2010–2019
అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానాలు
అక్టోబర్ 2017


అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానములు

పరలోక తండ్రి యొక్క సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక సిద్ధాంతములను, విధులను, నిబంధనలను, మరియు దైవ స్వభావములో పాల్గొనువారిగా మనము కాగల మిక్కిలి గొప్ప ప్రశస్తమైన వాగ్దానములను కలిగియున్నాడు.

మనలో ప్రతి ఒక్కరు అనుదినము ఎదుర్కొనే గొప్ప సమస్యలలో ఒకటి, మనకు ప్రాముఖ్యమైన నిత్య సంగతులను నిర్లక్ష్యము చేయునట్లు చేసే ఈ లోక సమస్యలు మన సమయమును, బలమును శాసించకుండా చూసుకోవడం. 1 మనకున్న అనేక బాధ్యతలు మరియు తీరికలేని జాబితాలవలన అవశ్యకమైన ఆత్మీయ ప్రాధాన్యతలను జ్ఞాపకముంచుకొనకుండా, వాటిపై దృష్టిపెట్టకుండా మనం చాలా సులభంగా మళ్లించబడగలము. కొన్నిసార్లు చాలా వేగంగా పరుగెట్టుటకు ప్రయత్నిస్తాము తద్వారా మనం ఎక్కడకు వెళ్తున్నాము, ఎందుకు పరుగెడుతున్నామో మరిచిపోతాము.

యేసు క్రీస్తు యొక్క శిష్యులకు “దేవునిగూర్చినట్టియు, మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక:

“ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు: దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు, వాటిని అనుగ్రహించెను”2 అని అపొస్తలుడైన పేతురు మనకు గుర్తు చేయును.

మన మర్త్య ప్రయాణములో మనం ఎక్కడికి మరియు ఎందుకు వెళ్తున్నాము అనేవాటికి నిజమైన జ్ఞాపకార్ధములుగా పేతురుచే వర్ణించబడిన అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానముల యొక్క ప్రాముఖ్యతను నా సందేశము నొక్కిచెప్తుంది. ఈ ముఖ్యమైన ఆత్మీయ వాగ్దానములను మనకు జ్ఞాపకము చేయుటలో విశ్రాంతి దినము, పరిశుద్ధ దేవాలయము మరియు మన గృహాలు వాటి పాత్రలను గురించి కూడా నేను చర్చిస్తాను.

ఈ ముఖ్యమైన సత్యములను మనం పరిగణించుచుండగా పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరికి బోధించాలని నేను హృదయపూర్వకముగా పార్థిస్తున్నాను.

మన దైవిక గుర్తింపు

మన పరలోక తండ్రి యొక్క గొప్ప సంతోషకరమైన ప్రణాళికలో సిద్ధాంతము, విధులు, నిబంధనలు మరియు అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానాలు కలిగియున్నవి, తద్వారా మనం దైవిక స్వభావములో పాలివారగుదుము. మన నిత్య గుర్తింపును మరియు నేర్చుకొనుటకు, మార్పుచెందుటకు, అభివృద్ధి చెందుటకు చివరకు ఆయనతో నిరంతరము జీవించుటకు మనం తప్పక వెంబడించవలసిన మార్గమును ఆయన ప్రణాళిక నిర్వచించును.

“కుటుంబము: ప్రపంచమునకు నకు ఒక ప్రకటనలో” వివరించినట్లుగా:

“మానవులందరు-స్త్రీ మరియు పురుషుడు-దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడిరి. ప్రతీఒక్కరు పరలోక తల్లిదండ్రులకు ప్రియమైన ఆత్మకుమారుడు లేకకుమార్తె అయియున్నారు మరియు అటులనే, ప్రతీఒక్కరు ఒక దైవిక స్వభావము మరియు గమ్యమును కలిగియున్నారు. . . .

