2010–2019
దైవ ప్రణాళిక ద్వారా
అక్టోబర్ 2017


దైవ‌ ప్రణాళిక ద్వారా

ప్రభువు యొక్క హస్తము మిమ్మల్ని నడిపిస్తోంది. “దైవ ప్రణాళిక” ద్వారా, మీ జీవితాల్లోని అతి చిన్న విషయాల్లో అలాగే ముఖ్యమైన పెద్ద విషయాల్లో ఆయన ప్రమేయం ఉంటుంది.

సహోదరీ సహోదరులరా, స్ఫూర్తినిచ్చు ఈ ప్రపంచవ్యాప్త సర్వసభ్య సమావేశమునందు నిలబడి మీ యొక్క బలము మరియు ఆత్మానుభూతిని నేను పొందుతున్నాను. అపొస్తలుడైన పేతురు యొక్క మాటల గురించి నేను ఆలోచిస్తున్నాను: “[ప్రభువా], మనమిక్కడ ఉండుట మంచిది.”1

అమ్మోనైహాలోని ప్రజలకు ప్రకటించిన‌ తర్వాత ఆల్మా చెప్పినది ఇది కాదు. ప్రజల దుర్మార్గము కారణంగా ఆల్మా నగరాన్ని విడిచిపెట్టెను. తరువాత‌ ఆల్మాకు ఒక దేవదూత కనిపించి, “అమ్మోనైహా పట్టణానికి తిరిగి వెళ్లి, ఆ పట్టణపు జనులకు తిరిగి బోధించవలెనని”2 అతడిని ఆజ్ఞాపించెను.

ఆల్మా “వేగవంతంగా,” “మరొక మార్గమున పట్టణమందు” ప్రవేశించెను. 3

“అతడు పట్టణమున ప్రవేశించగా అతడు ఆకలిగొనెను మరియు అతడు ఒక మనుష్యునితో చెప్పెను: దేవుని యొక్క ఒక దీన సేవకునికి నీవు తినుటకు ఏదైనా ఇచ్చెదవా?

“మరియు ఆ మనుష్యుడు అతనితో చెప్పెను: “నేను ఒక నీఫైయుడను. నీవు దేవుని యొక్క పరిశుద్ధ ప్రవక్తవని నేనెరుగుదును. ఏలయనగా నీవు చేర్చుకొందువని దర్శనమందు దేవదూత ఎవరిని గూర్చి చెప్పెనో ఆ మనుష్యుడవు నీవే.”4

ఆ వ్యక్తి అమ్యులెక్.

ఆల్మా, అమ్యులెక్ ను కలుసుకోవడం యాదృచ్ఛికంగా జరిగిందా? లేదు, ఇది యాదృచ్ఛికం కాదు, నమ్మకమైన తన మిషనరీ సహవాసుడిని ఏర్పరచుకొనుటకే అతడు ఆ మార్గంలో నగరంలోనికి ప్రవేశించెను.

ఎల్డర్ నీల్  ఎ. మాక్స్వెల్ ఇలా వివరించారు: “స్నేహం యొక్క పరిధిలో మనకు ఎదురయ్యే అవకాశాలను, జనులను మనలో ఎవ్వరూ పూర్తిగా ఉపయోగించుకోరు. మీరు మరియు నేను ఈ కలుసుకోవడాలను ‘యాదృచ్ఛికం’ అని పిలుస్తాము. ఈ పదం మానవులు అర్థం చేసుకోవడం కోసం ఉపయోగించడమైనది, కానీ యాదృచ్ఛికము అనేది సర్వజ్ఞుడైన దేవుని క్రియలను వివరించడానికి సరైన పదం కాదు. ఆయన ‘యాదృచ్ఛికం’తో కాదు. . . కానీ ‘దైవిక ప్రణాళిక’ ద్వారా పనులు చేయుదురు.”5

మన జీవితాలు ఒక చదరంగం వంటివి మరియు మనము ఆత్మీయప్రేరేపణల‌కు ప్రతిస్పందించినట్లయితే ప్రభువు మనల్ని ఒకచోట నుండి మరొకచోటికి కదిలిస్తారు. గతంలోకి చూస్తే, మన జీవితంలో ఆయన ప్రభావమును చూడవచ్చు.

