సర్వసభ్య సమావేశము
యోగ్యత అంటే లోపాలు లేకపోవడం కాదు
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


యోగ్యత అంటే లోపాలు లేకపోవడం కాదు

ప్రయత్నించడాన్ని కొనసాగించడంలో మీరు అనేకసార్లు విఫలమయ్యారని మీకు అనిపించినప్పుడు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు అది సాధ్యం చేసిన కృప నిజమైనవని గుర్తుంచుకోండి.

నా ఫోనులో మనం చెప్పేదానిని వ్రాసే పద్ధతిని ఉపయోగించి ఒకసారి మా అమ్మాయికి, అల్లుడికి నేను ఒక సందేశం పంపించాను. “హేయ్ మీ ఇద్దరిని, నేను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను” అని నేను చెప్పాను. “మీ ఇద్దరిని ద్వేషిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాలి” అని వారు అందుకున్నారు. ఎంత సులువుగా ఒక సరైన, ఉద్దేశపూర్వకమైన సందేశం అపార్థం చేసుకోబడగలదో అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది కదా? పశ్చాత్తాపం మరియు యోగ్యత గురించి దేవుని సందేశాలతో కూడా కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది.

పశ్చాత్తాపం మరియు మార్పు అనేవి అవసరం లేదనే సందేశాన్ని కొందరు తప్పుగా పొందుతారు. అవి ఆవశ్యకమైనవి అనేది దేవుని సందేశము.1 కానీ మనకు బలహీనతలుంటే దేవుడు మనల్ని ప్రేమించరా? ప్రేమిస్తారు! ఆయన మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తారు. వారి బలహీనతలతో పాటుగా నేను నా మనుమల్ని ప్రేమిస్తున్నాను, కానీ దానర్థము వారు వృద్ధిచెందాలని, కోరుకున్న విధంగా అవ్వాలని నేను కోరుకోవడం లేదని కాదు. మనం ఉన్నట్లుగానే దేవుడు మనల్ని ప్రేమిస్తారు, కానీ మన బలహీనతలను అనుమతించేటంత అధికంగా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తారు.2 ఆత్మీయంగా ఎదగడమే మర్త్యత్వము యొక్క ఉద్దేశ్యము.3 మార్పుకు సహకరించడమే క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క ఉద్దేశ్యము. క్రీస్తు పునరుత్థానం చెంది, మనల్ని శుద్ధిచేసి, ఓదార్చి, స్వస్థపరచడమే కాకుండా వాటన్నిటి ద్వారా ఆయనలా కావడానికి ఆయన మనల్ని మార్చివేయగలరు.4

పశ్చాత్తాపమనేది ఒక్కసారే జరిగే సంఘటన అని కొందరు తప్పుగా సందేశం పొందుతారు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, “పశ్చాత్తాపమనేది … ఒక ప్రక్రియ” అనేది దేవుని సందేశము.5 పశ్చాత్తాపానికి సమయం మరియు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం అవసరం కావచ్చు,6 కాబట్టి పాపమును విడిచిపెట్టుట7 మరియు “చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండుట”8 అనేవి జీవితకాల ప్రయత్నాలు.9

జీవితం ఒక సుదీర్ఘమైన కారు ప్రయాణం వంటిది. కేవలం ఒక ట్యాంకు ఇంధనంతో మనం గమ్యాన్ని చేరుకోలేము. మళ్ళీ మళ్ళీ మనం ట్యాంకును నింపాలి. సంస్కారమును తీసుకోవడం అనేది ఇంధనాన్ని నింపుకోవడానికి ఆగడం వంటిది. మనం పశ్చాత్తాపపడి, మన నిబంధనలను నూతనపరచినప్పుడు ఆజ్ఞలను పాటించడానికి మన సమ్మతిని మనం వాగ్దానం చేస్తాము. దేవుడు మరియు క్రీస్తు మనల్ని పరిశుద్ధాత్మతో దీవిస్తారు.10 క్లుప్తంగా, మన ప్రయాణంలో కొనసాగడానికి మనం వాగ్దానం చేస్తాము. దేవుడు మరియు క్రీస్తు మన ట్యాంకును నింపుతామని వాగ్దానం చేస్తారు.

