సర్వసభ్య సమావేశము
ఇంత గొప్ప హేతువులో మనం ముందుకు సాగక ఉందుమా?
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


ఇంత గొప్ప హేతువులో మనం ముందుకు సాగక ఉందుమా?

సంఘాన్ని స్థాపించడానికి జోసెఫ్ మరియు హైరం స్మిత్ లు, ఇతర విశ్వాసులైన స్త్రీపురుషులు, పిల్లలతో పాటు చెల్లించిన వెలను మనమెల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి.

ఇంత అద్భుతమైన ప్రారంభం కొరకు అధ్యక్షులకు ధన్యవాదాలు. సహోదర సహోదరీల్లారా, 215 సంవత్సరాల క్రితం, ఆగ్నేయ సంయుక్త రాష్ట్రాలలోని వెర్మాంట్ లో, న్యూ ఇంగ్లాండ్ గా పిలువబడిన ప్రాంతంలో జోసెఫ్, లూసీ మేక్ స్మిత్ లకు ఒక బాలుడు జన్మించాడు.

జోసెఫ్, లూసీ మేక్ లు యేసుక్రీస్తు నందు విశ్వాసం కలిగియుండి, పరిశుద్ధలేఖనాలను పఠిస్తూ, నిజాయితీగా ప్రార్థిస్తూ, దేవునియందు విశ్వాసంతో నడుచుకునేవారు.

వారి కుమారునికి జోసెఫ్ స్మిత్ జూ. అని వారు పేరు పెట్టారు.

స్మిత్ కుటుంబం గురించి, బ్రిగం యంగ్ ఇలా చెప్పారు: “ప్రభువు [జోసెఫ్ స్మిత్] పై, అతని తండ్రిపై, అతని తండ్రికి తండ్రిపై, అతని పూర్వీకులపై అబ్రహాము వరకు, అబ్రహాము నుండి వరదల వరకు, వరదల నుండి హనోకు వరకు, హనోకు నుండి ఆదాము వరకు తన దృష్టి సారించారు. ఆయన ఆ కుటుంబాన్ని, వారిలో ప్రవహించిన రక్తాన్ని, అది దాని పునాదులనుండి అతని జననం వరకు ప్రవహించడాన్ని చూసారు. [జోసెఫ్ స్మిత్] నిత్యత్వంలోనే సృష్టికి ముందుగా నియమించబడ్డాడు.”1

అతని కుటుంబంచే ప్రేమించబడిన, జోసెఫ్ జూ. ముఖ్యంగా అతడు జన్మించేనాటికి సుమారు ఆరు సంవత్సరాల వాడైన తన అన్న హైరంతో సన్నిహితంగా ఉండేవాడు.

గత అక్టోబరులో, జోసెఫ్ జన్మించిన షేరన్, వెర్మాంట్లోని చిన్న స్మిత్ గృహంలో గల నేలపొయ్యి ప్రక్కన నేను కూర్చున్నాను. జోసెఫ్ కొరకు హైరంకు గల ప్రేమను నేను అక్కడ అనుభవించాను, అతడు తన చిన్న తమ్ముడి చేతులను పట్టుకొని, నడక నేర్పించడాన్ని నేను ఊహించుకున్నాను.

తల్లిదండ్రులైన స్మిత్ లు వ్యక్తిగత ఆటంకాలను అనుభవించారు, అవి వారి కుటుంబాన్ని అనేకచోట్లకు మారునట్లు చేసి, చివరకు న్యూ ఇంగ్లాండ్ ను వదిలి, బాగా పశ్చిమానున్న న్యూయార్క్ రాష్ట్రానికి వెళ్ళే ధైర్యవంతమైన నిర్ణయాన్ని తీసుకునేలా చేసాయి.

కుటుంబం ఐక్యంగా ఉండుట వలన, వారు ఈ సవాళ్ళ నుండి బయటపడి, కలిసికట్టుగా న్యూయార్క్ లో, పాల్మైరా దగ్గరలోని, మాంచెష్టర్ లో వంద ఎకరాల (0.4 కి.మీ2) చెట్లతో కూడిన ప్రదేశంలో జీవితాన్ని పునఃప్రారంభించే కష్టమైన పనిని వారు ఎదుర్కున్నారు.

