సర్వసభ్య సమావేశము
దేవాలయాన్ని చూడడం నాకిష్టం
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


దేవాలయాన్ని చూడడం నాకిష్టం

మరణం తర్వాత కొనసాగి, నిత్యము నిలిచియుండే ప్రియమైన కుటుంబ సంబంధాల అభయాన్ని దేవాలయంలోనే మనం పొందగలము.

నా ప్రియ సహోదర సహోదరీలారా, సర్వ సభ్య సమావేశం యొక్క ఈ మొదటి సభలో మీతో ఉన్నందుకు నేను కృతజ్ఞుడిని. ప్రసంగీకులు, సంగీతం, ప్రార్థన ఆత్మను—అలాగే ప్రేరేపణ మరియు నిరీక్షణ యొక్క భావనను తీసుకువచ్చాయి.

ఆ భావన సాల్ట్ లేక్ దేవాలయంలోకి నేను అడుగుపెట్టిన మొదటిరోజును గుర్తుచేసింది. నేనొక యువకుడిని. నాతో పాటు నా తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. లోపల దేవాలయ కార్యకర్తచేత పలకరించబడేందుకు వారు ఒక్క క్షణం ఆగారు. ఒక్క క్షణం నేను ఒంటరిగా వారికంటే ముందుగా నడిచాను.

అందమైన తెల్లని దేవాలయ వస్త్రాలు ధరించిన తెల్ల జుట్టు గల ఒకావిడ నన్ను పలకరించింది. ఆమె నా వైపు చూసి నవ్వింది, తర్వాత, “దేవాలయానికి స్వాగతం సహోదరుడు ఐరింగ్,” అని నెమ్మదిగా అంది. ఆమెకు నా పేరు తెలిసినందున ఒక్క క్షణానికి ఆమె దేవదూత అని నేను అనుకున్నాను. నా కోటు మీద ఉన్న చిన్న కార్డు మీద నా పేరు ఉందని నేను గుర్తించలేదు.

నేను ఆమెను దాటివెళ్ళి, ఆగాను. గదిని వెలుగుతో నింపిన ఎత్తైన తెల్లని పైకప్పు వైపు చూసాను, అది దాదాపుగా ఆకాశం వైపు తెరచి ఉంచినట్లనిపించింది. ఆ క్షణంలో, స్పష్టమైన ఈ పదాలలో ఒక ఆలోచన నా మనస్సులోకి వచ్చింది: “ప్రకాశవంతమైన ఈ ప్రదేశానికి ఇంతకుముందు నేను వచ్చాను.” కానీ వెంటనే ఈ పదాలు నా మనస్సులోకి వచ్చాయి, అయితే నా స్వరంలో కాదు: “లేదు, ఇంతకు ముందెన్నడూ నువ్వు ఇక్కడికి రాలేదు. నువ్వు పుట్టకముందు గడియను నువ్వు గుర్తు చేసుకుంటున్నావు. ఇలాంటి పవిత్రమైన స్థలములో నువ్వు ఉన్నావు.”

మన దేవాలయాల వెలుపల, “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు చెక్కబడియుంటాయి. ఆ మాటలు నిజమని నాకు తెలుసు. దేవాలయము పరిశుద్ధమైన ప్రదేశము, దానికి మన హృదయాలు తెరువబడియుండి, మనము యోగ్యులమైనట్లయితే అక్కడ మనకు సులువుగా బయల్పాటు వస్తుంది.

ఆ మొదటిరోజు తరువాత కూడా నేను మళ్ళీ అదే ఆత్మను అనుభవించాను. అక్కడ వర్ణించినది నిజమని స్థిరపరుస్తూ నా హృదయంలోకి దహించు భావనను తెచ్చిన కొన్ని పదాలను దేవాలయ కార్యము కలిగియుంది. నా భవిష్యత్తుకు సంబంధించి నేను భావించినది వ్యక్తిగతమైనది మరియు 40 ఏళ్ళ తర్వాత ప్రభువు నుండి సేవచేయమనే పిలుపు ద్వారా అది నిజమయ్యింది.

