సర్వసభ్య సమావేశము
ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుండుట
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుండుట

విశ్వాసం అంటే మంచి సమయాల్లో మరియు చెడు సమయాల్లో మన తరఫున ఆయన బాహువును మనం చూసేవరకు కొన్ని బాధలు అనుభవించవలసి ఉన్నప్పటికీ దేవుడిని విశ్వసించడం.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మన ప్రియమైన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి ముగింపు వ్యాఖ్యలు వినడానికి మనందరిలో నా కంటే ఎక్కువ ఆసక్తి గలవారు ఎవ్వరూ లేరు. ఇది ఒక అద్భుతమైన సమావేశం, కానీ కోవిడ్-19 మన సంప్రదాయ సమావేశాలను మార్చివేసింది. ఈ అంటువ్యాధితో మనం చాలా అలసిపోయి, మన జుట్టును పెరికివేసుకోవాలి అని భావిస్తున్నాము. స్పష్టంగా, నా సోదరులలో కొందరు ఇప్పటికే ఆ చర్య తీసుకున్నారు. ఏ విధంగానైనా ప్రభావితమైన వారి కోసం, ముఖ్యంగా ప్రియమైన వారిని కోల్పోయిన వారి కోసం మేము నిరంతరం ప్రార్థిస్తున్నామని దయచేసి తెలుసుకోండి. ఇది చాలా ఎక్కువ కాలం జరిగిందని అందరూ అంగీకరిస్తారు.

మనకు వచ్చే కష్టాల నుండి ఉపశమనం కోసం మనం ఎంతకాలం వేచి ఉండాలి? మనము చాలాకాలం వేచియుండి, సహాయం చాలా నెమ్మదిగా వస్తుంది అనిపించినప్పుడు వ్యక్తిగత శ్రమలను భరించడం గురించి ఏమంటాము? భారాలు మనం భరించగలిగే దానికంటే ఎక్కువగా అనిపించినప్పుడు ఈ ఆలస్యం ఎందుకు?

అటువంటి ప్రశ్నలను అడిగేటప్పుడు మనం ప్రయత్నించగలిగితే, ఆ సమయములో ఆ ప్రాంతంలో అత్యంత శీతలమైన శీతాకాలములో చెమ్మగా, చీకటిగానున్న చెరసాల గది నుండి మరొకరి స్వరము ప్రతిధ్వనించడాన్ని మనము వినగలము.

“ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?” అని లిబర్టీ చెరసాల లోతులలోనుండి ఒక స్వరాన్ని మనం వింటాము. “నిన్ను మరుగుపరచు స్థలమును కప్పియుంచు తెర ఎక్కడ యుండెను? ఎంతకాలము నీ హస్తము నిలిచియుండును?” 1 ఎంతకాలము ఓ ప్రభువా, ఎంతకాలము?

కాబట్టి, దుఃఖాలు మనపై ఒత్తిడి తెచ్చినప్పుడు లేదా మన హృదయంలో బాధ సుదీర్ఘకాలము కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగినవారిలో మనం మొదటివారము కాదు. నేను ఇప్పుడు మహమ్మారులు లేదా చెరసాలల గురించి మాట్లాడడం లేదు, కానీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న మీ గురించి, మీ కుటుంబం మరియు మీ పొరుగువారి గురించి మాట్లాడుతున్నాను. వివాహం చేసుకోవాలనుకుని చేసుకోనివారు మరియు వివాహం చేసుకొని ఆ బంధము ఇంకొంచెం స్వర్గమయముగా ఉండాలని కోరుకునే ఆత్రుతగల అనేకమంది గురించి నేను మాట్లాడుతున్నాను. అవాంఛితముగా తీవ్రమైన వైద్య పరిస్థితిని ఎదుర్కోవాల్సిన వారి గురించి —బహుశా నయం చేయలేనిది—లేదా నివారణ లేని జన్యు లోపంతో జీవితకాల యుద్ధాన్ని ఎదుర్కొనేవారి గురించి నేను మాట్లాడుతున్నాను. భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్య సవాళ్లతో నిరంతర పోరాటం గురించి నేను మాట్లాడుతున్నాను, వాటితో బాధపడే చాలా మందిపై మరియు వారిని ప్రేమించి, వారితోపాటు బాధపడేవారి హృదయాలపై ఉండు భారము గురించి నేను మాట్లాడుతున్నాను. మనము ఎప్పటికీ మరచిపోరాదని రక్షకుడు చెప్పిన బీదవారి గురించి నేను మాట్లాడుతున్నాను, మరియు వయస్సుతో సంబంధం లేకుండా, మీరు ప్రార్థించిన మార్గానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్న ఒక బిడ్డ అతడు లేదా ఆమె ఆ మార్గానికి తిరిగి రావాలని వేచి ఉన్నవారి గురించి నేను మాట్లాడుతున్నాను.

