2010–2019
పరిశుద్ధత మరియు రక్షణ ప్రణాళిక
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


పరిశుద్ధత మరియు రక్షణ ప్రణాళిక

ఎక్కువ సంతోషము ఎక్కువ వ్యక్తిగత పరిశుద్ధత వలన కలుగుతుంది.

నా ప్రియమైన సహోదర సహోదరిలారా, సంతోషము కొరకు చేయు మీ వ్యక్తిగత అన్వేషణలో సహాయము చేయుటకు కావలసిన శక్తి కొరకు నేను ప్రార్థించాను. కొంతమంది ఇప్పటికే కావలసినంత సంతోషముగా ఉన్నట్లు భావించవచ్చును కాని మరింత సంతోషము కొరకు వచ్చు అవకాశమును ఎవరు తిరస్కరించరు. శాశ్వత ఆనందము కొరకు నిశ్చయముగా ఇవ్వబడు అవకాశమును అంగీకరించుటకు ఎవరైనా ఆతృతగా ఉంటారు.

దీనినే పరలోక తండ్రి; ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు; మరియు పరిశుద్ధాత్మ; పరలోక తండ్రి యొక్క ప్రతి ఆత్మీయ బిడ్డకు-ఇప్పుడు సజీవులుగా ఉన్నవారు, భవిష్యత్తులో సజీవులుగా ఉండువారు మరియు ఈ ప్రపంచములో ఎప్పటికి జీవించియున్నవారికి ఇవ్వాలనుకున్నారు. ఆ అవకాశమును కొన్నిసార్లు రక్షణ ప్రణాళిక అంటారు. పాపపు ఊబిలో కొట్టిమిట్టాడుతున్న తన కుమారునికి బోధించినప్పుడు ప్రవక్తయైన ఆల్మా దానిని ఆవిధంగా పేరుపెట్టారు. తన కుమారునికి-లేదా పరలోక తండ్రి యొక్క ఏ బిడ్డకు—దుష్టత్వము ఎప్పటికి సంతోషము కానేరదని ఆల్మాకు తెలుసు.1

సంతోషానికి మార్గము పరిశుద్ధతలో అభివృద్ధి చెందుట అని ఆయన తన కుమారునికి బోధించెను. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మనల్ని కడిగివేసి, పరిపూర్ణులుగా చేయుట ద్వారా ఎక్కువ పరిశుద్ధత సాధ్యమౌతుందని ఆయన స్పష్టంగా చెప్పారు.2 యేసు క్రీస్తునందు విశ్వాసము, కొనసాగుచున్న పశ్చాత్తాపము మరియు నిబంధలను పాటించుట ద్వారా మాత్రమే మనం అనుభవించాలని, నిలుపుకోవాలని ఆశపడే శాశ్వత ఆనందమును మనం ఆరోపించగలుగుతాము.

నేడు నా ప్రార్థన ఏమిటంటే, ఎక్కువ సంతోషము ఎక్కువ వ్యక్తిగత పరిశుద్ధత నుండి వచ్చునని మీరు అర్థము చేసుకొనుటకు నేను సహాయము చెయ్యడం తద్వారా ఆ నమ్మకము ప్రకారము మీరు చర్య చూపించగలరు. ఆ తరువాత మరింత పరిశుద్ధతగా మారే వరము కొరకు అర్హత సంపాదించుకొనుటకు మనమేమి చెయ్యాలో నాకు నేను తెలుసుకొన్నదానిని మీతో పంచుకుంటాను.

మనం విశ్వాసమును కసరత్తు చేసి, 3మన విధేయతను చూపించి,4 పశ్చాత్తాపపడి, 5 ఆయన కొరకు త్యాగముచేసి6 పరిశుద్ధ విధులను పొంది, ఆయనతో మన నిబంధనలు చేసుకొన్నప్పుడు7 మనం శుద్ధిచేయబడతాము లేదా మరింత పరిశుద్ధముగా అవుతామని ఇతర విషయాలతో పాటు లేఖనాలు మనకు బోధిస్తున్నాయి పరిశుద్ధత వరమునకు అర్హులగుటకు అణకువ, 8 దీనమనస్సు,9 సహనము 10 అవసరము.