“మర్త్యత్వమునకు ముందు రాజ్యములో ఆత్మకుమారులు మరియు కుమార్తెలు దేవునిని ఎరిగి మరియు వారి నిత్యుడగు తండ్రిగా ఆరాధించిరి. మరియు ఆయన ప్రణాళిక అయిన భౌతిక శరీరమును పొందగలుగుటకు మరియు సంపూర్ణతవైపు సాగిపోయి భూలోక అనుభవమును గణించుటకు మరియు ఆమె లేక అతని దైవిక గమ్యమైన నిత్యజీవ వారసత్వమును సంపూర్ణముగా గ్రహించుటకు అంగీకరించిరి.”3

దేవుడు తన పిల్లలకు వాగ్దానము చేయునదేమనగా వారు ఆయన ప్రణాళికలోని సూత్రములను, తన ప్రియకుమారుని మాదిరిని అనుసరించి, ఆజ్ఞలను గైకొని, మరియు అంతమువరకు విశ్వాసముతో సహించిన యెడల, రక్షకుని విమోచన బలముచేత వారు “దేవుని వరములలో కెల్ల గొప్పవరమైన నిత్యజీవమును పొందెదరు.” ”4 అత్యంత ఘనమైన, ప్రశస్తమైన వాగ్దానములో నిత్యజీవము అంతిమమైనది.

ఆత్మీయ పునర్జన్మ

మహిమ మరియు సద్గుణము కొరకు ప్రభువునుండి వచ్చు పిలుపుకు నిశ్చయముగా స్పందించడం ద్వారా అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానములను పర్తిగా మనం గ్రహించి, దైవిక స్వభావములో పాలుపంచుకొనుటకు ఆరంభిస్తాము. పేతురుచేత వర్ణించబడినట్లుగా, లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొనుటకు గట్టిగా ప్రయత్నించుటచేత ఈ పిలుపు నెరవేర్చబడుతుంది.

రక్షకునియందు విశ్వాసముతో, అణకువతో, మనం ముందుకు సాగినయెడల, ఆయన ప్రాయశ్చిత్తము వలన, పరిశుద్ధాత్మ యొక్క శక్తిచేత “మన యందు, లేక మన హృదయములందు ఒక గొప్ప మార్పు [కలుగును], అప్పుడు చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరిక లేక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండును.”5 మనము “మరల జన్మించితిమి; దేవుని మూలముగా జన్మించుట అనగా [మన] శరీరసంబంధమైన మరియు పతనమైన స్థితి నుండి ఒక పరిశుద్ధమయిన స్థితికి మారి దేవునిచే విమోచింపబడితిమి.” 6 “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను”7

మన స్వభావములో అటువంటి సంపూర్ణమైన మార్పు త్వరగా లేదా ఒకేసారి రాదు. రక్షకునివలె మనం కూడా “మొదటే సంపూర్ణత్వమును పొందము, కాని కృప వెంబడి కృపను [పొందుతాము].”8 “ఏలయనగా ప్రభువైన దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు: నేను నరుల సంతానమునకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చెదను; నా సూక్తులను ఆలకించు వారు, నా సలహాకు చెవియొగ్గు వారు ధన్యులు, వారు జ్ఞానము నేర్చుకొందురు.”9

యాజకత్వ విధులు మరియు పరిశుద్ధ నిబంధనలు ఈ కొనసాగుచున్న ఆత్మీయ పునర్జన్మ విధానములో ఆవశ్యకములు; మనం అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానములను పొందుటకు అవి దేవుడు నియమించిన కారకాలు. యోగ్యతతో పొంది, నిరంతరము జ్ఞాపకముచేసుకొను విధులు, మన జీవితాలలో దైవత్వపు శక్తిని ప్రసరింప చేయగల పరలోక ద్వారాలను తెరుస్తాయి. స్థిరముగా ఘనపరచి, ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొను నిబంధనలు ఈ మర్త్యత్వములో మరియు నిత్యత్వములో రెండింటిలోను ఎల్లప్పుడు ఉద్దేశాన్ని, అభయాన్ని ఇస్తాయి.

