సర్వసభ్య సమావేశము
మీ శత్రువులను ప్రేమించుడి
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


మీ శత్రువులను ప్రేమించుడి

మనమందరము దేవుని పిల్లలమని తెలుసుకొనుట మనకు ఇతరుల విలువ గురించి దివ్యదృష్టిని ఇచ్చి, పక్షపాతాన్ని జయించడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది.

ప్రభువు యొక్క బోధనలు నిత్యత్వము కొరకైనవి, అవి దేవుని పిల్లలందరి కొరకైనవి. ఈ సందేశంలో నేను సంయుక్త రాష్ట్రాల నుండి కొన్ని ఉదాహరణలు ఇస్తాను, కాని అవి బోధించే సూత్రాలు ప్రతిచోటా వర్తిస్తాయి.

రాజకీయ సంబంధాలలో, ప్రభుత్వ విధానాలలో కోపము, ద్వేషము ఉన్న కాలంలో మనము జీవిస్తున్నాము. కొందరు శాంతియుత నిరసనలను దాటి వినాశకరమైన ప్రవర్తనలో నిమగ్నమైయున్నప్పుడు ఈ వేసవిలో దీనిని మనము భావించాము. ప్రభుత్వ పదవుల కోసం ప్రస్తుతమున్న కొన్ని ప్రచారాలలో మనము దీనిని భావిస్తున్నాము. దురదృష్టవశాత్తూ, వీటిలో కొన్ని మన సంఘ సమావేశాలలో రాజకీయ ప్రకటనలు మరియు దయలేని ఉదహరణలు ఇచ్చుటలో వ్యాపించాయి.

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిపాదిత అభ్యర్థులు మరియు ప్రభుత్వ విధానాలపై మనకు ఎల్లప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఏదేమైనా, క్రీస్తు అనుచరులుగా మనం ఏ పరిస్థితులలోనైనా కోపంతో, ద్వేషంతో రాజకీయ ఎంపికలను చర్చించడాన్ని లేదా ఖండించడాన్ని విడిచిపెట్టాలి.

చిత్రం
కొండమీది ప్రసంగము

మన రక్షకుని బోధనలలో ఒకటి, బహుశా బాగా తెలిసినది కాని చాలా అరుదుగా ఆచరించబడింది ఇక్కడ ఉన్నది:

“నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

“నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, మిమ్మును ద్వేషపూరితముగా వాడుకొనువారి కొరకు, హింసించువారి కొరకు ప్రార్థనచేయుడి.” (మత్తయి 5:43–44). 1

తరతరాలుగా యూదులు తమ శత్రువులను ద్వేషించమని బోధించబడ్డారు, అప్పుడు వారు రోమనుల ఆక్రమణ యొక్క ఆధిపత్యముతోను, క్రూరత్వంతోను బాధపడుతున్నారు. కానీ, “మీ శత్రువులను ప్రేమించుడి” మరియు “మిమ్ములను ద్వేషపూరితముగా వాడుకొనువారికి మంచి చేయుడి” అని యేసు వారికి బోధించెను.

చిత్రం
యేసు అమెరికా ఖండములో బోధించుట

వ్యక్తిగత మరియు రాజకీయ సంబంధాలకు ఎంతో విప్లవాత్మకమైన బోధనలివి. కానీ మన రక్షకుడు దానినే పాటించమని ఇప్పటికీ ఆజ్ఞాపించియున్నాడు. “ఏలయనగా నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, వివాదము యొక్క ఆత్మను కలిగినవాడు నా సంబంధి కాడు, కానీ వివాదము యొక్క తండ్రి అయిన అపవాది సంబంధియై యున్నాడు; మరియు అతడు ఒకనితోనొకడు కోపముతో పోరాడునట్లు మనుష్యుల హృదయాలను పురిగొల్పును” (3 నీఫై 11:29) అని మోర్మన్ గ్రంథములో మనం చదువుతాము.

