2010–2019
నన్ను మోసగించకు
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


నన్ను మోసగించకు

మనం దేవుని ఆజ్ఞలకు విధేయులైనప్పుడు, మనం ఎల్లప్పుడు సరైన మార్గంలో నడిపించబడతాము మరియు మోసగించబడము.

ఈరోజు నేను ప్రతిఒక్కరికి, ప్రత్యేకించి యువతరానికి—ప్రాథమిక పిల్లలు, యువకులు, యువతులకు సలహా ఇవ్వదలిచాను. మన దినము కొరకు ప్రభువు యొక్క ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారిచేత మీరు ఎంతగానో ప్రేమించబడ్డారు—ఎంతగా అనగా, గత సంవత్సరంలో “ఇశ్రాయేలునకు ఆశ్రయము” అనే పేరుతో జరిగిన ప్రత్యేక ప్రపంచవ్యాప్త యౌవనుల భక్తి కార్యక్రమములో ఆయన మీలో అనేకమందితో మాట్లాడారు.1 అధ్యక్షులు నెల్సన్ గారు మిమ్మల్ని సరిగ్గా అలాగే, “ఇశ్రాయేలునకు ఆశ్రయము,” యువతరము, భూమి మీద యేసు క్రీస్తు యొక్క నిజమైన, జీవించియున్న సంఘము యొక్క భవిష్యత్తు అని పిలవడం తరచుగా మేము వింటాము.

నా యువ స్నేహితులారా, రెండు కుటుంబ కథలను పంచుకోవడం ద్వారా నేను ప్రారంభించదలిచాను.

102వ డాల్మేషన్

చాలా ఏళ్ళ క్రితం, నేను పని నుండి ఇంటికి వచ్చినప్పుడు, నేలమీద, గ్యారేజ్ తలుపుమీద, మా ఎర్ర ఇటుకల ఇంటిమీద ప్రతిచోట తెల్లని రంగు చింది ఉండడం చూసి ఉలిక్కిపడ్డాను. ఆ దృశ్యాన్ని దగ్గరగా గమనించినప్పుడు, రంగు ఇంకా తడిగా ఉండడం నేను కనుగొన్నాను. రంగుతోనున్న అడుగులు ఇంటి వెనుకవైపుకు దారితీయడంతో, నేను వాటిని అనుసరించాను. అక్కడ మా ఐదేళ్ళ అబ్బాయి చేతిలో పెయింట్ బ్రష్‌తో మా కుక్కను తరమటం నేను కనుగొన్నాను. అందమైన మా నల్లని లాబ్రడార్ (పెంపుడు కుక్క) సగం తెల్లరంగు వేయబడి ఉంది!

“నీవు ఏం చేస్తున్నావు?” అని నేను గట్టిగా అరిచాను.

మా అబ్బాయి ఆగి నా వైపు, కుక్క వైపు, తెల్లరంగు కారుతున్న పెయింట్ బ్రష్ వైపు చూసి, “మీకు తెలుసా 101 డాల్మేషన్స్ సినిమాలో ఉన్నట్లు నల్ల చుక్కలున్న కుక్కలాగా నేను దీనిని తయారు చేయాలనుకున్నాను,” అన్నాడు.

చిత్రం
నల్లరంగు లాబ్రడార్
చిత్రం
డాల్మేషన్

నాకు మా కుక్కంటే చాలా ఇష్టం. అది పరిపూర్ణంగా ఉందని నేననుకున్నాను, కానీ ఆ రోజు మా అబ్భాయి ఆలోచన వేరుగా ఉంది.

చారల పిల్లి

నా రెండవ కథ అంకుల్ గ్రోవర్‌కు సంబంధించినది (ఆయన భార్య యొక్క తండ్రి మామగారు), ఆయన పట్టణానికి చాలా దూరంలో దేశ సరిహద్దులలోనున్న ఇంటిలో ఉండేవారు. అంకుల్ గ్రోవర్ ముసలివారై పోతున్నారు. ఆయన చనిపోయేలోగా మా అబ్బాయిలు ఆయనను కలవాలని మేమనుకున్నాము. కాబట్టి, ఒకరోజు మధ్యాహ్నం మేము ఆయన ఇంటికి సుదూర ప్రయాణం చేసాము. ఆయనను సందర్శించి, మా అబ్బాయిలకు పరిచయం చేయడానికి మేము కలిసి కూర్చున్నాము. ఎంతోసేపు మాట్లాడకముందే, ఐదారేళ్ళ వయస్సున్న మా అబ్బాయిలిద్దరు, బయటకు వెళ్ళి ఆడుకోవాలనుకున్నారు.

