సర్వసభ్య సమావేశము
విశ్వాసంతో భవిష్యత్తును హత్తుకోండి
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


విశ్వాసంతో భవిష్యత్తును హత్తుకోండి

ప్రభువు హస్తములలో సాధనములుగా ఉండుటకు సిద్ధపడిన మరియు సిద్ధపాటును కొనసాగిస్తూ ఉన్న వారికి భవిష్యత్తు అద్భుతముగా ఉంటుంది.

ఇది మరుపురాని సాయంత్రం. నా ప్రియమైన సహోదరీలారా, మీతో ఉండుటను నేను గౌరవప్రదంగా భావిస్తున్నాను. ఈ గత కొన్ని నెలల్లో మీరు చాలా తరచుగా నా మనస్సులో మెదిలారు. మీరు ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువగా ఉండి, బలంగా ఉన్నారు. ప్రపంచాన్ని మార్చడానికి మీరు సంఖ్యాబలాన్ని మాత్రమే కాదు, ఆత్మీయ శక్తిని కూడా కలిగియున్నారు. ఈ మహమ్మారి సమయంలో మీరు అలా చేయడం నేను చూశాను.

మీలో కొందరు అకస్మాత్తుగా వస్తువుల కొరతను ఎదుర్కొన్నారు లేదా క్రొత్త ఉద్యోగం కోసం శోధిస్తున్నారు. చాలా మంది పిల్లలకు బోధించారు మరియు పొరుగువారి మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. కొందరు సువార్తికులను ఊహించిన దానికంటే ముందే ఇంటికి స్వాగతించారు, మరికొందరు మీ ఇళ్ళను సువార్తసేవ శిక్షణా కేంద్రాలుగా మార్చారు. మీరు కుటుంబం మరియు స్నేహితులతో మాట్లాడుటకు, ఒంటరిగా ఉన్నవారికి పరిచర్య చేయుటకు మరియు ఇతరులతో రండి, నన్ను అనుసరించండి అధ్యయనం చేయుటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. విశ్రాంతిదినమును ఆనందంగా మలుచుటకు మీరు కొత్త మార్గాలను కనుగొన్నారు. మరియు మీరు మిలియన్ల కొలది రక్షిత మాస్కులు తయారు చేసారు!

తమ ప్రియమైనవారిని కోల్పోయిన ప్రపంచంలోని చాలామంది మహిళల పట్ల నా హృదయపూర్వక జాలిని, ప్రేమను నేను కలిగియున్నాను. మేము మీతోపాటు దుఃఖిస్తున్నాము. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడడానికి నిర్విరామంగా పనిచేసే వారందరినీ మేము ప్రశంసిస్తున్నాము మరియు వారికొరకు ప్రార్థిస్తున్నాము.

యువతులైన మీరు కూడా విశేషమైనవారు. సామాజిక మాధ్యమం వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, మీలో చాలామంది ఇతరులను ప్రోత్సహించడానికి మరియు మన రక్షకుని వెలుగును పంచుకోవడానికి మార్గాలను కనుగొన్నారు.

సహోదరీలారా, మీరంతా ఖచ్చితంగా వీరోచితంగా ఉన్నారు! మీ బలం మరియు మీ విశ్వాసం చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను. క్లిష్ట పరిస్థితులలో, మీరు ధైర్యంగా ముందుకు సాగుతారని మీరు చూపించారు. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను మరియు ప్రభువు మిమ్ములను ప్రేమిస్తున్నారని మరియు మీరు చేస్తున్న గొప్ప పనిని చూస్తున్నారని నేను మీకు అభయమిస్తున్నాను. మీకు ధన్యవాదాలు! మీరు అక్షరాలా ఇజ్రాయేలీయుల యొక్క నిరీక్షణ అని మరోసారి నిరూపించారు!

25 సంవత్సరాల క్రితం 1995 సెప్టెంబరు సర్వసభ్య ఉపశమన సమాజ సమావేశంలో “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”ను పరిచయం చేసినప్పుడు అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ మీ కొరకు కలిగియున్న ఆశలకు మీరు రూపమిచ్చారు. 1 ఈ ముఖ్యమైన ప్రకటనను సంఘము యొక్క సహోదరీలకు పరిచయం చేయడానికి ఆయన ఎంచుకోవడం విశేషం. అలా చేయడం ద్వారా, అధ్యక్షులు హింక్లీ ప్రభువు యొక్క ప్రణాళికలో స్త్రీల యొక్క విశిష్టమైన ప్రభావాన్ని నొక్కిచెప్పారు.

