సర్వసభ్య సమావేశము
ఆయన మనల్ని ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నాను
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ఆయన మనల్ని ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నాను

చిన్న ప్రయత్నాలు సమిష్టిగా పెద్ద ప్రభావాన్ని చూపి, యేసు క్రీస్తు శిష్యులుగా మనం వ్యక్తిగతంగా చేసే అనేక పనులను పెద్దవిగా చేస్తాయి.

ఒకరికి ధన్యవాదాలు తెలుపడానికి, ఫైలో పిండి మరియు పిస్తా గింజలతో ఈ బిస్కెట్టు తయారుచేయబడింది. దశాబ్దాలుగా సిరియాలోని దమస్కులో మూడు బేకరీలను కలిగి ఉన్న కడాడో కుటుంబం దీనిని తయారు చేసింది. యుద్ధం వచ్చినప్పుడు, ఒక దిగ్బంధనం ఆహారం మరియు సామాగ్రి నగరంలోని తమ ప్రాంతానికి చేరనివ్వకుండా ఆపింది. కడాడోలు ఆకలితో అలమటించడం ప్రారంభించారు. నిరాశతోకూడిన ఈ పరిస్థితి తీవ్రమైనప్పుడు, కడవరి దిన పరిశుద్ధుల దాతృత్వసేవలు మరియు రెహ్మా వరల్డ్‌వైడ్‌లోని కొంతమంది ధైర్యవంతులైన సిబ్బంది, చిన్న పిల్లలకు పాలు ఇవ్వడంతో పాటు రోజూ వేడి భోజనాన్ని అందించడం మొదలుపెట్టారు. ఆ కష్టకాలం తరువాత, ఆ కుటుంబం మరలా క్రొత్త దేశంలో వారి జీవితాన్ని అదేవిధంగా వారి బేకరీని పునఃప్రారంభించింది.

ఇటీవల, క్రింది సందేశంతో బిస్కెట్ల పెట్టె సంఘ కార్యాలయాలకు వచ్చింది: “రెండు నెలలకు పైగా, మేము రెహ్మా–కడవరి దిన పరిశుద్ధుల [దాతృత్వసేవల] వంటగది నుండి ఆహారాన్ని పొందగలిగాము. అది లేకుంటే మేము [ఆకలితో] మరణించియుండేవారము. నా అంగడి నుండి నమూనాను చిన్న ధన్యవాద చిహ్నముగా పంపిస్తున్నాను … దయచేసి దీన్ని అంగీకరించండి. మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని ఆశీర్వదించమని సర్వశక్తిమంతుడైన దేవుడిని నేను కోరుతున్నాను.”1

ఈ బిస్కెట్టు కృతజ్ఞతను సూచిస్తుంది మరియు చేయబడిన సేవను గుర్తుంచుకోవడానికి ఒక మార్గము. ఇది సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతా చిహ్నంగా ఉంది. వార్తల కథనాన్ని చూసిన తర్వాత ప్రార్థించిన వారందరికీ, సౌకర్యవంతంగా లేనప్పుడు స్వచ్ఛందంగా పనిచేసిన వారందరికి లేదా ఏదో మంచి జరుగుతుందని మానవతా నిధికి దయతో డబ్బును విరాళమిచ్చిన వారికి ధన్యవాదాలు.

పేదవారిని సంరక్షించడానికి గల దైవిక బాధ్యత

యేసు క్రీస్తు యొక్క సంఘము పేదలను సంరక్షించాలనే దైవిక ఆదేశాన్ని పొందింది.2 రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యము యొక్క స్తంభాలలో ఇది ఒకటైయున్నది.3 ఆల్మా కాలంలో ఏది నిజమో అది ఖచ్చితంగా మనకూ నిజమైనది: “ఆ విధముగా వారి ఉన్నతస్థితిలో వారు దిగంబరముగానున్న వారిని, ఆకలిదప్పులతోనున్న వారిని, రోగులను లేదా పోషింపబడని వారిని వెళ్ళగొట్టలేదు; వారు తమ హృదయములను సంపదలపై నిలుపలేదు; కావున వారు వృద్ధులు యౌవనులు, దాసులు స్వతంత్రులు, పురుషులు స్త్రీలు అందరి యెడల సంఘము వెలుపలనేమి, సంఘమందేమి అవసరతలోనున్న వ్యక్తుల విషయములో పక్షపాతము లేకుండా ఉదారముగానుండిరి.”4

