సర్వసభ్య సమావేశము
దేవుని ప్రేమ
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


దేవుని ప్రేమ

మన తండ్రి మరియు మన విమోచకుడు మనల్ని ఆజ్ఞలతో దీవించారు మరియు వారి ఆజ్ఞలను పాటించడం ద్వారా వారి పరిపూర్ణ ప్రేమను మనము మరింత సంపూర్ణంగా మరియు గాఢంగా అనుభూతి చెందుతాము.

మన పరలోక తండ్రి మనలను గాఢంగా మరియు సంపూర్ణంగా ప్రేమిస్తున్నారు.1 ఆయన ప్రేమ వలన, ఆయన కలిగియుండిన మరియు కలిగియున్న సమస్తము కలిపి మనం పొందడానికి సమ్మతంగా ఉన్న అన్ని అవకాశాలను, ఆనందాలను మనకు అందుబాటులో ఉంచడానికి ఒక విమోచన మరియు సంతోషకర ప్రణాళికను తయారు చేసారు.2 దీనిని సాధించడానికి, ఆయన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మన విమోచకునిగా ఇవ్వడానికి కూడా సమ్మతించారు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”3 ఆయనది తండ్రి యొక్క స్వచ్ఛమైన ప్రేమ—అందరికీ సార్వత్రికమైనది అయినప్పటికీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనది.

ఇదే పరిపూర్ణమైన ప్రేమను యేసు క్రీస్తు తండ్రితో పంచుకుంటారు. తండ్రి తన గొప్ప సంతోషకర ప్రణాళికను మొదట వివరించినప్పుడు, మనలను విమోచించడానికి రక్షకునిగా వ్యవహరించుటకు ఆయన ఒకరిని పిలుచుట ఆ ప్రణాళికలో ముఖ్యమైన భాగము. “నేనున్నాను, నన్ను పంపుము” అని యేసు స్వచ్ఛందముగా వచ్చారు. 4 రక్షకుడు “ఆయన లోకమునకు ప్రయోజనకరమైన దానిని తప్ప మరిదేనిని చేయడు; ఏలయనగా ఆయన తన ప్రాణమును పణంగాపెట్టి మనుష్యులందరినీ తన వైపు ఆకర్షించునంతగా లోకమును ప్రేమించెను. అందువలన ఆయన రక్షణలో పాలుపొందమని ఆయన అందరిని ఆజ్ఞాపించును.”5

క్రీస్తు నామమున తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు ఈ దైవిక ప్రేమ మనకు అపారమైన ఓదార్పును మరియు ధైర్యాన్ని ఇవ్వాలి. మనలో ఒక్కరు కూడా వారికి అపరిచితులు కారు. మనం అనర్హులమని భావించినప్పటికీ, దేవుడిని ప్రార్థించడానికి వెనుకాడవలసిన అవసరం లేదు. వారు మనల్ని వినడానికి యేసు క్రీస్తు యొక్క కనికరము మరియు యోగ్యతలపై మనం ఆధారపడవచ్చు.6 మనం దేవుని ప్రేమలో నిలిచియుంటే, మనకు మార్గనిర్దేశం చేయడానికి ఇతరుల ఆమోదంపై మనం చాలా తక్కువ ఆధారపడి ఉంటాము.

దేవుని ప్రేమ పాపాన్ని మన్నించదు; బదులుగా ఇది విమోచనను అందిస్తుంది.

దేవుని ప్రేమ విస్తారమైనది, గనుక కొందరు దీనిని “షరుతులులేనిది” అని అంటారు మరియు దేవుని దీవెనలు పొందుటకు “షరుతులులేవని,” రక్షణ పొందుటకు “షరుతులులేవని” అర్థం చేసుకోవాలని వారి మనస్సులలో వారు భావించవచ్చు. అవి షరతులు లేనివి కావు. “రక్షకుడు నన్ను నన్నుగా ప్రేమిస్తున్నారు” అని కొందరు తరుచుగా చెప్తారు మరియు అది ఖచ్చితంగా నిజం. కానీ మనం ప్రస్తుతం ఉన్న స్థితిలో ఆయన మనలో ఎవరినీ తన రాజ్యంలోకి తీసుకువెళ్ళలేరు, “ఏలయనగా అపవిత్రమైనది ఏదియు అక్కడ ఉండజాలదు లేదా ఆయన సన్నిధిలో నివసించలేదు.”7 మన పాపాలు ముందుగా పరిష్కరించబడాలి.

