2010–2019
పరిశుద్ధుల యొక్క సంతోషము
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


పరిశుద్ధుల యొక్క సంతోషము

క్రీస్తు యొక్క ఆజ్ఞలు పాటించుట వలన, ఆయన ద్వారా దుఃఖము, బలహీనతను జయించుట వలన, ఆయన సేవ చేసినట్లుగా సేవ చేయుట వలన సంతోషము కలుగుతుంది.

లీహై మనవడు, మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన ఈనస్ తన జీవితములో యౌవనములో జరిగిన ఒక అసాధారణమైన అనుభవము గురించి వ్రాసెను. ఒంటరిగా అడవిలో ఉండి, ఈనస్ తన తండ్రియైన జేకబ్ బోధనలను గూర్చి లోతుగా ధ్యానించుట మొదలుపెట్టెను. “నేను తరచుగా నా తండ్రి నిత్యజీవము మరియు పరిశుద్ధుల యొక్క సంతోషమును గూర్చి పలుకగా వినిన మాటలు నా హృదయములో లోతుగా నాటుకున్నవి”1 అని అతడు వివరించెను. తన ఆత్మ యొక్క ఆత్మీయ ఆకలియందు, ఈనస్ మోకరించి ప్రార్థించెను, అది ఉదయము నుండి రాత్రి వరకు కొనసాగిన విశిష్టమైన ప్రార్థన, ఆ ప్రార్థన అతడికి కీలకమైన బయల్పాటులు, అభయములు మరియు వాగ్దానములను తెచ్చెను.

ఈనస్ అనుభవము నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది, కానీ నేడు నా మనస్సులో ఉన్న అతిముఖ్యమైన విషయము తన తండ్రి తరచుగా “పరిశుద్ధుల యొక్క సంతోషము”2 గురించి మాట్లాడటం గురించి ఈనస్‌ జ్ఞాపకముంచుకొనుట.

మూడు సంవత్సరాల క్రితం ఈ సర్వసభ్య సమావేశములో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మాట్లాడారు. 2 ఇతర విషయాలతో పాటు, ఆయన ఇలా చెప్పారు:

“మనం పొందే ఆనందం మన జీవితపు పరిస్థితులపైన తక్కువగా ఆధారపడును కాని మన జీవితము యొక్క దృష్టిసారింపుపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

“మన జీవితాల యొక్క దృష్టిసారింపు దేవుని రక్షణ ప్రణాళికపైన … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపైన ఆధారపడి ఉన్నప్పుడు, మన జీవితాలలో ఏది జరిగిన—లేదా ఏది జరగకపోయినా మనం సంతోషాన్ని అనుభవించగలము. సంతోషము ఆయన నుండి ఆయన వలన కలుగుతుంది. … కడవరి దిన పరిశుద్ధులకు, యేసు క్రీస్తే సంతోషము!”3

పరిశుద్ధులు అనగా బాప్తీస్మము ద్వారా సువార్త నిబంధనలోకి ప్రవేశించి, ఆయన శిష్యులవలె క్రీస్తును అనుసరించుటకు ప్రయాసపడుతున్నవారు.4 కాబట్టి, “పరిశుద్ధుల యొక్క సంతోషము” క్రీస్తువలె అగుటవలన కలిగే సంతోషమును సూచిస్తుంది.

ఆయన ఆజ్ఞలు పాటించుట వలన కలిగే సంతోషము, ఆయన ద్వారా దుఃఖము, బలహీనతను జయించే సంతోషము, ఆయన సేవ చేసినట్లుగానే సేవ చేయుట వలన కలిగే సంతోషము గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను.

