2010–2019
పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును
April 2017 General Conference


పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును

మన భయములను ప్రక్కన పెట్టి ఆనందముతోనూ, నిరీక్షణతోనూ, మరియు ప్రభువు మనతో ఉన్నాడను బలమైన నమ్మకముతో బ్రతుకుదాము.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ప్రియమైన స్నేహితులారా, మన విశ్వాసము మరియు దేవుని కొరకు, మరియు ఆయన పిల్లల కొరకు ప్రేమ యందు ఏకమైన, విశ్వవ్యాప్త సంఘముగా కలుసుకొనుట ఎటువంటి ఆధిక్యత, ఆనందకరమైనది.

మన ప్రియమైన ప్రవక్తయైన థామస్ ఎస్. మాన్సన్ యొక్క సమక్షానికై ప్రత్యేకంగా నేను కృతజ్ఞుడను. అధ్యక్షా, మీ నడిపింపును, సలహాను మరియు విజ్ఞతను ఎల్లప్పుడూ మా హృదయములందు గైకొంటాము. అధ్యక్షులు మాన్సన్, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్ధిస్తున్నాము.

సంవత్సరాల క్రితం, నేను ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీలో స్టేక్ అధ్యక్షునిగా సేవ చేస్తున్నప్పుడు, మా స్టేక్ సమావేశాలలో ఒకటి ముగిసిన తరువాత ఒక ప్రియమైన కానీ సంతోషంగాలేని ఒక సహోదరి నా వద్దకు వచ్చింది.

“ఇది భయంకరమైనది కాదా?” “మీరు ప్రసంగిస్తున్నప్పుడు, కనీసం నలుగురు లేక అయిదుగురు గాఢంగా నిద్రపోయి ఉంటారు!” అని చెప్పింది.

నేను ఒక్క క్షణం ఆలోచించి, “అన్ని నిద్రలకంటే సంఘములో నిద్రించటం చాలా ఆరోగ్యకరమైన నిద్ర అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని” సమాధానమిచ్చాను.

ఈ మామూలు సంభాషణను విన్న నా అద్భుతమైన భార్య హ్యారీయట్, నేను ఇచ్చినవాటన్నింటిలో ఆది ఒక చక్కని సమాధానమని తరువాత చెప్పింది.

ఆ గొప్ప మేలుకొలుపు

అమెరికాలో కొన్ని వందల సంవత్సరాల క్రితము గొప్ప మేలుకొలుపు అనే ఉద్యమము గ్రామీణ ప్రాంతమంతా వ్యాపించింది. దాని యొక్క ప్రాధమిక ఉద్దేశ్యములలో ఒకటి ఆత్మ సంబంధమైన విషయాలలో నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తున్న జనులను మేలుకొలుపుట.

యువకునిగా జోసఫ్ స్మిత్ తన కాలములోని ఈ మత మేలుకొలుపులో భాగంగా తాను బోధకుల నుండి వినిన సంగతులతో ప్రభావితమయ్యాడు. ప్రభువు యొక్క చిత్తమును ఏకాంత ప్రార్ధనలో తీక్షణముగా అడుగుటకు అతడు నిర్ణయించుటకు ఇది కూడా ఒక కారణము.

ఈ బోధకులు పాపి కొరకు ఎదురు చూచుచున్న నరకము యొక్క భయంకరమైన మంటలపై బలంగా ఉద్ఘటిoచు ఒక నాటకీయమైన భావోద్వేగకరంగా ప్రసంగించు శైలిని కలిగియుండిరి.1 వారి ప్రసంగములు, జనులను నిద్రపుచ్చ లేదు--- అవి కొన్ని పీడకలలు తెప్పించియుండవచ్చు. వారి ఉద్దేశ్యము మరియు విధానము చర్చిలోనికి జనులను భయపెట్టేదిగా ఉన్నది.

అభిసంధానముగా భయము

చరిత్రలో జనులు పని చేయునట్లుగా చేయుటకు సాధనముగా భయము తరచుగా ఉపయోగించబడింది. తల్లిదండ్రులు తమ పిల్లలతోనూ, యాజమాన్యం తమ ఉద్యోగులతో, మరియు రాజకీయ నాయకులు వోటర్లతో దానిని ఉపయోగించిరి.