జీవితాన్ని పునఃప్రారంభించడం వలన స్మిత్ కుటుంబానికి కలిగిన శారీరక, మానసిక సవాళ్ళు—చెట్లను నరకడం, తోటలను, పొలాలను నాటడం, దుంగలతో చిన్న గృహాన్ని, ఇతర వ్యవసాయ కట్టడాలను కట్టడం, దినసరి కూలీలుగా పనిచేయడం, పట్టణంలో అమ్మడానికి ఇంట్టో వస్తువులను తయారు చేయడం వంటివాటిని మనలో చాలామంది గ్రహించగలరో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు.

పశ్చిమ న్యూయార్క్ కు ఆ కుటుంబం చేరుకునేసరికి, ఆప్రాంతమంతా—రెండవ గొప్ప మేల్కొలుపుగా పిలువబడిన మతపరమైన ఉత్సాహంతో రగిలిపోతోంది.

మత విభాగముల మధ్య చర్చలు, కలహాలున్న ఆ సమయంలో, జోసెఫ్ ఒక అద్భుతమైన దర్శనాన్నిచూసాడు, ఈ రోజు దానిని మొదటి దర్శనం అని పిలుస్తున్నాం. దాని నుండి పొందిన నాలుగు ప్రాథమిక అంశాలతో మనం దీవించబడిన వాటినుండి నేను మాట్లాడతాను.2

జోసెఫ్ ఇలా నమోదు చేసాడు: “గొప్ప [మతపరమైన] ఉద్రేకముగల ఈ సమయములో నా మనస్సు లోతుగా ఆలోచన చేయుటకు, చాలా ఇబ్బందిపడుటకు మొదలుపెట్టెను; కాని నా భావములు లోతైనవి, తరచు హృదయవిదారకమైనవి అయినప్పటికీ, అవకాశమున్న ప్రతిసారి వారి కూడికలకు నేను హాజరైనప్పటికి, ఈ పక్షములన్నిటినుండి నేను దూరంగా నుంటిని. … [కానీ] వేర్వేరు తరగతుల మధ్య నెలకొనియున్న గందరగోళము, వివాదముల వలన, యౌవనములోనున్న వాడినైయుండి, మనుష్యులు మరియు పరిస్థితుల పట్ల అవగాహన లేని నాకు ఎవరు తప్పో, ఎవరు ఒప్పో అని ఏదైనా ఒక నిర్దిష్టమైన ముగింపుకు రావడం అసాధ్యము.”3

జోసెఫ్ తన ప్రశ్నలకు జవాబులను బైబిలులో వెదుకుతూ యాకోబు 1:5 చదివాడు: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయును.”4

అతడు ఇలా సూచించాడు: “ఈ సమయములో ఈ లేఖనభాగము నన్ను తాకినంతగా ఏ భాగము మనుష్య హృదయమును ఇంత శక్తివంతముగా తాకలేదు. అది నా ప్రతి హృదయాలోచనలోనికి గొప్ప బలముతో ప్రవేశించినట్లు అనిపించెను. పదే పదే దానిని గూర్చి నేను ఆలోచించితిని.”5

జీవితపు ప్రశ్నలన్నింటికీ బైబిలులో జవాబులు లేవు, కానీ ప్రార్థన ద్వారా సరాసరి దేవునితో మాట్లాడడం ద్వారా వారి ప్రశ్నలకు సమాధానాలను కనుగొనవచ్చని అది స్త్రీపురుషులకు బోధిస్తుందని జోసెఫ్ తెలుసుకున్నాడు.

అతడు ఇంకా చెప్పాడు: “దేవుని అడుగవలెనను నా ఈ సంకల్పమునకు అనుగుణముగా, ఆ ప్రయత్నము చేయుటకు నేను అడవిలోనికి వెళ్ళితిని. పద్దెనిమిది వందల ఇరవైయవ సంవత్సరపు వసంతకాల ఆరంభములో ఒక అందమైన, కాంతివంతమైన ఉదయకాలమున అది జరిగెను.”6

అప్పుడు జోసెఫ్ ఇలా చెప్పాడు, “కాంతి [స్తంభము] నాపైన నిలిచెను, [మరియు] గాలిలో వారి తేజస్సు, మహిమ వర్ణనాతీతముగా నుండిన ఇద్దరు వ్యక్తులు నా పైన నిలువబడియుండుట నేను చూచితిని. వారిలో ఒకరు నన్ను పేరుతో పిలిచి మరొకరిని చూపిస్తూ—[జోసెఫ్,] ఈయన నా ప్రియకుమారుడు. ఈయనను వినుము!7 అని చెప్పెను.

