సర్వసభ్య సమావేశము
మీ దీపమును పైకెత్తుడి
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మీ దీపమును పైకెత్తుడి

ఈ రోజు నా ఆహ్వానం చాలా సరళమైనది: సువార్తను పంచుకోండి. మీకు మీరుగా ఉండి, మీ దీపమును పైకెత్తుడి.

కొన్ని సంవత్సరాల క్రితం, నేను పెరూకు వెళ్ళే విమానంలో, నాస్తికుడు అని స్వయంగా చెప్పుకునే వ్యక్తి ప్రక్కన కూర్చున్నాను. నేను దేవునిని ఎందుకు నమ్ముతానని అతడు అడిగాడు. ఆ తర్వాత జరిగిన సంతోషకరమైన సంభాషణలో, జోసెఫ్ స్మిత్ దేవునిని చూసినందు వలన నేను ఆయనను విశ్వసించానని చెప్పాను—ఆ తర్వాత దేవుని గూర్చిన నా జ్ఞానం వ్యక్తిగత, నిజమైన ఆత్మీయ అనుభవం నుండి కూడా వచ్చిందని నేను జోడించాను. “ఒక దేవుడున్నాడని సమస్త వస్తువులు సూచించును”1 అనే నా నమ్మకాన్ని నేను పంచుకున్నాను మరియు అంతరిక్ష శూన్యంలో జీవ ఒయాసిస్సు అనే ఈ భూమి ఎలా ఉనికిలోనికి వచ్చిందని అతడు నమ్మాడని నేను అడిగాను. అతడు తన మాటలలో, అనంతమైన సుదీర్ఘ కాలంలో “విస్ఫోటనం” జరిగి ఉండవచ్చని సమాధానమిచ్చాడు. ఒక ”విస్ఫోటనం” అటువంటి క్రమమును రూపొందించడం ఎంత అసంభవమని నేను వివరించినప్పుడు, అతడు కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి, తర్వాత “నా దగ్గర సమాధానం లేదు” అని అన్నాడు. మీరు మోర్మన్ గ్రంథమును చదువుతారా అని నేను అతడిని అడిగాను. అతడు చదువుతానని చెప్పాడు, కాబట్టి నేను అతనికి ఒక ప్రతిని పంపాను.

అనేక సంవత్సరాల తరువాత, నైజీరియాలోని లాగోస్‌లో ఒక విమానాశ్రయంలో ఉండగా నేను క్రొత్త స్నేహితుడిని పొందాను. అతడు నా పాస్‌పోర్ట్ తనిఖీ చేస్తున్నప్పుడు మాకు పరిచయం ఏర్పడింది. నేను అతడి మత విశ్వాసాల గురించి అడిగాను, మరియు అతడు దేవునియందు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసాడు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలోని ఆనందాన్ని, ఉత్సాహాన్ని నేను పంచుకున్నాను మరియు సువార్తికుల నుండి మరింత నేర్చుకోవడానికి ఇష్టపడతారా అని నేనతడిని అడిగాను. అతడు అవునని చెప్పాడు మరియు అతడు బోధించబడి, బాప్తిస్మం తీసుకున్నాడు. ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల తరువాత, నేను లైబేరియాలోని విమానాశ్రమంలో నడుస్తున్నప్పుడు, నా పేరును పిలిచిన ఒక స్వరం వినిపించింది. నేను తిరిగి చూడగా, అదే యువకుడు పెద్ద చిరునవ్వుతో సమీపించాడు. మేము సంతోషంగా ఆలింగనం చేసుకున్నాము, మరియు అతడు సంఘంలో చురుకుగా ఉన్నాడని, తన స్నేహితురాలికి బోధించడానికి సువార్తికులతో కలిసి పని చేస్తున్నాడని నాకు తెలిపాడు.