మార్కెటింగ్ నిపుణులు భయము యొక్క శక్తిని అర్ధము చేసుకొని దానిని తరచుగా ఉపయోగిస్తున్నారు. అందుకే కొన్ని వాణిజ్య ప్రకటనలు మనము వారి అల్పాహార ధాన్యమును లేక నూతన వీడియో గేమును లేక సెల్ ఫోను వంటి వాటిలో సరియైన బ్రాండుని ఎoపిక చేసికొనుటలో విఫలమైనచో మనము బాధాకరమైన జీవితమును జీవించు మరియు దుఖముతో ఒంటరిగా మరణించు ప్రమాదమును ఎదుర్కొందుమను అంతర్గతంగా దాగియున్న సందేశమును కలిగియుండును.

దీనిని చూచి నవ్వి అటువంటి యుక్తులకు మనము పడమని అనుకొంటాము కానీ కొన్నిసార్లు పడతాము. ఆధ్వాన్నముగా, ఇతరులు మనము కోరుకొన్నది చేయునట్లు కొన్నిసార్లు మనము అవే విధానములనే ఉపయోగిస్తాము.

ఈ రోజు నా సందేశము రెండు ఉద్దేశ్యములను కలిగియున్నది. మొదటిది మనతో కలిపి--మనము ఇతరులను ప్రేరేపించుటకు భయమును ఎంతవరకు ఉపయోగించ వచ్చో పరిగణించి గ్రహించుటకు మిమ్మల్ని పురికొల్పటం. రెండవది మేలైన మార్గమును సూచించుట.

భయముతోనున్న సమస్య

మొదట, భయముతోనున్న సమస్యను చర్చిద్దాం. అన్నిటికిపైగా, మనలో ఎంత మంది భయము వల్ల మంచిగా ఆహారము తీసుకున్నాము, సీట్ బెల్టు ధరించాము, మరింత వ్యాయమము చేస్తాము, డబ్బు పొదుపు చేసాము లేక పాపము గురించి పశ్చాత్తాపపడ్డాము?

భయము మన చర్యలపై మరియు ప్రవర్తనపై శక్తివంతమైన ప్రభావము కలిగియుండగలదనుట నిజము. కానీ ఆ ప్రభావము తాత్కాలికము మరియు నిస్సారముగా ఉండవచ్చు. భయమునకు మన హృదయములను మార్చే శక్తి అరుదుగా కలదు, అది సరియైనదానిని ప్రేమించి మరియు పరలోక తండ్రికి విధేయులుగానుండగోరే జనులుగా మనలను ఎన్నటికీ మార్చలేదు.

భయపడే జనులు సరియైన వాటిని చెప్పవచ్చు మరియు చేయవచ్చు, కానీ వారు సరియైనవాటిని అనుభూతి చెందలేరు. వారు తరుచుగా నిస్సహాయంగా, వ్యతిరేకత మరియు క్రోధముతో కూడిన భావనలను పొందుతారు. కొంత కాలము తరువాత ఈ భావనలు అపనమ్మకము, ధిక్కరణ, మరియు తిరుగుబాటులకు కూడా దారితీస్తాయి.

దురదృష్టవశాత్తు, ఈ తప్పుడు విధానము లౌకిక ప్రపంచములోని జీవితము మరియు నాయకత్వమునకు మాత్రమే పరిమితము కాదు. వారి గృహములలో, వారి సంఘ పిలుపులలో, పనిలో లేక ఇతరులతో వారి దైనందిన వ్యవహారములలో అన్యాయపు అధినివేశమును ఉపయోగించు సంఘ సభ్యులను గూర్చి వినినప్పుడు అది నన్ను బాధపెట్టును.

తరచుగా, ఇతరులను బెదిరించుటను జనులు ఖండిస్తారు, కానీ దానిని వారు తమలో చూడలేరు. వారు తమ స్వంత ఏకపక్ష నియమములను ఇతరులు అనుసరించాలని కోరతారు. కానీ ఇతరులు స్వంత ఏకపక్ష నియమాలను అనుసరించనప్పుడు, వారు వారిని మాటలతోనూ మానసికముగాను మరియు కొన్నిసార్లు శారీరకముగా కూడా హింసిస్తారు.

