సర్వసభ్య సమావేశము
ప్రవక్తలకు నిరంతర బయల్పాటు మరియు మన జీవితాలను నడిపించడానికి వ్యక్తిగత బయల్పాటు యొక్క దీవెన
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


ప్రవక్తలకు నిరంతర బయల్పాటు మరియు మన జీవితాలను నడిపించడానికి వ్యక్తిగత బయల్పాటు యొక్క దీవెన

నిరంతర బయల్పాటు పొందబడింది మరియు ప్రభువు ఏర్పాటు చేసిన మార్గాల గుండా పొందబడుతూ ఉన్నది.

ప్రవక్తలకు నిరంతర బయల్పాటు మరియు మన జీవితాలను నడిపించడానికి నిరంతర వ్యక్తిగత బయల్పాటు గురించి నేను ఈరోజు మాట్లాడతాను.

కొన్నిసార్లు ప్రభువు యొక్క ఉద్దేశాలు మనకు తెలియనప్పటికీ మనం బయల్పాటు పొందుతాము. 1994 జూన్ లో ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఒక అపొస్తలునిగా పిలువబడడానికి ముందు, ఆయన పిలువబడతారని నేను ఒక అందమైన ప్రకటనానుభవాన్ని కలిగియున్నాను. నేను ప్రాంతీయ ప్రతినిధిని మరియు ఆ జ్ఞానము నాకివ్వబడవలసిన కారణమేదీ నాకు కనిపించలేదు. కానీ 1960 ప్రారంభంలో ఇంగ్లండులో మేము యౌవన మిషనరీ సహవాసులం, ఆయనంటే నాకెంతో ప్రేమ. ఆ అనుభవాన్ని నాపట్ల మృదు కనికరముగా నేను యెంచాను. ఈ మధ్య కాలంలో, మేము యౌవన మిషనరీలుగా ఉన్నప్పుడు నా జూనియర్ సహవాసియైన ఒక అపురూపమైన మిషనరీ సహవాసికి పన్నెండుమందిలో నేను జూనియర్ గా ఉండేందుకు ప్రభువు నన్ను సిద్ధపరుస్తున్నారేమోనని నేను ఆశ్చర్యపడ్డాను. 1 తమ జూనియర్ సహవాసుల పట్ల దయతో మెలగమని కొన్నిసార్లు నేను యౌవన మిషనరీలను హెచ్చరిస్తాను, ఎందుకంటే వారు ఎప్పుడు వీరిపై సీనియర్ సహవాసులు కాగలరో వీరికి తెలియదు.

ఈ పునఃస్థాపించబడిన సంఘము మన రక్షకుడైన యేసు క్రీస్తు చేత నడిపించబడుతున్నదని నేను స్థిరమైన సాక్ష్యం కలిగియున్నాను. ఆయన అపొస్తలులుగా ఎవరిని పిలవాలి మరియు వారిని ఏ క్రమములో పిలవాలి అనేది ఆయనకు తెలుసు. తన సీనియర్ అపొస్తలుడిని ఒక ప్రవక్తగా, సంఘాధ్యక్షునిగా ఎలా సిద్ధం చేయాలో కూడా ఆయనకు తెలుసు.

ఈ ఉదయం మన ప్రియ ప్రవక్త రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు, యేసు క్రీస్తు యొక్క సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపనకు సంబంధించి ప్రపంచానికి ఒక గంభీరమైన ద్విశతాబ్ది ప్రకటనను ఇవ్వగా వినేందుకు మనం దీవించబడ్డాము.2 అధ్యక్షులు నెల్సన్ చేసిన ఈ ముఖ్య ప్రకటన, యేసు క్రీస్తు సంఘము దాని మూలము, ఉనికి మరియు భవిష్యత్తులో దిశ కొరకు నిరంతర బయల్పాటు సూత్రంపై ఆధారపడుతుందని స్పష్టం చేసింది. ఈ క్రొత్త ప్రకటన తన పిల్లలతో ప్రియమైన తండ్రి యొక్క సంభాషణను సూచిస్తుంది.

