సర్వసభ్య సమావేశము
మనం ఎప్పటికీ మరచిపోలేని విషయాలు నేర్చుకుంటున్నాము
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మనం ఎప్పటికీ మరచిపోలేని విషయాలు నేర్చుకుంటున్నాము

మీరు మీ జీవితాన్ని ప్రార్థనతో చూస్తే, ఈ కష్ట సమయంలో ప్రభువు మీకు మార్గనిర్దేశం చేస్తున్న అనేక మార్గాలను మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను.

నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో ఈ వర్చువల్ సమావేశములో పాల్గొనుట కోసం ఎదురుచూశాను. మేము చివరిసారిగా సర్వసభ్య సమావేశము యొక్క యాజకత్వ సభను 2019 ఏప్రిల్‌లో నిర్వహించాము. గత రెండేళ్ళలో చాలా జరిగింది! మీలో కొందరు ప్రియమైన వారిని కోల్పోయారు. మరికొందరు ఉద్యోగాలు, జీవనోపాధి లేదా ఆరోగ్యాన్ని కోల్పోయారు. మరికొందరు శాంతి భావాన్ని లేదా భవిష్యత్తు కోసం ఆశను కోల్పోయారు. ఇవి లేదా ఇతర నష్టాలను అనుభవించిన మీలో ప్రతి ఒక్కరి కొరకు నేను సానుభూతిని కలిగియున్నాను. ప్రభువు మిమ్మల్ని ఓదార్చాలని నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలో దేవునికి ప్రాధాన్యతనివ్వడాన్ని మీరు కొనసాగిస్తున్నప్పుడు, ఆయన మీ భవిష్యత్తు గురించి ఎప్పటిలాగే ఆశాజనకంగా ఉన్నారని నాకు తెలుసు.

మనము అనుభవించిన నష్టాల మధ్య, మనం కనుగొన్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. కొందరు మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుయందు లోతైన విశ్వాసం కనుగొన్నారు. చాలామంది జీవితంపై సరికొత్త దృక్పథాన్ని—నిత్య దృక్పథాన్ని కూడా కనుగొన్నారు. మీ ప్రియమైనవారితో మరియు ప్రభువుతో మీరు బలమైన సంబంధాలను కనుగొనియుండవచ్చు. ఆయనను వినడానికి మరియు వ్యక్తిగత బయల్పాటు పొందడానికి హెచ్చైన సామర్థ్యాన్ని మీరు కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను. కష్టతరమైన శ్రమలు మనం అభివృద్ధి చెందడానికి తరచూ అవకాశాలను అందిస్తాయి, అది వేరే విధంగా రాదు.

గత రెండేళ్ళ గురించి తిరిగి ఆలోచించండి. మీరు ఎలా అభివృద్ధి చెందారు? మీరు ఏమి నేర్చుకున్నారు? మీరు మొదట్లో 2019కి తిరిగి వెళ్ళి అక్కడే జీవించాలని కోరుకొని ఉండవచ్చు! కానీ మీరు మీ జీవితాన్ని ప్రార్థనాపూర్వకముగా చూస్తే, మరింత భక్తి కలిగి, పరివర్తన చెందిన మనిషిగా, దేవుని యొక్క నిజమైన మనిషిగా మారడానికి మీకు సహాయం చేస్తూ, ఈ కష్ట సమయాల్లో ప్రభువు మీకు మార్గనిర్దేశం చేస్తున్న అనేక మార్గాలను మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను.

వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ప్రభువు మన కోసం గొప్ప మరియు అద్భుతమైన ప్రణాళికలను కలిగియున్నారని నాకు తెలుసు. కరుణతో మరియు సహనంతో ఆయన ఇలా చెప్పుచున్నారు:

“మీరు చిన్నపిల్లలు, తండ్రి ఎంత గొప్ప దీవెనలను … కలిగియుండి, మీ కొరకు సిద్ధపరచెనో మీరింకను గ్రహింపలేదు;

“అన్ని సంగతులను మీరిప్పుడు సహించలేరు; అయినప్పటికీ, సంతోషించుడి, నేను మిమ్ములను నడిపించెదను.”1

నా ప్రియమైన సహోదరులారా, ఆయన సజీవుడని, మనం ఆయనను వినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నిజంగా మనలను నడిపిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. బహుశా ప్రత్యేకంగా ప్రతికూలత ద్వారా కూడా మనం ఎదగాలని మరియు నేర్చుకోవాలని ఆయన కోరుతున్నారు.