లోగన్ యూటా దేవాలయంలో నేను వివాహం చేసుకున్నప్పుడు నేను అదే భావనను అనుభవించాను. అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఆ ముద్రణను నిర్వహించారు. ఆయన మాట్లాడిన కొద్ది మాటలలో ఆయన ఈ సలహా ఇచ్చారు, “హాల్, కేథీ, పిలుపు వచ్చినప్పుడు మీరు సులువుగా విడిచి వెళ్ళగలిగేలా జీవించండి.”

ఆయన ఆ కొద్ది మాటలు చెప్తున్నప్పుడు, ఒక ఎత్తైన కొండ మరియు దాని పైభాగానికి వెళ్తున్న దారిని పూర్తి రంగుల్లో నా మనస్సులో నేను స్పష్టంగా చూసాను. దారికి ఎడమప్రక్కగా తెల్లని కంచె ఉంది, కొండ పైభాగంలో చెట్ల వరుసలో అది కనిపించలేదు. చెట్ల గుండా ఒక తెల్లని ఇల్లు అస్పష్టంగా కనిపించింది.

ఒక సంవత్సరం తరువాత, ఆ దారిలో మా మామగారు తీసుకువెళ్ళినప్పుడు నేను ఆ కొండను గుర్తుపట్టాను. దేవాలయంలో అధ్యక్షులు కింబల్ తన సలహా ఇచ్చినప్పుడు సరిగ్గా నేను చూసిన దానిలాగే ఉందది.

మేము కొండ పైభాగానికి చేరుకున్నప్పుడు, మా మామగారు తెల్లని ఇంటి వద్ద ఆగారు. ఆయన, ఆయన భార్య స్థలం కొనబోతున్నారని, ఆయన కూతురిని, నన్ను అతిథిగృహంలో ఉండాలని కోరుతున్నారని ఆయన మాతో చెప్పారు. వారు కొన్ని అడుగుల దూరంలో ఉన్న ప్రధాన గృహములో నివసించేవారు. కాబట్టి ఆ ప్రియమైన కుటుంబ వాతావరణంలో మేము నివసించిన 10 సంవత్సరాలలో, “మనం ఇక్కడ ఎక్కువకాలం ఉండబోము కాబట్టి దీనిని ఆస్వాదించడం మంచిది” అని దాదాపు ప్రతిరోజు నేను, నా భార్య అనుకొనేవాళ్ళం.

సంఘ విద్యా ఉన్నతాధికారియైన నీల్ ఎ. మాక్స్‌వెల్ నుండి పిలుపు వచ్చింది. “సులువుగా విడిచివెళ్ళగలిగేలా” ఉండమని అధ్యక్షులు కింబల్ చేసిన హెచ్చరిక నిజమయ్యింది. నాకేమాత్రం తెలియని ప్రదేశంలో ఒక నియామకంలో సేవచేయడానికి ఆహ్లాదకరమైన వ్యక్తిగత పరిస్థితులను విడిచి వెళ్ళమనే పిలుపులా కనిపించిందది. ఆ దీవెనకర సమయాన్ని, ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి మా కుటుంబము సిద్ధంగా ఉంది, ఎందుకంటే మేము ఆనాడు దేనికోసం సిద్ధపరచబడ్డామో ఆ భవిష్యత్ సంఘటనను బయల్పాటు యొక్క ప్రదేశమైన పరిశుద్ధ దేవాలయంలో ఒక ప్రవక్త చూసారు.

ప్రభువు యొక్క దేవాలయాలు పరిశుద్ధ స్థలాలని నాకు తెలుసు. దేవాలయాల గురించి నేడు మాట్లాడడంలో నా ఉద్దేశ్యము, దేవాలయ అనుభవాల కొరకు మన కోసం వస్తున్న అధికమైన అవకాశాలకు యోగ్యులుగా మరియు సిద్ధంగా ఉండాలనే మీ కోరికను, నా కోరికను పెంచడం.

