సర్వసభ్య సమావేశము
అతిగొప్ప ఆస్తి
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


అతిగొప్ప ఆస్తి

సువార్త పట్ల రాజీలేని నిబద్ధతతో మనలో ప్రతి ఒక్కరు క్రీస్తు వద్దకు రావాలి.

ధనికుడైన యౌవన పాలకుడొకడు యేసు వద్దకు పరుగెత్తుకొనివచ్చి ఆయన యెదుట మోకాళ్ళూని, మనఃపూర్వకంగా సద్బోధకుడా, “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును?” అని ఆయనను అడిగాడని లేఖనములు చెప్తున్నాయి. ఈ వ్యక్తి విశ్వాసంతో పాటించిన ఆజ్ఞల సుదీర్ఘ జాబితాను పరిశీలించిన తర్వాత, యేసు అతనికి కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి, అతని సిలువనెత్తికొని వచ్చి తనను వెంబడించుమని అతడితో చెప్పారు. సూటిగా ఇవ్వబడిన ఈ ఉపదేశం ఆ యౌవన పాలకుడిని ఆందోళనకు గురిచేసింది మరియు అతడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు, ఎందుకంటే “అతడు మిగుల ఆస్తిగలవాడు” అని లేఖనములు చెప్తున్నాయి.1

స్పష్టంగా ఇది ధనము యొక్క ఉపయోగాలు మరియు బీదల అవసరాల గురించి హెచ్చరించే ముఖ్యమైన కథ. కానీ అంతిమంగా ఇది దివ్యమైన బాధ్యత పట్ల హృదయపూర్వకమైన, నిష్కపటమైన భక్తి గురించిన కథ. ధనము ఉన్నా, లేకపోయినా ఈ యౌవనుడి నుండి ఆశించబడినట్లుగా, ఆయన సువార్త పట్ల రాజీపడని నిబద్ధతతో మనలో ప్రతిఒక్కరు క్రీస్తు వద్దకు రావాలి. నేటి యువతరం యొక్క భాషలో, మనల్ని మనం “పూర్తి నిబద్ధులుగా” ప్రకటించుకోవాలి.2

స్వాభావికంగా గుర్తుంచుకోదగిన తన వచనంలో, ప్రభువు ఈ విధంగా చెప్తున్నారని సి. యస్. లూయిస్ ఊహించుకుంటాడు: “‘నాకు … మీ సమయం … (లేదా) మీ డబ్బు … (లేదా) మీ పని వద్దు, (వీలైనంతగా) (కేవలం) మీరు నాకు కావాలి. (ఆ చెట్టును మీరు శుద్ధిచేస్తున్నారు.) ఇక్కడొక కొమ్మ, అక్కడొక కొమ్మ కత్తిరించాలని నేను కోరడం లేదు, మొత్తాన్ని … బాగుచేయాలని కోరుతున్నాను. (ఆ పన్ను.) నేను (దానికి) రంధ్రం చేయాలని, తొడుగు పెట్టాలని లేదా (దానిని) నింపాలని కోరడం లేదు. దానిని తొలగించాలని (నేను కోరుతున్నాను). మిమ్మల్ని మీరు పూర్తిగా (నాకు అప్పగించుకోవాలని నేను కోరుతున్నాను). … (మరియు) బదులుగా నేను మిమ్మల్ని క్రొత్తగా చేస్తాను. నిజానికి, నన్ను నేను మీకిస్తాను: నా … చిత్తము (మీ చిత్తము) అవుతుంది.’”3

ఈ సర్వసభ్య సమావేశంలో మాట్లాడే వారందరు ఏదో ఒక విధంగా ఈ ధనికుడితో క్రీస్తు చెప్పిన దానినే చెప్తారు: “మీ రక్షకుని యొద్దకు రండి. పూర్తిగా మరియు హృదయపూర్వకంగా రండి. అది ఎంత భారీగా ఉన్నప్పటికీ, మీ శిలువనెత్తుకొని ఆయనను అనుసరించండి.”4 దేవుని రాజ్యంలో అరకొర ప్రయత్నాలు, మొదలుపెట్టడం, ఆపివేయడం, వెనుదిరగడం వంటివి ఉండవని తెలిసి వాళ్ళు ఇవన్నీ చెప్తారు. మరణించిన తల్లిదండ్రులను పాతిపెట్టడానికి లేదా ఇతర కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలకడానికి అనుమతి కోరిన వారికి, యేసు యొక్క సమాధానం కఠినంగా మరియు నిస్సందేహంగా ఉంది. “దానిని ఇతరులకు వదిలేయండి,” అని ఆయన చెప్పారు. “నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు.”5 మన హృదయ వాంఛలకు విరుద్ధమైనవాటితో సహా కష్టమైన విషయాలు మన నుండి అడుగబడినప్పుడు, క్రీస్తు హేతువు కొరకు మనం విశ్వసనీయతను ప్రతిజ్ఞ చేయడం మన జీవితాలలో అత్యున్నత భక్తి అని గుర్తుంచుకోండి. అది “రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే”6 లభ్యమవుతుందని యెషయా మనకు అభయమిచ్చినప్పటికీ—మరియు అది లభ్యమైనప్పటికీ—దానికోసం “మన దగ్గరున్నదంతా”7 ఖర్చవుతుందనే టి.ఎస్. ఎలియట్ పద్యంలోని వరుసను ఉపయోగిస్తూ మనం తప్పక సిద్ధపడాలి.

