సర్వసభ్య సమావేశము
దేవుని యొక్క మంచితనము మరియు గొప్పతనాన్ని పరిగణించండి
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


దేవుని యొక్క మంచితనము మరియు గొప్పతనాన్ని పరిగణించండి

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గొప్పతనాన్ని, వారు మీ కోసం చేసిన వాటిని ప్రతిరోజూ గుర్తుంచుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

ప్రపంచ చరిత్ర అంతటా, ప్రత్యేకించి కష్టసమయాల్లో, దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరియు వ్యక్తులుగా, కుటుంబాలుగా మరియు ప్రజలుగా మన కోసం ఆయన ఏమి చేసారో ఆలోచించమని ప్రవక్తలు మనల్ని ప్రోత్సహించారు. 1 ఈ దిశనిర్దేశము లేఖనాలంతటా కనిపిస్తుంది, కాని మోర్మన్ గ్రంథములో ఇది ప్రముఖంగా స్పష్టంగా కనిపిస్తుంది. మోర్మన్ గ్రంథము యొక్క ఉద్దేశాలలో ఒకటి “ఇశ్రాయేలు వంశస్థుల శేషమునకు, ప్రభువు వారి పితరుల కొరకు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో చూపుట” అని శీర్షిక పేజీ వివరిస్తుంది. 2 మోర్మన్ గ్రంథము యొక్క ముగింపులో మొరోనై యొక్క విజ్ఞప్తి ఉంది: “నేను మీకు ఉద్భోధించునదేమనగా, మీరు ఈ సంగతులను చదివినప్పుడు … నరుల సంతానముపట్ల ప్రభువు ఎంత కనికరముతోయుండెనో మీరు జ్ఞాపకము చేసుకొనవలెను … మరియు మీ హృదయములలో తలపోయవలెను.”3

దేవుని మంచితనంపై ప్రతిబింబించమని ప్రవక్తల నుండి వచ్చిన విజ్ఞప్తుల యొక్క స్థిరత్వం అద్భుతమైనది. 4 వారి సంతృప్తి కోసం కాదు, కానీ ఆ జ్ఞాపకం మనపై ఉన్న ప్రభావం కోసం మన పరలోక తండ్రి, తన మరియు తన ప్రియమైన కుమారుని మంచితనాన్ని మనం గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నారు. వారి దయను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, మన దృక్పథం మరియు అవగాహన విస్తరిస్తాయి. వారి కరుణపై ప్రతిబింబించడం ద్వారా, మనము మరింత వినయంగా, ప్రార్థనపూర్వకంగా మరియు స్థిరంగా మారతాము.

ఔదార్యం మరియు కరుణ కొరకు కృతజ్ఞత మనలను ఎలా మార్చగలదో ఒక మాజీ రోగితో ఒక తీక్షణమైన అనుభవం చూపిస్తుంది. 1987 లో, గుండె మార్పిడి అవసరమైన థామస్ నీల్సన్ అనే గొప్ప వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది. అతను 63 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో యూటాలోని లోగన్‌లో నివసించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనిక సేవ తరువాత, అతను డోనా విల్కేస్‌ను లోగన్ యూటా దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. అతను శక్తివంతమైన మరియు విజయవంతమైన తాపీ మేస్త్రీ అయ్యాడు. తరువాతి సంవత్సరాల్లో, అతను తన జ్యేష్ఠుడైన మనవడు జోనాథన్‌తో కలిసి పాఠశాల సెలవుల్లో పనిచేయడాన్ని ప్రత్యేకంగా ఆనందించాడు. టామ్, జోనాథన్లో తనను తాను ఎక్కువగా చూసినందున ఇద్దరూ కొంతవరకు ప్రత్యేక బంధాన్ని పెంచుకున్నారు.