ఉదాహారణకు, దేవుడు మన విశ్వాసాన్ని బట్టి దైవసమూహములో మూడవ సభ్యుడు అనగా పరిశుద్ధాత్మ,10 యొక్క స్థిర సహవాసమును వాగ్దానము చేస్తున్నారు, తద్వారా యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మనం ఎల్లప్పుడు మన పాపముల క్షమాపణను పొంద,11 మరియు నిలుపుకొంటామని, ఈ లోకములో శాంతిని పొందుతామని,12 రక్షకుడు మరణపు బంధకాలను తెంచి, సమాధిని జయించెనని, మరియు కుటుంబాలు ఈలోకములోను, నిత్యత్వమంతటిలో కలిసి ఉండగలవని వాగ్దానము చేస్తున్నాడు.13

అర్ధవంతముగా, పరలోక తండ్రి తన పిల్లలకు ఇవ్వబోవు అత్యంత ఘనమైన మరియు విలువైన వాగ్దానములన్నీ పూర్తిగా లెక్కించబడలేవు లేదా వివరించబడలేవు. ఐనప్పటికి, నేను ఇప్పుడే సమర్పించిన వాగ్దాన దీవెనల యొక్క పార్షిక జాబితా మనలో ప్రతి ఒక్కరిని “పూర్తిగా ఆశ్చర్యపోయేలా” 14 మరియు యేసు క్రీస్తు నామములో “సాష్టాంగపడి, తండ్రిని ఆరాధించేలా”15 చెయ్యాలి.

వాగ్దానాలను జ్ఞాపకముచేసుకొనుట

“జీవితము యొక్క గొప్ప ఉద్దేశము, మనం మర్త్య శరీరములు పొందుటకు పరలోక తండ్రి మనల్ని ఇక్కడికి పంపుటకు, అదేవిధంగా మనం పిలువబడిన పరిశుద్ధమైన పిలుపుకు గల హేతువును మనం చాలా త్వరగా మర్చిపోతాము; అందువలన, ప్రాముఖ్యములేని, తాత్కాలిక విషయాలను జయించుటకు బదులు . . .  , మనం చాలా తరుచుగా దేవుడు స్థాపించిన దైవిక సహాయమును పొందకుండా లోకవిషయాలందు దృష్టిసారించుటకు మనల్ని మనం అనుమతిస్తాము, ఆ సహాయము మాత్రమే [ప్రాముఖ్యములేని సంగతులు] మనం జయించుటకు సహాయపడును”16 అని అధ్యక్షులు లోరెంజో స్నో హెచ్చరించారు.

లోకము యొక్క భ్రష్టత్వము మరియు దాని స్థాయికి పైగా లేచుటలో సహాయపడుటకు దేవుని చేత స్థాపించబడిన దైవిక సహాయమునకు రెండు ముఖ్యమైన మూలాధారాలు సబ్బాతు దినము మరియు పరిశుద్ధ దేవాలయము. సబ్బాతు దినమును పరిశుద్ధముగా ఆచరించుట మరియు దేవాలయముకు హాజరగుట యొక్క ఉన్నతమైన ఉద్దేశములు సంబంధము కలిగి ఉంటాయి కాని అవి వేర్వేరు అని మనం మొదట అనుకుంటాము. ఐనప్పటికి ఆ రెండు ఉద్దేశములు ఖచ్చితముగా ఒకటే అని, వ్యక్తిగతముగా మరియు మన కుటుంబాలలో మనల్ని ఆత్మీయంగా బలపరచుటకు అవి కలిసి పనిచేయునని నేను నమ్ముచున్నాను.

సబ్బాతు

దేవుడు సమస్తమును సృష్టించిన తరువాత, ఏడవ దినమున ఆయన విశ్రమించి, జనులు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటలో సహాయపడుటకు ప్రతి వారములో ఒక రోజు విశ్రాంతి దినముగా ఉంటుందని ఆజ్ఞాపించెను.17 సబ్బాతు దేవుని సమయము, ఆయనను ఆరాధించి, ఆయన ఘనమైన మరియు విలువైన వాగ్దానాలను పొందుటకు, జ్ఞాపకము చేసుకొనుటకు ప్రత్యేకముగా ప్రక్కన పెట్టబడిన ఒక పరిశుద్ధ సమయము.