ఈనాడు నాకున్న భావాలనే మునుపటి రోజుల్లో అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ వ్యక్తం చేసారు. ఆయనిలా చెప్పారు: “అన్నింటిలోకి, … వాస్తవానికి పరలోకాలు తెరువబడినందుకు, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘము బయల్పాటు అనే బండపై కనుగొనబడినందుకు మనం అత్యంత కృతజ్ఞత కలిగియుండాలి. నిజానికి నిరంతర బయల్పాటు అనేది జీవముతోనున్న ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు సువార్తకు జీవనాధానరము.”3

మనం జీవించే రోజులను హనోకు ప్రవక్త ముందుగానే చూసాడు. గొప్ప దుష్టత్వం ప్రబలుతుందని ప్రభువు హనోకుకు తెలియజేసారు మరియు ”గొప్ప బాధ” కలుగునని ప్రవచించారు. “కాని నా జనులను నేను కాపాడెదను,“ అని ప్రభువు వాగ్దానమిచ్చారు.4 “పరలోకమునుండి నీతిని నేను క్రిందకు పంపుదును; నేను కనిన ఏకైక కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు భూమినుండి సత్యమును నేను పంపుదును.“5

మన మతము యొక్క ప్రధానరాయి అయిన మోర్మన్ గ్రంథము, హనోకుకు ప్రభువు చేసిన ప్రకటన యొక్క నెరవేర్పుగా భూమినుండి ముందుకు వచ్చిందని గొప్ప శక్తితో అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ బోధించారు. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కు తండ్రి, కుమారుడు, దేవదూతలు, ప్రవక్తలు ప్రత్యక్షమవడం అనేది “అవసరమైన శక్తులను రాజ్యానికి పునఃస్థాపించడానికి పరలోకం చేత నిర్దేశించబడినది.“6

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బయల్పాటు వెంబడి బయల్పాటును పొందారు. వాటిలో కొన్ని ఈ సమావేశంలో చెప్పబడ్డాయి. ప్రవక్తయైన జోసెఫ్ చేత పొందబడిన బయల్పాటులలో అనేకము మన కోసం సిద్ధాంతము మరియు నిబంధనలులో భద్రపరచబడ్డాయి. సంఘము యొక్క లేఖనాలన్నీ ఈ చివరి యుగంలో మన కోసం ప్రభువు యొక్క మనస్సును, చిత్తాన్ని కలిగియున్నాయి.7

ఈ గొప్ప పునాది గ్రంథాలకు అదనంగా, జీవించియున్న ప్రవక్తలకు నిరంతర బయల్పాటుతో మనం దీవించబడ్డాము. ప్రవక్తలు, “ఆయన కొరకు మాట్లాడేందుకు అధికారమివ్వబడి, ప్రభువు చేత నియమించబడిన ప్రతినిధులు.“8

కొన్ని బయల్పాటులు బృహత్తరమైన ప్రాముఖ్యత గలవి, మరికొన్ని ఆవశ్యకమైన దైవిక సత్యాల గురించి మన గ్రహింపును అధికంచేసి, మన రోజులకు నడిపింపును అందిస్తాయి.9

జూన్, 1978లో సంఘము యొక్క యోగ్యులైన పురుష సభ్యులందరికి యాజకత్వము మరియు దేవాలయ దీవెనలను విస్తరించాలని అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ గారికి వచ్చిన బయల్పాటు కొరకు మనం చాలా కృతజ్ఞులము.10