ఇప్పుడు, మీరు ఈ సంవత్సరం ఏమి నేర్చుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ప్రభువుకు దగ్గరయ్యారా లేదా మీరు ఆయనకు మరింత దూరంగా ఉన్నారా? ప్రస్తుత సంఘటనలు భవిష్యత్తు గురించి మీరు ఎలా భావించేలా చేసాయి?

మనమందరం అంగీకరించినట్లుగా, ప్రభువు మన కాలం గురించి గంభీరంగా మాట్లాడారు. మన రోజుల్లో “మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు” 2 మరియు చాలామంది ఎన్నుకోబడినవారు కూడా మోసపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్ఛరించారు. 3 “భూమిపై నుండి సమాధానము తీసివేయబడుతుంది” 4 మరియు మానవాళికి విపత్తులు సంభవిస్తాయని ఆయన ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌తో చెప్పారు. 5

అయినప్పటికీ ఈ యుగము ఎంత గొప్పదోనని ప్రభువు ఒక దర్శనము ఇచ్చారు. ఆయన ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌ను ఇలా ప్రకటించమని ప్రేరేపించారు, “ఈ అంతిమ దినములలో … చేయు పని చాలా ఘనమైనది. … దాని కీర్తి మాటలలో వర్ణించలేనిది, మరియు దాని వైభవాన్ని మించినది లేదు.” 6

ఇప్పుడు, ఈ గత కొన్ని నెలలను వివరించడానికి వైభవం అనేది మీరు ఎంచుకున్న పదం కాకపోవచ్చు! మన కాలంలోని అద్భుతమైన ప్రవచనాలు మరియు దివ్యమైన ప్రకటనలు రెండింటితో మనం ఎలా వ్యవహరించాలి? సరళమైన, కానీ అద్భుతమైన అభయముతో ప్రభువు మనకు ఇలా బోధించారు: “మీరు సిద్ధపడియుండిన యెడల మీరు భయపడకయుందురు.” 7

ఎంత గొప్ప వాగ్దానము! మనం మన భవిష్యత్తును చూసే విధానాన్ని ఇది అక్షరాలా మార్చగలదు. సాల్ట్ లేక్ లోయలో భూకంపంతో పాటు కరోనా మహమ్మారి, ఆమె అనుకున్నంత సిద్ధంగా ఆమె లేదని గ్రహించడంలో సహాయపడిందని లోతైన సాక్ష్యం ఉన్న ఒక మహిళ అంగీకరించడం నేను ఇటీవల విన్నాను. ఆమె తన ఆహార నిల్వను లేదా ఆమె సాక్ష్యమును సూచిస్తుందా అని నేను అడిగినప్పుడు, ఆమె నవ్వి, “అవును!” అని చెప్పింది.

ఈ యుగమును, మన భవిష్యత్తును విశ్వాసంతో హత్తుకోవడానికి సిద్ధపాటే కీలకం అయితే, మనం ఎలా ఉత్తమంగా సిద్ధపడగలము?

దశాబ్దాలుగా, ప్రభువు యొక్క ప్రవక్తలు ఆహారం, నీరు మరియు ఆర్ధిక నిల్వలను అవసరమైన సమయం కొరకు నిల్వ చేయమని కోరారు. ప్రస్తుత మహమ్మారి ఆ సలహా యొక్క జ్ఞానాన్ని బలోపేతం చేసింది. తాత్కాలికంగా సిద్ధంగా ఉండడానికి చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. కానీ నేను మీ ఆత్మీయ మరియు భావోద్వేగ సిద్ధపాటు గురించి మరింత ఆందోళన చెందుతున్నాను.

ఆ విషయంలో, ముఖ్యాధికారియైన మొరోనై నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. నీఫైయుల సైన్యాధిపతిగా, అతడు అధిక సంఖ్యాకులైన, బలమైన మరియు నీచమైన ప్రత్యర్థి శక్తులను ఎదుర్కొన్నాడు. కాబట్టి, మొరోనై తన ప్రజలను మూడు ముఖ్యమైన మార్గాల్లో సిద్ధం చేశాడు.

