సర్వసభ్య సమావేశము
దేవుని కార్యము సాధించడంలో ఏకమగుట
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


దేవుని కార్యము సాధించడంలో ఏకమగుట

మన దైవిక సామర్థ్యాన్ని నెరవేర్చడానికి అత్యంత ప్రభావవంతమైన విధానము, యాజకత్వము యొక్క శక్తి మరియు అధికారము చేత దీవించబడి, కలిసి పనిచేయడమే.

అద్భుతమైన ప్రియ సహోదరీ, సహోదరులారా, మీతో ఉండడం చాలా సంతోషకరము. మీరెక్కడ నుండి వింటున్నప్పటికీ, నా సహోదరీలకు ఆలింగనాలను మరియు నా సహోదరులకు హృదయపూర్వక కరచాలనాలను నేను ఇస్తున్నాను. ప్రభువు కార్యములో మనం ఏకమైయున్నాము.

మనం ఆదాము, హవ్వల గురించి ఆలోచించినప్పుడు, తరచు వచ్చే మొదటి ఆలోచన ఏదేను తోటలో వారి ఆహ్లాదకరమైన జీవితం. వాతావరణం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉందని — ఎక్కువ వేడిగా కాదు, ఎక్కువ చల్లగా కాదు — మరియు వారికి నచ్చినప్పుడల్లా తినేందుకు వీలుగా విస్తారమైన, రుచికరమైన పండ్లు, కూరగాయలు వారికి అందేంత దూరంలో పెరిగాయని నేను ఊహిస్తున్నాను. ఇది వారికొక క్రొత్త లోకమైనందున శోధించవలసింది చాలా ఉంది, కాబట్టి వారు జంతుజాలాలను పలకరిస్తున్నప్పుడు, అందమైన పరిసరాలను అన్వేషిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆసక్తికరంగా ఉండేది. వారు లోబడేందుకు ఆజ్ఞలు కూడా ఇవ్వబడ్డారు మరియు ఆ సూచనలు పాటించడానికి వారికి భిన్నమైన విధానాలున్నాయి, అవి ప్రారంభ ఆందోళనను, గందరగోళాన్ని కలిగించాయి.1 కానీ వారి జీవితాలను శాశ్వతంగా మార్చివేసే నిర్ణయాలను వారు చేసినప్పుడు, వారు కలిసి పనిచేయడం నేర్చుకున్నారు మరియు వారికోసం — ఆయన పిల్లలందరి కోసం దేవుడు కలిగియున్న ఉద్దేశాలను సాధించడంలో ఏకమయ్యారు.

ఇప్పుడు ఇదే జంటను మర్త్యత్వములో ఊహించుకోండి. వారు తమ ఆహారం కోసం శ్రమించాలి, కొన్ని జంతువులు వారిని ఆహారంగా భావించాయి, మరియు వారు కలిసి సలహా ఇచ్చుకొని, ప్రార్థించినప్పుడు మాత్రమే జయించబడగల కష్టమైన సవాళ్ళున్నాయి. ఆ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలని కనీసం కొన్నిసార్లు వారికి భిన్నాభిప్రాయాలు కలిగియుండవచ్చని నేను ఊహిస్తున్నాను. అయినప్పటికీ, ఐక్యతతో మరియు ప్రేమతో పనిచేయడం ఆవశ్యకమని పతనము ద్వారా వారు నేర్చుకున్నారు. దేవుని చేత వారు బోధింపబడి మరియు పొందిన శిక్షణలో, వారికి రక్షణ ప్రణాళిక మరియు ఆ ప్రణాళిక పనిచేయునట్లు చేసే యేసు క్రీస్తు సువార్త యొక్క నియమాలు బోధించబడ్డాయి. వారి భూలోక ఉద్దేశము మరియు నిత్య లక్ష్యము ఒకటేనని వారు గ్రహించినందువల్ల, ప్రేమ మరియు నీతితో కలిసి పనిచేయడాన్ని నేర్చుకోవడంలో తృప్తిని, సఫలతను వారు కనుగొన్నారు.