దేవుని రాజ్యం చిన్న పాపానికి పాల్పడినా అది తట్టుకోలేదు అని ఆచార్యులు హ్యూ నిబ్లే ఒకసారి పేర్కొన్నారు: “అవినీతి యొక్క చిన్న మచ్చపడితే ఆ ఇతర ప్రపంచం అవినీతిగలది లేదా అశాశ్వతమైనదని అర్థం. ఒక భవనం, సంస్థ, సంకేతం లేదా గుణములో ఉండే అతి చిన్న లోపం నిత్యత్వంలో తప్పకుండా ప్రాణాంతకం అవుతుంది.”8 దేవుని ఆజ్ఞలు “కఠినమైనవి”9 ఎందుకంటే ఆయన రాజ్యం మరియు దాని పౌరులు మినహాయింపు లేకుండా ఏకరీతిగా చెడును తిరస్కరించి, మంచిని ఎంచుకుంటేనే నిలబడగలరు.10

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా గమనించారు, “మన ఆధునిక సంస్కృతిలో చాలామంది మర్చిపోతున్నట్లు అనిపించే దానిని యేసు స్పష్టంగా అర్థం చేసుకున్నారు: పాపాన్ని క్షమించాలనే ఆజ్ఞ (దానిని చేయడానికి ఆయనకు అనంతమైన సామర్థ్యం ఉంది) మరియు దానిని మాఫీ చేయాలనే దానికి వ్యతిరేకముగా హెచ్చరిక చేయడం మధ్య కీలక వ్యత్యాసం ఉంది (దానిని ఆయన ఒక్కసారి కూడా ఎన్నడూ చేయలేదు).”11

ప్రస్తుతం మనకు లోపాలు ఉన్నప్పటికీ, ఆయన సంఘములో మరియు సిలెస్టియల్ లోకములో, “గౌరవప్రదమైన పేరును”12, మరియు స్థానాన్ని పొందగలమని మనం ఇంకా ఆశించవచ్చు. ఆయన పాపాన్ని మన్నించలేనని లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరించలేనని స్పష్టం చేసిన తర్వాత, ప్రభువు మనకు హామీ ఇస్తున్నారు:

“అయినను, పశ్చాత్తాపపడి ప్రభువు ఆజ్ఞలను గైకొనువాడు క్షమించబడును.”13

“ఎంత తరచుగా నా జనులు పశ్చాత్తాపపడుదురో అంత తరచుగా నాకు వ్యతిరేకముగా వారు చేసిన అతిక్రమములను నేను క్షమించెదను.”14

పశ్చాత్తాపము మరియు దైవిక కృప గందరగోళాన్ని పరిష్కరిస్తుంది:

“అమ్మోనైహా పట్టణమందు జీజ్రొమ్‌ అమ్యులెక్ చెప్పిన మాటలను కూడా జ్ఞాపకముంచుకొనుడి; ఏలయనగా ఆయన తన జనులను విమోచించుటకు ప్రభువు నిశ్చయముగా వచ్చునని, కానీ ఆయన వారిని వారి పాపములలో విమోచించుటకు రాడు, గాని వారి పాపములనుండి వారిని విమోచించుటకు వచ్చునని అతడు అతనికి చెప్పెను.

“మరియు పశ్చాత్తాపమును బట్టి, వారి పాపముల నుండి వారిని విమోచించుటకు తండ్రి నుండి ఆయనకు ఇవ్వబడిన శక్తిని ఆయన కలిగియుండెను; కాబట్టి వారి ఆత్మల యొక్క రక్షణకు విమోచకుని యొక్క శక్తికి తెచ్చు పశ్చాత్తాపము యొక్క షరతుల యొక్క వార్తలను ప్రకటించుటకు ఆయన తన దూతలను పంపెను.”15

పశ్చాత్తాపం యొక్క షరతుతో, న్యాయాన్ని దొంగిలించకుండా ప్రభువు కరుణ చూపగలరు మరియు “దేవుడు, దేవునిగా ఉండుట మానడు.”16

