2010–2019
పశ్చాత్తాపము ఎల్లప్పుడూ సవ్యమైనది
అక్టోబర్ 2017


పశ్చాత్తాపము ఎల్లప్పుడూ సవ్యమైనది

మనము పశ్చాత్తాపము యొక్క దారిలో అడుగు పెట్టినప్పటి నుంచి మనము రక్షకుని యొక్క విమోచన శక్తిని మన జీవితాలలోకి ఆహ్వానిస్తాము.

చాలా సంవత్సరముల క్రితము, అధ్యక్షులు గార్డన్   బి. హింక్లి గారు ఒక కళాశాల యొక్క ఫుట్ బాల్ ఆటకు వచ్చారు. చాలాకాలంగా సేవ అందిస్తున్న మరియు త్వరలో విరమణ తీసుకోబోతున్న ఆ జట్టు యొక్క ప్రియమయిన శిక్షకుని పేరు ఆ క్రీడాస్థలమునకు పెట్టబోతున్నట్లు ప్రకటించడానికి ఆయన వచ్చారు. ఎలాగైనా అటను గెలిచి వాళ్ళ శిక్షకుడిని గౌరవించాలి అని ఆ జట్టు ఆశపడింది. ఆటగాళ్ళ సామాన్లు భద్రపరచు గదికి వచ్చి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలని అధ్యక్షులు హింక్లీ ఆహ్వానించబడ్డారు. ఆయన మాటలచేత ప్రేరేపించబడిన ఆ జట్టు ఆనాటి ఆటలో గెలిచి, ఒక విజయాన్ని నమోదు చేస్తూ ఆ ఋతువును ముగించింది.

జీవితంలో   గెలవడం లేదు అనుకుని ఆందోళనపడే వారితో నేను ఈ రోజు మాట్లాడదల్చుకున్నాను. నిజమేమిటనగా, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.”1 ఆటలో ఓటమి లేని కాలము ఉండవచ్చునేమో కానీ జీవితంలో అటువంటి కాలము లేదు. కానీ యేసు క్రీస్తు ఒక పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తఃము చేసి, మనకి పశ్చాత్తాపము అనే బహుమతిని ఇచ్చారని నేను సాక్ష్యమిస్తున్నాను - అది పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణకు మరియు విజయవంతమైన జీవితానికి తిరిగివెళ్ళు మార్గము.

పశ్చాత్తాపము సంతోషాన్ని తెస్తుంది

చాలా తరచుగా, పశ్చాత్తాపమును బాధాకరమైనదిగా మరియు నిరుత్సాహపరిచేదిగా అనుకుంటాం మనము. కానీ, దేవుని ప్రణాళిక సంతోషము యొక్క ప్రణాళికయే కానీ దుఃఖము యొక్క ప్రణాళిక కాదు! పశ్చాత్తాపము అనేది ఉన్నతినిచ్చేది మరియు గౌరవమైనది. పాపము దుఃఖమును కలిగిస్తుంది. 2 పశ్చాత్తాపము మనము తప్పించుకొని వెళ్లే మార్గము! ఎల్డర్ డి.   టాడ్ క్రిస్టాఫర్సన్ గారు వివరించినట్లు, “పశ్చాత్తాపము లేకుండా జీవితములో నిజమైన ఉన్నతి లేక అభివృద్ధి లేదు. . . . పశ్చాత్తాపము ద్వారానే మనము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃపు మహిమను మరియు రక్షణను పొందెదము. పశ్చాత్తాపము   స్వేచ్ఛ, నమ్మకం మరియు శాంతివైపు మనకు దారిచూపిస్తుంది. ”3 అందరికి... ముఖ్యముగా యువతకు నా సందేశం... పశ్చాత్తాపము ఎల్లప్పుడూ సవ్యమైనది.

మనము పశ్చాత్తాపము గురించి మాట్లాడుతున్నప్పుడు, మనము ఒక్క స్వీయ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడట్లేదు. నిజమయిన పశ్చాత్తాపము దానికి మించినది---అది ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసము మరియు మన పాపములను క్షమించ గలిగే ఆయన శక్తి చేత ప్రేరేపించబడినది. ఎల్డర్ డేల్  జి. రెన్లండ్ గారు బోధించినట్లు, “రక్షకుడు లేకుండా  పశ్చాత్తాపము అనేది చెడు ప్రవర్తనను మార్పుచేసుకొనే సాధారణ పద్ధతి అవుతుంది.”4 మనము మన ప్రవర్తనని స్వతహాగా మార్చుకోవచ్చు, కానీ రక్షకుడు మాత్రమే మన భారములను ఎత్తివేయగలరు మరియు మన మచ్చలను తొలగించగలరు, తద్వారా మనము విధేయత యొక్క మార్గములో నమ్మకంతో మరియు బలముతో ముందుకెళ్ళగలము. పశ్చాత్తాపము యొక్క ఆనందం, ఒక మంచి జీవితము యొక్క ఆనందమును మించినది. అది మరల శుద్ధపరచబడిన క్షమాపణ యొక్క ఆనందము మరియు దేవునికి దగ్గరగా అయ్యే ఆనందము. మీరు ఒక్కసారి ఆ ఆనందమును అనుభవించినట్లయితే, దానిని మించినది మరొకటి ఉండదు.