కొందరు దురలవాట్ల నుండి పూర్తిగా దూరం కానందువలన సువార్తను జీవించడం వలన వచ్చే దీవెనలను అనుభవించడానికి తాము యోగ్యులం కాదని తప్పుగా సందేశాన్ని పొందుతారు. యోగ్యత అంటే లోపాలు లేకపోవడం కాదు అనేది దేవుని సందేశము.11 యోగ్యత అంటే నిజాయితీగా ఉండడం మరియు ప్రయత్నించడం. మనము దేవునితో, యాజకత్వ నాయకులతో, మనల్ని ప్రేమించేవారితో నిజాయితీగా ఉండాలి12 మరియు దేవుని ఆజ్ఞలు పాటించడానికి మనం తప్పక ప్రయత్నించాలి. మన వల్ల తప్పులు జరుగుతున్నాయని ఎప్పుడూ నిరాశ చెందకూడదు.13 క్రీస్తువంటి స్వభావాన్ని వృద్ధిచేసుకోవడానికి “లోపాలు లేకపోవడం కంటే ఎక్కువగా సహనము, నిరంతర ప్రయత్నం అవసరము” అని ఎల్డర్ బ్రూస్ సి. హఫెన్ చెప్పారు.14 ఆత్మ వరములు “నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలన్నింటిని గైకొనువారు మరియు ఆవిధముగా చేయుటకు కోరువారి మేలు కొరకు అనుగ్రహింపబడినవని ప్రభువు చెప్పారు.”15

ఒక యువకుడు, నేను డామన్ అని పిలుస్తాను, అతడు ఇలా వ్రాసాడు, “ఎదిగే వయస్సులో నేను అశ్లీలతతో కష్టపడ్డాను. నేను మంచిపనులు చేయలేనేమోనని ఎప్పుడూ అవమానకరంగా భావించేవాడిని.” డామన్ తప్పు చేసిన ప్రతిసారీ ఆ బాధ ఎంత తీవ్రమయ్యేదంటే దేవుని నుండి ఏ విధమైన కృప, క్షమాపణ లేదా అదనపు అవకాశాలకు అతడు యోగ్యుడు కాదని తననుతాను కఠినంగా తీర్పుతీర్చుకొనేవాడు. అతనిలా చెప్పాడు: “ఎప్పుడూ భయంకరంగా భావించడానికి మాత్రమే నేను తగినవాడనని నేను నిర్ణయించుకున్నాను. దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడని నేననుకున్నాను, ఎందుకంటే కష్టపడి శాశ్వతంగా దీనిని జయించడానికి నేను సమ్మతించడం లేదు. నేను ఒక వారం, కొన్నిసార్లు ఒక నెల దానిని నివారించగలిగాను, కానీ తర్వాత మళ్ళీ తప్పు చేసాను మరియు ‘నేను ఎప్పటికీ మంచిగా కాలేను, కాబట్టి ప్రయత్నించడం వలన ఉపయోగమేమిటి?’ అనుకున్నాను.”

అటువంటి ఒక బలహీన క్షణంలో, డామన్ తన యాజకత్వ నాయకునితో ఇలా అన్నాడు: “నేను సంఘానికి రావడం మానేయాలేమో. వేషధారునిగా ఉండి నేను విసిగిపోయాను.”

దానికి అతని నాయకుడు ఇలా స్పందించాడు: “నీకొక చెడు అలవాటు ఉండి, నువ్వు దానిని జయించడానికి ప్రయత్నిస్తుండడం వలన నువ్వు వేషధారివి కాదు. దానిని దాచిపెట్టి, దాని గురించి అబద్ధమాడి లేదా అటువంటి ఉన్నత ప్రమాణాలను ఆచరిస్తున్నందుకు సంఘములోనే లోపం ఉందని నిన్ను నువ్వు ఒప్పించడానికి ప్రయత్నిస్తే, నువ్వు వేషధారివి. నువ్వు చేసే పనుల గురించి నిజాయితీగా ఉండడం మరియు ముందడుగు వేయడం అనేవి వేషధారిగా ఉండడం కాదు. అది శిష్యునిగా ఉండడం.”16 ఈ నాయకుడు ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ బోధించిన దానిని వ్యాఖ్యానించాడు: “ప్రభువు తిరుగుబాటును చూసే దానికంటే భిన్నంగా బలహీనతను చూస్తారు. … బలహీనతల గురించి ప్రభువు మాట్లాడినప్పుడు, అది ఎల్లప్పుడూ దయతో కూడియుంటుంది” అని బోధించిన ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్‌ను ఈ నాయకుడు వ్యాఖ్యానించాడు.17