మీకు తెలిసినట్లుగా ప్రపంచం యొక్క విధానము క్రీస్తు విరోధి లేదా “క్రీస్తు అవసరం లేదు.” మన కాలం మోర్మన్ గ్రంథ చరిత్ర యొక్క పునఃప్రదర్శన, దీనిలో ఆకర్షణీయమైన వ్యక్తులు ఇతరుల మీద అవనీతిగల ఆధిపత్యాన్ని అనుసరిస్తారు, లైంగిక అనుమతి పత్రమును వేడుక చేసుకుంటారు మరియు ధనమును సంపాదించుట మన ఉనికి యొక్క లక్ష్యముగా ప్రోత్సహిస్తారు. వారి తత్వాలు చిన్న పాపాన్ని17 లేదా చాలా పెద్ద పాపం చేయడాన్ని సమర్థిస్తాయి, కానీ ఎవరూ విమోచనను అందించలేరు. అది గొఱ్ఱెపిల్ల రక్తం ద్వారా మాత్రమే వస్తుంది. “క్రీస్తు అవసరము లేదు” లేదా “పశ్చాత్తాపం అవసరం లేదు” అని చెప్పే జనసమూహం అందించే అత్యుత్తమమైనది ఏమిటంటే పాపం ఉనికిలో లేదని లేదా అది ఉనికిలో ఉంటే, అది చివరకు ఎలాంటి పర్యవసానాలను కలిగి ఉండదు అనే అవాస్తవ వాదన. తుది తీర్పులో ఆ వాదనకు ఎక్కువ ప్రభావవంతంగా ఉండటం నేను చూడలేను.18

మన పాపాలను హేతుబద్ధం చేయడానికి ప్రయత్నించడంలో అసాధ్యమైన దానిని మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మరోవైపు, కేవలము మన స్వంత యోగ్యత ద్వారా పాపం యొక్క ప్రభావాలను చెరిపివేయడంలో మనం అసాధ్యమైనదాన్ని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మనది హేతుబద్ధీకరణ యొక్క మతం లేదా పరిపూర్ణత యొక్క మతం కాదు, కానీ విమోచన యొక్క మతము—యేసు క్రీస్తు ద్వారా విమోచన. మనం పశ్చాత్తాపపడిన వారిమధ్య ఉంటే, ఆయన ప్రాయశ్చిత్తముతో మన పాపాలు ఆయన సిలువకు వ్రేలాడదీయబడతాయి మరియు “అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.”19

ప్రవక్తల ఆకాంక్షించే ప్రేమ దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది.

పాపానికి వ్యతిరేకంగా వారు చేసిన హెచ్చరికలలో దేవుని ప్రవక్తల ఆకాంక్షించే ప్రేమ వలన నేను చాలాకాలంగా ఆకట్టుకోబడ్డాను మరియు అనుభూతి చెందాను కూడ. వారు ఖండించాలనే కోరికతో ప్రేరేపించబడలేదు. వారి నిజమైన కోరిక దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది; నిజానికి, ఇది దేవుని ప్రేమ. వారు ఎవరి వద్దకు పంపబడతారో వారిని ప్రేమిస్తారు, వారు ఎవరైనా కావచ్చు మరియు వారు ఎలాంటి వారైనా కావచ్చు. ప్రభువు వలె, ఆయన సేవకులు కూడా ఎవరైనా పాపపు బాధలు మరియు అల్పమైన ఎంపికలతో శ్రమపడకూడదని కోరుకుంటారు.20

