిపైన క్రుమ్మరింపబడిన విభిన్నమైన శాంతి మరియు ఓదార్పు కూడా లోతైనది. ఆదరణకర్తగా తన పాత్రయందు, పరిశుద్ధాత్మ ఈ గ్రహింపశక్యము కాని బాధ గుండా ఫెర్నాండో నిజముగా బలపరచబడ్డాడు. ఆత్మ నిలకడయైన శాంతిని సంభాషించింది, అది ఫెర్నాండో దురదృష్టకరమైన ప్రమాదములో చేర్చబడిన వారినందరి పట్ల క్షమాపణ మరియు ప్రేమగల స్వభావమునకు నడిపించింది.

బేలీ తల్లిదండ్రులు ప్రమాద సమయములో మిషనరీగా సేవ చేస్తున్న ఆమె సహోదరుడికి ఫోను చేసారు. తన ప్రియమైన సహోదరి గురించి కష్టమైన వార్తను విన్న తరువాత తన భావాలను ఒక లేఖలో వివరించాడు: “తుఫాను మధ్యలో, మీ స్వరములు అంత నెమ్మదిగా ఉండటం అద్భుతమైనది. నాకేమి చెప్పాలో తెలియటం లేదు. . . . నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నా సహోదరి ఉండదని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. . . రక్షకుడు మరియు ఆయన ప్రణాళికను గూర్చి మీ అమోఘమైన సాక్ష్యముల చేత నేను ఓదార్చబడ్డాను. నేను చదివి మరియు బోధించినప్పుడు, అదే ప్రియమైన ఆత్మ నన్ను కన్నీటి అంచుకు తీసుకొనివెళ్ళును మరియు నా హృదయమును నింపును. తరువాత నేను ఓదార్చబడ్డాను మరియు నేను ఎరిగిన విషయాలను నాకు గుర్తు చేయబడ్డాను.”8

ఫెర్నాండో మరియు బేలీ కుటుంబానికి ఆయన చేసినట్లుగా, మిమ్మల్ని ఓదార్చుట ద్వారా పరిశుద్ధాత్మ మీకు సహాయపడును.

పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును

పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును, తండ్రి మరియు కుమారుని గూర్చి సాక్ష్యము కూడా వహించును. 9 తన శిష్యులతో మాట్లాడుతూ, ప్రభువు చెప్పాడు: “తండ్రి యొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, . . . ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.” 10

సాక్షిగా పరిశుద్ధాత్మ యొక్క విలువైన పాత్రను వివరించుటకు బదులుగా, నేను ఫెర్నాండో మరియు బేలీ వృత్తాంతమును కొనసాగిస్తాను. మీకు గుర్తున్న యెడల, ఫెర్నాండో మరియు అతడి తమ్ముడు బాప్తీస్మము పొందారని నేను చెప్పాను, కాని అతడి తల్లిదండ్రులు మరియు ముగ్గురు తమ్ముళ్ళు పొందలేదు. మరియు, సంవత్సరాలుగా మిషనరీలతో కలుసుకొనమని అనేకసార్లు అడగబడినప్పటికిని, ప్రతీసారి కుటుంబము తిరస్కరించింది.

బేలీ మరియు ఆమె కూతురి బాధాకరమైన మరణమును బట్టి, ఫెర్నాండో కుటుంబానికి ఓదార్పు పొందుట సాధ్యము కాలేదు. ఫెర్నాండో మరియు బేలీ కుటుంబము వలె, వాళ్ళు ఆదరణ లేక శాంతిని కనుగొనలేకపోయారు. బేలీ కుటుంబముతో పాటు వారి స్వంత కుమారుడు, వారి బరువైన భారమును ఎలా భరిస్తున్నాడో వారు గ్రహించలేకపోయారు.

చివరకు వారు తమకు లేనిది మరియు తమ కుమారుడు కలిగియున్నది, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త అని, ఇదే అతడి శాంతి మరియు ఓదార్పుకు ఆధారమనే ముగింపుకు వచ్చారు. ఈ గ్రహింపు తరువాత, వారు తమ కుటుంబానికి సువార్తను బోధించుటకు మిషనరీలను ఆహ్వానించారు. ఫలితంగా, వారు సంతోషము యొక్క గొప్ప ప్రణాళికను గూర్చి సాక్ష్యమును పొందారు, అది వారు నిరాశతో వెదకుచున్న మధురమైన శాంతిని మరియు నెమ్మదిపరచు ఓదార్పును వారికి తెచ్చింది.