దాత గుండె కోసం వేచియుండటం టామ్‌ను నిరాశపరిచింది. అతను అంతగా సహనం గల వ్యక్తి కాదు. అతను ఎల్లప్పుడూ కృషి మరియు సంపూర్ణ సంకల్పం ద్వారా లక్ష్యాలను నిర్దేశించి, సాధించగలిగాడు. గుండె వైఫల్యంతో పోరాడుతూ, తన జీవితాన్ని నిలిపివేసిన టామ్, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి నేను ఏమి చేస్తున్నానని కొన్నిసార్లు నన్ను అడిగాడు. హాస్యాస్పదంగా, దాత గుండె అతనికి త్వరగా అందుబాటులోకి వచ్చేలా నేను అనుసరించగల మార్గాలను ఆయన సూచించాడు.

సంతోషకరమైనదే కాని భయంకరమైన ఒక రోజు, ఆదర్శవంతమైన దాత గండె ఒకటి టామ్‌కు అందుబాటులోకి వచ్చింది. దాని పరిమాణం మరియు రక్తపు రకం జతకుదిరాయి, మరియు దాత కేవలం 16 సంవత్సరాల వయస్సు గల యౌవనుడు. దాత గుండె టామ్ యొక్క ప్రియమైన మనవడు జోనాథన్ కు చెందినది. ఆ రోజు ప్రారంభంలో జోనాథన్, తాను ప్రయాణిస్తున్న కారు అటుగా వెళ్తున్న రైలును ఢీకొనడంతో ప్రాణాంతకంగా గాయపడ్డాడు.

నేను ఆసుపత్రిలో టామ్ మరియు డోనాలను సందర్శించినప్పుడు, వారు కలవరపడ్డారు. మనవడి గుండెను ఉపయోగించడం ద్వారా టామ్ జీవితాన్ని పొడిగించవచ్చని తెలుసుకోవడం ద్వారా వారు ఏ అనుభవాన్ని పొందుతున్నారో ఊహించడం కష్టం. మొదట, వారు జోనాథన్ యొక్క దుఃఖిస్తున్న తల్లిదండ్రులైన వారి కుమార్తె మరియు అల్లుడి నుండి వచ్చిన గుండెను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించారు. అయినప్పటికీ, టామ్ మరియు డోనాకు తెలుసు, జోనాథన్ మెదడు పనిచేయకపోవడం వలన చనిపోయాడని, మరియు టామ్‌కు దాత గుండె కోసం వారు చేసిన ప్రార్థనలు జోనాథన్ ప్రమాదానికి కారణం కాదని అర్థం చేసుకున్నారు. లేదు, జోనాథన్ గుండె టామ్‌కు అవసరమైన సమయంలో అతన్ని దీవించగల బహుమతి. ఈ విషాదం నుండి ఏదైనా మంచి రావచ్చని వారు గుర్తించారు మరియు ఆ ఆలోచనతో కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

గుండె మార్పిడి విధానాలు చక్కగా సాగాయి. తరువాత, టామ్ వేరే వ్యక్తిగా మారాడు. ఈ మార్పు మెరుగైన ఆరోగ్యం లేదా కృతజ్ఞతకు మించి సాగింది. ప్రతి ఉదయం జోనాథన్ పైన, తన కుమార్తె మరియు అల్లుడిపైన, తనకు లభించిన బహుమతిపైన, మరియు ఆ బహుమతి పొందడానికి ఏమి అవసరమయ్యిందో దానిపైన అతడు ప్రతిబింబించాడని అతను నాకు చెప్పాడు. అతని సహజమైన మంచి హాస్యం మరియు ధైర్యం ఇప్పటికీ స్పష్టంగా కనబడుతున్నప్పటికీ, టామ్ మరింత గంభీరంగా, ఆలోచనాత్మకంగా మరియు దయగలవాడిగా కావడం నేను గమనించాను.