మన శత్రువులను, మన విరోధులను ప్రేమించడం అంత సులభం కాదు. “మనలో చాలా మంది ప్రేమ మరియు క్షమాపణ యొక్క ఆ దశకు చేరుకోలేదు” అని అధ్యక్షులు హింక్లీ గమనించారు, “దానికి మన సామర్థ్యం కన్నా దాదాపుగా కొంచెం ఎక్కువ స్వీయ-క్రమశిక్షణ అవసరం.” 2 కానీ ఆ రకమైన ప్రేమ తప్పనిసరి, ఎందుకంటే “ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” మరియు “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అనే రక్షకుని రెండు గొప్ప ఆజ్ఞలలో అది భాగమైయున్నది (మత్తయి 22:37, 39). మరియు అది ఖచ్చితంగా సాధ్యమైయుండాలి, ఎందుకంటే ఆయన దీనిని కూడా బోధించారు, “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును”(మత్తయి 7:7). 3

మనుష్య చట్టాలకు లోబడియున్న ప్రపంచంలో ఈ దైవిక ఆజ్ఞలను మనం ఎలా పాటిస్తాము? అదృష్టవశాత్తూ, ఆయన నిత్య చట్టాలను మానవ నిర్మిత చట్టాల యొక్క ఆచరణాత్మకతతో ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలిపే రక్షకుని మాదిరిని మనం కలిగియున్నాము. యూదులు రోమ్‌కు పన్నులు చెల్లించాలా అనే ప్రశ్నతో విరోధులు ఆయనను చిక్కునపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు, వారి నాణేలపై కైసరు ప్రతిరూపమును చూపించి ఆయన, “ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను”(లూకా 20:25). 4

చిత్రం
కైసరుకు చెల్లించుడి

అందువల్ల, మనం పౌర అధికారం క్రింద శాంతియుతంగా జీవించడానికి మనుష్య చట్టాలను అనుసరించాలి (కైసరుకు చెల్లించుడి), మరియు మన నిత్య గమ్యం వైపు వెళ్ళడానికి దేవుని చట్టాలను పాటించాలి. కానీ దీన్ని మనం ఎలా చేయాలి, ముఖ్యంగా మన విరోధులను, మన శత్రువులను ప్రేమించడం ఎలా నేర్చుకోవాలి?

“కోపముతో పోరాడ” వద్దు అనే రక్షకుని బోధ మంచి మొదటి అడుగు. అపవాది వివాదము యొక్క తండ్రి మరియు కోపముతో పోరాడునట్లు మనుష్యుల హృదయాలను పురిగొల్పువాడు అతడే. అతడు వ్యక్తుల మధ్య మరియు సమూహాల మధ్య శత్రుత్వాన్ని, ద్వేషపూరిత సంబంధాలను ప్రోత్సహిస్తాడు. కోపం “సాతాను యొక్క సాధనం” అని అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ బోధించారు, ఎందుకంటే “కోపంగా ఉండడమంటే సాతాను ప్రభావానికి లోబడి ఉండడం. మనకు ఎవరూ కోపం తెప్పించలేరు. అది మన ఎంపిక.” 5 కోపం అనేది విడిపోవడానికి మరియు శత్రుత్వానికి మార్గం. మనం విభేదించే వారి పట్ల కోపాన్ని, శత్రుత్వాన్ని నివారించినప్పుడు మనం మన విరోధులను ప్రేమించే దిశగా వెళ్తాము. మనము వారి నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే అది మరింత సహాయపడుతుంది.

ఇతరులను ప్రేమించే శక్తిని పెంపొందించే ఇతర మార్గాలలో ఒకటి ఏదనగా పూర్వ కాలపు సంగీతనాకటములోని పదాలలో వివరించబడిన సరళమైన పద్ధతి. మనము వేరే సంస్కృతికి చెందిన వ్యక్తులను అర్థం చేసుకోవడానికి మరియు వారితో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనము వారిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వ్యక్తిగత పరిచయాలు అవగాహన మరియు పరస్పర గౌరవాన్ని ఉత్పత్తి చేసినప్పుడు అపరిచితుల అనుమానం లేదా శత్రుత్వం లెక్కలేనన్ని సందర్భాలలో స్నేహానికి, ప్రేమకు కూడా దారితీస్తుంది. 6

మన విరోధులను, మన శత్రువులను ప్రేమించడాన్ని నేర్చుకోవడంలో ఇంకా గొప్ప సహాయం ఏమిటంటే, ప్రేమ యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. దీని గురించి అనేక ప్రవచనాత్మక బోధనలలో మూడు ఇక్కడ ఉన్నాయి.

