సర్వసభ్య సమావేశము
ప్రార్థన ద్వారా అడుగుటకు, తరువాత పొందిన జవాబును అమలు చేయడానికి విశ్వాసము
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ప్రార్థన ద్వారా అడుగుటకు, తరువాత పొందిన జవాబును అమలు చేయడానికి విశ్వాసము.

సత్యము గురించి బయల్పాటులను పొందడానికి యేసు క్రీస్తుపై విశ్వాసము కలిగియుండుట కీలకమైనది.

నా ప్రియమైన సహోదర సహోదరిలారా, సర్వసభ్య సమావేశము యొక్క శనివారం సాయంకాల సభలో మీతో మాట్లాడే అవకాశం కొరకు నేను కృతజ్ఞుత కలిగియున్నాను. నేటి ఉదయపు సమావేశంలో తన పరిచయ ప్రసంగములో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు, “మీ హృదయంలోని ప్రశ్నల కొరకు ఇవ్వబడు స్వచ్ఛమైన బయల్పాటు ఈ సమావేశాన్ని ఎక్కువ ప్రతిఫలాన్నిచ్చేదిగా మరియు మరపురానిదిగా చేస్తుంది.” ఈ రెండు రోజుల్లో మీరు ఏమి వినాలని ప్రభువు కోరుచున్నారో వాటిని వినుటలో మీకు సహాయపడడానికి పరిశుద్ధాత్మ పరిచర్య కోసం మీరు ఇంకా వెదకనట్లయితే, ఇప్పుడు అలా చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.”1 ఈ సమావేశంలో మీతో మాట్లాడడానికి కావలసిన బయల్పాటును పొందడానికి నేను సిద్ధపడినప్పుడు, నేను ఆ ఆశీర్వాదం కోసం వెదికాను. మీరు దేవుని నుండి ఆ బయల్పాటును పొందాలని నా హృదయపూర్వక ప్రార్థన.

దేవుని నుండి బయల్పాటు పొందే విధానం ఆదాము హవ్వల కాలం నుండి మారలేదు. ఆరంభం నుండి నేటి వరకు ప్రభువు సేవకులు అని పిలవబడే వారందరికీ ఇది ఆవిధంగానే ఉంది. ఇది మీకు మరియు నాకు ఒకటే. ఇది విశ్వాసాన్ని సాధన చేయడం ద్వారా ఎల్లప్పుడూ చేయబడుతుంది.2

యువకుడైన జోసెఫ్ స్మిత్ దేవుడిని ఒక ప్రశ్న అడగడానికి తగినంత విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడు తన హృదయపూర్వక అవసరానికి సమాధానం ఇస్తాడని నమ్మాడు. వచ్చిన ఆ సమాధానం ప్రపంచాన్నే మార్చివేసింది. పాపం నుండి శుద్ధిచేయబడడానికి ఏ సంఘంలో చేరాలి అని అతడు తెలుసుకోవాలనుకున్నాడు. అతడు పొందిన సమాధానం అతడిని ఎప్పటికప్పుడు మెరుగైన ప్రశ్నలు అడగడానికి మరియు అప్పుడే ప్రారంభమైన బయల్పాటు యొక్క నిరంతర ప్రవాహం ప్రకారం పనిచేయడానికి ప్రోత్సహించింది.3

ఈ సమవేశములో మీ అనుభవం కూడా ఇదేవిధంగా ఉండవచ్చు. సమాధానాల కోసం వెదికే ప్రశ్నలను మీరు కలిగియున్నారు. ఆయన సేవకుల ద్వారా ప్రభువు నుండి సమాధానాలు పొందుతారని ఆశించడానికి తగినంత విశ్వాసాన్ని కనీసం మీరు కలిగియున్నారు.4 సమాధానాల కోసం ప్రసంగీకులను బిగ్గరగా అడగడానికి మీకు అవకాశం ఉండదు, కానీ మీరు మీ ప్రేమగల తండ్రిని ప్రార్థనలో అడగవచ్చు.

