2010–2019
ప్రభువునందు నమ్మకముంచుము
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


ప్రభువునందు నమ్మకముంచుము

ప్రభువునందు, ఆయన తన పిల్లల కొరకుగల ప్రేమయందు నమ్మకముంచుటయే మన యొక్క నిశ్చయమైన ఆధారము.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, కొంతకాలం క్రితం నేను పొందిన ఒక ఉత్తరము నేను ప్రసంగించే విషయాన్ని పరిచయం చేస్తుంది. తన నిత్యత్వ సహచరి మరణించిన ఒక వ్యక్తితో దేవాలయ వివాహం గూర్చి రచయత ఆలోచిస్తున్నారు. ఆమె రెండవ భార్య కాబోతోంది. ఆమె ఈ ప్రశ్నను అడిగింది: రాబోయే జీవితంలో ఆమె తన స్వంత గృహాన్ని కలిగియుంటుందా, లేదా ఆమె తన భర్త, అతని మొదటి భార్యతోపాటు జీవించాలా? ప్రభువునందు నమ్మకముంచమని నేను ఆమెతో చెప్పాను.

నాతో గొప్ప అనుబంధమున్న ఒక వ్యక్తి నుండి వినిన ఒక అనుభవాన్ని, అతని అనుమతితో పంచుకుంటూ కొనసాగిస్తాను. తన పిల్లలకు తల్లి మరియు తన ప్రియమైన భార్య యొక్క మరణం తర్వాత, ఒక తండ్రి తిరిగి వివాహం చేసుకున్నాడు. పిల్లలలో ఎదిగిన వారు రెండవ వివాహానికి బలంగా అభ్యంతరం తెలిపి, వారి దగ్గరి బంధువు, గౌరవనీయుడైన సంఘ నాయకుడి సలహాను కోరారు. ఆత్మలోకంలోని అనుబంధాలు, పరిస్థితులు లేదా అంతిమ తీర్పును అనుసరించే మహిమ రాజ్యాలపై కేెంద్రీకృతమైన వారి అభ్యంతరాలకు కారణాలను విన్న తర్వాత, ఈ నాయకుడు ఇలా చెప్పాడు: “మీరు తప్పు విషయాలను గూర్చి బాధపడుతున్నారు. మీరు ఆ ప్రదేశాలకు వెళ్లగలరా లేరా అనే దాని గురించి మీరు బాధపడాలి. దానిపై దృష్టిసారించండి. మీరు అక్కడికి వెళ్లినప్పుడు, సమస్తము మీరు ఊహించుకొన్న దానికన్నా అధ్బుతంగా ఉంటుంది” అని చెప్పాడు.

అది ఎంతటి ఓదార్చే బోధన! ప్రభువునందు నమ్మకముంచండి!

నేను పొందిన లేఖల నుండి, మనం మరణించిన తర్వాత, మనము పునరుత్థాఃనము చెందక ముందు మనం నివసించే ఆత్మ లోకం గూర్చిన ప్రశ్నలతో ఇతరులు కూడా ఇబ్బందిపడుతున్నారని నేనెరుగుదును. కొందరు ఆత్మ లోకం ఈ మర్త్యజీవితంలో మనము అనుభవించే అనేకమైన భౌతిక పరిస్థితులు, సమస్యలతో కొనసాగుతుందని భావిస్తారు. ఆత్మ లోకంలోని పరిస్థితులను గూర్చి నిజంగా మనకు ఏమి తెలుసు? ఈ విషయంపై బి వై యు మత పండితుని యొక్క వ్యాసం సరైనదని నేను నమ్ముతున్నాను: “లేఖనాలనుండి ఆత్మ లోకం గూర్చి మనకేమి తెలుసని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు, దాని జవాబు, ‘మనం ఊహించుకున్నంత కాదు’”1

