సర్వసభ్య సమావేశము
ధైర్యము తెచ్చుకొనుడి
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


ధైర్యము తెచ్చుకొనుడి

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సిద్ధాంతంపై మనకున్న అచంచలమైన విశ్వాసం మనం వేసే అడుగులకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు మనకు ఆనందాన్ని ఇస్తుంది.

తన మర్త్య జీవితపు ఆఖరి దినములలో, యేసు క్రీస్తు తన అపొస్తలులకు వారు అనుభవించే హింసలు మరియు కష్టాల గురించి చెప్పెను. 1 ఈ గొప్ప అభయముతో ఆయన ముగించెను: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను” (యోహాను 16:33). అది మన పరలోక తండ్రి పిల్లలందరికీ రక్షకుని సందేశం. మన మర్త్య జీవితాల్లో మనలో ప్రతి ఒక్కరికి అది అంతిమ శుభవార్త.

“ధైర్యము తెచ్చుకొనుడి” అనునది పునరుత్థానం చెందిన క్రీస్తు తన అపొస్తలులను పంపిన ప్రపంచానికి కావలసిన అభయము. “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము” (2 కొరింథీయులకు 4:8–9) అని అపొస్తలుడైన పౌలు తరువాత కొరింథీయులకు చెప్పెను.

చిత్రం
యేసు ఒకరి తరువాత ఒకరికి సేవ చేస్తారు

రెండు వేల సంవత్సరాల తరువాత మనం కూడా “ఎటుబోయినను శ్రమపడుచున్నను”, నిరాశకు గురికాకుండా ధైర్యంగా ఉండడానికి మనకు అదే సందేశం అవసరం. ప్రభువు తన విలువైన కుమార్తెలపై ప్రత్యేక ప్రేమ మరియు శ్రద్ధ కలిగియున్నాడు. మీ కోరికలు, మీ అవసరాలు మరియు మీ భయాలు ఆయనకు తెలుసు. ప్రభువు సర్వశక్తిమంతుడు. ఆయనను నమ్మండి.

“దేవుని ఉద్దేశ్యములు, ప్రణాళికలు, కార్యములు భంగపరచబడలేవు, అవి నిష్ఫలము కాలేవు”(సిద్ధాంతము మరియు నిబంధనలు 3:1) అని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బోధింపబడెను. కష్టపడుతున్న తన పిల్లలకు, ప్రభువు ఈ గొప్ప హామీలు ఇచ్చారు:

“ఇదిగో, ఓ నా సేవకులారా, ఇది మీకు ప్రభువు వాగ్దానమైయున్నది.

“కాబట్టి, భయపడక ధైర్యముగానుండుడి, ఏలయనగా ప్రభువైన నేను మీతోనున్నాను, మీ ప్రక్కన నిలిచెదను; నేను సజీవుడగు దేవుని కుమారుడనని, మీరు యేసు క్రీస్తునైన నన్ను గూర్చి సాక్ష్యమియ్యవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:5–6).

ప్రభువు మన యొద్ద నిలబడి ఈవిధముగా చెప్పెను:

“నేను ఒకనితో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను, చిన్నపిల్లలారా, సంతోషముగా నుండుడి; ఏలయనగా నేను మీ మధ్యనున్నాను, నేను మిమ్ములను విడిచిపెట్టలేదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 61:36).

“ఎందుకనగా అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును”(సిద్ధాంతము మరియు నిబంధనలు 58:4).

సహోదరీలారా, హింసలు మరియు వ్యక్తిగత విషాదాల మధ్య ఇవ్వబడిన ఈ వాగ్దానాలు, నేడు మీ ఇబ్బందికరమైన పరిస్థితులలో మీలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని నేను సాక్ష్యమిస్తున్నాను. అవి విలువైనవి, మరియు మర్త్యత్వపు సవాళ్ళ ద్వారా మనము ముందుకు సాగినప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, సువార్త యొక్క సంపూర్ణతలో ఆనందం కలిగియుండాలని మనకు గుర్తుచేస్తాయి.

