సర్వసభ్య సమావేశము
మీరు స్వతంత్రులైయుందురు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మీరు స్వతంత్రులైయుందురు

మన మర్త్య జీవితపు చీకటి సమయాల్లో కూడా మనము పట్టుకొనవలసిన వెలుగు యేసు క్రీస్తే (3 నీఫై 18:24 చూడండి).

నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఆఫ్రికా నుండి మీతో మాట్లాడగలుగుతున్నందుకు నేనెంతో కృతజ్ఞుడిని. నేటి సాంకేతిక పరిజ్ఞానం మరియు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మిమ్మల్ని చేరకోవడానికి దానిని అత్యంత ప్రభావితంగా ఉపయోగించడం ఒక దీవెన.

సెప్టెంబరు 2019లో, మేరీలాండ్ బాల్టిమోర్ మిషను నాయకులుగా సేవ చేస్తుండగా మిషను నాయకత్వ సదస్సుకు హాజరైనప్పుడు, సహోదరి ముటోంబో మరియు నేను న్యూయార్క్‌లోని పాల్మైరాలో కొన్ని సంఘ చారిత్రక ప్రదేశాలను దర్శించాము. మా సందర్శనను పరిశుద్ధ వనము వద్ద ముగించాము. పరిశుద్ధ వనమును దర్శించడంలో మా ఉద్దేశ్యము ప్రత్యేక ప్రత్యక్షతను లేదా దర్శనమును పొందడం కాదు, కానీ ఈ పరిశుద్ధ ప్రదేశంలో మేము దేవుని సన్నిధిని భావించాము. ప్రవక్త జోసెఫ్ స్మిత్ కొరకు మా హృదయాలు కృతజ్ఞతతో నింపబడ్డాయి.

తిరుగు ప్రయాణంలో నేను నవ్వుతుండడం గమనించిన సహోదరి ముటోంబో, “నీ ఉత్సాహానికి కారణమేమిటి?” అని అడిగింది.

“నా ప్రియమైన నతాలి, సత్యం ఎల్లప్పుడూ అపరాధాన్ని జయిస్తుంది మరియు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మూలంగా భూమిపై అంధకారము కొనసాగదు” అని నేను జవాబిచ్చాను.

“ప్రస్తుతము ఉన్నవిధముగా, గతములో ఉన్నవిధముగా, భవిష్యత్తులో (ఉండబోవు విధముగా) ఉన్న సంగతులు యొక్క జ్ఞానమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:24) మనము పొందులాగున అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తేవడానికి తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తు యువ జోసెఫ్ స్మిత్‌ను దర్శించారు.

దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత, అపవాది లోకమంతా విస్తరింపజేస్తున్న కొన్ని ఆచారాలు మరియు అబద్ధాల నుండి స్వతంత్రులవడానికి కావలసిన సత్యాలను ఇంకా అనేకమంది వెదుకుతున్నారు. “అనేకమంది మనుష్యుల మాయోపాయముల చేత గ్రుడ్డివారిగా చేయబడియున్నారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 123:12). ఎఫెసీయులకు తన పత్రికలో పౌలు ఇలా బోధించాడు: “నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును” (ఎఫెసీయులకు 5:14). తన మాటలు విను వారందరికి తాను వెలుగవుతానని రక్షకుడు వాగ్దానమిచ్చారు (2 నీఫై 10:14 చూడండి).

ముప్పది ఐదు సంవత్సరాల క్రితం, నా తల్లిదండ్రులు కూడా గ్రుడ్డివారిగా చేయబడి, సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంతగానో వెదికారు మరియు దానిని కనుగొనడానికి ఎక్కడకు వెళ్ళాలని చింతించారు. నా తల్లిదండ్రులు ఇద్దరూ పల్లెటూరిలో జన్మించారు, అక్కడ ఆచారాలు వ్యక్తులు మరియు కుటుంబాల జీవితాల్లో నిజంగా పాతుకుపోయాయి. వారిద్దరూ యవ్వనంలో ఉన్నప్పుడు ఊరిని వదిలి, మంచి జీవితాన్ని వెతుక్కుంటూ పట్టణానికి వచ్చారు.