“మనుష్యుల పిల్లల యొక్క ఆత్మలపై మనము నియంత్రణను లేక అధినివేశమును లేక బలప్రయోగమును లేక ఏ స్థాయిలోనైనాను దుర్ణీతిగా వినియోగించిన యెడల పరలోకములు వెనుకకు మళ్లును మరియు ప్రభువు యొక్క ఆత్మ దుఖించును”2 అని ప్రభువు చెప్పారు.

ముగింపు సాధనమును సమర్ధిస్తుందని నమ్ముట ద్వారా కొన్నిసార్లు మనము మన చర్యలను సమర్ధించుకొనుటకు శోధించబడే సందర్భములు ఉండవచ్చును. అదుపుచేయుట, కఠినముగా ఉండుట, బలవంతముగా ఒప్పించుట ఇతరుల మంచి కొరకే అని కూడా అనుకోవచ్చును. అలా కాదు, ఎందుకంటే, “ఆత్మ యొక్క ఫలములు ప్రేమ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వీకము, మరియు ఆశానిగ్రహము,”3 అని ప్రభువు స్పష్టము చేసెను.

ఒక మేలైన మార్గము

నేను మన పరలోక తండ్రిని మరింత ఎరిగినప్పుడు ఆయన తన పిల్లలను ఎలా ప్రేరేపించునో మరియు నడిపించునో నేను మరింత ఎక్కువగా చూశాను. ఆయన కోపగించడు, ప్రతీకారము తీర్చుకొనడు లేక ప్రతిఘటించువాడు కాడు. 4 ఆయన యొక్క కార్యము మరియు మహిమ, ఆయన యొక్క సంపూర్ణ ఉద్దేశ్యము మనలను తీర్చిదిద్దుట, మనలను పైకి లేపుట, మరియు ఆయన పూర్ణత్వములోనికి మనలను నడిపించుట. 5

దేవుడు మోషేకు తనను తాను “దయగలవాడు, కృపామయుడు, దీర్ఘశాంతుడు మరియు మంచితనము మరియు సత్యముల సమృద్ధియై ఉన్నాడని వివరించెను.”6

మన పరలోకమందున్న తండ్రి తన పిల్లలమైన మన కొరకు గల ఆయన యొక్క ప్రేమ గ్రహించుటకు మన శక్తికి మించినది.7

దీనికి అర్ధము దేవుడు ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకముగానున్న ప్రవర్తనలను అంగీకరించి అలక్ష్యము చేస్తాడనా? లేదు, ఖచ్చితముగా కాదు!

కాని మన ప్రవర్తనల కంటే అధికముగా ఆయన మనలను మార్చాలనుకుంటున్నాడు. ఆయన మన స్వభావములను పూర్తిగా మార్చాలనుకుంటున్నాడు. ఆయన మన హృదయములను మార్చాలనుకుంటున్నారు.

మనమందరము చేరుకుని ఇనుప దండమును స్థిరముగా పట్టుకొని మన భయములను ఎదిరించి సన్నని ఇరుకైన మార్గమునందు ముందుకు మరియు పైకి ముందుకు వెళ్ళవలెనని ఆయన కోరుచున్నాడు. ఆయన మనలను ప్రేమించుచున్నారు మరియు ఇది సంతోషమునకు మార్గము కనుక దీనిని ఆయన మన కొరకు కోరుచున్నారు.

మరి, మన దినములో ఆయనను అనుసరించునట్లు దేవుడు తన పిల్లలను ఎలా ప్రేరేపించును?

ఆయన తన కుమారుని పంపెను!

దేవుడు మనకు సరియైన మార్గమును చూపుటకు తన అద్వితీయ కుమారుడైన ఏసు క్రీస్తును పంపెను.

దేవుడు మనలను అనునయిoచుట, దీర్ఘ శాంతము, సాత్వీకము, దయాళుత్వము మరియు నిష్కపటమైన ప్రేమ ద్వారా, ప్రోత్సహించును.8 దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు మనము తోట్రిల్లునప్పుడు, మనము పైకి లేచి మరలా ప్రయత్నించాలని మరియు శక్తివంతులము కావాలని కోరుచున్నాడు.

ఆయన మన గురువు

ఆయన మన గొప్ప విలువైన నిరీక్షణ.

విశ్వాసముతో మనల్ని ప్రేరేపించుటకు ఆయన కోరుచున్నాడు.

మన తప్పటడుగుల నుండి మనం నేర్చుకోవాలని మరియు సరియైన ఎంపికలను చేయుటకు ఆయన మనలను నమ్ముచున్నాడు.