చిత్రం
ఆదాము హవ్వలు వారి పిల్లలకు బోధించుట

వారికి పిల్లలు పుట్టినప్పుడు, ఆదాము, హవ్వలు పరలోక దూతల నుండి తాము నేర్చుకున్న దానిని తమ కుటుంబానికి బోధించారు. ఈ జీవితంలో వారికి సంతోషం కలిగించే ఆ నియమాలను అర్థం చేసుకొని, వాటిని హత్తుకోవడానికి, అదేవిధంగా వారి సామర్థ్యాలను పెంచుకొని, వారి విధేయతను దేవునికి రుజువు చేసిన తర్వాత, వారి పరలోక తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడడంలో తమ పిల్లలకు సహాయపడడంపై వారు దృష్టిసారించారు. ఈ ప్రక్రియలో, ఆదాము హవ్వలు వారి విభిన్న బలాలను అభినందించడం నేర్చుకున్నారు మరియు నిత్య ప్రాముఖ్యత గల వారి పనిలో ఒకరికొకరు సహకరించుకున్నారు.2

శతాబ్దాలు మరియు వెయ్యేండ్లు గడుస్తుండగా, స్త్రీ పురుషుల ప్రేరేపిత మరియు పరస్పర ఆధారిత సహకారాల యొక్క స్పష్టత తప్పు సమాచారము, అపార్థాల చేత మసకబారింది. ఏదేను తోటలో అద్భుతమైన ఆరంభానికి, నేటికి మధ్యనున్న కాలంలో, మన ఆత్మలను జయించడానికి అతని ప్రయత్నాల్లో స్త్రీ పురుషులను విభజించాలనే అతని లక్ష్యంలో అపవాది చాలామట్టుకు సఫలమయ్యాడు. స్త్రీ పురుషులు భావించే ఐక్యతను అతడు నాశనం చేయగలిగితే, మన దైవిక విలువ మరియు నిబంధన బాధ్యతల గురించి అతడు మనల్ని కలవరపెట్టగలిగితే, నిత్యత్వము యొక్క ఆవశ్యక విభాగాలైన కుటుంబాలను నాశనం చేయడంలో అతడు సఫలమవుతాడని లూసిఫర్‌కు తెలుసు.

స్త్రీ పురుషుల అంతర్గత భేధాలు దేవునిచేత ఇవ్వబడ్డాయని మరియు సమానంగా విలువివ్వబడతాయనే నిత్య సత్యాన్ని దాచివేసి, ఉన్నత లేదా తక్కువ స్థాయి అనే భావాలను సృష్టించడానికి ఒక సాధనంగా సాతాను పోలికను పురికొల్పుతాడు. కుటుంబం మరియు నాగరిక సమాజం రెండిటిలో స్త్రీ సహకారాన్ని అప్రతిష్టపాలు చేయడానికి అతడు ప్రయత్నించాడు, ఆవిధంగా మంచి కోసం వారి ఉత్తేజకరమైన ప్రభావాన్ని తగ్గించాడు. ఒకరినొకరు అభినందించుకొని, ఐక్యతకు దోహదపడే స్త్రీ పురుషుల ప్రత్యేక సహకారాలను వేడుక జరుపుకొనుటకు బదులుగా ఆధిపత్య పోరును ప్రోత్సహించడమే అతని లక్ష్యమైయుంది.

కాబట్టి, సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా, దైవికంగా పరస్పర ఆధారితమైనప్పటికీ భిన్నమైన స్త్రీ పురుషుల యొక్క సహకారాలు మరియు బాధ్యతల పూర్తి గ్రహింపు అధికంగా కనుమరుగైంది. అనేక సమాజాల్లో పక్కపక్కన భాగస్వాములుగా ఉండడానికి బదులుగా స్త్రీలు, పురుషులకు దాసోహమయ్యారు, వారి కార్యకలాపాలు ఇరుకైన పరిధికి పరిమితం చేయబడ్డాయి. ఆ చీకటి కాలాల్లో ఆత్మీయ వృద్ధి తీవ్రంగా మందగించింది; వాస్తవానికి, కొద్దిగా ఆత్మీయ వెలుగు కూడా ఆధిపత్య సంప్రదాయాలలో మునిగిపోయిన మనస్సులు మరియు హృదయాల లోనికి చొచ్చుకుపోగలదు.