ఆ అమూల్యమైన బయల్పాటు పొందబడినప్పుడు అక్కడ ఉండి, పాల్గొనిన పన్నెండుమందిలో అనేకమందితో నేను సేవ చేసాను. అధ్యక్షులు కింబల్ మరియు వారు అనుభవించిన శక్తివంతమైన, ఐక్యపరచు ఆత్మీయ నడిపింపు గురించి వారిలో ప్రతిఒక్కరు వ్యక్తిగత సంభాషణలలో నిర్థారించారు. అది ఆ సమయమునకు ముందు లేక తరువాత వారు పొందిన అత్యంత శక్తివంతమైన బయల్పాటు అని అనేకులు చెప్పారు.11

మాలో ప్రస్తుతం పన్నెండుమంది అపొస్తలుల సమూహంలో సేవచేస్తున్నవారు, ఇటీవల ప్రవక్తల ద్వారా గణనీయమైన బయల్పాటులు వస్తుండగా మన రోజులలో దీవించబడ్డారు.12 ప్రత్యేకించి కుటుంబాలు తమ ఇళ్ళలో విశ్వాసపు పవిత్ర స్థలాలను నిర్మించడానికి, తెరకు ఇరువైపుల చెదరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చడానికి, వరము పొందిన సభ్యులను పరిశుద్ధ దేవాలయ విధుల విషయాల్లో దీవించడానికి సహాయపడేందుకు ఇవ్వబడిన బయల్పాటులకు సంబంధించి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రభువు చేత నియమించబడిన ప్రతినిధియై యున్నారు.

అక్టోబరు 2018 సర్వసభ్య సమావేశంలో మన గృహాలను దీవించడానికి ముఖ్యమైన మార్పులు ప్రకటించబడినప్పుడు, “మన ప్రియ ప్రవక్త బయల్పాటు కొరకు ప్రభువును అభ్యర్థించిన తర్వాత, … దేవాలయంలో ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సలహాసభ యొక్క ఆలోచనలలో … అందరిచేత ఒక శక్తివంతమైన నిర్థారణ పొందబడిందని,“13 నేను సాక్ష్యమిచ్చాను.

ఆ సమయంలో, పరిశుద్ధ దేవాలయ విధులకు సంబంధించిన ఇతర బయల్పాటులు పొందబడ్డాయి, కానీ ప్రకటించబడలేదు లేక అమలుపరచబడలేదు.14 అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ గారికి వ్యక్తిగత ప్రవచనాత్మక బయల్పాటుతో మరియు ఆ ప్రక్రియలో పాల్గొంటున్న వారికి మృదువైన, శక్తివంతమైన నిర్థారణతో ఈ నడిపింపు మొదలైంది. ఉపశమన సమాజము, యువతులు మరియు ప్రాథమిక నిర్మాణాలపై అధ్యక్షత వహించు సహోదరీలను ప్రత్యేకంగా చేర్చారు అధ్యక్షులు నెల్సన్. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు దేవాలయంలో చివరి నడిపింపు అత్యంత ఆత్మీయమైనది మరియు శక్తివంతమైనది. మేము ప్రభువు యొక్క మనస్సు, చిత్తము మరియు స్వరమును పొందామని మాలో ప్రతిఒక్కరికి తెలుసు.15

నిరంతర బయల్పాటు పొందబడిందని మరియు ప్రభువు ఏర్పాటు చేసిన మార్గాల గుండా పొందబడుతూ ఉన్నదని మనస్ఫూర్తిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ ఉదయం అధ్యక్షులు నెల్సన్ ఇచ్చిన క్రొత్త ప్రకటన జనులందరిని దీవించడానికి ఇవ్వబడిన బయల్పాటు అని నేను సాక్ష్యమిస్తున్నాను.

ప్రభువు బల్ల వద్ద విందారగించడానికి మేము అందరిని ఆహ్వానిస్తున్నాము.

