లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 121


121వ ప్రకరణము

1839, మార్చి 20న లిబర్టీ, మిస్సోరి చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు సంఘమునకు ఒక పత్రికగా ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత వ్రాయబడిన ప్రార్థన మరియు ప్రవచనములు. ప్రవక్త మరియు అనేకమంది సహచరులు నెలల తరబడి చెరసాలలో యుండిరి. కార్యనిర్వహణ అధికారికి, రాష్ట్ర న్యాయాధిపతుల సముదాయమునకు పంపబడిన అర్జీలు, అప్పీళ్ళు వారికి ఉపశమనమును కలిగించుటలో విఫలమయ్యెను.

1–6, శ్రమపడుచున్న పరిశుద్ధుల కొరకు ప్రవక్త ప్రభువును వేడుకొనును; 7–10, ప్రభువు అతనికి శాంతికర వర్తమానమును పలికెను; 11–17, వారు అపరాధము చేసిరని ప్రభువు జనులకు విరోధముగా, అబద్ధముగా ప్రకటించు వారందరు శపించబడుదురు; 18–25, వారు యాజకత్వమును పొందుటకు హక్కును కలిగియుండక నిరాకరింపబడుదురు; 26–32, పరాక్రమముతో అంతమువరకు సహించు వారికి మహిమకర బయల్పాటులు వాగ్దానము చేయబడెను; 33–40, ఎందుకు అనేకులు పిలువబడి, కొందరే ఎన్నుకోబడిరి; 41–46, యాజకత్వమును నీతితో మాత్రమే ఉపయోగించవలెను.

1 ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు? నిన్ను మరుగుపరచు స్థలమును కప్పియుంచు తెర ఎక్కడనున్నది?

2 ఎంతకాలము నీ హస్తము నిలిచియుండును, అనంతమైన పరలోకమునుండి నీ కన్నులు, నిర్మలమైన నీ కన్నులు నీ జనుల యెడల, నీ సేవకుల యెడల జరిగిన తప్పదములను వీక్షించుచుండును మరియు వారి అంగలార్పులను నీవు ఆలకించుచుందువు?

3 అవును, ఓ ప్రభువా, నీ హృదయము వారి యెడల సున్నితమై, నీ ఆంత్రములు వారి యెడల జాలి కలిగియుండుటకు ముందు ఎంతకాలము వారు ఈ తప్పిదములను, అన్యాయపు హింసలను సహించవలెను?

4 ఓ ప్రభువా, సర్వశక్తిగల దేవా, పరలోకము, భూమి, సముద్రములు వాటిలోనున్న సమస్తము యొక్క రూపకర్త, అపవాదిని షీయోలు యొక్క చీకటి అంధకార రాజ్యమును నియంత్రించి, లోబరచుకొనువాడా—నీ బాహువును చాపుము; నీ కన్నును చొచ్చుకొనిపోనిమ్ము; నీ తెర తీసివేయబడును గాక; నిన్ను మరుగుపరచు స్థలము ఇకపై కప్పబడియుండనీయకుము; నీ చెవిని విననీయుము; నీ హృదయము సున్నితమై, మా యెడల నీ ఆంత్రములు జాలితో కదిలింపబడనియ్యుము.

5 మా శత్రువులపై నీ కోపము రగులుకొననిమ్ము; నీ హృదయపు ఉగ్రతయందు, నీ ఖడ్గముతో మా యెడల జరిగిన తప్పిదములకు ప్రతీకారము తీర్చుకొనుము.

6 ఓ మా దేవా, బాధపడుచున్న నీ పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుము; నీ సేవకులు నీ నామమందు నిరంతరము ఆనందించెదరు.

7 నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక; నీ లేమి, నీ కష్టములు కొంతకాలమే ఉండును;

8 దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును; నీ శత్రువులందరి పైన నీవు జయము పొందెదవు.

9 నీ స్నేహితులు నీ ప్రక్కన నిలిచియుందురు, వారు మరలా వెచ్చని హృదయాలతో, స్నేహపూరిత హస్తాలతో నిన్ను ఘనపరిచెదరు.

10 నీవింకను యోబు వలే కాలేదు; వారు యోబుకు చేసియున్నట్లు నీ స్నేహితులు నీతో వ్యాజ్యమాడలేదు, అపరాధమును మోపలేదు.