ఇంకా, మనం వ్యక్తిగతంగా వేచి ఉండాల్సిన సంగతుల యొక్క ఈ సుదీర్ఘమైన జాబితా మనం సమిష్టిగా ఎదుర్కొనే అతిపెద్ద ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సమస్యలను తెలుపుటకు ప్రయత్నించదని నేను అంగీకరిస్తున్నాను. పరలోకమందున్న మన తండ్రి ఈ తీవ్ర ఒత్తిడిని కలిగించు ప్రజా సమస్యలను మరియు వ్యక్తిగత సమస్యలను మనం పరిష్కరించాలని స్పష్టంగా ఆశిస్తున్నారు, కానీ అతిపెద్ద ప్రపంచ సమస్యలకు లేదా అతిచిన్న వ్యక్తిగత సమస్యలకు సంబంధించినదైనప్పటికీ మన ఉత్తమ ఆత్మీయ ప్రయత్నం మరియు ఉత్సాహపూరితమైన, అభ్యర్ధనపూర్వకమైన ప్రార్థనలు మనం ఆశించిన విజయాలను ఇవ్వని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. కాబట్టి మనము పని చేస్తూ, మన ప్రార్థనలలో కొన్నింటికి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, వాటిని దేవుడు విన్నారని, బహుశా మనం కోరుకున్న సమయంలో లేదా విధానంలో కాకపోయినా వాటికి సమాధానం ఇస్తారని అపొస్తలుని వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నాను. కానీ సర్వజ్ఞులు మరియు శాశ్వతంగా దయగల తల్లిదండ్రులు ఇవ్వవలసిన సమయము మరియు విధానములో అవి ఎల్లప్పుడు జవాబివ్వబడతాయి. నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఎప్పుడూ నిద్రపోని, కునుకని2 ఆయన ఒక దివ్యమైన వ్యక్తి చెయ్యవలసిన దానికంటే ఎక్కువగా తన పిల్లలు ఆనందం మరియు అంతిమ మహోన్నతస్థితి పొందాలని జాగ్రత్త వహిస్తున్నారని దయచేసి అర్థం చేసుకోండి. స్వచ్ఛమైన ప్రేమ, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగియుండి, దేవుడు దయగల తండ్రి అని పేరు కలిగియున్నాడు.

“అలా అయితే, ఆయన ప్రేమ మరియు దయ చేత ఇశ్రాయేలీయుల సంతానము ఆరిన నేలమీద నడవడానికి ఎర్ర సముద్రం విడిపోయినంత తేలికగా మన కష్టాలను సులభతరం చేయకూడదా లేక తొలగించకూడదా? సంఘము యొక్క మొదటి సభ్యుల పంటలను నాశనం చేసిన మిడతలను తినడానికి సముద్రపుకాకులను పంపినట్లు మన 21వ శతాబ్ధపు సమస్యలను పరిష్కరించడానికి మనకు సహాయం చేయకూడదా?”

