సర్వసభ్య సమావేశము
దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము

మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? దేవుడిని మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనిచ్చేందుకు మీరు సమ్మతిస్తున్నారా?

నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈ సమావేశపు అద్భుతమైన సందేశాల కొరకు, ఇప్పుడు మీతో మాట్లాడేందుకు నాకు గల విశేషాధికారం కొరకు నేనెంతో కృతజ్ఞుడిని.

36 ఏళ్ళకు పైగా నేను అపొస్తలునిగా ఉన్నాను, ఇశ్రాయేలును సమకూర్చే సిద్ధాంతము నాకు ఆసక్తిని కలిగించింది.1 దాని గురించి ప్రతిది నన్ను ఆశ్చర్యపరచింది, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల పరిచర్యలు, పేర్లు2; వారి జీవితాలు, వారి భార్యలు; దేవుడు వారితో చేసిన నిబంధన, వారి వంశము ద్వారా దానిని విస్తరింప చేయడం;3 పన్నెండు గోత్రములు చెదిరియుండుట; మరియు మన కాలములో సమకూర్చుట గురించి అసంఖ్యాక ప్రవచనాలు అన్నీ ఆశ్చర్యపరిచాయి.

నేను సమకూర్చుట గురించి అధ్యయనం చేసాను, ప్రార్థించాను, దానికి సంబంధించిన ప్రతి లేఖనంపై విందారగించాను, నా గ్రహింపును హెచ్చించమని ప్రభువును అడిగాను.

కాబట్టి ఇటీవల నేను క్రొత్త అంతరార్థానికి నడిపించబడినప్పుడు నా ఆనందాన్ని ఊహించండి. ఇద్దరు హెబ్రీయ పండితుల సహాయంతో, ఇశ్రాయేలు అనే పదానికి గల హెబ్రీయ అర్థాలలో ఒకటి “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము“4 అని నేను తెలుసుకున్నాను. ఆ విధంగా ఇశ్రాయేలు అనే పేరు అతడు లేక ఆమె జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించే వ్యక్తిని సూచిస్తుంది. ఈ ఆలోచన నన్ను బలంగా ప్రేరేపిస్తోంది!

ఇశ్రాయేలు మాట వివరణకు సమ్మతించు అనే పదం ముఖ్యమైనది.5 మనమందరం కర్తృత్వాన్ని కలిగియున్నాం. ఇశ్రాయేలుగా అయ్యేందుకు మనం ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు. మన జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మనం ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు. దేవుడిని మన జీవితాల్లో అత్యంత శక్తివంతమైన ప్రభావంగా ఉండనిచ్చేందుకు మనం ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు.

ఒక్క క్షణం, అబ్రాహాము మనవడైన యాకోబు జీవితంలో ముఖ్యమైన మలుపును మనం గుర్తుచేసుకుందాం. యాకోబు పెనూయేలు (అనగా “దేవుని ముఖము” అని అర్థము),6 అని పిలిచిన ప్రదేశంలో ఒక గంభీరమైన సవాలుతో పెనుగులాడాడు. అతని కర్తృత్వము పరీక్షించబడింది. ఈ పెనుగులాట ద్వారా, అతనికేది అత్యంత ముఖ్యమైనదో యాకోబు నిరూపించాడు. అతని జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతిస్తున్నాడని అతడు రుజువు చేసాడు. దానికి జవాబుగా, దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు,7 దానర్థము “దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనిమ్ము.” అప్పుడు అబ్రాహాముకు వాగ్దానమివ్వబడిన దీవెనలు అన్నీ అతనికి కూడా చెందుతాయని దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానమిచ్చాడు.8