సంఘము ఈ ఆదేశానికి అనేక రకాలుగా ప్రతిస్పందిస్తుంది, వీటిలో:

  • ఉపశమన సమాజము, యాజకత్వ సమూహములు మరియు తరగతుల ద్వారా మనము చేసే పరిచర్య;

  • ఉపవాసం మరియు ఉపవాస కానుకల వినియోగం;

  • సంక్షేమ పొలాలు మరియు డబ్బాలలో ఆహారాన్ని నిల్వచేసే దుకాణాలు;

  • వలసదారులకు స్వాగత కేంద్రాలు;

  • చెరసాలలో ఉన్నవారికి మద్దతు మరియు సహాయం అందించే కార్యక్రమం;

  • సంఘ మానవతావాద సహాయ ప్రయత్నాలు;

  • మరియు అది లభ్యమయ్యే చోట, సేవ చేసే అవకాశాలతో వాలంటీర్లను జతపరచే జస్ట్ సర్వ్ యాప్.

ఇవన్నీ యాజకత్వం ద్వారా నిర్వహించబడిన మార్గాలు, ఇక్కడ చిన్న ప్రయత్నాలు సమిష్టిగా పెద్ద ప్రభావాన్ని చూపి, యేసు క్రీస్తు శిష్యులుగా మనం చేసే అనేక వ్యక్తిగత పనులను పెద్దవిగా చేస్తాయి.

ప్రవక్తలు భూమి అంతటిపై గృహనిర్వాహకత్వాన్ని కలిగియున్నారు

ప్రవక్తలు సంఘ సభ్యుల కోసం మాత్రమే కాకుండా సమస్త భూమిపైబాధ్యత కలిగియున్నారు. ప్రథమ అధ్యక్షత్వము ఆ బాధ్యతను ఎంత వ్యక్తిగతంగా మరియు అంకితభావంతో తీసుకున్నారో నేను నా స్వంత అనుభవం నుండి చెప్పగలను. అవసరాలు పెరిగేకొద్దీ, మన మానవతావాద విస్తరణను గణనీయమైన రీతిలో పెంచమని ప్రథమ అధ్యక్షత్వము మాకు బాధ్యత అప్పగించింది. వారు అతిపెద్ద పోకడలు మరియు చిన్న వివరాలపై ఆసక్తి కలిగి ఉన్నారు.

ఇటీవల, మహమ్మారి సమయంలో ఆసుపత్రులలో ఉపయోగించడం కోసం బీహైవ్ దుస్తుల విభాగం కుట్టిన రక్ష్తిత మెడికల్ గౌన్లలో ఒకదాన్ని మేము వారికి చూపించాము. ఒక మెడికల్ డాక్టరుగా, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గొప్ప ఆసక్తి చూపించారు. ఆయన దానిని కేవలం చూడాలని అనుకోలేదు. ఆయన దానిని ధరించాలని—ముంజేతి పట్టీలు, పొడవు మరియు వెనుక భాగంలో అది కట్టబడి ఉన్న విధానాన్ని పరిశీలించాలని కోరారు. తరువాత ఆయన భావోద్వేగముతో కూడిన స్వరముతో మాతో ఇలా అన్నారు, “మీరు మీకు అప్పగించబడిన కార్యములలో భాగంగా వ్యక్తులను కలిసినప్పుడు, వారి ఉపవాసం, వారి అర్పణలు మరియు ప్రభువు పేరిట వారి పరిచర్యకు ధన్యవాదాలు తెల్పండి.”

మానవతావాద నివేదిక

తుఫానులు, భూకంపాలు, శరణార్థుల స్థానభ్రంశం మరియు ఒక మహమ్మారికి కూడా యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ఎలా ప్రతిస్పందిస్తుందో అధ్యక్షులు నెల్సన్ ఆదేశాల మేరకు నేను మీకు తెలియజేస్తున్నాను—కడవరి దిన పరిశుద్ధులు మరియు చాలా మంది స్నేహితుల దయకు ధన్యవాదాలు. గత 18 నెలల్లో 1,500లకు పైగా కోవిడ్-19 ప్రాజెక్టులు చేయడం ఖచ్చితంగా సంఘ ఉపశమన ప్రయత్నాల యొక్క అతిపెద్ద దృష్టిసారింపు అయినప్పటికీ, సంఘము 108 దేశాలలో 933 ప్రకృతి వైపరీత్యాలు మరియు శరణార్థుల సంక్షోభాలకు కూడా ప్రతిస్పందించింది. కానీ ఈ గణాంకాలు చేయబడుచున్న ప్రతిదాన్ని పూర్తిగా వివరంగా చెప్పవు. ఏమి చేయబడుతుందో వివరించడానికి నాలుగు క్లుప్త ఉదాహరణలను పంచుకుంటాను.

