2010–2019
మీ గొప్ప సాహసం
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


మీ గొప్ప సాహసం

మన సౌకర్యాలను, భద్రతను ప్రక్కనపెట్టి, ప్రతిరోజూ శిష్యత్వపు ప్రయాణంలో ఆయనతో చేరమని రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు.

హోబిట్స్ గురించి

చాలా సంవత్సరాల క్రితం రాసిన ఒక ప్రియమైన పిల్లల కాల్పనిక నవల, “భూమిలో ఒక రంధ్రంలో ఒక హోబిట్ నివసించాడు” అనే వాక్యంతో ప్రారంభమవుతుంది. 1

బిల్బో బాగ్గిన్స్ కథ ఒక మామూలు మరియు ఏ ప్రత్యేకతలేని హోబిట్ గురించినది, అతనికి ఒక విశేషమైన అవకాశం ఇవ్వబడుతుంది—సాహసం చెయ్యడానికి అద్భుతమైన అవకాశం మరియు గొప్ప బహుమానం పొందే వాగ్దానం.

సమస్య ఏమిటంటే ఆత్మ గౌరవం గల హోబిట్స్ లో ఎక్కువమంది సాహసాల జోలికి వెళ్ళరు. వాళ్ళ జీవితాలు సుఖం చుట్టూ తిరుగుతాయి. వాళ్ళకి భోజనం దొరికినప్పుడు ఆరుసార్లు తింటూ ఆనందిస్తారు, ఇంకా రోజంతా వనాల్లో గడుపుతూ, సందర్శకులతో కథలు చెప్తూ, పాడుతూ, సంగీత వాయిద్యాలు వాయిస్తూ, జీవితపు చిన్నచిన్న ఆనందాలను అనుభవిస్తూ ఉంటారు.

అయినప్పటికీ, గొప్ప సాహసం గురించి బిల్బోకి చెప్పబడినప్పుడు, హఠాత్తుగా అతనిలో బలమైన ఆసక్తి కలిగింది. ఆరంభం నుండి ప్రయాణం సవాళ్ళతో కూడుకొన్నదని అతనికి అర్థమైంది. ప్రమాదకరమైనది కూడా. అతను తిరిగి రాకపోవచ్చు కూడా.

అయినా సాహసం చేయాలనే ఆలోచన అతని మనసులో నాటుకుపోయింది. కాబట్టి ఈ మామూలు హోబిట్ తన సౌకర్యాన్ని వదిలి, అతన్ని “అక్కడికి తీసుకువెళ్ళి, తిరిగి తెచ్చే” గొప్ప సాహసపు మార్గంలో ముందుకుసాగాడు. 2

మీ సాహసం

ఈ కథ మనలో ప్రతిధ్వనించడానికి ఒక కారణం ఇది మన కథ కూడా కావడమే.

చాలాకాలం క్రితం, మనం పుట్టక ముందు, జ్ఞాపకాల నుండి దాచబడి, మరచిపోబడిన వయస్సులో మనం కూడా ఒక సాహసాన్ని ఆరంభించడానికి ఆహ్వానించబడ్డాం. అది దేవుడైన మన పరలోక తండ్రిచేత ప్రతిపాదించబడింది. ఈ సాహసాన్ని ఒప్పుకోవడమంటే అర్థం, ఆయన సన్నిధిలోని సౌకర్యాన్ని, భద్రతను వదిలిపెట్టడం. అంటే తెలియని ప్రమాదాలు, పరీక్షలతో నిండిన ప్రయాణం కోసం భూమిపైకి రావడం.

అది సులువు కాదని మనకు తెలుసు.

కానీ, భౌతిక శరీరంతో పాటు మనం అమూల్యమైన నిధులను పొంది, మర్త్యత్వము యొక్క అత్యధిక ఆనందాలను, బాధలను అనుభవిస్తామని కూడా మనకు తెలుసు. ప్రయత్నించడాన్ని, వెదకడాన్ని, శ్రమించడాన్ని మనం నేర్చుకుంటాం. దేవుని గురించి, మన గురించి నిజాలను కనుగొంటాం.

