2010–2019
ఆయన చేసినట్లుగానే
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


ఆయన చేసినట్లుగానే

ఆయన చేసినట్లే పరిచర్య చేయుటకు మనము ఆశించినప్పుడు, మన స్వంత వాటిని మరచిపోయి, ఇతరులను పైకెత్తే అవకాశాలు మనకివ్వబడతాయి.

దాాదాపు 18 నెలల క్రితం, 2017 శరదృతువులో, 64 సంవత్సరాల మా అన్న మైక్ తాను క్లోమ కేన్సరుతో నిర్ధారించబడ్డానని నాకు తెలియచేసాడు. అతడు తన గృహ బోధకుని నుండి ఒక యాజకత్వ దీవెనను పొందానని, తన బిషప్పును కూడా కలుసుకున్నానని నాతో చెప్పాడు. ఆ తరువాత “నా హాస్పిటల్ గదిలో నుండి నేను ఏమి చూడగలుగుతున్నానో చూడు” అనే శీర్షికతో, తాను చికిత్స పొందుతున్న హాస్పటల్ నుండి తీసుకొన్న ఓక్‌లాండ్ కాలిఫోర్నియా దేవాలయ చిత్రాన్ని నాకు పంపాడు.”1

అతడి కేన్సరు గురించి ఆశ్చర్యపడినట్లే, అతని గృహబోధకులు, యాజకత్వ దీవెనలు, బిషప్పులు, దేవాలయాలను గూర్చిన వాఖ్యానాల చేత నేను ఆశ్చర్యపడ్డాను. అహరోను యాజకత్వములో ఒక యాజకుడైన మైక్, దాదాపు 50 సంవత్సరాలుగా సంఘానికి సక్రమంగా హాజరుకాలేదని మీరు గ్రహించాలి.

ఒక కుటుంబముగా, మేము కేన్సరుతో అతడి మెరుగుదలపై ఆసక్తి చెందినట్లుగానే, ఇప్పుడు మోర్మన్ గ్రంథమును గూర్చి ముద్రించు శక్తి, మరణము తరువాత జీవితమును గూర్చి తరచుగా అడిగే అతడి విస్తారమైన ప్రశ్నల వలన అతడి ఆత్మీయ అభివృద్ధి కోసం కూడా దాదాపు అంతే ఆసక్తి చెందాము. నెలలు గడిచే కొద్దీ, కాన్సరు వ్యాప్తి చెందడం వలన, అదనపు మరియు చాలా ప్రత్యేకమైన చికిత్స అవసరత మైక్‌ను యూటాలోని హంట్స్‌మన్ కేన్సర్ కేంద్రానికి తీసుకొచ్చింది.

అతడు చేరుకున్న వెంటనే, మైక్ నివసిస్తున్న సంరక్షణ కేంద్రానికి సేవ చేస్తున్న వార్డు యొక్క వార్డు మిషను లీడరు జాన్ హాల్‌బ్రూక్ చేత దర్శించబడ్డాడు. “మైక్ దేవుని కుమారుడని నాకు స్పష్టమైందని” జాన్ వ్యాఖ్యానించాడు, త్వరలో వారి మధ్య ఒక అనుబంధం, స్నేహం ఏర్పడింది, దానివలన జాన్, మైక్ యొక్క పరిచర్య చేయు అనధికారిక సహోదరునిగా మారాడు. వెంటనే మిషనరీలు దర్శింపబడాలనే ఆహ్వానము ఇవ్వబడింది, దానిని మా అన్న మర్యాదగా తిరస్కరించాడు, కాని వారి నెల రోజుల స్నేహంలో, జాన్, మైక్‌తో, “సువార్త సందేశమును వినుట నీవు ఆనందిస్తావని నేను అనుకుంటున్నాను,”2 అని వివరిస్తూ మరలా అడిగాడు. ఈసారి ఆహ్వానం అంగీకరించబడి, మిషనరీలతో తరుచైన సమావేశాలకు, అదేవిధంగా బిషప్ జాన్ షార్ప్ సందర్శనాలు, అతని సంభాషణలు చివరకు మైక్ తాను బాప్తీస్మము పొందిన 57 సంవత్సరాల తరువాత, తన గోత్ర జనకుని దీవెనను పొందుటకు నడిపించాయి.