మార్పిడి తర్వాత టామ్ అదనంగా 13 సంవత్సరాలు జీవించాడు, ఆ మార్పిడి జరుగకపోతే అతను అన్ని సంవత్సరాలు ఉండేవాడు కాదు. ఈ సంవత్సరాలు తన కుటుంబాన్ని మరియు ఇతరుల జీవితాలను ఔదార్యంతో, ప్రేమతో తాకడానికి వీలుకల్పించాయని అతని సంస్మరణలో పేర్కొనబడింది. అతను ఒక వ్యక్తిగత లబ్ధిదారుడు మరియు ఆశావాదానికీ, సంకల్పానికి ఉదాహరణగా ఉన్నాడు.

టామ్ మాదిరిగానే, మనలో ప్రతి ఒక్కరము యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా కలుగు విమోచనతో సహా మనం సమకూర్చుకోలేని బహుమతులను, మన పరలోక తండ్రి మరియు ఆయన ప్రియమైన కుమారుడి నుండి బహుమతులను పొందాము. 5 మనం ఈ ప్రపంచంలో జీవితాన్ని పొందాము; మనం ఎంచుకొన్నట్లైతే ఇకమీదట కలుగు నిత్య రక్షణ మరియు మహోన్నత స్థితిలో భౌతిక జీవితాన్ని మనం పొందుతాము-పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మూలంగా ఇది సాధ్యమౌతుంది.

ఈ బహుమతులను మనం ఉపయోగించిన, వాటి నుండి ప్రయోజనం పొందిన, లేదా వాటి గురించి ఆలోచించిన ప్రతిసారీ, దాతల త్యాగం, ఔదార్యం మరియు కరుణను మనం పరిగణించాలి. దాతలకు గౌరవం ఇవ్వడం మనల్ని కృతజ్ఞత గలవారిగా మాత్రమే చేయదు. వారి బహుమతులపై ప్రతిబింబించడం వలన అది మనల్ని మార్చగలదు మరియు మార్చాలి.

ఒక గొప్ప పరివర్తన అనగా చిన్న ఆల్మా పరివర్తన లాంటిది. ఆల్మా “దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు” 6 ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. సంఘమును హింసిస్తున్నందుకు మరియు “జనుల యొక్క హృదయాలను దొంగిలించుచున్నందుకు”8 దేవదూత “ఉరుములవంటి స్వరముతో” 7 ఆల్మాను మందలించాడు. దేవదూత ఈ మందలింపుకు ఇది చేర్చాడు: “వెళ్ళుము, నీ పితరుల దాస్యమును జ్ఞాపకము చేసుకొనుము …; మరియు (దేవుడు) వారి కొరకు ఎంత గొప్ప కార్యములు చేసెనో జ్ఞాపకము చేసుకొనుము.”9 సాధ్యమయ్యే అన్ని ఉద్భోధలలో, దేవదూత నొక్కిచెప్పినది అదే.

ఆల్మా పశ్చాత్తాపపడి, జ్ఞాపకము చేసుకున్నాడు. తరువాత అతను తన కుమారుడైన హీలమన్‌తో దేవదూత యొక్క మందలింపు గురించి చెప్పాడు. ఆల్మా ఇలా ఉపదేశించాడు, “మన పితరుల యొక్క చెరను జ్ఞాపకము చేసుకొనుటయందు నేను చేసినట్లే నీవు చేయవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా వారు దాస్యమందుండిరి, మరియు అబ్రాహాము, … ఇస్సాకు, … యాకోబు, … యొక్క దేవుడు తప్ప ఎవడును వారిని విడిపించలేక యుండెను: మరియు ఆయన నిశ్చయముగా వారి శ్రమల నుండి వారిని విడిపించెను.” 10 “నేను నా నమ్మిక ఆయన యందు ఉంచెదను,”11 అని ఆల్మా చెప్పాడు. “ప్రతి రకమైన పరీక్షలు మరియు కష్టాల” సమయంలో సహకారమును, బానిసత్వం నుండి విముక్తిని గుర్తుంచుకోవడం ద్వారా, మనము దేవుడిని మరియు ఆయన వాగ్దానాల యొక్క నిశ్చయతను తెలుసుకుంటామని ఆల్మా అర్థం చేసుకున్నాడు.12

మనలో కొద్దిమందికి మాత్రమే ఆల్మా వలె నాటకీయమైన అనుభవం ఉంటుంది, అయినప్పటికీ మన పరివర్తన అంతే లోతుగా ఉండగలదు. రక్షకుడు పూర్వం ఈ ప్రతిజ్ఞ చేసారు:

“నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి … మాంసపు గుండెను మీకిచ్చెదను.

