సర్వసభ్య సమావేశము
అక్కడ ఆహారముండెను
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


అక్కడ ఆహారముండెను

మనం భౌతికంగా సిద్ధపడేందుకు కోరుకున్నప్పుడు, జీవితపు శ్రమలను మనం అధిక విశ్వాసంతో ఎదుర్కోగలము.

ప్రస్తుత మహమ్మారి వలన కలిగిన ప్రయాణ ఆంక్షలకు ముందు నేనొక అంతర్జాతీయ నియామకం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ప్రయాణవేళల్లో మార్పు కారణంగా ఆదివారం విరామం దొరికింది. ప్రయాణం మధ్యలో ఒక స్థానిక సంస్కార సమావేశానికి హాజరయ్యేందుకు నాకు సమయం దొరికింది, అక్కడ నేను ఒక చిన్న సందేశాన్ని కూడా పంచుకోగలిగాను. సమావేశం తర్వాత ఒక ఔత్సాహిక పరిచారకుడు నా దగ్గరకు వచ్చి, నాకు అధ్యక్షులు నెల్సన్ తెలుసా అని, నేనెప్పుడైనా ఆయనతో కరచాలనం చేసానా అని అడిగాడు. ఆయన నాకు తెలుసని, నేను ఆయనతో కరచాలనం చేసానని, అధ్యక్షత్వం వహించు బిషప్రిక్కులో ఒక సభ్యునిగా ప్రతివారం రెండుసార్లు అధ్యక్షులు నెల్సన్‌ను, ఆయన సలహాదారులను కలిసే అవకాశం నేను కలిగియున్నానని జవాబిచ్చాను.

అప్పుడు ఆ యౌవన పరిచారకుడు కుర్చీలో కూర్చొని, గాలిలో చేతులు ఎగరేస్తూ, ”ఇది నా జీవితంలో అతిగొప్ప దినం!” అని అరిచాడు. సహోదర సహోదరీలారా, నేను గాలిలో నా చేతులు ఎగరేస్తూ అరవకపోవచ్చు, కానీ జీవించియున్న ప్రవక్త కొరకు, ప్రత్యేకించి సవాలుతో కూడిన సమయాల్లో మనం ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారుల నుండి పొందే నడిపింపు కొరకు నేను నిత్యము కృతజ్ఞత కలిగియున్నాను.

ఆది నుండి, ఈ మర్త్య అనుభవంలో భాగంగా వస్తాయని ఆయన ఎరిగియున్న విపత్తులు, శ్రమల కొరకు ఆత్మీయంగా, భౌతికంగా సిద్ధపడడంలో తన జనులకు సహాయపడేందుకు ప్రభువు నడిపింపు అందించారు. ఈ విపత్తులు స్వభావరీత్యా వ్యక్తిగతమైనవి లేక సాధారణమైనవి కావచ్చు, కానీ మనం ఆయన సలహాను విని, దానిని ఆచరణలో ఉంచినంత వరకు ప్రభువు యొక్క నడిపింపు రక్షణను, సహకారాన్ని అందిస్తుంది. ఆదికాండములోని ఒక వృత్తాంతములో అద్భుతమైన ఉదాహరణ ఇవ్వబడింది, అక్కడ మనం ఐగుప్తులోని యోసేపు గురించి, ఫరో కలకు అతడు చెప్పిన ప్రేరేపితమైన అర్ధము గురించి నేర్చుకుంటాము.

“మరియు యోసేపు ఫరోతో ఇట్లనెను, … దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను. …

“ఇదిగో, ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి:

“మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును.” 1

యోసేపు చెప్పిన దానిని విని, దేవుడు కలలో అతనికి చూపిన దానిపట్ల స్పందించి, రాబోవు దాని కొరకు ఏదైనా చేయడానికి ఫరో వెంటనే సిద్ధపడనారంభించాడు. అప్పుడు లేఖనములు ఇలా నమోదు చేసాయి:

“సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.

“యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చెను. …

“యోసేపు సముద్రపు ఇసుకవలె అతివిస్తారముగా ధాన్యము పోగుచేసెను, … కొలుచుట అసాధ్యమాయెను గనుక కొలుచుట మానివేసెను.” 2

సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములు గడిచిన తర్వాత, “ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెనని మనకు చెప్పబడింది, యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను” 3 అని మనము చెప్పబడ్డాము.