నా మట్టుకు, దేవాలయ అనుభవాలకు యోగ్యులుగా ఉండేందుకు గొప్ప ప్రేరణ ఆయన పరిశుద్ధ గృహాల గురించి ప్రభువు చెప్పినదే:

“నా జనులు ప్రభువు నామములో ఒక మందిరమును నిర్మించి, అది పాడుచేయబడకుండునట్లు అపవిత్రమైనదేదియు దానిలో ప్రవేశింపకుండా చేసిన యెడల, దానిపై నా మహిమ నిలుచును;

“అవును, నా సన్నిధి అక్కడ ఉండును, ఏలయనగా నేను దానిలోనికి వచ్చెదను, హృదయశుద్ధి కలిగి దానిలోనికి వచ్చు వారందరు దేవుని చూచెదరు.

“కానీ అది పాడుచేయబడిన యెడల నేను దానిలోనికి రాను, నా మహిమ అక్కడ ఉండదు; ఏలయనగా అపవిత్రమైన దేవాలయములలోనికి నేను రాను.”1

ఇకపై ఆయన మనకు అపరిచితునిగా ఉండరనే భావనలో మనము దేవాలయంలో రక్షకుడిని “చూడగలమని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు స్పష్టం చేసారు. అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “మనం ఆయనను అర్థం చేసుకుంటాము. మనం ఆయన కార్యమును, ఆయన మహిమను తెలుసుకుంటాము. ఆయన అద్వితీయ జీవితం యొక్క అనంతమైన ప్రభావాన్ని మనం భావించడం మొదలుపెడతాము.”2

మీరు లేదా నేను తగినంత పరిశుద్ధంగా దేవాలయానికి వెళ్ళనట్లయితే, రక్షకుని గురించి మనం దేవాలయంలో పొందగలిగే ఆత్మీయ బోధనను పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనము చూడలేము.

అటువంటి బోధనను పొందడానికి మనం యోగ్యులమైనప్పుడు, మన దేవాలయ అనుభవం ద్వారా మన జీవితాలంతటా నిరీక్షణ, ఆనందం మరియు ఆశావాదం పెరగగలవు. ఆ నిరీక్షణ, ఆనందం మరియు ఆశావాదం పరిశుద్ధ దేవాలయాల్లో నిర్వహించబడే విధులను అంగీకరించడం ద్వారా మాత్రమే లభ్యమవుతాయి. మరణం తర్వాత కొనసాగి, నిత్యము నిలిచియుండే ప్రియమైన కుటుంబ సంబంధాల అభయాన్ని దేవాలయంలోనే మనం పొందగలము.

చాలాకాలం క్రితం, నేను బిషప్పుగా సేవచేస్తున్నప్పుడు, కుటుంబాలుగా శాశ్వతంగా దేవునితో జీవించడానికి యోగ్యుడవమనే నా ఆహ్వానాన్ని ఒక యువకుడు ప్రతిఘటించాడు. అతని స్నేహితులతో అతడు గడిపిన మంచి సమయాల గురించి నాతో చెప్పాడు. నేనతడిని మాట్లాడనిచ్చాను. అప్పుడు, అతని వేడుకలలో ఒకదానిలో, భీకరశబ్దాల హోరులో అకస్మాత్తుగా అతడు ఒంటరిగా భావించినట్లు గుర్తించిన క్షణం గురించి నాతో చెప్పాడు. ఏమి జరిగిందని నేనతడిని అడిగాను. చిన్న పిల్లవానిగా అతని తల్లి ఒడిలో కూర్చొని, ఆమె చేతులు అతని చుట్టూ వేయబడియున్న సమయాన్ని అతడు గుర్తుచేసుకున్నాడని చెప్పాడు. అతడు ఆ కథ చెప్పేటప్పుడు ఆ క్షణం, అతను కన్నీరు పెట్టాడు. నాకు తెలిసినది నిజమని నేనతనితో చెప్పాను: “శాశ్వతంగా అటువంటి కుటుంబ స్వీకార భావనను నువ్వు కలిగియుండగల ఏకైక మార్గం, దేవాలయం యొక్క ముద్రణ విధులను పొందడానికి నీకై నువ్వు యోగ్యునిగా కావడం మరియు ఇతరులకు సహాయం చేయడం.”