ఇది మేలైన విధానము! 9

లోకము యొక్క దుష్టత్వములు గురించి ఏమిటి?

మనము ఇతరులను బలవంతముగా మార్చడానికి ఉపయోగించే మార్గము లోకములోని దుష్టత్వమును భూతద్దంలో చూపటం మరియు దానినే తరచుగా పేర్కొనటం.

మన లోకము తప్పకుండా ఎల్లప్పుడూ అపరిపూర్ణముగానే ఉండెను, మరియు అలాగే ఉండుట కొనసాగును. అనేకమంది అమాయక జనులు ప్రకృతి యొక్క పరిస్థితులు కారణముగా మరియు మనుష్యుల యొక్క అమానుషత్వము వల్ల కూడా బాధపడతారు. మన దినములో అవినీతి మరియు దుష్టత్వము చాలా అసమాన్యము మరియు ఆందోళనకరము.

కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ, ఈ కాలంలో బ్రతకటాన్ని ప్రపంచ చరిత్రలో మరే కాలముతోనూ నేను మార్పిడి చేసుకోను. అసమాన్యమైన ఆర్ధిక అభివృద్ధి, విజ్ఞానము మరియు ప్రయోజనములు గల దినములలో జీవించుటకు మనము లెక్కలేనంతగా దీవించబడియున్నాము. మరి ముఖ్యముగా, లోకము యొక్క ప్రమాదముల పట్ల ఒక అసాధారణమైన ధృక్కోణమును ఇచ్చి ఈ అపాయములతో ఎలా వ్యవహరించాలో లేక వాటిని ఎలా నివారించాలో చూపించు ఏసు క్రీస్తు యొక్క సువార్త యొక్క సంపూర్ణతను కలిగియుండుటకు మనము దీవించబడ్డాము.

ఈ దీవెనల గురించి నేను ఆలోచించినప్పుడు, నేను మోకరిల్లి తన పిల్లలందరి యెడల ఆయన యొక్క అంతములేని ప్రేమ కొరకు మన పరలోక తండ్రికి స్తుతులు అర్పించాలని కోరుచున్నాను.

తన పిల్లలందరు భయమునందు లేక ఈ లోకము యొక్క చెడును గూర్చిన తలంపులతో ఉండాలని దేవుడు కోరునని నేను నమ్మటం లేదు. “ఏలయనగా దేవుడు మనకు భయముగల ఆత్మను కాక శక్తితోనూ మరియు ప్రేమతో కూడిన ఆత్మను మరియు శక్తివంతమైన మనస్సును మనకు ఇచ్చెను.” 10

సంతోషించుటకు ఆయన మనకు సమృద్ధియైన కారణముల నిచ్చెను. మనము కేవలము వాటిని వెదకాలి మరియు గుర్తించాలి. ప్రభువు తరచుగా మనకు “భయపడవద్దు,” “ధైర్యముగానుండుము,” 11 చిన్న మందా భయపడవద్దు,” 12 అని గుర్తుచేయును.

ప్రభువు మన యుద్దములను పోరాడును

సహోదర, సహోదరిలారా, మనము ప్రభువు యొక్క “చిన్న మంద.” మనము కడవరి దినముల పరిశుద్ధులము. రక్షకుని యొక్క రాకడ కొరకు ఎదురుచూచుట, మరియు ఆయనను ఆహ్వానించుటకు లోకమును సిద్ధపరచుటలో మన నిబద్దత మనకు ఆ పేరుతో వారసత్వముగా వచ్చినవి. కాబట్టి, మనము దేవునిని సేవించి, మన పొరుగువారిని ప్రేమిద్దాము. ఏ ఇతర మతము లేక జనుల గుంపు క్రిందుగా ఎన్నడూ చూడకుండా దీనిని మనము సహజమైన నమ్మకముతో, వినయముతో చేద్దాము. సహోదర, సహోదరిలారా, “మనము ఆ కాలము యొక్క సూచనలను మరియు మనుష్య కుమారుని యొక్క రాకడ యొక్క సూచనలను తెలుసుకొను” 13 లాగున దేవుని వాక్యమును చదవమని మరియు ఆత్మ యొక్క స్వరమును వినుటను చేయమని చెప్పబడ్డాము.