దురదృష్టవశాత్తూ, ఇశ్రాయేలు సంతతి దేవునితో వారి నిబంధనలను అతిక్రమించారు. వారు ప్రవక్తలను రాళ్ళతో కొట్టారు మరియు వారి జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించలేదు. అనంతరం, దేవుడు వారిని భూమి యొక్క నాలుగు దిగంతములకు చెదరగొట్టాడు.9 “నిమిషమాత్రము నేను నిన్ను (ఇశ్రాయేలు) విసర్జించితిని; గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను” అని యెషయా చెప్పినట్లుగా కనికరముతో వారిని సమకూర్చుతానని తరువాత ఆయన వాగ్దానమిచ్చాడు.10

ఇశ్రాయేలు యొక్క హెబ్రీయ అర్థాన్ని మనస్సులో ఉంచుకున్నప్పుడు, ఇశ్రాయేలును సమకూర్చుటకు అదనపు అర్థాన్ని మనం కనుగొంటాము. వారి జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించేవారిని ప్రభువు సమకూర్చుతున్నాడు. దేవుడిని తమ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనిచ్చేందుకు ఎంచుకొను వారిని ప్రభువు సమకూర్చుతున్నాడు.

శతాబ్దాలుగా, ప్రవక్తలు ఈ సమకూర్చుట గురించి ముందుగా చెప్పారు,11 అది ఇప్పుడు జరుగుతోంది! ప్రభువు యొక్క రెండవ రాకడకు ముందు తప్పనిసరిగా జరుగవలసినదిగా, ఇది లోకంలో అత్యంత ముఖ్యమైన కార్యము!

ఈ పూర్వ-సహస్రాబ్ది సమకూర్చుట మిలియన్లమంది జనులకు విశ్వాసాన్ని విస్తరించి, ఆత్మీయ ధైర్యాన్నిచ్చే వ్యక్తిగత వీరగాథ వంటిది. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా లేక “నిబంధన చేసిన కడవరి-దిన ఇశ్రాయేలుగా,“12 ఈ అతిముఖ్య కార్యములో ప్రభువుకు సహకరించడానికి మనం నియమించబడ్డాము.13

తెరకు ఇరువైపుల ఇశ్రాయేలును సమకూర్చుట గురించి మనం మాట్లాడినప్పుడు, మనం సువార్త, దేవాలయం, కుటుంబ చరిత్ర కార్యాల గురించి సూచిస్తున్నాము. ఎవరితోనైతే మనం జీవించి, పనిచేసి, సేవచేస్తామో వారి హృదయాలలో విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని నిర్మించడం గురించి కూడా మనం సూచిస్తున్నాము. తెరకు ఎటువైపునైనా—దేవునితో వారి నిబంధనలు చేయడానికి మరియు పాటించడానికి—ఎవరికైనా సహాయపడేందుకు ఎప్పుడైనా మనమేదైనా చేసినప్పుడు, మనం ఇశ్రాయేలును సమకూర్చడానికి సహాయపడుతున్నాం.

కొద్దికాలం క్రితం, మా మనవళ్ళలో ఒకరి భార్య ఆత్మీయంగా శ్రమపడింది. నేను ఆమెను “జిల్” అని పిలుస్తాను. ఉపవాసం, ప్రార్థన చేసి, యాజకత్వ దీవెనలు ఇచ్చినప్పటికీ జిల్ తండ్రి మరణించబోతున్నారు. తన తండ్రిని, తన సాక్ష్యాన్ని రెండిటిని కోల్పోతానేమోనని ఆమె చాలా భయపడింది.

జిల్ పరిస్థితి గురించి ఒకరోజు సాయంత్రం నా భార్యయైన సహోదరి వెండీ నెల్సన్ నాతో చెప్పింది. ఆమె ఆత్మీయ పెనుగులాటకు నా జవాబు ఒక్క పదమని మరుసటి ఉదయం జిల్‌తో చెప్పాలని వెండీ ప్రేరేపించబడింది. ఆ పదము సమీపదృష్టి.

మొదట నా జవాబుతో ఆమె సర్వనాశనమయ్యిందని జిల్ ఆ తరువాత వెండీతో చెప్పింది. “మా నాన్న కోసం తాతయ్య ఒక అద్భుతాన్ని వాగ్దానమిస్తారని నేనాశించాను. సమీపదృష్టి అనే పదాన్ని మాత్రమే చెప్పాలని ఆయన ఎందుకు బలవంతం చేయబడ్డారని నేను ఆశ్చర్యపడుతున్నాను” అని ఆమె అన్నది.