క్రీస్తు యొక్క ఆజ్ఞలు పాటించుట వలన కలిగే సంతోషము

అనేకమంది ప్రభువు యొక్క ఆజ్ఞల ప్రాముఖ్యతను ప్రశ్నించుట లేదా కేవలం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, ఆనందాన్ని వెదికే యుగములో మనం జీవిస్తున్నాము, తక్కువ తరచుగా, ఉద్దేశపూర్వకముగా పవిత్రత చట్టము, నిజాయితీగా ఉండు ప్రమాణము, సబ్బాతు దినము యొక్క పరిశుద్ధత వంటి దివ్యమైన ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయువారు కొన్నిసార్లు విధేయతగా ఉండుటకు ప్రయాసపడుతున్న వారికంటే ఎక్కువగా వర్థిల్లుచున్నట్లు, జీవితము యొక్క మంచి విషయాలను ఆనందిస్తున్నట్లు కనిపించును. ఆ ప్రయత్నము మరియు త్యాగములు చేయుటకు యోగ్యమైనవా అని కొంతమంది ఆలోచించడం మొదలుపెడతారు. ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి ఫిర్యాదు చేసారు:

“దేవునికి సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన విధిని గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటవలన ప్రయోజనమేమి?

“గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పు కొనుచున్నారు.”5

వేచియుండండి, “నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు” అని ప్రభువు చెప్పుచున్నారు. … “అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.”6 దుష్టులు “వారి క్రియలయందు వారు కొంత కాలము సంతోషము కలిగియుందురు,” కాని అది ఎల్లప్పుడు తాత్కాలికమే.7 పరిశుద్ధుల యొక్క సంతోషము శాశ్వతమైనది.

దేవుడు సంగతులను వాటి నిజమైన దృష్టితో చూస్తారు, మరియు ఆయన ఆ దృష్టికోణమును తన ఆజ్ఞల ద్వారా మనతో పంచుకుంటారు, నిత్య సంతోషము వైపు తీసుకొని వెళ్ళు మర్త్యత్వము యొక్క ఊహించని, చూడని కష్టాల గురించి ప్రభావవంతముగా నడిపిస్తారు. ప్రవక్త జోసెఫ్ స్మిత్ వివరించాడు: “ఆయన ఆజ్ఞలు మనకు బోధించినప్పుడు, అది నిత్యత్వమును గూర్చి దృష్టిలో ఉన్నాయి, ఏలయనగా మనము నిత్యత్వములో ఉన్నట్లుగా దేవుని చేత చూడబడ్డాము.”8

తన జీవితములో తరువాత దశలో సువార్తను కనుగొని, కాస్త ముందుగా కనుగొని ఉంటే బాగుండునని కోరని వారినెవరిని నేను కలువలేదు. “ఓ, చెడు ఎంపికలను మరియు తప్పిదాలను నేను చెయ్యకుండా ఉండేవాడ్ని,” అని వారు చెప్తారు. మేలైన ఎంపికలు మరియు సంతోషకరమైన ఫలితాలకు ప్రభువు యొక్క ఆజ్ఞలు మనకు మార్గదర్శి. ఈ మరింత శ్రేష్టమైన మార్గాన్ని మనకు చూపినందుకు మనమెంతగానో సంతోషించి, ఆయనకు కృతజ్ఞత తెలుపవలెను.

చిత్రం
సహోదరి కామ్‌వాన్యా

ఇప్పుడు కోట్ డి ఐవరీ అబిడ్జాన్ వెస్ట్ మిషన్ లో సేవ చేస్తున్న డి. ఆర్. కాంగోకు చెందిన సహోదరి కలొంబో రోసెట్ కామ్‌వాన్యా ఒకప్పుడు యువతిగా దేవుడు తనను ఏ దిశగా వెళ్లాలో తెలుసుకొనుటకు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఒక అసాధారణమైన రాత్రి దర్శనములో, ఆమెకు ఒక సంఘ భవనము చూపబడింది, అది ఒక దేవాలయము అని ఇప్పుడు ఆమె గుర్తించింది. ఆమె వెదకడం ప్రారంభించి, వెంటనే ఆమె తన దర్శనములో చూచిన సంఘ భవనమును కనుగొన్నది. ఆ చిహ్నము, “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము” అని సూచించింది. సహోదరి కామ్‌వాన్యా బాప్తీస్మము తీసుకొనెను, తరువాత ఆమె తల్లి మరియు తన ఆరుగురు సహోదరులు తీసుకొన్నారు. సహోదరి కామ్‌వాన్యా ఇలా చెప్పెను, “నేను సువార్తను పొందినప్పుడు, బంధించబడిన పక్షి విడుదల చేయబడినట్లు నేను భావించాను. నా హృదయము ఆనందముతో నిండింది. … దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నాకు నమ్మకము కలిగింది.”9