తర్వాత రక్షకుడు మాట్లాడుచూ: “జోసెఫ్, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి. నీమార్గమున వెళ్ళి, నాకట్టడలలో నడుస్తూ, నా ఆజ్ఞలను పాటించు. ఇదిగో, నేను మహిమకలిగిన ప్రభువును. నేను లోకం కొరకు, దానిలో నా నామమున విశ్వసించువారందరు నిత్యజీవితం పొందునట్లు సిలువవేయబడ్డాను.”8 అని చెప్పెను.

జోసెఫ్ ఇంకా చెప్పాడు, “నేను మాట్లాడగలుగునట్లు నా ఆధీనములోనికి నేను వచ్చిన వెంటనే, నా పైన కాంతిలో నిలువబడిన ఆ వ్యక్తులను అన్ని పక్షములలో ఏది సరియైనదని అడిగితిని.”9

అతడు జ్ఞాపకం చేసుకుంటూ: “అన్ని మత తరగతుల వారు తప్పుడు సిద్ధాంతాలను నమ్ముతున్నారని, వారిలో ఎవరూ దేవునిచే ఆయన సంఘంగా, మరియు రాజ్యంగా అంగీకరించబడలేదని వారు నాతో చెప్పారు. … అదే సమయంలో సువార్త యొక్క పరిపూర్ణత భవిష్యత్తులో ఒకరోజు నాకు తెలియజేయబడుతుందనే వాగ్ధానాన్ని [నేను] పొందా[ను]”10 అన్నాడు.

జోసెఫ్, “ఈ దర్శనంలో నేను అనేక దేవదూతలను చూసానని”11 కూడా సూచించాడు.

ఈ మహిమకరమైన దర్శనం తర్వాత, జోసెఫ్ వ్రాసాడు: “నా ఆత్మ ప్రేమతో నింపబడి, అనేక దినముల వరకు గొప్ప ఆనందంతో నేను సంతోషించగలిగాను. … ప్రభువు నాతోనే ఉన్నారు.”12

అతను తన సిద్ధపాటును పరిశుద్ధ వనం నుండి ప్రారంభించి దేవుని ప్రవక్తగా ఉద్భవించాడు.

జోసెఫ్ కూడా ప్రాచీన ప్రవక్తలు అనుభవించిన తిరస్కారాన్ని, వ్యతిరేకతను, హింసను తెలుసుకోవడం ప్రారంభించాడు. జోసెఫ్ మత పునరుజ్జీవంలో చురుకుగానున్న పరిచారకులలో ఒకనితో తాను చూచిన, వినిన వాటిని పంచుకొనుటను జ్ఞాపకం చేసుకున్నాడు:

“అతని ప్రవర్తనకు నేను బహుగా ఆశ్చర్యపడితిని; నా సంభాషణనను అతడు తేలికగా తీసుకొనుటయే కాక, అది సాతాను వలన కలిగిందని, ఈ దినములలో దర్శనములు లేదా బయల్పాటులు అనునవి లేవని; అటువంటివి అపొస్తలులతో సమాప్తమయ్యెనని, అవి ఇక ఉండవని మిక్కిలి అలక్ష్యముతో చెప్పెను.

“నా కథను చెప్పుటవలన మత విశ్వాసులుగా చెప్పుకొనువారి మధ్య నా గురించి చాలా అసూయ భావము రేగెనని, ఎక్కువగుచున్న గొప్ప హింసకు అది కారణమని నేను అతి త్వరలోనే తెలుసుకొంటిని; … ఇది అన్ని పక్షములలో సర్వసాధారణమయ్యెను—నన్ను హింసించుటకు అందరు ఏకమయ్యిరి.”13