నా నాస్తిక మిత్రుడు మోర్మన్ గ్రంథాన్ని చదివాడో, సంఘంలో చేరాడో నాకు తెలియదు. నా రెండవ స్నేహితుడు చేరాడు. ఇద్దరిపట్ల, నా బాధ్యత2—నా అవకాశం—ఒకటే: ప్రేమించుటకు, పంచుకొనుటకు మరియు సాధారణమైన, సహజమైన రీతిలో ఆహ్వానించుటకు సువార్త దీపమును పట్టుకొనియుండుట.3

సహోదర సహోదరిలారా, సువార్తను పంచుకోవడం వలన కలిగే ఆశీర్వాదాలను నేను అనుభవించాను మరియు అవి అసాధారణమైనవి. వాటిలో కొన్ని ఇక్కడున్నాయి:

సువార్తను పంచుకోవడం ఆనందమును, నిరీక్షణను తెస్తుంది

ఈ భూమిమీదకు 4 వచ్చేముందు మనము మన పరలోక తల్లిదండ్రుల బిడ్డలుగా జీవించామని మరియు ప్రతి వ్యక్తికి ఒక శరీరాన్ని పొందడానికి, అనుభవాన్ని పొందడానికి, నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి నిత్య జీవాన్ని—దేవుని యొక్క జీవితాన్ని5 పొందడానికి భూమి సృష్టించబడిందని మీకు మరియు నాకు తెలుసు. పరలోక తండ్రికి మనం భూమిపై బాధపడతాము మరియు పాపం చేస్తామని తెలుసు, కాబట్టి ఆయన తన కుమారుడిని పంపారు, ఆయన “సాటిలేని జీవితం”6 మరియు అనంతమైన ప్రాయశ్చిత్త త్యాగం7 మనం క్షమించబడడం, స్వస్థపరచడం మరియు సంపూర్ణులుగా చేయబడడాన్ని సాధ్యంచేస్తుంది.8

ఈ సత్యాలను తెలుసుకోవడం జీవితాన్నే మార్చివేస్తుంది! జీవితం యొక్క మహిమకరమైన ఉద్దేశ్యాన్ని ఒక వ్యక్తి నేర్చుకున్నప్పుడు, క్రీస్తు తనను అనుసరించేవారిని క్షమిస్తారని ఆదరిస్తారని గ్రహించినప్పుడు మరియు బాప్తిస్మపు నీటిలోకి క్రీస్తును అనుసరించాలని ఎంచుకున్నప్పుడు, జీవిత పరిస్థితులు మెరుగ్గా లేనప్పుడు కూడా జీవితం మెరుగ్గా మారుతుంది.

నైజీరియాలోని ఒనిట్షాలో నేను కలుసుకున్న చాలా సంతోషంగా ఉన్న ఒక సహోదరి, ఒకసారి సత్యాన్ని తెలుసుకుని బాప్తిస్మం తీసుకున్న తరువాత ఇలా చెప్పింది (ఇప్పుడు ఆమె మాటలను నేను ఉపయోగిస్తాను), “నాకు అంతా మంచిగా ఉన్నది. నేను సంతోషంగా ఉన్నాను. నేను పరలోకంలో ఉన్నాను.”9 సువార్తను పంచుకోవడం వలన దాత మరియు గ్రహీత ఇద్దరి ఆత్మలలో ఆనందం మరియు ఆశను కలుగజేస్తుంది. నిజంగా, మీరు సువార్తను పంచుకున్నప్పుడు “మీ ఆనందము ఎంత గొప్పదగును!”10 సువార్తను పంచుకోవడం మనకున్న ఆనందాన్ని, ఆశను రెట్టింపు చేస్తుంది.11

సువార్తను పంచుకోవడం మన జీవితాలలోనికి దేవుని యొక్క శక్తిని తెస్తుంది.

మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు, “ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని”13 మనలో ప్రతిఒక్కరూ దేవునితో శాశ్వతమైన12 నిబంధనలోకి ప్రవేశించాము, ఇందులో “అన్ని సమయములలో, అన్ని విషయములలో, మీరు ఉండు అన్ని స్థలములలో [ఆయనకు] సాక్షులుగా ఉండుట” కలిపియున్నది.14 ఈ నిబంధనను పాటించడం ద్వారా మనం ఆయనలో “నిలిచి” ఉన్నప్పుడు, ఒక కొమ్మ ద్రాక్షచెట్టు15 నుండి పోషణను పొందునట్లు క్రీస్తు నుండి దైవత్వపు శక్తి మన జీవితాల్లోకి ప్రవహిస్తుంది.