”రాబోవు” 4 విపత్తుల కొరకు మనం సిద్ధపడవలసిన అవసరాన్ని అర్థం చేసుకొని, వారి సలహాను అనుసరించే ప్రయత్నంలో మనం ఎదుర్కొనే పరిమితులను, ఆంక్షలను గుర్తించే ప్రవక్తల చేత నడిపించబడేందుకు నేడు మనం దీవించబడ్డాము.

కొవిడ్-19, అలాగే వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలు ప్రతి ఖండంలోని సంప్రదాయక, సామాజిక, మతపరమైన సరిహద్దులు దాటుకుంటూ ఎవరిపట్ల పక్షపాతం చూపవని స్పష్టమవుతోంది. ఉద్యోగాలు కోల్పోబడ్డాయి, పనిలో నుండి తొలగించబడడం వలన పనిచేసే అవకాశాలు ప్రభావితం చేయబడి ఆదాయాలు తగ్గిపోయాయి, ఆరోగ్య మరియు చట్టపరమైన సమస్యలతో పనిచేసే సామర్థ్యము ప్రభావితం చేయబడింది.

ప్రభావితం చేయబడిన వారందరికి వారి పరిస్థితిపట్ల సానుభూతిని, విచారాన్ని, అలాగే ముందుముందు మంచి రోజులు వస్తాయనే దృఢవిశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాము. తమ సమూహాలలో భౌతిక అవసరాలు గల సభ్యులను వెదికే బిషప్పులు, శాఖాధ్యక్షులతో మీరు దీవించబడ్డారు, మీ జీవితాలను పునఃస్థాపించి, మీరు సిద్ధపాటు సూత్రాలను అన్వయిస్తున్నప్పుడు మిమ్మల్ని స్వావలంబన మార్గంలో ఉంచడానికి సహాయపడే సాధనాలు, వనరులకు వారు ప్రవేశం కలిగియున్నారు.

ఆర్థికవ్యవస్థలను అదేవిధంగా వ్యక్తిగత జీవితాలను పూర్తిగా నాశనం చేసిన మహమ్మారి గల నేటి వాతావరణంలో, అనేకమంది శ్రమపడుతున్నారనే వాస్తవాన్ని విస్మరించి, భవిష్యత్తు కోసం ఆహారము మరియు ధనము యొక్క నిల్వలను పెంచడం ఆరంభించండి అని వారిని అడగడం దయగల రక్షకుని స్వభావానికి విరుద్ధమైనది. అయినప్పటికీ, దానర్థం మనం సిద్ధపాటు సూత్రాలను శాశ్వతంగా విడిచిపెట్టాలని కాదు—ఈ సూత్రాలు “జ్ఞానమందు, క్రమమందు” 5 మాత్రమే అన్వయించబడాలి, ఆవిధంగా భవిష్యత్తులో మనం ఐగుప్తులోని యోసేపు వలె “అక్కడ ఆహారముండెను” 6 అని చెప్పవచ్చు.

మనం చేయగలిగిన దానికంటే అధికంగా చేయాలని ప్రభువు మన నుండి ఆశించరు, కానీ మనం చేయగలిగినప్పుడు, మనం చేయగల దానిని చేయాలని ఆయన ఆశిస్తారు. అధ్యక్షులు నెల్సన్ గత సర్వసభ్య సమావేశంలో మనకు గుర్తుచేసినట్లుగా,“ప్రభువు ప్రయత్నాన్ని ప్రేమిస్తున్నాడు.” 7

చిత్రం
వివిధ భాషలలో వ్యక్తిగత రాబడి చేతిపుస్తకము

“తగినంత ఆహారం, నీరు కలిగియుండి కొంత డబ్బును పొదుపు చేయడం ద్వారా జీవితంలో దుర్దశ కొరకు సిద్ధపడమని” 8 సంఘ నాయకులు తరచు కడవరి-దిన పరిశుద్ధులను ప్రోత్సహించారు. అదే సమయంలో, “జ్ఞానము” కలిగియుండి నిత్యావసరాల నిల్వను, ఆర్ధిక నిల్వను ఏర్పాటుచేసే మన ప్రయత్నాల్లో “పరిమితికి మించరాదని” 9 మనము ప్రోత్సహించబడ్డాము. స్వావలంబన కొరకు వ్యక్తిగత రాబడులు అను పేరుగల ఒక వనరు 2017లో ప్రచురించబడింది, ప్రస్తుతము అది 36 భాషలలో సంఘ వెబ్‌సైటులో లభ్యమవుతోంది, ప్రథమ అధ్యక్షత్వము నుండి ఒక సందేశముతో ప్రారంభమయ్యే అది ఇలా చెప్తుంది:

“’నా పరిశుద్ధులకు సమకూర్చుట నా ఉద్దేశమైయున్నది’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 104:15] అని ప్రభువు ప్రకటించారు. ఈ బయల్పాటు, ఆయన భౌతిక దీవెనలను అందించి, స్వావలంబన యొక్క ద్వారము తెరుస్తారని ప్రభువు నుండి ఒక వాగ్దానమైయున్నది. …

“… ఈ సూత్రాలను అంగీకరించి జీవించడం, ప్రభువు చేత వాగ్దానమివ్వబడిన భౌతిక దీవెనలు పొందడానికి మిమ్మల్ని సమర్థులను చేస్తుంది. …

“ఈ సూత్రాలను శ్రద్ధగా చదివి, అన్వయించమని, వాటిని మీ కుటుంబ సభ్యులకు బోధించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరావిధంగా చేసినప్పుడు, మీ జీవితం దీవించబడుతుంది … (ఎందుకంటే) మీరు పరలోకమందున్న మన తండ్రి యొక్క బిడ్డ. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టరు. ఆయన మిమ్మల్ని ఎరుగుదురు మరియు స్వావలంబన యొక్క ఆత్మీయ, భౌతిక దీవెనలను మీకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు.” 10

ఈ వనరులో ఇంకా ఆదాయవ్యయ పట్టికను తయారుచేసి కలిగినంతలో జీవించడం, కష్టాలలో మీ కుటుంబాన్ని కాపాడుకోవడం, ఆర్థిక సంక్షోభాన్ని నిర్వహించడం, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం, మరియు ఇంకా ఎన్నో విషయాలకు సంబంధించిన అధ్యాయాలున్నాయి, ఇది సంఘ వెబ్‌సైటులో లేదా మీ స్థానిక నాయకుల ద్వారా అందరికీ అందుబాటులో ఉంది.

సిద్ధపాటు సూత్రాలను పరిగణించినప్పుడు, ప్రేరణ కోసం ఐగుప్తులోని యోసేపు వైపు మనం చూడగలం. సమృద్ధిగల కాలంలో కొంతైనా త్యాగము చేయకుండా వారు “కరవు” కాలాన్ని గడపడానికి జరుగబోయే దానిని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఫరో ప్రజలు పండించగలిగిన మొత్తాన్ని వినియోగించడానికి బదులుగా వారి తక్షణ అవసరాలకు, అలాగే భవిష్యత్ అవసరాలకు తగినంత అందిస్తూ పరిమితులు ఏర్పాటు చేయబడి, అనుసరించబడ్డాయి. సవాళ్ళతో కూడిన సమయాలు వస్తాయని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. వారు అమలు చేయాలి, వారి ప్రయత్నం వలన, “అక్కడ ఆహారముండెను.” 11

“అయితే దీని నుండి ఏమి నేర్చుకోవచ్చు?” అనే ముఖ్యమైన ప్రశ్నకు ఇది దారితీస్తుంది. ప్రభువుకు అన్ని విషయాలు ఆత్మీయమైనవని, మరియు ఆయన మనకు భౌతికమైన ధర్మశాస్త్రమును ఎన్నడూ ఇవ్వలేదని 12 గ్రహించడం ప్రారంభించుటకు ఒక మంచి స్థలము. అప్పుడు, మన భౌతిక సిద్ధపాటు కొరకు కూడా మనం నిర్మించవలసిన పునాది యేసు క్రీస్తేనని ప్రతిది ఆయన వైపు చూపుతుంది.