మీ అవసరాలకు మరియు మీ ఆత్మీయ సిద్ధపాటుకు తగినట్లుగా సమాధానాలు వస్తాయని అనుభవం ద్వారా నాకు తెలుసు. మీ నిత్య సంక్షేమానికి లేదా ఇతరుల నిత్య సంక్షేమానికి ముఖ్యమైన సమాధానం మీకు అవసరమైతే, సమాధానం తప్పకుండా రావచ్చు. అయినప్పటికీ, సహనముగా ఉండుము అని జోసెఫ్ స్మిత్‌కు సమాధానం వచ్చినట్లే మీకు కూడా రావచ్చును.5

యేసు క్రీస్తుపై మీ విశ్వాసం ఆయన ప్రాయశ్చిత్త ప్రభావాల ద్వారా మీ హృదయాన్ని మృదువుగా చేసినట్లైతే, మీ ప్రార్థనలకు సమాధానంగా ఆత్మ యొక్క గుసగుసలను మీరు అనుభవించగలుగుతారు. నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే, నేనుఅంతర్గత నెమ్మదిని భావించి మరియు ప్రభువు చిత్తానికి లోబడినప్పుడు, యధార్థమైన మిక్కిలి నిమ్మళమైన స్వరం స్పష్టంగా మరియుగ్రహించదగినదిగా నా మనస్సులోకి వస్తుంది. వినయము యొక్క ఆ భావన “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక”6 అనే మాటలతో శ్రేష్టముగావర్ణించబడవచ్చు.

అందుకే, ఈ బయల్పాటు యొక్క ప్రక్రియను క్రీస్తు సిద్ధాంతం అని ఈ సమావేశంలో ప్రసంగీకులు బోధించడాన్ని మీరు వింటారు.7 క్రీస్తు సిద్ధాంతాన్ని మన హృదయంలో తీసుకొని, దానిని మన జీవితాల్లో అమలు చేయడానికి మనం ఎంతవరకు ప్రయత్నించామో అంతే పరిమాణంలో మనకు బయల్పాటు వస్తుంది.

సత్యాన్ని బయలుపరచడానికి మరియు మనం రక్షకుని నడిపింపును అనుసరిస్తున్నామనే ధైర్యం కలిగి ఉండటానికి యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండడం కీలకమైనదని నీఫై బోధించాడని మోర్మన్ గ్రంథం నుండి మీకు జ్ఞాపకముందా. యేసు క్రీస్తు మర్త్య జీవితంలో జన్మించడానికి శతాబ్దాలకు ముందు నీఫై ఈ మాటలను వ్రాసారు:

“దేవదూతలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాట్లాడుదురు, అందువలన వారు క్రీస్తు యొక్క మాటలను మాట్లాడుదురు. కావున, క్రీస్తు యొక్క మాటలను విందారగించమని నేను మీతో చెప్పితిని; ఏలయనగా క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును.

“అందువలన నేను ఈ మాటలను పలికిన తరువాత మీరు వాటిని గ్రహించలేని యెడల, అది మీరు అడుగనందువలననే; లేదా మీరు తట్టనందువలననే; కావున, మీరు వెలుగులోనికి తేబడకుండా అంధకారములోనే నశించవలెను.

“ఇదిగో నేను మీతో మరలా చెప్పుచున్నాను, మీరు మార్గము ద్వారా ప్రవేశించి పరిశుద్ధాత్మను పొందిన యెడల, మీరు చేయవలసిన కార్యములన్నిటినీ ఆయన మీకు చూపును.

“ఇది యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతము మరియు శరీరము నందు ఆయన తననుతాను మీకు ప్రత్యక్షపరచుకొను వరకు మరి ఎక్కువ సిద్ధాంతము ఇవ్వబడదు. ఆయన శరీరమందు తననుతాను మీకు ప్రత్యక్షపరచుకొనునప్పుడు, ఆయన మీతో చెప్పు వాటిని చేయుటకు మీరు శ్రద్ధ వహించుడి.”8

నేడు మరియు రాబోయే రోజుల్లో ప్రభువు తన సేవకుల ద్వారా మీకు మరియు నాకు విషయాలు తెలియజేస్తారు. మనం చేయవలసిన కార్యమును ఆయన మనకు తెలియజేస్తారు.9 రక్షకుడు మీకు మరియు నాకు కేకలువేసి ఆజ్ఞలు ఇవ్వరు. ఆయన ఏలీయాతో మాట్లాడినట్లుగా:

“అందుకాయన–నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నాభిన్నములాయెనుగాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెనుగాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.

“ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెనుగాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.”10

ఆయనపై మనకున్న విశ్వాసం వలన ఆ స్వరమును వినగలుగుతాము. తగినంత విశ్వాసం కలిగియుండి, ఆయన ఏది అడిగినా, వెళ్ళి దానిని చేయాలనే ఉద్దేశ్యంతో మనం నడిపింపు కోసం అడుగుతాము.11 ఆయన ఏది అడిగినా అది ఇతరులను దీవిస్తుందని తెలుసుకోవడానికి కావలసిన విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటాము మరియు మనపై ఆయనకున్న ప్రేమ కారణంగా మనం ఈ ప్రక్రియలో శుద్ధి చేయబడగలుగుతాము.

