2010–2019
పశ్చాత్తాపము ద్వారా శుద్ధి చేయబడెను
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


పశ్చాత్తాపము ద్వారా శుద్ధి చేయబడెను

దేవుని యొక్క ప్రణాళిక మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన, మనము పశ్చాత్తాపము యొక్క ప్రక్రియ చేత శుద్ధి చేయబడగలము.

మర్త్యత్వములో మనము మానవుని యొక్క చట్టములు మరియు దేవుని యొక్క చట్టములకు లోబడియున్నాము. నేను అపొస్తులునిగా పిలవబడకముందు యూటా సుప్రీమ్ కోర్టు యొక్క న్యాయవాదిగా మరియు ఇప్పుడు ప్రథమ అధ్యక్షత్వము యొక్క సభ్యునిగా గంభీరమైన దుష్ప్రవర్తనను ఈ చట్టముల ప్రకారము తీర్పు తీర్చుటలో నాకు అసాధారణమైన అనుభవము కలిగియున్నాను. మానవుని యొక్క చట్టములు మరియు దేవుని యొక్క చట్టములకు మధ్య తేడా యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క శక్తి మరియు వాస్తవికత పట్ల నా ప్రశంసను హెచ్చించింది. మానవుని యొక్క చట్టముల ప్రకారము, ఎక్కువ తీవ్రమైన నేరము చేసిన ఒక వ్యక్తి సాధ్యమైన తాత్కాలిక విడుదల లేకుండా చెరసాలో జీవిత ఖైదుగా చేయబడవచ్చును. కాని ప్రేమగల పరలోక తండ్రి యొక్క కనికరముగల ప్రణాళిక క్రింద అది భిన్నముగా ఉన్నది. “విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మలు కలిగిన వారందరి” (2 నీఫై 2:7) యొక్క పాపముల కొరకు చేయబడిన మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము వలన అటువంటి తీవ్రమైన పాపములు మర్త్యత్వములో క్షమించబడగలవని నేను ప్రత్యక్షంగా చూసాను. క్రీస్తు విమోచించును మరియు ఆయన ప్రాయశ్చిత్తము యదార్థమైనది.

మన రక్షకుని యొక్క ప్రేమగల కనికరము గాయకబృందము చేత ఇప్పుడే పాడబడిన గొప్ప కీర్తనలో వ్యక్తపరచబడింది.

యేసు వద్దకు రమ్ము; ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడు ఆలకించును.

మీరు పాపములో నిలిచియున్నప్పటికినీ.

ఆయన ప్రేమ మిమ్మల్ని కనుగొనును మరియు మిమ్మల్ని మృదువుగా నడిపించును.

చీకటి రాత్రి నుండి పగలుకు.1

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము “మనుష్యులందరు పశ్చాత్తాపపడుట(కు) మరియు ఆయన వద్దకు వచ్చుట(కు)”(సిద్ధాంతము మరియు నిబంధనలు18:11; మార్కు 3:28; 1 నీఫై 10:18; ఆల్మా 34:8, 16కూడా చూడుము) అవకాశమును ఇచ్చును. ఆల్మా గ్రంథము దుష్టులైన మరియు రక్త దాహముగల జనులైన వారి యొక్క పశ్చాత్తాపము మరియు క్షమాపణను కూడ వివరించును (ఆల్మా 25:16; 27:27, 30 చూడుము). బహిష్కరణ లేక పేరు తీసివేయబడుట ద్వారా సంఘములో వారి సభ్యత్వమును కోల్పోయిన వారితో కలిపి, ఈ రోజు నా సందేశము మనందరి కొరకు నిరీక్షణను ఇచ్చుటకైనది. మనమందరము పాపులము, మనం పశ్చాత్తాపము ద్వారా శుద్ధి చేయబడగలము. “పాపము కొరకు పశ్చాత్తాపపడుట సులభము కాదు,“ అని గత సర్వసభ్య సమావేశములో ఎల్డర్ రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు బోధించారు. “కాని ఆ బహుమానము చెల్లించిన వెలకంటే విలవైనది.“2