భౌతికంగా సిద్ధపడి, స్వావలంబన కలిగియుండడమంటే అర్థము, “యేసు క్రీస్తు యొక్క కృప లేక అధికారిక శక్తి మరియు మన స్వంత ప్రయత్నం ద్వారా మనకు, మన కుటుంబాలకు కావలసిన ఆత్మీయ, భౌతిక జీవితావసరాలన్నీ మనం పొందగలమని నమ్మడం” 13 .

భౌతిక సిద్ధపాటు కొరకు ఆత్మీయ పునాది యొక్క అదనపు అంశాలు “జ్ఞానమందు, క్రమమందు” 14 పనిచేయడాన్ని కలిగియున్నాయి, అనగా కాలం గడిచేకొద్దీ క్రమంగా ఆహారం నిల్వ చేయడం, పొదుపు చేయడం, అలాగే ”చిన్న మరియు సాధారణ” పద్ధతులను 15 హత్తుకోవడం. చిన్నవైనా నిలకడ గల మన ప్రయత్నాలను ప్రభువు హెచ్చిస్తారనే విశ్వాసానికి అది నిరూపణ.

ఆత్మీయ పునాదిని సరైన స్థానంలో ఉంచినప్పుడు, భౌతిక సిద్ధపాటు యొక్క రెండు ముఖ్యాంశాలను మనం విజయవంతంగా అన్వయించగలము—రాబడులను సంభాళించడం మరియు నిత్యావసరాలను నిల్వ చేయడం.

మీ రాబడులను తగినవిధంగా సంభాళించడానికి గల ముఖ్య సూత్రాలలో దశమభాగములు, అర్పణలు చెల్లించడం, అప్పులను తీర్చివేయడం మరియు మానివేయడం, ఆదాయవ్యయ పట్టికను తయారుచేసి, కలిగినంతలో జీవించడం; భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటివి ఉన్నాయి.

నిత్యావసరాలను నిల్వ చేయడానికి గల ముఖ్య సూత్రాలలో ఆహార నిల్వ, మంచినీటి నిల్వ, వ్యక్తిగత మరియు కుటుంబ అవసరాలను బట్టి ఇతర అవసరాల నిల్వ ఉన్నాయి, అన్నీ ఎందుకంటే ఇల్లే “శ్రేష్టమైన నిల్వగృహము,” 16 అది “అవసరమైన సమయాల్లో అత్యంత అందుబాటులో గల సంక్షేమనిధి” అవుతుంది. 17

మనము ఆత్మీయ సూత్రాలను హత్తుకొని, ప్రభువు నుండి ప్రేరేపణను వెదకినప్పుడు, వ్యక్తిగతంగా మరియు కుటుంబాలుగా మన కొరకు ప్రభువు యొక్క చిత్తాన్ని మరియు భౌతిక సిద్ధపాటు యొక్క ముఖ్యసూత్రాలను ఎంత బాగా అన్వయించవచ్చో తెలుసుకోవడానికి మనం నడిపించబడతాము. ఆరంభించడమే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన మెట్టు.

ఇలా చెప్పినప్పుడు ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఈ సూత్రాన్ని బోధించారు: “చర్య తీసుకోవడమంటే విశ్వాసాన్ని సాధన చేయడం. … నిజమైన విశ్వాసం ప్రభువైన యేసు క్రీస్తుయందు మరియు పైన కేంద్రీకరించబడుతుంది మరియు ఎల్లప్పుడూ క్రియకు దారితీస్తుంది.” 18

సహోదర సహోదరీలారా, నిరంతరం-మార్పుచెందుతున్న లోకంలో మనం అనిశ్చిత పరిస్థితుల కొరకు తప్పక సిద్ధపడాలి. ముందుముందు మంచి రోజులు ఉన్నప్పటికీ, మర్త్యత్వము యొక్క మంచి సమయాలు, కష్ట సమయాలు కొనసాగుతాయని మనకు తెలుసు. భౌతికంగా సిద్ధపడి ఉండేందుకు మనం కోరుకున్నప్పుడు, మన హృదయాలలో అధికమైన విశ్వాసంతో, శాంతితో జీవితపు శ్రమలను మనం ఎదుర్కోగలం మరియు ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కూడా ఐగుప్తులోని యోసేపు వలె, “అక్కడ ఆహారముండెను” 19 అని చెప్పగలుగుతాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.