లేబన్ నుండి పలకలను తెచ్చుటకు తిరిగి వెళ్ళినప్పుడు నీఫై కు అటువంటి పరలోకపు సహాయము అందడాన్ని చూడవచ్చు. అతడు “చేయవలసిన క్రియలేమో ముందుగా ఎరుగక ఆత్మ చేత అతడు నడిపించబడెను.”6 లేబన్ మద్యము మత్తులో అతని ముందుండెను మరియు నీఫై అతనిని చంపి ఆ పలకలను తీసుకొని, అతని సోదరుల యొద్దకు తిరిగి పారిపోయెను. లేబన్ ను చంపగలగడం అతని అదృష్టమా? లేదా “దేవుని ప్రణాళిక‌” ద్వారా అది జరిగెనా?

భూమిపై దేవుని రాజ్యం ముందుకెళ్లుటకు సువార్తలో మరియు సంఘములో విశేషమైన సంఘటనలు జరుగుతాయి. అవి యాదృచ్ఛికంగా కాదు, కానీ దేవుని ప్రణాళిక ద్వారా జరుగుతాయి. ఈ ప్రపంచాన్ని రూపొందించిన ఆయన తన వాక్కుతో సముద్రాలను నెమ్మది చేయగలరు, ఆల్మా మరియు అమ్యులెక్, నీఫై మరియు లేబన్ ఇరువురూ సరైన‌ సమయములో సరైన స్థానంలో ఉండేలా నడిపించగలరు.

అదేవిధంగా, మన జీవితాల్లో జరిగే అనేక‌ సంఘటనలు భూమ్మీద దేవుని ప్రణళికను వివరిస్తాయి.

ఆయనతో అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ ఇలా చెప్పిన సందర్భం గురించి ప్రియమైన ఎల్డర్ జోసెఫ్  బి. వర్త్లిన్ చెప్పారు : “అన్ని విషయాలపైన దేవుని హస్తము ఉంటుంది. తరచుగా జరిగే విషయాలు, అవి యాదృచ్ఛికమైనవి కాదు. ఒకరోజు, మన జీవితాల్లో యాదృచ్ఛికమైన విషయాలను తిరిగి చూసినప్పుడు, బహుశా అవి అంత యాదృచ్ఛికం కాదని మన‌ము గ్రహించవచ్చు.”7

తరచు మనం చేసే మంచి పనులు కొద్దిమందికే తెలుస్తాయి. అయితే అవి పరలోకంలో నమోదు చేయబడతాయి. ఒకరోజు, మనము పూర్ణ భక్తితో నీతిక్రియలకై సాక్షులుగా నిలబడతాము. ఎటువంటి శ్రమ‌ లేదా విపత్తు దేవుని సంతోష ప్రణాళికను అడ్డుకోలేదు. నిజానికి, “దైవ ప్రణాళిక‌” ద్వారా “ఉదయమున సంతోషము కలుగును.”8 “తండ్రి చిత్తమును జరిగించుటకు నేను లోకములోనికి వచ్చియున్నాను,”9 అని యేసు బోధించారు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, మనము కూడా తండ్రి చిత్తమును జరిగించవలెను.

నా జీవిత ప్రయాణం యొక్క అనుభవం ద్వారా, నేను తెలుసుకొనినది ఏమనగా ప్రభువు తన పని చేయడానికి ఆ చదరంగం బల్ల మీద మనలను నడిపిస్తారు. యాదృచ్ఛికంగా కనిపించేది నిజానికి, పరలోకంలో ఉన్న ప్రేమగల తండ్రి పర్యవేక్షణ. ఆయన మన తల వెంట్రుకలన్నిటిని లెక్కంపగలరు.10 మన తండ్రి సెలవులేక ఒక్క పిచ్చుకైనను నేలను పడదు. 11 మన జీవితాలలో ప్రతీ చిన్న విషయంలో ప్రభువు ప్రమేయము ఉంటుంది, ఆ సంఘటనలు మరియు అవకాశాలు భూమి మీద దేవుని రాజ్యం నిర్మించడంలో మన కుటుంబాలను, ఇతరులను ప్రోత్సహించడానికిమనల్ని సిద్ధం చేస్తాయి. యెహోవా అబ్రాహాముతో చెప్పినట్లు, గుర్తుంచుకొనుము, “ఆదినుండి అంతము వరకు నేను ఎరుగుదును. కావున నా చెయ్యి నీ మీద నిలుచును.”12

