సర్వసభ్య సమావేశము
మానసిక ఆరోగ్యము గురించి మాట్లాడుట
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మానసిక ఆరోగ్యము గురించి మాట్లాడుట

నా కుటుంబం శ్రమలను అనుభవించినప్పుడు, నేను చేసిన అనేక పరిశీలనలను పంచుకోవడానికి నన్ను అనుమతించండి.

నిబంధన మార్గంలో సంతోషంగా నడుస్తున్నప్పుడు మా కుటుంబం గొప్ప ఆశీర్వాదాలను పొందినప్పటికీ, మేము చాలా కష్టాలను కూడా ఎదుర్కొన్నాము. మానసిక అనారోగ్యానికి సంబంధించి కొన్ని వ్యక్తిగత అనుభవాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. వీటిలో చికిత్స అవసరమైన నిరాశ, తీవ్రమైన ఆందోళన, ద్విధ్రువ రుగ్మత, ఎ.డి.హెచ్‌.డి—మరియు కొన్నిసార్లు వీటన్నిటి కలయిక ఉన్నాయి. వీటితో సంబంధమున్న వారి ఆమోదంతో నేను ఈ సున్నితమైన అనుభవాలను పంచుకుంటాను.

నా పరిచర్యలో, నేను ఇలాంటి అనుభవాలు కలిగిన వందలాది వ్యక్తులు మరియు కుటుంబాలను కలుసుకున్నాను. లేఖనాలలో పేర్కొన్న విధంగా భూమిని కప్పిన “నాశనకరమైన తెగులులో”1 మానసిక అనారోగ్యం కూడా ఉండవచ్చునేమోనని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోయాను. యువకులు, వృద్ధులు, ధనికులు మరియు పేదలందరినీ ప్రభావితం చేస్తూ, ప్రతి ఖండాన్ని మరియు సంస్కృతిని కలుపుకొంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. సంఘ సభ్యులు మినహాయించబడలేదు.

అదే సమయంలో, మన సిద్ధాంతం యేసు క్రీస్తు వలె మారడానికి మరియు ఆయనలో పరిపూర్ణులు కావడానికి ప్రయాసపడాలని బోధిస్తుంది. మన పిల్లలు “నేను యేసువలె ఉండుటకు ప్రయత్నిస్తున్నాను”2 అని పాడుతారు. మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పరిపూర్ణులు గనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాము.3 పరిపూర్ణత గురించి మన అవగాహనకు మానసిక అనారోగ్యం అంతరాయం కలిగించవచ్చు గనుక, ఈ అంశము చాలా తరచుగా నిషిద్ధమైనదిగా మిగిలిపోతుంది. ఫలితంగా చాలా అజ్ఞానం, చాలా మౌనమైన బాధ మరియు చాలా నిరాశ ఉన్నది. చాలామంది, వారు తెలుసుకున్న ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ముంచివేయబడినట్లు భావిస్తూ, సంఘములో తమకు చోటు లేదని తప్పుగా నమ్ముతారు.

అటువంటి మోసాన్ని ఎదుర్కొనుటకు, “రక్షకుడు తన తండ్రి యొక్క పిల్లలలో ప్రతివారిని ప్రేమిస్తారు అని గుర్తుంచుకోవడం ముఖ్యమైనది. అనేక రకాల మానసిక ఆరోగ్య సవాళ్ళతో జీవిస్తున్నప్పుడు చాలామంది అనుభవించే బాధను, శ్రమను ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆయన ‘ప్రతిరకమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ … తన జనుల యొక్క బాధలు మరియు రోగములను ఆయన తనపైన [తీసుకొనెను]’ (ఆల్మా 7:11; అవధారణ చేర్చబడింది; హెబ్రీయులకు 4:15–16; 2 నీఫై 9:21 కూడా చూడండి). ఆయన అన్ని బాధలను అర్థం చేసుకున్నందున, ఏవిధంగా ‘నలిగినవారిని విడిపించవలెనో’ ఆయన ఎరిగియున్నాడు (లూకా 4:18; యెషయా 49:13–16 కూడా చూడండి).4 సవాళ్ళు తరచుగా అదనపు సాధనాలు మరియు మద్దతు యొక్క అవసరాన్ని సూచిస్తాయి, కానీ గుణములో లోపాన్ని కాదు.