కావున, మనము లోకము యొక్క సవాళ్లను ఎరుగకుండా లేక మన కాలము యొక్క కష్టములు తెలియకుండా లేము. కానీ దీని అర్ధము మనపై మనము లేక ఇతరులపై భయము అనే భారమును మోపుట కాదు. మన అపారమైన సవాళ్లపై చింతించుట కంటె మన దేవుని యొక్క అనంతమైన గొప్పతనము, మంచితనము మరియు ఎదురులేని శక్తి పై దృష్టి పెట్టి ఆయనను నమ్ముచూ మరియు సంతోషముగల హృదయముతో ఏసు క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడుట మేలు కదా?

ఆయన యొక్క నిబంధన జనులుగా, మనకు దుర్ఘటనలు జరగవచ్చుననే భయము కారణముగా అచేతనము కానవసరము లేదు. బదులుగా, మనము ముందున్న సవాళ్లను మరియు అవకాశములను చేరుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసము, ధైర్యము, తీర్మానము మరియు నమ్మకముతో మనము ముందుకు సాగవచ్చును. 14

శిష్యరికపు మార్గములో మనము ఒంటరిగా నడవము. “ప్రభువైన మీ దేవుడు మీతో వెళ్ళును, ఆయన మిమ్మును విడువడు, ఎడబాయడు.” 15

“ప్రభువు మీ కొరకు యుద్ధము చేయును, మరియు మీరు మీ శాంతిని కలిగియుందురు.” 16

భయమును ఎదుర్కొనుటలో, మనము ధైర్యమును కనుగొందాము, మన విశ్వాసమును కూడదీసుకుందాము, మరియు “నీకు ఫ్యతిరేకముగ రూపొందింపబడిన ఏ ఆయుధమునూ వర్ధిల్లదు. ఇది ప్రభువు యొక్క సేవకులకు వారసత్వము,”17 అన్న వాగ్దానమునందు విశ్వాసమును కలిగియుందాము.

మనము శ్రమలు మరియు సంక్షోభముల కాలములో బ్రదుకుచున్నామా? అవును మనమున్నాము.

దేవుడు తానే ఇలా చెప్పెను. “లోకములో మీకు శ్రమ కలుగును : అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.”18

నమ్ముటకు మరియు ఆ ప్రకారము ప్రవర్తించుటకు, విశ్వాసమును మనము సాధన చేయగలమా? మన ఒడంబడికలకు మరియు పవిత్ర నిబంధనలకు తగినట్లుగా జీవించగలమా? సవాళ్ళతో కూడిన పరిస్థితులలో కూడా మనము దేవుని ఆజ్ఞలను పాటించగలమా? మనము తప్పక చేయగలము!

“మనము యదార్ధముగా నడచుకొనిన యెడల సమస్తమును మన మేలు కొరకు పనిచేస్తాయని” 19 దేవుడు వాగ్దానము చేసాడు కనుక మనము చేయగలము. కాబట్టి, మనము మన భయాలను ప్రక్కన పెట్టి సంతోషముతో, నిరీక్షణ, మరియు ప్రభువు మనతో ఉన్నాడనే ధైర్యముగల నమ్మకముతో జీవిద్దాము.

పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును

నా ప్రియమైన స్నేహితులారా, క్రీస్తునందు నా ప్రియ సహోదర, సహోదరీలారా, మనమెప్పుడైనను మనల్ని భయము లేక ఆందోళనలతో జీవించుచున్నట్లు కనుగొనిన యెడల లేక మన మాటలు, వైఖరులు లేక పనులు ఇతరులలో భయమును కలుగజేయుచున్న యెడల, భయము కొరకు దైవికముగా నియమింపబడిన విరుగుడు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమ, చేత ఈ భయము నుండి మనము బంధ విముక్తులము కావాలని నా ఆత్మ యొక్క పూర్ణ బలము చేత ప్రార్థిస్తున్నాను, ఏలయనగా “పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్లగొట్టును.”20

క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమ కీడు కలుగజేయుటకు, బాధించుటకు, బెదిరించుట, లేక హింసించుటకు శోధనలను జయించును.

మన ప్రియమైన రక్షకుని అనుచరులుగా వినయము, మర్యాద, మరియు ధైర్యముగల నమ్మకముతో నడచుటకు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమ మనలను అనుమతించును. మన భయములగుండా ముందుకు వెళ్లుటకు, మన పరలోక తండ్రి యొక్క శక్తి మరియు మంచితనమునందు మన పూర్తి నమ్మకమును ఉంచుటకు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమ నమ్మకమునిచ్చును.