దేవుడు ప్రేమగల తల్లిదండ్రులున్న కుటుంబములో నన్ను ఉంచారు. ప్రపంచము ప్రకారము వారు సాధారణ జనులు; భక్తిగల నా తండ్రి ఒక ట్రక్కు డ్రైవరు; దేవదూత లాంటి నా తల్లి, ఒక గృహిణి. ప్రభువు ప్రియమైన నా భార్య మెలానీని కనుగొనుటకు సహాయము చేసారు; నాకు ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వడానికి ప్రియమైన స్నేహితుడిగా మారిన ఒక వ్యాపారవేత్తని ఆయన ప్రేరేపించారు. యౌవనుడిగా మరియు ఒక మిషను అధ్యక్షుడిగా, మిషనరీ రంగంలో సేవ చేయడానికి ప్రభువు నన్ను పిలిచారు; ఆయన నన్ను డెబ్బది యొక్క కోరములో పిలిచారు, ఇప్పుడు నన్ను అపొస్తలునిగా పిలిచారు. వెనుతిరిగి చూసుకుంటే, నేను ఆ కదలికలను ఏర్పాటుచేయలేదని గ్రహించాను; మీ కోసం మరియు మీరు ఇష్టపడేవారి కోసం ముఖ్యమైన కదలికలను ప్రభువు ఏర్పాటు చేస్తున్నట్లే నాకోసం చేసారు.

మీరు మీ జీవితంలో ఏమి వెతుకుతున్నారు? “నేను ఇక్కడే ఉన్నాను” అని, ఆయన దగ్గరగా ఉన్నాడని మీకు గుర్తుచేసే దేవుని అద్భుతాలు ఏవి? ప్రభువు మీ జీవితంలో ఉన్న మరియు ఉంటున్న ఆ సమయాలను, దినములను గురించి ఆలోచించండి. వాటిని ప్రభువు మీయందు, మీ ఎంపికల యందు విశ్వాసము చూపిన అమూల్యమైన క్షణాలుగా భద్రపరచుకోండి. ఆయనను అనుసరిస్తున్నందుకు మీకై మీరు కాగలిగిన దానికన్నా మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా చేయుటకు ఆయనను అనుమతించండి. ఆయన ప్రమేయాన్ని భద్రపరచుకోండి. కొన్నిసార్లు మన‌ ప్రయాణంలో మన ప్రణాళికల్లోని మార్పులను తప్పటడుగులుగా మనం భావిస్తాము. వాటిని ప్రభువు పని చేయుటలో మొదటి అడుగులుగా భావించండి. 13

కొన్ని నెలల క్రితం మా మనవరాలు సంఘ చారిత్రక ప్రదేశాలు పర్యటించడానికి ఒక యువ బృందంలో చేరింది. తుది ప్రయాణ ప్రణాళికలో ఆమె తన మిషనరీ సహోదరుడు, మా మనవడు సేవ చేస్తున్న ప్రాంతం గుండా ప్రయాణించవలసి ఉందని గమనించింది. మా మనవరాలికి తన సోదరుడిని అతని మిషనులో కలిసే ఉద్దేశం లేనప్పటికి, తన‌ సోదరుడు పనిచేస్తున్న పట్టణములోకి బస్సు ప్రవేశించినప్పుడు, ఇద్దరు మిషనరీలు వీధిలో నడిచిరావడం ఆమె గమనించింది. ఆ మిషనరీలలో ఒకరు ఆమె సోదరుడు.

ఆమె సోదరుడిని పలకరించడానికి బస్సు ఆపమని యువత డ్రైవరును అడిగినప్పుడు బస్సంతా ఆతృతతో నిండిపోయింది. ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో, కన్నీళ్లు మరియు మధురమైన మాటల తర్వాత, ఆమె సోదరుడు తన మిషనరీ విధులు నెరవేర్చడానికి తిరిగి వెళ్ళాడు. ఆమె సోదరుడు ఒక ఇంటి నుండి తన కారు వద్దకు నడుస్తూ ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయం ఆ వీధిలోఉన్నట్లు తరువాత మేము తెలుసుకున్నాము.

చిత్రం
ఎల్డర్ రాస్బాండ్ మనవళ్ళు మనవరాళ్ళు తిరిగి కలుసుకున్నారు

పరలోకపు తండ్రి మనసులో నిర్దిష్టమైన‌ ఉద్దేశ్యంతో మనల్ని అటువంటి పరిస్థితులలో ఉంచుతారు. ఆయన‌ నా జీవితంలో అలా చేసారు మరియు ఆయన‌ మా ప్రియ మనవళ్ల జీవితాల్లో చేసినట్టు మీ జీవితంలో కూడా చేస్తున్నారు.