నా కుటుంబం శ్రమలను అనుభవించినప్పుడు, నేను పరిశీలించిన అనేక విషయాలను పంచుకోవడానికి నన్ను అనుమతించండి.

ముందుగా, చాలామంది మాతో విలపిస్తారు; వారు మమ్మల్ని తీర్పు తీర్చరు. తీవ్రమైన భయాందోళనలు, ఉద్రేకము మరియు నిరాశ కారణంగా, మా కుమారుడు కేవలం నాలుగు వారాల తర్వాత తన సువార్త సేవ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడి తల్లిదండ్రులుగా, మేము అతడి విజయం కోసం చాలా ప్రార్థించినందువలన నిరాశ మరియు బాధను ఎదుర్కోవడం మాకు కష్టమైంది. అందరి తల్లిదండ్రులవలె, మన పిల్లలు కూడా సుభిక్షంగా మరియు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాము. మా కుమారుడికి సువార్తసేవ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో అని కూడా మేము ఆశ్చర్యపడ్డాము.

మాకు తెలియకుండానే, మా కొడుకు తిరిగి రావడం అతనికి అనంతంగా మరింత వినాశకరంగా మారింది. అతడు ప్రభువును ప్రేమించాడని మరియు సేవ చేయాలనుకున్నాడని గమనించండి, అయినప్పటికీ అతడు అర్థం చేసుకోవడానికి కష్టమైన కారణాల వల్ల అతడు చేయలేకపోయాడు. అతడు త్వరలోనే పూర్తి నిరాశా నిస్పృహలో ఉన్నట్లు మరియు తీవ్ర అపరాధంతో పోరాడుతున్నట్లు కనుగొన్నాడు. అతడు ఇకపై అంగీకరించబడినట్లు భావించలేదు, కానీ ఆత్మీయంగా మొద్దుబారిపోయినట్లు భావించాడు. మరణించాలనే పునరావృత ఆలోచనలచేత అతడు ముంచివేయబడ్డాడు.

ఈ అహేతుక స్థితిలో ఉన్నప్పుడు, మా కుమారుడు తన ప్రాణాలను తీసుకోవడమే మిగిలి ఉందని నమ్మాడు. అతడిని రక్షించడానికి పరిశుద్ధాత్మ మరియు తెరకు ఇరువైపులా ఉన్న దేవదూతల సైన్యం అవసరమైయింది.

అతడు తన జీవితం కోసం పోరాడుతున్నప్పుడు మరియు ఈ అత్యంత క్లిష్ట సమయంలో మా కుటుంబం, వార్డు నాయకులు, సభ్యులు మరియు స్నేహితులు మాకు మద్దతునివ్వడానికి, సేవ చేయడానికి ప్రత్యేక ప్రయత్నం చేయవలసి వచ్చింది.

అటువంటి కుమ్మరించబడిన ప్రేమను నేనెప్పుడూ అనుభవించలేదు. ఆదరణ యొక్క అవసరతలో ఉన్నవారిని ఆదరించుట అంటే ఏమిటో ఇంత శక్తివంతంగా మరియు స్వంత విధానంలో నేనెన్నడూ గ్రహించలేదు. ఆ అధికప్రేమకు మా కుటుంబం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటుంది.

ఈ సంఘటనలతో పాటు జరిగిన లెక్కలేనన్ని అద్భుతాలను నేను వర్ణించలేను. అదృష్టవశాత్తు, మా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ అతడు ప్రేమించబడ్డాడని, విలువైనవాడని మరియు అవసరమైనవాడని అతడు అంగీకరించడానికి మరియు నయం చేయబడడానికి అతడికి చాలా కాలం మరియు చాలా వైద్య, చికిత్స మరియు ఆత్మీయ సంరక్షణ అవసరమయ్యాయి.

అటువంటి సంఘటనలన్నీ మాకు జరిగినట్లుగానే ముగింపబడవని నేను గుర్తించాను. ప్రియమైన వారిని చాలా ముందుగానే కోల్పోయి, ఇప్పుడు బాధతో పాటు సమాధానాలు లేని ప్రశ్నలతో బాధపడుతున్న వారితో నేను బాధపడుతున్నాను.