దక్షిణాఫ్రికా కోవిడ్ సహోయకచర్య

దక్షిణాఫ్రికాలోని వెల్‌కామ్‌కు చెందిన పదహారేళ్ల డైక మఫుటి కొన్నేళ్ళ క్రితం తన తల్లిదండ్రులను కోల్పోవడం వలన తన ముగ్గురు తోబుట్టువులను స్వయంగా సంరక్షించవలసి వచ్చింది. తగినంత ఆహారాన్ని కనుగొనడం ఆమెకు ఎల్లప్పుడూ కష్టంగా ఉండేది, కానీ కోవిడ్ కారణంగా సరఫరాలో కొరత మరియు దిగ్బంధాలు దానిని దాదాపు అసాధ్యం చేసింది. వారు తరచుగా ఆకలితో ఉండేవారు, పొరుగువారి ఔదార్యంతో మాత్రమే వారికి చాలీచాలని ఆహారం లభించేది.

చిత్రం
డైక మఫుటి

2020 ఆగష్టులో ఒక ఎండరోజులో, ఆమె తలుపు తట్టబడటంతో డైక ఆశ్చర్యపోయింది. ఆమె తలుపు తెరిచినప్పుడు ఇద్దరు అపరిచితులను కనుగొంది—ఒకరు జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రాంతీయ కార్యాలయం నుండి సంఘ ప్రతినిధి మరియు మరొకరు దక్షిణాఫ్రికాలోని సామాజిక అభివృద్ధి శాఖ అధికారి.

ప్రమాదంలో ఉన్న కుటుంబాలకు ఆహారాన్ని తీసుకురావడానికి రెండు సంస్థలు జతకలిసాయి. సంఘ మానవతావాద నిధులతో కొనుగోలు చేసిన మొక్కజొన్న పిండి గుట్ట మరియు ఇతర ఆహార పదార్థాలను ఆమె చూసినప్పుడు డైకకు అకస్మాత్తుగా గొప్ప ఉపశమనం కలిగింది. ప్రభుత్వ సహాయ ప్యాకేజీ ఆమె కోసం అమలులోకి వచ్చే వరకు ఆమె తన కుటుంబాన్ని అనేక వారాల పాటు పోషించడానికి ఇవి సహాయపడతాయి.

కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అలాంటి వేలాది అనుభవాలలో డైక కథ ఒకటి. సమర్పించబడిన మీ విరాళముల కొరకు ధన్యవాదాలు.

రామ్‌స్టెయిన్‌లో ఆఫ్ఘన్ సహాయకచర్య

వార్తల్లో ఇటీవలి చిత్రాలను మనమందరం చూసాము: ఆఫ్ఘనిస్తాన్ నుండి వేలాదిమంది తరలివచ్చారు. చాలామంది తమ తుది గమ్యస్థానాలకు వెళ్ళడానికి ముందు ఖత్తర్, సంయుక్త రాష్ట్రాలు, జర్మనీ మరియు స్పెయిన్‌లోని విమాన స్థావరాలు లేదా ఇతర తాత్కాలిక ప్రదేశాలకు వచ్చారు. వారి అవసరాలు తక్షణమే తీర్చాలి, మరియు సామాగ్రితో, వాలంటీర్లతో సంఘం స్పందించింది. జర్మనీలోని రామ్‌స్టెయిన్ వాయుదళ స్థావరం వద్ద, సంఘం పెద్ద మొత్తంలో డైపర్‌లు, పిల్లలకు డబ్బాపాలు, ఆహారం మరియు బూట్లు అందించింది.