కష్టాలు మరియు సవాళ్ళు మర్త్యత్వము యొక్క సాధారణ అనుభవాలు. మనము అభివృద్ధి చెందడానికి సహాయపడే దైవిక ప్రణాళికలో వ్యతిరేకత ఒక ముఖ్యమైన భాగం 2 మరియు ఆ ప్రక్రియ మధ్యలో, నిత్యత్వపు దృష్టికోణములో వ్యతిరేకత మనల్ని అధిగమించడానికి అనుమతించబడదని మనము దేవుని అభయమును కలిగియున్నాము. ఆయన సహాయంతో మరియు మన విశ్వాసంతో, ఓర్పుతో మనం విజయం సాధిస్తాము. వారు భాగమైయున్న మర్త్య జీవితము వలె, కష్టాలన్నీ తాత్కాలికమే. వినాశనకరమైన యుద్ధానికి ముందు జరిగిన వివాదాలలో, సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన అబ్రహం లింకన్, “ఇది కూడా గతించిపోతుంది” 3 అని తన శ్రోతలకు పూర్వపు జ్ఞానం గురించి తెలివిగా గుర్తుచేసారు.

మీకు తెలిసిన విధముగా, మనం సంతోషంగా ఉండడాన్ని కష్టతరం చేసేవి మరియు ఇప్పుడు నేను మాట్లాడే మర్త్యత్వపు ప్రతికూలతలు కొవిడ్-19 మహమ్మారి యొక్క వినాశనకరమైన అనేక ప్రభావాలలో కొన్నింటి వలన కోట్లమంది కష్టపడుతున్న విధముగా కొన్నిసార్లు సాధారణమైన అనేక ఇతర ప్రతికూలతలతో పాటు మనకు వస్తాయి. అదేవిధంగా, సంయుక్త రాష్ట్రాలలో అధ్యక్ష ఎన్నికలతో పాటుగా ఎల్లప్పుడూ కనిపించే శత్రుత్వం మరియు వివాదం ద్వారా లక్షలాదిమంది బాధపడుతున్నారు, కానీ ఈ సమయం మనలో వృద్ధులైన చాలామంది ఎప్పటికీ గుర్తుంచుకోగలిగేంత తీవ్రముగా ఉన్నది.

వ్యక్తిగత ప్రాతిపదికన, మనలో ప్రతి ఒక్కరూ పేదరికం, జాత్యహంకారం, అనారోగ్యం, ఉద్యోగ నష్టాలు లేదా నిరాశలు, అవిధేయులైన పిల్లలు, చెడ్డ వివాహాలు లేదా వివాహాలు జరుగకపోవడం, మరియు మనము లేదా ఇతరులు చేసిన పాపం యొక్క ప్రభావాలు వంటి మర్త్యత్వము యొక్క అనేక ప్రతికూలతలతో వ్యక్తిగతంగా పోరాడుతున్నారు.

అయినప్పటికీ, వీటన్నిటి మధ్యలో ధైర్యముగానుండి, సువార్త యొక్క సూత్రాలు మరియు వాగ్దానాలలో, మన శ్రమల ఫలాలలో ఆనందాన్ని పొందడానికి మనకు ఆ పరలోక ఉపదేశము కలదు. 4 ఆ ఉపదేశము ఎల్లప్పుడూ ప్రవక్తలకు మరియు మనందరికీ ఉంది. మన పూర్వీకుల అనుభవాల నుండి మరియు ప్రభువు వారికి చెప్పిన విషయాల నుండి మనకు ఇది తెలుసు.

చిత్రం
సహోదరుడు జోసెఫ్

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ యొక్క పరిస్థితులను జ్ఞాపకము చేసుకోండి. ప్రతికూలత దృష్టికోణంద్వారా చూస్తే, అతని జీవితం పేదరికం, హింస, నిరాశ, కుటుంబ దుఃఖాలు మరియు అంతిమ హతసాక్ష్యముతో కూడుకున్నది. అతడు జైలు శిక్ష అనుభవించగా, అతని భార్యాపిల్లలు మరియు ఇతర పరిశుద్ధులు మిస్సోరి నుండి తరిమివేయబడడం వలన చాలా కష్టాలను అనుభవించారు.

ఉపశమనం కోసం జోసెఫ్ వేడుకున్నప్పుడు, ప్రభువు ఇలా సమాధానం చెప్పారు:

“నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక; నీ లేమి, నీ కష్టములు కొంతకాలమే ఉండును;

“దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును; నీ శత్రువులందరి పైన నీవు జయము పొందెదవు.” (సిద్ధాంతములు మరియు నిబంధనలు 121:7–8).