సువార్తను పంచుకోవడం మనల్ని శోధనల నుండి కాపాడుతుంది

ప్రభువు ఇలా ఆజ్ఞాపించారు:

“లోకము కొరకు ప్రకాశించునట్లు మీ దీపమును పైకెత్తుడి. ఇదిగో, నేను చేయగా మీరు చూచిన నా మాదిరిని మీరు అనుసరించుడి. …

“… మీరు స్పృశించి తెలుసుకొని, చూచునట్లు నా యొద్దకు మీరు రావలెనని నేను ఆజ్ఞాపించియున్నానని మీరు చూచుచున్నారు; అట్లే మీరు కూడా లోకమునకు చేయవలెను; మరియు ఈ ఆజ్ఞను అతిక్రమించు వారెవరైనను శోధనలోనికి నడపించబడుటకు తమనుతాము అనుమతించుకొందురు.”16

సువార్త దీపమును పట్టుకోకూడదని ఎంచుకోవడం వలన సత్యం మరియు జ్ఞానం లేని స్థితిలోకి మనము నెట్టబడతాము, అక్కడ మనం ఎక్కువ శోధనలకు గురవుతాము. ముఖ్యముగా, దానికి వ్యతిరేకమైనది నిజం: సువార్త దీపమును పట్టుకోవడానికి ఎంచుకోవడం మనల్ని ఆ కాంతికి మరియు శోధనలకు వ్యతిరేకంగా అది అందించే రక్షణకు దగ్గర చేస్తుంది. నేటి ప్రపంచంలో ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం!

సువార్తను పంచుకోవడం మనకు స్వస్థత కలిగిస్తుంది

సహోదరి టిఫనీ మైలోన్ తన విశ్వాసం గురించిన ప్రశ్నలతో సహా తీవ్రమైన వ్యక్తిగత పోరాటాలు ఉన్నప్పటికీ, సువార్తికులకు సహకరించాలనే ఆహ్వానాన్ని అంగీకరించింది. సువార్తికులకు సహాయం చేయడం ఆమె విశ్వాసాన్ని మరియు క్షేమంగా ఉన్నాననే భావనను నూతనపరిచిందని ఇటీవల ఆమె నాతో చెప్పింది. ఆమె మాటల్లో, “సువార్తసేవ స్వస్థత చేకూరుస్తుంది.”17

ఆనందము. నిరీక్షణ. దేవుని నుండి బలపరిచే శక్తి. శోధనల నుండి రక్షణ. స్వస్థత. మనం సువార్తను పంచుకున్నప్పుడు (పాపముల క్షమాపణతో సహా)18 ఇవన్నీ మరియు మరిన్ని పరలోకమునుండి దీవెనలు మంచుబిందువుల వలె మన ఆత్మలపై కురియునట్లు చేస్తుంది.

ఇప్పుడు మనకున్న గొప్ప అవకాశము వైపు తిరుగుట

సహోదర సహోదరిలారా, “అన్ని … పక్షములు, [మతవిభాగములు] మరియు మతశాఖలలో అనేకమంది కేవలము సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్నారు.”19 మన దీపమును పట్టుకోవలసిన అవసరం ఇంత ఎక్కువగా మానవ చరిత్రలో ఎన్నడూ లేదు. మరియు సత్యము మునుపెన్నడు ఇంత ఎక్కువ అందుబాటులో లేదు.

బౌద్ధమతంలో పెరిగిన జిమ్మీ టన్, తమ జీవితాన్ని యూట్యూబ్‌లో పంచుకున్న ఒక కుటుంబం చేత ఆకర్షించబడ్డాడు. వారు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యులు అని తెలుసుకున్నప్పుడు, అతడు స్వయంగా ఆన్‌లైన్‌లో సువార్తను అధ్యయనం చేసాడు, యాప్‌లో మోర్మన్ గ్రంథాన్ని చదివాడు, మరియు కాలేజీలో సువార్తికులను కలిసిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు…20 ఎల్డర్ టన్ ఇప్పుడు తానే పూర్తి కాల సువార్తికుడు.