ప్రభువు ఆజ్ఞలు పాటించుట ఆయన ప్రేమను మరింత సులభంగా మరింత పరిపూర్ణముగా భావించుటను మనకు సాధ్యపరచును. ఆజ్ఞల యొక్క తిన్నని, ఇరుకైన మార్గము జీవవృక్షమునకు నేరుగా నడిపించును, వృక్షము, దాని ఫలము, అతిమధురమైనవి మరియు “సమస్త విషయాల కంటే మిక్కిలి కోరదగినది,”10 దేవుని యొక్క ప్రేమకు ప్రాతినిధ్యముగా ఉన్నది మరియు ఆత్మను “మిక్కిలి గొప్ప ఆనందముతో”11 నింపును. రక్షకుడు ఇలా చెప్పారు:

“నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు.

“మీయందు నా సంతోషము నిలిచియుండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.”12

క్రీస్తు ద్వారా జయించుట వలన కలుగు ఆనందము

మనం నమ్మకముగా ఆజ్ఞలను పాటిస్తున్నప్పటికి, మన సంతోషానికి అంతరాయము కలిగించు శ్రమలు, దుర్ఘటనలు రావచ్చును. కాని ఈ సవాళ్ళను జయించుటకు రక్షకుని సహాయముతో మనం ప్రయత్నించినప్పుడు, ఇప్పుడు మనం భావించే సంతోషమును మరియు మనం ఎదురు చూసే సంతోషమును అది భద్రపరచును. “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి: నేను లోకమును జయించి యున్నాను”13 అని క్రీస్తు తన శిష్యులకు అభయమిచ్చెను. ఆయన వైపు తిరిగి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయనతో మనం బద్దులముగా చేసుకొనినప్పుడు మన కష్టాలు, కన్నీళ్లు సంతోషముగా మారును. నేను ఒక ఉదాహరణను చెప్తాను.

1989లో, జాక్ రష్టన్ అర్వైన్ అమెరికాలోని కాలిఫోర్నియా స్టేకు అధ్యక్షునిగా సేవ చేస్తున్నారు. కాలిఫోర్నియా తీరప్రాంతములో ఒక కుటుంబ విరామ సమయములో, జాక్ ఏ ఈతబల్ల సహాయము లేకుండా ఈతకొడుతున్నప్పుడు, ఒక అల అతడిని ఈడ్చుకొని పోయి నీటిలో మునిగియున్న రాతికి బలంగా కొట్టి, అయన మెడను ఇరుగగొట్టి, తన వెన్నెముకను గాయపరిచింది. జాక్ తరువాత ఇలా చెప్పెను, “నేను ఆ రాతిని డీకొట్టిన వెంటనే, నాకు పక్షవాతము వచ్చిందని నేను ఎరుగుదును.”14 అతడు ఇకముందు మాట్లాడలేక పోయాడు లేదా తనంతట తానుగా శ్వాస తీసుకోలేకపోయాడు.15

చిత్రం
కుటుంబము మరియు స్నేహితులు రష్టన్లుకు సహాయపడుతున్నారు.