ఈ ప్రయాణంలో మనం అనేక తప్పిదాలు చేస్తామని మనకు తెలుసు. కానీ, యేసు క్రీస్తు యొక్క గొప్ప త్యాగము వలన మన అతిక్రమముల నుండి మనం పవిత్రంగా చేయబడగలము, మన ఆత్మలలో శుభ్రపరచబడి, శుద్ధి చేయబడగలము, మరియు ఒకనాడు పునరుత్థానం చెంది, మనం ప్రేమించిన వారితో ఏకమవ్వగలమనే వాగ్దానాన్ని కూడా మనం కలిగియున్నాం.

దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనం నేర్చుకున్నాము. ఆయన మనకు జీవితాన్నిచ్చారు, మనం సఫలం కావాలని కోరుతున్నారు. అందుకే మనకోసం ఒక రక్షకుడిని సిద్ధం చేసారు. అయినప్పటికీ, మనకైమనము యెంచుకోవడానికి పరలోక తండ్రి మనల్ని అనుమతించారు, ఎందుకంటే అది మనకివ్వబడింది. 3

మర్త్య సాహసంలో కొన్ని భాగాలు దేవుని పిల్లల్ని కలతపెట్టి, భయపెట్టి ఉండవచ్చు, అందుకే మన ఆత్మీయ సహోదరీ సహోదరులలో అధికులు దానికి వ్యతిరేకంగా నిర్ణయించుకున్నారు. 4

మర్త్య కర్తృత్వము యొక్క బహుమానము మరియు శక్తి ద్వారా, మనం నేర్చుకోగలిగిన మరియు నిత్యత్వములో కాగలిగిన సామర్థ్యం కోసం ఈ సాహసం తగినదేనని మనం నిశ్చయించుకున్నాము. 5

కాబట్టి దేవుని మరియు ఆయన ప్రియ కుమారుని శక్తి, వాగ్దానాలలో నమ్మకముంచి, మనం సవాలును స్వీకరించాం.

నేను స్వీకరించాను.

మీరు స్వీకరించారు.

మన నివాసస్థలము యొక్క భద్రతను వదిలి, “అక్కడికి వెళ్ళి తిరిగివచ్చే” మన గొప్ప సాహసాన్ని ఆరంభించడానికి మనం ఒప్పుకున్నాం.

సాహసానికి పిలుపు

అయినను మనల్ని తికమక పెట్టడానికి మర్త్య జీవితానికి ఒక మార్గముంది, లేదంటారా? ఎదుగుదల, వృద్ధి కంటే ఎక్కువగా సుఖానికి, సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ మన గొప్ప అన్వేషణను మనం మరచిపోతాం.

అయినప్పటికీ, మన హృదయాంతరాలలో ఒక ఉన్నతమైన ఆత్మీయ ఉద్దేశము కొరకు ఖండించలేనంత బలమైన కోరిక నిలిచియుంటుంది. ఈ కోరిక మూలంగానే జనులు సువార్తకు, యేసు క్రీస్తు సంఘానికి ఆకర్షింపబడతారు. పునఃస్థాపించబడిన సువార్త అనేది ఒకవిధంగా మనం ఎప్పుడో అంగీకరించిన సాహసానికి క్రొత్తగా ఇచ్చిన పిలుపు వంటిది. మన సౌకర్యాలను, భద్రతను ప్రక్కనపెట్టి, ప్రతిరోజూ శిష్యత్వపు ప్రయాణంలో ఆయనతో చేరమని రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు.