మొదట, వారు సురక్షితంగా ఉండే ప్రాంతాలను సృష్టించడానికి అతడు వారికి సహాయం చేశాడు- “రక్షణ స్థలములు” అని వాటికి పేరు పెట్టాడు. 8 రెండవది, “ప్రభువైన వారి దేవునిపట్ల విశ్వాసముగా ఉండుటకు జనుల మనస్సులను” అతడు సిద్ధపరిచాడు. 9 మరియు మూడవది, అతడు తన ప్రజలను శారీరకంగా లేదా ఆధ్యాత్మికంగా సిద్ధం చేయడాన్ని ఎప్పుడూ ఆపలేదు. 10 ఈ మూడు సూత్రాలను పరిశీలిద్దాం.

మొదటి సూత్రం: రక్షణ స్థలాలను సృష్టించడం.

మొరోనై ప్రతి నీఫై నగరాన్ని కరకట్టలు, కోటలు మరియు గోడలతో బలపరిచాడు. 11 లేమనీయులు వారికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు, వారు “వారి రక్షణ స్థలములను సిద్ధపరచుకొనుటలో నీఫైయుల తెలివిని బట్టి మిక్కిలిగా అచ్చెరువొందిరి.” 12

అదేవిధంగా, మన చుట్టూ గందరగోళం పెరుగుతున్నప్పుడు, మనము శారీరకంగా, ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉండగలిగే ప్రదేశాలను మనం సృష్టించాలి. ఆత్మ నివసించే మీ గృహము విశ్వాసం యొక్క వ్యక్తిగత అభయారణ్యం అయినప్పుడు మీ ఇల్లు రక్షణ యొక్క మొదటి ప్రదేశం అవుతుంది.

అదేవిధంగా, సీయోను యొక్క స్టేకులు “తుఫాను నుండి ఆశ్రయదుర్గములు,” 13 ఎందుకంటే అవి యాజకత్వ తాళపుచెవులను కలిగియుండి, యాజకత్వ అధికారాన్ని వినియోగించే వారిచేత నడిపించబడతాయి. మీకు మార్గనిర్దేశం చేయడానికి ప్రభువు అధికారం ఇచ్చిన వారి సలహాలను మీరు అనుసరిస్తూ ఉన్నప్పుడు, మీకు ఎక్కువ భద్రత లభిస్తుంది.

ప్రభువు యొక్క గృహమైన దేవాలయం ఇతర ప్రదేశాలకు భిన్నంగా ఉండే సురక్షిత ప్రదేశం. సహోదరీలారా, అక్కడ మీరు చేసే పవిత్ర యాజకత్వ నిబంధనల ద్వారా యాజకత్వ శక్తిని మీరు వరముగా పొందుతారు. 14 అక్కడ, మీ కుటుంబాలు నిత్యత్వము కొరకు ముద్రవేయబడతాయి. ఈ సంవత్సరం, మన దేవాలయ ప్రవేశం తీవ్రంగా పరిమితం చేయబడినప్పుడు కూడా మీరు ఆయనతో చేసిన మీ నిబంధనలను గౌరవించినందుకు మీ దేవాలయ దీవెన నిరంతరం దేవుని శక్తి మీకు లభించేలా చేసింది.

సరళంగా చెప్పాలంటే, మీరు పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించగలిగి, ఆయన చేత మార్గనిర్దేశం చేయబడే ఏ ప్రదేశమైనా రక్షణ స్థలమే. 15 పరిశుద్ధాత్మ మీతో ఉన్నప్పుడు, ప్రబలంగా ఉన్న అభిప్రాయాలకు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు కూడా మీరు సత్యాన్ని బోధించవచ్చు. మరియు మీరు సువార్త గురించి హృదయపూర్వక ప్రశ్నలను బయల్పాటు వాతావరణంలో ఆలోచించవచ్చు.

నా ప్రియమైన సహోదరీలారా, రక్షణ స్థలమైన గృహాన్ని సృష్టించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యాజకత్వ శక్తి, దేవాలయ నిబంధనలు మరియు ఆశీర్వాదాల గురించి మీ అవగాహన పెంచుకోమనే నా ఆహ్వానాన్ని మీ కోసం నూతనపరుస్తున్నాను. మీరు వెనక్కి వెళ్ళగల రక్షణ స్థలాలను కలిగి ఉండడం భవిష్యత్తును విశ్వాసంతో హత్తుకోవడానికి మీకు సహాయపడుతుంది.