తమ సాక్ష్యాలతో శ్రమపడుతున్న వారు, తక్కువ క్రియాశీలురు లేక సంఘ పుస్తకాలలో నుండి పేర్లు తొలగించబడిన వారందరితో తిరిగి ఏకమవ్వడానికి మా హృదయపూర్వక కోరికను కూడా మేము ప్రకటిస్తున్నాము. మనమందరం చేయవలసిన విషయాలను నేర్చుకోవడానికి ప్రభువు బల్ల వద్ద మీతో కలిసి, ”క్రీస్తు యొక్క మాటల” విందారగించాలని మేము కోరుతున్నాము.16 మాకు మీ అవసరముంది! సంఘానికి మీ అవసరముంది! ప్రభువుకు మీ అవసరముంది! లోకరక్షకుడిని ఆరాధించడంలో మీరు మాతో చేరాలనేది మా హృదయపూర్వక ప్రార్థన. మీలో కొందరు దౌర్జన్యాన్ని, నిర్దయను లేక క్రీస్తు వంటిది కాని మరేదైనా ప్రవర్తనను ఎదుర్కొనియుండవచ్చని మాకు తెలుసు. కొందరు తమ విశ్వాసానికి సంబంధించి పూర్తిగా అభినందించబడలేని, గ్రహించబడలేని లేక పరిష్కరించబడలేని సవాళ్ళను కలిగియున్నారని కూడా మాకు తెలుసు.

మన అత్యంత దృఢమైన, విశ్వాసులైన సభ్యులలో కొందరు కొంతకాలము తమ విశ్వాసానికి సవాళ్ళను ఎదుర్కొన్నారు. సంఘాన్ని విడిచిపెట్టి, మిస్సోరి కోర్టులో ప్రవక్త జోసెఫ్ స్మిత్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన డబ్ల్యు. డబ్ల్యు. ఫెల్ప్స్ యొక్క నిజమైన వృత్తాంతము నాకిష్టం. పశ్చాత్తాపపడిన తర్వాత, ఆయన జోసెఫ్ కు ఇలా వ్రాసారు, “నా పరిస్థితి నాకు తెలుసు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు, నా స్నేహితులు నాకు సహాయపడినట్లైతే, నేను రక్షింపబడాలనుకుంటున్నాను.“17 జోసెఫ్ అతన్ని క్షమించారు, తిరిగి పనిలో పెట్టుకొని, ప్రేమతో ఇలా వ్రాసారు, “మొదట స్నేహితులైనవారు మళ్ళీ చివరకు స్నేహితులే.“18

సహోదర సహోదరీలారా, మీ పరిస్థితి ఏదైనప్పటికీ, సంఘము మరియు దాని సభ్యులు మిమ్మల్ని తిరిగి స్వాగతిస్తారని దయచేసి తెలుసుకోండి!

మన జీవితాలను నడిపించడానికి వ్యక్తిగత బయల్పాటు

ప్రభువు నుండి వినయంతో నడిపింపును వెదికే వారందరికి వ్యక్తిగత బయల్పాటు లభ్యమవుతుంది. అది ప్రవచనాత్మక బయల్పాటంత ముఖ్యమైనది. బాప్తీస్మము తీసుకొని, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా నిర్థారించబడేందుకు అవసరమైన సాక్ష్యాన్ని పొందడంలో మిలియన్లమంది పరిశుద్ధాత్మ నుండి వ్యక్తిగత, ఆత్మీయ బయల్పాటు అందుకున్నారు.

వ్యక్తిగత బయల్పాటు అనేది మనము “పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధపరచబడినప్పుడు,“ బాప్తీస్మము తర్వాత అందుకొనే లోతైన దీవెన. 19 నేను 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిగిన ప్రత్యేక ఆత్మీయ బయల్పాటు నాకు గుర్తుంది. నా సహోదరుడు మిషను సేవ చేయరాదని కోరుకుంటున్న మా ప్రియమైన తండ్రికి ఎలా జవాబు చెప్పాలని అమూల్యమైన నా సోదరుడు ప్రభువు నుండి నడిపింపును వెదుకుతున్నాడు. నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాను మరియు సువార్త యొక్క యధార్థత గురించి వ్యక్తిగత బయల్పాటు పొందాను.