అప్పుడు, 1820 యొక్క వసంతకాలపు ఆరంభంలో న్యూయార్క్ ఉత్తర భాగంలోని పవిత్రమైన అటవీప్రాంతంలో బాలుడైన జోసెఫ్ స్మిత్‌కు తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, పునఃస్థాపించబడిన సువార్త యొక్క వెలుగు, “సూర్యుని ప్రకాశాన్ని మించి3 ప్రకాశించింది. ఆ సంఘటన పరలోకం నుండి బయల్పాటు యొక్క ఆధునిక కుమ్మరింపును ప్రారంభించింది. పునఃస్థాపించబడవలసిన క్రీస్తు యొక్క అసలైన సంఘము యొక్క మొదటి అంశాలలో ఒకటి, దేవుని యాజకత్వపు అధికారము. పునఃస్థాపన వృద్ధిచెందడం కొనసాగుతుండగా, ఈ పరిశుద్ధ కార్యములో ఆయన చేత అధికారమివ్వబడి, నిర్దేశించబడి, భాగస్వాములుగా పనిచేయు ప్రాముఖ్యతను, సామర్థ్యాన్ని స్త్రీ పురుషులు మరల తెలుసుకోవడం ప్రారంభించారు.

చిత్రం
ఉపశమన సమాజ నిర్మాణము

1842లో, అనుభవం లేని సంఘము యొక్క స్త్రీలు పనిలో సహాయపడేందుకు ఒక అధికారిక సమూహంగా ఏర్పడాలని కోరినప్పుడు, వారిని “యాజకత్వపు విధానంలో యాజకత్వము క్రింద“4 ఏర్పాటు చేయడానికి అధ్యక్షులు జోసెఫ్ స్మిత్ ప్రేరేపించబడ్డారు. “దేవుని నామములో నేనిప్పుడు తాళపుచెవులను మీకిస్తున్నాను; … ఇది మంచి దినములకు ఆరంభం,“ అని ఆయన అన్నారు.5 ఆ తాళపుచెవులు ఇవ్వబడినప్పటి నుండి, స్త్రీల కోసం విద్య, రాజకీయ, ఆర్థిక అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా క్రమక్రమంగా విస్తరించడం మొదలైంది. 6

ఉపశమన సమాజము అనబడే స్త్రీల కొరకైన ఈ క్రొత్త సంఘ నిర్మాణము ఆనాటి స్త్రీల సమాజాల కంటే భిన్నమైనది, ఎందుకంటే ఇది ఒక ప్రవక్త చేత స్థాపించబడింది, ఆయన సంఘ నిర్మాణము నుండి దూరంగా కాకుండా అందులోనే స్త్రీలకు అధికారము, పరిశుద్ధ బాధ్యతలు మరియు అధికారిక స్థానాలను ఇవ్వడానికి యాజకత్వపు అధికారంతో చర్య తీసుకున్నారు.7

ప్రవక్త జోసెఫ్ స్మిత్ దినము నుండి నేటివరకు, కొనసాగుతున్న పునఃస్థాపన, దైవికంగా నియమించబడిన తమ బాధ్యతలను నిర్వర్తించడానికి స్త్రీ, పురుషులు ఇరువురికి సహాయపడడంలో యాజకత్వపు అధికారము మరియు శక్తి యొక్క ఆవశ్యకతపై జ్ఞానోదయం కలిగించింది. యాజకత్వపు తాళపుచెవులు కలిగియున్న ఒకరి ఆధ్వర్యంలో ప్రత్యేకపరచబడిన స్త్రీలు వారి పిలుపులను యాజకత్వపు అధికారము తో నిర్వహిస్తారని ఇటీవల మనం బోధించబడ్డాము.8