ఇంకా ఎక్కువ పరిశుద్ధత కావాలి అని నేను కోరిక కలిగియున్నప్పుడు ఒక అనుభవము సాల్ట్ లేక్ దేవాలయములో కలిగింది. అక్కడ ఏమి ఆశించాలో ఎక్కువ చెప్పబడకుండా మొదటి సారి నేను దేవాలయములో ప్రవేశించాను. “ప్రభువుకు పరిశుద్ధత” మరియు “ప్రభువు గృహము” అనే మాటలను ఆ భవనముపైన చూసాను. ఏమి జరుగబోతుందో గ్రహించే గొప్ప భావనను నేను పొందాను. ఐనప్పటికి ప్రవేశించుటకు నేను సిద్ధపడ్డానా అని ఆలోచించాను.

మేము దేవాలయములో ప్రవేశించినప్పుడు నా తల్లి, నా తండ్రి నాకంటే ముందుగా నడిచారు. మా యోగ్యతను ధృవపరచుటకు మా సిఫారసులు చూపించమని మేము అడగబడ్డాము.

సిఫారసు డెస్క్ వద్ద ఉన్న వ్యక్తి మా తల్లిదండ్రులకు తెలుసు. కాబట్టి ఒక్క క్షణం ఆయనతో మాట్లాడుటకు వారు ఆగారు. నేను ఒంటరిగా ఒక పెద్ద విశాలమైన స్థలములోనికి వెళ్లాను అక్కడ సమస్తము ప్రకాశవంతమైన తెలుపుతో నిండియున్నది. తెరిచియున్న ఆకాశమువలె కనబడు ఎత్తైన పైకప్పు వైపుకు నేను చూసాను. ఆ గడియలో ఇంతకు ముందు నేను అక్కడ ఉన్నానని ఒక స్పష్టమైన ఆలోచన కలిగింది.

ఐనప్పటికి, నేనొక మృదువైన స్వరమును విన్నాను—ఆ స్వరము నాదికాదు. ఆ మృదువుగా పలుకబడిన మాటలు ఇవే: “నువ్వు ఇంతకుముందెప్పుడు ఇక్కడకు రాలేదు. నీవు జన్మించకముందు గడియను నీవు జ్ఞాపకము చేసుకొనుచున్నావు. ఇలాంటి పవిత్రమైన స్థలములో నీవు ఉన్నావు. నీవు నిలబడియున్న స్థలములోకి రక్షకుడు త్వరలో వచ్చునని నీవు భావించావు. నీవు ఆయనను చూడాలని ఆతృతతో ఉన్నావు కాబట్టి నీవు సంతోషంగా భావించావు.

సాల్ట్ లేక్ దేవాలయములో ఆ అనుభవము ఒక్క గడియ మాత్రమే ఉండెను. అయినప్పటికి దాని యొక్క జ్ఞాపకము నాకు శాంతిని, సంతోషాన్ని, మిక్కిలి ఆనందాన్ని ఇస్తుంది.

ఆ రోజు నేను చాలా పాఠాలు నేర్చుకొన్నాను. పరశుద్ధాత్మ మిక్కిలి నిమ్మళమైన స్వరముతో మాట్లాడును. నా హృదయములో ఆత్మీయ శాంతి ఉన్నప్పుడు ఆయన్ని నేను వినగలను. సంతోషకర భావాన్ని, నేను మరింత పరిశుద్ధునిగా అవ్వగలననే అభయాన్ని ఆయన నాకు ఇచ్చును. దేవుని యొక్క దేవాలయములో ఆ మొదటి గడియలలో నేను పొందిన సంతోషాన్ని అది ఎల్లప్పుడు నాకు తెస్తుంది.