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఈ విధముగా బోధించారు, “ప్రేమ మరింత ప్రేమను పుట్టించును అనేది చాలా కాలంగా ఉన్న సామెత. మనము అధికముగా ప్రేమను చూపించెదము—సర్వమానవాళికి మన దయను తెలియజేయుదము.” 7

అధ్యక్షులు హావర్డ్ డబ్ల్యు. హంటర్ ఇలా బోధించారు: “ప్రతిచోటా ఉన్న స్త్రీపురుషులు దయ, సాత్వీకము మరియు అణకువగల క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమను సాధనచేస్తే మనం జీవిస్తున్న ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అది అసూయ లేదా అహంకారం లేకుండా ఉంటుంది. … అది ప్రతిఫలంగా ఏమీ కోరుకోదు. … దానిలో మూర్ఖత్వానికి, ద్వేషానికి, హింసకు చోటు లేదు. … మత విశ్వాసం, జాతి, జాతీయత, ఆర్థిక స్థితి, విద్య లేదా సంస్కృతితో సంబంధం లేకుండా విభిన్న వ్యక్తులను క్రైస్తవ ప్రేమలో కలిసి జీవించమని అది ప్రోత్సహిస్తుంది.” 8

“సమస్త మానవ కుటుంబాన్ని హత్తుకోవడానికి మన ప్రేమ వృత్తాన్ని విస్తరించాలని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ కోరారు. 9

మన శత్రువులను ప్రేమించడంలో ముఖ్యమైన భాగం ఏమిటంటే, మన వివిధ దేశాల చట్టాలను పాటించడం ద్వారా కైసరువి కైసరుకు చెల్లించడం. యేసు బోధనలు విప్లవాత్మకమైనవి అయినప్పటికీ, ఆయన విప్లవాన్ని లేదా చట్ట ఉల్లంఘనను బోధించలేదు. ఆయన ఉత్తమమైన మార్గాన్ని నేర్పించారు. ఆధునిక బయల్పాటు దానినే బోధిస్తుంది:

“దేశచట్టాలను ఏ మనుష్యుడు అతిక్రమించకూడదు, ఏలయనగా దేవుని చట్టాలను పాటించువాడు దేశచట్టాలను అతిక్రమించనవసరము లేదు.

“కాబట్టి, ఇప్పుడున్న ప్రభుత్వాలకు లోబడియుండుడి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:21–22).

ప్రారంభ పరిశుద్ధులు మిస్సోరి యొక్క చట్టాలు మరియు అధికారుల నుండి తీవ్రమైన హింసను ఎదుర్కొన్న తరువాత ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత వ్రాయబడిన విశ్వాస ప్రమాణాలు ఇలా ప్రకటిస్తున్నాయి: “చట్టమును గైకొనుట, గౌరవించుట, సమర్థించుటలో రాజులకు, అధ్యక్షులకు, అధికారులకు, న్యాయాధిపతులకు లోబడియుండుటను మేము నమ్ముచున్నాము” (విశ్వాస ప్రమాణాలు 1:12).

దీని అర్థం, చట్టాన్ని అమలు చేసే వారి చర్యలన్నిటిని మనము అంగీకరిస్తున్నామని కాదు. మనము ప్రస్తుత చట్టాన్ని పాటిస్తాము మరియు దానిని మార్చడానికి శాంతియుత మార్గాలను ఉపయోగిస్తాము. ఎన్నికల ఫలితాలను మనము శాంతియుతంగా అంగీకరిస్తామని దీని అర్థం. ఫలితంతో నిరాశ చెందిన వారిచేత బెదిరించబడే హింసలో మనము పాల్గొనము. 10 ప్రజాస్వామ్య సమాజంలో, తరువాతి ఎన్నికల వరకు శాంతియుతంగా కొనసాగే అవకాశం మరియు విధి మనకు ఎల్లప్పుడూ ఉంటుంది.

మనుష్యులందరూ దేవుని ప్రియమైన పిల్లలు, వారు శత్రుత్వం చేత వేరు చేయబడకూడదు అనే వాస్తవం మీద మన శత్రువులను ప్రేమించమని చెప్పిన రక్షకుని బోధన ఆధారపడి ఉంటుంది. అనేక అమెరికా నగరాల్లో ఇటీవల జరిగిన నిరసనలలో ఆ నిత్య సూత్రం మరియు చట్టము యొక్క కొన్ని ప్రాథమిక సూత్రాలు పరీక్షించబడ్డాయి.