అవును, మన శరీరాలు మరణించిన తర్వాత మనం ఆత్మలుగా ఆత్మ లోకంలో జీవిస్తాయని లేఖనాలనుండి మనమెరుగుదుము. ఈ ఆత్మ లోకం జీవితంలో “నీతిమంతులుగా” లేదా “న్యాయముగా” ఉన్నవారికి మరియు దుష్టులుగా ఉన్నవారికి మధ్య విభజించబడిందని కూడా లేఖనాలు బోధిస్తాయి. దుష్టులు లేదా తిరుగుబాటు చేసిన వారికి కొందరు విశ్వాసులైన ఆత్మలు సువార్తను ఏవిధంగా బోధిస్తారో 1 పేతురు 3:19;సిద్ధాంతము మరియు నిబంధనలు 138:19–20, 29, 32, 37 కూడా అవి వివరిస్తాయి అతి ముఖ్యంగా, ఆధునిక బయల్పాటులు ఆత్మ లోకంలో రక్షణకార్యం ముందుకు సాగుతుందని బయల్పరుస్తాయి(సిద్ధాంతము మరియు నిబంధనలు 138:30–34, 58 చూడుము), మనం మర్త్యత్వంలో పశ్చాత్తాపపడుటను వాయిదా వేయకూడదని ప్రేరేపించబడినప్పటికీ (ఆల్మా 13:27 చూడుము), అక్కడ పశ్చాత్తాపపడుటకు కొంచెం అవకాశం కలదని మనం బోధించబడ్ఢాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:58 చూడుము).

ఆత్మ లోకంలోని రక్షణ కార్యము లేఖనాలలో తరచూ వివరించబడే “దాస్యం” నుండి ఆత్మలను విడిపించుటను కలిగియున్నది. ఆత్మ లోకంలో అందరూ ఏదోక రూపమైన దాస్యములో ఉన్నారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 138వ ప్రకరణంగా నమోదుచేయబడిన అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ యొక్క గొప్ప బయల్పాటు, “ప్రశాంతమైన” సిద్ధాంతము మరియు నిబంధనలు 138:22 స్థితిలోనున్న నీతిమంతులైన మృతులు, పునరుత్థాఃనము కొరకు వారు ఎదురుచూస్తున్నప్పుడు(సిద్ధాంతము మరియు నిబంధనలు 138:16 చూడుము), “వారి ఆత్మలు తమ శరీరాలనుండి ఎంతోకాలం నుండి విడిగానుండుటను వారు చెరగా భావించిరి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:50) అని చెప్పుచున్నది.

దుష్టులు మరియొక దాస్యమును కూడా భరిస్తారు. పశ్చాత్తాపపడని పాపముల వలన, అపోస్తలుడైన పేతురు సూచించే ఆత్మల “చెరసాల”లో వారు ఉంటారు (1 పేతురు 3:19; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:42 కూడా చూడుము.) ఈ ఆత్మలు “బంధించబడిన” లేదా “చెరపట్టబడినవి” గా (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:31, 42), లేదా వారు పునరుత్థాఃనము మరియు తీర్పు కొరకు వేచి చూస్తున్నప్పుడు, “ఏడ్చుచూ, రోదించుచు, పండ్లుకొరకుచూ,” “వెలుపలి అంధకారంలోనికి త్రోసివేయబడినవిగా” (ఆల్మా 40:13–14) వివరించబడినవి.

అది వివిధ గుంపులకు వివిధ సమయాలలో సంభవించినప్పటికినీ, యేసుక్రీస్తు పునరుత్థాఃనము చేత ఆత్మ లోకంలోని వారందరి పునరుత్థాఃనము అభయమివ్వబడింది (1 కొరింథీ 15:22 చూడుము). ఆ నియమించబడిన సమయం వరకు, లేఖనాలలో చెప్పబడినట్లుగా ఆత్మ లోకంలో జరిగే ముఖ్యమైన కార్యము రక్షణకార్యము గూర్చినది ఇంకొంచెం బయల్పరచబడింది. సువార్త అమాయకులకు, పశ్చాత్తాపపడని వారికి, తిరుగుబాటుదారులకు ప్రకటించబడుతుంది, ఆవిధంగా వారు తమ దాస్యము నుండి విడిపించబడి, ప్రియమైన పరలోకతండ్రి వారి కొరకు భద్రపరచిన దీవెనలకు వద్దకు ముందుకు సాగెదరు.

ఆత్మలలోకంలో మారుమనస్సు పొందిన నీతిమంతులైన ఆత్మల చెర ఏదనగా భూమిపై వారికి ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే విధుల ద్వారా వారు బాప్తీస్మం పొంది, పరిశుద్ధాత్మ దీవెనలను అనుభవించుట కొరకు వారు వేచిచూచుట మరియు ప్రేరేపించుటకు అనుమతించబడుటైయున్నది.(సిద్ధాంతము మరియు నిబంధనలు 138:30–37, 57–58 చూడుము).2 ఈ మర్త్యత్వపు ప్రత్యామ్నాయ విధులు వారిని యాజకత్వపు అధికారంతో ముందుకు సాగి చెరలోనున్న ఆత్మలకు సువార్తను బోధించే నీతిమంతుల సైన్యం విస్తరించునట్లు చేయుటకు శక్తినిస్తాయి.