జిల్ తండ్రి మరణించిన తర్వాత, ఆమె సమీపదృష్టి అనే పదం గురించి ఆలోచించసాగింది. సమీపదృష్టి అంటే అర్థము “దూరదృష్టి లేకపోవడమని” మరింత ఎక్కువగా లోతుగా గ్రహించడానికి ఆమె తన మనస్సును తెరిచింది. ఆమె ఆలోచన మరలడం ప్రారంభమైంది. అప్పుడు జిల్ ఇలా చెప్పింది, “సమీపదృష్టి నన్ను ఆగి, ఆలోచించి, స్వస్థపడేలా చేసింది. ఆ పదం ఇప్పుడు నన్ను సమాధానంతో నింపుతుంది. నా దృష్టిని విస్తరించి, నిత్య దీవెనలు వెదకాలని నాకు గుర్తుచేస్తుంది. ఒక దైవిక ప్రణాళిక ఉందని, మా నాన్న ఇంకా జీవించియున్నారని, నన్ను ప్రేమిస్తున్నారని, నా కోసం చూస్తున్నారని అది నాకు గుర్తుచేస్తుంది. సమీపదృష్టి నన్ను దేవుని వైపు నడిపించింది.”

అమూల్యమైన మా మనవరాలిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఆమె జీవితంలో గుండెను మెలిపెట్టే ఈ సమయంలో, తన జీవితం కొరకు నిత్యదృష్టితో ఆమె తండ్రి పట్ల దేవుని చిత్తాన్ని అంగీకరించడాన్ని ప్రియమైన జిల్ నేర్చుకుంటోంది. దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడాన్ని ఎంచుకోవడం ద్వారా ఆమె సమాధానాన్ని కనుగొంటున్నది.

మనం దానిని అనుమతించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క హెబ్రీయ వివరణ మనకు సహాయపడగల విధానాలు అనేకమున్నాయి. ఈ ఆలోచన మనస్సులో ఉన్నప్పుడు, మన సువార్తికుల కోసం—ఇశ్రాయేలును సమకూర్చే మన ప్రయత్నాల కోసం—మన ప్రార్థనలు ఎలా మారగలవో ఊహించండి. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సత్యాలను పొందడానికి సిద్ధం చేయబడిన వారి వద్దకు మనల్ని, సువార్తికులను నడిపించమని మనం తరచు ప్రార్థిస్తాం. వారి జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించేవారిని కనుగొనడానికి మనం అభ్యర్థించినప్పుడు, మనం ఎవరివైపు నడిపించబడతాము? అని నేను ఆశ్చర్యపడుతున్నాను.

ఎన్నడూ దేవునిని లేక యేసు క్రీస్తును నమ్మకపోయినా, ఇప్పుడు వారి గురించి, వారి సంతోష ప్రణాళిక గురించి తెలుసుకోవాలని ఆకాంక్షించే వారి వద్దకు మనం నడిపించబడవచ్చు. ఇతరులు “నిబంధనలో జన్మించియుండవచ్చు,”14 కానీ నిబంధన బాట నుండి దూరంగా తిరుగులాడుతుండవచ్చు. వారిప్పుడు పశ్చాత్తాపపడి తిరిగిరావడానికి, దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సిద్ధంగా ఉండియుండవచ్చు. స్నేహపూర్వకంగా వారిని ఆహ్వానించి, ప్రేమించడం ద్వారా మనం వారికి సహాయపడగలము. మనం నడిపించబడే మరికొంతమంది ఎప్పుడూ వారి జీవితాల్లో ఏదో కోల్పోయినట్లుగా భావించే వారైయుండవచ్చు. వారు కూడా తమ జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించే వారికి వచ్చే పరిపూర్ణత మరియు ఆనందం కోసం ఆశిస్తున్నారు.

చెదిరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చడానికి సువార్తకు చాలా విస్తారమైన సామర్థ్యముంది. యేసు క్రీస్తు యొక్క సువార్తను పూర్తిగా హత్తుకొనే ప్రతిఒక్కరికి చోటుంది. పరివర్తన చెందిన ప్రతిఒక్కరు జన్మతః లేక దత్తత ద్వారా దేవుని నిబంధన పిల్లల్లో ఒకరవుతారు.15 విశ్వాసులైన ఇశ్రాయేలు సంతానానికి దేవుడు వాగ్దానమిచ్చిన వాటన్నిటికి ప్రతిఒక్కరు పూర్తి వారసులవుతారు.16

ప్రతిఒక్కరు దేవుని సంతానమైనందున మనలో ప్రతిఒక్కరు దైవిక సామర్థ్యాన్ని కలిగియున్నారు. ఆయన దృష్టిలో అందరు సమానము. ఈ సత్యము యొక్క అంతరార్థములు లోతైనవి. సహోదర సహోదరీలారా, నేను చెప్పబోయే దానిని జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక జాతిని మరొకదాని కంటే ఎక్కువగా ప్రేమించడు. ఈ విషయంపై ఆయన సిద్ధాంతము స్పష్టమైనది. ఆయన “నల్లవాడిని తెల్లవాడిని, దాసుని స్వతంత్రుని, పురుషుని స్త్రీని” అందరినీ తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు.17

దేవుని యెదుట మీ స్థానము మీ చర్మపు రంగును బట్టి నిర్థారించబడదని నేను మీకు హామీ ఇస్తున్నాను. దేవుని అనుగ్రహము ఉండుట, లేకపోవుట అనేది దేవుని పట్ల మరియు ఆయన ఆజ్ఞల పట్ల మన భక్తిపై ఆధారపడుతుంది, కానీ మన చర్మపు రంగుపై కాదు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన నల్ల సహోదర సహోదరీలు జాతివివక్ష మరియు దురభిమానపు బాధలను సహిస్తున్నందుకు నేను దుఃఖిస్తున్నాను. వేరు చేయు వైఖరులు మరియు దురభిమానపు చర్యల నుండి బయటకు నడిపించమని ప్రతిచోటనున్న మన సభ్యులకు నేడు నేను పిలుపునిస్తున్నాను. దేవుని పిల్లలందరి పట్ల గౌరవాన్ని ప్రోత్సహించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.

జాతితో సంబంధం లేకుండా మనలో ప్రతిఒక్కరిని అడిగే ప్రశ్న ఒక్కటే. మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? దేవునిని మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? ప్రతిరోజు మీరు చేసేవాటిని ప్రభావితం చేయడానికి ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలను మీరు అనుమతిస్తారా? ఇతర వాటికంటే ఆయన స్వరము ప్రాధాన్యత సంతరించుకొనేలా మీరు అనుమతిస్తారా? మీరు చేయాలని ఆయన కోరేదానిని మీ ఆశయాలన్నిటి కంటే అతిముఖ్యమైనదానిగా భావించడానికి మీరు సమ్మతిస్తున్నారా? మీ చిత్తము ఆయన చిత్తమందు ఉపసంహరించబడడానికి మీరు సమ్మతిస్తున్నారా? 18

అటువంటి సమ్మతి మిమ్మల్ని ఏవిధంగా దీవించగలదో ఆలోచించండి. మీరు అవివాహితులైయుండి నిత్య సహవాసిని వెదుకుతున్నట్లయితే, ఎవరిని ఎలా కలవాలో నిర్ణయించడానికి “ఇశ్రాయేలులో” భాగమవ్వాలనే మీ కోరిక మీకు సహాయపడుతుంది.