వారి అడిగిన దానిని విని, అంకుల్ గ్రోవర్, వంగి వాళ్ళ ముఖాలలో ముఖం పెట్టి చూసారు. పరిచయంలేని, చాలా ముసలిదైన అతడి ముఖాన్ని చూసి పిల్లలు కాస్త భయపడ్డారు. గంభీరమైన గొంతుతో ఆయన వారితో, “జాగ్రత్త—అక్కడ బోలెడన్ని ఉడుములుంటాయి,” అన్నారు. ఇది విని నేను, లీసా ఉలిక్కిపడ్డాము; ఉడుము వారినేమైనా చేస్తుందేమోనని భయపడ్డాము! మేము మాట్లాడుతుండగా పిల్లలు ఆడుకోవడానికి త్వరగా బయటికి వెళ్ళారు.

చిత్రం
ఉడుము

తరువాత ఇంటికి వెళ్ళడానికి మేము కారులో కూర్చున్నప్పుడు, “మీరు ఉడుమును చూసారా?” అని నేను పిల్లల్ని అడిగాను. వారిలో ఒకరు జవాబిస్తూ, “లేదు, మేము అలాంటివేవీ చూడలేదు, కానీ వీపుమీద తెల్లని చారతో ఉన్న నల్లపిల్లిని చూసామని అన్నారు!”

గొప్ప మోసగాడు

జీవితం మరియు వాస్తవం గురించి ఏదైనా కనుగొన్న అమాయక పిల్లలకు సంబంధించిన ఈ కథలు మనకు నవ్వు తెప్పించవచ్చు, కానీ అవి లోతైన భావాన్ని కూడా వివరిస్తాయి.

మొదటి కథలో మా అబ్బాయి దగ్గర అందమైన పెంపుడు కుక్క ఉంది. కానీ అతడు ఒక బకెట్టు నిండా రంగు తీసుకొని, చేతిలో పెయింట్ బ్రష్‌తో తాను ఊహించుకున్నట్లుగా దానిని తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు.

రెండవ కథలో, ఉడుము నుండి వారు ఎదుర్కొనగల అవాంఛనీయ ముప్పు గురించి బాలురకు అవగాహన లేదు. నిజానికి వాళ్ళు ఎదుర్కొన్న దానిని సరిగ్గా గుర్తించలేక, కొన్ని దురదృష్టకరమైన పర్యవసానాలతో వారు బాధపడే ప్రమాదం ఉంది. నిజమైన విషయాన్ని మరేదో అనుకొని ఊహించుకుంటూ—తప్పుగా గుర్తించడానికి సంబంధించిన కథలివి. ప్రతి సందర్భంలో, ఫలితాలు చాలా చిన్నవి.

అయినప్పటికీ, ఈ రోజుల్లో చాలామంది పెద్దయెత్తున ఇటువంటి విషయాలతో కుస్తీపడుతున్నారు. వారు సంగతులను అవి నిజంగా ఉన్నట్లుగా చూడలేరు లేదా సత్యంతో సంతృప్తి చెందరు అంతేకాక, సంపూర్ణ సత్యం నుండి మనల్ని ఉద్దేశపూర్వకంగా దూరంగా నడిపించడానికి రూపొందించబడిన శక్తులు నేడు ఉన్నాయి. ఈ మోసాలు, అబద్ధాలు అమాయకత్వంచేత తప్పుగా గుర్తించడాన్ని మించి, తరచుగా చిన్నవి కాదు, చాలా తీవ్రమైన ఫలితాలను కలిగియుంటాయి.