రెండవ సూత్రం: దేవునిపట్ల నమ్మకంగా ఉండడానికి మీ మనస్సును సిద్ధం చేయండి

సాల్ట్ లేక్ దేేవాలయము యొక్క మన్నిక మరియు సామర్థ్యాన్ని విస్తరించడానికి మేము ఒక పెద్ద ప్రాజెక్టును చేసాము.

చిత్రం
సాల్ట్ లేక్ దేవాలయ నిర్మాణం

ఇలాంటి అసాధారణ చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని కొందరు ప్రశ్నించారు. ఏదేమైనా, ఈ సంవత్సరం ప్రారంభంలో సాల్ట్ లేక్ లోయలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు, ఈ గౌరవనీయమైన ఆలయం గట్టిగా కదిలి మొరోనై దేవదూత విగ్రహంపైనున్న బూర పడిపోయింది! 16

చిత్రం
పడిపోయిన బూరతో మొరోనై దేవదూత

సాల్ట్ లేక్ దేవాలయము యొక్క భౌతిక పునాది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేంత బలంగా ఉండవలసిన విధంగా, మన ఆధ్యాత్మిక పునాదులు కూడా దృఢంగా ఉండాలి. అప్పుడు, రూపకాలంకార భూకంపాలు మన జీవితాలను కదిలించినప్పుడు, మన విశ్వాసం కారణంగా మనం “స్థిరంగా మరియు కదలకుండా” నిలబడగలం. 17

“అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా కూడా నేర్చుకొనుటకు 18 ప్రయత్నించుట ద్వారా మన విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో ప్రభువు మనకు నేర్పించారు. ఆయన ఆజ్ఞలను పాటించుటకు మరియు “ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు” 19 ప్రయత్నిస్తున్నప్పుడు మనము యేసు క్రీస్తు నందు మన విశ్వాసాన్ని బలపరచుకుంటాము. ఇంకా, ఆయనయందు మన విశ్వాసాన్ని సాధన చేసిన ప్రతిసారీ ఆయనపై మన విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ద్వారా నేర్చుకోవడం అంటే అర్థం ఇదే.

ఉదాహరణకు, దేవుని చట్టాలకు విధేయులుగా ఉండడానికి మనం విశ్వాసం కలిగియున్న ప్రతిసారీ—ప్రజాదరణ పొందిన అభిప్రాయాలు మనలను తక్కువ చేసినప్పుడు—లేదా మనము వినోదం లేదా నిబంధనలను విచ్ఛిన్నం చేసే భావజాలాలను వ్యతిరేకిస్తున్న ప్రతిసారీ మనము మన విశ్వాసాన్ని సాధన చేస్తున్నాము, అది మన విశ్వాసాన్ని పెంచుతుంది.

ఇంకా, మోర్మన్ గ్రంథములో క్రమంగా నిమగ్నమవ్వడం కంటే ఎక్కువగా ఏది విశ్వాసాన్ని పెంచదు. ఇంత శక్తి మరియు స్పష్టతతో యేసు క్రీస్తు గురించి మరే గ్రంథము సాక్ష్యం ఇవ్వలేదు. దాని ప్రవక్తలు, ప్రభువు ప్రేరణతో మన కాలాన్ని చూశారు మరియు మనకు చాలా వరకు సహాయపడే సిద్ధాంతాన్ని, సత్యాలను ఎంచుకున్నారు. మోర్మన్ గ్రంథముఅనేది మన కడవరి-దినపు మనుగడకు మార్గదర్శి.

వాస్తవానికి, మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై మన కాడిని మోపినప్పుడు మన అంతిమ భద్రత కలుగుతుంది! దేవుడు లేని జీవితం భయంతో నిండిన జీవితం. దేవునితో గడిపే జీవితం శాంతితో నిండిన జీవితం. దీనికి కారణం, విశ్వాసులకు ఆత్మీయ దీవెనలు రావడం. వ్యక్తిగత బయల్పాటు పొందడం ఆ గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి.