మరింత పరిశుద్ధముగా అగుట వలన కలిగే సంతోషమనే అద్భతమును మీ జీవితాలలో మరియు ఇతరుల జీవితాలలో మీరు గమనించారు. ఇటీవల వారాలలో, మరణమునకు సిద్దముగా ఉండి రక్షకుని యెడల పూర్తి విశ్వాసమును, సంతోషకర ముఖాలను కలిగియున్న రోగులను దర్శించాను.

వారిలో ఒకరు తన కుటుంబముచేత చుట్టుముట్టబడి యుండెను. నేను, నా కుమారుడు ప్రవేశించినప్పుడు అతడు, అతని భార్య నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. వారు నాకు అనేక సంవత్సరాలుగా తెలుసు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వారి జీవితాలలో, వారి కుటుంబ సభ్యుల జీవితాలలో పనిచెయ్యడం నేను చూసాను.

ఆయన ఆయుష్షును పెంచుటకు గల వైద్య ప్రయత్నాలను ఆపాలని వారు కలిసి నిర్ణయించుకున్నారు. ఆయన మాతో మాట్లాడినప్పుడు ఒక నిశ్శబ్ధ భావన కలిగింది. సువార్త కొరకు మరియు ఆయనపైన, ఆయన ప్రేమించే ఆయన కుటుంబము పైన దాని యొక్క శుద్ధిచేయు ప్రభావము కొరకు కృతజ్ఞత తెలిపినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వారు. దేవాలయములో సేవచేసిన అతని యొక్క సంతోషకర సంవత్సరాల గురించి ఆయన మాట్లాడారు. ఈయన యొక్క విజ్ఞప్తి మేరకు నా కుమారుడు ఆయన తలను ప్రత్యేకపరచబడిన నూనేతో ప్రతిష్ఠించెను. ఆ ప్రతిష్ఠించిన దానిని నేను ముద్రించాను. నేను ఆవిధంగా చేసినప్పుడు, ఆయన త్వరలోనే రక్షకుని ముఖాముఖీగా చూస్తారని స్పష్టమైన భావన నాకు కలిగింది.

ఆయన సంతోషాన్ని, ప్రేమను మరియు రక్షకుని అంగీకారాన్ని భావిస్తారని నేను వాగ్దానము చేసాను. మేము అక్కడనుండి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ, దయగల చిరునవ్వు నవ్వెను. ఆయన నాతో పలికిన చివరి మాటలు “నేను ఆమెను ప్రేమిస్తున్నానని క్యాథీకి చెప్పు.” నా భార్య క్యాథ్లీన్ అనేక సంవత్సరాలుగా అతని కుటుంబము యొక్క తరాలవారిని రక్షకుని యొద్దకు వచ్చి, పవిత్రమైన నిబంధనలు చేసుకొని దాని వలన కలుగు సంతోషానికి అర్హులుకమ్మని ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించమని ప్రోత్సాహించింది.

కొన్ని గంటల తరువాత అతడు మరణించెను. ఆయన మరణించిన కొన్ని వారాలలోనే విధవరాలైన అతని భార్య నాకు నా భార్యకు ఒక బహుమతి తెచ్చింది. మేము మాట్లాడుచున్నప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది. ఆమె ఆహ్లాదకరంగా ఇలా చెప్పింది, “నేను విచారముగాను, ఒంటరిగాను భావిస్తానని ఊహించాను.” నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అది సరియైనది అని మీరనుకుంటున్నారా?”

ఆమె తన భర్తను ఎంతగా ప్రేమించిందో, వారిద్దరు కలిసి ఏవిధంగా ప్రభువును తెలుసుకొని, ప్రేమించి మరియు సేవించారో తెలుసు కాబట్టి నేను ఆమెతో ఆ సంతోషకర భావాలు వాగ్దానము చెయ్యబడిన బహుమానమని ఎందుకంటే ఆమె చేసిన విశ్వాసముగల సేవ వలన ఆమె మరింత పరిశుద్ధముగా చెయ్యబడెనని నేను చెప్పాను. ఆమె పరిశుద్ధత ఆమెను ఆ సంతోషానికి అర్హురాలిగా చేసింది.