నా తదుపరి పరిశీలన ఏమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లల పోరాటాలను గుర్తించడం కష్టంగా ఉంటుంది, కానీ మనకు మనం అవగాహన కలిగించుకోవాలి. సాధారణ అభివృద్ధికి సంబంధించిన ఇబ్బందులు మరియు అనారోగ్యం యొక్క సూచనల మధ్య వ్యత్యాసాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? తల్లిదండ్రులుగా, మన పిల్లలు జీవితములో ఎదుర్కొనే సవాళ్ళను పరిష్కరించుటలో సహాయపడే పవిత్రమైన బాధ్యత మనకు ఉంది; అయినప్పటికిని, మనలో కొద్దిమంది మానసిక ఆరోగ్య నిపుణులు. అయినప్పటికీ, మన పిల్లలు తగిన అంచనాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వారి నిజాయితీతో కూడిన ప్రయత్నాలతో సంతృప్తి చెందడం నేర్చుకోవడానికి వారికి సహాయపడడం ద్వారా వారి పట్ల శ్రద్ధ వహించాలి. ఆత్మీయ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని మనలో ప్రతి ఒక్కరికి మన వ్యక్తిగత లోపాల నుండి తెలుసు.

“ప్రతీ భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్య సమస్యకు పరిష్కారము లేదు. పతనమయిన ప్రపంచంలో, పతనమయిన శరీరంతో జీవిస్తున్నందున, మనం ఒత్తిడి మరియు గందరగోళాన్ని అనుభవిస్తాము. అదనంగా, అనేక సహకార కారకాలు మానసిక అనారోగ్య నిర్ధారణకు దారితీయవచ్చు. మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సుతో సంబంధం లేకుండా, మన లోటుపాట్లు గురించి ఆలోచించడం కంటే పెరుగుదలపై దృష్టి పెట్టడం ఆరోగ్యకరం” అని మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాము.5

నా భార్య మరియు నాకు, ఎల్లప్పుడూ సహాయపడిన ఒక విషయం ఏమిటంటే ప్రభువుకు సాధ్యమైనంత దగ్గరగా ఉండటమే. వెనక్కి తిరిగి చూస్తే, గొప్ప సందిగ్ధ సమయాల్లో ప్రభువు ఓపికగా మాకు ఎలా బోధించారో ఇప్పుడు మేము చూసాము. చీకటి సమయాల్లో ఆయన వెలుగు మాకు దశలవారీగా మార్గనిర్దేశం చేసింది. భూసంబంధమైన పని లేదా సాధన కంటే నిత్య ప్రణాళికలో ఒక వ్యక్తి ఆత్మ విలువ చాలా ముఖ్యమైనదని చూడడానికి ప్రభువు మాకు సహాయం చేశారు.

మరలా, మానసిక అనారోగ్యం గురించి మనకు మనం అవగాహన కలిగించుకోవడం వలన, మనకు మరియు కష్టాల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. ఒకరితో ఒకరు బహిరంగంగా మరియు నిజాయితీగా చర్చించడం వలన ఈ ముఖ్యమైన అంశానికి అర్హమైన శ్రద్ధను పొందడానికి సహాయపడుతుంది. ఏది ఏమైనా, సమాచారం తరువాతే ప్రేరేపణ మరియు బయల్పాటులు వస్తాయి. చాలా తరచుగా కనిపించని ఈ సవాళ్ళు ఎవరినైనా ప్రభావితం చేయగలవు, మరియు మనం వాటిని ఎదుర్కొంటున్నప్పుడు, అవి అధిగమించలేనివిగా కనిపిస్తాయి.

మనం నేర్చుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే మనం ఖచ్చితంగా ఒంటరిగా లేము. సువార్త గ్రంథాలయ యాప్‌లోని జీవిత సహాయ విభాగంలో మానసిక ఆరోగ్యం అనే అంశాన్ని అధ్యయనం చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అభ్యాసము మరింత అవగాహన, మరింత అంగీకారం, మరింత కరుణ మరియు మరింత ప్రేమకు దారితీస్తుంది. ఇది విషాదాన్ని తగ్గించగలదు, అదే సమయంలో ఆరోగ్యకరమైన అంచనాలను మరియు ఆరోగ్యకరమైన పరస్పర చర్యలను అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి మనకు సహాయం చేస్తుంది.