చిత్రం
శాంతియుత నిరసన

తీవ్రస్థాయిలో ఒకవైపు “శాంతియుతంగా సమావేశమగుటకు మరియు మనోవేదనల పరిష్కారానికి ప్రభుత్వంపై దావా వేయుటకు ప్రజలకు గల హక్కుకు” సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగంలోని మొదటి సవరణ హామీ ఇస్తుందని కొందరు మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ప్రజలలో అవగాహన పెంచడానికి మరియు చట్టాల యొక్క విషయములో లేదా నిర్వహణలో గల అన్యాయాలపై దృష్టి పెట్టడానికి అదే అధికారిక మార్గం. అక్కడ అన్యాయాలు జరిగాయి. ప్రజల చర్యలలో, వ్యక్తిగత వైఖరులలో మనకు జాత్యహంకారం మరియు దానికి సంబంధించిన మనోవేదనలు ఉన్నాయి. ప్రేరణాత్మకమైన వ్యక్తిగత వ్యాసంలో, నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (NAACP) యొక్క రెవరెండ్ థెరిసా ఎ. డియర్, “జాత్యహంకారం అనేది ద్వేషము, అణచివేత, నిష్క్రియాత్మకత, ఉదాసీనత, అలక్ష్యము మరియు నిశ్శబ్దంపైన వృద్ధి చెందుతుంది” అని గుర్తు చేసారు. 11 పౌరులుగా మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన సంఘము యొక్క సభ్యులుగా, జాత్యహంకారాన్ని తొలగించడంలో సహాయపడేందుకు మనం బాగా పని చేయాలి.

చిత్రం
అక్రమ అల్లర్లు

తీవ్రస్థాయిలో మరోవైపు, ఈ హింసాత్మక నిరసనలలో పాల్గొని, వాటికి మద్దతునిచ్చే అతి కొద్దిమంది మరియు వాటిని అనుసరించి జరిగే చట్టవిరుద్ధమైన చర్యలు, రాజ్యాంగం చేత రక్షించబడు నిరసనలు శాంతియుత నిరసనలు మాత్రమే అని మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఆస్తిని నాశనం చేయడానికి, అపవిత్రం చేయడానికి లేదా దొంగిలించడానికి లేదా ప్రభుత్వ చట్టబద్ధమైన పోలీసు అధికారాలను అణగద్రొక్కడానికి నిరసనకారులకు హక్కు లేదు. విప్లవం లేదా అరాచకత్వాన్ని రాజ్యాంగం మరియు చట్టాలు స్వాగతించవు. మనమందరం అనగా పోలీసులు, నిరసనకారులు, మద్దతుదారులు మరియు ప్రేక్షకులు—మన హక్కుల పరిమితులను మరియు ఇప్పటికే ఉన్న చట్ట సరిహద్దులలో ఉండడానికి మన విధుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అబ్రహాం లింకన్ సరిగ్గా ఇలా అన్నారు: “అల్లరిమూక యొక్క బలవంతపు చట్టం ద్వారా పరిష్కరించదగిన సమస్య ఏదీ లేదు.” 12 అల్లరిమూకల ద్వారా ఫిర్యాదులను పరిష్కరించడమంటే చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరించడమే. దీనినే అరాచకం అంటారు, అనగా సమర్థవంతమైన ప్రభుత్వాలు మరియు పోలీసులు లేని పరిస్థితి, ఇది వ్యక్తిగత హక్కులను పరిరక్షించడానికి బదులు వాటిని బలహీనపరుస్తుంది.

సంయుక్త రాష్ట్రాలలో ఇటీవల జరిగిన నిరసనలు చాలామందికి దిగ్భ్రాంతి కలిగించడానికి ఒక కారణం ఏమిటంటే, ఇతర దేశాలలో వివిధ జాతుల మధ్య ఉన్న శత్రుత్వాలు, చట్టవిరుద్ధాలు సంయుక్త రాష్ట్రాలలో భావించబడడం. ఇటీవలి నిరసనలలో ఎక్కువగా కనిపించిన నల్లజాతీయులైన అమెరికన్లకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, లాటిన్ వారు, ఆసియా వారు మరియు ఇతర సమూహాలకు వ్యతిరేకంగా ఉన్న జాత్యహంకారాన్ని నిర్మూలించడంలో ఈ దేశం మెరుగ్గా ఉండాలి. జాత్యహంకారాన్ని నిర్మూలించడంలో ఈ దేశచరిత్ర మెరుగ్గా లేదు, మరియు మనం తప్పకుండా ఉత్తమంగా చేయాలి.