పరిశుద్ధాత్మ యొక్క పాత్ర

వ్యక్తిగత బయల్పాటు అనేది పరిశుద్ధాత్మ నుండి పొందబడిన ఆత్మీయ సత్యాలపై ఆధారపడుతుంది.20 పరిశుద్ధాత్మ సమస్త సత్యము గురించి, ప్రత్యేకించి రక్షకుని గురించి బయల్పరచువాడు మరియు సాక్ష్యమిచ్చువాడు. పరిశుద్ధాత్మ లేకుండా, యేసే క్రీస్తని నిజంగా మనము తెలుసుకోలేము. ఆయన ముఖ్యపాత్ర, తండ్రి, కుమారుడు మరియు వారి నామాలు, వారి మహిమ గురించి సాక్ష్యమివ్వడమే.

పరిశుద్ధాత్మ ప్రతిఒక్కరిని శక్తివంతమైన విధానంలో ప్రభావితం చేయగలడు.21 ఒకరు బాప్తీస్మము తీసుకొని, పరిశుద్ధాత్మ వరమును పొందితే తప్ప, ఈ ప్రభావము నిరంతరము ఉండదు. పశ్చాత్తాపము మరియు క్షమాపణ ప్రక్రియలో శుద్ధిచేయు సాధనంగా కూడా పరిశుద్ధాత్మ పనిచేస్తాడు.

ఆత్మ అద్భుతమైన విధానాలలో సంభాషిస్తుంది. ప్రభువు ఈ అందమైన వర్ణనను ఉపయోగించారు:

“నేను నీ మనస్సులోను నీ హృదయములోను పరిశుద్ధాత్మ ద్వారా చెప్పెదను, అది నీ మీదికి వచ్చి, నీ హృదయమందు నివశించును.

“ఇప్పుడు ఇదిగో, ఇదియే బయల్పాటు ఆత్మ.”22

దాని ప్రభావము నమ్మశక్యం కానంత శక్తివంతమైనప్పటికీ, చాలా తరచుగా అది నిర్మలమైన స్వరములా వస్తుంది.23 ఆత్మ మన మనస్సులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే దానికి గల అనేక మాదిరులలో మన మనస్సుకు శాంతిని కలుగజేయుట,24 మన మనస్సును ఆక్రమించుట,25 మన మనస్సులను వెలిగించుట,26 మరియు ఒక స్వరమును మన మనస్సులోకి పంపుట27 వంటి వాటిని లేఖనములు కలిగియున్నాయి.

బయల్పాటు పొందడానికి మనల్ని సిద్ధపరిచే కొన్ని నియమాలు:

  • ఆత్మీయ నడిపింపు కొరకు ప్రార్థించుట. భక్తితో వినయంగా మనం వెదకాలి, అడగాలి 28 మరియు సహనముతో లోబడియుండాలి.29

  • ప్రేరేపణ కొరకు సిద్ధపడుట. దీనికి మనం ప్రభువు యొక్క బోధనలతో ఏకీభవించి, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా ఉండడం అవసరం.

  • యోగ్యులుగా సంస్కారమందు పాలుపంచుకొనుట. మనం దీనిని చేసినప్పుడు, ఆయన పరిశుద్ధ కుమారుని నామమును మనపైకి తీసుకుంటామని, ఆయనను జ్ఞాపకముంచుకుంటామని మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తామని మనం దేవునికి సాక్ష్యమిచ్చి, ఆయనతో నిబంధన చేస్తాము.

ఈ నియమాలు పరిశుద్ధాత్మను పొందడానికి, గుర్తించడానికి, ప్రేరేపణను నడిపింపును అనుసరించడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. వీటిలో “శాంతికరమైన విషయములు … అనగా సంతోషమును తెచ్చునవి, [మరియు] నిత్యజీవమును తెచ్చునవి“ 30 కలిపియున్నాయి.