ప్రతికూలత గొప్ప గురువు. మీరు గత రెండు సంవత్సరాల్లో నేర్చుకున్నది మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలనుకుంటున్నది ఏమిటి? మీ సమాధానాలు మీకు ప్రత్యేకమైనవి, కానీ మనమందరం నేర్చుకున్నామని మరియు ఎప్పటికీ మరచిపోలేమని నేను ఆశిస్తున్న నాలుగు పాఠాలను నేను చెప్పాలనుకుంటున్నాను.

1వ పాఠం: గృహము విశ్వాసం మరియు ఆరాధన యొక్క కేంద్రం

అంత్యదినములలో ప్రమాదాల గురించి తరచూ ప్రభువు మనల్ని హెచ్చరించినప్పుడు, ఆయన ఈ విధముగా ఉపదేశించును: “పరిశుద్ధ స్థలములలో నిలబడండి, కదలక స్థిరంగా ఉండండి.”2 ఈ “పరిశుద్ధ స్థలాలలో” ఖచ్చితంగా ప్రభువు యొక్క దేవాలయాలు మరియు సమావేశ గృహాలు ఉన్నాయి. కానీ ఈ ప్రదేశాలలో సమకూడే మన సామర్థ్యం వివిధ స్థాయిలలో పరిమితం చేయబడినందున, భూమిపై అతిపరిశుద్ధమైన ప్రదేశాలలో ఒకటి గృహము—అనగా మీ గృహము అని మనము తెలుసుకున్నాము.

సహోదరులారా, మీరు దేవుని యాజకత్వాన్ని కలిగియున్నారు. “యాజకత్వపు హక్కులు పరలోక శక్తులతో వేరు చేయబడలేకుండా కలుపబడియున్నవి.”3 మీరు మరియు మీ కుటుంబము యాజకత్వ విధులు పొందారు. “[యాజకత్వపు] విధులయందు దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడును.” 4 మీరు చేసిన నిబంధనలను మీరు పాటించినప్పుడు, ఆ శక్తి మీకు మరియు మీ కుటుంబానికి మీ స్వంత గృహములో లభ్యమవుతుంది.5

కేవలం 185 సంవత్సరాల క్రితం, ఈ రోజు, ఏప్రిల్ 3, 1836, ఏలీయా యాజకత్వపు తాళపుచేతులను పునఃస్థాపించెను, అది మన కుటుంబాలను శాశ్వతంగా ముద్రించడానికి వీలు కల్పిస్తుంది. అందుకే మీ గృహములో సంస్కారము నిర్వహించడం చాలా మంచి అనుభూతి కలిగిస్తుంది. వారి తండ్రి, తాత, భర్త, కొడుకు లేదా సోదరుడైన మీరు ఈ పవిత్ర విధిని నిర్వహించడాన్ని చూడటం మీ కుటుంబ సభ్యులను ఎలా ప్రభావితం చేసిందని మీరనుకొనుచున్నారు? మీ కుటుంబంలో ఆ పవిత్రమైన అనుభూతిని నిలుపుకోవడానికి మీరు ఏమి చేస్తారు?

మీ ఇంటిని నిజంగా విశ్వాసము యొక్క ఆశ్రయ దుర్గముగా మార్చడానికి ఇంకా చాలా ఎక్కువ చేయవలసి ఉందని మీరు భావించవచ్చు. అలా అయితే, దయచేసి దానిని చేయండి! మీరు వివాహితులైయుంటే, ఈ కీలకమైన పనిలో మీ సమాన భాగస్వామియైన మీ భార్యతో కలిసి ఆలోచన చెయ్యండి. దీని కంటే ముఖ్యమైనవి చాలా తక్కువే ఉన్నాయి. ఇప్పుడు మరియు ప్రభువు మళ్ళీ వచ్చే సమయానికి మధ్య, మనందరికీ ప్రశాంతత మరియు భద్రత ఉన్న ప్రదేశాలుగా మన గృహాలు కావాలి.6

ఆత్మను ఆహ్వానించే వైఖరులు మరియు చర్యలు మీ ఇంటి పరిశుద్ధతను పెంచుతాయి. మీ ప్రవర్తనలో లేదా వాతావరణంలో పరిశుద్ధాత్మను కించపరిచేది ఏదైనా ఉంటే, పరిశుద్ధత అంతరించిపోతుంది అనే వాస్తవం కూడా అంతే ఖచ్చితంగా ఉంది, అప్పుడు “పరలోకములు వాటంతట అవి వెనుకకు తీసుకొనబడును.”7