ఈ దారిలో అనేక మలుపులున్నాయి. కొండలు, లోయలు, డొంకదారులున్నాయి. సాలీళ్ళు, ఎరలు మరియు ఒకటో రెండో రాక్షసబల్లులను పోలినవి కూడా ఉండవచ్చు. కానీ మీరు బాటలో నిలిచియుండి, దేవునిమీద నమ్మకముంచినట్లయితే, మీరు క్రమక్రమంగా మహిమకరమైన మీ గమ్యానికి, మీ పరలోక గృహానికి దారి కనుగొంటారు.

మరి మీరెలా ప్రారంభిస్తారు?

అది చాలా సులువు.

యెహోవాతట్టు మీ హృదయాన్ని తిప్పుకోండి.

ముందుగా, యెహోవాతట్టు మీ హృదయాన్ని తిప్పుకోవడానికి మీరు యెంచుకోవాలి. ఆయనను కనుగొనడానికి ప్రతిరోజు ప్రయత్నించాలి. ఆయనను ప్రేమించడాన్ని నేర్చుకోవాలి. ఆయన బోధలను నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు అనుసరించడానికి మరియు దేవుని ఆజ్ఞలను పాటించటానికి నేర్చుకోవటానికి ఆ ప్రేమ మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. ఒక పిల్లవాడు కూడా గ్రహించగలిగేంత తేలికైన, సులువైన విధానంలో యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మనకివ్వబడింది. అయినప్పటికీ, యేసు క్రీస్తు సువార్త జీవితంలోని అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులను కలిగియుంది మరియు ఒక జీవితకాలంపాటు అధ్యయనం చేసి, ధ్యానం చేసినప్పటికీ కనీసం చిన్నభాగం కూడా గ్రహించలేనంత లోతును, సంక్లిష్టతను కలిగియుంది.

మీరు మీ సామర్థ్యాన్ని సందేహిస్తున్నందు వలన ఈ సాహసానికి వెనుకాడుతున్నట్లయితే గుర్తుంచుకోండి, శిష్యత్వమంటే పరిపూర్ణంగా పనులు చేయడం కాదు; దానర్థం ఉద్దేశపూర్వకంగా పనులు చేయడం. మీ సామర్థ్యాల కంటే ఎక్కువగా మీ ఎంపికలే నిజంగా మీరెవరో చూపుతాయి. 6

మీరు విఫలమైనప్పుడు కూడా పట్టు వదలకుండా ఉండేందుకు మీరు యెంచుకోవచ్చు, బదులుగా మీ ధైర్యాన్ని కనుగొని, ముందుకుసాగి, పైకి లేవచ్చు. అదే ప్రయాణంలో గొప్ప పరీక్ష.

మీరు పరిపూర్ణులు కారని, కొన్నిసార్లు విఫలమవుతారని దేవుడికి తెలుసు. మీరు సఫలమైనప్పటి కంటే మీరు పోరాడుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని తక్కువగా ఏమీ ప్రేమించడు.

ప్రేమించే ఒక తల్లి లేక తండ్రిగా ఆయన కోరుకునేది, మీరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాలని మాత్రమే. శిష్యత్వమనేది పియానో వాయించడాన్ని నేర్చుకోవడం లాంటిది. ముందుగా మీరు చేయగలిగిందల్లా రెండు వ్రేళ్ళతో ఏదో ఒక రాగాన్ని వాయించడం. కానీ మీరు సాధన చేయడం కొనసాగిస్తే, మీరిప్పుడు వాయించగల మామూలు రాగాలే ఒకనాడు అద్భుతమైన రాగాలకు, సంగీత కావ్యాలకు, కచేరీలకు దారితీస్తాయి.

ఇప్పుడు ఈ జీవితంలో ఆ రోజు రాకపోవచ్చు, కానీ తప్పక వస్తుంది. మీరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉండాలనే దేవుడు అడిగేది.

ఇతరులపట్ల ప్రేమ చూపండి.