చిత్రం
ఎల్లిస్ ద్వీపం
చిత్రం
వలసదారులు

సంయుక్త రాష్ట్రాలు వివిధ జాతీయతలు మరియు వివిధ జాతుల వలసదారులచే స్థాపించబడింది. దాని ఏకీకృత ఉద్దేశ్యం ఒక నిర్దిష్ట మతాన్ని స్థాపించడం లేదా పాత దేశాల యొక్క విభిన్న సంస్కృతులు లేదా గిరిజన విధేయతలను శాశ్వతం చేయడం కాదు. మన వ్యవస్థాపక తరం కొత్త రాజ్యాంగం మరియు చట్టాల ద్వారా ఏకీకృతం కావాలని కోరింది. మన ఏకీకృత పత్రాలు లేదా వాటి అర్ధాల గురించి అప్పటి, ఇప్పటి అవగాహన పరిపూర్ణంగా ఉందని చెప్పలేము. సంయుక్త రాష్ట్రాల యొక్క మొదటి రెండు శతాబ్దాల చరిత్ర మహిళలకు ఓటు హక్కు మరియు ముఖ్యంగా బానిసత్వాన్ని రద్దు చేయడం మరియు బానిసలుగా ఉన్నవారు స్వేచ్ఛ యొక్క ఆకాంక్షలు మరియు పరిస్థితులను ఆస్వాదించాలనే భరోసా వంటి అనేక మెరుగుదలల యొక్క అవసరాన్ని మనకు చూపించింది.

ఇద్దరు యేల్ విశ్వవిద్యాలయ పండితులు ఇటీవల మనకు ఇలా గుర్తు చేశారు:

“సంయుక్త రాష్ట్రాలలో అనేక లోపాల ఉన్నప్పటికీ, అది విభిన్న మరియు విభజించబడిన సమాజాన్ని ఏకం చేయడానికి విశిష్టమైన రీతిలో సామర్థ్యాన్ని కలిగియుంది. …

“ … దాని పౌరులు జాతీయ గుర్తింపు మరియు బహుళ సాంస్కృతికత రెండింటిలో ఒకదానిని ఎంచుకోవలసిన అవసరం లేదు. అమెరికా దేశస్థులు రెండింటినీ కలిగియుండవచ్చు. కానీ దీనిలో ముఖ్యమైన భాగం రాజ్యాంగ దేశభక్తి కలిగియుండడం. మన సైద్ధాంతిక భేదాభిప్రాయాలతో సంబంధం లేకుండా మనం రాజ్యాంగం ద్వారా మరియు రాజ్యాంగం చేత ఐక్యంగా ఉండాలి.” 13

చాలా సంవత్సరాల క్రితం, బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి హౌస్ ఆఫ్ కామన్స్ లో జరిగిన చర్చలో ఈ గొప్ప సలహాను ఇచ్చారు: “మనకు శాశ్వతమైన మిత్రులు మరియు మనకు శాశ్వత శత్రువులు లేరు. మన ఆసక్తులు నిత్యమైనవి మరియు శాశ్వతమైనవి, మరియు ఈ ఆసక్తులు పాటించడం మన కర్తవ్యం.” 14

రాజకీయ విషయాలలో “నిత్యమైన మరియు శాశ్వతమైన” ఆసక్తులను అనుసరించడానికి ఇది మంచి లౌకిక కారణం. అదనంగా, మనల్ని నడిపించడానికి మరొక నిత్య ఆసక్తిని ప్రభువు సంఘం యొక్క సిద్ధాంతం మనకు బోధిస్తుంది: మన రక్షకుని బోధనలు సంయుక్త రాష్ట్రాల యొక్క రాజ్యాంగాన్ని మరియు మన అనేక దేశాల ప్రాథమిక చట్టాలను ప్రేరేపించాయి. మనం భిన్నత్వంలో ఏకత్వం కోరుకున్నప్పుడు తాత్కాలికమైన “మిత్రదేశాలకు” విధేయత చూపకుండా స్థాపించబడిన చట్టానికే ఎల్లప్పుడూ విధేయత చూపించడం మన విరోధులను మరియు మన శత్రువులను ప్రేమించడానికి ఉత్తమమైన మార్గం.