మనం అడిగితే, “బయల్పాటు వెంబడి బయల్పాటు” పొందవచ్చని ప్రభువు వాగ్దానం చేశారు. 20 బయల్పాటు పొందే సామర్థ్యాన్ని మీరు పెంచుకున్నప్పుడు, మీ జీవితానికి అధికమైన నడిపింపుతో మరియు ఆత్మ యొక్క అనంతమైన బహుమతులతో ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను.

మూడవ సూత్రం: ఎప్పుడూ సిద్ధపాటును ఆపవద్దు

పరిస్థితులు బాగా ఉన్నప్పుడు కూడా ముఖ్యాధికారియైన మొరోనై తన జనులను సిద్ధం చేస్తూనే ఉన్నాడు. అతడు ఎప్పుడూ ఆగలేదు. అతడు ఎప్పుడూ సంతృప్తి చెందలేదు.

విరోధి ఎప్పుడూ దాడి చేయడాన్ని ఆపడు. కాబట్టి, మనం ఎప్పటికీ మన సిద్ధపాటును ఆపలేము! మనం ఐహికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంత ఎక్కువ స్వయంసమృద్ధిని కలిగియుంటే అంత ఎక్కువగా సాతాను యొక్క కనికరంలేని దాడులను అడ్డుకోవడానికి మనము సిద్ధంగా ఉంటాము.

ప్రియమైన సహోదరీలారా, మీ కొరకు మరియు మీరు ఇష్టపడేవారి కొరకు రక్షణ స్థలాలను సృష్టించడంలో మీరు ప్రవీణులు. ఇంకా, మీరు దైవిక వరాన్ని కలిగియున్నారు, అది ఇతరులలో బలమైన మార్గాల్లో విశ్వాసాన్నిపెంపొందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 21 మరియు మీరు ఎప్పటికీ ఆగరు. దానిని మీరు ఈ సంవత్సరం మరోసారి ప్రదర్శించారు.

దయచేసి, దానిని కొనసాగించండి! మీ గృహాలను పరిరక్షించడంలో మరియు మీ ప్రియమైనవారి హృదయాలలో విశ్వాసాన్ని కలిగించడంలో మీ అప్రమత్తత రాబోయే తరాలకు ప్రతిఫలాలను ఇస్తుంది.

నా ప్రియమైన సహోదరీలారా, ఎదురుచూచుటకు మనకుచాలా విషయాలు ఉన్నాయి! ఈ కడవరి దినముల చివరి భాగంలోని సంక్లిష్టతలను చర్చించే సామర్థ్యం మీకు ఉందని ఆయనకు తెలుసు కాబట్టి ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచారు. మీరు ఆయన కార్యము యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తారని మరియు దానిని జరిగించడానికి సహాయపడడంలో ఆతృతగా ఉంటారని ఆయనకు తెలుసు.

రాబోయే రోజులు సులభంగా ఉంటాయని నేను అనడం లేదు, కానీ సిద్ధపడిన వారికి మరియు ప్రభువు చేతిలో సాధనంగా ఉండడానికి సిద్ధమవుతున్నవారికి భవిష్యత్తు మహిమకరముగా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.

నా ప్రియమైన సహోదరీలారా, ఈ ప్రస్తుత పరిస్థితిని మాత్రమే సహించడం కాదు, భవిష్యత్తును విశ్వాసంతో హత్తుకుందాం! గందరగోళ సమయాలు మనకు ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు. అవి ప్రశాంతమైన సమయాల్లో కంటే ఎక్కువగా మన ప్రభావం చొచ్చుకుపోగల సందర్భాలు.

మనము రక్షణ స్థలాలను సృష్టించేటప్పుడు, దేవునిపట్ల నమ్మకంగా ఉండడానికి మన మనస్సులను సిద్ధం చేసుకుని, ఎప్పుడూ మన సిద్ధపాటును ఆపకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను. ఆయన “మనల్ని విడిపించును … ఎంత అధికముగాననగా, ఆయన మన ఆత్మలతో సమాధానమును పలికి మనకు గొప్ప విశ్వాసమును అనుగ్రహించును మరియు … ఆయన యందు మన విడుదల కొరకు మనము నిరీక్షించునట్లు చేయును” 22

మీరు విశ్వాసంతో భవిష్యత్తును హత్తుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఈ వాగ్దానాలు మీ సొంతం అవుతాయి! మీ కొరకు నా ప్రేమను, మీ యందు నా నమ్మకమును వ్యక్తపరుస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.