నిజమైన పశ్చాత్తాపము విధేయతను ఒక నిబద్ధతగా -- బాప్తీస్మముతో మొదలై ప్రతివారం ప్రభురాత్రి భోజనము అనగా సంస్కారము తీసుకొని పునరుద్ధరణ చేసుకొనే నిబంధనగా చేసుకునేందుకు మనకు స్ఫూర్తిని ఇస్తుంది. అక్కడ మనము “ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉండును”5 అనే వాగ్దానమును పొందెదము. ఆయన యొక్క నిత్య సాహచర్యం ద్వారా మనకి శాంతి మరియు ఆనందం కూడా లభిస్తాయి. ఇదే పశ్చాత్తాపము యొక్క ప్రతిఫలము మరియు ఇదియే పశ్చాత్తాపమును కూడా ఆనందముగా చేస్తుంది.

పశ్చాత్తాపమునకు పట్టుదల అవసరం

తప్పిపోయిన కుమారుని ఉపమానము నాకు ఎంతో ప్రియమైనది. 6 తప్పిపోయిన కుమారుడు “తనకు తానుగా బుద్దిని తెచ్చుకొనుట” ఆ ఉపమానములో ఒక పదునైన కీలకమైన క్షణము. పందుల పాకలో కూర్చొని, “పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్న అతడు” చివరికి తాను తన తండి యొక్క వారసత్వమునే కాకుండా తన సొంత జీవితమును కూడా వ్యర్థము చేసుకున్నాడనిని తెలుసుకున్నాడు. తన తండ్రి తనని కొడుకుగా కాకపోయినా ఒక పనివాడిగా అయినా తిరిగి చేర్చుకొంటాడనే విశ్వాసముతో తన తిరుగుబాటు గతమును వదిలిపెట్టి, ఇంటికి వెళ్ళాలని అతడు నిశ్చయించుకున్నాడు.

నేను తరచు, ఆ కుమారుడి తిరుగు ప్రయాణము గురించి ఆశ్చర్యపడ్డాను. “నన్ను నా తండ్రి ఎలా స్వీకరిస్తాడు?” అని అతను మధ్యదారిలో కొన్నిసార్లు సంకోచించి యుండవచ్చు. బహుశా అతను పందుల వైపు వెనక్కి రెండు అడుగులు వేసి ఉండవచ్చు. అతను నిరాశతో వెనక్కి తిరిగివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. కానీ విశ్వాసము అతనిని ముందుకు నడిపించింది మరియు విశ్వాసము అతని తండ్రి అతని కొరకు ఓర్పుతో ఎదురుచూసేలా చేసింది, చివరి వరకు:

“వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.

“అప్పుడు ఆ కుమారుడు అతనితో - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

“అయితే తండ్రి తన దాసులను చూచి - ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; …

“ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను.”

పశ్చాత్తాపము అందరికొరకైనది

సహోదర సహోదరీలారా, మనము అందరమూ తప్పిపోయినవారమే. మనము అందరమూ “మన తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకోవాలి”-- బహుశా ఒకటి కంటే ఎక్కువసార్లు--- మరియు తిరిగి ఇంటికి వెళ్లే మార్గమును ఎంచుకోవాలి. ఇది మన జీవితాల్లో ప్రతిరోజూ చేయవలసిన ఎంపిక.