అక్టోబరు 2019లో, దేవాలయ వరమును పొందిన స్త్రీలు దేవునితో వారు చేసిన ఆ పరిశుద్ధ నిబంధనలను పాటించినప్పుడు తమ జీవితాల్లో మరియు తమ ఇళ్ళలో యాజకత్వపు శక్తి కలిగియుంటారని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.9 “యాజకత్వమును కలిగియున్న పురుషుల వలె, వారి యాజకత్వ నిబంధనలనుండి ప్రవహించు దేవుని శక్తితో వరమివ్వబడిన స్త్రీలకు కూడా పరలోకములు తెరవబడి ఉంటాయి“ అని ఆయన వివరించారు. “మీ కుటుంబానికి మరియు మీరు ప్రేమించే ఇతరులకు సహాయము చేయుటకు రక్షకుని శక్తిని ధారాళముగా అందుకోమని“ ప్రతి సహోదరిని ఆయన ప్రోత్సహించారు. 10

కాబట్టి, నా కొరకు, మీ కొరకు దాని అర్థమేమిటి? యాజకత్వపు అధికారాన్ని, శక్తిని అర్థం చేసుకోవడం మన జీవితాలను ఎలా మార్చుతుంది? స్త్రీ పురుషులు కలిసి పనిచేసినప్పుడు11, మనం విడిగా పనిచేసిన దానికంటే ఎక్కువ సాధిస్తామని గ్రహించడం ఒక ముఖ్యాంశము. పోటీ పడుటకు బదులుగా మన పాత్రలు పరిపూర్ణమైనవి. స్త్రీలు యాజకత్వపు కార్యాలయానికి నియమించబడనప్పటికీ, గతంలో గుర్తించినట్లుగా స్త్రీలు తమ నిబంధనలను పాటించినప్పుడు వారు యాజకత్వపు శక్తితో దీవించబడ్డారు, మరియు ఒక పిలుపుకు వారు నియమించబడినప్పుడు వారు యాజకత్వపు అధికారంతో పనిచేస్తారు.

ఆగస్టులో ఒక అందమైన రోజున, ఈ కడవరి దినాలలో అహరోను యాజకత్వము పునరుద్ధరించబడిన స్థలమైన హార్మొని, పెన్సిల్వేనియాలోని జోసెఫ్ మరియు ఎమ్మా స్మిత్ యొక్క పునర్నిర్మించబడిన గృహంలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారితో కూర్చొనేందుకు నేను విశేషాధికారమివ్వబడ్డాను. మా సంభాషణలో, అధ్యక్షులు నెల్సన్ పునఃస్థాపనలో స్త్రీలు పోషించిన ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడారు.

అధ్యక్షులు నెల్సన్: “ఈ యాజకత్వము పునఃస్థాపించబడిన స్థలానికి నేను వచ్చినప్పుడు జ్ఞాపకం చేయబడే అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి, పునఃస్థాపనలో స్త్రీలు పోషించిన ముఖ్యమైన పాత్ర.

“జోసెఫ్ మోర్మన్ గ్రంథాన్ని అనువదించడం మొదట ప్రారంభించినప్పుడు, ఎవరు రాసారు? అవును, అతడు కొద్దిగా వ్రాసాడు, ఎక్కువ కాదు. ఎమ్మా అడుగుపెట్టింది.

“అప్పుడు పాల్మైరా, న్యూయార్క్‌లో వారి ఇంటి దగ్గర ప్రార్థించడానికి జోసెఫ్ ఏవిధంగా చెట్లపొదలలోకి వెళ్ళాడో నేను ఆలోచిస్తున్నాను. అతడు ఎక్కడికి వెళ్ళాడు? అతడు పరిశుద్ధ వనానికి వెళ్ళాడు. అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఆమె ప్రార్థించాలని కోరుకున్నప్పుడు తల్లి అక్కడికే వెళ్ళేది.

