సర్వసభ్య సమావేశము
ఒక క్రొత్త సాధారణత
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


ఒక క్రొత్త సాధారణత

మీ హృదయము, మనస్సు మరియు ఆత్మను మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వైపు త్రిప్పమని నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రెండు రోజుల సర్వసభ్య సమావేశం మహిమాన్వితమైనది! ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్‌తో నేను అంగీకరిస్తున్నాను. ఆయన చెప్పినట్లుగా, సందేశాలు, ప్రార్థనలు మరియు సంగీతము ప్రభువు చేత ప్రేరేపించబడినవి. ఏ విధంగానైనా పాల్గొన్న అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ సభలన్నిటిలో, మీరు సమావేశమును వింటున్నట్లు నా మనస్సులో నేను చిత్రీకరించుకున్నాను. మీరు ఏమి అనుభూతి చెందుతున్నారో, చింతిస్తున్నారో, లేదా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయమని నేను ప్రభువును కోరాను. ఈ సమావేశాన్ని ముగించడానికి నేను ఏమి చెప్పినట్లైతే అది భవిష్యత్తు గురించి ఆశావాదంతో మిమ్మల్ని పంపుతుందో మరియు దేనినైతే మీరు భావించాలని ప్రభువు నాకు తెలిపారో దాని గురించి నేను ఆలోచించాను.

శతాబ్దాలుగా ప్రవక్తలు ముందే ఊహించిన అద్భుతమైన యుగంలో మనం జీవిస్తున్నాం. నీతిమంతుల నుండి ఆత్మీయ ఆశీర్వాదం ఏదీ నిలిపివేయబడకుండా ఉన్న యుగమిది. 1 ప్రపంచంలో గందరగోళం ఉన్నప్పటికీ, 2 మనం “ఆనందకరమైన నిరీక్షణతో” 3 భవిష్యత్తు కోసం ఎదురుచూడాలని ప్రభువు మనల్ని కోరుచున్నారు. నిన్నటి జ్ఞాపకాలలో మన ప్రయత్నాలను వృధాచేయవద్దు. ఇశ్రాయేలీయుల సమకూర్పు ముందుకు సాగుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు తన సంఘ వ్యవహారాలను నిర్దేశిస్తారు మరియు అది దాని దైవిక లక్ష్యాలను సాధిస్తుంది.

మనలో ప్రతి ఒక్కరూ అతని లేదా ఆమె దైవిక సామర్థ్యాన్ని సాధిస్తారని నిర్ధారించుకోవడం మీకు మరియు నాకు ఉన్న సవాలు. నేడు మనం “క్రొత్త సాధారణత” గురించి తరచుగా వింటుంటాము. మీరు నిజంగా “క్రొత్త సాధారణత”ను స్వీకరించాలనుకుంటే, మీ హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వైపు ఎక్కువగా త్రిప్పమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అది మీ “క్రొత్త సాధారణత”గా ఉండనివ్వండి.

ప్రతిరోజూ పశ్చాత్తాపపడడం ద్వారా “మీ క్రొత్త సాధారణత”ను హత్తుకోండి. మీ ఆలోచనలో, మాటలో మరియు క్రియలో స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇతరులకు పరిచర్య చేయండి. నిత్య దృష్టికోణాన్ని అలవరచుకోండి. మీ పిలుపులను ఘనపరచండి. మరియు మీ సవాళ్లు ఏమైనప్పటికీ, నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మీరు మీ సృష్టికర్తను కలుసుకొనుటకు మరింత సిద్ధంగా ఉండునట్లు ప్రతిరోజూ జీవించండి.4

అందుకే మనకు దేవాలయాలు ఉన్నాయి. ప్రభువు యొక్క విధులు మరియు నిబంధనలు దేవుని ఆశీర్వాదాలలో గొప్పదైన నిత్యజీవితానికి మనలను సిద్ధం చేస్తాయి.5 మీకు తెలిసినట్లుగా, కోవిడ్ మహమ్మారి వలన మన దేవాలయాలను తాత్కాలికంగా మూసివేయడం అవసరమైంది. అప్పుడు మనము జాగ్రత్తగా సమన్వయంతో, దశలవారీగా తిరిగి ప్రారంభించాము. ఇప్పుడు అనేక దేవాలయాలు 2వ దశలో ఉన్నందున, వేలాది జంటలు ముద్రించబడ్డాయి మరియు గత కొన్ని నెలల్లో వేలాది మందికి వారి స్వంత దేవాలయవరము లభించింది. సంఘము యొక్క విలువైన సభ్యులందరూ మళ్ళీ వారి పూర్వీకులకు సేవ చేసి, పరిశుద్ధ దేవాలయంలో ఆరాధించే రోజు కోసం మేము ఎదురుచూస్తున్నాము.

ఆరు క్రొత్త దేవాలయాలు ఈ ప్రదేశాలలో నిర్మించబడునని ప్రకటించుటకు నేనానందించుచున్నాను: తరవా, కిరిబాటి; పోర్ట్ విలా, వనౌటు; లిండన్, యూటా; గ్రేటర్ గ్వాటమాలా సిటీ, గ్వాటమాలా; సావో పౌలో ఈస్ట్, బ్రెజిల్; మరియు శాంటా క్రూజ్, బొలీవియా.

మేము ఈ దేవాలయాలను నిర్మించి, నిర్వహిస్తున్నప్పుడు, మీలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు నిర్మించుకొని, నిర్వహించుకోవాలని ప్రార్థిస్తున్నాము, తద్వారా మీరు పరిశుద్ధ దేవాలయంలోకి ప్రవేశించడానికి అర్హులౌతారు.

ఇప్పుడు, నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సమాధానముతో నిండియుండమని నేను మిమ్ములను ఆశీర్వదిస్తున్నాను. ఆయన సమాధానము అన్ని మర్త్య అవగాహనలకు మించినది.6 దేవుని చట్టాలను పాటించాలనే అధిక కోరిక మరియు సామర్థ్యంతో నేను మిమ్ములను ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆ విధంగా చేసినట్లైతే, అనిశ్చితి మధ్య కూడా ఎక్కువ ధైర్యం, అధికమైన వ్యక్తిగత బయల్పాటు, మీ గృహాలలో మధురమైన సామరస్యం మరియు ఆనందంతో కూడిన దీవెనలు మీపై క్రుమ్మరించబడతాయని నేను వాగ్దానం చేస్తున్నాను.

ప్రభువు యొక్క రెండవ రాకడకు మనలను మరియు ప్రపంచాన్ని సిద్ధం చేసే మన దైవిక ఆదేశాన్ని నెరవేర్చడానికి మనం కలిసి ముందుకు వెళ్దాం. మీ పట్ల నాకున్న ప్రేమ యొక్క వ్యక్తీకరణతో యేసు క్రీస్తు పవిత్ర నామంలో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.