ఈ వ్యక్తిగత, నిత్య ఉపదేశము ప్రవక్తయైన జోసెఫ్‌కు తన స్థానిక ఉల్లాస స్వభావాన్ని మరియు అతని ప్రజల యొక్క ప్రేమను, విధేయతను కొనసాగించడానికి సహాయపడింది. ఈ లక్షణాలను అనుసరించిన నాయకులను మరియు అగ్రగాములను ఇవి బలోపేతం చేశాయి మరియు మిమ్మల్ని కూడా బలపరుస్తాయి.

చిత్రం
లోతైన మంచు గుండా నడుస్తున్న ప్రారంభ సువార్తికులు

ఆ ప్రారంభ సభ్యుల గురించి ఆలోచించండి! వారున్న స్థలం నుండి మరొక చోటికి పదే పదే వారు తరిమివేయబడ్డారు. చివరకు వారు ఎడారిలో తమ ఇళ్ళను మరియు సంఘాన్ని స్థాపించే సవాళ్ళను ఎదుర్కొన్నారు. 5 గొప్ప సాల్ట్ లేక్ లోయలో అగ్రగాముల మొదటి బృందం వచ్చిన రెండు సంవత్సరాల తరువాత కూడా, ఆ శత్రు ప్రాంతంలో వారి మనుగడ ఇంకా ప్రమాదకరంగా ఉంది. చాలా మంది సభ్యులు అప్పటికీ మైదాన ప్రాంతాలలో ఉన్నారు లేదా అలా చేయడానికి వనరులను పొందడానికి కష్టపడుతున్నారు. అయినప్పటికీ, నాయకులు మరియు సభ్యులు ఇంకా ఆశతో ధైర్యముగా ఉన్నారు.

పరిశుద్ధులు వారి కొత్త గృహాలలో స్థిరపడకపోయినా, అక్టోబరు 1849లో సర్వసభ్య సమావేశంలో స్కాండినేవియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు దక్షిణ పసిఫిక్‌లకు పెద్ద సువార్తికుల బృందము పంపబడింది. 6 వారి అత్యల్ప స్థాయి అని భావించేదానినుండి, అగ్రగాములు కొత్త ఎత్తులకు చేరుకున్నారు. కేవలం మూడు సంవత్సరాల తరువాత, చెదిరిపోయిన ఇజ్రాయేలీయులను సమకూర్చడానికి మరో 98 మంది కూడా పిలువబడ్డారు. ఈ సువార్తసేవ “సాధారణంగా, చాలాకాలం ఉండకూడదు; ఏ వ్యక్తి అయినా తన కుటుంబం నుండి 3 నుండి 7 సంవత్సరాల వరకు దూరంగా ఉండగలడు” అని సంఘ నాయకులలో ఒకరు వివరించారు. 7

సహోదరీలారా, ప్రథమ అధ్యక్షత్వము మీ సవాళ్ళ గురించి ఆందోళన చెందుతుంది. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు మీ కోసం ప్రార్థిస్తున్నాము. అదే సమయంలో, భూకంపాలు, మంటలు, వరదలు మరియు తుఫానులు కాకుండా మన భౌతిక సవాళ్ళు సాధారణంగా మన పూర్వీకులు ఎదుర్కొన్న వాటికంటే తక్కువగా ఉన్నాయని మేము తరచుగా కృతజ్ఞతలు తెలియజేస్తాము.

కష్టాల మధ్య ఈ దైవిక అభయము ఎల్లప్పుడూ ఉంటుంది, “ సంతోషించుడి, నేను మిమ్ములను నడిపించెదను. పరలోకరాజ్యము, దాని దీవెనలు, నిత్యత్వపు ఐశ్వర్యములు మీవైయున్నవి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:18). ఇది ఎలా జరుగుతుంది? అగ్రగాములకు ఇది ఎలా జరిగింది? నేడు దేవుని యొక్క స్త్రీలకు ఇది ఎలా జరుగుతుంది? ప్రవక్త యొక్క నడిపింపును అనుసరించుట ద్వారా, “నరకపు ద్వారములు [మన] యెదుట నిలువనేరవు” అని ఏప్రిల్ 1830లో బయల్పాటు ద్వారా ప్రభువు సెలవిచ్చెను. “ప్రభువైన దేవుడు అంధకార శక్తులను మీ యెదుట నుండి తరిమివేయును, మీ మేలు కొరకు, ఆయన నామ ఘనత కొరకు పరలోకములు కంపించునట్లు చేయును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 21:6) అని ఆయన సెలవిచ్చెను. “కాబట్టి, చిన్నమందా భయపడకుము; మంచిని చేయుము; భూమియు, నరకమును మీకు వ్యతిరేకముగా కలిసినను, మీరు నా బండమీద కట్టబడిన యెడల, అవి మిమ్ములను జయించలేవు.” సిద్ధాంతము మరియు నిబంధనలు 6:34).