11 నీవు అపరాధివని నేరము మోపువారి ఆశ భంగమగును, వారి నిరీక్షణ ఉదయించు సూర్యుని కిరణముల యెదుట కరిగిపోవు మంచువలె కరిగిపోవును;

12 సమయములను, కాలములను మార్చుటకు, ఆయన కార్యములను వారు గ్రహింపకుండునట్లు వారి మనస్సులకు గ్రుడ్డితనము కలుగజేయుటకు, దేవుడు తన హస్తమును, ముద్రను సిద్ధము చేసెను; తద్వారా ఆయన వారిని పరీక్షించి, తమ మోసక్రియలయందు వారిని పట్టుకొనును;

13 వారి హృదయములు చెడిపోయెను గనుక, ఇతరులపైకి వారు తేవలెనని కోరు సంగతులు, ఇతరులు బాధపడుటను ఇష్టపడుట, అవన్నియు వారిమీదకే వచ్చును గాక;

14 తద్వారా వారు నిరాశచెంది, వారి ఆశలు నాశనమగును గాక;

15 ఇంకను అనేక సంవత్సరములు గడువక మునుపే, ప్రాకారము దగ్గర నిలుచుటకు వారిలో ఒక్కడును విడువబడకుండా వారి సంతానము ఆకాశము క్రింద తుడిచివేయబడునని దేవుడు సెలవిచ్చుచున్నాడు.

16 నేను అభిషేకించిన వారి యెడల కాలిమడమ త్రిప్పువాడు శపించబడునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు, వారు నా యెదుట పాపము చేయకుండినను వారు పాపము చేసిరని వారందురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు, కానీ నా దృష్టిలో సరియైనదానిని, నేను వారికాజ్ఞాపించిన దానిని వారు చేసిరి.

17 కానీ అపరాధము చేసిరని చెప్పువారే దానిని చేసియున్నారు, ఎందుకనగా వారు పాపమునకు దాసులు, వారు అవిధేయతకు కుమారులు.

18 వారిని చెరలోనికి, మరణమునకు నడిపించుటకు నా సేవకులకు విరోధముగా అసత్యముగా ప్రమాణము చేయువారు—

19 వారికి శ్రమ; ఏలయనగా నా చిన్నవారిని వారు అభ్యంతరపరచిరి గనుక వారు నా మందిరపు విధులను పొందకుండా వేరుచేయబడుదురు.

20 వారి గంప నిండదు, వారి గృహములు వారి ధాన్యపుకొట్లు నాశనమగును, వారిని పొగిడిన వారిచే వారు కొట్టబడుదురు.

21 వారు లేదా వారి సంతానము తరతరాలకు యాజకత్వము పొందు హక్కును కలిగియుండరు.

22 వారి మెడలకు తిరుగటి రాయి కట్టబడి, మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వారికి మేలు.

23 నా జనులకు ఇబ్బంది కలిగించి, తరిమి, చంపివేసి, వారికి విరోధముగా సాక్ష్యము చెప్పువారందరికి శ్రమ అని సైన్యములకధిపతియైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు; నరకపు శిక్షను సర్పసంతానము తప్పించుకొనలేదు.

24 ఇదిగో, వారి క్రియలన్నింటిని నా కన్నులు చూచి, తెలుసుకొనుచున్నవి, వారందరికి తగిన కాలములో తీర్పును నేను సిద్ధపరచియున్నాను;

25 ఏలయనగా ప్రతి మనుష్యునికి వాని క్రియల చొప్పున ఒక సమయము ఏర్పాటు చేయబడియున్నది.

26 తన పరిశుద్ధాత్మ వలన దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహించును, అవును, ప్రపంచము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బయలుపరచబడని వాటిని మాటలతో వర్ణించలేని పరిశుద్ధాత్మ వరము వలన అనుగ్రహించును;

27 అంతిమ కాలములలో బయలుపరచబడు వాటి కొరకు మన పితరులు మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుకొనియుండిరి, వారి మహిమ కొరకు అవి దాచిపెట్టబడినందున వాటికొరకు దేవదూతలచేత వారి మనసులు త్రిప్పబడెను;

28 ఏదియు దాచబడకుండా ఉండు సమయములో అవి వచ్చును, ఒక్క దేవుడు ఉన్నాడో లేదా అనేకమంది దేవుళ్ళు ఉన్నారో అనేది వారికి ప్రత్యక్షపరచబడును.

29 సమస్త సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు బయలుపరచబడి, యేసు క్రీస్తు సువార్త కొరకు పరాక్రమముతో అంతము వరకు సహించు వారందరిపైన ప్రోక్షించబడును.

30 ఆకాశములకు లేదా సముద్రములకు, లేదా నేలకు లేదా సూర్య చంద్ర నక్షత్రములకు హద్దులు నియమించబడిన యెడల—

31 వాటి భ్రమణ కాలములన్నియు, నియమించబడిన దినములు, నెలలు, సంవత్సరములన్నియు, వాటి జీవితకాల దినములు, నెలలు, సంవత్సరములన్నియు, వాటి మహిమలు, నియమములు, నియమించబడిన కాలములు సంపూర్ణ కాలముల యుగము యొక్క దినములలో బయలుపరచబడును—

32 ఈ లోకము ఉనికిలోనికి రాకముందు ఇతర దేవుళ్ళందరిని పాలించు నిత్య దేవుని సలహాసభలో నియమించబడిన దాని ప్రకారము, ప్రతి మనుష్యుడు ఆయన నిత్య సన్నిధిలోనికి, అమర్త్య విశ్రాంతిలోనికి ప్రవేశించునప్పుడు, ముగింపు మరియు అంతము వరకు అవి దాచబడవలెను.