“యాజకత్వము యొక్క పునఃస్థాపన మరియు సంఘము యొక్క పునఃస్థాపనలో ముఖ్యపాత్ర పోషించిన స్త్రీలలో వారు కేవలం ఇద్దరు మాత్రమే. నేడు మన భార్యలు ఎంత ముఖ్యమైనవారో అప్పుడు వారు కూడా అంతేనని నిస్సందేహంగా మనం చెప్పగలము. అవును, వారు ముఖ్యమైనవారు.“

ఎమ్మా, లూసీ మరియు జోసెఫ్ వలె, మనము కూడా ఒకరినుండి ఒకరు నేర్చుకోవడానికి సమ్మతించినప్పుడు, యేసు క్రీస్తు యొక్క శిష్యులవడానికి మన లక్ష్యములో ఏకమైనప్పుడు, ఆ మార్గములో ఇతరులకు సహాయపడినప్పుడు, మనము చాలా సమర్థవంతంగా ఉంటాము.

“యాజకత్వము దేవుని పిల్లల జీవితాలను లెక్కలేనన్ని విధాలుగా దీవిస్తుందని మనము బోధించబడ్డాము. … [సంఘ] పిలుపులు, దేవాలయ విధులు, కుటుంబ బంధాలు, నిశ్శబ్దమైన వ్యక్తిగత పరిచర్యలో కడవరి-దిన పరిశుద్ధ స్త్రీలు మరియు పురుషులు యాజకత్వపు శక్తితో, అధికారంతో ముందుకు వెళ్తారు. ఆయన శక్తి ద్వారా దేవుని కార్యమును నెరవేర్చుటలో పురుషులు, స్త్రీలు పరస్పరం ఆధారపడడమనేది ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్తకు కేంద్రమైనది.”12

మనము చేయడానికి పిలువబడిన మరియు విశేషాధికారమివ్వబడిన దైవకార్యమునకు ఐకమత్యము ఆవశ్యకమైనది, కానీ అది అంత తేలిక కాదు. నిజంగా కలిసి చర్చించడానికి—ఒకరినొకరు వినడానికి, ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి ప్రయత్నము, సమయము అవసరం—కానీ ఆ ప్రక్రియకు ఫలితం, మరింత ప్రేరేపించబడిన నిర్ణయాలు. ఇంటివద్దనైనా లేక మన సంఘ బాధ్యతల్లోనైనా, మన దైవిక సామర్థ్యాన్నినెరవేర్చడానికి అత్యంత ప్రభావవంతమైన విధానము, భిన్నమైనప్పటికీ పరిపూర్ణమైన మన పాత్రలలో ఆయన యాజకత్వము యొక్క శక్తి మరియు అధికారము చేత దీవించబడి కలిసి పనిచేయడమే.

నేడు నిబంధన స్త్రీల జీవితాల్లో ఆ భాగస్వామ్యం ఎలా కనిపిస్తుంది? నేను ఒక ఉదాహరణను పంచుకోవాలనుకుంటున్నాను.