మీరు యెంచుకున్న ఈ మార్గంలో ఏదో ఆసక్తికరమైనది, దాదాపు ప్రతికూలమైనది ఉంది: మీ సువార్త సాహసంలో పురోగమించడానికి మీకు గల ఏకైక మార్గం ఇతరులు కూడా పురోగమించడానికి సహాయపడడమే.

ఇతరులకు సహాయపడడమే శిష్యత్వపు మార్గము. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, దయ, సేవ మనల్ని శిష్యులుగా మెరుగుపరుస్తాయి.

బీదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయపడేందుకు, దుఃఖించువారిని చేరుకొనేందుకు మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీ స్వభావం శుద్ధిచేయబడి, సృష్టించబడుతుంది, మీ ఆత్మ విస్తరించబడి, మీరు మరింత విశ్వాసులవుతారు.

కానీ, తిరిగి చెల్లించబడుతుందని ఆశించడం వలన ఈ ప్రేమ రాజాలదు. ఇది గుర్తింపును, ముఖస్తుతిని, ఉపకారాన్ని ఆశించే రకమైన సేవ కాజాలదు.

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు బదులుగా ఏమీ ఆశించకుండా దేవుడిని, ఆయన పిల్లలను ప్రేమిస్తారు. మనల్ని నిరాశపరచేవారిని, మనల్ని ఇష్టపడని వారిని, మనల్ని ఎగతాళి చేసేవారిని, హింసించేవారిని, బాధపెట్టాలని చూసేవారిని కూడా మనం ప్రేమిస్తాము.

క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమతో మీరు మీ హృదయాలను నింపినప్పుడు, ద్వేషం, తీర్పు, అవమానానికి మీరు చోటివ్వరు. మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, ఎందుకంటే మీరు ఆయనను ప్రేమిస్తున్నారు. ఈ ప్రక్రియలో మీరు మీ ఆలోచనల్లో, క్రియల్లో నెమ్మదిగా మరింతగా క్రీస్తు వలె అవుతారు. 7 ఇంతకన్నా గొప్ప సాహసం ఇంకేముంటుంది?

మీ అనుభవాన్ని పంచుకోండి

ఈ ప్రయాణంలో మనం సాధించడానికి ప్రయత్నించవలసిన మూడవ విషయం, యేసు క్రీస్తు నామాన్ని మనపైకి తీసుకోవడం మరియు మనమెవరం అనేదాని గురించి సిగ్గుపడకపోవడం.

మనం మన విశ్వాసాన్ని దాచిపెట్టం.

మనం దానిని పాతిపెట్టం.

దానికి విరుద్ధంగా, మనం మన ప్రయాణం గురించి ఇతరులతో మామూలుగా, సహజమైన విధానాల్లో మాట్లాడతాము. స్నేహితులు చేసేది అదే—వారికి ముఖ్యమైన విషయాల గురించి, వారి మనస్సుకు దగ్గరగా అనిపించే, వైవిధ్యాన్నిచ్చే విషయాల గురించి వారు మాట్లాడతారు.

మీరు చేసేది అదే. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా మీరు మీ కథలను, అనుభవాలను చెప్పండి.

కొన్నిసార్లు మీ కథలు జనాల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు అవి వారికి కన్నీళ్ళు తెప్పిస్తాయి. కొన్నిసార్లు మరికొంత కాలం, మరొక రోజు సహనంతో, అదేస్థితిలో ధైర్యంగా, దేవునికి మరికాస్త దగ్గరగా కొనసాగడానికి జనులకు అవి సహాయపడతాయి.

మీ అనుభవాలను వ్యక్తిగతంగా, సామాజిక మాధ్యమాల్లో, సమూహాల్లో, ప్రతిచోట పంచుకోండి.

యేసు తన శిష్యులతో చెప్పిన చివరి విషయాల్లో ఒకటి, వారు లోకమంతా ప్రయాణించి, పునరుత్థానుడైన క్రీస్తు వృత్తాంతాన్ని పంచుకోవాలి. 8 ఆ గొప్ప నియామకాన్ని నేడు మేము ఆనందంగా అంగీరిస్తున్నాము.

