సర్వసభ్య సమావేశము
వారు చూచునట్లు
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


వారు చూచునట్లు

యేసు క్రీస్తు వైపు మార్గమును ఇతరులు చూచునట్లు మీ వెలుగును ప్రకాశింపజేసే అవకాశముల కోసం వెదకండి మరియు ప్రార్థించండి.

సహోదర సహోదరీలారా, ఈ సమావేశములో మనము అనుభవించిన ఆత్మ చేత మన హృదయాలు దీవించబడ్డాయి మరియు క్రొత్తవిగా చేయబడ్డాయి.

చిత్రం
వెలుగు స్తంభము

రెండు వందల సంవత్సరాల క్రితం, చెట్ల పొదలలో వెలుగు స్తంభమొకటి ఒక యువకునిపై నిలిచింది. ఆ వెలుగులో, జోసెఫ్ స్మిత్ తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును చూసాడు. వారి వెలుగు భూమిని కప్పిన ఆత్మీయ చీకటిని తరిమి వేసింది మరియు జోసెఫ్ స్మిత్‌కు—మనందరి కొరకు ముందుకు మార్గం చూపింది. ఆరోజు బయల్పరచబడిన వెలుగు వలన, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా లభ్యమయ్యే సంపూర్ణమైన దీవెనలను మనం పొందగలము.

ఆయన సువార్త పునఃస్థాపన యొక్క సుగుణము ద్వారా, మనము మన రక్షకుని యొక్క వెలుగుతో నింపబడగలము. అయినప్పటికినీ, ఆ వెలుగు మీకు, నాకు మాత్రమే ఉద్దేశించబడలేదు. “మీ సత్క్రియలను చూచి మరియు పరలోకమందున్న మీ తండ్రిని వారు మహిమపరచునట్లు ఈ జనుల యెదుట మీ వెలుగును అట్లు ప్రకాశించనియ్యుడి”1 అని యేసు క్రీస్తు మనల్ని పిలిచియున్నాడు. “వారు చూచునట్లు” పదసమూహాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇతరులు మార్గమును చూచి, తద్వారా క్రీస్తునొద్దకు వచ్చుటకు సహాయపడుట గురించి ఎక్కువ ఉద్దేశ్యపూర్వకంగా ఉండమని ప్రభువు నుండి వచ్చిన ముఖ్యమైన ఆహ్వానమది.

చిత్రం
ఎల్డర్ ఎల్. టామ్ పెర్రీ

నాకు 10 సంవత్సరాల వయస్సున్నప్పుడు, పన్నెండు మంది అపొస్తలుల సమూహములోని ఎల్డర్ ఎల్. టామ్ పెర్రీ పనిమీద మా స్వగ్రామానికి రాగా, ఆయనకి ఆతిధ్యమిచ్చే గౌరవము మా కుటుంబానికి కలిగింది.

రోజు ముగుస్తుండగా, ఎల్డర్ పెర్రీ ప్రపంచములోని పరిశుద్ధులను గూర్చి వృత్తాంతములను చెప్తుండగా, మా కుటుంబము మరియు పెర్రీ మా హాలు గదిలో కూర్చొని మా అమ్మ చేసిన రుచికరమైన ఆపిల్ పైను తింటున్నాము. నేను మంత్ర ముగ్ధురాలినయ్యాను.

అప్పటికే ఆలస్యం అవుతోంది, మా అమ్మ నన్ను వంటగదిలోకి పిలిచి, ఈ సాధారణమైన ప్రశ్న అడిగింది: “బోన్ని, కోళ్లకు ఆహారం పెట్టావా?”

హఠాత్తుగా ఆలోచించాను; నేను పెట్టలేదు. ప్రభువు యొక్క అపొస్తలుని సమక్షమును విడిచి వెళ్ళడం ఇష్టం లేక, ఉదయం వరకు కోళ్ళు ఉపవాసముంటాయని నేను సూచించాను.

“లేదు,” అని మా అమ్మ ఖచ్చితమైన జవాబిచ్చింది. అప్పుడే, ఎల్డర్ పెర్రీ వంటగదిలోకి వచ్చి, తన ఉరిమే, ఉత్సాహముగల స్వరముతో ఇలా అడిగారు, “ఎవరో కోళ్ళకు ఆహారమివ్వాల్సి ఉన్నదని నేను విన్నానా? నేను, నా కొడుకు, నీతో రామా?”