మనలో ప్రతీ ఒక్కరు విలువైన వారము, దేవుని ప్రేమను పొందువారము, ఆయన మనలను ఎరిగినవాడు, మనతో మెల్లగా మాట్లాడువాడు, మన‌లో ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా కాపాడువాడు. ఆయన మహాజ్ఞాని, ఈ లోకంలో ఉన్న స్త్రీ, పురుషుల కన్నా శక్తివంతమైనవాడు. ఆయన మన సవాళ్ళను, విజయాలను, మన హృదయాలలోని నీతిగల కోరికలను ఎరిగినవాడు.

ఒక సంవత్సరం క్రితం, నేను టెంపుల్ స్క్వేర్ లో నడుస్తున్నప్పుడు, మిషనరీ పని చేస్తున్న ఒక సోదరి నన్ను కలిసి, “నేను మీకు గుర్తున్నానా? నేను ఫ్లోరిడా నుండి వచ్చాను,” అన్నది. తన పేరు సహోదరి ఐడా చిలాన్ అని నాకు చెప్పింది. అవును, నేను ఆమెను, ఆమె కుటుంబాన్ని కలుసుకున్నట్లు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఆమె స్టేకు అధ్యక్షుడు ఆమె కుటుంబాన్ని సందర్శించమని సూచించారు. బాప్తీస్మము పొందని వారి కుమార్తె ఐడా కొరకు మేము అక్కడ ఉన్నామ‌ని స్పష్టమయ్యింది. మా పర్యటన తర్వాత, సంవత్సరం కంటే ఎక్కువ కాలం బోధన మరియు స్నేహం తర్వాత ఐడా బాప్తీస్మము పొందింది.

చిత్రం
ఐడా చిలాన్ మరియు ఆమె సహవాసితో ఎల్డర్ రాస్బాండ్

టెంపుల్ స్క్వేర్ ని మేము సందర్శించిన తరువాత, ఆమె నాకు ఒక లేఖ రాసింది. “పరలోకపు తండ్రికి మనలో ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ఆయన ఏదో ఒక ఉద్దేశ్యంతో మనల్ని ఒకరి మార్గంలో ఒకరిని నడిపిస్తారని నా పూర్ణ హృదయంతో నేను నమ్ముచున్నాను. నా మిషనరీలలో ఒకరైనందుకు, ఐదు సంవత్సరముల క్రితము నన్ను కలుసుకుని, నన్ను కనుగొన్నందుకు ధన్యవాదాలు.”14 ఆమె తన జీవితంలో జరిగిన దైవిక యాదృచ్ఛికాలు, వాటి పర్యవసానాలైన బాప్తీస్మము, నిర్ధారణ, టెంపుల్ స్క్వేర్ వద్ద మిషను పరిచర్యమరియు ఇటీవల జరిగిన ఆమె దేవాలయ వివాహం గురించి చెప్తూ తన పరివర్తన వృత్తాంతాన్నికూడా ఐడా నాకు పంపింది.15

స్టేకు అధ్యక్షుడు మమ్మల్ని చిలాన్ ఇంటికి తీసుకొని వెళ్ళడం, ఆ తరువాత ఆమె, నేను టెంపుల్ స్క్వేర్ వద్ద కలుసుకోవడము కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా? “దేవుని ప్రణాళికలో” ఇది ఒక‌ భాగమని ఐడా యొక్క సాక్ష్యం తెలియచేసింది.

ప్రభువు మనతో ఉండడానికి ఇష్టపడతారు. మనము ఆయన ఆత్మను అనుభూతి చెంది మొదటి ప్రేరణకు లోబడినట్లైతే, “నేను నీ ముందుగా వెళ్తాను. నేను నీ కుడిపార్శ్వమున ఉండునట్లు నీ ఎడమ పార్శ్వమునందును ఉందును, నా ఆత్మ నీ హృదయములో ఉండును, నా దేవదూతలు నీ చుట్టూ కాపు కాచును,”16 అనిఆయన వాగ్దానం చేసినట్లుగా మనము ఆయనను పొందెదము, అది యాదృచ్ఛికం కాదు.

మనందరి జీవితాల్లో ఇలాంటి విషయాలు జరుగుతాయి. మన‌ము బాగా తెలిసిన వారిలా ఉన్నవారిని కలవచ్చు, పరిచయాన్ని పునరుద్ధరించుకోవచ్చు, లేదా అపరిచితులతో మనకు సరిపోవు విషయాలను కనుగొనవచ్చు.అవి జరిగినప్పుడు, బహుశా మనమందరం నిజంగా “సోదరులు మరియు సోదరీమణులు” అని ప్రభువు మనకు గుర్తుచేస్తుండవచ్చు. మన‌ము నిజంగా జోసెఫ్ స్మిత్ “క్రీస్తు యొక్క కారణం”17 అని పిలిచిన అదే కారణంలో నిమగ్నమై ఉన్నాము.