గత సంవత్సరము డిసెంబరు ప్రారంభములో, అనేక నెలల చికిత్సా విధానాల తరువాత, మైక్ తీవ్రమైన ఇతర దుష్ప్రభావాలను కలిగిస్తున్న కాన్సర్ చికిత్సలను మానివేయటానికి నిర్ణయించుకున్నాడు, మరియు ప్రకృతి దాని ప్రక్రియను చేయడానికి వదలివేసాడు. మైక్‌ జీవించటానికి ఖచ్చితంగా మూడు నెలలు ఉన్నాయని అతని వైద్యుడి చేత మేము తెలియచేయబడ్డాము. ఈ మధ్యకాలములో, అతడి స్థానిక యాజకత్వ నాయకుల సందర్శనాలు, సహాయాల నడుమ సువార్త ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. మైక్‌తో మా సందర్శనాలలో, సువార్త యొక్క పునఃస్థాపన, యాజకత్వపు తాళపు చెవులు, దేవాలయ విధులు, మానవుని నిత్య స్వభావమును గూర్చి మేము చర్చించినప్పుడు, అతడి మంచము ప్రక్కన బల్లపై మోర్మన్ గ్రంథ ప్రతి తెరవబడియుండుట మేము తరచుగా చూసాము.

డిసెంబరు నెల మధ్యలో, చేతిలో తన గోత్ర జనకుని దీవెనతో మైక్ బలమును పొందుచున్నట్లుగా కనబడ్డాడు, అతని జీవించేకాలము కనీసము మరొక మూడు నెలలుగా కనబడింది. క్రిస్టమస్, క్రొత్త సంవత్సరం, ఇంకా అనేకమైన సందర్బాలలో మాతో చేరుటకు అతని కొరకు మేము ప్రణాళికలు కూడా చేసాము. డిసెంబరు 16న, బిషప్పు షార్ప్ నాకు ఫోను చేసి ఆయన, స్టేకు అధ్యక్షులు మైక్‌ను ఇంటర్యూ చేసారని, అతడు మెల్కీసెదకు యాజకత్వమును పొందుటకు యోగ్యునిగా కనుగొన్నారని, దానిలో నేను పాల్గొనుటకు ఎప్పుడు వీలవుతుందని అడిగాడు. ఆ విధి శుక్రవారం, డిసెంబరు 21కి ప్రణాళిక చేయబడింది.

ఆ దినము వచ్చినప్పుడు, నా భార్య కేరల్, నేను సంరక్షణ కేంద్రాన్ని చేరుకున్న వెంటనే అతని గదికి దగ్గరనున్న హాలులో మాకు మైక్‌ గుండె కొట్టుకోవటం లేదని తెలియజేయబడింది. మేము గదిలో ప్రవేశించేసరికి గోత్ర జనకుడు, అతని బిషప్పు, స్టేకు అధ్యక్షులు అక్కడ వేచియున్నారు- తర్వాత మైక్ తన కన్నులను తెరిచాడు. అతడు నన్ను గుర్తించి, నా మాట వినగలుగుతున్నాడని, యాజకత్వమును పొందుటకు సిద్ధముగా ఉన్నాడని అంగీకరించాడు. అహరోను యాజకత్వములో ఒక యాజకునిగా మైక్ నియమించబడిన యాభై సంవత్సరాల తరువాత, అతని స్థానిక నాయకుల సహాయంతో, మా అన్నకు మెల్కీసెదకు యాజకత్వమును ఇచ్చి, ఎల్డరు యొక్క కార్యాలయానికి నియమించుటకు నాకు విశేషావకాశము కలిగింది. ఐదు గంటల తరువాత, మెల్కీసెదెకు యాజకత్వముగల వానిగా, మా తల్లిదండ్రులను కలుసుకొనుటకు తెరను దాటుతూ, మైక్ చనిపోయాడు.

కేవలము ఒక సంవత్సరము క్రితం, “ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానములో,”3 మన సహోదర, సహోదరీల కొరకు శ్రద్ధ తీసుకొనుటకు మనలో ప్రతీఒక్కరికీ అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత ఒక పిలుపు ఇవ్వబడింది. రక్షకుని గూర్చి మాట్లాడుతూ, అధ్యక్షులు నెల్సన్, “ఇది ఆయన సంఘము గనుక, ఆయన సేవకులైన మనము, ఆయన చేసినట్లుగా ఒక్కరికి పరిచర్య చేద్దాము. ఆయన నామములో, ఆయన శక్తి, అధికారముతో, ఆయన ప్రేమగల దయతో మనము పరిచర్య చేద్ధామని,”4 బోధించారు.