మనమందరము దేవుని పిల్లలమని తెలుసుకొనుట మనకు ఇతరులందరి విలువ గురించి దివ్యదృష్టిని ఇచ్చి, పక్షపాతం, జాత్యహంకారాన్ని జయించడానికి సంకల్పాన్ని, సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ దేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలుగా నివసించినందువల్ల, ఈ దేశ చట్టాలను పాటించడం మరియు మెరుగుపరచడానికి ప్రయత్నించడం మాత్రమే కాకుండా, మన విరోధులను మరియు మన శత్రువులను ప్రేమించడం కూడా సాధ్యమని ప్రభువు నాకు నేర్పించారు. ఇది అంత సులభం కాదు, కాని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సహాయంతో ఇది సాధ్యపడుతుంది. ప్రేమించమనే ఈ ఆజ్ఞను ఆయన ఇచ్చారు మరియు మనం దానిని గైకొనాలని కోరినప్పుడు ఆయన సహాయం చేస్తానని వాగ్దానం చేసారు. మనం ప్రేమించబడుచున్నామని, మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుచేత సహాయం చేయబడతామని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. లూకా 6:27–28, 30 కూడా చూడండి.

  2. Gordon B. Hinckley, “The Healing Power of Christ,” Ensign, Nov. 1988, 59; see also Teachings of Gordon B. Hinckley (1997), 230.

  3. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:5 కూడా చూడండి.

  4. మత్తయి 22:21; మార్కు 12:17 కూడా చూడండి.

  5. థామస్ ఎస్. మాన్సన్, “School Thy Feelings, O My Brother,” Liahona, నవ. 2009, 68.

  6. బెక్కి మరియు బెన్నెట్ బోర్డెన్, “Moving Closer: Loving as the Savior Did,” Ensign, సెప్టె. 2020, 24–27 చూడండి.

  7. History of the Church, 5:517 లో జోసెఫ్ స్మిత్. అదేవిధంగా, మార్టిన్ లూథర్ కింగ్ జూ. (1929-68) ఇలా అన్నారు: “హింస కోసం హింస తిరిగి రావడం హింసను హెచ్చిస్తుంది, అప్పటికే నక్షత్రాలు లేని రాత్రికి లోతైన చీకటిని జోడిస్తుంది. చీకటి చీకటిని తరిమికొట్టదు; కాంతి మాత్రమే అలా చేయగలదు. ద్వేషం ద్వేషాన్ని తరిమికొట్టదు; ప్రేమ మాత్రమే అలా చేయగలదు” ( మేము ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాము: గందరగోళానికా లేదా సమాజానికా? [2010], 64–65).

  8. Teachings of Presidents of the Church: Howard W. Hunter (2015), 263.

  9. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Blessed Are the Peacemakers,” Liahona, Nov. 2002; Teachings of Russell M. Nelson (2018), 83 కూడా చూడండి.

  10. “A House Divided,” The Economist, Sept. 5, 2020, 17–20 చూడండి.

  11. థెరిసా ఏ. డియర్, “America’s Tipping Point: 7 Ways to Dismantle Racism,” Deseret News, June 7, 2020, A1.

  12. యంగ్ మెన్స్ లైసియం, స్ప్రింగ్‌ఫీల్డ్, ఇల్లినాయ్ వద్ద అబ్రహామ్ లింకన్ ప్రసంగము (జనవరి 27, 1838); జాన్ బార్ట్‌లెట్, Bartlett’s Familiar Quotations, 18th ed. (2012), 444.

  13. అమీ చువా మరియు జెడ్ రూబెన్‌ఫెల్డ్, “The Threat of Tribalism,” Atlantic, Oct. 2018, 81, theatlantic.com.

  14. హెన్రీ జాన్ టెంపుల్, విస్కౌంట్ పామర్స్టన్, హౌస్ ఆఫ్ కామన్స్ లో వ్యాఖ్యలు, మార్చి 1, 1848; బార్ట్‌లెట్‌లో, Bartlett’s Familiar Quotations, 392; వివరణ చేర్చబడింది.