చిత్రం
ఫెర్నాండో కుటుంబము యొక్క బాప్తీస్మము

బేలీ, వారి పుట్టకుండా చనిపోయిన మనుమరాలిని నష్టపోయిన రెండు నెలల తరువాత, ఫెర్నాండో తల్లిదండ్రులు అదేవిధంగా అతడి ఇద్దరు తమ్ముళ్ళు బాప్తీస్మము పొందారు, నిర్ధారించబడ్డారు, మరియు పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందారు. ఫెర్నాండో యొక్క చిన్న తమ్ముడు, తనకు ఎనిమిది వచ్చినప్పుడు తన బాప్తీస్మమునకు ఎదురుచూస్తున్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ, వారు బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మ వరమును పొందాలనే కోరికకు వారిని నడిపిస్తూ, సువార్త యొక్క సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చిందని వారు ప్రతిఒక్కరు సాక్ష్యమిచ్చారు.

సహోదర, సహోదరిలారా, ఫెర్నాండో యొక్క కుటుంబమునకు చేసినట్లు మీకు సాక్ష్యమిచ్చుట ద్వారా పరిశుద్ధాత్మ మీకు సహాయపడును.

సంక్షిప్తము

ఇప్పుడు మనం సంక్షిప్తపరచాలి. పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానమునకు తెచ్చు మూడు బయల్పరచబడిన సత్యములను మనము గుర్తించాము. అవి, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మూడవ సభ్యుడు, పరిశుద్ధాత్మ ఆత్మ స్వరూపి మరియు హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మ వరము కలుగును. “పరిశుద్ధాత్మ మీకే విధంగా సహాయపడగలదు?” అన్న ప్రశ్నకు మూడు జవాబులను కూడా మనము గుర్తించాము. పరిశుద్ధాత్మ హెచ్చరించును, పరిశుద్ధాత్మ ఓదార్చును, మరియు పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును.

ఆ వరమును కాపాడుకోవటానికి యోగ్యత

బాప్తీస్మమిచ్చుటకు మరియు నిర్ధారించుటకు సిద్ధపడు మీలో అనేకులకు, ఇటీవల లేక చాలా కాలం క్రితం నిర్ధారించబడిన మీకు, పరిశుద్ధాత్మ యొక్క వరమును మనము నిలుపుకొనుటమన భౌతిక మరియు ఆత్మీయ భద్రతకు అది ముఖ్యమైనది. ఆజ్ఞలను పాటించుట, వ్యక్తిగత, కుటుంబ ప్రార్థనలు చేయుట, లేఖనాలను చదవటం, కుటుంబము మరియు ప్రియమైన వారితో ప్రేమ, క్షమించే అనుబంధాలను కలిగియుండుటకు కోరుకొనుటకు ప్రయాసపడుట ద్వారా దీనిని మనము చేస్తాము. మనము మన ఆలోచనలు, క్రియలు, మరియు సుగుణమైన భాషను కాపాడుకోవాలి. మనము మన గృహాలు, సంఘము, మరియు సాధ్యమైనప్పుడల్లా, పరిశుద్ధ దేవాలయములో మన పరలోక తండ్రిని ఆరాధించాలి. ఆత్మకు దగ్గరగా ఉండుము, మరియు ఆత్మ మీకు దగ్గరగా ఉండును.

సాక్ష్యము

ఒక ఆహ్వానము మరియు నా స్థిరమైన సాక్ష్యముతో నేనిప్పుడు ముగిస్తున్నాను. మన ప్రాథమిక పిల్లలచేత చాలా తరచుగా పాడబడిన మాటలను మరింత సంపూర్ణముగా జీవించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మాటలు వారు గుర్తిస్తారని నా నిశ్చయము: “విను, విను, పరిశుద్ధాత్మ గుసగుస వినుము. మెల్లని, నిశ్శబ్ధమైన స్వరమును వినుము.”11

సహోదర, సహోదరిలారా, వృద్ధులు మరియు యౌవనులారా, త్రియేక దేవుడైన- తండ్రియైన దేవుని, యేసు క్రీస్తు, మరియు పరిశుద్ధాత్మను కలిగియున్న, దైవిక ప్రాణుల మహిమకరమైన ఉనికిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. సంపూర్ణ కాలములలో జీవిస్తున్న కడవరి దిన పరిశుద్ధులుగా మనము ఆనందించు విశేషావకాశాలలో ఒకటి పరిశుద్ధాత్మ వరమని నేను సాక్ష్యమిస్తున్నాను. పరిశుద్ధాత్మ మీకు సహాయపడగలదు మరియు సహాయపడుతుందని నాకు తెలుసు. యేసు క్రీస్తు మరియు మన రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్ర గురించి, మన పరలోక తండ్రిగా దేవుని గురించి ప్రత్యేక సాక్ష్యమును కూడా నేను చేరుస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.