చిత్రం
శరణార్థులకు మానవసంక్షేమ విరాళాలు
చిత్రం
ఆఫ్ఘన్ శరణార్థుల కోసం వస్త్రములు కుట్టుచున్న మహిళలు

కాబూల్ విమానాశ్రయం రద్దీగా గందరగోళంగా ఉండటంతో చాలా మంది ఆఫ్ఘన్ మహిళలు తమ శిరస్సును కప్పుకోవడానికి ధరించిన సాంప్రదాయక వస్త్రమును కోల్పోవడం వలన తమ భర్తల చొక్కాలను ఉపయోగిస్తున్నట్లు కొంతమంది ఉపశమన సమాజ సహోదరిలు గమనించారు. మతపరమైన లేదా సాంస్కృతిక సరిహద్దులను దాటిన స్నేహపూర్వక చర్యకు నిదర్శనంగా, రామ్‌స్టెయిన్ మొదటి వార్డు సహోదరిలు ఆఫ్ఘన్ మహిళలకు సాంప్రదాయ ముస్లిం దుస్తులను కుట్టడానికి సమావేశమయ్యారు. సహోదరి బేథని హాల్స్ ఇలా అన్నారు, “మహిళలకు ప్రార్థన వస్త్రాలు అవసరమని మేము విన్నాము, మరియు వారు ప్రార్థన కోసం [సౌకర్యవంతంగా] ఉండటానికి మేము వాటిని కుట్టాము.”5

హైతీ భూకంప సహాయకచర్య

ఇతరులకు మంచి చేయాలంటే మీరు ధనవంతులుగా లేదా వృద్ధులుగా ఉండాల్సిన అవసరం లేదని ఈ తర్వాతి ఉదాహరణ చూపిస్తుంది. పద్దెనిమిదేళ్ల మారీ “జడ్జౌ” జాక్వెస్ హైతీలోని కవైలాన్ శాఖ నుండి వచ్చింది. ఆగష్టులో ఆమె పట్టణ సమీపంలో వినాశకరమైన భూకంపం సంభవించినప్పుడు, కూలిపోయిన పదివేల భవనాలలో ఆమె కుటుంబం యొక్క ఇల్లు ఒకటి. మీ ఇంటిని కోల్పోయే బాధన ఊహించుకోవడం దాదాపు అసాధ్యం. కానీ ఆ నిరాశకు లోనయ్యే బదులు ఆమె అద్భుతరీతిలో, భూకంపం ఇతర వ్యక్తులను ఎలా ప్రభావితం చేసిందో గ్రహించింది మరియు వారికి సహాయం చేసే ప్రయత్నం చేసింది.

చిత్రం
మారీ జాక్వెస్
చిత్రం
హైతీ భూకంపము

సంబంధిత పత్రికారంగం

ఆమె పొరుగింటి వృద్ధురాలు కష్టపడడాన్ని చూసి ఆమెను సంరక్షిచడం ప్రారంభించింది. శిథిలాలను తొలగించడానికి ఆమె ఇతరులకు సహాయపడింది. ఆమె అలసిపోయినప్పటికీ, ఇతర సంఘ సభ్యులతో కలిసి ఆహారం మరియు పరిశుభ్రత కిట్‌లను ఇతరులకు పంపిణీ చేసింది. యువత మరియు యువజనులు యేసు క్రీస్తు మాదిరిని అనుసరించడానికి కృషి చేస్తున్నప్పుడు వారి చేత వహించబడిన సేవ యొక్క శక్తివంతమైన అనేక మాదిరులలో జడ్జౌ కథ ఒకటి.

జర్మన్ వరద సహాయకచర్య

భూకంపానికి కొన్ని వారాల ముందు, అట్లాంటిక్ అంతటా మరో యువకుల సమూహం ఇలాంటి సేవలను అందిస్తోంది. జూలైలో పశ్చిమ ఐరోపాలో సంభవించిన వరదలు అనేక దశాబ్దాలలో అత్యంత తీవ్రమైనవి.

చిత్రం
జర్మనీలో వరదలు

చివరకు వరదనీరు తగ్గినప్పుడు, జర్మనీలోని అహర్‌వీలర్ జిల్లా నది ఒడ్డున ఉన్న ఒక దుకాణదారుడు నష్టాన్ని సర్వే చేసి, ముంచివేయబడినట్లుగా భావించాడు. వినయముగల ఈ వ్యక్తి కేథలిక్ భక్తుడు, తనకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినైనా పంపాలని మనసులో ప్రార్థించాడు మరుసటి రోజు ఉదయం, జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్ మిషను అధ్యక్షులైన డాన్ హమ్మోన్ పసుపురంగు సహాయ హస్తాల చొక్కాలు ధరించి, సువార్తికుల చిన్న బృందంతో ఆ వీధి దగ్గరకు వచ్చారు. దుకాణదారుడి గోడలపై 10 అడుగుల (3 మీ) వరకు నీరు చేరడంతో పాటు లోపల చాలా మట్టి పేరుకుపోయింది. వాలంటీర్లు బురదను బయటకు తీశారు, కార్పెట్ మరియు అట్టగోడలను తీసివేసారు మరియు వాటిని తొలగించడానికి ప్రతిదాన్ని వీధిలో గుట్టగా పోసారు. సంతోషించిన దుకాణదారుడు వారితో పాటు గంటల తరబడి పని చేసాడు, ప్రభువు తన ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి 24 గంటల్లో తన సేవకుల బృందాన్ని పంపినందుకు ఆశ్చర్యపోయాడు!6