దేవుని ప్రవక్త యొక్క ఆహ్వానానికి స్పందించి, ఆ ఒక్కరికీ పరిచర్య చేయుటకు సభ్యులు విశ్వసనీయంగా వారి పరిచర్య నియామకాలను పూర్తి చేస్తున్న సమన్విత ప్రయత్నాలందు, అదేవిధంగా, అనేకమంది “ప్రణాళిక చేయని” పరిచర్యగా నేను పిలిచే దానికి, ఊహించని అవకాశాలకు స్పందించి క్రీస్తు వంటి ప్రేమను ప్రదర్శిస్తున్నప్పుడు, రెండింటి ద్వారా అసాధారణమైన ప్రయత్నాలు ప్రపంచమంతటా జరుగుతున్నవి. మా స్వంత కుటుంబములో, ఈ రకమైన పరిచర్యను చాలా దగ్గరగా, ప్రత్యక్షంగా మేము చూసాము.

మైక్ యొక్క స్నేహితుడు, పరిచర్య చేయు సహోదరుడు, మాజీ మిషను అధ్యక్షుడైన జాన్, తన మిషనరీలకు ఇలా చెప్పేవాడు, “ఒక జాబితాలో ఎవరైనా ‘ఆసక్తి కలిగిలేరు,’ అని చెప్పబడితే, వారిని వదిలేయవద్దు. జనులు మారతారు.” “మైక్ అధ్భుతంగా మార్పు చెందాడు,”5 అని తరువాత అతడు మాతో చెప్పాడు. జాన్, తరచూ ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందిస్తూ, మొదట ఒక స్నేహితుడిగా ఉన్నాడు . . . కానీ అతడి పరిచర్య స్నేహపూర్వక సందర్శనలతో ఆగలేదు. పరిచర్య చేయుట ఒక స్నేహితునిగా ఉండుట కంటే ఎక్కువని, మనం పరిచర్య చేసినప్పుడు ఆ స్నేహము వృద్ధి చెందుతుందని జాన్ ఎరుగును.

పరిచర్య చేయు సేవ యొక్క అవసరతను కలిగియుండుటకు ఎవరూ ప్రాణాపాయకరమైన వ్యాధితో బాధపడవలసిన అవసరం లేదు. ఆ అవసరతలు వివిధ రూపాలు, పరిమాణాలు, షరతులతో వచ్చును. ఒక ఒంటరి తల్లి లేక తండ్రి, సువార్తలో చురుకుగా లేని దంపతులు, ప్రయాసపడుతున్న యౌవనుడు, అణచివేయబడిన తల్లి, విశ్వాస పరీక్ష, ఆర్ధిక, ఆరోగ్య, లేక వైవాహిక సమస్యలు---జాబితా దాదాపు అంతులేనిది. అయినప్పటికినీ, మా అన్న మైక్ వలే, ఏ ఒక్కరూ దాటిపోలేదు, మరియు రక్షకుని ప్రేమగల చేరువ ఎప్పటికీ ఆలస్యము కాదు.

సంఘము యొక్క పరిచర్య వెబ్‌సైట్ పై మనమిలా బోధించబడ్డాము, “పరిచర్యకు అనేక ఉద్దేశములు ఉన్నప్పటికినీ, మన ప్రయత్నాలు ఇతరులు లోతైన వ్యక్తిగత పరివర్తనను సాధించుటకు, రక్షకుని వలే మారుటకు సహాయపడాలనే కోరిక చేత నడిపించబడాలి.”6 ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్ దానిని ఇలా చెప్పారు:

“ఒక దయగల హృదయముగల వ్యక్తి ఎవరికైనా టైరు మార్చుటకు, తన గదిలో తోటివానిని వైద్యుని వద్దకు తీసుకెళ్లుటకు, విచారముగల వ్యక్తితో భోజనము చేయుటకు, లేక ఒకరి రోజును ప్రకాశవంతం చేయుటకు చిరునవ్వు నవ్వుట, పలుకరించుట ద్వారా సహాయపడగలడు.