మనం తరచుగా పశ్చాతాపమును “ఒక బలమైన మార్పు”7 అవసరమైన దుఃఖకరమైన పాపంతో చేర్చుతాము. కానీ పశ్చాత్తాపము అందరికొరకైనది – “నిషేధింపబడిన దారులలో పడి నశించిపోయిన వారు”8 అలాగే “ఇరుకైన మరియు సంకుచితమైన మార్గమున ప్రవేశించి,” ఇప్పుడు “ముందుకు త్రోసుకు వెళ్ళవలసిన”9 వారందరి కొరకైనది. పశ్చాత్తాపము మనల్ని సరైన దారిలో పెడ్తుంది మరియు సరైన మార్గములో కొనసాగేలా చేస్తుంది. ఇది ఎవరైతే ఇప్పుడిప్పుడే నమ్ముట మొదలుపెట్టారో వారికోసం, ఎప్పట్నుంచో నమ్మిక ఉంచినవారి కోసం మరియు తిరిగి మరల నమ్మిక మొదలుపెట్టాల్సిన వారి కోసం కూడా. ఎల్డర్ డేవిడ్  ఎ. బెడ్నార్ బోధించిన విధముగా, “మనలో చాలా మంది ప్రాయశ్చిత్తఃము అనేది పాపుల కోసము అని అర్ధం చేసుకుంటారు. అది నాకు ఖచ్చ్ఛతంగా తెలియదు, అయితే మనకి తెలిసినది మరియు అర్ధమయినది ఏమిటంటే, ప్రాయశ్చిత్తఃము అనేది పరిశుద్ధుల కోసము కూడా-- విధేయత కలిగిన, యోగ్యులైన మరియు … ఇంకా మంచిగా అవ్వాలని ప్రయత్నించే మంచి స్త్రీ పురుషుల కోసం కూడా.”10

ఇటీవల నేను కొత్త మిషనరీలు వచ్చినప్పుడు మిషనరీ శిక్షణ కేంద్రమును సందర్శించాను. నేను వారిని చూసినప్పుడు మరియు వారి కళ్ళలో వెలుగుని చూసినప్పుడు నేను లోతుగా కదిలించబడ్డాను. వారు చాలాప్రకాశవంతంగా, సంతోషంగా మరియు ఉత్సాహభరితంగా కనిపించారు. అప్పుడు నాకొక ఆలోచన వచ్చింది: “వారు పశ్చాతాపమునకు కావలసిన విశ్వాసమును అనుభవించారు. అందువలనే వారు ఆనందముతో మరియు నిరీక్షణతో నింపబడియున్నారు.”

దానర్థం వారు గతంలో తీవ్రమైన అతిక్రమణలు చేసారని నేను అనుకోను, కానీ ఎలా పశ్చాత్తాపపడాలో వారికి తెలుసని నేననుకుంటున్నాను; పశ్చాత్తాపము సవ్యమైనదని వారు నేర్చుకున్నారు; మరియు వారు ఈ ఆనందకరమైన సందేశమును ప్రపంచముతో పంచుకునేందుకు ఆసక్తితో సిద్ధంగా ఉన్నారు.

పశ్చాత్తాపము యొక్క ఆనందమును మనము అనుభూతి చెందుతున్నప్పుడు ఇదే జరుగుతుంది. ఈనస్ యొక్క ఉదాహరణను పరిశీలించండి. అతనికి “బుద్ధి వచ్చిన” సందర్భము కలదు మరియు అతని “దోషము తొలగిపోయిన” తరువాత వెంటనే అతని హృదయము ఇతరుల సంక్షేమము వైపు తిరిగింది. ఈనస్ తన దినములన్నిటా పశ్చాత్తాపమును ప్రకటించాడు మరియు “లోకము కంటే ఎక్కువగా దానియందు ఆనందించియున్నాడు.”11 పశ్చాత్తాపము అదే చేస్తుంది; అది మన హృదయములను ఇతరుల వైపు తిప్పుతుంది, ఎందుకంటే మనము అనుభూతి చెందే ఆనందము అందరికి ఉద్దేశించబడిందని మనకు తెలుసు.

పశ్చాత్తాపము అనేది జీవితకాల యత్నము

నా స్నేహితుడొకరు తక్కువ చురుకుగా గల కడవరి దిన పరిశుద్ధుల కుటుంబమునుంచి వచ్చాడు. అతడు యవ్వనంలో ఉన్నప్పుడు అతడు కూడా “బుద్ధి తెచ్చుకొని,” మిషనుకు వెళ్ళడానికి సిద్దపడాలని నిర్ణయించుకున్నాడు.

అతను ఒక శ్రేష్ఠమైన మిషనరీ అయ్యాడు. అతను ఇంటికి తిరిగివచ్చే ముందు రోజు, ఆ మిషను అధ్యక్షుడు అతనని కలిసి మాట్లాడుతూ తన సాక్ష్యము పంచుకోమని కోరారు. అతను చెప్పాడు మరియు కన్నీటితో కౌగిలించుకున్న అధ్యక్షుడు ఇలా అన్నారు, “ఎల్డర్, ఒకవేళ నువ్వు నీ సాక్ష్యమును నిర్మించిన పనులను చేయడం కొనసాగించకపోతే, ఇప్పుడు చెప్పిన సాక్ష్యమును నువ్వు కొన్ని నెలల్లో మర్చిపోగలవు లేదా నిరాకరించగలవు.”