యేసు క్రీస్తుపై మనకున్న విశ్వాసం తండ్రిని సమాధానాలు కొరకు అడగడానికి నడిపిస్తుంది, ఆ విశ్వాసమే అయన నడిపింపును వినడానికి, నిశ్చయముగా మరియు ఉత్సాహంగా విధేయత చూపడానికి మనకు తగినంత రక్షకుని యొక్క గ్రహణ శీలతను కూడా తీసుకువస్తుంది. అప్పుడు పని కష్టంగా ఉన్నప్పుడు కూడా మనము ఈ కీర్తనలోని పదాలను ఆనందంతో పాడతాము: “నా దేవుడు, నా రాజువైన నీ కార్యము మధురము.”12

మన జీవితాలలో మరియు హృదయాలలో క్రీస్తు సిద్ధాంతాన్ని ఎంత ఎక్కువగా కలిగి ఉంటే, యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండడం వలన వచ్చే దీవెనను ఎప్పుడు పొందనివారి పట్ల లేదా దానిని కాపాడుకోవడానికి కష్టపడుతున్న వారి పట్ల మనం అంత ఎక్కువ ప్రేమ మరియు సాహానుభూతిని భావిస్తాము. ఆయన పట్ల విశ్వాసం మరియు నమ్మకం లేకుండా ప్రభువు ఆజ్ఞలను పాటించడం కష్టం. కొందరు రక్షకునిపై విశ్వాసం కోల్పోయినందున, వారు మంచిని చెడు అని మరియు చెడును మంచి అని చెప్పి, ఆయన సలహాను కూడా ఖండించవచ్చు.13 ఈ తప్పును నివారించడానికి, మనం పొందే ఏ వ్యక్తిగత బయల్పాటు అయినా, ప్రభువు మరియు ఆయన ప్రవక్తల బోధనతో అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం.

సహోదర సహోదరిలారా, ప్రభువు ఆజ్ఞలకు విధేయులుగా ఉండటానికి విశ్వాసం అవసరం. ఆయన కోసం ఇతరులకు సేవ చేయడానికి యేసు క్రీస్తుపై విశ్వాసం అవసరం. బయటకు వెళ్ళి ఆయన సువార్తను బోధించడానికి, ఆత్మ యొక్క స్వరాన్ని అనుభూతి చెందని మరియు సందేశం యొక్క వాస్తవికతను తిరస్కరించే వ్యక్తులకు దానిని అందించడానికి విశ్వాసం అవసరం. కానీ మనము క్రీస్తుపై విశ్వాసాన్ని సాధన చేసినప్పుడు---మరియు ఆయన జీవిస్తున్న ప్రవక్తను అనుసరించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం వృద్ధి చెందుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వలన, బహుశా చరిత్రలో ఏ రెండు రోజులలో దేవుని పిల్లలు వినేదాని కంటే ఈ వారాంతంలో ఎక్కువమంది దేవుని వాక్యాన్ని వింటారు మరియు గుర్తిస్తారు.

ఇది భూమిపై ఉన్న ప్రభువు సంఘము మరియు రాజ్యం అనే హెచ్చించబడిన విశ్వాసంతో, సభ్యులు శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా, ఎక్కువ మంది సభ్యులు దశమభాగం చెల్లించి, అవసరమైన వారికి సహాయం చేయడానికి విరాళాలు ఇస్తున్నారు. యేసు క్రీస్తు ద్వారా పిలువబడ్డారనే విశ్వాసంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సువార్తికులు ఒక మహమ్మారి సృష్టించిన సవాళ్ళను అధిగమించడానికి మార్గాలను కనుగొన్నారు మరియు దానిని ధైర్యంతో, సదానందంతో చేస్తున్నారు. మరియు వారి అదనపు ప్రయత్నంలో, వారి విశ్వాసం బలపడింది.