చిత్రం
ఇద్దరు తొక్కగలిగే సైకిలుపై దంపతులు

ఆలిసన్ మరియు జాన్ ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యం కలిగియున్నారు. వారు చిన్న, పెద్ద పందెములలో ఇద్దరు తొక్కగలిగే సైకిలును తొక్కేవారు. ఆ వాహనం మీద విజయవంతంగా పోటీపడేందుకు, నడిపే వారిద్దరు తప్పక ఐకమత్యంగా ఉండాలి. సరైన సమయంలో వారు ఒకే దిశలో వంగవలసి యుంటుంది. ఒకరు మరొకరిపై ఆధిపత్యం ప్రదర్శించలేరు, కానీ వారు తప్పక స్పష్టంగా మాట్లాడుకోవాలి మరియు ప్రతిఒక్కరు అతడు లేక ఆమె తన వంతు చేయాలి. ఎప్పుడు బ్రేకు వేయాలో, ఎప్పుడు నిలపాలో అనేదానిపై ముందున్న కెప్టెన్‌కు నియంత్రణ ఉంటుంది. వెనుకనున్న స్టాకర్, జరుగుతున్న దానిమీద శ్రద్ధపెట్టి, వారు వెనుకబడినట్లయితే అదనపు శక్తిని జోడించడానికి లేదా ఇతరులకు మరీ దగ్గరైనప్పుడు నెమ్మదించడానికి సిద్ధంగా ఉండాలి. ముందుకు సాగి, వారి లక్ష్యాన్ని సాధించడానికి వారు ఒకరికొకరు తప్పక సహకరించుకోవాలి.

ఆలిసన్ వివరించింది: “మొదట కొంత సమయం కెప్టెన్ స్థానంలో ఉన్న వ్యక్తి, మేము నిలుపవలసినప్పుడు ‘నిలుపు‘ అని, మేము తొక్కడం ఆపవలసినప్పుడు ‘బ్రేకింగ్‘ అని చెప్తాడు. కొంతసేపటి తర్వాత స్టాకర్ గా ఉన్న వ్యక్తి, కెప్టెన్ ఎప్పుడు నిలుపుతాడో లేక బ్రేకు వేస్తాడో అని చెప్పడం నేర్చుకుంటాడు, ఏమీ చెప్పవలసిన అవసరం ఉండదు. ఒకరు చేసేదానిని మరొకరు గుర్తించడం మేము నేర్చుకున్నాము, మరియు ఒకరు శ్రమపడుతున్నప్పుడు చెప్పగలిగాము, (అప్పుడు) మరొకరు ఎక్కువ చేయడానికి ప్రయత్నించాము. ఇదంతా నిజానికి నమ్మకం మరియు కలిసి పనిచేయడానికి సంబంధించింది.”13

జాన్ మరియు ఆలిసన్ తమ సైకిలు తొక్కినప్పుడు మాత్రమే ఐకమత్యంతో లేరు, కానీ వారు తమ వివాహంలో కూడా ఐకమత్యంగా ఉన్నారు. ఇద్దరూ తమ స్వంతాని కంటే ఎక్కువగా అవతలి వారి సంతోషాన్ని కోరుకున్నారు; ఒకరినొకరు మంచి కోసం వెదికారు, వారు వృద్ధి చేసుకోవలసిన విషయాలను జయించడానికి పనిచేసారు. నడిపించడంలో వారు వంతులు తీసుకున్నారు, ఒక భాగస్వామి కష్టపడుతున్నప్పుడు మరొకరు ఎక్కువ ఇచ్చారు. ప్రతిఒక్కరు మరొకరి సహకారానికి విలువిచ్చారు, మరియు తమ నైపుణ్యాలను, వనరులను వారు జతచేసినప్పుడు, వారి సవాళ్ళకు చక్కని జవాబులను కనుగొన్నారు. వారు క్రీస్తు వంటి ప్రేమతో ఒకరికొకరు నిజంగా కట్టుబడియున్నారు.

మన చుట్టూ ”నేను ముందు” అనే సందేశాలున్న ఈ రోజుల్లో, ఐకమత్యంతో కలిసి పనిచేయడమనే దైవిక విధానంతో ఎక్కువగా సమ్మతించడమనేది క్లిష్టమైనది. స్త్రీలు విభిన్నమైన, దైవిక బహుమానాలు కలిగియున్నారు14 మరియు ప్రత్యేక బాధ్యతలు ఇవ్వబడ్డారు, కానీ అవి పురుషుల బహుమానాలు, బాధ్యతల కంటే ఎక్కువ—లేక తక్కువ ప్రాముఖ్యమైనవి కాదు. ఆమె లేక అతని దైవిక సామర్థ్యాన్ని నెరవేర్చడానికి ఆయన పిల్లల్లో ప్రతిఒక్కరికి మంచి అవకాశాన్ని ఇవ్వాలనే పరలోక తండ్రి యొక్క దైవిక ప్రణాళికను అమలు చేయడానికి అవన్నీ రూపొందించబడ్డాయి మరియు అవసరము.