మీరు వివాహమాడిన వారు అతడు లేక ఆమె నిబంధనలను అతిక్రమించినట్లయితే, మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీ సమ్మతి దేవునితో మీ నిబంధనలు చెక్కుచెదరకుండా నిలిపేందుకు అనుమతిస్తుంది. విరిగిన హృదయముగల వారిని రక్షకుడు బాగుచేస్తాడు. ఎలా ముందుకు సాగాలని తెలుసుకోవడానికి మీరు వెదికినప్పుడు పరలోకాలు తెరువబడతాయి. మీరు తిరుగులాడనవసరం లేదు, ఆశ్చర్యపడనవసరం లేదు.

దేవునికి ప్రాధాన్యతనివ్వడానికి మీరు ఎంచుకొనినప్పుడు సువార్త లేక సంఘం గురించి మీకు నిజాయితీగల ప్రశ్నలున్నట్లయితే, ఖచ్ఛితమైన నిత్య సత్యాలను కనుగొని గ్రహించడానికి మీరు నడిపించబడతారు, అవి మీ జీవితానికి దారిచూపి నిబంధన బాటపై స్థిరంగా ఉండేందుకు మీకు సహాయపడతాయి.

మీరు శోధనను ఎదుర్కొన్నప్పుడు—మీరు అలసిపోయి, ఒంటరిగా భావించినప్పుడు లేక అపార్థం చేసుకోబడినప్పుడు శోధన వచ్చినా కూడా—మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు ఎంచుకొనినప్పుడు, మిమ్మల్ని బలపరచమని ఆయనను అభ్యర్థించినప్పుడు మీరెంత ధైర్యంగా ఉండగలరో ఊహించండి.

దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం, ఇశ్రాయేలులో భాగమవ్వడమే మీ ముఖ్యమైన కోరికైనప్పుడు, అనేక నిర్ణయాలు తేలికవుతాయి. అనేక సంగతులు అప్రాధాన్యమవుతాయి! మిమ్మల్ని మీరు మంచిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఏది చూడాలో, ఏది చదవాలో, ఎక్కడ మీ సమయాన్ని గడపాలో, ఎవరితో సహవాసం చేయాలో మీకు తెలుస్తుంది. మీరు ఏం సాధించాలని కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. నిజంగా మీరు ఎలాంటి వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నారో మీకు తెలుస్తుంది.

ఇప్పుడు, నా ప్రియ సహోదర సహోదరీలారా, దేవునికి ప్రాధాన్యతనివ్వడానికి విశ్వాసము, ధైర్యము కావాలి. పశ్చాత్తాపపడడానికి, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించడానికి పట్టుదలగల, కఠోరమైన ఆత్మీయ కార్యము కావాలి.19 సువార్తను అధ్యయనం చేయడానికి, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుల గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి, వ్యక్తిగత బయల్పాటును వెదికి దానికి స్పందించడానికి తగిన వ్యక్తిగత అలవాట్లను వృద్ధి చేయడానికి స్థిరమైన అనుదిన ప్రయత్నం అవసరం.

అపొస్తలుడైన పౌలు ప్రవచించినట్లుగా ఈ అపాయకరమైన కాలాల్లో,20 దేవుని ప్రణాళికపై అతని దాడులను మరుగుచేయాలని సాతాను ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. అనేక చెడ్డ ఆలోచనలు లోకంలో ప్రఖ్యాతిగాంచాయి. కాబట్టి, మన జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి, ఆయన స్వరమును వినడం నేర్చుకోవడానికి, ఇశ్రాయేలును సమకూర్చడంలో సహాయపడేందుకు మన శక్తిని ఉపయోగించడానికి నిర్థారించుకోవడమే ఆత్మీయంగా జీవించడానికి గల ఏకైక మార్గము.