మూడుసంవత్సరాల తర్వాత, 1823లో, చివరిదినాలలో యేసుక్రీస్తు సువార్త పునఃస్థాపన కొనసాగింపులో భాగంగా పరలోకములు మరలా తెరువబడ్డాయి. మొరోనై అనబడే దేవదూత తనకు ప్రత్యక్షమై, “నేను చేయవలసిన ఒక కార్యమును దేవుడు కలిగియున్నాడని … [మరియు] బంగారుపలకలపైన వ్రాయబడిన ఒక గ్రంథము పాతిపెట్టబడియుండెనని,” అది “[అమెరికాలలోని] ప్రాచీన నివాసులకు రక్షకునిచేత ఇవ్వబడినట్లుగా … నిత్య సువార్తను సంపూర్ణముగా దానిలో కలిగియున్నది”14 అని చెప్పెనని జోసెఫ్ సూచించాడు.

చివరికి, జోసెఫ్ ప్రాచీన వృత్తాంతాన్ని పొంది, అనువదించి, ప్రచురించాడు, అది ఈ రోజు మోర్మన్ గ్రంథమని పిలువబడుతుంది.

అతని సహోదరుడు, ముఖ్యంగా 1813 లో అతని బాధాకరమైన, ప్రాణాంతక కాలి శస్త్రచికిత్స తరువాత అతనికి స్థిరమైన మద్దతుదారుడైన హైరం, బంగారు పలకలను చూసిన సాక్షులలో ఒకడు. 1830 లో యేసు క్రీస్తు సంఘం ఏర్పాటు చేయబడినప్పుడున్న ఆరుగురు సభ్యులలో అతను కూడా ఒకడు.

వారి జీవితకాలంలో, జోసెఫ్, హైరంలు అల్లరిమూకలను, హింసను కలిసి ఎదుర్కొన్నారు. ఉదాహరణకు, 1838–39 శీతలమైన చలికాలంలో వారు ఐదు నెలలు మిస్సౌరీలోని లిబర్టీ చెరసాలలో అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితులను అనుభవించారు.

ఏప్రిల్ 1839లో, జోసెఫ్ తన భార్యయైన ఎమ్మాకు లిబర్టీ చెరసాలలోని పరిస్థితిని వివరిస్తూ: “ఇప్పటికి ఐదు నెలల, ఆరు రోజుల నుండి నేను రాత్రి పగలు, ప్రహారిగోడలలో కాపలాల లోపల ఒంటరియైన, అంధకారమైన, అపరిశుభ్రమైన చెరసాల ఇనుప తలుపుల మధ్య ఉన్నానని నేను నమ్ముతున్నాను. … మేము ఈ [స్థలం] నుండి ఎప్పటికైనా తరలించబడతామని, మేము సంతోషిస్తున్నాము. మాకు ఏమి జరిగినా, దీని కంటే దారుణమైన పరిస్థితిలోకి మేము వెళ్ళలేము. … మిస్సౌరీ, క్లే కౌంటీలోని లిబర్టీకి తిరిగి రావాలని మేమెప్పుడూ కోరుకోము. శాశ్వతంగా గుర్తుండేలా మేము తగినంత అనుభవించాము”15 అని వ్రాసాడు.

హింసను ఎదుర్కొంటున్నప్పుడు, హైరం ప్రభువు వాగ్దానాలపై విశ్వాసాన్ని ప్రదర్శించి, తాను ఎంచుకుంటే తన శత్రువుల నుండి తప్పించుకునే హామీని పొందాడు. 1835 లో జోసెఫ్ స్మిత్ చేతినుండి అందుకున్న ఒక దీవెనలో, ప్రభువు అతనికి ఈ వాగ్ధానం చేశారు: “నీ శత్రువుల చేతిలో నుండి తప్పించుకునే శక్తి నీవు కలిగియున్నావు. నీ ప్రాణం నిరంతరాయమైన ఉత్సాహంతో వెదకబడుతుంది, కానీ నీవు దానిని తప్పించుకోగలవు. అయితే అది నీకు ఆనందాన్నిస్తే, దేవునికి మహిమ కలుగునట్లు, నీవు దానిని కోరుకుంటే నీ ప్రాణాన్ని స్వచ్ఛందంగా అర్పించే శక్తి నీవు కలిగియుంటావు”. 16