మన గృహాలను సువార్త అభ్యాసము మరియు సువార్త జీవన కేంద్రంగా మార్చాలని ప్రభువు ఎందుకు కోరుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మహమ్మారి కోసం మనల్ని సిద్ధం చేయడానికి మరియు మనకు సహాయం చేయడానికి మాత్రమే కాదు. సమకూడుటపై ఉన్న ప్రస్తుత ఆంక్షలు చివరికి ముగుస్తాయి. అయినప్పటికీ, మీ గృహాన్ని మీ విశ్వాసం యొక్క ప్రాథమిక ఆశ్రయ దుర్గముగా మార్చాలనే మీ నిబద్ధత ఎప్పటికీ అంతం కాదు. ఈ పతనమైన ప్రపంచంలో విశ్వాసం మరియు పరిశుద్ధత తగ్గడంతో, పరిశుద్ధ స్థలాల కొరకు మీ అవసరం పెరుగుతుంది. మీ ఇంటిని నిజమైన పరిశుద్ధ స్థలంగా మార్చడం కొనసాగించమని మరియు ఆ ఆవశ్యక లక్ష్యం నుండి “కదలక నిలిచియుండమని8 నేను మిమ్మల్ని కోరుతున్నాను.

2వ పాఠం: మనం ఒకరికొకరం అవసరం

మనం కలిసి పనిచేసి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే ఆయన మనల్ని కుటుంబాలుగా భూమికి పంపుతారు మరియు మనల్ని వార్డులుగా, స్టేకులుగా ఏర్పాటుచేస్తారు. అందుకే ఒకరికొకరు సేవ చేసుకొని, పరిచర్య చేయమని ఆయన మనలను అడుగుతారు. అందుకే ఆయన మనలను లోకము లో నివసించండి, కానీ లోకమునకు చెందవద్దని కోరతారు.9 మనం ఒంటరిగా చేయగలిగినదానికంటే కలిసికట్టుగా చాలా ఎక్కువ సాధించగలము.10 ఆయన పిల్లలు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉంటే దేవుని సంతోష ప్రణాళిక వ్యర్థమవుతుంది.

ఇటీవలి మహమ్మారి ప్రత్యేకమైనది, ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఒకే సమయంలో ప్రభావితం చేసింది. కొందరు ఇతరులకన్నా ఎక్కువ బాధలు అనుభవించగా, మనమందరం ఏదో ఒక విధంగా సవాలు చేయబడ్డాం. ఈ కారణంగా, మన ఉమ్మడి శ్రమ దేవుని పిల్లలను మునుపెన్నడూ లేని విధంగా ఏకం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. కాబట్టి, ఈ ఉమ్మడి శ్రమ మిమ్మల్ని మీ పొరుగువారికి—వీధిలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరులకు మరియు సహోదరీలకు దగ్గర చేసిందా? అని నేను అడుగుతున్నాను.

ఈ విషయంలో, రెండు గొప్ప ఆజ్ఞలు మనకు మార్గనిర్దేశం చేయగలవు: మొదటిది, దేవుడిని ప్రేమించడం మరియు రెండవది, మన పొరుగువారిని ప్రేమించడం.11 మనము సేవ చేయడం ద్వారా మన ప్రేమను చూపిస్తాము.

ఒంటరిగా ఉన్నవారి గురించి మీకు తెలిస్తే, మీరు కూడా ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ వారిని చేరుకోండి! వారిని కలవడానికి మీకు ఒక కారణం లేదా ఒక సందేశం లేదా ఒక పని ఉండవలసిన అవసరం లేదు. వారిని పలకరించి మీ ప్రేమను చూపించండి. సాంకేతిక పరిజ్ఞానం మీకు సహాయపడగలదు. మహమ్మారి ఉన్నను, లేకున్నను దేవుని ప్రతి విలువైన బిడ్డ అతను లేదా ఆమె ఒంటరిగా లేరని తెలుసుకోవాలి!

3వ పాఠం: మీ యాజకత్వ సమూహం కేవలం కూడికలకు హాజరుకావడం కంటే ఎక్కువైనది

మహమ్మారి సమయంలో, ఆదివారపు సమూహ కూడికలు కొంతకాలం రద్దు చేయబడ్డాయి. కొన్ని సమూహాలు ఇప్పుడు వర్చువల్‌గా కలుసుకుంటున్నాయి. ఏదేమైనా, యాజకత్వ సమూహాలకు ప్రభువు ఇచ్చిన పని ఎప్పుడూ కూడికలకు మాత్రమే పరిమితం కాలేదు. సమూహము అంటే ఏమిటి మరియు అది ఏమి చేయగలదో అనే దానిలో కూడికలు ఒక చిన్న భాగం మాత్రమే.