1. పశ్చాత్తాపము

పశ్చాత్తాపము మన రక్షకునితో ప్రారంభమగును, మరియు అది ఒక సంతోషమే కానీ భారము కాదు. గత డిసెంబరు క్రిస్మస్ భక్తి సమావేశములో, అధ్యక్షులు నెల్సన్ బోధించారు: “నిజమైన పశ్చాత్తాము ఒక సంఘటన కాదు. అది ఎప్పటికీ ముగించబడని విశేషావకాశము. అది అభివృద్ధికి మరియు మనశ్శాంతిని, ఆదరణను సంతోషమును కలిగియుండుటకు ప్రధానమైనది.”3

పశ్చాత్తాముపై బోధించబడిన గొప్ప బోధనలలో కొన్ని మోర్మన్ గ్రంథములో సంఘ సభ్యులకు ఆల్మా యొక్క ప్రసంగములో ఉన్నవి, తరువాత అతడు వారిని “అధిక అవిశ్వాస,” స్థితిలో ఉన్నట్లుగా, “గర్వమందు … పైకెత్తబడి,” మరియు హృదయములు “లోకము యొక్క వ్యర్ధమైన వస్తువులపైన (”ఆల్మా 7:6 ) ఉంచబడినవిగా వర్ణించాడు. ఈ పునఃస్థాపించబడిన సంఘము యొక్క ప్రతీ సభ్యుడు, ఆల్మా యొక్క ప్రేరేపించబడిన బోధనలనుండి నేర్చుకోవాల్సినది అధికంగా ఉన్నది.

మనము యేసు క్రీస్తునందు విశ్వాసముతో ప్రారంభిస్తాము, ఎందుకనగా “లోకము యొక్క పాపములు తీసివేయుటకు వచ్చునది ఆయనే”(ఆల్మా 5:48). మనము తప్పక పశ్చాత్తాపపడాలి ఎందుకనగా, ఆల్మా బోధించినట్లుగా, “మీరు పశ్చాత్తాపము పొందని యెడల పరలోక రాజ్యమందు మీరు ఏ విధముగాను ప్రవేశింపలేరు,”(ఆల్మా 5:51). పశ్చాత్తాపము దేవుని యొక్క ప్రణాళికలో ఆవశ్యకమైన భాగము. మన మర్త్య అనుభవములో అందరూ పాపము చేసి, దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడతాము కనుక, మనుష్యుడు పశ్చాత్తాపము లేకుండా “రక్షింపబడలేడు,” (ఆల్మా 5:31; హీలమన్12:22 కూడా చూడుము).

ఇది ప్రారంభమునుండి బోధించబడింది. ప్రభువు ఆదామును ఇలా ఆజ్ఞాపించెను, “ప్రతీ చోటా మనుష్యులందరూ పశ్చాత్తాపపడవలెనని, లేనియెడల వారు దేవుని రాజ్యమును పొందలేరని, అక్కడ లేక ఆయన సన్నిధిలో అపవిత్రమైన వస్తువు ఏదీ నివసించలేదని, మీ పిల్లలకు బోధించుము.”(మోషే 6:57). దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన మన సమస్త క్రియలు లేక వైఫల్యములు---మనము సమస్త పాపముల నిమిత్తము తప్పక పశ్చాత్తాపపడాలి. ఏ ఒక్కరూ మినాహాయించబడరు. కేవలము నిన్న రాత్రి అధ్యక్షులు నెల్సన్ మనకు సవాలు చేసారు: “సహోదరులారా, మనమందరము పశ్చాత్తాపపడాల్సిన అవసరమున్నది.”4

పశ్చాత్తాపము ద్వారా శుద్ధి చేయబడుటకు, మనము మన పాపములను విడిచిపెట్టి, ప్రభువుకు మరియు అవసరమైనప్పుడు ఆయన మర్త్య న్యాయాధిపతి వద్ద ఒప్పుకోవాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:43 చూడుము). మనము “నీతి కార్యములు ఫలించవలెను,” అని కూడా ఆల్మా బోధించాడు (ఆల్మా 5:35). ఇదంతయు క్రీస్తు నొద్దకు రమ్మని తరచు ఇవ్వబడే లేఖన ఆహ్వానములో భాగము.