ఓహ్, కోళ్ళకు ఆహారమివ్వడం ఇప్పుడు ఎంత సంపూర్ణమైన ఆనందంగా మారింది! మా పెద్ద పసుపురంగు టార్చిలైటు తేవడానికి నేను పరుగెత్తాను. ఉత్సాహముతో, నేను గెంతుతూ, కోళ్ళ గూడుకు దారి చూపించాను. నా చేతిలో ఊగుతున్న టార్చిలైటుతో, మేము మొక్కజొన్న తోట దాటాము మరియు గోధుమ పొలమును దాటాము.

మార్గమును దాటి సన్నని నీటి కాలువను సమీపిస్తూ, నేను ఇంతకు ముందు ఎన్నో రాత్రులు చేసినట్లుగా సహజంగా దానిపై నుండి దూకాను. చీకటిలో తెలియని దారిలో నడవడానికి ఎల్డర్ పెర్రీ ప్రయత్నాలను నేను పూర్తిగా ఎరుగను. ఊగుతున్న నా వెలుగు గొయ్యి చూడడానికి ఆయనకు సహాయపడలేదు. స్థిరమైన వెలుగు లేకుండా, ఆయన నేరుగా నీటిలో అడుగు వేసారు మరియు గట్టిగా మూలిగారు. భయపడి, నేను వెనుదిరిగి గోతిలోనుండి పూర్తిగా తడిచిపోయిన పాదమును తీసి, తన బరువైన లెదరు బూటు నుండి నీటిని విదిలిస్తున్న నా క్రొత్త స్నేహితుని చూసాను.

పూర్తిగా తడిచి, నీళ్లు కారుతున్న బూటుతో ఎల్డర్ పెర్రీ కోళ్ళకు ఆహారమివ్వడంలో నాకు సహాయపడ్డారు. మేము పూర్తి చేసినప్పుడు, ఆయన ప్రేమగా సూచించారు, “బోన్ని, నేను దారిని చూడాల్సి ఉన్నది. నేను నడుస్తున్న చోట వెలుగు ప్రకాశించాల్సిన అవసరమున్నది.”

నేను నా వెలుగును ప్రకాశింప చేస్తున్నాను, కానీ ఎల్డర్ పెర్రీకి దారి చూపే విధానములో కాదు. ఇప్పుడు, దారిని సరిగ్గా చూపడానికి నా వెలుగు ఆయనకు అవసరమని ఎరిగి, ఆయన అడుగులకు ఎదురుగా టార్చిలైటును నేను కేంద్రీకరించాను మరియు మేము నమ్మకంతో ఇంటికి తిరిగి వెళ్ళగలిగాము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఎల్డర్ పెర్రీ నుండి నేను నేర్చుకున్న సూత్రమును సంవత్సరాలుగా నేను ధ్యానించాను. మన వెలుగును ప్రకాశించనివ్వమనే ప్రభువు యొక్క ఆహ్వానము, కాంతి కిరణాన్ని యాదృచ్ఛికంగా కదిలించడం మరియు లోకాన్ని సాధారణంగా ప్రకాశవంతంగా చేయడానికి మాత్రమే సంబంధించినది కాదు. అది క్రీస్తు వైపు మార్గమును ఇతరులు చూడగలుగునట్లు మన వెలుగును కేంద్రీకరించుటను గూర్చినది. అది తెరకు ఈవైపు ఇశ్రాయేలును సమకూర్చుట—దేవునితో పరిశుద్ధ నిబంధనలు చేసి, పాటించుటలో తదుపరి దశ ముందుకు చూడడానికి సహాయపడుట.2

“ఇదిగో నేను వెలుగునైయున్నాను; నేను మీ కొరకు ఒక ఉదాహరణ ఉంచియున్నాను,”3 అని రక్షకుడు సాక్ష్యమిచ్చారు. ఆయన మాదిరులలో ఒకదానిని చూద్దాం.

బావి వద్ద స్త్రీ యేసు క్రీస్తును ఎరుగని సమరయురాలు మరియు ఆమె స్వంత సమాజంలో అంటరానిదానిగా అనేకమంది చేత చూడబడింది. యేసు ఆమెను కలిసి, సంభాషణ ప్రారంభించారు. ఆయన ఆమెతో నీటి గురించి మాట్లాడారు. తరువాత ఆయన “జీవజలము”4 గా తనను తాను ప్రకటించినప్పుడు, హెచ్చించబడిన వెలుగుకు ఆమెను ఆయన నడిపించారు.