మనం క్రమం తప్పక లేఖనాలను, సువార్త సత్యాలను చదివి, మనం వెదుకుతున్న నడిపింపును మన మనస్సుల్లో ధ్యానించినప్పుడు మన ఆత్మీయ సిద్ధపాటు గొప్పగా మెరుగుపరచబడుతుంది. కానీ సహనంతో ఉండాలని, ప్రభువు యుక్తకాలమందు నమ్మకముంచాలని జ్ఞాపకముంచుకోండి. ఆయన “ఉద్దేశపూర్వకంగా మనకు సూచనలివ్వాలని యెంచుకున్నప్పుడు,“ 31 సర్వజ్ఞుడైన ప్రభువు చేత నడిపింపు ఇవ్వబడుతుంది.

మన పిలుపులు మరియు నియామకాల్లో బయల్పాటు

మన పిలుపులు మరియు నియామకాల్లో కూడా పరిశుద్ధాత్మ బయల్పాటును అందిస్తాడు. నా అనుభవంలో, చాలా తరచుగా మన బాధ్యతలను నెరవేర్చడంలో ఇతరులను దీవించడానికి ప్రయత్నించినప్పుడు విశేషమైన ఆత్మీయ నడిపింపు వస్తుంది.

వ్యాపారనిమిత్తం పనిమీద విమానంలో ప్రయాణించడానికి కొద్ది సమయం ముందు యౌవన బిషప్పుగా ఒక జంట నుండి నిరాశ నిండిన పిలుపు అందుకోవడం నాకు గుర్తుంది. నేను వారిని ఎలా దీవించగలనో తెలుసుకోవడానికి, వారు రావడానికి ముందు నేను ప్రభువును అర్థించాను. సమస్య యొక్క స్వభావము మరియు నేను చెప్పవలసిన సమాధానము నాకు బయల్పరచబడ్డాయి. అతికొద్ది సమయం ఉన్నప్పటికీ, ఒక బిషప్పుగా నా పిలుపు యొక్క పరిశుద్ధ బాధ్యతలను నెరవేర్చడానికి ఆ బయల్పాటుతో కూడిన నడిపింపు నన్ను అనుమతించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్పులు కూడా ఇదే విధమైన అనుభవాలను నాతో పంచుకుంటారు. ఒక స్టేకు అధ్యక్షునిగా ముఖ్యమైన బయల్పాటును పొందడం మాత్రమే కాకుండా, ప్రభువు యొక్క ఉద్దేశాలను సాధించడానికి అవసరమైన వ్యక్తిగత సవరణను కూడా నేను పొందుతాను.

మనం వినయంతో ప్రభువు యొక్క ద్రాక్షతోటలో పనిచేసినప్పుడు, మనలో ప్రతిఒక్కరి చేత ఆ బయల్పాటుతో కూడిన నడిపింపు అందుకోబడుతుందని నేను హామీ ఇస్తున్నాను. మన నడిపింపులో అధికము పరిశుద్ధాత్మ నుండి వస్తుంది. కొన్నిసార్లు మరియు కొన్ని ఉద్దేశాల కొరకు అది తిన్నగా ప్రభువు నుండి వస్తుంది. ఇది సత్యమని వ్యక్తిగతంగా నేను సాక్ష్యమిస్తున్నాను. మొత్తంగా సంఘం కొరకు నడిపింపు, సంఘం యొక్క అధ్యక్షుడు మరియు ప్రవక్తకు వస్తుంది.

ఆధునిక అపొస్తలులుగా మేము మన ప్రస్తుత ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్ గారితో ప్రయాణిస్తూ, పనిచేసే విశేషాధికారమును కలిగియున్నాము. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ గురించి విల్ఫర్డ్ ఉడ్రఫ్ చెప్పిన దానిని నేను వ్యాఖ్యానిస్తాను; అది అధ్యక్షులు నెల్సన్ విషయంలో అంతే నిజమైనది. “దేవుని ఆత్మ అతనితో పనిచేయడాన్ని, యేసు క్రీస్తు యొక్క బయల్పాటులు అతనికి రావడాన్ని మరియు ఆ బయల్పాటుల నెరవేర్పును“ 32నేను చూసాను.