నేడు వినుచున్న కొంతమంది ఇలా ఆలోచిస్తు ఉండవచ్చును: “విశ్వాసముగా ఉన్నవారికి వాగ్దానము చెయ్యబడిన శాంతిని, సంతోషాన్ని నేనెందుకు అనుభవించలేకపోతున్నాను? భయంకరమైన ప్రతికూలతలో కూడా నేను విశ్వాసముగా ఉన్నాను, కాని నేను సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాను.”

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కూడా ఈ శ్రమను అనుభవించెను. మిస్సొరిలో ఉన్న లిబర్టి చెరశాలలో ఉంచబడినప్పుడు ఆయన ఉపశమనము కొరకు ప్రార్థించెను. ఆయన ప్రభువుకు నమ్మకముగా ఉండెను. ఆయన పరిశుద్ధతలో అభివృద్ధి చెందెను. ఐనప్పటికి అతనికి సంతోషము నిరాకరించబడిందని ఆయన భావించెను.

మన మర్త్య పరీక్షలో ఏదో ఒక సమయంలో లేదా బహశా చాలా కాలం వరకు మనందరికి కావలసిన సహనము యొక్క పాఠాలు ప్రభువు ఆయనకు బోధించెను. తన నమ్మకమైన, బాధపడుచున్న ప్రవక్తకి ప్రభువు సందేశము ఇదే:

“గోతిలో నీవు పడద్రోయబడినను, లేక నరహత్య చేయువారి చేతులలోనికి అప్పగించబడి మరణదండన నీకు విధించబడినను; అగాధములోనికి నీవు పడద్రోయబడినను; ఎగిసిపడే అలలు నీకు విరోధముగా కుట్రపన్నినను; బలమైన గాలులు నీకు శత్రువుగా మారినను; ఆకాశము నల్లగా మారి, నీ మార్గమును అడ్డగించుటకు పంచభూతములు కలిసిపోయినను; అన్నిటికన్నా, నరకపు దవడలు నీ కొరకు నోటిని విశాలముగా తెరచినను, నా కుమారుడా, ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు నీ మేలుకొరకేనని తెలుసుకొనుము.

“మనుష్య కుమారుడు వీటన్నిటికంటె హీనమైనవాటిని అనుభవించెను. అతని కంటే నీవు గొప్పవాడివా?

“కాబట్టి, నీ మార్గమున నిలువుము యాజకత్వము నీతోనుండును; ఏలయనగా వారి హద్దులు నియమించబడియున్నవి, వాటిని వారు దాటలేరు. నీవు బ్రతుకు దినములు తెలియును నీ ఆయుష్కాలము తక్కువగా లెక్కించబడదు; కాబట్టి, మనుష్యుడు ఏమిచేయునో అని భయపడకుము, ఏలయనగా దేవుడు నిరంతరము నీకు తోడైయుండును.”11

ఈ సూచన పూర్వక పాఠాన్నే ప్రభువు యోబుకు ఇచ్చెను, ప్రాయశ్చిత్తము తనను మరింత పరిశుద్ధునిగా చేయుటకు అనుమతించుటకు అతడు చాలా గొప్ప కష్టాలను అనుభవించెను. ఆయన గురించిన మనం కలిగియున్న ఉపోద్ఘాతమును బట్టి యోబు పరిశుద్ధుడని మనకు తెలుసు: “ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.”12

తరువాత యోబు తన ఐశ్వర్యాన్ని, తన కుటుంబాన్ని, ఆయన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయెను. అతని ఎక్కువ ప్రతికూలత ద్వారా పొందిన ఎక్కువ పరిశుద్ధత, ఎక్కువ సంతోషానికి అర్హునిగా చేసిందని యోబు సందేహించాడని మీరు జ్ఞాపకము చేసుకోవచ్చును. ఆ పరిశుద్ధత తనకు దుఃఖాన్ని తీసుకువచ్చినట్లుగా యోబుకు అనిపించెను.