జూన్ 1844 లో, జీవించడానికి లేదా దేవుడిని మహిమపరచడానికి మరియు “తన సాక్ష్యాన్ని తన రక్తంతో ముద్రవేయడానికి” తన జీవితాన్ని—తన ప్రియమైన సోదరుడు జోసెఫ్ తో కలిసి జతగా అర్పించే ఎంపిక చేయడానికి హైరం అవకాశం ఇవ్వబడ్డాడు.17

గుర్తించకుండా ఉండడానికి వారి ముఖాలకు రంగులు పూసుకున్న పిరికివారైన సాయుధ గుంపు చేత క్రూరంగా వారు హత్య చేయబడిన కార్తేజ్‌ నిర్ణీతయాత్రకు ఒక వారం ముందు, జోసెఫ్ ఇలా నమోదు చేశాడు: “నేను నా సోదరుడు హైరంకు తన కుటుంబాన్ని తీసుకొని తదుపరి స్టీమ్‌బోట్‌లో సిన్సినాటికి వెళ్ళిపోమని సలహా ఇచ్చాను.”

“జోసెఫ్, నేను నిన్ను విడిచిపోలేను” అని హైరం ఇచ్చిన సమాధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పటికీ నేను గొప్ప ఉద్రిక్తతను అనుభవిస్తాను.18

కాబట్టి జోసెఫ్, హైరంలు క్రీస్తు హేతువు మరియు నామము కొరకు వారు హతసాక్షులు కాబడిన కార్తేజ్ కు వెళ్ళారు.

హతసాక్షుల అధికారిక ప్రకటన క్రింది విధంగా చెప్పబడింది: “ప్రభువు యొక్క ప్రవక్త, దీర్ఘదర్శియైన జోసెఫ్ స్మిత్, … మోర్మన్ గ్రంథమును వెలుగులోనికి తెచ్చెను, ఆయన దానిని దేవుని యొక్క వరము మరియు శక్తిచేత అనువదించి, అది రెండు ఖండములపై ప్రచురించబడుటకు కారకుడాయెను; అది కలిగియున్న నిత్య సువార్త యొక్క సంపూర్ణతను భూమి నలుమూలలకు పంపెను; ఈ సిద్ధాంతము మరియు నిబంధనల గ్రంథమును కూర్పుచేయు బయల్పాటులు, ఆజ్ఞలను, మనుష్యకుమారుల ప్రయోజనము కొరకు జ్ఞానముతో నిండిన అనేక పత్రములను, సూచనలను వెలుగులోనికి తెచ్చెను; వేలకొలది కడవరి-దిన పరిశుద్ధులను సమకూర్చి, గొప్ప పట్టణమును నిర్మించి, నాశనము చేయజాలని పేరు ప్రఖ్యాతులను వదిలివెళ్ళెను. … ప్రాచీన కాలములో ప్రభువు అభిషేకించిన వారిలో అనేకమందివలే [జోసెఫ్] తన పరిచర్యను, తన కార్యములను తన రక్తముతో ముద్రించాడు; అతని సహోదరుడు హైరం కూడా ఆవిధముగానే చేసాడు. జీవించినంతవరకు వారు విడిపోలేదు, మరణమందు వారు వేరుచేయబడలేదు!19

హతసాక్షులైన తర్వాత, జోసెఫ్, హైరంల శరీరాలు స్మిత్ కుటుంబీకులు వారి ప్రియమైన వారిని చూచునట్లు నావూకు తీసుకురాబడి, కడగబడి, వస్త్రాధరణ చేయబడ్డాయి. వారి అమూల్యమైన తల్లి జ్ఞాపకం ఇలా చేసుకున్నది: “చాలాసేపు నేను నా ప్రతీ నరాన్ని, నాలోని శక్తినంతటిని కూడగట్టుకొని, నన్ను బలపరచమని దేవునికి మొరపెట్టుకున్నాను; కానీ నేను ఆ గదిలో ప్రవేశించి, నాకళ్లముందుండిన హతమార్చబడిన నా కుమారులను చూసినప్పుడు, నా కుటుంబం యొక్క బాధలను, మూలుగులను, [మరియు] వారి భార్యలు, పిల్లలు, సహోదర సహోదరీల పెదవుల నుండి వస్తున్న ఏడ్పులను … వినినప్పుడు, అది భరించలేనంతగా ఉండెను. కృంగిపోతూ, ప్రభువుకు నా ఆత్మ వేదనతో, ‘నా దేవా! నా దేవా! ఈ కుటుంబాన్ని ఎందుకు చేయివిడచితివి?’”20 అని ప్రార్థించాను.