ఆల్మా తనతో కలిపి క్రైస్తవ విశ్వాసులను బాధించడానికి, హింసించడానికి మరియు చంపడానికి సిద్ధంగా ఉన్న ద్వేషపూరిత జనులకు పశ్చాత్తాపము మరియు విమోచన యొక్క సందేశాన్ని ప్రకటించడానికి పంపబడ్డాడు. అయినప్పటికీ, అతడు వారిని ప్రేమించాడు మరియు వారి రక్షణ కోసం ఆరాటపడ్డాడు. అమ్మోనైహా ప్రజలకు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును ప్రకటించిన తరువాత, ఆల్మా ఇలా వేడుకున్నాడు: “ఇప్పుడు నా సహోదరులారా, మీరు నా మాటలను ఆలకించవలెనని, మీ పాపములను విడిచి వేయవలెనని, మీ పశ్చాత్తాపము యొక్క దినమును ఆలస్యము చేయరాదని; … తద్వారా మీరు అంత్యదినమున పైకి లేపబడి [దేవుని] విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లు వేదనాభరితమైన ఆతురతతో నా హృదయము యొక్క నన్నిహిత భాగమునుండి అంతేకాకుండా బాధ కలుగునంతగా కూడ నేను కోరుచున్నాను.” 21

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మాటలలో, “మనం ఖచ్చితంగా దేవుని పిల్లలందరి గురించి లోతుగా శ్రద్ధ వహిస్తున్నందువల్లనే మనం ఆయన సత్యాన్ని ప్రకటిస్తాము.” 22

దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నారు; మీరు ఆయననుప్రేమిస్తున్నారా?

తండ్రి మరియు కుమారుని ప్రేమ ఉచితంగా ఇవ్వబడుతుంది కానీ దానిలో నిరీక్షణలు మరియు అంచనాలు కూడా కలిపిఉన్నవి. మరలా, అధ్యక్షులు నెల్సన్‌ను ఉదహరిస్తూ, “దేవుని యొక్క చట్టాలు మన పట్ల ఆయనకు గల అనంతమైన ప్రేమచేత మరియు మనకు సాధ్యమైనంత మంచివారిగా కావాలనే ఆయన కోరిక చేత పూర్తిగా ప్రేరేపించబడ్డాయి.”23

వారు మిమ్ములను ప్రేమిస్తున్నారు గనుక, “ఇప్పుడు మీరు ఉన్న స్థితిలో” మిమ్ములను విడిచిపెట్టడానికి వారు ఇష్టపడరు. వారు మిమ్ములను ప్రేమిస్తున్నారు గనుక, మీరు ఆనందాన్ని, విజయాన్ని పొందాలని వారు కోరుకుంటున్నారు. వారు మిమ్ములను ప్రేమిస్తున్నారు గనుక, మీరు పశ్చాత్తాపపడాలని వారు కోరతారు, ఎందుకంటే అదే సంతోషానికి మార్గము. కానీ అది మీ ఎంపిక—వారు మీ కర్తృత్వమును గౌరవిస్తారు. వారిని ప్రేమించడానికి, వారికి సేవ చేయడానికి మరియు వారి ఆజ్ఞలను పాటించడానికి మీరు ఎంచుకోవాలి. అప్పుడు వారు మిమ్ములను మరింత సమృద్ధిగా దీవించగలరు, అదేవిధంగా మిమ్మల్ని ప్రేమించగలరు.

మనపట్ల వారి ప్రధానమైన అంచనా ఏమిటంటే మనం కూడా ప్రేమించాలి. “దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.”24 యోహాను వ్రాసినట్లుగా, “ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనికొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.”25

మాజీ ప్రాథమిక ప్రధాన అధ్యక్షురాలైన జాయ్ డి. జోన్స్ ఒక యువ జంటగా ఉన్నప్పుడు, ఆమె మరియు ఆమె భర్త చాలా సంవత్సరాలుగా సంఘానికి రాని ఒక కుటుంబాన్ని సందర్శించడానికి మరియు పరిచర్య చేయడానికి పిలువబడ్డారని జ్ఞాపకముచేసుకున్నారు. వారు అవసరములేదని వారి మొదటి సందర్శనలో వెంటనే స్పష్టమైంది. అదనపు విఫల ప్రయత్నాల వలన నిరాశ చెందిన తరువాత, చాలా హృదయపూర్వకమైన ప్రార్థన చేసి, ధ్యానించిన తర్వాత, సహోదరుడు మరియు సహోదరి జోన్స్ వారు సేవ ఎందుకు చేయాలి అనేదానికి సిద్ధాంతము మరియు నిబంధనలలో ఈ వాక్యము నుండి సమాధానం పొందారు: “ప్రభువైన నీ దేవుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతోను ప్రేమించవలెను; యేసు క్రీస్తు నామములో నీవు ఆయనను సేవించవలెను.26 సహోదరి జోన్స్ ఇలా అన్నారు:

“మేము ఈ కుటుంబానికి సేవ చేయడానికి మరియు మా బిషప్పుకు సేవ చేయడానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్నామని మేము గ్రహించాము, కానీ మేము నిజంగా ప్రభువు కోసం ప్రేమతో సేవ చేస్తున్నామా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకోవలసి వచ్చింది. …

“… ప్రభువు కోసం మా ప్రేమ వలన మేము ఈ ప్రియమైన కుటుంబంతో మా సందర్శనల కోసం ఎదురుచూడసాగాము (1 నీఫై 11:22 చూడండి). మేము దానిని ఆయన కొరకు చేస్తున్నాము. ఆయన ప్రయాసను ఇకపై ప్రయాసగా చేయలేదు. అనేక నెలలు మేము గుమ్మం దగ్గర నిలబడిన తర్వాత, ఆ కుటుంబం మమ్మల్ని లోపలికి అనుమతించడం ప్రారంభించింది. చివరికి, మేము కలిసి క్రమం తప్పకుండా ప్రార్థన మరియు సున్నితమైన సువార్త చర్చలు జరిపాము. చిరకాల స్నేహం ఏర్పడింది. మేము ఆయన పిల్లలను ప్రేమించడం ద్వారా ఆయనను ఆరాధిస్తున్నాము మరియు ప్రేమిస్తున్నాము.”27

దేవుడు మనల్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నారని ఒప్పుకోవడంలో, మనలో ప్రతి ఒక్కరూ ఇలా ప్రశ్నించుకోవచ్చు, “నేను దేవుడిని ఎంత బాగా ప్రేమిస్తున్నాను? నేను ఆయనపై ఆధారపడినట్లుగా ఆయన నా ప్రేమపై ఆధారపడగలరా?” మన వైఫల్యాలు ఉన్నప్పటికినీ మనం ఏమి అవుతున్నామనే దాని వలన కూడా దేవుడు మనల్ని ప్రేమించగలిగేలా జీవించడం విలువైన ఆకాంక్ష కాదా? ఉదాహరణకు, “అతని హృదయపు నిజాయితీ వలన ప్రభువైన నేను అతడిని ప్రేమించుచున్నాను” అని ఆయన హైరమ్ స్మిత్ గురించి చెప్పినట్లుగా మీ గురించి మరియు నా గురించి చెప్పగలడు.28 యోహాను యొక్క దయగల ఉపదేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”29

నిజానికి, ఆయన ఆజ్ఞలు బాధాకరమైనవి కావు—దానికి వ్యతిరేకమైనవి. అవి స్వస్థత, సంతోషం, శాంతి మరియు ఆనందం యొక్క మార్గాన్ని సూచిస్తాయి. మన తండ్రి మరియు మన విమోచకుడు మనల్ని ఆజ్ఞలతో దీవించారు, మరియు వారి ఆజ్ఞలను పాటించడం ద్వారా వారి పరిపూర్ణ ప్రేమను మనము మరింత సంపూర్ణంగా మరియు గాఢంగా అనుభూతి చెందుతాము.30

నిరంతర కలహములు గల మన కాలానికి పరిష్కారం ఇక్కడ ఉంది— అదే దేవుని ప్రేమ. రక్షకుని పరిచర్య తరువాత, మోర్మన్ గ్రంథ చరిత్రలో సువర్ణ యుగంలో ఈ విధంగా నివేదించబడింది, “జనుల యొక్క హృదయములలో నివసించిన దేవుని యొక్క ప్రేమను బట్టిదేశమందు, ఎట్టి వివాదము లేకుండెను.”31 సీయోను కొరకు ప్రయాసపడుచున్నప్పుడు, ప్రకటనలోని వాగ్దానాన్ని మనము జ్ఞాపకముంచుకుంటాము: “జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ [పరిశుద్ధ] పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు.”32

మన పరలోకపు తండ్రి మరియు మన విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క వాస్తవికత మరియు వారి స్థిరమైన, నిరంతర ప్రేమ గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.