మన గృహములలో మన వ్యాపార స్థలములలో, మన సంఘ పిలుపులలో మన హృదయాలలో, భయమునకు బదులుగా క్రీస్తు యొక్క ప్రేమతో భర్తీ చేద్దాము. క్రీస్తు యొక్క ప్రేమ భయమును విశ్వాసముతో నింపును!

ఆయన ప్రేమ మన పరలోక తండ్రి యొక్క మంచితనమును గుర్తించి, నమ్మి, మరియు ఆయన దైవిక ప్రణాళిక, ఆయన సువార్త, మరియు ఆయన ఆజ్ఞలందు విశ్వాసము కలిగియుండుటకు మనకు సాధ్యపరచును.21 దేవుని మరియు మనుష్యులను ప్రేమించుట దేవుని ఆజ్ఞలకు మన విధేయతను భారముగా కాక దీవెనగా మార్చును. క్రీస్తు యొక్క ప్రేమ కాస్త దయగల వారిగా, ఎక్కువ క్షమించే వారిగా, ఎక్కువ శ్రద్ధగల వారిగా, మరియు ఆయన కార్యమునకు ఎక్కువ సమర్పించు వారిగా అగుటకు మనకు సహాయపడును.

క్రీస్తు యొక్క ప్రేమతో మనము మన హృదయములను నింపిన యెడల, ఆత్మీయ తాజాదనముతో మేల్కొల్పపబడతాము, సంతోషంగా, ఆత్మ విశ్వాసముతో నడుస్తాము, మరియు మన ప్రియమైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగు మరియు మహిమలో మేల్కోని సజీవంగా ఉంటాము.

“(క్రీస్తు యొక్క) ప్రేమ యందు భయము లేదు” 22 అన్న అపొస్తులుడైన యోహానుతో, నేను సాక్ష్యమిస్తున్నాను. సహోదర, సహోదరిలారా, ప్రియమైన స్నేహితులారా, ఆయన మిమ్మల్ని పరిపూర్ణముగా ఎరుగును. ఆయన మిమ్మల్ని పరిపూర్ణముగా ప్రేమిస్తున్నాడు. మీ భవిష్యత్తు మీ కొరకు ఏమి కలిగియున్నదో ఆయన ఎరుగును. “భయపడకుము, కేవలము నమ్ముడి,” 23 మరియు “ఆయన యొక్క (పరిపూర్ణ ప్రేమయందు) మనము కట్టుబడియుందుము”24 గాక. యేసు క్రీస్తు నామములో ఇది నా ప్రార్ధన మరియు దీవెన, ఆమేన్.

వివరణలు

  1. జార్జ్ వైట్ ఫీల్డ్ మరియు జోనాతాన్ ఎడ్వార్డ్స్ ఈ రకమైన బోధకుని యొక్క రెండు ప్రసిద్ధమైన మాదిరులు.

  2. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:37.

  3. గలతీయులకు 5:22–23.

  4. ఒక సందర్భములో, రక్షకుడు సమరయుల గ్రామానికి వెళ్లాలనుకున్నాడు, కాని జనులు యేసును తిరస్కరించారు మరియు వారి గ్రామములోనికి ఆయనను ఆంగీకరించలేదు. ఆయన శిష్యులలో ఇద్దరు దీనిచేత కోపగించుకొన్నారు, “ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన ఈ హెచ్చరికతో జవాబిచ్చాడు: “మీరే ఆత్మను కలిగియున్నారో మీకు తెలియదు. మనుష్య కుమారుడు మనుష్యుల జీవితాలను నాశనము చేయుటకు రాలేదు, కాని వారిని రక్షించుటకు వచ్చెను.” (లూకా 9:51–56, రాజైన యాకోబు క్రొత్త పాఠ్యంతరము[1982]).

  5. మోషే 1:39 చూడుము; ఎఫెసీయులకు 3:19 కూడా చూడుము.

  6. నిర్గమకాండము 34:6.