ఐనప్పటికి ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు ఇచ్చిన సరిదిద్దే పాఠాన్నే యోబుకు కూడా ఇచ్చేను. తన గుండెపగిలే పరిస్థితిని ఆత్మీయ నేత్రాలతో చూచుటకు యోబును ప్రభువు అనుమతించెను. ఆయన చెప్పెను:

“పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.

“నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

“నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.

“దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.

“ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?”13

దేవుడు అన్యాయము చేసెనని చెప్పిన దానికి పశ్చాత్తాపపడిన తరువాత యోబు తన శ్రమలను ఉన్నతమైన, పరిశుద్ధమైన విధములో చూచుటకు అనుమతించబడెను. ఆయన పశ్చాత్తాపపడెను.

“అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యు త్తరమిచ్చెను,

“నీవు సమస్తక్రియలను చేయగలవనియునీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియునేనిప్పుడు తెలిసికొంటిని.

“జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు? ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.

“నేను మాటలాడ గోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియ జెప్పుము.

“వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.

“కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.”14

యోబు పశ్చాత్తాపపడిన తరువాత మరింత పరిశుద్ధముగా అయ్యెను, అతడు కోల్పోయిన దానికంటే ఎక్కువగా ప్రభువు అతన్ని దీవించెను. కాని బహశా యోబుకు మిక్కిలి గొప్పదైన దీవెన ఏదనగా ప్రతికూలత మరియు పశ్చాత్తాపము ద్వారా ఎక్కువ పరిశుద్ధతను పొందటం. అతడు ఇంకా జీవించబోవు దినాలలో ఎక్కువ సంతోషమును పొందుటకు అర్హత పొందటం.

ఎక్కువ పరిశుద్ధత కేవలం దానిని అడగటం వలన రాదు. అది దేవుడు మనల్ని మార్చుటకు మనం ఏమి చెయ్యాలో దానిని చెయ్యడం ద్వారా వస్తుంది.

ఎక్కువ పరిశుద్ధతను పొందుటకు నిబంధన మార్గములో ఏవిధంగా ముందుకు సాగాలో అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇచ్చిన సలహా నాకు ఉత్తమమైనదిగా అనిపిస్తున్నది. ఆయన మనల్ని ప్రోత్సాహించినప్పుడు మార్గాన్ని చూపించారు:

అను దినము ఇంకొంచెము ఉత్తమముగా చేయుచు, ఇంకొంచెం ఉత్తమముగాా ఉంటూ—అనుదిన పశ్చాత్తాపము యొక్క బలపరచు శక్తిని అనుభవించండి.

పశ్చాత్తాపపడుటకు మనం ఎంచుకొన్నప్పుడు, మారుటకు మనం ఎంచుకుంటాము! రక్షకుడు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు ఆయనను మనం అనుమతిస్తాము. మనం ఆత్మీయంగా ఎదుగుటకు, ఆనందమును పొందుటకు అనగా—ఆయన యందు విమోచన ఆనందమును పొందుటకు మనం ఎంచుకుంటాము. మనం పశ్చాత్తాపపడాలని ఎంచుకొన్నప్పుడు, మనం మరింతగా యేసు క్రీస్తువలె ఉండుటకు ఎంచుకొంటాము!