క్రీస్తు నొద్దకు ఆత్మలను తెచ్చుటలో వారి సహోదరులతో ఏకమవ్వడానికి 16 నేడు ”మనకు ధైర్యము మరియు మన తల్లియైన హవ్వ యొక్క దృష్టి గల స్త్రీలు అవసరము.”15 వారే పూర్తిగా బాధ్యులని ఊహించుకోవడం లేక స్త్రీలు ఎక్కువ పనిచేస్తుండగా తామే చేస్తున్నట్లు నటించడానికి బదులుగా పురుషులు నిజమైన భాగస్వాములుగా మారవలసిన అవసరముంది. తమంతట తామే అన్నీ చేయాలని ఆలోచించడం లేక ఏమి చేయాలో చెప్పాలని వేచియుండడానికి బదులుగా భాగస్వాములుగా18 స్త్రీలు ”ముందడుగు వేసి, న్యాయంగా కావలసిన (తమ) స్థానాలను తీసుకోవడానికి” సమ్మతించవలసిన అవసరముంది.17

స్త్రీలను ముఖ్య భాగస్థులుగా యెంచడమనేది ”సమానత్వాన్ని” సృష్టించడానికి సంబంధించినది కాదు, కానీ సిద్ధాంతపరమైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించినది. దానిని అమలుపరిచేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా, దేవుడు చేసినట్లుగా: రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో ఆవశ్యకమైన భాగస్వాములుగా స్త్రీలకు విలువివ్వడానికి మనం చురుకుగా పనిచేయగలం.

మనం సిద్ధంగా ఉన్నామా? సాంస్కృతిక పక్షపాతాలను జయించడానికి మనం ప్రయత్నిద్దామా, మరియు బదులుగా మూల సిద్ధాంతంపై ఆధారపడి దైవిక విధానాలను, అభ్యాసాలను హత్తుకుందామా? “ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధపరచడంలో సహాయపడేందు[కు] … ఈ పరిశుద్ధ కార్యములో చేయి చేయి కలిపి నడిచేందుకు“19 అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనమలా చేసినప్పుడు, ప్రతి వ్యక్తి యొక్క సహకారానికి విలువివ్వడం మరియు మన దైవిక పాత్రలను నెరవేర్చే ప్రభావాన్ని పెంచడం మనం నేర్చుకుంటాం. ముందెన్నడూ మనం అనుభవించని గొప్ప ఆనందాన్ని మనం అనుభవిస్తాము.

ఆయన కార్యము ముందుకు సాగడంలో సహాయపడేందుకు ప్రభువు యొక్క ప్రేరేపిత విధానంలో ఏకమవ్వడానికి మనలో ప్రతిఒక్కరం ఎన్నుకుందాం. మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. ఆదికాండము 3:1–18; మోషే 4:1–19 చూడండి.

  2. మోషే 5:1–12 చూడండి. ఈ వచనాలు ఆదాము హవ్వల నిజమైన భాగస్వామ్యాన్ని బోధిస్తాయి: వారికి పిల్లలు కలిగారు (2వ వచనము); వారికోసం, వారి కుటుంబం కోసం సమకూర్చుకోవడానికి వారు కలిసి శ్రమించారు (1వ వచనము); వారు కలిసి ప్రార్థించారు (4వ వచనము); వారు దేవుని ఆజ్ఞలకు లోబడ్డారు మరియు కలిసి బలులు అర్పించారు (5వ వచనము); వారు కలిసి యేసు క్రీస్తు సువార్తను నేర్చుకొని (వచనాలు 4, 6– 11), దానిని వారి పిల్లలకు బోధించారు (12వ వచనము).