ప్రతీ సబ్బాతు దినమున మనము సంస్కారములో పాల్గొనాల్సిన అవసరమున్నది. ఆ విధిలో మనము నిబంధనలు చేస్తాము మరియు మన రక్షకుడు మనము సాధించాలని కోరిన పరిపూర్ణత నుండి మనల్ని నిలిపివేయు సమస్త క్రియలు మరియు కోరికలను జయించుటకు సహాయపడు దీవెనలను పొందుతాము (మత్తయి 5:48; 3 నీఫై12:48). మనము “సమస్త భక్తిహీనత నుండి (మనల్ని) నిరాకరించుకొని, సమస్త బలము, మనస్సు, మరియు శక్తితో దేవునిని ప్రేమించిన యెడల,” అప్పుడు మనము “మచ్చలేకుండా పరిశుద్ధులగుటకు” ఆయన రక్తమును చిందించుట ద్వారా “క్రీస్తునందు పరిపూర్ణులై,” “పరిశుద్ధపరచబడతాము” (మొరోనై 10:32–33). ఎంత గొప్ప వాగ్దానము! ఎంత గొప్ప అద్భుతము! ఎంత గొప్ప దీవెన!

II. జవాబుదారీతనము మరియు మర్త్య తీర్పులు

దేవుని ప్రణాళికలో ఈ మర్త్య అనుభవము యొక్క ఒక ఉద్దేశ్యమేదనగా “(మన) దేవుడైన ప్రభువు (మనకు) ఆజ్ఞాపించిన వాటన్నిటిని (మనము) చేస్తామా అని చూచుటకు” “మనల్ని పరీక్షించుట”(అబ్రహాము 3:25). ఈ ప్రణాళిక యొక్క భాగముగా, మనము దేవునికి మరియు ఆయన ఎంపిక చేసిన సేవకులకు జవాబుదారులము, మరియు ఆ జవాబుదారీతనము మర్త్య మరియు దైవిక తీర్పులు రెండిటిని కలిపియున్నది.

ప్రభువు యొక్క సంఘములో, సభ్యుల కొరకు లేక కాబోయే సభ్యుల మర్త్య తీర్పులు దైవిక నడిపింపును వెదకు నాయకుల చేత నిర్వహించబడును. నిత్యజీవమునకు నడిపించు నిబంధన బాటపై ఆయన ప్రాయశ్చిత్త శక్తిని పొందుటకు క్రీస్తు నొద్దకు వచ్చుటకు వెదకు వ్యక్తులను తీర్పు తీర్చుట వారి బాధ్యతగా ఉన్నది. మర్త్య తీర్పులు ఒక వ్యక్తి బాప్తీస్మము కొరకు సిద్ధముగా ఉన్నాడా లేదో తీర్మానిస్తాయి. ఒక వ్యక్తి దేవాలయమునకు హాజరగుటకు ఒక సిఫారసును కలిగియుండుటకు యోగ్యత కలిగియున్నాడా? సంఘ నివేదికల నుండి పేరు తీసివేయబడిన వ్యక్తి, బాప్తీస్మము ద్వారా తిరిగి చేర్చబడుటకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా తగినంతగా పశ్చాత్తాపపడ్డాడా?

దేవుని చేత పిలువబడిన ఒక మర్త్య న్యాయవాది, ఒక వ్యక్తి దేవాలయము వంటి ఎక్కువ అభివృద్ధి కొరకు అనుమతించినప్పుడు, అతడు ఆ వ్యక్తిని పరిపూర్ణుడని ఖరారు చేయటం లేదు, మరియు అతడు ఏ పాపములు క్షమించుట లేదు. మర్త్య పాపము వలన విశేషావకాశములను మరియు దీవెనలను తాత్కాలికంగా కోల్పోవుటగా ఆయన పిలిచిన దానిని ఎల్డర్ స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ బోధించారు, ఒక వ్యక్తి “పశ్చాత్తాపము ద్వారా దేవుని నుండి క్షమాపణను వెదకాలి మరియు పొందాలి, మరియు ఆయన మాత్రమే పాపము నుండి క్షమాపణ ఇవ్వగలడు.”5 అంతిమ తీర్పు వరకు పాపకరమైన చర్యలు మరియు కోరికలు పశ్చాత్తాపపడని యెడల, పశ్చాత్తాపపడని వ్యక్తి అపరిశుద్ధునిగా నిలిచియుంటాడు. పశ్చాత్తాపము యొక్క అంతిమ శుద్ధీకరణ ప్రభావము కలిపి, అంతిమ జవాబుదారీతనము, మనలో ప్రతీఒక్కరి మరియు దేవుని మధ్య ఉండును.