కుటుంబము, స్నేహితులు, స్టేకు సభ్యులందరు సహోదరుడు రష్టన్, ఆయన భార్య జో యాన్‌లకు సహాయం చేసారు మరియు వారు చేసిన ఇతర పనులతో పాటు జాక్ చక్రాల కుర్చీ కదులుటకు అనుకూలంగా వారి ఇంటిలో కొంత భాగానికి మార్పులు చేసారు. ఆ తరువాత 23 సంవత్సరాలు జాక్‌కు ప్రధాన సంరక్షకురాలిగా జో యాన్ అయ్యింది. ప్రభువు తన జనులను వారి కష్టాలలో దర్శించి, వారి భారాలను తేలిక చేసిన 16 మోర్మన్ గ్రంథ వృత్తాంతములను సూచిస్తూ జో యాన్ ఇలా చెప్పెను, “నా భర్తను సంరక్షించుట ద్వారా నేను పొందే సంతోషము గురించి నేను తరచు ఆశ్చర్యపోతాను.” 17

చిత్రం
జాక్ మరియు జో యాన్ రష్టన్

అతడి శ్వాస వ్యవస్థలో చిన్న మార్పు చెయ్యడం ద్వారా జాక్ మాట్లాడే శక్తి పునరుద్దరించబడింది మరియు ఒక సంవత్సరము లోపే, జాక్ సువార్త సిద్ధాంత బోధకుడు మరియు స్టేకు గోత్రజనకునిగా పిలువబడెను. అతడు గోత్రజనకుని దీవెన ఇవ్వవలసి వచ్చినప్పుడు, యాజకత్వము కలిగిన మరొక వ్యక్తి సహోదరుడు రష్టన్ చేతిని ఆ దీవెన పొందు వ్యక్తిపైన పెట్టి, ఆ దీవెన ఇచ్చు సమయములో తన చేతికి, భుజానికి ఆధారమిచ్చాడు. 22 సంవత్సరాల అంకితమైన సేవ తరువాత 2012 క్రిస్మస్ రోజున జాక్ మరణించెను.

చిత్రం
జాక్ రష్టన్

ఒక ముఖాముఖి సమావేశములో జాక్ ఇలా వివరించెను, “సమస్యలు మనందరి జీవితాలలోకి వస్తాయి; ఈ భూమిపైన ఇక్కడ ఉండటంలో అది కేవలము ఒక భాగము. మతము లేదా దేవునియందు విశ్వాసము కలిగియుండటం మనల్ని చెడు విషయాలనుండి రక్షిస్తుంది అని కొందరు జనులు అనుకుంటారు. అది ముఖ్యమైన అంశం అని నేను అనుకోవడం లేదు. ముఖ్యమైన అంశం ఏమిటంటే, మన విశ్వాసం బలమైనదైతే, చెడు విషయాలు జరిగినప్పుడు, అవి తప్పక జరుగుతాయి, మనం వాటిని ఎదుర్కోగలుగుతాము. … నా విశ్వాసము ఎప్పుడు సంకోచించలేదు కాని నేను నిరుత్సాహపడలేదని దాని అర్థం కాదు. నా సామర్ధ్యము యొక్క అంచుల వరకు నేను నెట్టబడినట్లు మరియు ఎటువైపు తిరగలేనట్లు, నా జీవితంలో మొదటిసారి భావించాను, కాబట్టి నేను ప్రభువు వైపుకు తిరిగాను, మరియు నేటి వరకు నేను అపరిమితమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాను.”18

ఇది దుస్తులు ధరించుటలో, వినోదము మరియు లైంగిక పవిత్రత విషయంలో ప్రభువు ప్రమాణాలను పాటించుటకు ప్రయత్నించు వారికి వ్యతిరేకముగా సాంఘిక మాధ్యము మరియు వ్యక్తిగతముగా కొన్నిసార్లు దయలేకుండా ముట్టడి చేసే కాలము. హేళన చేయడం మరియు హింసించడం అనే ఈ సిలువను మోసేవారిలో తరచు యువత మరియ యువ జనులు, అదేవిధంగా స్త్రీలు మరియు తల్లులు ఉంటారు. అటువంటి దూషణను జయించడం అంత సులభము కాదు, కాని పేతురు మాటలను జ్ఞాపకము చేసుకోండి: “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.”19