ఈ యుగములో ప్రభువు దిశనిర్దేశమును చూపించెను:

“నీవు మరింత పరిపూర్ణముగా ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండుటకు, నీవు ప్రార్థనా మందిరమునకు వెళ్ళి, నా పరిశుద్ధ దినమున నీ సంస్కారములను అర్పించుము;

“ఏలయనగా నీ పనులనుండి విశ్రమించి, మహోన్నతునికి నీ ఆరాధనలను చెల్లించుటకు ఈ దినము నీకు నియమించబడినది.” 18

కాబట్టి, సబ్బాతు దినమున మనం విధులలో పాల్గొని, నిబంధనల గురించి నేర్చుకొని, పొంది, జ్ఞాపకము చేసుకొని మరియు నూతనపరచుకొనుట ద్వారా కుమారుని నామమున తండ్రిని ఆరాధిస్తాము. ఆయన యొక్క పరిశుద్ధమైన దినమున, మన ఆలోచనలు, క్రియలు మరియు ప్రవర్తన అనేవి దేవునికి ఇచ్చే గుర్తులు మరియు ఆయన యెడల మన ప్రేమకు సూచకాలు.19

సబ్బాతు యొక్క అదనపు ఉద్దేశమేమనగా ఈ లోక సంగతులనుండి మన దృష్టిని నిత్యత్వము యొక్క దీవెనలకు త్రిప్పుకొనుట. ఈ పరిశుద్ధ సమయములో మన తీరికలేని జీవితాల యొక్క అనేకమైన వాడుక ప్రకారము చేసేపనులనుండి తీసివేయబడి, దైవిక స్వభావములో పాలుపంచుకొనువారిగా మనం మారి ఘనమైన మరియు విలువైన వాగ్దానాలను పొంది, జ్ఞాపకము చేసుకొనుట ద్వారా మనం “దేవుని వైపు చూచి జీవించగలము.”20

పరిశుద్ధ దేవాలయము

దేవాలయాలను నిర్మించమని ప్రభువు ఎల్లప్పుడు తన జనులకు ఆజ్ఞాపించెను, అవి పరిశుద్ధ స్థలాలు మరియు వాటిలో యోగ్యులైన పరిశుద్ధులు వారికొరకు, వారి మృతుల కొరకు పవిత్రమైన సువార్త ఆచారకర్మలు మరియు విధులను నిర్వహిస్తారు. దేవాలయాలు ఆరాధించుటకు అత్యంత పరిశుద్ధమైన స్థలాలు. ఒక దేవాలయము అక్షరాల ప్రభువు గృహము, ఒక పవిత్రమైన స్థలము, దేవుని ఆరాధించుటకు, ఆయన ఘనమైన మరియు విలువైన వాగ్దానాలు పొంది, జ్ఞాపకము చేసుకొనుటకు ప్రత్యేకముగా ప్రతిష్టించబడినది.

“మిమ్మును మీరు ఏర్పాటుచేసుకొనుడి; అవసరమైన ప్రతిదానిని సిద్ధపరుచకొనుడి; ఒక మందిరమును అనగా ఒక ప్రార్థనా మందిరమును, ఒక ఉపవాస మందిరమును, ఒక విశ్వాస మందిరమును, ఒక విద్యామందిరమును, ఒక మహిమగల మందిరమును, ఒక సక్రమమైన గృహమును, ఒక దేవుని మందిరమును స్థాపించుడి”21 అని ఈ యుగములో ప్రభువు ఆదేశించారు. దేవాలయ ఆరాధన యొక్క ముఖ్యమైన ఉద్దేశము విధులలో పాల్గొనుట మరియు నిబంధనల గురించి నేర్చుకొనుట, పొందుట మరియు జ్ఞాపకముచేసుకొనుట. మనం తరచు వెళ్లే ప్రదేశాలకంటే దేవాలయాలలో మనం వేరుగా ఆలోచిస్తాము, ప్రవర్తిస్తాము మరియు దుస్తులు ధరిస్తాము.