“నా ఆత్మను మీయందుంచెదను. …

“… మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును.” 13

పునరుత్థానం చెందిన రక్షకుడు ఈ పరివర్తన ఎలా ప్రారంభమవుతుందో నీఫైయులకు చెప్పారు. ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో కీలకమైన లక్షణాన్ని ఆయన గుర్తించారు:

“మరియు నేను సిలువపైన పైకెత్తబడునట్లు నా తండ్రి నన్ను పంపియున్నాడు; మరియు నేను మనుష్యులందరినీ నా వైపు ఆకర్షించుకొనునట్లు నేను సిలువపైన పైకెత్తబడిన తరువాత. …

“మరియు ఈ హేతువు నిమిత్తము, నేను పైకెత్తబడితిని; కాబట్టి, తండ్రి యొక్క శక్తిని బట్టి నేను మనుష్యులందరిని నా వైపు ఆకర్షించుకొందును.” 14

మీరు రక్షకుని వైపు ఆకర్షించబడడానికి మీకు ఏమి అవసరమౌతుంది? యేసు క్రీస్తు తన తండ్రి చిత్తానికి లోబడడం, మరణంపై ఆయన సాధించిన విజయం, మీ పాపాలను మరియు తప్పులను ఆయన స్వయంగా ఆయనపై తీసుకోవడం, మీ కోసం మధ్యవర్తిత్వం చేయడానికి తండ్రి నుండి శక్తిని స్వీకరించడం మరియు మీ కోసం ఆయన అంతిమ విమోచనను పరిగణించండి.15 మిమ్మల్ని ఆయన వైపుకు ఆకర్షించడానికి ఈ విషయాలు సరిపోవా? అవి నాకు సరిపోతాయి. యేసు క్రీస్తు “తన బాహువులు చాపి, [మిమ్మల్ని మరియు నన్ను] స్వస్థపరచుటకు, క్షమించుటకు, శుభ్రపరచుటకు, బలపరచుటకు, శుద్ధిచేయుటకు మరియు పవిత్రపరచుటకు కోరుకుంటూ, సమ్మతిస్తూ నిలబడియున్నారు.”16

ఈ విషయాలు మనకు క్రొత్త హృదయాన్ని ఇవ్వాలి మరియు పరలోక తండ్రిని, యేసు క్రీస్తును అనుసరించడానికి ఎన్నుకోమని మనల్ని ప్రేరేపించాలి. అయినప్పటికీ, క్రొత్త హృదయాలు కూడా “సంచరించే అవకాశం ఉంది, … [మనం] ప్రేమించే దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉంది.” 17 ఈ ధోరణితో పోరాడడానికి, మనకు లభించిన బహుమతులు మరియు వాటిని పొందడానికి ఏమి అవసరమైనవో వాటిపైన మనం ప్రతిరోజూ ప్రతిబింబించాలి. రాజైన బెంజిమెన్ ఇలా ఉపదేశించాడు, “దేవుని గొప్పతనమును ఎల్లప్పుడు జ్ఞాపకమందు ఉంచుకొనవలెనని … మీ యెడల ఆయన మంచితనమును మరియు దీర్ఘశాంతమును మీరు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను.” 18 మనము అలా చేస్తే, గొప్ప పరలోకపు ఆశీర్వాదాలకు మనము అర్హత పొందుతాము.