  7. ఎఫెసీయులకు 3:19 చూడుము.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 121:41 చూడుము. నిశ్చయముగా ఆయన మర్త్య పిల్లలమైన మనము, ఒకరినొకరి పట్ల ఈవిధంగా ప్రవర్తించాలని దేవుడు మనల్ని ఆశించిన యెడల, ఆయన---ప్రతీ సుగుణము కలిగిన ఒక పరిపూర్ణమైన ప్రాణి అయ్యుండి-- అటువంటి ప్రవర్తనకు మాదిరిగా ఉన్నాడు.

  9. పరలోకములో మర్త్యత్వమునకు ముందు సలహా సభ అద్భుతమైన అధ్యయనమును కలిగియున్నది, అది దేవుని యొక్క స్వభావమును రుజువు చేయును. అక్కడ మన పరలోక తండ్రి, మన నిత్య అభివృద్ధి కొరకు తన ప్రణాళికను సమర్పించాడు. అయినప్పటికిని, లూసిఫర్, మరొక విధానమును ప్రస్తావించాడు. ఏ ఒక్కరు నశించిపోరని---అందరూ విధేయులవుతారని అతడు భరోసా ఇచ్చాడు. దీనిని నెరవేర్చగల ఏకైక విధానము నిరంకుశత్వము మరియు బలత్కారము. కాని మన ప్రేమగల పరలోకపు తండ్రి అటువంటి ప్రణాళికను అనుమతించడు. ఆయన తన పిల్లల యొక్క కర్తృత్వమునకు విలువిచ్చాడు. మనము నిజముగా నేర్చుకోవాల్సిన యెడల మార్గము వెంబడి మనము తప్పులు చేస్తామని ఆయన ఎరుగును. మరియు అందుకే ఆయన మనకు ఒక రక్షకుని అందించాడు, ఆయన శాశ్వతమైన త్యాగము మనల్ని పాపము నుండి శుద్ధి చేయగలదు మరియు దేవుని రాజ్యములోనికి తిరిగి మన ప్రవేశమును అనుమతించును.

    మన పరలోకమందున్న తండ్రి తన ప్రియమైన బిడ్డలలో అనేకమంది లూసిఫర్ చేత వశపరచబడుట చూసినప్పుడు, తన ప్రణాళికను అనుసరించుటకు ఆయన వారిని బలవంతం చేసాడా? అటువంటి భయంకరమైన ఎంపిక చేయుచున్న వారిని భయపెట్టాడా లేక బెదరించాడా? లేదు. మన సర్వశక్తిమంతుడైన దేవుడు నిశ్చయముగా ఈ తిరుగుబాటును ఆపగలడు. ఆయన తన చిత్తమును భిన్నాభిప్రాయముగల వారిపై విధించి మరియు వారు అంగీకరించునట్లు చేయగలడు. కాని బదులుగా, ఆయన తన పిల్లలు తమకై తాము ఎంపిక చేయునట్లు అనుమతించాడు.

  10. 2 తిమోతి 1:7.

  11. ఉదాహారణకు, యెహోషువ 1:9; యెషయా 41:13; లూకా 12:32; యోహాను 16:33; 1 పేతురు 3:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36; 50:41; 61:36; 78:18 చూడుము.

  12. లూకా 12:32.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 68:11.

  14. మోషే తన కాలములోని జనులకు ఇచ్చిన సలహా ఇంకా అన్వయించును: “భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి,” (నిర్గమకాండము 14:13, రాజైన యాకోబు క్రొత్త పాఠ్యంతరము).

  15. ద్వితీయోపదేశకాండము 31:6.

  16. నిర్గమకాండము 14:14, రాజైన యాకోబు క్రొత్త పాఠ్యంతరము.

  17. యెషయా 54:17.

  18. యోహాను 16:33.

  19. సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24; 2 కొరింథీయులకు 2:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 105:14 కూడా చూడుము.

  20. 1 యోహాను 4:18.

  21. రక్షకుడు “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు” (యోహాను 3:17(). వాస్తవానికి, “ఆయన లోకమునకు అది ప్రయోజనకరమైనదైతే తప్ప దేనిని చేయడు, ఏలయనగా ఆయన లోకమును ప్రేమించెను, ఆయన తన స్వప్రాణమును పెట్టి మనుష్యులందరు తనవైపు ఆకర్షించునట్లు.” (2 నీఫై 26:24).

  22. 1 యోహాను 4:18; 1 యోహాను 4:16 కూడా చూడుము.

  23. మార్కు 5:36.

  24. యోహాను 15:10.