మనం పంచుకోవడానికి ఎంతో మహిమకరమైన సందేశాన్ని కలిగియున్నాం: యేసు క్రీస్తు మూలంగా ప్రతి స్త్రీ, పురుషుడు, బిడ్డ సురక్షితంగా తమ పరలోక గృహానికి తిరిగివెళ్ళి, అక్కడ మహిమలో, నీతిగా జీవించగలరు.

పంచుకోవడానికి ఇంతకన్నా మంచి వార్త కూడా ఉంది.

మన రోజులలో దేవుడు మనిషి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. జీవించుచున్న ప్రవక్తను మనం కలిగియున్నాము.

పునఃస్థాపించబడిన సువార్తను గాని, యేసు క్రీస్తు సంఘాన్ని గాని “అమ్మమని” దేవుడు మిమ్మల్ని కోరడం లేదని నేను మీకు గుర్తుచేస్తున్నాను.

మీరు దానిని కుంచెము క్రింద పెట్టరాదని మాత్రమే ఆయన ఆశిస్తున్నారు.

సంఘము వారికోసం కాదని జనులు నిర్ణయించుకుంటే, అది వారిష్టం.

దానర్థం మీరు విఫలమయ్యారని కాదు. వారిని మీరు దయతో ఆదరించడం కొనసాగించండి. మీరు వారిని మళ్ళీ ఆహ్వానించడానికి అది మినహాయింపు కాదు.

మామూలు సామాజిక సంబంధాలకు, ప్రేమతో ధైర్యంతో కూడిన శిష్యత్వానికి మధ్య గల వ్యత్యాసం—ఆహ్వానమే!

జీవితంలో వారి స్థితిగతులు, వారి జాతి, మతము, నిర్ణయాలతో సంబంధం లేకుండా దేవుని పిల్లలందరిని మేము ప్రేమించి, గౌరవిస్తాము.

మా వంతుగా మేము, “వచ్చి చూడండి! శిష్యత్వపు బాటలో నడవడం ఎంత బహుమానకరంగా, గౌరవప్రదంగా ఉంటుందో మీకుమీరే కనుగొనండి,” అని చెప్తాము.

“వచ్చి, ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చే మా ప్రయత్నంలో సహాయపడమని” జనులను మేము ఆహ్వానిస్తున్నాము.

“వచ్చి నిలిచిపోండి, అని మేము చెప్తున్నాము. మేము మీ సహోదరులము, సహోదరీలము. మేము పరిపూర్ణులం కాదు. మేము దేవుడిని నమ్మి, ఆయన ఆజ్ఞలను పాటించాలనుకుంటున్నాము.

“మాతో చేరండి, మీరు మమ్మల్ని మంచిగా మారుస్తారు. ఈ ప్రక్రియలో మీరు కూడా మంచిగా మారతారు. ఈ సాహసాన్ని కలిసి చేద్దాం.”

నేనెప్పుడు ప్రారంభించాలి?

సాహసానికి పిలుపు మన స్నేహితుడైన బిల్బో బాగ్గిన్స్ ను మేల్కొలిపినట్లు భావించినప్పుడు, అతడు రాత్రి బాగా విశ్రాంతి తీసుకొని, మంచి అల్పాహారం సేవించి, ప్రొద్దున్నే బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు.

బిల్బో మేల్కొన్నప్పుడు, ఇల్లంతా చిందరవందరగా ఉండడం గమనించి, తన గొప్ప ప్రణాళిక నుండి దాదాపుగా మరలిపోయాడు.

కానీ అప్పుడే అతని స్నేహితుడు గాండాల్ఫ్ వచ్చి, “నువ్వు ఎప్పుడు రాబోతున్నావు?” అని అడిగాడు.9 తన స్నేహితులతోపాటు వెళ్ళడానికి ఏమి చేయాలో బిల్బో నిర్ణయించుకోవలసి వచ్చింది.