దేవుని మంచితనం మరియు దయ మీద ప్రతిబింబించడం, మనం ఆత్మీయంగా మరింత గ్రహించువారిగా అగుటకు సహాయపడుతుంది. క్రమంగా, పెరిగిన ఆత్మీయ సున్నితత్వం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్ని విషయాల సత్యాన్ని తెలుసుకోవడానికి మనల్ని అనుమతిస్తుంది. 19 మోర్మన్ గ్రంథము యొక్క యధార్థతకు ఒక సాక్ష్యాన్ని కలిగియుండి, యేసే క్రీస్తని, మన వ్యక్తిగత రక్షకుడు మరియు విమోచకుడని యెరిగి, ఈ కడవరి దినాలలో ఆయన సువార్త పునఃస్థాపించబడిందని అంగీకరించుట ఇందులో భాగము.20

మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గొప్పతనాన్ని మరియు వారు మనకోసం చేసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు టామ్, జోనాథన్ గుండెను తేలికగా తీసుకోనట్లే మనం కూడా వారిని తేలికగా తీసుకోము. ఆనందకరమైన మరియు భక్తితో కూడిన గౌరవ మార్గములో, టామ్ ప్రతిరోజూ తన జీవితాన్ని పొడిగించిన విషాదాన్ని గుర్తు చేసుకున్నాడు. మనము రక్షింపబడతామని మరియు మహోన్నత స్థితిని పొందుతామని తెలుసుకోవడంలో కలిగిన ఆనందంలో, రక్షణ మరియు మహోన్నత స్థితి గొప్ప వెలతో వచ్చాయని మనం గుర్తుంచుకోవాలి. 21 యేసు క్రీస్తు లేకుండా మనం శిక్షించబడతాము, కాని ఆయన వలన పరలోక తండ్రి ఇవ్వగలిగిన గొప్ప బహుమతిని మనం పొందగలమని మనం గ్రహించినప్పుడు మనం భక్తితో కూడిన గౌరవముతో ఆనందంగా ఉండగలము. 22 వాస్తవానికి, మనం “ఈ లోకములో నిత్యజీవమును” మరియు చివరకు రాబోయే లోకములో “నిత్యజీవము … అనగా అమర్త్యత్వ మహిమను” పొందుతామన్న వాగ్దానాన్ని ఆనందించడానికి ఈ భక్తితోకూడిన గౌరవము మనల్ని అనుమతిస్తుంది. 23

మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క మంచితనాన్ని మనం పరిగణించినప్పుడు, వారిపై మనకున్న నమ్మకం పెరుగుతుంది. దేవుడు మన తండ్రి అని, మనం ఆయన పిల్లలమని మనకు తెలుసు, కాబట్టి మన ప్రార్థనలు మారుతాయి. మనం ఆయన చిత్తాన్ని మార్చాలని కోరము, కాని మన చిత్తాన్ని ఆయన చిత్తంతో సమం చేసుకోవాలని మరియు వాటిని మనం అడిగితేనే ఇవ్వబడతాయి అన్న షరతుపై ఆయన మనకు మంజూరు చేయాలనుకుంటున్న ఆశీర్వాదాలను మనకోసం నిశ్చయపరచుకోవాలని కోరతాము. 24 మనం మరింత సాత్వీకంగా, మరింత స్వచ్ఛంగా, మరింత స్థిరంగా, మరింత క్రీస్తువలె ఉండాలని కోరుకుంటాము. 25 ఈ మార్పులు అదనపు పరలోక దీవెనలకు మనల్నిఅర్హులుగా చేస్తాయి.

ప్రతి మంచి విషయం యేసు క్రీస్తు నుండి వచ్చునని అంగీకరించడం ద్వారా, మన విశ్వాసాన్ని ఇతరులకు మరింత సమర్థవంతంగా తెలియజేస్తాము. 26 అసాధ్యమైనవిగా కనిపించే పనులు మరియు పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనము ధైర్యాన్ని కలిగియుంటాము.27 రక్షకుడిని అనుసరించడానికి మనం చేసిన నిబంధనలను పాటించాలనే మన నిర్ణయాన్ని మనం బలపరుస్తాము.28 మనం దేవుని ప్రేమతో నింపబడతాము, అవసరతలో ఉన్నవారిని తీర్పుతీర్చువారిగా ఉండకుండా వారికి సహాయం చేయాలనుకుంటాము, మన పిల్లలను ప్రేమించి, వారిని నీతియందు పెంచుతాము, మన పాపాలకు క్షమాపణను నిలుపుకుంటాము మరియు ఎల్లప్పుడూ సంతోషిస్తాము.29 దేవుని మంచితనం మరియు దయను జ్ఞాపకముంచుకోవడం వలన కలుగు గొప్ప ఫలాలు ఇవి.