ఈ ప్రాధమికాంశాలు తప్ప, మన లేఖనాలు మరణం తర్వాత, అంతిమ తీర్పుకు ముందు వచ్చే ఆత్మ లోకం గూర్చి చాలా తక్కువగా కలిగియున్నాయి.3 అయితే మనం ఆత్మ లోకం గురించి ఇంకా ఏమి తెలుసుకున్నాము? సంఘం యొక్క అనేక సభ్యులు ఆత్మ లోకం ఏవిధంగా ఏర్పరచబడింది లేదా సంగతులు ఏవిధంగా నడపబడుతున్నాయనే దాని గూర్చిన దర్శనాలను, వారికి సమాచారమిచ్చే ఇతర ప్రేరేపణలను పొందియున్నారు, కానీ ఈ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలు సంఘ అధికారిక సిద్ధాంతాలుగా గ్రహించబడి లేదా బోధింపబడరాదు. మరియు, అంతేకాకుండా, మృత్యు సమీప అనుభవాలపై ముంద్రించబడిన పుస్తకాల వంటి వనరులందు సభ్యులు, ఇతరులచేత విస్తారమైన ఊహాగానాలు కూడా ఉన్నాయి.4

వీటన్నింటికీ, మునుపటి సర్వసభ్య సమావేశాలలో ఎల్డర్లు డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఏండర్సన్ ఇచ్చిన తెలివైన జాగ్రత్తలను జ్ఞాపకంముంచుకొనుట ముఖ్యమైనది. ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ ఇలా అన్నారు: “గతంలో గాని లేదా ప్రస్తుతంలో గానీ సంఘనాయకుని చేత చెప్పబడిన వ్యాఖ్యానము అవశ్యకంగా సిద్ధాంతం కానవసరం లేదని జ్ఞాపకముంచుకోవాలి. సహజంగా సంఘంలో ఒక నాయకుడు ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యానం అధికారికంగా లేదా సంఘమంతటికీ వర్తించేదిగా కాకుండా, తరచుగా ఒక వ్యక్తిగతమైన, బాగా ఆలోచించబడిన, భావముగా సాధారణంగా గ్రహించబడింది.”5

గత సమావేశంలో, ఎల్డర్ ఏండర్సన్ ఈ సూత్రాన్ని బోధించారు: “సిద్ధాంతము ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది సమూహపు సభ్యులు మొత్తం 15 మంది చేత బోధించబడుతుంది. అది ఒకరి ప్రసంగంలో నిగూఢ భాగంలో దాగియుండదు.”6 15 మంది ప్రవక్తలు, ధీర్ఘదర్శులు, బయల్పాటుదారులచే సంతకం చేయబడిన కుటుంబం ఒక ప్రకటన, ఆ సూత్రం యొక్క అద్భుతమైన దృష్టాంతము.

కుటుంబ ప్రకటన వంటి లాంఛానప్రాయమైన దానికంటే, ఇతర ప్రవక్తలు, అపోస్తలులచే నిర్ధారించబడిన సంఘాధ్యక్షుల ప్రవచనాత్మక బోధనలు కూడా దీనికి ఒక ఉదాహరణ. ఆత్మ లోకంలోని పరిస్థితులకనుగుణంగా, అతని పరిచర్య చివరి దశలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ బోధించిన రెండు బోధనలు ఆయన తర్వాత వచ్చిన నాయకులచే తరచూ బోధించబడ్డాయి. వాటిలో ఒకటి కింగ్ ఫోలెట్ ప్రసంగంలో అతడు నీతిమంతులైన కుటుంబ సభ్యులు ఆత్మల లోకంలో కలిసియుంటారని బోధించినది.7 అతడి జీవితపు చివరి సంవత్సరం, ఒక అంత్యక్రియల కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్య: “న్యాయవంతుల ఆత్మలు మక్కిలి గొప్ప, ఇంకా మహిమకరమైన కార్యానికి … ఆత్మల లోకం[లో] మహోన్నతపరచబడతాయి. … వారు మననుండి ఎంతో దూరంలో లేరు, మన ఆలోచనలను, భావాలను, నడవడికలను అర్థం చేసుకొని దానివలన తరచూ బాధపడుతూ ఉంటారు.”8