కాబట్టి ఒక మామూలు, సాధారణ హోబిట్ సాహసపు బాట వైపు ఎంత వేగంగా పరుగుపెట్టాడంటే అతడు తన టోపీ, చేతి కర్ర మరియు జేబురుమాలును మరచిపోయాడు. అతను తన రెండవ అల్పాహారం కూడా అసంపూర్తిగా వదిలివేసాడు.

ఇక్కడ మనం నేర్చుకోవడానికి కూడా ఒక పాఠం ఉంది.

చాలాకాలం క్రితం మనకోసం మన ప్రియ పరలోక తండ్రి సిద్ధం చేసిన దాని ప్రకారం జీవిస్తూ, దానిని పంచుకొనే గొప్ప సాహసంలో చేరాలని మీరు, నేను ప్రేరేపించబడినట్లయితే, సేవ మరియు శిష్యత్వము యొక్క ఆయన మార్గంలో దేవుని కుమారుడు, మన రక్షకుడిని అనుసరించడానికి నేడే సరైనదని నేను అభయమిస్తున్నాను.

అన్నీ పరిపూర్ణంగా అమరే క్షణం కోసం మనం జీవితకాలం పాటు వేచియుండవలసి రావచ్చు. కానీ దేవుడిని వెదకడానికి, ఇతరులకు పరిచర్య చేయడానికి, మన అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి పూర్తిగా అంకితమయ్యే సమయమిదే.

మీ టోపీ, చేతికర్ర, రుమాలు, చిందరవందరగా ఉన్న ఇంటిని వదిలిపెట్టండి. 10

ఆ బాటలో ఇప్పటికే నడుస్తున్న వారందరు ధైర్యం తెచ్చుకొని, దయ కలిగియుండి, నమ్మకంతో కొనసాగండి.

ఆ బాటనుండి తొలగిపోయిన వారు దయచేసి తిరిగిరండి, మళ్ళీ మాతో చేరి మమ్మల్ని బలపరచండి.

ఇంకా ప్రారంభించని వారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈ గొప్ప ఆత్మీయ ప్రయాణంలోని అద్భుతాలను మీరు అనుభవించాలనుకుంటే, మీ గొప్ప సాహసం వైపు అడుగేయండి. మిషనరీలతో మాట్లాడండి. మీ కడవరి-దిన పరిశుద్ధ స్నేహితులతో మాట్లాడండి. ఈ అద్భుతము మరియు ఆశ్చర్య కార్యము గురించి వారితో మాట్లాడండి. 11

ఆరంభించడానికిదే సమయము!

వచ్చి, మాతో చేరండి!

మీ జీవితానికి మరింత అర్థం, ఉన్నతమైన ఉద్దేశం, బలమైన కుటుంబ బంధాలు, దేవునితో దగ్గరి సంబంధం ఉండగలవని మీరు భావిస్తే వచ్చి, మాతో చేరండి.

తమనుతాము ఉత్తమంగా మార్చుకోవడానికి, అవసరంలో ఉన్నవారికి సహాయపడేందుకు, ఈ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి శ్రమిస్తున్న ప్రజాసంఘాన్ని మీరు వెదుకుతున్నట్లయితే, వచ్చి మాతో చేరండి!

ఈ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, సాహసవంతమైన ప్రయాణం ఏమిటో వచ్చి చూడండి.

ఈ మార్గంలో మిమ్మల్ని మీరు కనుగొంటారు.

మీరు అర్థాన్ని కనుగొంటారు.

మీరు దేవుడిని కనుగొంటారు.

మీ జీవితపు అత్యంత సాహసవంతమైన, మహిమకరమైన ప్రయాణాన్ని మీరు కనుగొంటారు.

దీని గురించి నేను రక్షకుడైన యేసు క్రీస్తు నామమున సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. జే. ఆర్. ఆర్ టోల్కేన్ The Hobbit or There and Back Again (2001), 3.