III. పునరుత్థానము మరియు అంతిమ తీర్పు

లేఖనములలో సర్వసాధారణంగా వివరించబడిన తీర్పు అంతిమ తీర్పు, అది పునరుత్థానము తరువాత జరుగును (2 నీఫై 9:15 చూడుము). “అశాశ్వతమైన శరీరమందు మీరు చేసియున్న క్రియలను బట్టి, తీర్పు తీర్చబడుటకు” (ఆల్మా 5:15; ఆల్మా 41:3; 3 నీఫై 26:4; బయల్పాటు 20:12 కూడ చూడుము), “మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము,” (రోమా 14:10; 2 నీఫై 9:15; మోషైయ 27:31 కూడా చూడుము) అని అనేక లేఖనములు వివరించాయి. అందరూ “వారి క్రియలను బట్టి ” (3నీఫై 27:15) మరియు “వారి హృదయము యొక్క కోరిక(లను) బట్టి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 137:9; ఆల్మా 41:6 కూడా చూడుము) తీర్పు తీర్చబడతారు.

ఈ అంతిమ తీర్పు యొక్క ఉద్దేశము మనము ఆల్మా వివరించిన “హృదయము యొక్క బలమైన మార్పు” (see Alma 5:14, 26), పొందామో లేదో తీర్మానించుట, అక్కడ మనము “చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరిక లేక నిరంతరము మంచి చేయుటకు కోరిక” (మోషైయ 5:2) తో నూతన సృష్టిగా మారతాము. దానికి న్యాయవ్యాది మన రక్షకుడైన, యేసు క్రీస్తు (యోహాను 5:22; 2 నీఫై 9:41 చూడుము). ఆయన తీర్పు తరువాత “ఆయన తీర్పులు న్యాయమైనవి” (మోషైయ16:1; 27:31; ఆల్మా 12:15 కూడా చూడుము), అని మనమందరము ఒప్పుకుంటాము, ఎందుకనగా ఆయన సర్వవ్యాపకత్వము (2 నీఫై 9:15, 20 చూడుము) ఆయనకు నీతిగల లేక పశ్చాత్తాపపడిన మరియు పశ్చాత్తాపపడని, లేక మార్పు చెందని మన సమస్త క్రియలు మరియు కోరికల యొక్క పరిపూర్ణమైన జ్ఞానమును ఇచ్చెను.

ఈ అంతిమ తీర్పు యొక్క ప్రక్రియను లేఖనాలు వివరిస్తున్నాయి. పునరుత్థానములో “అన్ని వస్తువులు వాటి సరియైన క్రమమునకు పునఃస్థాపించబడుట”(ఆల్మా 41:2) మన దేవుని యొక్క న్యాయమునకు అవసరమైయున్నదని ఆల్మా బోధిస్తున్నాడు. “ఈ జీవితమందు వారి క్రియలు మంచివైన మరియు వారి హృదయముల యొక్క కోరికలు మంచివైన యెడల … (వారు) అంత్యదినమున మంచిదైన దానికి పునఃస్థాపించబడతారు,”(ఆల్మా 41:3) అని దీని అర్ధము. అదేవిధంగా, “వారి క్రియలు (లేక వారి కోరికలు) చెడ్డవైన యెడల చెడు నిమిత్తము వారు వారికి పునఃస్థాపించబడవలెను”(ఆల్మా 41:4–5; హీలమన్ 14:31 కూడా చూడుము). అదేవిధంగా, అంతిమ తీర్పులో “నీతిమంతులైనవారు ఇంకనూ నీతిమంతులుగా ఉందురు, మరియు అసహ్యులు ఇంకనూ అసహ్యులుగా ఉందురు”(2 నీఫై 9:16; మోర్మన్ 9:14; 1నీఫై 15:33 కూడ చూడుము) అని ప్రవక్త జేకబ్ బోధించాడు. “సజీవులకు మరియు మృతులు ఇద్దరి యొక్క నిత్యుడైన న్యాయాధిపతి గొప్ప యెహోవా యొక్క ప్రీతికరమైన న్యాయపీఠము” (మొరోనై 10:34; 3 నీఫై 27:16 కూడా చూడుము) అని మొరోనై పిలిచిన దాని ముందు మనం నిలబడేముందు జరిగే ప్రక్రియ అది.