ఇప్పుడు, దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించేవారి గురించి ప్రభువు ఎలా భావిస్తున్నాడు? నీఫై దానిని బాగా చెప్పాడు: “ఆయనను తమ దేవునిగా అంగీకరించు వారిని (ప్రభువు) ప్రేమించును. ఆయన మన పితరులను ప్రేమించెను, వారితో అనగా అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులతో నిబంధన చేసెను; తాను చేసిన నిబంధనలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను.”21

ఇశ్రాయేలుకు ఏమి చేయాలని ప్రభువు సమ్మతించుచున్నాడు? ఆయన “(మన) యుద్ధములను, (మన) పిల్లల యుద్ధములను, (మన) పిల్లల పిల్లల (యుద్ధములను) … మూడవ నాలుగవ తరము వరకు పోరాడెదను”! అని ప్రభువు ప్రతిజ్ఞ చేసారు.22

వచ్చే ఆరు నెలల్లో మీరు మీ లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, నిబంధన చేసిన ఇశ్రాయేలీయుల కోసం చేస్తానని ప్రభువు వాగ్దానం చేసిన వాటన్నిటిని జాబితా చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు దిగ్భ్రాంతి చెందుతారని నేననుకుంటున్నాను! ఈ వాగ్దానాలను ధ్యానించండి. మీ కుటుంబంతో, స్నేహితులతో వాటి గురించి మాట్లాడండి. మీ స్వంత జీవితంలో ఈ వాగ్దానాల నెరవేర్పు కోసం వేచిచూస్తూ జీవించండి.

నా ప్రియ సహోదర సహోదరీలారా, మీ జీవితాలలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు ఎంచుకున్నప్పుడు, మన దేవుడు “అద్భుతాలు చేయు దేవుడు“23 అని మీకైమీరు అనుభవాన్ని పొందుతారు. జనులుగా, మనం ఆయన నిబంధన పిల్లలం, ఆయన పేరుతో మనం పిలువబడతాం. ఈ సంగతుల గురించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. ఒక అపొస్తలునిగా నా 36 సంవత్సరాల కాలంలో నేను ఇచ్చిన 800 లకు పైగా సందేశాలలో కనీసం 378 సందేశాలలో నేను ఇశ్రాయేలు గురించి మాట్లాడాను.

  2. హెబ్రీ భాషలో, అబ్రాము అనునది ఘనమైన పేరు, దానర్థము “ఉన్నతమైన తండ్రి.“ కానీ ఆ పేరును దేవుడు అబ్రాహాముగా మార్చినప్పుడు అది ఇంకా ప్రాముఖ్యతను సంతరించుకుంది, దానర్థము “అనేక జనములకు తండ్రి.“ నిజానికి అబ్రాహాము “అనేక జనములకు తండ్రి“యై యుండవలెను. (ఆదికాండము 17:5; నెహెమ్యా 9:7 చూడండి.)

  3. లోక రక్షకుడు అబ్రాహాము సంతానము ద్వారా పుట్టునని, నిర్ణీత స్థలములు వారసత్వముగా వచ్చునని, సమస్త జనములు అబ్రాహాము వంశము ద్వారా దీవించబడునని ప్రభువును దేవుడైన యెహోవా అబ్రాహాముతో ఒక నిబంధన చేసెను (Bible Dictionary, “Abraham, covenant of” చూడండి).

  4. Bible Dictionary, “Israel” చూడండి.

  5. ఇశ్రాయేలు అను పదము లేఖనములలో వెయ్యి కంటే ఎక్కువసార్లు అగుపడుతుంది. ఇది 12 మంది కుమారులు మరియు కుమార్తెలు గల యాకోబు (ఇశ్రాయేలు) కుటుంబానికి అన్వయించబడగలదు (ఆదికాండము 35:23–26; 46:7 చూడండి). నేడు ఇది భౌగోళికంగా భూగ్రహం మీద ఒక ప్రదేశానికి అన్వయించబడగలదు. కానీ దాని సిద్ధాంతపరమైన ఉపయోగం వారి జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యమిచ్చేందుకు సమ్మతించిన జనులకు అన్వయిస్తుంది.

  6. ఆదికాండము 32:30; ఆదికాండము 32:31 లో పెనూయేలుగా కూడా చెప్పబడింది.

  7. ఆదికాండము 32:28 చూడండి.

  8. ఆదికాండము 35:11–12 చూడండి.

  9. అదనపు అధ్యయనం కొరకు, Topical Guide, “Israel, Scattering of” చూడండి.