33 ప్రవహించు జలములు ఎంతకాలము కల్మషముగా ఉండగలవు? ఏ శక్తులు పరలోకమును ఆపగలవు? అదేవిధముగా మిస్సోరి నదిని అది ప్రవహించు దిశలో ఆపుటకు మనుష్యుడు తన బలహీన హస్తమును చాపి, దాని ప్రవాహ దిశను మార్చలేనట్టే, కడవరి దిన పరిశుద్ధుల తలలపై పరలోకము నుండి జ్ఞానమును క్రుమ్మరించకుండా సర్వశక్తుడిని ఆపలేరు.

34 ఇదిగో, పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. వారెందుకు ఎన్నుకోబడలేదు?

35 ఎందుకనగా వారి హృదయాలు లోక విషయములపైన ఎంతగానో ఉంచబడి, మనుష్యుల సన్మానములను వారు కోరెదరు, కానీ ఈ ఒక్క పాఠమును వారు నేర్చుకోరు—

36 అదేమనగా యాజకత్వపు హక్కులు పరలోక శక్తులతో వేరు చేయబడలేకుండా కలుపబడియున్నవి, పరలోక శక్తులను నీతి సూత్రములతో తప్ప నియంత్రించలేము లేదా వినియోగించలేము.

37 అవి మనపైన అనుగ్రహించబడును, ఇది సత్యము; కానీ మన పాపములను కప్పుకొనుటకు మనము ప్రయత్నించినప్పుడు, లేదా మన గర్వమును, మన వ్యర్థమైన ఆలోచనను సమర్థించుకొనుటకు లేదా ఏవిధమైన అవినీతియందైనను నరుల సంతానము యొక్క ఆత్మలపైన నియంత్రణ లేదా అధికారము చేయుటకు లేదా బలవంతము చేయుటకు ప్రయత్నించినప్పుడు, ఇదిగో, పరలోకములు వాటంతట అవి వెనుకకు తీసుకొనబడును; ప్రభువు ఆత్మ దుఃఖపడును; అది వెనుకకు తీసుకొనబడినప్పుడు, ఆ మనుష్యుని యాజకత్వమునకు లేదా అధికారమునకు అది ముగింపు అగును.

38 ఇదిగో, అతడు గ్రహింపక మునుపే, వ్యర్థముగా పోరాడుటకు, పరిశుద్ధులను హింసించుటకు, దేవునికి విరోధముగా యుద్ధము చేయుటకు అతడు విడిచిపెట్టబడును.

39 కొంచెము అధికారమును పొందిన వెంటనే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని, తక్షణమే అవినీతితో ఏలుబడి చేయుటను ఆరంభించుట దాదాపు మనుష్యులందరి స్వభావము మరియు వైఖరియని కొన్ని విచారకరమైన అనుభవముల నుండి మనము నేర్చుకొనియున్నాము.

40 కాబట్టి, పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే.

41 కేవలము ప్రేరేపణతో, దీర్ఘ శాంతముతో, మృదుత్వముతో, సాత్వికముతో, నిష్కపటమైన ప్రేమతో తప్ప, యాజకత్వపు సుగుణము చేత ఏ శక్తి లేదా ప్రభావము అమలుపరచబడలేదు లేదా అమలుపరచబడకూడదు;

42 దయతో, నిర్మలమైన జ్ఞానముతో, వేషధారణ లేకుండా, మోసము లేకుండా అది ఆత్మను మిక్కిలి వృద్ధిచేయును—

43 పరిశుద్ధాత్మచేత కదిలింపబడినప్పుడు సరియైన సమయములో కఠినముగా మందలించవలెను, తరువాత నీవు మందలించిన వానియెడల మరింత ప్రేమను చూపవలెను, లేనియెడల అతడు నిన్ను తన శత్రువుగా యెంచును;

44 తద్వారా మరణపాశముల కంటె నీ విశ్వాస్యత గొప్పదని అతడు తెలుసుకొనును.

45 నీ ఆంత్రములు మనుష్యులందరి యెడల, విశ్వాస గృహము యెడల దాతృత్వముతో నిండనీయుము, నీ ఆలోచనలు నిరంతరము సుగుణముతో అలంకరింపబడనీయము; అప్పుడు నీ ఆత్మస్థైర్యము దేవుని సముఖమందు బలమైనదిగా ఎదుగును; యాజకత్వపు సిద్ధాంతము ఆకాశమునుండి కురియు మంచుబిందువుల వలే నీ ఆత్మమీదకు దిగివచ్చును.

46 పరిశుద్ధాత్మ నీ స్థిర సహచరునిగాయుండును, నీ దండము నీతి సత్యముల యొక్క మారని దండముగానుండును; నీ ఏలుబడి నిత్య ఏలుబడిగానుండును, బలవంతము లేకుండా నిరంతరము అది నీ యొద్దకు ప్రవహించును.