అవును, ఈ కార్యములో ఆత్మీయంగా పూర్తిగా నిమగ్నమవడం నుండి మనల్ని ఆపగలిగే అలవాట్లు, లోపాలు లేదా వ్యక్తిగత చరిత్రను మనమందరం కలిగియున్నాము. కానీ దేవుడు మన తండ్రి మరియు మనం విడిచిపెట్టిన పాపాలను క్షమించి, మరచిపోవడంలో అత్యుత్తమమైనవారు, ఎందుకంటే అలా చేయడానికి మనం ఆయనకు ఎన్నో అవకాశాలనిచ్చాము. ఏ సందర్భంలోనైనా, మన ప్రవర్తనలో మార్పుచేయాలని మనం భావించిన ఏ క్షణంలోనైనా మనలో ప్రతిఒక్కరి కోసం దైవిక సహాయం రాగలదు. దేవుడు సౌలుకు “క్రొత్త మనస్సు” నిచ్చాడు.8 మీ గతమును విడిచి, “నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి”9 అని ప్రాచీన ఇశ్రాయేలీయులందరికీ యెహెజ్కేలు పిలుపునిచ్చాడు. ఆత్మ వ్యాకోచించునట్లు చేయు “బలమైన మార్పు”10 కొరకు ఆల్మా పిలుపునిచ్చాడు మరియు “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు”11 అని యేసు తనకైతాను బోధించాడు. మార్పును సాధించి, ఉన్నతస్థాయిలో జీవించడమనేది దానిని కోరుకునే వారికి ఎల్లప్పుడూ దేవుడిచ్చిన బహుమానాల్లో ఒకటని స్పష్టమవుతోంది.

స్నేహితులారా, మన ప్రస్తుత పరిస్థితిలో అన్ని విధములైన విభజనలు మరియు ఉపవిభాగాలు, సమితులు మరియు ఉపసమితులు, గుర్తింపులేని ఆన్‌లైన్ వర్గాలు మరియు రాజకీయ గుర్తింపులతో మన చుట్టూ తగినంత శత్రుత్వం ఉన్నది. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి వాక్యాన్ని ఉపయోగించడానికి, మనం అపేక్షించగలిగేది ఒక “ఉన్నతమైన, పరిశుద్ధమైన”12 జీవితమా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. అలా చేసినప్పుడు, మోర్మన్ గ్రంథములో ఆ జనులు ఎంతో నిశ్చయంగా ఆ ప్రశ్నను అడిగి, దానికి జవాబిచ్చిన ఆశ్చర్యకరమైన సమయాన్ని మనం బాగా గుర్తుంచుకుంటాము:

“ఇప్పుడు, … జనుల హృదయములలో ఉన్న దేవుని ప్రేమను బట్టి దేశమంతటా జనులందరి మధ్య ఏ వివాదము లేకుండెను.

“ఎట్టి అసూయలు, జగడములు, … ఏ విధమైన కాముకత్వము లేకుండెను; నిశ్చయముగా, దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు.

“అక్కడ దొంగలు లేదా హంతకులు లేరు, లేమనీయులు లేరు లేదా ఏ విధమైన -ఈయులు లేరు; కానీ వారు ఒక్కటిగా, క్రీస్తు యొక్క సంతానముగా మరియు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండిరి.

వారెంత ధన్యులు!13

తృప్తిగల, సంతోషకరమైన జీవితంలో ఈ పురోగతికి మూలమేది? ఈ విషయంలో ఒక్క వాక్యంలో అది చెప్పబడింది: “జనుల హృదయములలో దేవుని ప్రేమ గలదు.”14 మన స్వంత జీవితాలలో, ఇతరులతో మన సంబంధాలలో మరియు చివరికి మానవాళి అంతటి కొరకు మన భావాల్లో దేవుని ప్రేమ పరిస్థితులను అదుపు చేసినప్పుడు పాత వ్యత్యాసాలు, హేళనలు మరియు కృత్రిమ విభజనలు కనుమరుగైపోయి శాంతి పెరుగుతుంది. మన మోర్మన్ గ్రంథములోని మాదిరిలో ఖచ్చితంగా జరిగినది అదే. ఇకపై అక్కడ లేమనీయులు, జేకబీయులు, జోసెఫీయులు లేదా జోరమీయులు లేరు. అక్కడ ఏ “-ఈయులు” లేనేలేరు. జనులు ఒక క్రొత్త శ్రేష్ఠమైన గుర్తింపును ఉపయోగించారు. అక్కడ చెప్పబడినట్లుగా, వారందరు “క్రీస్తు యొక్క సంతానముగా”15 పిలువబడ్డారు.