దీనికి విరుద్ధంగా రక్షకుడు హెచ్చరించారు, “అన్ని విషయాలలో ఆయన హస్తాన్ని ఒప్పుకోని వారు తప్ప ఇంకెవ్వరు దేవుని బాధపెట్టరు లేదా వారికి విరోధముగా ఆయన కోపము రగులుకొనదు.”30 మనం ఆయనను మరచిపోయినప్పుడు దేవుడు అవమానించబడ్డాడని నేను అనుకోను. బదులుగా, ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారని నేను భావిస్తున్నాను. ఆయనను, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయనకు దగ్గరయ్యే అవకాశాన్ని మనం కోల్పోయామని ఆయనకు తెలుసు. అప్పుడు ఆయన మనకు దగ్గరగా రావడాన్ని మరియు ఆయన వాగ్దానం చేసిన నిర్దిష్ట ఆశీర్వాదాలను మనం కోల్పోతాము.31

ప్రతిరోజూ పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గొప్పతనాన్ని మరియు వారు మీ కోసం చేసిన వాటిని గుర్తుంచుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వారి మంచితనాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సంచరిస్తున్న మీ హృదయాన్ని వారితో మరింత గట్టిగా బంధించబడనివ్వండి.32 వారి కరుణ గురించి ఆలోచించండి, మీరు అదనపు ఆత్మీయ సున్నితత్వంతో ఆశీర్వదించబడతారు మరియు మరింతగా క్రీస్తువలె అవుతారు. వారి సహానుభూతిని అర్థంచేసుకోవడం, “ఎప్పటికీ అంతం లేని ఆనందపు స్థితిలో దేవునితో నివసించడానికి” మీరు “పరలోకములోనికి స్వీకరించబడే వరకు” మీరు “అంతం వరకు విశ్వాసంగా ఉండడానికి” సహాయపడుతుంది. 33

మన పరలోక తండ్రి, తన ప్రియమైన కుమారుని గురించి ప్రస్తావిస్తూ, “ఈయన మాట వినుడి!” అని చెప్పారు. 34 మీరు ఆ మాటలపై చర్య తీసుకొని, ఆయనను విన్నప్పుడు, మీరు పునఃస్థాపించలేని వాటిని పునఃస్థాపించడానికి రక్షకుడు ఇష్టపడతారని, మీరు నయం చేయలేని గాయాలను నయం చేయడానికి ఆయన ఇష్టపడతారని, కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైన వాటిని బాగుచేయడానికి ఆయన ఇష్టపడతారని ఆనందంగా, భక్తితో కూడిన గౌరవముతో జ్ఞాపకముంచుకోండి;35 మీపైకి వచ్చిన ఏదైనా అన్యాయానికి ఆయన పరిహారం చెల్లిస్తారు;36 మరియు విరిగిన హృదయాలను శాశ్వతంగా చక్కదిద్దడానికి ఆయన ఇష్టపడతారు.37

నేను మన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నుండి వచ్చు వరాలపై ప్రతిబింబించినప్పుడు, వారి అనంతమైన ప్రేమ మరియు పరలోక తండ్రి పిల్లలందరి పట్ల వారి అపారమైన కరుణ గురించి నేను తెలుసుకున్నాను. 38 ఈ జ్ఞానం నన్ను మార్చింది, అది మిమ్మల్ని కూడా మారుస్తుంది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.