అయితే, ఆత్మలు ఎక్కడ నివసిస్తాయని ముందు నేను ప్రస్థావించిన ప్రశ్న యొక్క మాట ఏమిటి? మీకా ప్రశ్న వింతగా లేదా అల్పమైనదిగా అనిపిస్తే, మీ స్వంత ప్రశ్నలను, లేదా గతంలో వేరొక వ్యక్తి నుండి మీరు వినిన దాని ఆదారంగా మీరు సమాధానమిచ్చుటకు ప్రయత్నించిన వాటిని పరిగణించండి. ఆత్మ లోకం గూర్చిన అన్ని ప్రశ్నలకు, నేను రెండు సమాధానాలు సూచిస్తున్నాను. మొదటిది, దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నారని, మనలో ప్రతి ఒక్కరికీ శ్రేయమైన దానిని తప్పక చేస్తారని జ్ఞాపకముంచుకొనండి. రెండవది, జవాబు దొరకని అనేక ప్రశ్నలపై నాకు చాలా సహాయకరమైనది, ఈ పరిచయమైన బైబిల్ బోధనను జ్ఞాపకముంచుకొనండి:

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.

“నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును”(సామెతలు 3:5–6).

అదేవిధంగా, నీఫై తన గొప్ప కీర్తనను ఈ వాక్యములతో ముగించెను: “ఓ ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచియున్నాను, నేను శాశ్వతంగా నీయందు నమ్మిక యుంచెదను. శరీర బాహువందు నేను నమ్మికయుంచను” (2 నీఫై 4:34).

మనమంతా ఆత్మ లోకంలోని పరిస్థితులను గూర్చి ఏకాంతంగా విస్మయమొందవచ్చు, లేదా వీటిని లేదా జవాబివ్వబడని ఇతర ప్రశ్నలను కుటుంబంలో లేదా ఇతర ప్రత్యేక సన్నివేశాలలో చర్చించవచ్చు. కానీ అధికారిక సిద్ధాంతము యొక్క ప్రమాణాలకు అనుగుణంగా లేని దేనిని అధికార సిద్ధాంతంగా బోధించవద్దు లేదా ఉపయోగించవద్దు. అలా చేయడం దేవుని కార్యాన్ని వృద్ధి చెందనివ్వదు, మరియు మనలో ప్రతీఒక్కరికి ప్రభువు యొక్క ప్రణాళిక అనుగ్రహించు వ్యక్తిగత బయల్పాటు నుండి వచ్చే ఆదరణ లేదా జ్ఞానాభివృద్ధిని వెదకుట నుండి వ్యక్తులను నిరుత్సాహపరుస్తుంది. వ్యక్తిగత బోధనలు లేదా ఊహాకల్పనలపై అత్యధికంగా ఆధారపడుట మనలను నేర్చుకొనుట, మన గ్రహింపును అధికంచేసి నిబంధన బాటలో మనం ముందుకు సాగుటకు సహాయపడే ప్రయత్నాలపై కేంద్రీకరించుట నుండి మనలను ప్రక్కత్రోవపట్టిస్తాయి.

యేసుక్రీస్తు కడవరి దిన పరిశుద్ధుల సంఘంలో ప్రభువునందు నమ్మకముంచుట అనునది చాలా సుపరిచితమైన, నిజమైన బోధన. పూర్వపు విశ్వాసులు గొప్ప శ్రమలను, అధిగమించలేని అడ్ఢంకులను అనుభవించినప్పుడు జోసెఫ్ స్మిత్ బోధించినది అది.9 ఇంకనూ బయల్పరచబడని విషయాలను లేదా సంఘ అధికారిక సిద్ధాంతంగా అంగీకరించబడని వాటిని నేర్చుకొనేందుకు మన ప్రయత్నాలు లేదా ఆదరణను కనుగొనుటకు మన ప్రయత్నాలు అడ్ఢంకులను ఎదుర్కొన్నప్పుడు ఇది అత్యుత్తమమైన సూత్రం.

అదే సూత్రం బంధింపబడుటను గూర్చి జవాబివ్వబడని ప్రశ్నలకు లేదా మర్త్యత్వంలోని అతిక్రమాలకు లేదా సంఘటనల వలన కోరబడే సర్దుబాటులకు వర్తిస్తుంది. మనకు తెలియంది చాలా ఉన్నది, అది ప్రభువునందు, ఆయన తన పిల్లల కొరకుగల ప్రేమయందు నమ్మకముంచుటయే మన యొక్క నిశ్చయమైన ఆదారము.