వారు వివాహం చేసుకొని, అత్యంత నిరాడంబరంగా తమ కుటుంబాన్ని ప్రారంభించారు. నా తల్లిదండ్రులు, ఇద్దర చెల్లెళ్ళు, నేను మరియు మాతోపాటు ఉండే పిన్ని కొడుకుతో కలిపి మేము సుమారు ఎనిమిది మంది ఒక చిన్న ఇంటిలో ఉండేవాళ్ళము. మేము నిజంగా ఒక కుటుంబమేనా అని నేను ఆశ్చర్యపడేవాడిని, ఎందుకంటే మా తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడానికి మేము అనుమతించబడేవారము కాదు. మా నాన్న పని నుండి తిరిగివచ్చినప్పుడు, ఆయన ఇంటిలోనికి ప్రవేశించిన వెంటనే మమ్మల్ని అక్కడి నుండి బయటకు వెళ్ళమనేవారు. మా తల్లిదండ్రుల వివాహంలో అన్యోన్యత, నిజమైన ప్రేమ లేనందున మేము రాత్రిపూట చాలా తక్కువగా నిద్రపోయేవారము. మా ఇల్లు చిన్నదే కాకుండా చీకటిగా ఉండేది. సువార్తికులను కలవడానికి ముందు మేము ప్రతి ఆదివారం వేర్వేరు సంఘాలకు హాజరయ్యాము. ఈ లోకం ఇవ్వలేని దేనికొరకో మా తల్లిదండ్రులు వెదుకుతున్నారని స్పష్టమైంది.

జైర్ (నేడు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లేదా కాంగో-కిన్షాసా అని పిలువబడుతుంది) లో సేవ చేయడానికి పిలువబడిన మొదటి వయోధిక సువార్తికుల జంటయైన ఎల్డర్ మరియు సహోదరి హచింగ్స్‌ను మేము కలుసుకొనే వరకు ఇది కొనసాగింది. దేవుని నుండి వచ్చిన దూతలుగా అనిపించిన ఈ అద్భుతమైన సువార్తికులను మేము కలుసుకోవడం ప్రారంభించినప్పుడు, మా కుటుంబంలో ఏదో మార్పును నేను గమనించాను. మా బాప్తీస్మము తర్వాత, పునఃస్థాపించబడిన సువార్త కారణంగా క్రమక్రమంగా మా జీవనశైలి మారింది. క్రీస్తు యొక్క మాటలు మా ఆత్మలను వర్థిల్లజేయనారంభించాయి. అవి మా గ్రహింపును స్పష్టం చేయనారంభించాయి మరియు మేము పొందిన సత్యాలు స్పష్టంగా ఉండి, మేము వెలుగును చూడగలిగినందున అవి మాకు మధురముగా మారాయి. ఈ వెలుగు అంతకంతకు తేజరిల్లెను.

సువార్త యొక్క ఉద్దేశ్యము వెనుక ఉన్న కారణాలను గ్రహించడం మేము మరింతగా రక్షకుని వలె కావడానికి మాకు సహాయపడుతోంది. మా ఇంటి కొలత మారలేదు; లేదా మా సామాజిక పరిస్థితులు మారలేదు. కానీ రోజూ ఉదయం, సాయంత్రం మేము ప్రార్థిస్తుండగా నా తల్లిదండ్రుల హృదయాలు మారడం నేను చూసాను. మేము మోర్మన్ గ్రంథాన్ని చదివాము; మేము కుటుంబ గృహ సాయంకాలాన్ని జరుపుకున్నాము; కుటుంబంలో ఐక్యత పెరిగింది. ప్రతీ ఆదివారము సంఘానికి వెళ్ళడానికి మేము ఉదయం 6 గంటలకే నిద్రలేచేవాళ్ళము మరియు సణగకుండా ప్రతీవారము సంఘ సమావేశాలకు హాజరయ్యేందుకు గంటల తరబడి ప్రయాణించేవారము. అది చూసేందుకు ఒక అద్భుతమైన అనుభవం. ఇంతకుముందు చీకటిలో నడిచిన మేము, మా మధ్యనుండి చీకటిని తరిమివేసి (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:25 చూడండి) “గొప్ప వెలుగును” (2 నీఫై 19:2) చూసాము.