ఏదేను తోటలో ఆదాము, హవ్వలు “ఆనందము లేక అమాయకపు స్థితలో ఉండేవారు, ఎందుకనగా వారు దైన్యమునెరుగరు.”20 ఇప్పుడు, లెక్క అప్పగించవలసిన వారిగా, మనము పాపము, శ్రమ, బలహీనత లేదా సంతోషానికి ఏ ఇతర అవరోధము ఏ రూపములో ఉన్నప్పటికి దుఃఖాన్ని జయించుటలో ఆనందాన్ని పొందుతాము. శిష్యత్వపు మార్గములో పురోగతిని గ్రహించుటలో కలిగే ఆనందము; “వారి పాపముల … యొక్క క్షమాపణను పొందియుండి, మరియు మనస్సాక్షి యొక్క సమాధానమును కలిగియుండే”21 ఆనందము; క్రీస్తు యొక్క కృప ద్వారా ఒకరి ఆత్మ వ్యాకోచించి, అభివృద్ధి చెందుటను భావించే ఆనందము ఇదే.22

క్రీస్తు సేవ చేసినట్లుగా సేవ చేయుట యొక్క ఆనందము

మన అమర్త్యత్వము మరియు నిత్యజీవమును తెచ్చుటలో రక్షకుడు ఆనందమును కనుగొనును.23 రక్షకుని ప్రాయశ్చిత్తము గురించి మాట్లాడుతూ అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు:

“అన్ని సంగతులవలె, యేసు క్రీస్తు మన శ్రేష్టమైన మాదిరి, ‘ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించెను.’[హెబ్రీయులకు 12:2] దాని గురించి ఆలోచించండి! భూమిపైన సహించబడిన అనుభవాలన్నింటిలో అత్యంత బాధాకరమైన దానిని సహించుటకు మన రక్షకుడు ఆనందముపై తన దృష్టిసారించెను!

“ఆయన యెదుట ఉంచబడిన ఆనందము ఏమిటి? నిశ్చయముగా అది మనల్ని శుద్ధిచేయుట, స్వస్థపరచుట మరియు బలపరచుట యొక్క ఆనందమును; పశ్చాత్తాపపడు వారందరి పాప పరిహారమును చెల్లించే ఆనందమును; స్వచ్ఛముగా, యోగ్యతగా—ఇంటికి తిరిగి వెళ్ళి, మన పరలోక తల్లిదండ్రులు మరియు కుటుంబాలతో జీవించుటకు మీకు, నాకు సాధ్యము చేసిన ఆనందమును కలిగియున్నది.”24

అదేవిధంగా, “మనముందు ఉంచబడిన ఆనందము” ఏదనగా రక్షకునికి ఆయన విమోచన కార్యములో సహాయము చేసే ఆనందము. అబ్రాహాము సంతానముగా25 మరియు పిల్లలుగా మనము, భూమిపైన ఉన్న కుటుంబాలన్నిటిని “రక్షణ అనగా నిత్యజీవము యొక్క దీవెనలైన సువార్త దీవెనలతో”26దీవించుటలో పాల్గొంటాము.

ఆల్మా మాటలు మన మదిలోకి వస్తాయి:

“అవును, మరియు ఏ ఆత్మనైనా పశ్చాత్తాపమునకు తెచ్చుటకు దేవుని యొక్క హస్తములలో బహుశా నేను ఒక సాధనముగ ఉందునేమోననునది నా అతిశయమైయున్నది, మరియు ఇది నా సంతోషమైయున్నది.