  10. యెషయా 54:7.

  11. యెషయా 11:11–12; 2 నీఫై 21:11–12; మోషైయ 15:11 చూడండి.

  12. Encyclopedia of Mormonism (1992), “Covenant Israel, Latter-Day,” 1:330–31 చూడండి.

  13. ఇశ్రాయేలును సమకూర్చుటలో మనం పాల్గొనినప్పుడు, సమకూడిన వారిని వర్ణించడానికి ప్రభువు ఒక అద్భుతమైన విధానాన్ని కలిగియున్నారు. ఆయన మనందరిని కలిపి ఆయన ”స్వకీయ ధనముగా,” (నిర్గమకాండము 19:5; కీర్తనలు 135:4), ఆయన ”స్వకీయ సంపాద్యముగా,” (మలాకీ 3:17; సిద్ధాంతము మరియు నిబంధనలు 101:3), “పరిశుద్ధ జనముగా” (నిర్గమకాండము 19:6 సూచించారు; (ద్వితీయోపదేశకాండము 14:2; 26:18 కూడా చూడండి).

  14. “నీ సంతానమందు భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదింపబడుదురు“ (3 నీఫై 20:27) అని చెప్పుచూ దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను ఈ వాక్యభాగము సూచిస్తుంది. “నిబంధనలో జన్మించుట“ అనగా ఒక వ్యక్తి జన్మించడానికి ముందే ఆ వ్యక్తి తల్లిదండ్రులు దేవాలయంలో ముద్రించబడిరని అర్థము.

  15. అటువంటి వాగ్దానము అబ్రాహాముకు దేవునిచేత బోధించబడింది: “ఈ సువార్తను అంగీకరించు వారందరు నీ నామముతో పిలువబడి, నీ సంతానముగా యెంచబడుదురు, వారు లేచి తమ తండ్రిగా నిన్ను ఘనపరిచెదరు” (అబ్రాహాము 2:10; రోమా 8:14–17; గలతీయులకు 3:26–29 కూడా చూడండి).

  16. విశ్వాసముగల ప్రతి సభ్యుడు గోత్రజనకుని దీవెన కొరకు అభ్యర్థించవచ్చు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా గోత్రజనకుడు ఇశ్రాయేలీయులలో ఆ వ్యక్తి వంశమును ప్రకటించును. ఆ ప్రకటన అతని లేక ఆమె వంశము, జాతీయత లేక జన్యుపరమైన స్వభావాన్ని ప్రకటించవలసిన అవసరం లేదు. బదులుగా, ప్రకటించబడిన వంశము ఇశ్రాయేలు గోత్రమును గుర్తిస్తుంది, దాని ద్వారా అతడు లేక ఆమె తన దీవెనలను పొందుతారు.

  17. 2 నీఫై 26:33.

  18. మోషైయ 15:7 చూడండి. తీవ్రంగా పరీక్షించబడుటకు సమ్మతించని వారు ఇశ్రాయేలు వారు కానవసరం లేదు. అబ్రాహాము సంతానానికి దేవుడు సిద్ధపరచిన దీవెనలన్నిటిని పొందడానికి మనలో ప్రతిఒక్కరు మనకొరకు ప్రత్యేకించబడిన “అబ్రాహాము పరీక్ష“ ఇవ్వబడాలని ఆశించవచ్చు. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బోధించినట్లుగా, మన హృదయాలు బ్రద్దలవుతాయేమోనని మనం భావించునంత తీవ్రంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. (recollection of John Taylor in Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 231 చూడండి.)

  19. మోషైయ 3:19 చూడండి.

  20. 2 తిమోతి 3:1–13 చూడండి.

  21. 1 నీఫై 17:40; వివరణ చేర్చబడింది.

  22. సిద్ధాంతము మరియు నిబంధనలు 98:37; కీర్తనలు 31:23; యెషయా 49:25; సిద్ధాంతము మరియు నిబంధనలు 105:14 కూడా చూడండి.

  23. మోర్మన్ 9:11.