ఆమె మరియు ఆమె అవసరతలను క్రీస్తు కనికరముతో ఎరిగియున్నారు. ఆయన ఆమె ఉన్న చోట కలిసి, తెలిసిన మరియు సాధారణమైన దాని గురించి మాట్లాడడం ద్వారా ప్రారంభించారు. ఆయన అక్కడ ఆపి వుంటే, అది సానుకూలమైన అనుకోని సమావేశం అయ్యుండేది. కానీ ఆమె పట్టణంలోనికి వెళ్లి “వచ్చి, చూడుడి … : ఈయన క్రీస్తు కాడా?”5 అని ప్రకటించుట జరిగేది కాదు. సంభాషణ ద్వారా, క్రమంగా, ఆమె యేసు క్రీస్తును కనుగొన్నది, మరియు ఆమె గతమును లక్ష్యపెట్టకుండా, ఇతరులు చూచుటకు మార్గమును ప్రకాశింపజేస్తూ ఆమె వెలుగు యొక్క సాధనమైంది. 6

ఇప్పుడు వెలుగును ప్రకాశింపజేయుటలో రక్షకుని యొక్క మాదిరిని అనుసరించిన ఇద్దరు వ్యక్తులను మనము చూద్దాం. ఇటీవల నా స్నేహితుడు కెవిన్ రాత్రి భోజన సమయంలో ఒక వ్యాపార నిర్వాహకుడి ప్రక్కన కూర్చున్నాడు. రెండు గంటలు ఏమి మాట్లాడాలా అని అతడు చింతించాడు. ఒక ప్రేరేపణను అనుసరించి, కెవిన్ ఇలా అడిగాడు, “మీ కుటుంబం గురించి నాకు చెప్పండి. వారు ఎక్కడ నుండి వచ్చారు?”

ఆ మంచి వ్యక్తికి తన వారసత్వము గురించి ఎక్కువగా తెలియదు, కనుక కెవిన్ తన ఫోను తీసి, చెప్పాడు, “జనులను వారి కుటుంబాలతో జతపరచే ఒక యాప్ నా దగ్గరుంది. మనము ఏమి కనుగొనగలమో చూద్దాం.”

సుదీర్ఘమైన చర్చ తరువాత, కెవిన్ యొక్క క్రొత్త స్నేహితుడు అడిగాడు, “మీ సంఘానికి కుటుంబము ఎందుకు అంత ముఖ్యమైనది?”

కెవిన్ మామూలుగా జవాబిచ్చాడు, “మనము చనిపోయిన తరువాత జీవించడం కొనసాగిస్తామని మేము నమ్ముతాము. మన పూర్వీకులను మనము గుర్తించి, వారి పేర్లను దేవాలయమని పిలువబడిన పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళితే, మరణము తరువాత కూడా మన కుటుంబాలను కలిపియుంచే వివాహ విధులను మనం నిర్వహించగలము.”7

అతడికి, అతని క్రొత్త స్నేహితునికి ఉమ్మడిగా ఉన్న దానితో కెవిన్ ప్రారంభించాడు. తరువాత అతడు రక్షకుని యొక్క వెలుగును, ప్రేమను గూర్చి సాక్ష్యమివ్వడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు.

రెండవ వృత్తాంతము, ఒక సాంప్రదాయక బాస్కెట్ బాల్ క్రీడాకారిణి, ఎల్లా గూర్చినది. దూరంగా పాఠశాల వద్ద ఉండగా, ఆమె తన మిషను పిలుపు పొందినప్పుడు ఆమె మాదిరి ప్రారంభమైంది. తన జట్టు ఎదురుగా ఆమె పిలుపును తెరవాలని ఆమె కోరుకున్నది. వారికి యేసు క్రీస్తు యొక్క సంఘము గురించి దాదాపుగా ఏమీ తెలియదు మరియు సేవ చేయడానికి ఎల్లా కోరికను వారు గ్రహించలేదు. తన జట్టు సహచరులు పరిశుద్ధాత్మను అనుభూతి చెందే విధానములో తన మిషను గురించి ఎలా వివరించాలో తెలుసుకోవడానికి ఆమె పలుమార్లు ప్రార్థన చేసింది. ఆమె జవాబు?