ఆ దృష్టి డామన్‌కు నిరీక్షణనిచ్చింది. “డామన్ మళ్ళీ విఫలమయ్యాడు” అని చెప్పడానికి దేవుడు పైన లేడని అతడు గ్రహించాడు. దానికి బదులుగా బహుశా ఆయన, “చూడు, డామన్ ఎంత వృద్ధిచెందాడో” అని అంటున్నారు. ఈ యువకుడు చివరకు సిగ్గుతో తలవంచుకోవడం లేదా సాకులు మరియు హేతుబద్ధీకరణల కోసం వెదకడం మానివేసాడు. దైవిక సహాయం కోసం అతడు పైకి చూసాడు మరియు అతడు దానిని కనుగొన్నాడు.18

డామన్ చెప్పాడు: “గతంలో నేను క్షమాపణ అడగడానికి మాత్రమే దేవుని వైపు తిరిగేవాడిని, కానీ ఇప్పుడు కృప కొరకు—ఆయన ‘క్రియాత్మక శక్తి’ కొరకు కూడా అడుగుతున్నాను [బైబిలు నిఘంటువు, “కృప”]. నేను ముందెన్నడూ ఇలా చేయలేదు. ఈ మధ్య నేను చేసిన దానికోసం నన్ను నేను ద్వేషించుకోవడంలో తక్కువ సమయం గడుపుతున్నాను మరియు ఆయన చేసిన దానికొరకు యేసును ప్రేమించడంలో ఎక్కువ సమయం గడుపుతున్నాను” అని డామన్ చెప్పాడు

ఎంతకాలం డామన్ కష్టపడ్డాడనేది పరిశీలిస్తే, వెంటనే “మళ్ళీ చేయకూడదు” అని చెప్పడానికి లేదా “యోగ్యునిగా” యెంచబడేందుకు కొన్ని సంయమన సూత్రాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడానికి తల్లిదండ్రులు మరియు నాయకులు అతనికి సహాయపడడం నిరుపయోగం మరియు అవాస్తవం కావచ్చు. దానికి బదులుగా వారు చిన్నవైన, సాధించగల లక్ష్యాలతో మొదలుపెట్టారు. పూర్తి విజయాలు లేదా వైఫల్యాలను వదిలి, వారు దశలవారీ ఎదుగుదలపై దృష్టిసారించారు, అది వైఫల్యాలకు బదులుగా వరుస విజయాలపై నిర్మించుకోవడానికి డామన్‌ను అనుమతించింది.19 దాస్యంలో ఉన్న లింహై జనుల మాదిరిగా అతడు “అంచెలంచెలుగా వర్ధిల్లగలడని” అతడు తెలుసుకున్నాడు.20

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ఇలా ఉపదేశించారు: “ఏదైనా పెద్ద దానితో వ్యవహరించేటప్పుడు, కొద్దికొద్దిగా చిన్న మొత్తాలతో మనం పనిచేయవలసి రావచ్చు. … క్రొత్త మరియు మంచి అలవాట్లను మన స్వభావంలో కలుపుకోవడం, చెడు అలవాట్లు లేదా వ్యసనాలను జయించడం అంటే చాలా తరచుగా దాని అర్థము ఈరోజు ఒకటి, రేపు మరొకటి, తర్వాత ఇంకొకటి, బహుశా చాలా రోజులు, నెలలు మరియు సంవత్సరాల పాటు చేసే ప్రయత్నం. … కానీ మనం దానిని చేయగలం, ఎందుకంటే ప్రతిరోజు మనకు కావలసిన సహాయం కోసం మనం దేవుడిని వేడుకోగలం.”21

ఇప్పుడు, సహోదర సహోదరీలారా, కొవిడ్-19 మహమ్మారి ఎవరికీ సులభం కాలేదు, కానీ సంఘావరోధ ఆంక్షలతో పాటు ఉన్న ఏకాంతవాసము ప్రత్యేకించి చెడు అలవాట్లతో శ్రమపడుతున్న వారికి జీవితాన్ని కష్టతరం చేసింది. మార్పు సాధ్యమని, పశ్చాత్తాపము ఒక ప్రక్రియ అని, యోగ్యత అంటే లోపాలు లేకపోవడం కాదని గుర్తుంచుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది, దేవుడు మరియు క్రీస్తు ఇక్కడ, ఇప్పుడు మనకు సహాయపడేందుకు సిద్ధమని గుర్తుంచుకోండి.22