నా చివరి పరిశీలన: మనం ఒకరినొకరం నిరంతరం కనిపెట్టుకొని ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమించాలి మరియు ముఖ్యంగా మన అంచనాలు వెంటనే నెరవేరనప్పుడు—తక్కువ తీర్పుతీర్చువారిగా ఉండాలి. మన పిల్లలు మరియు యువత వారిపట్ల వారు ప్రేమను అనుభూతి చెందడానికి కష్టపడుతున్నప్పుడు కూడా, వారి జీవితాలలో యేసు క్రీస్తు ప్రేమను అనుభూతి చెందడానికి మనం సహాయం చేయాలి. పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యుడిగా పనిచేసిన ఎల్డర్ ఆర్సన్ ఎఫ్. విట్నీ, కష్టపడుతున్న సంతానానికి ఎలా సహాయం చేయాలో తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు: “మీ … పిల్లల కోసం ప్రార్థించండి …; మీ విశ్వాసంతో వారిని హత్తుకొని ఉండండి.”6

విశ్వాసంతో వారిని కనిపెట్టడం అంటే ఏమిటో నేను తరచుగా ఆలోచించాను. ప్రేమ, సాత్వీకము, దయ మరియు గౌరవం యొక్క సాధారణ చర్యలను ఇది కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను. దీని అర్థము వారి స్వంత వేగంతో అభివృద్ధి చెందడానికి వారిని అనుమతించడం మరియు మన రక్షకుని ప్రేమను అనుభూతి చెందడంలో వారికి సహాయపడటానికి సాక్ష్యం చెప్పడం. వారి గురించి ఎక్కువగా ఆలోచించడం మరియు మన గురించి లేదా ఇతరుల గురించి తక్కువగా ఆలోచించడం అవసరం. సాధారణంగా దాని అర్థము తక్కువ మాట్లాడటం మరియు చాలా ఎక్కువగా వినడం. మనం వారిని ప్రేమించాలి, వారిని శక్తివంతం చేయాలి, మరియు విజయవంతం కావడానికి మరియు దేవునికి నమ్మకంగా ఉండటానికి వారి ప్రయత్నాలను తరచుగా ప్రశంసించాలి. చివరగా, మనం దేవునికి దగ్గరగా ఉన్నట్లే, వారికి దగ్గరగా ఉండటానికి మన శక్తి మేరకు మనం ప్రతీది చేయాలి.

మానసిక అనారోగ్యంతో వ్యక్తిగతంగా ప్రభావితం చేయబడిన వారందరికీ, మీరు ఈ సమయంలో దేవుని ప్రేమను అనుభవించకపోయినా, మీ నిబంధనలను గట్టిగా పట్టుకొని ఉండండి. మీ శక్తిమేరకు ఏమి చెయగలరో దానిని చేయండి, తరువాత “దేవుని రక్షణను చూచుటకు, ఆయన బాహువు బయలుపరచబడుట కొరకు … నిశ్చయముతో నిలిచియుండుము.”7

యేసు క్రీస్తు మన రక్షకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనకు మనం తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు మరియు మన కొరకు కనిపెడుతున్నారు. మా కుటుంబ శ్రమల సమయంలో, ఆయన ఎంత సన్నిహితుడో నేను తెలుసుకున్నాను. ఆయన వాగ్దానములు యథార్థమైనవి:

భయపడకు, నేను మీతో ఉన్నాను; ఓహ్ భయపడవద్దు,

నేను మీ దేవుడును, ఇంకా నేను సహాయం చేస్తాను.

నేను మిమ్ములను బలపరుస్తాను, మీకు సహాయం చేస్తాను మరియు మిమ్ములను నిలబెడతాను, …

నా నీతిగల,సర్వశక్తివంతమైన హస్తముచేత సమర్ధించబడతారు.

మన పునాది ఎంత దృఢమైనదో తెలుసుకుని, మనం ఎల్లప్పుడు సంతోషంగా ఇలా ప్రకటించవచ్చు:

విశ్రాంతి కొరకు యేసు పై ఆధారపడిన ఆత్మ

అతడి శత్రువులకు వదలివేయను, నేను వదలలేను;

కదిలించడానికి నరకమంతా ప్రయత్నించినప్పటికీ, ఆ ఆత్మ, …

నేను ఎన్నడూ, ఎన్నడూ … ఎన్నడూ విడిచిపెట్టను!8

యేసు క్రీస్తు నామములో, ఆమేన్.