ఆత్మ లోకంలో కుటుంబ సంబంధాల వివరాలు లేదా మనం పునరుత్థానం చెందిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ, వాగ్దానం చేసినట్లుగా తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పుటకు ఏలీయా ప్రవక్త వచ్చాడని మనకు తెలుసు.3 మన వంశస్థులలో మనకు వీలైనంతమందికి ఇదే శాశ్వత సంతోషాన్ని అందించడానికి మనకు చేతనైనంత చేయడంపై మన నిత్య సంతోషము ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు.

దేవాలయం యొక్క ముద్రణ విధులను పొందడానికి, గౌరవించడానికి యోగ్యులు కావాలని కోరుకొమ్మని సజీవులైన కుటుంబ సభ్యులను ఆహ్వానించడంలో నేను అదే కోరికను భావిస్తున్నాను. తెరకు ఇరువైపులా అంత్యదినాలలో వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు సమకూర్పులో అది ఒక భాగము.

మనకున్న గొప్ప అవకాశాలలో ఒకటి, మన కుటుంబ సభ్యులు చిన్నగా ఉన్నప్పుడే కలుగుతుంది. వారు క్రీస్తు వెలుగు అనే బహుమానంతో పుట్టారు. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవడాన్ని అది వారికి సాధ్యం చేస్తుంది. అందువల్లనే దేవాలయాన్ని లేదా దేవాలయ చిత్రాన్ని చూడడం కూడా ఒకరోజు దాని లోపలికి వెళ్ళే అవకాశం రావాలని, యోగ్యులుగా ఉండాలనే కోరికను వారిలో వృద్ధిచేయగలదు.

యువతగా వారు దేవాలయంలో ప్రత్యామ్నాయ బాప్తీస్మములు నిర్వహించడానికి దేవాలయ సిఫారసును పొందినప్పుడు ఆ రోజు రాగలదు. ఆ అనుభవంలో, దేవాలయ విధులు ఎల్లప్పుడూ రక్షకుడిని, ఆయన ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తాయనే వారి భావన వృద్ధి చెందగలదు. పాపము నుండి శుద్ధిచేయబడేందుకు ఆత్మ లోకంలో ఒక వ్యక్తికి వారు అవకాశమిస్తున్నారని వారు భావించినప్పుడు, మన పరలోక తండ్రి బిడ్డను దీవించే ఆయన పవిత్ర కార్యములో రక్షకునికి సహాయపడుతున్నామనే వారి భావన వృద్ధి చెందుతుంది.

ఆ అనుభవం యొక్క శక్తి ఒక యువకుడి జీవితాన్ని మార్చడం నేను చూసాను. చాలా ఏళ్ళ క్రితం, నేను నా కూతురితో కలిసి ఒకరోజు మధ్యాహ్నం దేవాలయానికి వెళ్ళాను. ప్రత్యామ్నాయ బాప్తీస్మములు చేయడంలో ఆమె చివరిదైయుండెను. పేర్లు సిద్ధపరచబడిన వారందరి కోసం విధులు పూర్తయ్యేవరకు ఆమె ఉండగలదా అని నా కూతురు అడుగబడింది. ఆమె ఉంటానని చెప్పింది.

బాప్తీస్మపు తొట్టెలోనికి నా కూతురు దిగడం నేను గమనించాను. బాప్తీస్మములు మొదలయ్యాయి. నీటిలో నుండి ఆమె పైకి లేపబడిన ప్రతిసారీ చిన్నపిల్లయైన నా కూతురి ముఖంపై నీరు ధారగా కారింది. “ఇంకా చేయగలవా?” అని ఆమె మళ్ళీ మళ్ళీ అడుగబడింది. ప్రతిసారీ ఆమె చేస్తానని చెప్పింది.