దేవాలయము యొక్క ప్రధాన ఉద్దేశము ఈలోక విషయాలనుండి మన దృష్టిని నిత్యదీవెనలవైపుకు పైకెత్తుట. మనకు పరిచయముగల లోక పరిస్థితులనుండి తాత్కాలికంగా వేరు పరచుకొని, ఘనమైన మరియు విలువైన వాగ్దానాలను పొంది, జ్ఞాపకము చేసుకొనుట ద్వారా మనం “దేవునివైపు చూసి జీవించగలము” 22 తద్వారా దైవిక స్వభావములో పాలుపంచుకొనువారుగా అవుతాము.

సబ్బాతు దినము మరియు దేవాలయము అనేవి పరిశుద్ధ సమయము మరియు పరిశుద్ధ స్థలము, దేవుని ఆరాధించుటకు మరియు ఆయన పిల్లలకు ఆయన యొక్క మిక్కిలి ఘనమైన మరియు విలువైన వాగ్దానాలను పొంది, జ్ఞాపకము చేసుకొనుటకు ప్రత్యేకముగా ప్రతిష్టించబడినవి. దేవునిచేత స్థాపించబడి, సహాయము చేసే ఈ రెండు దైవికమైన మూలాధారాల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒకటే: శక్తివంతముగా, పదే పదే మన ధ్యానమును మన పరలోకతండ్రిపైన, ఆయన అద్వితీయ కుమారుడు, పరిశుద్ధాత్మ, మరియు రక్షకుని పునఃస్థాపించబడిన సువార్త యొక్క విధులు, నిబంధనలతో ముడిపడియున్న వాగ్దానాలపైన పెట్టుట.

మన గృహాలు

ముఖ్యముగా, ఒక గృహము అనేది కాలము మరియు అనంతవిశ్వము యొక్క అంతిమ కలయిక కావాలి, దానిలో వ్యక్తులు, కుటుంబాలు దేవుని యొక్క ఘనమైన మరియు విలువైన వాగ్దానాలు అత్యంత ప్రభావవంతముగా జ్ఞాపకము చేసుకొనును. ఆదివారపు కూడికలకు మరియు దేవాలయము యొక్క పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించుటకు మన గృహాలను విడిచిపెట్టుట ఆవశ్యకము కాని అది సరిపోదు. ఆ పరిశుద్ధ కార్యక్రమాలనుండి మనం పొందిన ఆత్మ బలాన్ని తిరిగి మన గృహాలకు తీసుకొనివస్తేనే, మర్త్యజీవితము యొక్క ఉద్దేశాలపై దృష్టినిలిపి, లోకములో ఉన్న భ్రష్టత్వమును జయించగలము. వ్యక్తులను, కుటుంబాలను మరియు మన గృహాలను పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మరియు శక్తితో, ప్రభువైన యేసు క్రీస్తువైపునకు లోతుగాను, కొనసాగుతున్న పరివర్తనతో మరియు దేవుని యొక్క నిత్య వాగ్దానాల యొక్క “నిరీక్షణ యొక్క పరిపూర్ణమైన వెలుగుతో” 23 నేర్చుకొన్న ముఖ్యమైన పాఠాలను నిరంతర జ్ఞాపికలతో మనలో ఇంకునట్లు చేసే ఆత్మీయ ఉత్ప్రేరకాలుగా మన సబ్బాతు మరియు దేవాలయ అనుభవాలు ఉండవలెను.

మనం “పరలోకమందును, భూమియందును క్రీస్తునందున్న సమస్తమును అనగా ఆయనలో ఒకటిగా కూడివచ్చినప్పుడు”25 సబ్బాతు మరియు దేవాలయము మన గృహాలలో “మరింత శ్రేష్టమైనమార్గాన్ని”24 నెలకొల్పుటలో మనకు సహాయపడగలవు. ఆయన యొక్క పరిశుద్ధమైన సమయముతో,ఆయన పరిశుద్ధమైన స్థలములో మనం నేర్చుకున్నవాటితో మన గృహాలలో మనమేమి చేస్తున్నాము అనేది దైవిక స్వభావములో పాలుపొందువారిగా అగుటలో కీలకమైనది.