“కాని మొదటి ఆజ్ఞను పాటించువారు సహజముగా ఈ ముఖ్యమైన సేవా చర్యలను చేరుస్తారు.”7

యేసు క్రీస్తు యొక్క మాదిరిలో మన పరిచర్యను చేయుటకు, ప్రేమించుటకు, లేవనెత్తుటకు, సేవ చేయుటకు, దీవించుటకు ఆయన చేసిన ప్రయత్నములు తక్షణ అవసరతను తీర్చుట కంటే మహోన్నతమైన లక్ష్యమును కలిగియున్నాయని జ్ఞాపకముంచుకొనుట ముఖ్యమైనది. ఆయన వారి అను-దిన అవసరతలను స్పష్టముగా ఎరిగియుండి, వారిని స్వస్థపరచి, ఆహారమిచ్చి, క్షమించి, బోధించినప్పుడు, వారి ప్రస్తుతపు బాధపై కనికరాన్ని కలిగియున్నాడు. కానీ ఆయన ఈరోజుకి శ్రద్ధ తీసుకొనుట కంటే అధికంగా చేయాలని కోరాడు. ఆయన తన చుట్టూ ఉన్నవారిని, ఆయనను అనుసరించి, ఆయనను తెలుసుకొని, వారి దైవిక సామర్థ్యాన్ని చేరుకోవాలని ఆయన కోరాడు.8

“ఆయన చేసినట్లుగానే,“9 పరిచర్య చేయుటకు మనము ఆశించినప్పుడు, మన స్వంత వాటిని మరచిపోయి, ఇతరులను పైకెత్తే అవకాశాలు మనకివ్వబడతాము. ఈ అవకాశములు తరచుగా అసౌకర్యముగా, బోధకుని వలే అధికంగా మారుటకు మన కోరికను పరీక్షిస్తూ ఉండవచ్చు, అందరికంటే గొప్పదైన ఆయన సేవ, ఆయన అంతములేని ప్రాయశ్చిత్తఃము, ఖచ్చితంగా సౌకర్యమైనవి కాదు. మత్తయి 25 అధ్యాయములో, ఆయన వలే, మనము కూడా అనేకమందిచే ఎదుర్కొనబడి, తరచుగా గుర్తించబడని ప్రయాసలు, శ్రమలు, సవాళ్ళకు సున్నితంగా స్పందించినప్పుడు, ప్రభువు మన గురించి ఎలా భావిస్తున్నాడో మనము జ్ఞాపకము చేయబడ్డాము:

“నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి:

“నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. . . .

“అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితిమి? లేక నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

“ఎప్పుడు పరదేశివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? …

“అందుకు రాజు, మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.”10

మనము పరిచర్య చేయు సహోదరులు లేక సహోదరీలుగా సేవ చేస్తున్నా, లేక అవసరతలో ఉన్న వారి గురించి తెలియజేయబడినప్పుడు, ఆత్మ యొక్క నడిపింపును, మార్గదర్శకత్వమును వెదకి దానిపై పనిచేయవలెనని మనము ప్రోత్సహించబడుచున్నాము. ఉత్తమంగా ఎలా సేవా చేయాలని మనము ఆశ్చర్యపడవచ్చు, కానీ ప్రభువు ఎరుగును, ఆయన ఆత్మ ద్వారా మన ప్రయత్నములందు మనము నడిపించబడతాము. “(అతడు) చేయవలసిన క్రియలను ముందుగా ఎరుగక ఆత్మ చేత నడిపించబడిన,”11 నీఫై వలే, మనము ఆయన బిడ్డలను దీవించుటకు ప్రభువు హస్తములందు సాధనములగుటకు ప్రయాసపడినప్పుడు, మనము కూడా ఆత్మ చేత నడిపించబడతాము. ఆత్మ యొక్క నడిపింపును మనము వెదకి, ప్రభువును నమ్మినప్పుడు, మనము అమలు చేసి, దీవించగల-అనగా పరిచర్య చేయగల పరిస్థితులు మరియు స్థలాలలో మనం ఉంచబడతాం.