పరిశుద్ధులుగా అగుటకు మనం చేయు ప్రయత్నాలలో అధ్యక్షులు నెల్సన్ ఇలా కొనసాగించి ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చారు: “ఈ సమయంలో ప్రభువు మన నుండి పరిపూర్ణతను ఆశించుట లేదు. … కాని మనం ఎక్కువ నిర్మలముగా ఉండాలని ఆయన మననుండి ఆశిస్తున్నారు. అనుదిన పశ్చాత్తాపము నిర్మలత్వమునకు మార్గము.”15

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గత సమావేశ ప్రసంగాలలో మనం ఎవిధంగా పరిశుద్ధతలో అభివృద్ధి చెందుతామో, ఎటువైపు మనం వెళ్తున్నామో ఏవిధంగా తెలుసుకోగలమో మరింత స్పష్టముగా చూచుటకు నాకు సహాయం చేసారు. ఆయన ఇలా చెప్పారు: “మనం ఆత్మీయతను ఏవిధంగా సాధిస్తాము? మనం నిరంతరము పరిశుద్ధాత్మ యొక్క సహచరత్వాన్ని కలిగియుండే ఆ స్థాయిని ఏవిధంగా చేరుకోగలము? ఏవిధంగా నిత్యత్వము యొక్క దృష్టికోణములో ఈ లోక విషయాలను చూచి, అంచనా వెయ్యగలం?”16

అధ్యక్షులు ఓక్స్ యొక్క సమాధానము మన ప్రేమగల రక్షకునిగా యేసు క్రీస్తునందు అధిక విశ్వాసాన్ని కలిగియుండటంతో ప్రారంభమౌతుంది. మనం అనుదినం క్షమాపణను కోరి, ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకు అది దారితీస్తుంది. ఆయన వాక్యాన్ని అనుదినము విందారగించినప్పుడు యేసు క్రీస్తునందు అధికమైన విశ్వాసము కలుగుతుంది.

“More Holiness Give Me” (నాకు మరించి పరిశుద్ధత ఇవ్వుము) అనే కీర్తన మరింత పరిశుద్ధులుగా అగుటకు సహాయం కొరకు ప్రార్థన చేయుటకు ఒక మార్గాన్ని సూచిస్తుంది. మనం కోరే పరిశుద్ధత ప్రేమగల దేవుని నుండి కలిగే ఒక బహుమానమని, మనం చేయగలిగినదంతా చేసిన తరువాత యుక్తకాలములో అది మంజూరుచెయ్యబడునని ఆ రచనకర్త తెలివిగా సూచిస్తున్నారు. ఆఖరు వచనము మీకు జ్ఞాపకముండవచ్చును:

నాకు మరింత శుద్ధత ఇవ్వుము,

జయించుటకు మరింత బలము,

ఇహలోక మలినాలనుండి మరింత స్వేచ్ఛను,

పరలోకము కొరకు మరింత కోరికనిమ్ము.

పరలోకరాజ్యానికి మరింత సిద్ధపాటును,

నేను మరింతగా ఉపయోగపడుటకు,

మరింత దీవించబడి, పరిశుద్ధునిగా అగుటకు—

మరింత రక్షకుడైన నీ వలె అగుటకు.17

మన వ్యక్తిగత పరిస్థితులు ఏవైనప్పటికి, గృహానికి తిరిగి వెళ్ళే నిబంధన పథములో ఎక్కడ ఉన్నప్పటికి, ఎక్కువ పరిశుద్ధతకు మనం చేయు ప్రార్థనలు జవాబివ్వబడును గాక. మన విన్నపము మంజూరు చెయ్యబడినప్పుడు, మన సంతోషము ఎక్కువౌతుంది. అది నెమ్మదిగా రావచ్చు కాని అది వస్తుంది. ప్రేమగల పరలోక తండ్రి, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునుండి ఆ ఆభయాన్ని నేను కలిగియున్నాను.

జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మన ప్రియమైన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. తండ్రియైన దేవుడు జీవిస్తున్నారు మరియు మనల్నిప్రేమిస్తున్నారు. కుటుంబాలుగా మనం తిరిగి గృహానికి రావాలని ఆయన మనల్ని కోరుచున్నారు. అక్కడికి మన ప్రయాణములో ఆయన్ని అనుసరించమని ప్రేమగల మన రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. వారు మార్గాన్ని సిద్ధపరిచారు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.