“మరియు ఇదిగో నా సహోదరులలో అనేకులు నిజముగా పశ్చాత్తాపము పొందుట, మరియు వారి దేవుడైన ప్రభువు వద్దకు వచ్చుట నేను చూచినప్పుడు నా ఆత్మ సంతోషముతో నిండిపోవును. …

“… కానీ నేను నా స్వంత విజయమందు మాత్రమే సంతోషించను, కానీ నీఫై యొక్క దేశమునకు ఎక్కి వెళ్ళిన, నా సహోదరులు యొక్క విజయమును బట్టి నా సంతోషము అధిక సంపూర్ణమైనది.

“ఇప్పుడు ఈ నా సహోదరుల యొక్క విజయమును గూర్చి నేను తలంచినప్పుడు నా ఆత్మ శరీరము నుండి వేరు చేయబడుటకు కూడ, అది ఉన్నట్లు కొనిపోబడును. నా సంతోషము అంత గొప్పది.”27

సంఘములో మనం ఒకరికొకరం చేసే మన సేవ యొక్క ఫలాలు “మన యెదుట ఉంచబడిన” ఆనందములో భాగము. దేవునిని సంతోషపరచు ఆనందము మరియు ఆయన పిల్లలైన, మన సహోదర సహోదరీలకు వెలుగు, ఉపశమనము మరియు సంతోషమును తెచ్చుట వలన కలుగు ఆనందముపై దృష్టిసారిస్తే, నిరాశ లేదా ఒత్తిడి కలిగించు సమయాలలో కూడా, మనం సహనముతో పరిచర్య చెయ్యవచ్చును.

పోర్ట్-ఆ-ప్రిన్స్ దేవాలయమును ప్రతిష్ఠించుట కొరకు గత నెల హైతిలో ఉన్నప్పుడు, ఎల్డర్ డేవిడ్ మరియు సహోదరి సూజన్ బెడ్నార్ ఒక యౌవన సహోదరిని కలిసారు, ఆమె భర్త కొన్ని రోజుల ముందు విషాదకరమైన ప్రమాదంలో మరణించెను. ఆమెతోపాటు వారు కన్నీరు కార్చారు. అయినప్పటికి ఆదివారము ఈ ప్రియమైన స్త్రీ దేవాలయములో ప్రవేశించువారి కొరకు మృదువైన, స్వాగతించు చిరునవ్వుతో సమర్పించు సేవలలో ఆహ్వానించువారిలో ఒకరిగా తన స్థానములో ఉండెను.

“పరిశుద్ధుల యొక్క అంతిమ సంతోషము“ రక్షకుడు వారి హేతువు కొరకు వేడుకొనుచున్నారని,28 ”మరియు మన కొరకు [యేసు] తండ్రికి ప్రార్థన చేయుటను మనం [వినినప్పుడు] మన ఆత్మలలో [నింపబడే] సంతోషమును ఏ ఒక్కరు ఊహించుకోలేరని నేను నమ్ముచున్నాను.”29 “లోకము యొక్క సిలువలను ఎవరు భరించారో వారు”30 మరియు “యేసు క్రీస్తు బోధించినట్లుగా ఉద్దేశ్యపూర్వకంగా నీతికరమైన జీవితమును జీవించుటకు ప్రయత్నిస్తున్న”31విశ్వాసులైన పరిశుద్ధుల కొరకు ఆనందము ఒక వరమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌తో పాటు నేను కూడా సాక్ష్యమిస్తున్నాను. మీ ఆనందము సంపూర్ణమగును గాక, యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. ఈనస్ 1:3

  2. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Opening Remarks,” Liahona, నవం. 2016, 81-84 చూడండి.

  3. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Joy and Spiritual Survival,” 82.

  4. Bible Dictionary, “Saint” చూడండి.

  5. మలాకీ 3: 14--15.

  6. మలాకీ 3: 17--18.