అతను మిషను నుండి వచ్చినప్పటినుండి రోజు లేఖనాలను చదివాడు మరియు ప్రార్ధన చేసాడు అని నా స్నేహితుడు తర్వాత నాతో చెప్పాడు. నిరంతరము “దేవుని యొక్క మంచి వ్క్యము చేత పోషించబడడం” అతనిని “సరైన మార్గమందు”12 నిలిపింది.

ఎవరైతే పూర్తి సమయము దేవుని సేవకు సిద్దపడుతున్నారో మరియు ఎవరైతే సేవ ముగించుకుని తిరిగి వస్తున్నారో, వారిది గమనించండి! సాక్ష్యము సంపాదించడము ఒక్కటే సరిపోదు; దానిని మీరు నిలబెట్టుకోవాలి మరియు బలపరచుకోవాలి. ప్రతి మిషనరీకి ఇది తెలిసినదే, సైకిల్ తొక్కడము ఆపేస్తే అది పడిపోతుంది మరియు మీరు మీ సాక్ష్యమును బలపరచుకోకపోతే అది బలహీనపడిపోతుంది. ఇదే సూత్రము పశ్చాతాపమునకు కూడా వర్తిస్తుంది - ఇది జీవితకాల యత్నము, జీవితంలో ఒకసారి జరిగే అనుభూతి కాదు.

క్షమాపణను వెదికే వారందరిని- యువతను, యౌవనస్థులను, తల్లిదండ్రులను, తాత బామ్మలను, మరియు అవును, ముత్తాత బామ్మలను కూడా --- నేను ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. మొదలుపెట్టేందుకు ఇదియే సమయము. మీ పశ్చాత్తాపము యొక్క దినమును ఆలస్యం చేయకండి. 13

ఒకసారి మీరు నిర్ణయం తీసుకున్న తరువాత, అదే మార్గమును అనుసరించండి. మన తండ్రి మిమ్మల్ని స్వీకరించాలనే ఆశతో వేచియున్నారు. ఆయన తన చేతులను “దినమంతయు” మీ కొరకు చాచి ఉంచారు.14 శ్రమకు తగిన ప్రతిఫలము ఉంటుంది.

నీఫై యొక్క మాటలు గుర్తు తెచ్చుకోండి: “అందువలన, క్రీస్తు నందు ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్క మరియు మనుష్యులందరి యొక్క ప్రేమను కలిగి ముందుకు త్రోసుకు వెళ్ళవలెను. ఇప్పుడు మీరు క్రీస్తు వాక్యమను విందారగించుచు ముందునకు త్రోసుకొని వెళ్ళిపోయి అంతమువరకు స్థిరముగా నుండిన యెడల, ఇదిగో మీరు నిత్య జీవమును పొందుదురని తండ్రి ఇట్లు చెప్పుచున్నారు.”15

కొన్నిసార్లు ప్రయాణము సుదీర్ఘంగా కనిపిస్తుంది-- ఎందుకంటే ఇది నిత్యజీవితము వైపు ప్రయాణము కాబట్టి. కానీ, మనము యేసు క్రీస్తు యందు విశ్వాసముతో మరియు ఆయన యొక్క ప్రాయశ్చిత్తఃము యందు నమ్మిక ఉంచి ప్రయాణమును సాగిస్తే అది సంతోషముతో కూడిన ప్రయాణము కావచ్చు. మనము పశ్చాత్తాపము యొక్క దారిలో అడుగు పెట్టినప్పటి నుంచి మనము రక్షకుని యొక్క విమోచన శక్తిని మన జీవితాలలోకి ఆహ్వానిస్తాము అని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. ఆ శక్తి మన అడుగులకు స్థిరమునిస్తుంది, మన దృష్టిని విస్తరిస్తుంది మరియు చివరికి మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళి, “భళా!”16 అని మన పరలోక తండ్రి మనల్ని మెచ్చుకోవడాన్ని వినే దివ్యమైన రోజు వరకు ఒక్కొక్క అడుగు ముందుకు సాగాలనే మన తీర్మానాన్ని మరింత బలపరుస్తుంది. యేసు క్రీస్తు నామమున, ఆమేన్.