“కాబట్టి, ఆయన మనల్ని ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నాను”

సంఘము యొక్క మానవతావాద ప్రయత్నాల గురించి మాట్లాడుతూ, ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు: “ దేవుడు … చాలా వరకు … ఇతర వ్యక్తులను ఉపయోగించుట ద్వారా ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. కాబట్టి, ఆయన మనల్ని ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రజల ప్రార్థనలకు మనము జవాబుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.”7

సహోదర సహోదరిలారా, మీ పరిచర్య, విరాళాలు, సమయం మరియు ప్రేమ ద్వారా మీరు చాలా ప్రార్థనలకు జవాబుగా ఉన్నారు. మరియు అయినప్పటికిని చేయవలసింది ఇంకా చాలా ఉంది. సంఘములో బాప్తిస్మము పొందిన సభ్యులుగా, అవసరమైన వారిని సంరక్షిస్తామనే ఒక నిబంధన క్రింద మనమున్నాము. మన వ్యక్తిగత ప్రయత్నాలకు డబ్బు లేదా సుదూర ప్రాంతాలకు8 వెళ్ళవలసిన అవసరం లేదు; వాటికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మరియు “ఇదిగో నేనున్నాను, నన్ను పంపండి”9 అని ప్రభువుతో చెప్పడానికి ఇష్టపడే హృదయం అవసరం.

ప్రభువు యొక్క ఆమోదయైగ్యమైన సంవత్సరం

యేసు నజరేతుకు వచ్చారని లూకా 4లో వ్రాయబడింది,అక్కడ ఆయన పెరిగి పెద్దవాడై, మరియు చదవడానికి సమాజ మందిరంలో నిలబడ్డాడు. ఇది ఆయన మర్త్య పరిచర్య ప్రారంభానికి దగ్గరగా ఉంది, మరియు ఆయన యెషయా గ్రంథం నుండి ఒక భాగాన్ని ఉదహరించాడు:

ప్రభువు ఆత్మ నామీద ఉన్నదిబీదలకు సువార్త ప్రకటించుటకైఆయన నన్ను అభిషేకించెనుచెరలోనున్న వారికి విడుదలను,గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకునునలిగినవారిని విడిపించుటకును

ప్రభువు హితవత్సరము ప్రకటించుటకునుఆయన నన్ను పంపియున్నాడు. …

“… నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది.”10

మన కాలంలో కూడా ఈ లేఖనం నెరవేరుతోందని నేను సాక్ష్యమిస్తున్నాను. విరిగిన హృదయాలను స్వస్థపరచడానికి యేసు క్రీస్తు వచ్చారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన సువార్త గ్రుడ్డివారికి తిరిగి చూపు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. బందీలకు విమోచనను ప్రకటించడానికి ఆయన సంఘం ఉద్దేశించబడింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆయన శిష్యులు గాయపడిన వారికి స్వేచ్ఛను ప్రసాదించడానికి ప్రయాసపడుతున్నారు.

యేసు తన అపొస్తలుడైన సీమోను పేతురును అడిగిన ప్రశ్నను పునరావృతం చేయడం ద్వారా నేను ముగిస్తాను: “నీవు నన్ను ప్రేమిస్తున్నావా?”11 మనం ఆ ప్రశ్నకు ఎలా సమాధానమిస్తామో మరియు ఎలా “[ఆయన] గొర్రెలను మేపుతామో”12 అనే దానిలో సువార్త యొక్క సారాంశాన్ని కలిగి ఉంది. మన బోధకుడైన యేసు క్రీస్తు పట్ల గొప్ప భక్తి మరియు ప్రేమతో, ఆయన అద్భుతమైన పరిచర్యలో భాగం కావాలని మనలో ప్రతి ఒక్కరినీ నేను ఆహ్వానిస్తున్నాను, మరియు ఆయన మనల్ని ఉపయోగించాలని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.