  2. The Hobbit యొక్క ఉపశీర్షిక

  3. మోషే 03:17.

  4. యోబు 38:4–7 (దేవుని కుమారులు సంతోషముతో కేకలువేసారు); యెషయా 14:12–13 (“దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును”); ప్రకటన 12:7–11 (పరలోకములో యుద్ధము జరిగింది) చూడండి.

  5. కర్తృత్వము అనేది ‘ఎంతో కృపతో మానవ కుటుంబం పైన పరలోకము కుమ్మరించిన ఎంపిక చేయబడిన బహుమానాలలో ఒకటైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు గల మనస్సు’ అని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ వివరించారు [Teachings of the Prophet Joseph Smith, comp. Joseph Fielding Smith (1977), 49]. ఈ ‘స్వేచ్ఛా స్వాతంత్య్రాలు గల మనస్సు’ లేక కర్తృత్వము అనగా వ్యక్తులను ‘తమకైతాము ప్రతినిధులుగా ఉండేందుకు’ అనుమతించే శక్తి (సి&ని 58:28). ఇది మంచి చెడుల మధ్య లేక మంచి చెడుల వివిధ స్థాయిల మధ్య ఎంచుకోవడానికి సంకల్పాన్ని అభ్యసించడాన్ని మరియు ఆ ఎంపిక యొక్క ఫలితాలను అనుభవించే అవకాశాన్ని కూడా కలిపియుంటుంది. పరలోక తండ్రి తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తారంటే, మనము మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని—ఆయన వలె కావాలని ఆయన మనల్ని కోరుతున్నారు. వృద్ధిచెందడానికి, ఒక వ్యక్తి అతని లేక ఆమె కోరుకున్న ఎంపిక చేయడానికి సహజ సామర్థ్యాన్ని తప్పక కలిగియుండాలి. ‘మనుష్యులను స్వతంత్రులనుగా చేయకుండా దేవుడు కూడా వారిని తనలాగా మార్చలేనందువలన’ ఆయన పిల్లల కొరకు ఆయన ప్రణాళికలో కర్తృత్వము ప్రధానమైనది [David O. McKay, “Whither Shall We Go? Or Life’s Supreme Decision,” Deseret News, June 8, 1935, 1]” (Byron R. Merrill, “Agency and Freedom in the Divine Plan,” in Window of Faith: Latter-day Saint Perspectives on World History, ed. Roy A. Prete [2005], 162).

  6. ఆమె నవల హ్యారీ పాటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్‌లో రచయిత జే.కే. రౌలింగ్‌ తన హాగ్వార్ట్స్ ప్రధానోపాధ్యాయుడు డంబుల్డోర్ యువ హ్యారీ పాటర్‌తో సమానమైన విషయం చెప్పాడు. ఇది మనకు కూడా అద్భుతమైన సలహా. నేను ఇంతకు ముందు సందేశాలలో ఉపయోగించాను మరియు ఇది పునరావృతం కావడం విలువైనదిగా భావిస్తున్నాను

  7. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనిమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడుఆయనను పోలియుందుమని; ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక యెరుగుదుము (1యోహాను 3:2; వివరణ చేర్చబడింది).

    అటువంటి పరివర్తనను అర్థం చేసుకోవడం మన సామర్థ్యాన్ని మించినదైనప్పటికీ, “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు.

    “మనము పిల్లలమైతే వారసులము; అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము;

    మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” (రోమీయులకు 8:16–18; వివరణ చేర్చబడింది).

  8. మత్తయి 28:16-20 చూడండి.

  9. టోల్కేన్, The Hobbit, 33.

  10. లూకా 09:59-62 చూడండి.

  11. లీ గ్రాండ్ రిచర్డ్స్, A Marvelous Work and a Wonder, rev. ed. (1966) చూడండి.