ఒకరోజు నాకు బాగా గుర్తుంది, ఉదయాన్నే మా కుటుంబ ప్రార్థన కోసం లేవడం ఇష్టం లేక నేను మా చెల్లెళ్ళతో, “ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన, ఇది తప్ప ఈ ఇంట్లో మనం చేసేదేమీ లేదు” అని సణిగాను. మా నాన్న నా మాటలు విన్నారు. ఆయన స్పందన నాకింకా గుర్తుంది, ప్రేమతోనే గాని ఖచ్ఛితంగా ఆయన నాకిలా నేర్పించారు, “నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన చేస్తావు.”

మా నాన్న మాటలు ప్రతిరోజూ నా చెవుల్లో ధ్వనించాయి. నేడు సహోదరి ముటోంబో మరియు నేను మా పిల్లలతో ఏం చేస్తామని మీరనుకుంటున్నారు? మేము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన చేస్తాము. ఇది మా వారసత్వము.

పుట్టుకతో గ్రుడ్డి వాడైయుండి, యేసు క్రీస్తు చేత స్వస్థపరచబడిన వ్యక్తిని అతని కన్నులేలాగు తెరువబడెనని అతని పొరుగువారు మరియు పరిసయ్యులు అడిగినప్పుడు అతడిలా చెప్పాడు:

“యేసు అనునొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి-నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను: నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని. …

“… ఒకటి మాత్రము నేనెరుగుదును … నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాను” (యోహాను 9:11, 25).

మేము కూడా గ్రుడ్డివారమైయుండి ఇప్పుడు చూడగలుగుచున్నాము. పునఃస్థాపించబడిన సువార్త ఆ సమయం నుండి మా కుటుంబాన్ని ప్రభావితం చేసింది. సువార్త యొక్క ఉద్దేశ్యము వెనుక ఉన్న కారణాలను గ్రహించడం నా కుటుంబంలో మూడు తరాలను దీవించింది మరియు రాబోయే అనేక తరాలను దీవించడం కొనసాగిస్తుంది.

యేసు క్రీస్తే చీకటియందు ప్రకాశించు వెలుగు. ఆయనను వెంబడించువాడు “చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగియుండును” ( యోహాను 8:12).

2016 మరియు 2017 మధ్య దాదాపు సంవత్సరకాలం కసాయ్ ప్రాంతంలోని ప్రజలు భయంకరమైన విషాదాన్ని ఎదుర్కొన్నారు. అది ప్రజలకు అత్యంత కష్టకాలం, ఎందుకంటే యోధుల సాంప్రదాయక సమూహము మరియు ప్రభుత్వ బలగాల మధ్య వివాదం చెలరేగింది. కసాయ్ సెంట్రల్ ప్రావిన్స్‌లోని పట్టణాల నుండి కసాయ్ ప్రాంతమంతా హింస విస్తరించింది. అనేకమంది రక్షణ కొరకు తమ ఇళ్ళనుండి పారిపోయి, పొదలలో దాక్కున్నారు. వారికి ఆహారము, నీళ్ళు లేదా నిజానికి ఏదీ లేదు మరియు వారిలో కనంగ ప్రాంతములోని యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు కొందరున్నారు. సంఘ సభ్యులలో కొందరు సైనికుల చేత చంపబడ్డారు.