అవును, ఇక్కడ మనం మానవ కుటుంబానికి ఇవ్వబడిన మొదటి గొప్ప ఆజ్ఞ అనగా, మినహాయింపు లేకుండా లేదా రాజీపడకుండా, మన పూర్ణ హృదయం, శక్తి, మనస్సు మరియు బలముతో మనస్ఫూర్తిగా దేవుడిని ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాము.16 ఈ దేవుని ప్రేమ విశ్వంలో మొదటి గొప్ప ఆజ్ఞ. కానీ విశ్వంలో మొట్టమొదటి గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడు మనల్ని ఆ విధంగానే మనస్పూర్తిగా, షరతులు లేదా రాజీ లేకుండా, తన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ప్రేమిస్తున్నారు. ఆయన హృదయం మరియు మన హృదయం యొక్క ఆ బలాలు ఏ ఆటంకం లేకుండా కలిసినప్పుడు ఆత్మీయ, నైతిక శక్తి యొక్క నిజమైన విస్ఫోటం జరుగుతుంది. అప్పుడు టేల్హార్డ్ డి చార్డిన్ వ్రాసినట్లు, “ప్రపంచ చరిత్రలో రెండవసారి మానవుడు అగ్నిని కనుగొన్నట్లవుతుంది.”17

అప్పుడు, నిజంగా అప్పుడు, పైపైన లేదా అల్పమైన విధానాలలో కాకుండా మనం ప్రభావవంతంగా రెండవ గొప్ప ఆజ్ఞను పాటించగలము. ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో ఉండేందుకు ప్రయత్నించేటంతగా మనం దేవుడిని ప్రేమించినట్లయితే, మన పొరుగువారిని మరియు మనల్ని మనం ప్రేమించగల శక్తి, సామర్థ్యము, చిత్తము మరియు మార్గాన్ని ఆయన మనకిస్తారు. బహుశా అప్పుడు మనం మళ్ళీ, “దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు” అని చెప్పగలము.18

సహోదర సహోదరిలారా, ఆ ధనవంతుడైన యువకుడు విఫలమైన చోట మనం విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను, అయితే సమస్యతో సంబంధం లేకుండా మరియు ఖర్చుతో సంబంధం లేకుండా అది ఎంత బలవంతము చేసేది అయినప్పటికీ మనం క్రీస్తు శిలువను మనపై తీసుకుంటాము. మనము ఆయనను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేసినప్పుడు, ఒక విధంగా లేదా మరొక విధంగా ఆ మార్గము ముళ్ళ కిరీటము మరియు రోమీయుల యొక్క ఖఠినమైన శిలువను దాటి వెళుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మన యౌవన పాలకుడు ఎంతటి ధనవంతుడైనా, అతడు రక్షకుని ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించవలసిన ప్రాముఖ్యతను తప్పించుకోగలిగేటంత ధనవంతుడు కాదు మరియు మనము కూడా తప్పించుకోలేము. సంపదలన్నింటిలో కెల్లా గొప్ప సంపదయైన నిత్య జీవపు వరమును పొందే దీవెన కొరకు ఆ మార్గములో నిలిచియుండి, మన వృత్తి యొక్క ప్రధాన యాజకుడు, మన ఉదయ నక్షత్రం, న్యాయవాది మరియు మన రాజును అనుసరించమని మనం కోరబడడం చాలా చిన్న విషయం. మనలో ప్రతిఒక్కరం “(మన) పూర్ణాత్మలను ఆయనకు ఒక అర్పణముగా అర్పించాలని”19 అప్రసిద్ధ ప్రాచీన ప్రవక్తయైన అమలేకితో పాటు నేను సాక్ష్యమిస్తున్నాను. అటువంటి నిశ్చయమైన, నిలకడయైన భక్తితో మనమిలా పాడుదాం:

పర్వతమును కొనియాడుడి; దానిపై నేను స్థిరపరచబడితిని:

నీ విమోచన ప్రేమా పర్వతం. …

ఇదిగో నా హృదయము, దాని తీసుకొని ముద్రించుము,

నీ పరలోక గృహము కొరకు దాని ముద్రించుము.20

యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.