ఇప్పుడు “దైవ ప్రణళికలో” మన కర్తృత్వము ఎక్కడ సరిపోతుంది? మన రక్షకుడిని మరియు ఆయన ఎంపిక చేసిన నాయకులను అనుసరించడానికి లేదా అనుసరించకపోవడానికి మనకు వీలుంది. ఈ నమూనా మోర్మన్ గ్రంథంలో స్పష్టంగా ఉంది, నీఫైయులు ప్రభువు నుండి దూరంగా మరలినప్పుడు...మోర్మన్ ఇలా విలపించాడు:

“ప్రభువు యొక్క ఆత్మ ఇక ఏమాత్రము వారిని కాపాడలేదని వారు చూచిరి. అవును, ప్రభువు యొక్క ఆత్మ అపరిశుద్ధమైన‌ ఆలయములలో నివసించదు, కావున అది వారి నుండి ఉపసంహరించుకొనెను.

“కాబట్టి ప్రభువు వారిని తన అద్భుతము వలన మరియు సాటిలేని శక్తి ద్వారా కాపాడుట మానెను. ఏలయనగా వారు అవిశ్వాసము మరియు భయంకరమైన దుర్మార్గము యొక్క ఒక స్థితిలోనికి పడియుండిరి.”18

మనం ఎంత బలంగా ఉన్నాము, మనం ఎంత విశ్వాసముగా ఉన్నాము లేదా మనకేం తెలుసు అనేవి ప్రభువు మనల్ని అడిగే వాటన్నింటి ఫలితం కాదు. దమస్కు రహదారిలో ప్రభువు ఆపిన సౌలు గురించి ఆలోచించండి. అతను తన జీవితంలో తప్పు దిశగా వెళుతున్నాడు; ఉత్తర దక్షిణాలతో పనిలేదు. సౌలు దైవికంగా మళ్ళించబడ్డాడు.తరువాత ఆయన పౌలుగా పిలువబడినప్పుడు, సౌలుగా ఆయనేమి చేయదలిచాడో అని కాకుండా ప్రభువు ముందుగా ఎరిగినట్లు ఆయనేమి కాగలడు మరియు ఏమి చేయగలడనేది అపొస్తలుడైన ఆయన పరిచర్యనందు ప్రతిబింబించబడింది. అదేవిధంగా, మనలో ప్రతి ఒక్కరూ ఏమి చేయగలరో మరియు ఏమి కాగలరో ప్రభువుకు తెలుసు. అపొస్తలుడైన పౌలు ఏమి బోధించాడు? “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”19

మన‌ము నీతిగా, అంగీకారముగా మరియు సమర్థులై ఉన్నప్పుడు, మనము యోగ్యులుగా అర్హులుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, మనము ఎన్నడూ ఊహించని స్థానాలకు ఎదిగి, పరలోకపు తండ్రి యొక్క “దైవ ప్రణాళిక‌” లో భాగమౌతాము. మనలో ప్రతి ఒక్కరికి దైవత్వం ఉంది. దేవుడు మనద్వారా, మనతో పని చేయడం చూసినప్పుడు, మనం ప్రోత్సహించబడాలి, అలాగే ఆ నడిపింపు కోసం కృతజ్ఞత కలిగియుండాలి. మానవునికి అమర్త్యత్వం మరియు నిత్యజీవితాన్ని తీసుకురావడమే నా కార్యము మరియు మహిమయైయున్నదని20 పరలోకమందున్న మన తండ్రి చెప్పినప్పుడు, ఆయన తన పిల్లలందరిని—ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు.

ప్రభువు యొక్క హస్తము మిమ్మల్ని నడిపిస్తోంది. “దైవ ప్రణాళిక” ద్వారా, మీ జీవితాల్లోని అతి చిన్న విషయాల్లో అలాగే ముఖ్యమైన పెద్ద విషయాల్లో ఆయన ప్రమేయం ఉంటుంది. సామెతల యందు చెప్పిన్నట్లుగా, “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము; . . . అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”21 ఆయన‌ మిమ్మల్ని ఆశీర్వదించి, కాపాడి, శాంతి కలుగజేస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, ఆమేన్.