దేవుని యెదుట మనము శుద్ధి చేయబడ్డామని నిశ్చయపరచుటకు, మనము అంతిమ తీర్పుకు ముందుగా పశ్చాత్తాపపడాలి (మోర్మన్ 3:22 చూడుము). ఆల్మా తన పాపియైన కుమారునికి చెప్పినట్లుగా, దేవుని యొదట మన పాపములను దాచలేము, “మరియు నీవు పశ్చాత్తాపము పొందని యెడల అంత్య దినమున నీకు వ్యతిరేకముగ, ఒక సాక్ష్యము వలే అవి నిలువబడును”(ఆల్మా 39:8; వివరణ చేర్చబడింది). యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపము ద్వారా అవసరమైన శుద్ధీకరణను సాధించుటకు ఏకైక మార్గము, మరియు ఈ మర్త్య జీవితము దానిని చేయుటకు మన సమయము. ఆత్మ లోకములో కొంత పశ్చాత్తాపము సంభవించునని మనము బోధింపబడినప్పటికినీ, (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:31, 33, 58 చూడుము), అది ఖచ్చితంగా కాదు. ఎల్డర్ మెల్విన్ జే. బ్యాలర్డ్ ఇలా బోధించారు: “శరీరము మరియు ఆత్మ రెండు ఒకటిగా కలిసియున్నప్పుడు జయించుట మరియు ప్రభవును సేవించుట ఎక్కువ సులభమైనది. స్త్రీలు, పురుషులు ఎక్కువ ప్రభావితం చేయబడి మరియు అనుకూలంగా మారే సమయమిది. ఈ జీవితము పశ్చాత్తాపపడు సమయము. ”6

మనము పశ్చాత్తాపపడినప్పుడు, మన క్రియలు, కోరికలు కలిపి మన పాపములు శుద్ధి చేయబడునని మరియు మన కనికరముగల అంతిమ న్యాయవ్యాది “వాటిని ఇక జ్ఞాపకముంచుకొనడు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42; యెషయా 1:18; యిర్మీయా 31:34; హెబ్రీయులకు 8:12; ఆల్మా 41:6; హీలమన్ 14:18–19 కూడా చూడుము) అనే ప్రభువు యొక్క అభయమును మనము కలిగియున్నాము. పశ్చాత్తాపము ద్వారా శుద్ధి చేయబడి, మనము నిత్య జీవము కొరకు యోగ్యులు కాగలము, దానిని రాజైన బెంజిమెన్ ఇలా వర్ణించెను, “దేవునితో ఎన్నడును అంతము కాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు”(M 2:41; సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7కూడా చూడుము).

దేవుని “పునఃస్థాపన యొక్క ప్రణాళికలో ”(ఆల్మా 41:2) మరొక భాగముగా పునరుత్థానము, “సమస్త వస్తువులు … వాటి సరియైన మరియు పరిపూర్ణ రూపమునకు” పునఃస్థాపించబడును(ఆల్మా 40:23). ఇది పుట్టుక లేక గాయము లేక వ్యాధి యందు కలిగిన వాటిని కలిపి, మర్త్యత్వములో పొందబడిన మన సమస్త శారీరక లోపములు మరియు అంగవైకల్యముల యొక్క పరిపూర్ణతను కలిపియున్నది.

ఈ పునఃస్థాపన మన అపవిత్రమైన లేక అదుపు చేయబడని కోరికలు లేక వ్యసనముల నుండి మనల్ని శుద్ధి చేస్తుందా? అది చేయలేదు. మన కోరికలు అదేవిధంగా మన క్రియల (ఆల్మా 41:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 137:9 చూడుము) కొరకు తీర్పు తీర్చబడతామని మరియు మన ఆలోచనలు మనల్ని ఖండిస్తాయని కూడ ఆధునిక బయల్పాటు నుండి మనము ఎరిగియున్నాము (ఆల్మా 12:14 చూడుము). మనము మరణము వరకు “పశ్చాత్తాపము యొక్క దినమును వాయిదా” వేయరాదని, ఆల్మా బోధించాడు (ఆల్మా 34:33), ఎందుకనగా ఈ జీవితములో మనము కలిగియున్న అదే ఆత్మ—ప్రభువు యొక్క లేక సాతాను యొక్క ఆత్మ అయినప్పటికినీ—“అదే ఆత్మ నిత్య లోకములో మీ శరీరమును స్వాధీనపరచుకొనుటకు శక్తి కలిగియుండును” (ఆల్మా 34:34). మన రక్షకుడు చెడు నుండి మనల్ని శుద్ధి చేయుటకు శక్తి కలిగియున్నాడు మరియు సిద్ధముగా ఉన్నాడు. మన దుష్టమైన లేక అయోగ్యమైన కోరికలు మరియు ఆలోచనలు శుద్ధి చేయబడుటకు మరియు అంతిమ తీర్పుయందు దేవుని యెదుట నిలబడుటకు సిద్ధముగా ఉండుటకు పశ్చాత్తాపడుటకు ఆయన సహాయము కోరుటకు ఇదే సమయము.