ఇతర సమయాలలో ఒక అవసరతను మనం గుర్తించాము, కానీ ఇవ్వటానికి మనము కలిగియున్నది సరిపోదని, స్పందించుటకు సరిపోమని భావించియుండవచ్చు. “ఆయన చేసినట్లుగానే”12 చేయుట అనగా మనకు సాధ్యమైనది ఇచ్చుట ద్వారా పరిచర్య చేయుచూ, మన “ఈ మర్త్య ప్రయాణములోని సహ ప్రయాణికులను”13 దీవించుటకు ప్రభువు మన ప్రయత్నాలను వృద్ది చేస్తారని నమ్ముట. కొందరికి, అది సమయము, తలాంతుల వరము ఇచ్చుట కావచ్చు, ఇంకొందరి, అది ఒక దయగల మాట లేక భౌతిక సహాయము కావచ్చు. మన ప్రయత్నాలు సరిపోనివని మనము భావించినప్పటికీ, “చిన్నవి మరియు సాధారణమైన” వాటి గురించి ఒక ముఖ్యమైన సూత్రమును అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ పంచుకున్నారు. చిన్నవి మరియు సాధారణమైన చర్యలు శక్తివంతమైనవి, ఎందుకనగా అవి దాతలను, గ్రహీతలు ఇరువురిని దీవించు సహవాసి అయిన “పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును”14 ఆహ్వానిస్తాయని ఆయన బోధించారు.

త్వరలో తాను చనిపోతానని ఎరిగిన, నా సహోదరుడు ఇలా వ్యాఖ్యానించాడు, “క్లోమకాన్సర్ అతి ముఖ్యమైన దానిపై నీవు దృష్టిసారించునట్లు ఎలా చేయగలదో ఆశ్చర్యకరమైనది.”15 ఒక అవసరతను చూసి, విమర్శించకుండా, రక్షకుని వలే పరిచర్య చేసిన అద్భుతమైన స్త్రీ,పురుషుల కొరకు కృత్ఞజతలు, అది మైక్‌కు చాలా ఆలస్యము కాలేదు. కొందరికి, మార్పు త్వరగా రావచ్చు; మిగిలిన వారికి, బహుశా ఈ జీవితము తరువాత రావచ్చు. అయినప్పటికినీ, అది ఎప్పటికీ ఆలస్యము కాదని, దాని వ్యవధి, పరిధిలో అపరిమితమైన అంతములేని యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము యొక్క దీవెనలు పొందలేని మార్గము నుండి చాలా దూరము ఎవ్వరూ ఎప్పటికీ తప్పిపోలేరని మనము జ్ఞాపకముంచుకోవాలి.

గత అక్టోబరు సర్వసభ్య సమావేశములో, ఎల్డర్ డేల్ జి. రెన్‌లాండ్ ఇలా బోధించారు, “మనము ఎంతకాలము మార్గము తప్పిపోయినప్పటికినీ, ... మనము మారాలని నిర్ణయించుకొనిన క్షణాన, తిరిగి రావటానికి దేవుడు మనకు సహాయపడతాడు.”16 అయినప్పటికిని, మారాలనే నిర్ణయము, తరచుగా “సువార్త సందేశాన్ని వినుటకు మీరు ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను,” వంటి ఆహ్వానాల యొక్క ఫలితమైయున్నది. రక్షకునికి అది ఎన్నడూ ఆలస్యము కాదు గనుక, ఆహ్వానించుటకు ఎన్నడూ అది మనకు తొందరైనది కూడా కాదు.

ఈ ఈస్టరు సమయము మనము మరొకసారి, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ప్రాయశ్చిత్త త్యాగముపై మరియు అటువంటి బ్రహ్మాండమైన ఖరీదుతో మనలో ప్రతీఒక్కరి కొరకు ఆయన చేసిన దానిని పర్యాలోచన చేయుటకు ఒక మహిమకరమైన అవకాశమిచ్చును, దానిని ఆయన తానే ప్రకటించాడు, దాని వెల “అందరికంటే గొప్పవాడైన (ఆయనను), బాధ వలన వణకునట్లు చేసెను.” “అయినప్పటికినీ,” ”మనుష్య సంతతి కొరకు దానిని నేను అనుభవించి, నా సిద్ధపాట్లను నెరవేర్చియున్నాను,“17 అని ఆయన వ్యాఖ్యానించాడు.

ఆయన “నెరవేర్చెను,” గనుక ఎల్లప్పుడు నిరీక్షణ ఉన్నదని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.