ప్రుభువు యొక్క వాగ్దానములతో, మనం “[మన] హృదయము[ల]ను పైకెత్తుకొని సంతోషించెదము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:13), మరియు “సంతోషకరమైన హృదయము, సంతోషకరమైన ముఖముతో” (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:15), మనం నిబంధన మార్గములో ముందుకు సాగెదము. మనలో చాలామంది తెలియని ప్రదేశంలోనికి వెళ్ళి స్థిరపడడానికి తమ ఇండ్లను వదిలివేయడం వంటి పెద్ద పర్యవసానములు గల నిర్ణయాలను ఎదుర్కొనరు. మన నిర్ణయాలు ఎక్కువగా జీవితపు దినచర్యలలో ఉంటాయి, కానీ ప్రభువు మనకు చెప్పినట్లు, “మంచి చేయుట యందు విసుగులేకయుండుడి, ఏలయనగా మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు. చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33).

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సిద్ధాంతంలో అనంతమైన శక్తి ఉంది. ఆ సిద్ధాంతంపై మనకున్న అచంచలమైన విశ్వాసం మనం వేసే అడుగులకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది మన మనస్సులను ప్రకాశవంతం చేస్తుంది మరియు మన చర్యలకు బలాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది. ఈ మార్గదర్శకత్వం, జ్ఞానోదయం మరియు శక్తి అనేవి మన పరలోక తండ్రి నుండి మనం పొందిన బహుమతులు. పశ్చాత్తాపము అను దివ్యమైన బహమానముతో పాటు ఆ సిద్ధాంతమును అర్థం చేసుకొని, మన జీవితాలలో అనుసరించడం ద్వారా నిత్య గమ్యమునకు, అనగా మన ప్రియమైన పరలోక తల్లిదండ్రులను మరలా కలుసుకొని మహోన్నతస్థితిని పొందడానికి నడిపించు మార్గములో మనం ఉన్నప్పుడు మనం సంతోషముగా ఉండగలము.

ఎల్డర్ రిచర్డ్ జి. స్కాట్ ఇలా బోధించారు, “మీరు అధిక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉండవచ్చు.” “కొన్నిసార్లు అవి చాలా కేంద్రీకృతమై ఉంటాయి, అప్రయత్నంగా ఉంటాయి, అవి మీ నియంత్రణ సామర్థ్యానికి మించినవి అని మీరు భావిస్తారు. ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవద్దు. ‘నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము’ [సామెతలు 3:5]. … మీరు విఫలమవ్వాలని కాదు, కానీ మీరు అధిగమించడం ద్వారా విజయం సాధించాలని జీవితం ఒక సవాలుగా ఉండాలని ఉద్దేశించబడింది.” 8

మనమందరం మన పరలోక గమ్యస్థానానికి చేరుకోవడానికి పట్టువిడువక ఉండాలని ప్రార్థించుచూ, ఇది తండ్రి అయిన దేవుడు మరియు అతని కుమారుడైన యేసు క్రీస్తు ప్రణాళికలో ఒక భాగమని నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామమున, ఆమేన్.

వివరణలు

  1. యోహాను 13–16 చూడండి.

  2. 2 నీఫై 2:11 చూడండి.

  3. అబ్రహం లింకన్, విస్కాన్సిన్ స్టేట్ అగ్రికల్చరల్ సొసైటీ, మిల్వాకీ, జాన్ బార్ట్‌లెట్‌లో 1859 సెప్టెంబరు 30న చేసిన ప్రసంగము Bartlett’s Familiar Quotations (2012), 444.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:31 చూడండి.

  5. See Lawrence E. Corbridge, “Surviving and Thriving like the Pioneers,” Ensign, July 2020, 23–24.

  6. “Minutes of the General Conference of 6 ” General Church Minutes Collection, Church History Library, Salt Lake City చూడండి.

  7. Journal History of The Church of Jesus Christ of Latter-day Saints, Aug. 28, 1852, 1, Church History Library, Salt Lake City లో జార్జ్ ఎ. స్మిత్.

  8. రిచర్డ్ జి. స్కాట్, Finding Peace, Happiness, and Joy (2007), 248–49