మనం పశ్చాత్తాప పడేవరకు దేవుడు సహాయం చేయడానికి వేచియున్నాడని కొందరు తప్పుగా సందేశాన్ని పొందుతారు. మనం పశ్చాత్తాప పడుతున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారనేది దేవుని సందేశము. “విధేయత మార్గంలో మనం ఎక్కడ ఉన్నప్పటికీ” ఆయన కృప మనకు లభ్యమవుతుంది.23 ఎల్డర్ డిటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఇలా చెప్పారు: “లోపం లేని మనుష్యులు దేవుడికి అవసరం లేదు. తమ ‘హృదయమును, సిద్ధమైన మనస్సును’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 64:34] అర్పించేవారిని ఆయన కోరతారు మరియు వారిని ‘క్రీస్తునందు పరిపూర్ణులుగా’ [మొరోనై 10:32–33] ఆయన చేస్తారు.”24

విరిగిన మరియు ఒత్తిడితో కూడిన కుటుంబ సంబంధాలతో చాలామంది ఎంతగా బాధపడుతున్నారంటే దేవుని కనికరము మరియు దీర్ఘశాంతాన్ని నమ్మడం వారికి కష్టమవుతోంది. దేవుడిని ఆయన ఉన్నట్లుగా—మన అవసరాలను తీర్చి25, “తనను అడుగువారికి ఏవిధంగా మంచి యీవులనివ్వాలో” ఎరిగిన ప్రియమైన తండ్రిగా చూడడానికి వారు కష్టపడుతున్నారు.26 ఆయన కృప కేవలం యోగ్యులకు ఇవ్వబడే బహుమతి కాదు. అది మనం యోగ్యులవడానికి సహాయపడేందుకు ఆయన ఇచ్చే “దైవిక సహాయము”. అది కేవలం నీతిమంతులకు ఇవ్వబడే బహుమానం కాదు. అది నీతిమంతులవడానికి మనకు సహాయపడేందుకు ఆయన ఇచ్చే “శక్తి యొక్క వరము”.27 మనం కేవలం దేవుడు మరియు క్రీస్తు వైపు నడవడం లేదు. మనం వారితో నడుస్తున్నాము.28

సంఘమందంతటా యౌవనులు యువతుల మరియు అహరోను యాజకత్వ సమూహముల ఇతివృత్తాలను పఠిస్తారు. న్యూజిలాండ్ నుండి స్పెయిన్ నుండి ఇథియోపియా నుండి జపాను వరకు, “పశ్చాత్తాప వరమందు నేను ఆనందిస్తున్నాను” అని యువతులు చెప్తారు. చిలి నుండి గ్వాటమాలా నుండి మొరోనై, యూటా వరకు, “నేను సేవచేయడానికి, విశ్వాసాన్ని సాధనచేసి, పశ్చాత్తాపపడి, అనుదినం మెరుగవడానికి ప్రయత్నించినప్పుడు, దేవాలయ దీవెనలు మరియు సువార్త యొక్క శాశ్వతానందమును పొందడానికి నేను అర్హుడనవుతాను” అని యువకులు చెప్తారు.

ఆ దీవెనలు, ఆ ఆనందం నిజమైనవనని, ఆజ్ఞలన్నిటిని పాటించే వారికి మరియు “ఆవిధముగా చేయుటకు కోరువారికి” అవి లభ్యమవుతాయని నేను వాగ్దానమిస్తున్నాను.29 ప్రయత్నించడాన్ని కొనసాగించడంలో మీరు అనేకసార్లు విఫలమయ్యారని మీకు అనిపించినప్పుడు, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు అది సాధ్యం చేసిన కృప నిజమైనవని గుర్తుంచుకోండి.30 “[ఆయన] కనికరము యొక్క బాహువు మీ వైపు చాచబడియున్నది.”31 ఈరోజు, వచ్చే 20 ఏళ్ళలో మరియు ఎప్పటికీ మీరు ప్రేమించబడతారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.