  7. “కానీ అది నా సువార్తపైన కట్టబడని యెడల, మరియు మనుష్యుల యొక్క క్రియలపైన లేదా అపవాది యొక్క క్రియలపైన కట్టబడిన, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, వారి క్రియలయందు వారు కొంతకాలము సంతోషము కలిగియుందురు మరియు త్వరలోనే అంతము వచ్చును మరియు వారు నరికివేయబడి మరియు అగ్నిలో పడవేయబడుదురు. అక్కడనుండి తిరిగి వచ్చుటలేదు” (3 నీఫై 27:11).

  8. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 475.

  9. వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు.

  10. 1 నీఫై 11:22; 1 నీఫై 8:11 కూడా చూడండి.

  11. 1 నీఫై 8:12.

  12. యోహాను 15:10-11; అవధారణ చేర్చబడినది.

  13. యోహాను 16:33.

  14. “Faith in Adversity: Jack Rushton and the Power of Faith,” లో జాక్ రష్టన్ SmallandSimpleTV, సెప్టె. 2, 2009, YouTube.com.

  15. Allison M. Hawes, “It’s Good to Be Alive,” Ensign, ఏప్రి. 1994, 42 చూడండి.

  16. మోషైయ 24:14 చూడండి.

  17. హావ్స్‌ లో, “It’s Good to Be Alive,” 43 జో యాన్ రష్టన్.

  18. “Faith in Adversity: Jack Rushton and the Power of Faith” లో జాక్ రష్టన్.

  19. 1 పేతురు 4:14. 2 నీఫై 9:18 and 3 నీఫై 12:12లో ఉదహరించబడిన వాగ్దానాలను కూడా జ్ఞాపకముంచుకొనుము.

  20. 2 నీఫై 2:23; మోషే 5:10–11 కూడా చూడండి.

  21. మోషైయ 4:3.

  22. జోసెఫ్ స్మిత్ “దేవుని అడుగవలెను” అని అతడిని ప్రేరేపించిన యాకోబు మాటలను మనం జ్ఞాపకము చేసుకుంటాము (యాకోబు1:5). ఈ వచనాలు తక్కువ పరిచయము కలిగినవి:

    “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

    “మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

    “మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి” (Joseph Smith Translation, James 1:2 [in James 1:2, footnote a]; James 1:3–4).

  23. మోషే 01:39 చూడుము.

  24. రస్సెల్ ఎమ్. నెల్సన్, “Joy and Spiritual Survival,” 82–83; అసలైనదానిలో అవధారణ కలదు.

  25. “మీరు క్రీస్తు సంబంధులైతే, ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు” ( గలతీయులకు 3:29; ఆదికాండము 22:18; 26:4; 28:14; అపొస్తలుల కార్యములు 3:25; 1 నీఫై 15:18; 22:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 124:58) కూడా చూడండి.

  26. అబ్రహాము 2:11.

  27. ఆల్మా 29:9, 14,16. ఆ విధంగా ప్రభువు మనతో ఇలా చెప్పుచున్నారు, “నా తండ్రి యొక్క రాజ్యములోనికి నాకు ఒక్క ఆత్మను మీరు తెచ్చినప్పుడు మీ సంతోషము గొప్పదైన యెడల, మీరు అనేక ఆత్మలను ఆయన వద్దకు తెచ్చిన యెడల మీ సంతోషము ఎంత గొప్పదిగా ఉండును!” సిద్ధాంతము మరియు నిబంధనలు 18:16. ఆ ముగ్గురు నీఫైయులకు సంపూర్ణ ఆనందము వాగ్దానము చేయబడెను, ఎందుకంటే “లోకము ఉన్నంత వరకు” క్రీస్తు యొద్దకు ఆత్మలు తీసుకొనిరావాలని వారు కోరారు” (3 నీఫై 28:9; 3 నీఫై 28:10 కూడా చూడండి).

  28. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3-5 చూడుము.

  29. 3 నీఫై 17:17.

  30. 2 నీఫై 9:18.

  31. రస్సెల్ ఎమ్. నెల్సన్, Joy and Spiritual Survival,” 84.