ముగింపులో, ఆత్మ లోకం గురించి మనకు తెలిసినదేమిటంటే అక్కడ తండ్రి, కుమారుల రక్షణకార్యం కొనసాగుతుంది. మన రక్షకుడు చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించేకార్యాన్ని ఆరంభించారు (1 పేతురు 3:18-19; 4:6; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:6–11, 18–21, 28–37 చూడుము), మరియు ఆ కార్యము అర్హులైన వార్తావహులు ఇంకా పరిశుద్ధపరచబడవలసిన అవసరమున్న వారికి పశ్చాత్తాపమును కలిగియున్న సువార్తను ప్రకటించినప్పుడు కొనసాగుతుందిసిద్ధాంతము మరియు నిబంధనలు 138:57). దాని సమస్తము యొక్క ఉద్దేశము ఆధునిక బయల్పాటులో ఇవ్వబడిన సంఘ అధికార సిద్ధాంతములో వివరించబడింది.

“పశ్చాత్తాపపడిన మృతులు, దేవుని మందిరంలోని విధులకు విధేయులగుట ద్వారా విమోచించబడుదురు,

“వారు తమ అతిక్రమములకు పరిహారం చెల్లించిన తర్వాత, శుద్ధి చేయబడి, వారు రక్షణ యొక్క వారసులు కనుక వారి క్రియల ప్రకారము బహుమానమును పొందుదురు.” (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:58–59).

పునఃరుద్ధరింపబడిన సువార్త సిద్ధాంతమును బోధించుట, ఆజ్ఞలను పాటించుట, ఒకరినొకరు ప్రేమించి సహాయం చేసుకొనుట, మరియు పరిశుద్ధ దేవాలయాలలో రక్షణకార్యాన్ని చేయుట మనలో ప్రతి ఒక్కరి బాధ్యత.

నేను ఇక్కడ చెప్పిన సత్యమును గూర్చి, ఈ సమావేశంలో బోధింపబడిన సత్యాలను గూర్చి, బోధింపబడబోవు సత్యాలను గూర్చి సాక్ష్యమిస్తున్నాను. ఇదంతా యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం వలననే సాధ్యపరచబడెను. ఆధునిక బయల్పాటుల నుండి మనకు తెలిసినట్లుగా, ఆయన “తండ్రిని మహిమపరచి, ఆయన హస్త కార్యములన్నింటినీ రక్షించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:43; వివరణ చేర్చబడినది). యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “What’s on the Other Side? A Conversation with Brent L. Top on the Spirit World,” Religious Educator, vol. 14, no. 2 (2013), 48.

  2. See Teachings of the Prophet Joseph Smith, sel. Joseph Fielding Smith (1976), 309–10; Joseph Smith, “Journal, December 1842–June 1844; Book 2,” p. 246, The Joseph Smith Papers, josephsmithpapers.org.

  3. జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన బయల్పాటు ఆత్మ లోకము గురించి తరచుగా వ్యాఖ్యానించబడినది ఇలా వివరించును, “ఇక్కడ మనమధ్య ఉన్న అదే స్నేహము అక్కడ మన మధ్య ఉండును,” (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:2). ఇది ఆత్మ లోకము కంటే ఒక రాజ్యము యొక్క మహిమను వివరించవచ్చు, అది కొనసాగును కనుక, “కేవలము అది నిత్య మహిమతో జతపరచబడును, ఆ మహిమను మనము ఇప్పుడు ఆనందించము.” (2 వచనము).

  4. ఉదాహరణకు, George G. Ritchie, Return from Tomorrow (1978) and Raymond Moody, Life after Life (1975).

  5. డి. టాడ్ క్రిస్టాఫర్సన్, “క్రీస్తు సిద్ధాంతము,” లియహోనా, మే 2012, 88; Joseph F. Smith, Gospel Doctrine, 5th ed. (1939), 42 కూడా చూడుము. ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 74:5 లోని వివరణ అపొస్తులుడైన పౌలు యొక్క వ్యక్తిగత బోధనను గూర్చి చూడుము.

  6. నీల్ ఎల్. ఏండర్సన్, “మీ విశ్వాసము యొక్క పరీక్ష,” లియహోనా, నవం. 2012, 41.

  7. See Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 175.

  8. History of the Church, 6:52; included in Teachings of the Prophet Joseph Smith, 326; often quoted, as in Henry B. Eyring, To Draw Closer to God (1997), 122; see also Teachings of Presidents of the Church: Brigham Young (1997), chapter 38, “The Spirit World.”

  9. See Teachings: Joseph Smith, 231–33.