మన జీవితాలను నడిపించడానికి మనలో ప్రతిఒక్కరు నిరంతర బయల్పాటును వెదకాలని, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో తండ్రియైన దేవుని ఆరాధించినప్పుడు ఆత్మను అనుసరించాలనేది నేడు నా వినయపూర్వక అభ్యర్థన, వారి గురించి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. 1960లో మిషనరీ సేవ కొరకు యువకుల వయోపరిమితి 20 నుండి 19 సంవత్సరాలకు తగ్గించబడినప్పుడు, 20 ఏళ్ళ వయస్సు వారిలో నేను చివరివాడిని; ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ 19 ఏళ్ళ వయస్సు వారిలో మొదటివాడు.

  2. “యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచమునకు ఒక ద్విశతాబ్ది ప్రకటన,” రస్సెల్ ఎం. నెల్సన్, “ఆయనను వినుము,” లియహోనా, మే 2020, 91 లో చూడండి. ఈ ప్రకటన, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము చేత ఈ యుగములో ఇవ్వబడిన ఇతర ఐదింటితో చేరుతుంది.

  3. Teachings of Presidents of the Church: Spencer W. Kimball (2006), 243; మత్తయి 16:13–19 కూడా చూడండి.

  4. మోషే 7:61 చూడండి.

  5. మోషే 7:62 చూడండి. “భూమి నలుమూలల నుండి నేను ఎన్నుకొనిన వారిని పోగుచేయుటకు నీతియు, సత్యమును వరదవలె భూమిని ముంచివేయునట్లు చేయుదును,“ అని ప్రభువు కొనసాగించారు (మోషే 7:62; కీర్తన 85:11 కూడా చూడండి).

  6. ఎజ్రా టాఫ్ట్ బెన్సన్, “The Gift of Modern Revelation,” Ensign, Nov. 1986, 80.

  7. ఎజ్రా టాఫ్ట్ బెన్సన్, “The Gift of Modern Revelation,” 80 కూడా చూడండి.

  8. హ్యు బి. బ్రౌన్, “Joseph Smith among the Prophets” (Sixteenth Annual Joseph Smith Memorial Sermon, Logan Institute of Religion, Dec. 7, 1958), 7.

  9. హ్యు బి. బ్రౌన్, “Joseph Smith among the Prophets,” 7 చూడండి. అన్ని సందర్భాలలో బయల్పాటులు, మునుపటి ప్రవక్తలకు ఇవ్వబడిన దేవుని వాక్యముతో సరిపోలి ఉన్నాయి.

  10. అధికారిక ప్రకటన 2 చూడండి; 2 నీఫై 26:33 కూడా చూడండి. “నల్లవాడు, తెల్లవాడు, దాసుడు, స్వతంత్రుడు, పురుషుడు మరియు స్త్రీతో“ కలిపి “అందరు దేవునికి ఒకే రీతిగా ఉన్నారు,“ (2 నీఫై 26:33) అని మోర్మన్ గ్రంథములో నిర్దేశించిన సిద్ధాంతాన్ని ఆ బయల్పాటు అమలుపరిచింది. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సలహాసభ చేత సాల్ట్ లేక్ దేవాలయపు పరిశుద్ధ పై గదిలో ఈ విశేషమైన బయల్పాటు పొందబడి, నిర్థారించబడింది.

  11. ఆ బయల్పాటు ఎంత శక్తివంతంగా, పరిశుద్ధంగా ఉందంటే దానిని వర్థించడానికి ఎన్ని మాటలైనా సరిపోవని మరియు కొన్ని రకాలుగా బయల్పాటు యొక్క లోతైన, శక్తివంతమైన స్వభావాన్ని నీరుగారుస్తాయని అపొస్తలులలో అనేకులు చెప్పారు.