కనంగలోని ఎంగాంజా వార్డు యొక్క సహోదరుడు హొనొరె మరియు ఆయన కుటుంబము తమ ఇళ్ళలో దాక్కొన్న వారిలో ఉన్నారు, వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఎందుకంటే వీధులన్నిటిలో నిరంతరం కాల్పులు జరుగుతున్నాయి. ఒకరోజు సాయంత్రం తినడానికి కుటుంబ తోట నుండి కూరగాయలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు సహోదరుడు ములుంబా మరియు అతని కుటుంబమును పొరుగున ఉన్న సైనికుడు గమనించాడు. ఒక సైనిక సమూహము వారి ఇంటికి వచ్చి, వారిని బయటకు లాగి, తమ సైనిక ఆచారాలను పాటించమని లేదా వారు చంపివేయబడతారని వారికి చెప్పారు.

సహోదరుడు ములుంబా ధైర్యంగా వారితో ఇలా చెప్పారు, “నేను యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యుడిని. నేను, నా కుటుంబము యేసు క్రీస్తును అంగీకరించాము మరియు ఆయన యందు విశ్వాసం కలిగియున్నాము. మేము మా నిబంధనల పట్ల విశ్వాసంగా నిలిచియుంటాము మరియు మరణించడానికి అంగీకరిస్తాము.”

అప్పుడు సైనికులు వారితో, “మీరు యేసు క్రీస్తును ఎన్నుకున్నందున మీ శరీరాలు కుక్కల చేత తినివేయబడతాయి” అని చెప్పి, మళ్ళీ తిరిగి వస్తామని అన్నారు. కానీ వారెన్నడూ తిరిగి రాలేదు మరియు ఆ కుటుంబము రెండు నెలలపాటు అక్కడ నివసించినప్పటికీ, వారిని ఎన్నడూ చూడలేదు. సహోదరుడు ములుంబా మరియు అతని కుటుంబము తమ విశ్వాసమును నిలుపుకున్నారు. వారు తమ నిబంధనలను గుర్తుంచుకొని, రక్షించబడ్డారు.

మన మర్త్య జీవితపు చీకటి సమయాల్లో కూడా మనము పట్టుకొన వలసిన వెలుగు యేసు క్రీస్తే (3 నీఫై 18:24 చూడండి). యేసు క్రీస్తును అనుసరించడానికి మనం ఎంచుకొన్నప్పుడు, మారడానికి మనం ఎంచుకుంటాము. ఒక మనుష్యుడు క్రీస్తు కొరకు మార్పుచెంది, క్రీస్తు చేత ప్రధానునిగా చేయబడినప్పుడు పౌలు వలె మనము, “ప్రభువా, నేనేమి చేయవలెను?” అని అడుగుతాము. (అపొస్తలుల కార్యములు 9:6). మనము “ఆయన అడుగుజాడల యందు నడుచుకొనెదము” (1 పేతురు 2:21). “ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే మనము నడుచుకొనెదము” (1 యోహాను 2:6). (Ezra Taft Benson, “Born of God,” Tambuli, Oct. 1989, 2, 6. చూడండి)

మీరు మరియు నేను అమర్త్యత్వము మరియు ఉన్నతస్థితి యొక్క దీవెనలను పొందునట్లు మృతిపొంది, సమాధి చేయబడి, మూడవ దినమున లేపబడి, పరలోకములోనికి ఆరోహణడైన ఆయనను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే “వెలుగు, … జీవము మరియు సత్యమునైయున్నాడు” (ఈథర్ 4:12). లోకము యొక్క గందరగోళమునకు ఆయనే విరుగుడు మరియు చికిత్స. మనం ఉన్నతస్థితిని సాధించడానికి ఆయనే మనకు ఆదర్శవంతమైన మాదిరి, ఆయనే యేసు క్రీస్తు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.