“నేను ఒక పవర్ పాయింట్ చేసాను,” “ఎందుకంటే నేను చక్కగా చేయగలను,” అని చెప్పింది ఎల్లా. 400 పైగా మిషన్లలో ఒక దానిలో సేవ చేసే సాధ్యత మరియు ఒక భాషను నేర్చుకొనే అవకాశము గురించి ఆమె వారికి చెప్పింది. ఇదివరకే సేవ చేస్తున్న వేలమంది మిషనరీల గురించి ఆమె ప్రత్యేకంగా చెప్పింది. ఎల్లా రక్షకుని యొక్క చిత్రము మరియు ఈ క్లుప్తమైన సాక్ష్యముతో ముగించింది: “బాస్కెట్ బాల్ నా జీవితంలోని మిక్కిలి ముఖ్యమైన విషయాలలో ఒకటి.” ఈ కోచ్ మరియు ఈ జట్టుతో ఆడడానికి నేను దేశము దాటి నా కుటుంబమును విడిచి వచ్చాను. బాస్కెట్ బాల్ కంటే రెండు విషయాలు మాత్రమే నాకు ఎక్కువ ముఖ్యమైనవి, నా విశ్వాసము మరియు నా కుటుంబము.”

ఇప్పుడు ఒకవేళ మీరు, “ఇవి గొప్ప 1,000 వోల్టుల మాదిరులు, కాని నేను 20- వాల్టుల బల్బును,” అని ఆలోచిస్తున్నట్లయితే, “నేను మీరు ఎత్తిపట్టుకొను వెలుగునైయున్నాను,”9 అని రక్షకుడు సాక్ష్యమిచ్చాడని జ్ఞాపకముంచుకోండి. కేవలం మనం ఆయన వైపు ఇతరులను చూపిస్తే, వెలుగును తెస్తానని ఆయన మనకు జ్ఞాపకం చేసారు.

మీరు, నేను ఇప్పుడు పంచుకోవడానికి తగినంత వెలుగును కలిగియున్నాము. యేసు క్రీస్తుకు దగ్గరవడానికి ఎవరికైనా సహాయపడడానికి తరువాత దశను మరియు తదుపరి దశను, తరువాత మెట్టును మనము వెలిగించగలము.

మీకై మీరు ప్రశ్నించుకోండి, “వారు చూడలేనిది కానీ వారికి అవసరమైన బాటను కనుగొనడానికి మీరు కలిగియున్న వెలుగు ఎవరికి అవసరము?”

నా ప్రియమైన స్నేహితులారా, మన వెలుగును ప్రకాశింపజేయడం ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రభువు మనతో చెప్పారు, “ఇంకను భూమి మీద అనేకమంది జనులున్నారు … వారు సత్యమునుండి ఆపబడ్డారు, ఎందుకనగా దానిని ఎక్కడ కనుగొనాలో వారికి తెలియదు.”10 మనము సహాయపడగలము. ఇతరులు చూడగలుగునట్లు మన వెలుగును మనం ఉద్దేశపూర్వకంగా ప్రకాశింప చేయగలం. మనము ఒక ఆహ్వానము ఇవ్వగలము.11 ఆ అడుగు ఎంతగా నిలిచిపోతున్నప్పటికీ, రక్షకుని వైపు అడుగువేసే వారితో మనము నడవగలము. మనము ఇశ్రాయేలును సమకూర్చగలము.

ప్రభువు ప్రతీ చిన్న ప్రయత్నాన్ని నెరవేరుస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము చెప్పాల్సినది, చేయాల్సినది తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తాడు. అటువంటి ప్రయత్నాలకు మనము మన సౌకర్యాలను వదిలి రావలసియుండవచ్చు, కానీ మన వెలుగు ప్రకాశించడానికి ప్రభువు సహాయపడతారని మనము అభయమివ్వబడగలము.

బయల్పాటు ద్వారా ఈ సంఘాన్ని నడిపించుటను కొనసాగిస్తున్న రక్షకుని వెలుగు కొరకు నేను కృతజ్ఞురాలిని.

చిత్రం
దీపమును పట్టుకున్న రక్షకుడు

యేసు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించమని, మరియు మన చుట్టూ ఉన్నవారిని కనికరముతో తెలుసుకోమని మనందరిని నేను ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు వైపు మార్గమును ఇతరులు చూచునట్లు మీ వెలుగును ప్రకాశింపజేసే అవకాశముల కోసం వెదకండి మరియు ప్రార్థించండి. ఆయన వాగ్దానము గొప్పది: “నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగియుండును.”12 మన రక్షకుడైన యేసు క్రీస్తే మార్గము, సత్యము, జీవము, వెలుగు, మరియు లోకము యొక్క ప్రేమ అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.