  12. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” Liahona, May 2017, 145 చూడుము. ఈ ప్రకటన అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి గారిచే సెప్టెంబరు 23, 1995లో సాల్ట్ లేక్ సిటీ, యూటాలో ప్రధాన ఉపశమన సమాజ సమావేశములో ప్రకటించబడింది. See also Thomas S. Monson, “Welcome to Conference,” Liahona, Nov. 2012, 4–5. మిషనరీ సేవకు తక్కువ వయోపరిమితిని అధ్యక్షులు మాన్సన్ ప్రకటించారు.

  13. క్వింటిన్ ఎల్. కుక్, “పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తునకు లోతైన, శాశ్వతమైన పరివర్తన,“ లియహోనా, నవ. 2018, 11 చూడండి.

  14. పరిశుద్ధ దేవాలయ విధులకు సంబంధించిన బయల్పాటులు అన్ని దేవాలయాల్లో జనవరి 1, 2019 నుండి అమలుపరచడం మొదలైంది. దేవాలయ విధుల గురించి నిర్దిష్టమైన వివరాలు కేవలం దేవాలయంలోనే చర్చించబడతాయని గ్రహించడం ముఖ్యము. అయినప్పటికీ, నియమాలు బోధించబడ్డాయి. దేవాలయ నిబంధనలు మరియు విధుల ప్రాముఖ్యత గురించి, వాటి ద్వారా ఏ విధంగా ”దైవత్వపు శక్తి మన జీవితాల్లోకి ప్రవహించగలదు” అని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ అందంగా బోధించారు (“Let This House Be Built unto My Name,” Liahona, May 2020, 86).

  15. ఈ ప్రక్రియ మరియు సమావేశాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, మరియు ఏప్రిల్ 2018లో సాల్ట్ లేక్ దేవాలయంలో జరిగాయి. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహానికి చివరి బయల్పాటు ఏప్రిల్ 26, 2018న వచ్చింది.

  16. 2 నీఫై 32:3 చూడండి.

  17. పరిశుద్ధులు: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల కథ, ,సం. 1, సత్యము యొక్క ప్రమాణము, 1815–1846 (2018), 418.

  18. పరిశుద్ధులు, 1:418.

  19. 3 నీఫై 27:20.

  20. పరిశుద్ధాత్మ, దైవసమూహము యొక్క సభ్యుడు (1 యోహాను 5:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:28 చూడండి). అతడు మనిషి ఆకారం మరియు పోలికలో ఆత్మ శరీరాన్ని కలిగియున్నాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22 చూడండి). అతని ప్రభావము ప్రతిచోట ఉండగలదు. అతడు ఉద్దేశములో మన పరలోక తండ్రితో మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తుతో ఏకమైయున్నాడు.

  21. క్రీస్తు యొక్క వెలుగు గురించి మరియు క్రీస్తు యొక్క వెలుగుకు పరిశుద్ధాత్మకు మధ్య తేడా గురించి వివరణాత్మక గ్రహింపు కొరకు 2 నీఫై 32; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:7, 11–13; “Light of Christ,” Bible Dictionary చూడండి. బాయిడ్ కె. పాకర్, “The Light of Christ,” Liahona, Apr. 2005, 8–14 కూడా చూడండి

  22. సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2–3 చూడండి.

  23. హీలమన్ 5:30; సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6 చూడండి.

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:23 చూడండి.

  25. సిద్ధాంతము మరియు నిబంధనలు 128:1 చూడండి.

  26. సిద్ధాంతము మరియు నిబంధనలు 11:13 చూడండి.

  27. ఈనస్ 1:10 చూడండి.

  28. మత్తయి 7:7–8 చూడండి.

  29. మోషైయ 3:19 చూడండి.

  30. సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61 చూడండి.

  31. నీల్ ఎ. మాక్స్ వెల్, All These Things Shall Give Thee Experience (2007), 31.

  32. విల్ఫర్డ్ ఉడ్రఫ్, in Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 283