అహరోను యాజకత్వము మరియు పెద్దల సమూహము యొక్క నా సహోదరులారా, మనకు సమూహాలు ఎందుకు ఉన్నాయోననే మీ అవగాహనను విస్తరించండి. ఇప్పుడు—ఆయన పనిని నెరవేర్చడానికి మీరు మీ సమూహాన్ని ఎలా ఉపయోగించాలని ప్రభువు కోరుతున్నారు? ప్రభువు నుండి బయల్పాటు కోరండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి! అడగండి! ఆలకించండి! మీరు నాయకత్వ స్థానానికి పిలువబడితే, అధ్యక్షత్వముగా మరియు మీ సమూహ సభ్యులతో కలిసి ఆలోచన చెయ్యండి. మీ యాజకత్వ స్థానము లేదా పిలుపు ఏమైనప్పటికీ, మీ సమూహ సభ్యునిగా మరియు మీ సేవలో మీరు కలిగియున్న నిబద్దతయందు దేవునికి ప్రాధాన్యతనివ్వండి. మీరు “ఆత్రుతగా మంచి పనిలో నిమగ్నమై”12 ఉన్నందున మీరు తీసుకువచ్చే నీతిని ఆనందంతో అనుభవించండి. తెరకు రెండు వైపులా ఇశ్రాయేలీయులు సమకూర్చబడుటను వేగవంతం చేయడానికి సమూహాలు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాయి.

4వ పాఠం: మనం నిశ్చలంగా ఉన్నప్పుడు యేసు క్రీస్తును ఉత్తమంగా వింటాము

“అన్ని సంగతులు సంక్షోభములోనుండును; జనులపైకి భయము వచ్చును, గనుక మనుష్యులు ధైర్యము చెడి, కూలుదురు”13 అని చాలా కాలం క్రితం ప్రవచించబడిన కాలములో మనం జీవిస్తున్నాము. మహమ్మారికి ముందు అది నిజం మరియు తరువాత ఇది నిజం అవుతుంది. ప్రపంచంలో కల్లోలం పెరుగుతూనే ఉంటుంది. దానికి విరుద్ధముగా ప్రభువు స్వరము “ఒక గొప్ప అల్లరి శబ్దము యొక్క స్వరము కాదు …, కానీ [అది] గుసగుస [వంటి] పరిపూర్ణ మృదుత్వము యొక్క నిర్మలమైన స్వరము మరియు అది సూటిగా ఆత్మకు కూడా [గ్రుచ్చుకొనును].”14 మిక్కిలి నిమ్మళమైన ఈ స్వరమును వినడానికి, మీరు కూడా నిశ్చలంగా ఉండాలి!15

కొంతకాలంపాటు, మహమ్మారి సాధారణంగా మన జీవితాలను నింపే కార్యకలాపాలను రద్దు చేసింది. త్వరలోనే మనము ప్రపంచంలోని శబ్దం మరియు కల్లోలంతో ఆ సమయాన్ని మళ్ళీ పూరించడానికి ఎంచుకోగలుగవచ్చు. లేదా ఆయన మార్గదర్శకత్వాన్ని, ఆదరణను మరియు సమాధానాన్ని గుసగుసలాడుతున్న ప్రభువు స్వరాన్ని వినడానికి మన సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. నిశ్శబ్ద సమయం పవిత్రమైన సమయం—వ్యక్తిగత బయల్పాటును సులభతరం చేసే మరియు శాంతిని కలిగించే సమయం.

ఒంటరిగా మరియు మీ ప్రియమైనవారితో సమయం గడపడానికి మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోండి. ప్రార్థనలో మీ హృదయాన్ని దేవునికి తెలపండి. లేఖనాలలో నిమగ్నమవ్వడానికి, దేవాలయంలో ఆరాధించడానికి సమయం కేటాయించండి.

నా ప్రియమైన సహోదరులారా, ఈ మహమ్మారి సమయంలో మన అనుభవాల నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలని ప్రభువు కోరుకుంటున్నారు. నేను నాలుగు మాత్రమే జాబితా చేసాను. మీ స్వంత జాబితాను తయారు చేయమని, దానిని జాగ్రత్తగా పరిశీలించి, మీకు నచ్చిన వారితో పంచుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

దేవుని నిబంధనలను పాటించే ప్రజలకు భవిష్యత్తు ప్రకాశవంతముగా ఉంటుంది.16 మానవాళిని ఆశీర్వదించడానికి, ఓదార్చడానికి, బలోపేతం చేయడానికి మరియు ప్రపంచాన్ని, దాని ప్రజలను తన రెండవ రాకడకు సిద్ధం చేయడంలో సహాయపడటానికి యాజకత్వాన్ని కలిగియుండేందుకు యోగ్యులైన తన సేవకులను ప్రభువు ఎక్కువగా పిలుచును. మనము పొందిన పవిత్రమైన నియామకములకు అనుగుణంగా జీవించడం మనలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరముగా ఉంటుంది. మనము దీనిని చేయగలము! నా ప్రియమైన సహోదరులారా, మీ పట్ల నాకున్న ప్రేమ యొక్క వ్యక్తీకరణతో, యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో ఈవిధంగా నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.