IV. కరుణగల బాహువులు

దేవుని యొక్క ప్రణాళిక మరియు ఆయన ఆజ్ఞలన్నిటి యొక్క ప్రతీభాగమును ప్రభావితం చేసేది, మనలో ప్రతీఒక్కరి కొరకు ఆయన ప్రేమ, అది “అన్ని వస్తువులను మించి కోరదగినది … మరియు ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది”(1 నీఫై 11:22–23). “వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును … (మరియు) బహుగా క్షమించును” అని ప్రవక్త యెషయా అభయమిచ్చెను (యెషయా 55:7). “ఇదిగో, మనుష్యులందరిని ఆయన ఆహ్వానించుచున్నాడు, నా యొద్దకు రండి మరియు మీరు జీవవృక్షము యొక్క ఫలమును పాలుపొందుదురు, అవును, మీరు జీవము యొక్క రొట్టెను మరియు జీవజలములను ఉచితముగా తిందురు మరియు త్రాగెదరు,” అని ఆల్మా బోధించాడు (ఆల్మా 5:33; 2 నీఫై 26:25–33) కూడా చూడుము. పునరుత్థానుడైన ప్రభువు నీఫైయులతో ఇలా చెప్పాడు, “ఇదిగో, నా కనికరము యొక్క బాహువు మీవైపు చాపబడినది, మరియు వచ్చు వానిని నేను చేర్చుకొందును మరియు నా యొద్దకు వచ్చు వారు ధన్యులు” (3 నీఫై 9:14). ఇవి మరియు అనేక ఇతర లేఖన బోధనల నుండి, ఆయన పిల్లల కొరకు దేవుని యొక్క అత్యంత గొప్ప దీవెనలు ఆనందించుటకు ఆయన ఇచ్చిన ప్రేమగల షరతులపై పురుషులు మరియు స్త్రీలు అందరిని స్వీకరించుటకు మన ప్రేమగల రక్షకుడు తన బాహువులను చాపియున్నాడని మనము ఎరుగుదుము.7

దేవుని యొక్క ప్రణాళిక మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మరియు మనము పశ్చాత్తాప ప్రక్రియ ద్వారా శుద్ధి చేయబడగలమని, “పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ” తో నేను సాక్ష్యమిస్తున్నాను. “క్రీస్తు వాక్యమును విందారగించుచూ ముందునకు త్రోసుకొనివెళ్ళిపోయి, మరియు అంతము వరకు స్థిరముగా నుండిన యెడల, ఇదిగో మీరు నిత్యజీవమును పొందుదురని తండ్రి ఇట్లు చెప్పుచున్నాడు” (2 నీఫై 31:20). మనమందరము ఆవిధంగా చేయుదుము గాక, యేసు క్రీస్తు యొక్క నామములో నేను వేడుకొంటున్నాను మరియు ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. “Come unto Jesus,” Hymns, no. 117.

  2. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Repentance and Conversion,” Liahona, మే 2007, 102.

  3. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Four Gifts that Jesus Christ Offers to You” (2018 First Presidency Christmas Devotional, Dec. 2, 2018), broadcasts.

  4. రస్సెల్ ఎమ్. నెల్సన్, “We Can Do Better and Be Better,” Liahona, మే 2019.

  5. The Teachings of Spencer W. Kimball, ed. Edward L. Kimball (1982), 101.

  6. Melvin J. Ballard, in Melvin R. Ballard, Melvin J. Ballard: Crusader for Righteousness (1966), 212–13.

  7. టాడ్ ఆర్. కాలిస్టర్, The Infinite Atonement (2000), 27–29 చూడుము.