  3. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:16 చూడండి.

  4. శారా ఎమ్. కింబల్, “Auto-Biography” లో జోసెఫ్ స్మిత్ Woman’s Exponent, Sept. 1, 1883, 51; Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 451 కూడా చూడండి.

  5. Nauvoo Relief Society Minute Book,” 40, josephsmithpapers.org, లో జోసెఫ్ స్మిత్.

  6. జార్జ్ ఆల్బర్ట్ స్మిత్, “Address to the Members of the Relief Society,” Relief Society Magazine, Dec. 1945, 717 చూడండి.

  7. జాన్ టేలర్, in Nauvoo Relief Society Minutes, మార్చి. 17, 1842 చూడండి, churchhistorianspress.org వద్ద లభ్యమవుతుంది. ఎలైజా ఆర్. స్నో ప్రకారం, మునుపటి యుగాల్లో స్త్రీలు అధికారికంగా ఏర్పరచబడ్డారని జోసెఫ్ స్మిత్ కూడా బోధించారు (Eliza R. Snow, “Female Relief Society,” Deseret News, Apr. 22, 1868, 1; and Daughters in My Kingdom: The History and Work of Relief Society [2011], 1–7 చూడండి).

  8. డాల్లిన్ హెచ్. ఓక్స్, “The Keys and Authority of the Priesthood,” లియహోనా, మే 2014, 49–52 చూడండి.

  9. Russell M. Nelson, “Spiritual Treasures,” Liahona, Nov. 2019, 78, 79 చూడండి.

  10. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Spiritual Treasures,” 77.

  11. “కానీ భార్యాభర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడతారనే నిత్య ఉద్దేశాన్ని పునఃస్థాపించబడిన సువార్త బోధిస్తుంది. వారు సమానులు. వారు భాగస్వాములు“ (Bruce R. and Marie K. Hafen, “Crossing Thresholds and Becoming Equal Partners,” Liahona, Aug. 2007, 28).

  12. Gospel Topics, “Joseph Smith’s Teachings about Priesthood, Temple, and Women,” topics.ChurchofJesusChrist.org.

  13. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  14. రస్సెల్ ఎమ్. నెల్సన్, “A Plea to My Sisters,” లియహోనా, నవ. 2015, 95–97 చూడండి.

  15. Russell M. Nelson, “A Plea to My Sisters,” 97.

  16. General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 1.4, ChurchofJesusChrist.org, చూడండి.

  17. Russell M. Nelson, “A Plea to My Sisters,” 97.

  18. “నా ప్రియమైన సహోదరీలారా, మీ పిలుపు ఏదైనప్పటికీ, మీ పరిస్థితులు ఏవైనప్పటికీ, మీ భావనలు, మీ పరిజ్ఞానములు, మరియు మీ ప్రేరణలు మాకు అవసరము. వార్డు మరియు స్టేకు సలహాసభలలో మీరు మాట్లాడుట మరియు నిస్సంకోచంగా మాట్లాడుట మాకవసరము. వివాహితురాలైన ప్రతి సహోదరి, మీ కుటుంబమును పరిపాలించుటలో మీ భర్తతో మీరు ఏకమైనప్పుడు ‘తోడ్పడుచున్న మరియు పూర్తి భాగస్వామిగా‘ మాట్లాడుట మాకవసరము. వివాహితులు లేక ఒంటరి సహోదరీలైన మీరు, దేవుని నుండి పొందిన వరములుగా ప్రత్యేక సామర్థ్యములు మరియు ప్రత్యేక సహజ జ్ఞానములు కలిగియున్నారు. సహోదరులమైన మేము మీ ప్రత్యేక ప్రభావమును నకలు చేయలేము. …

    “… మీ బలము మాకు అవసరము!” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “A Plea to My Sisters,” 97).

  19. రస్సెల్ ఎమ్. నెల్సన్, “A Plea to My Sisters,” 97.