అలాంటి ప్రశ్నలకు సమాధానం “అవును, దేవుడు అద్భుతాలను తక్షణమే అందించగలడు, కానీ మన మర్త్య ప్రయాణ సమయాలు మరియు ఋతువులు నిర్దేశించుట కేవలము ఆయన పని అని త్వరగా లేదా ఆలస్యంగా మనం తెలుసుకుంటాము.” మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆ కాలపట్టికను ఆయన నిర్దేశిస్తారు. ప్రతి బలహీనమైన మనిషి బేతెస్ద3 కొలనులోకి ప్రవేశించడానికి ఎదురుచూస్తున్నప్పుడు తక్షణమే స్వస్థత పొందాడు, మరొకరు వాగ్దాన దేశములో ప్రవేశించడానికి 40 సంవత్సరాలు ఎడారిలో గడుపుతారు.4 ప్రతి నీఫై మరియు లీహై వారి విశ్వాసం5 మూలంగా వారిని చుట్టుముట్టిన అగ్నిజ్వాల నుండి దేవుని చేత రక్షించబడినప్పటికీ, తన విశ్వాసం మూలంగా రగులుచున్న మంటల చేత కాల్చబడిన ఒక అబినడైను మనము కలిగియున్నాము.6 బయలుదేవత7 యొక్క ప్రవక్తలకు విరోధముగా సాక్ష్యమివ్వడానికి క్షణికావేశంలో ఆకాశము నుండి అగ్నిని పిలిచిన ఏలియా, కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేని కాలాన్ని భరించాడు మరియు ఒక కాకి పంజాలో తీసుకువెళ్ళగల చాలీచాలని ఆహారం చేత పోషించబడ్డాడు.8 నా అంచనా ప్రకారం, మనం “సంతోషకరమైన భోజనం” అని పిలిచే దానికి అది ఏ మాత్రము సమానము కాదు.

ఇప్పుడు నేను వివరించడానికి ప్రయత్నిస్తున్న విషయము ఏమిటి? ఆ విషయం ఏమిటంటే, విశ్వాసం అంటే మంచి సమయాల్లో మరియు చెడు సమయాల్లో మన తరఫున ఆయన బాహువును మనం చూసేవరకు కొన్ని బాధలు అనుభవించవలసి ఉన్నప్పటికీ దేవుడిని విశ్వసించడం.9 మన ఆధునిక ప్రపంచంలో ఇది చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే జీవితంలో అన్నిటికంటే మంచి విషయం అన్ని బాధలను నివారించడమేనని, ఎవ్వరూ ఎప్పుడూ దేని గురించి బాధపడకూడదని చాలామంది నమ్ముతారు.10 కానీ “క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు”11 ఆ నమ్మకము ఎన్నటికీ దారితీయదు.

ఎల్డర్ నీల్ ఏ. మాక్స్‌వెల్ ఒకసారి చెప్పినదాన్ని సవరించడానికి మరియు విస్తరించడానికి ధైర్యం చేసినందుకు క్షమాపణలతో, నేను కూడా సూచించేదేమనగా, “ఒకరి జీవితం… విశ్వాసముతో నిండినది మరియు ఒత్తిడి లేనిదిగా ఉండజాలదు.” మరొక గ్లాసు నిమ్మరసం త్రాగుచూ, “ప్రభువా, నీకు నచ్చిన సద్గుణాలన్నీ నాకిమ్ము, కానీ నాకు దుఃఖం, వేదన, బాధ లేదా వ్యతిరేకత ఇవ్వకుండా ఉండమని చెప్పి జీవితంలో ఏ కష్టాలు అనుభవించకుండా ఉండాలంటే అది సాధ్యము కాదు. దయచేసి ఎవరైనా నన్ను ఇష్టపడకుండా ఉండనివ్వకుము లేదా నన్ను మోసం చేయనివ్వకుము, అన్నింటికంటే మించి నీ చేత లేదా నేను ప్రేమిస్తున్నవారి చేత విడిచిపెట్టబడునట్లు నన్ను ఎప్పుడూ అనుమతించకుము. వాస్తవానికి, ప్రభువా, నిన్ను దైవికంగా చేసిన అనుభవాలన్నిటి నుండి నన్ను దూరముంచకుండా జాగ్రత్త వహించుము. కానీ ఇతరుల యొక్క కఠినమైన ఒడిదుడుకులు గల జీవిత ప్రయాణము ముగిసినప్పుడు, దయచేసి నన్ను వచ్చి నీతో నివసించనిమ్ము, అక్కడ నా సౌకర్యవంతమైన క్రైస్తవ మతం అనే మేఘాలలో నేను సంతోషంగా తేలుతున్నప్పుడు మనం ఎంత సారూప్యంగా ఉన్నామో అని నేను గొప్పలు చెప్పుకోగలను.”12