వ్యతిరేకత మరియు శ్రమలు తరచుగా విశ్వాసం యొక్క పెరుగుదలకు ప్రేరణగా ఉంటాయి. ముఖ్యముగా పునఃస్థాపన ప్రారంభమైనప్పటి నుండి మరియు ప్రభువు సంఘము స్థాపించబడినప్పటి నుండి ఇది ఎల్లప్పుడూ సత్యమైయుంది.14

అధ్యక్షులు జార్జ్ క్యు. కేనన్ చాలా కాలం క్రితం చెప్పినది నేడు సత్యము మరియు రక్షకుడు తన సంఘాన్ని, తన జనులను నడిపించడానికి వ్యక్తిగతంగా వచ్చే వరకు ఆవిధంగానే ఉంటుంది: “సువార్తకు విధేయత [ప్రజలను] ప్రభువుతో చాలా దగ్గరి మరియు సన్నిహిత అనుబంధానికి తెస్తుంది. ఇది భూమిపై మనుష్యులు మరియు పరలోకంలో మన గొప్ప సృష్టికర్త మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇది సర్వశక్తిమంతుని పట్ల మరియు ఆయనపై నమ్మకముంచువారి యొక్క ప్రార్థనలను విని, సమాధానం ఇవ్వడానికి ఆయనకున్న సంసిద్ధత పట్ల మానవ మనస్సులో సంపూర్ణ విశ్వాస భావాన్ని కలిగిస్తుంది. శ్రమ మరియు కష్ట కాలాల్లో ఈ విశ్వాసం అత్యంత విలువైనది. వ్యక్తికి లేదా వ్యక్తులకు సమస్యలు రావచ్చు, విపత్తు భయపెట్టవచ్చు మరియు నిరీక్షణ కలిగియుండుటకు ఏ కారణము కనిపించకపోవచ్చు, అయినప్పటికీ, సువార్తకు విధేయతగా ఉండడం వలన వచ్చే విశేషాధికారాలను ఎక్కడ జనులు పొందియున్నారో, అక్కడ వారికి ఖచ్చితంగా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగియుంటారు; వారి పాదాలు కదలక స్థిరమైన బండపై ఉంటాయి.15

యేసే క్రీస్తని, ఇది ఆయన వ్యక్తిగతంగా నడిపించే సంఘమని, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నేడు ఆయన యొక్క జీవిస్తున్న ప్రవక్త అని మనకున్న సాక్ష్యమే మనం నిలిచియున్న బండ అని నేను సాక్ష్యమిస్తున్నాను.

అధ్యక్షులు నెల్సన్ ప్రభువు నుండి నడిపింపును వెదకి, పొందుతారు. ఆ నడిపింపును అనుసరించాలనే దృఢ సంకల్పంతో దానిని నేను వెదకడానికి ఆయనే నాకు మాదిరి. ప్రభువు నడిపింపుకు విధేయులుగా ఉండాలనే అదే సంకల్పం ఆయన సంఘం యొక్క ఈ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన లేదా మాట్లాడే, ప్రార్థించే లేదా పాడబోయే వారందరి హృదయంలో ఉన్నది.

భూమి అంతటా ఈ సమావేశాన్ని చూసే లేదా వినే వారు తమపట్ల ప్రభువు ప్రేమను అనుభూతి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ పట్ల మరియు మన పరలోకపు తండ్రి అయిన ఆయన పరలోకపు తండ్రి పట్ల రక్షకునికున్న ప్రేమలో ఒక చిన్న భాగాన్ని నేను అనుభవించాలన్న నా ప్రార్థనకు పరలోక తండ్రి సమాధానమిచ్చారు.

యేసు క్రీస్తు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన రక్షకుడు మరియు మన విమోచకుడైయున్నారు. ఇది ఆయన సంఘము. దానికి ఆయన శిరస్సయి ఉన్నారు. ఆయన తన పరలోకపు తండ్రితో కలిసి, జోసెఫ్ స్మిత్‌కు వ్యక్తిగతంగా న్యూయార్క్‌లోని చెట్ల వనములో ప్రత్యక్షమయ్యారు. యేసు క్రీస్తు సువార్త మరియు ఆయన యాజకత్వం పరలోక దూతల ద్వారా పునఃస్థాపించబడ్డాయి.16 పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, అది నిజమని నాకు తెలుసు.

మీరు కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ మీ నిరంతర సహచరుడిగా ఉండటానికి అనుమతించే నిబంధనలు చేసుకొని మరియు పాటించడానికి కావలసిన యేసు క్రీస్తుపై విశ్వాసం కోసం పరలోక తండ్రిని మీరు అడగాలని నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రేమను, ఖచ్చితమైన నా సాక్ష్యాన్ని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీతో వదలుతున్నాను, ఆమేన్.