అభిమానమున్న తండ్రిగా, ఇంకా చేయడం నుండి ఆమె విడిపించబడాలని నేను కోరుకోసాగాను. కానీ, ఆమె ఇంకా చేయగలదేమోనని అడుగబడినప్పుడు ఆమె నిశ్చయమైన స్వరంతో “చేస్తానని” చెప్పినప్పుడు ఆమె దృఢత్వం నాకింకా గుర్తుంది. ఆరోజు జాబితాలో ఉన్న చివరి వ్యక్తి యేసు క్రీస్తు నామములో బాప్తీస్మపు దీవెన పొందేవరకు ఆమె నిలిచియుంది.

ఆ రాత్రి నేను ఆమెతో పాటు దేవాలయం బయటకు నడిచినప్పుడు, నేను చూసిన దాని పట్ల నేను ఆశ్చర్యపోయాను. ఆయన గృహంలో ప్రభువుకు సేవ చేయడం ద్వారా నా కళ్ళముందు ఒక బిడ్డ ఉద్ధరించబడి, మార్పుచెందింది. దేవాలయం నుండి మేము కలిసి నడుస్తున్నప్పుడు కలిగిన వెలుగు మరియు సమాధానపు భావన నాకింకా గుర్తుంది.

సంవత్సరాలు గడిచిపోయాయి. అత్యంత కష్టమైనప్పటికీ ఆయన కోసం ఆమె ఇంకా చేస్తుందా అని ప్రభువు నుండి వచ్చే ప్రశ్నకు ఆమె ఇప్పటికీ చేస్తానని చెప్తుంది. మనల్ని ఉద్ధరించి, మార్చడానికి దేవాలయ సేవ చేయగలిగింది అదే. అందుకే, పరిస్థితులు అనుకూలించినప్పుడల్లా ప్రభువు మందిరానికి వెళ్ళడానికి యోగ్యులుగా ఉండాలనే కోరికలో మరియు సంకల్పంలో మీరు, మీ ప్రియమైన కుటుంబమంతా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను.

మిమ్మల్ని అక్కడ స్వాగతించాలని ఆయన కోరుతున్నారు. ఆయనకు సన్నిహితంగా వారు భావించగలిగేలా అక్కడికి వెళ్ళాలనే కోరికను పరలోక తండ్రి యొక్క పిల్లల హృదయాల్లో వృద్ధిచేయడానికి మీరు ప్రయత్నించాలని మరియు ఆయనతో, మీతో శాశ్వతంగా ఉండేందుకు అర్హులవ్వమని మీ పూర్వీకులను కూడా మీరు ఆహ్వానించాలని నేను ప్రార్థిస్తున్నాను,

ఈ మాటలు మనవి కాగలవు:

దేవాలయాన్ని చూడడం నాకిష్టం.

ఒకరోజు నేనక్కడికి వెళ్తాను

పరిశుద్ధాత్మను అనుభవించడానికి,

వినడానికి, ప్రార్థించడానికి.

ఎందుకంటే దేవాలయం దేవుని ఇల్లు,

ప్రేమా, సౌందర్యాల నిలయం.

నా యవ్వనంలోనే నేను సిద్ధపడతాను;

ఇది నా పవిత్ర విధి.4

మనము ప్రేమగల పరలోక తండ్రి యొక్క పిల్లలమని నేను గంభీరంగా సాక్ష్యమిస్తున్నాను. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మన రక్షకునిగా, విమోచకునిగా ఉండేందుకు ఆయన ఎన్నుకున్నారు. పరిశుద్ధ దేవాలయ విధుల ద్వారా మాత్రమే వారితో మరియు మన కుటుంబంతో జీవించడానికి మనం తిరిగి వెళ్ళగలము. దేవుని పిల్లలందరికీ నిత్య జీవితాన్ని సాధ్యం చేసే యాజకత్వ తాళపుచెవులన్నిటినీ అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ కలిగియున్నారని, ఉపయోగిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.