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, క్రైస్తవ మతం ఓదార్పునిస్తుంది, కానీ తరచుగా అది సౌకర్యంగా ఉండదు. ఇక్కడ మరియు ఇకపై పరిశుద్ధతకు మరియు సంతోషానికి మార్గం సుదీర్ఘమైనది మరియు కొన్నిసార్లు రాళ్ళతో కూడినది. దానిలో నడవడానికి సమయం మరియు చిత్తశుద్ధి అవసరం. కానీ వాస్తవానికి, ఆ విధంగా చేయడం వలన కలిగే ప్రతిఫలం సువిశాలమైనది. ఈ సత్యము స్పష్టంగా మరియు ఒప్పించే విధంగా మోర్మన్ గ్రంథంలో ఆల్మా 32వ అధ్యాయంలో బోధించబడుతుంది. దేవుని వాక్యాన్ని మన హృదయాలలో కేవలం విత్తనంగా నాటితే, మరియు నీరుపోసి, కలుపు తీసి, పోషించి దానిని ప్రోత్సహించడానికి మనం తగినంత శ్రద్ధ వహిస్తే, అది భవిష్యత్తులో ఫలమును ఫలిస్తుంది, “అది మిక్కిలి శ్రేష్ఠమైనది, అది తియ్యనైన సమస్తము కంటే తియ్యనైనది,” దానిని ఆరగించడం ఆకలిదప్పులు లేని స్థితికి దారితీస్తుంది అని అక్కడ ఈ గొప్ప ప్రధాన యాజకుడు బోధిస్తున్నాడు.13

ఈ విశేషమైన అధ్యాయంలో చాలా పాఠాలు బోధించబడుతున్నాయి, కానీ వాటికి కేంద్రంగా విత్తనాన్ని పోషించాల్సిన సూత్రం ఉంది మరియు “దాని ఫలము కొరకు విశ్వాసముతో ఎదురుచూచుచు“ అది పరిపక్వం చెందడానికి మనం వేచియుండాలి.14 మన పంట, “క్రమక్రమముగా” 15వస్తుందని ఆల్మా బోధిస్తున్నాడు. మన హృదయాలలో దేవుని వాక్యాన్ని పెంపొందించుకోవడంలో శ్రద్ధ మరియు సహనంతో “చెట్టు మీకు ఫలము ఫలించు వరకు … దీర్ఘశాంతముతో” “కనిపెట్టుచుండుము” అని మూడుసార్లు పిలుపునివ్వడం ద్వారా అతడు తన గొప్ప సూచనను ముగించడంలో ఆశ్చర్యపోనవసరం లేదు.16

కోవిడ్ మరియు క్యాన్సర్, సందేహం మరియు నిరాశ, ఆర్థిక ఇబ్బందులు మరియు కుటుంబ పరీక్షలు. ఈ భారాలు ఎప్పుడు తీసివేయబడతాయి? దానికి సమాధానం “క్రమ క్రమముగా.”17 అది స్వల్పకాలమా లేదా సుదీర్ఘమైనదా అని చెప్పడం ఎల్లప్పుడూ మనకు సాధ్యం కాదు, కానీ యేసు క్రీస్తు సువార్తను విడిచిపెట్టక దానిని అంటిపెట్టుకొనియుండు వారికి దేవుని కృప చేత దీవెనలు కలుగును. ఆ దీవెనలను పొందే సమస్య చాలా వ్యక్తిగతమైన తోటలో మరియు చాలాకాలం క్రితం యెరూషలేములోని బహిరంగ కొండపై పరిష్కరించబడింది.

మన ప్రియమైన ప్రవక్త ఈ సమావేశాన్ని ముగించగా ఆయననుండి మనం విన్నప్పుడు, ఆయన తన జీవితమంతా ప్రదర్శించినట్లుగా, “ప్రభువు కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు”18 అని మనం జ్ఞాపకము చేసుకుందాము. మీ దుఃఖాల నుండి ఉపశమనమును, మీ శోకం నుండి స్వేచ్ఛను కోరుకునే మీలో ప్రతి ఒక్కరికి ఆ దీవెనలు “క్రమ క్రమముగా”—త్వరలోనైనా లేదా ఆలస్యంగానైనా రావాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను దేవుని ప్రేమకు మరియు ఆయన అద్భుతమైన సువార్త యొక్క పునఃస్థాపనకు సాక్ష్యమిస్తున్నాను, అది మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఏదోవిధంగా జవాబైయుంటుంది. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క విమోచన నామములో, ఆమేన్.