ఆ విచారకరమైన, బాధాకరమైన క్షణంలో, వారు ఇలా చెప్తున్నట్లు ఆమె జ్ఞాపకం చేసుకున్నారు, “అమ్మా, మా గురించి ఏడ్వవద్దు; మేము లోకాన్ని ప్రేమతో జయించాము.” 21

వారు నిజంగా లోకాన్ని జయించియున్నారు. జోసెఫ్, హైరం స్మిత్ లు, ప్రకటన గ్రంథంలో వివరించబడిన విశ్వాసులైన పరిశుద్ధులవలే, “మహాశ్రమలనుండి వచ్చి; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి [మరియు] వారు … దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచుండిరి: సింహాసనాసీనుడైన వాడు తానే వారి మధ్యన నివసించును.

“వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు.

“ఏలయనగా సింహాసనం మధ్యనుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును: దేవుడే వారి కన్నులనుండి ప్రతి భాష్పబిందువును తుడిచి వేయును.“22

మనం మొదటి దర్శనం యొక్క 200వ వార్షికోత్సవమనే ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకుంటున్నప్పుడు మీరు, నేను అనేక దీవెనలను, ఈనాడు మనం కలిగియున్న ఈ బయల్పరచబడిన సత్యాలను అనుభవించునట్లు సంఘాన్ని స్థాపించుటకు విశ్వాసులైన ఇతర స్త్రీపురుషులు, పిల్లలతో పాటు జోసెఫ్, హైరం స్మిత్ లు చెల్లించిన వెలను మనమెల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. వారి విశ్వాసము ఎప్పటికి మరువబడకూడదు!

జోసెఫ్, హైరంలు మరియు వారి కుటుంబాలు ఎందుకు అంతగా బాధపడాలి అని నేను తరచు ఆశ్చర్యపడేవాడిని. తమ అనేక బాధల ద్వారా వారు దేవుడిని తెలుసుకున్నంతగా ఆ బాధలు లేకుండా తెలుసుకునేవారు కాదేమో. దాని ద్వారా, వారు గెత్సమనే తోటను, రక్షకుని సిలువను ప్రతిబింబించారు. పౌలు చెప్పినట్లుగా, “క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.”23

1844లో అతని మరణానికి ముందు, జోసెఫ్ పరిశుద్ధులకు ఆత్మతో నిండిన లేఖను వ్రాసెను. అది ఇప్పటికీ సంఘంలో కొనసాగే క్రియకు పిలుపు:

“సహోదర [సహోదరీల్లారా], ఇంత గొప్ప హేతువులో మనం ముందుకు సాగక ఉందుమా? వెనుకకు కాక ముందుకు సాగుడి. సహోదర [సహోదరీల్లారా] ధైర్యము తెచ్చుకొనుడి; జయము పొందుటకు ముందుకు సాగుడి! …

“… కావున ఒక సంఘముగా, జనులుగా, కడవరి-దిన పరిశుద్ధులుగా మనం, నీతిని అనుసరించి ప్రభువునకు ఒక అర్పణను అర్పించెదము.”24

ఈ వారాంతంలో 200వ వార్షికోత్సవమును జరుపుకొనుటలో ఆత్మనుండి మనం వినినప్పుడు, రాబోయే దినాలలో దేవునికి నీతితో ఏ అర్పణను అర్పించాలో మీరు ఆలోచించుకోండి. ధైర్యం కలిగియుండండి—మీరు విశ్వాసముంచే, అతి ప్రాముఖ్యమైన వారితో దానిని పంచుకోండి, దయచేసి సమయం తీసుకొని దానిని చేయండి!

ఆ గొప్ప సోదరులైన జోసెఫ్, హైరం స్మిత్ మరియు విశ్వాసులైన ఇతర పరిశుద్ధుల విశ్వాసపూర్వక అర్పణలపట్ల ఆయన సంతోషించినట్లే, నీతియుక్తంగా మన హృదయాలనుండి ఆయనకు అర్పణను సమర్పించినప్పుడు రక్షకుడు సంతోషిస్తారని నాకు తెలుసు. దీనిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నేను గంభీరంగా సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.