వాగ్దానము మరియు సాక్ష్యము

మర్త్యత్వము యొక్క వాడుకప్రకారమైన దినచర్యలతో, ఐహిక విషయాలతో మనం సులభంగా జయించబడవచ్చును. నిద్రపోవుట, తినుట, వస్త్రాలు ధరించుట, పనిచేయుట. ఆటలాడుట, వ్యాయామము చేయుట మరియు అనేక ఆచారబద్ధమైన కార్యక్రమాలు ఆవశ్యకము మరియు ముఖ్యము. కాని చివరకు, మనం ఏమి అవుతామో అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యెడల మనము కలిగియున్న జ్ఞానము మరియు వారి నుండి నేర్చుకొనుటకు గల సమ్మతి యొక్క ఫలితము; అది కేవలము మన జీవిత కాలములో అనుదిన అన్వేషణల యొక్క మొత్తము కాదు.

చెయ్యవలసియున్న వేర్వేరు పనుల యొక్క అనుదిన ప్రాథమిక సూచిక కంటే సువార్త చాలా ఎక్కువ; అది “సరిగ్గా అమర్చబడి”26 మరియు అల్లబడిన సత్యము యొక్క పట్టుజలతారు, అది మనం మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తువలె అగుటలో సహాయపడుటకు, అంతేకాక దైవిక స్వభావములో పాలుపొందుటకు రూపొందించబడినది. యదార్థముగా, ఈ మహోన్నత ఆత్మీయ సత్యము చింతలు, సమస్యలు, లోకము యొక్క తేలిక స్వభావములతో కప్పబడి, “ఆనవాలుకు అవతల చూచుట”27 ద్వారా మనం గ్రుడ్డివారిగా చెయ్యబడ్డాము.

మనం తెలివిగాగా ఉండి, పరిశుద్ధాత్మను మన మార్గదర్శిగా ఆహ్వానిస్తే, 28 ఏది సత్యమో ఆయన మనకు బోధిస్తారని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. మన నిత్య గమ్యమును నెరవేర్చుటకు మరియు దైవిక స్వభాములో పాలుపొందువారిగా అగుటకు మనం శ్రమపడినప్పుడు, “ఆయన క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చును, [మరియు] మన మనస్సులను పరలోక దృష్టితో వెలిగించును.”29

మన విధులు మరియు నిబంధనలతో ముడిపడియున్న మిక్కిలి ఘనమైన మరియు విలువైన వాగ్దానాలు ఖచ్చితమైనవని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభువు ఈవిధంగా ప్రకటించెను:

“మీ రక్షణకు సహాయపడునట్లుగా, మీరు నా యెదుట ఏవిధంగా నడుచుకొనవలెనో నేను నిర్దేశాలనిచ్చెదను.

మీరు నేను చెప్పినది చేసిన యెడల, ప్రభువైన నేను బద్ధుడనగుదును; కాని మీరు నేను చెప్పినది చేయని యెడల, మీకు ఏ వాగ్దానము ఉండదు.”30

మన పరలోక తండ్రి జీవించుచున్నారని, ఆయన రక్షణ ప్రణాళికకు కర్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు ఆయన యొక్క అద్వితీయ కుమారుడు, మన రక్షకుడు మరియు విమోచనకర్త. ఆయన సజీవుడు. తండ్రి యొక్క ప్రణాళిక మరియు వాగ్దానాలు, రక్షకుని ప్రాయశ్చిత్తఃము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము “ఈ లోకములో శాంతిని, రాబోవు లోకములో నిత్య జీవమును సాధ్యము చేయునని నేను సాక్ష్యమిస్తున్నాను.”31 వీటన్నిటి గురించి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.