మన ప్రవక్త మాటలలో—అతడు మరియు ప్రపంచమంతటా ఉన్న అతని తోటి సువార్తికులు ప్రభువు యొక్క సైన్యమైయున్నారు.21 ఈ సువార్తికులు సాధారణంగా చేసేదానికంటే భిన్నంగా చేస్తున్నారు: 2000 నుండి 2010లోపు జన్మించిన వారు దేవుని22 నుండి దూరముగా వెళ్తున్నట్లు సర్వేలు నివేదిస్తుండగా, మన యౌవన యోధులైన23 ఎల్డర్లు మరియు సహోదరీలు జనులను దేవుని వైపుకు త్రిప్పుచున్నారు. అధిక సంఖ్యలో సంఘ సభ్యులు సువార్తను పంచుకోవడంలో సువార్తికులతో ఐక్యమవుతున్నారు మరియు అనేక మంది స్నేహితులు క్రీస్తు మరియు ఆయన సంఘానికి వచ్చుటకు సహాయపడుతున్నారు.

లైబేరియాలో మన ప్రియమైన కడవరి దిన సభ్యులు 10 నెలల్లో 507 మంది స్నేహితులు బాప్తిస్మపు నీటిలో ప్రవేశించడానికి సహాయం చేసారు, వారి దేశంలో పూర్తి కాల సువార్తికులు లేరు. పూర్తి-కాల సువార్తికులు తిరిగి వస్తారని లైబేరియాలోని మా అద్భుతమైన స్టేకు అధ్యక్షులలో ఒకరు విన్నప్పుడు, ఆయన ఇలా అన్నారు: “ఓహ్ మంచిది, ఇప్పుడు వారు మా పనిలో మాకు సహాయపడగలరు.”

ఆయన చెప్పింది సరియైనదే: ఈ భూమిపై గొప్ప హేతువైన24 ఇశ్రాయేలీయుల సమకూర్పు మన నిబంధన బాధ్యత. మరియు ఇది మన సమయం! ఈ రోజు నా ఆహ్వానం చాలా సరళమైనది: సువార్తను పంచుకోండి. మీకు మీరుగా ఉండి, మీ దీపమును పైకెత్తండి. పరలోక సహాయం కోసం ప్రార్థించండి మరియు ఆధ్యాత్మిక ప్రేరణలను అనుసరించండి. మీ జీవితాన్ని సాధారణంగా మరియు సహజంగా పంచుకోండి, వచ్చి చూడమని, వచ్చి సహాయం చేయమని, మరియు వచ్చి చేరమని మరొక వ్యక్తిని ఆహ్వానించండి.25 మీరు మరియు మీరు ప్రేమించేవారు వాగ్దానం చేయబడిన దీవెనలను పొందినప్పుడు సంతోషించండి.

క్రీస్తులో దీనులకు సువర్తమానము ప్రకటించబడుతుందని; క్రీస్తులోనలిగిన హృదయముగలవారు దృఢపరచబడతారని; క్రీస్తులోచెరలోనున్నవారికి విడుదల ప్రకటించబడుతుందని; మరియు క్రీస్తులో, క్రీస్తులో మాత్రమే, దుఃఖించు వారికి బూడిదెకు ప్రతిగా పూదండ ఇవ్వబడుతుందని నాకు తెలుసు.26 అందువలన, ఈ విషయాలను తెలియజేయబడడం చాలా అవసరం!27

యేసు క్రీస్తు మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.28 సువార్త దీపమును పట్టుకొనియుండుటలో మన విశ్వాసం యొక్క సాధన ఎంత అసంపూర్ణమైనదైనప్పటికీ దానిని ఆయన ముగిస్తారు, ఆయన పూర్తి చేస్తారు. ఆయన మన జీవితాల్లో, ఆయన సమకూర్చే వారందరి జీవితాలలో అద్భుతాలు చేస్తారు, ఎందుకంటే ఆయన అద్భుతములు చేసే దేవుడు.29 యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన నామములో, ఆమేన్.