సాతాను, అబద్ధాలకు తండ్రి, గొప్ప మోసగాడు, వాస్తవంగా ఉన్న విషయాలను మనం ప్రశ్నించేలా, నిత్య సత్యాలను నిర్లక్ష్యం చేసి, లేదా బాగా నచ్చేలా వాటిని మరోలా మార్చేలా చేస్తాడు. “అతడు దేవుని పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు” 2 మరియు మేలును కీడనియు, కీడును మేలనియు నమ్మేలా దేవుని పిల్లలను ఒప్పించే సామర్థ్యాన్ని సాధన చేస్తూ, ప్రణాళికలు వేస్తూ వేల సంవత్సరాల కాలం గడిపాడు.

ఉడుములు కేవలం పిల్లులని లేక రంగు వేసి మీరు లాబ్రడార్ కుక్కను డాల్మేషన్‌లా మార్చగలరని మనుష్యులను ఒప్పించడానికి అతడు ప్రసిద్ధిగాంచాడు.

చిత్రం
మోషే దేవునిని ముఖా-ముఖీగా చూసెను.

ఇప్పుడు ఈ సూత్రానికి ఒక ఉదాహరణను చూద్దాం, ప్రభువు యొక్క ప్రవక్తయైన మోషే ఇటువంటి దానిని ముఖాముఖిగా ఎదుర్కొన్న సందర్భం లేఖనాలలో ఉంది. మోషే అత్యంత ఎత్తైన కొండమీదికి కొనిపోబడి, దేవునిని ముఖాముఖిగా చూసి, ఆయనతో మాట్లాడెను. 3 దేవుడు మోషేకు తన నిత్య గుర్తింపు గురించి బోధించారు. మోషే మర్త్యుడైయుండి, అపరిపూర్ణంగా ఉన్నప్పటికీ, మోషే తన ఏకైక కుమారుని పోలియున్నాడని; మరియు తన ఏకైక కుమారుడే … రక్షకుడని దేవుడు బోధించాడు. 4

ఈ అద్భుతమైన దర్శనంలో మోషే దేవుడిని చూసాడు, మరియు మర్త్యుడైనప్పటికీ తాను దేవుని కుమారుడని తన గురించి తాను ఒక ముఖ్యవిషయాన్ని తెలుసుకున్నాడు.

ఈ అద్భుతమైన దర్శనం ముగిసినప్పుడు ఏమి జరిగిందో జాగ్రత్తగా వినండి. “మరియు ఇది జరిగెను … సాతాను అతడిని శోధిస్తూ వచ్చి,” “మోషేమనుష్య కుమారుడా, నన్ను ఆరాధించుము!”5మీరు ఎవరు ? అని మోషే ధైర్యంగా అడిగాడు. ఇదిగో, నేను దేవుని కుమారుడను, ఆయన అద్వితీయ కుమారుని పోలియున్నాను; మరియు నేను మిమ్మల్ని ఆరాధించునట్లు, మీ మహిమ ఎక్కడ?6

మరొకమాటలో, నువ్వు నన్ను మోసగించలేవు, ఎందుకంటే నేనెవరో నాకు తెలుసని మోషే చెప్పాడు. నేను దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాను. ఆయన వెలుగు, మహిమ నీకు లేవు. కాబట్టి నేను నిన్నెందుకు ఆరాధించాలి లేక మీ మోసానికి బలికావాలి?

మోషే ఇంకా ఎలా స్పందించాడో శ్రద్ధగా వినండి. “సాతానా ఇక్కడ నుండి పొమ్ము; నన్ను మోసగించకు,7 అని అతడు ప్రకటించాడు.

అపవాది నుండి వచ్చిన శోధనకు మోషే ధైర్యంగా స్పందించిన తీరు నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మీరు శోధన చేత ప్రభావితం చేయబడినప్పుడు ఇదేవిధంగా స్పందించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. “వెళ్ళిపో! అని మీ ఆత్మ యొక్క శత్రువును ఆజ్ఞాపించండి. నీ దగ్గర మహిమ లేదు. నన్ను శోధించకు లేక నాకు అబద్ధాలు చెప్పకు! నేనెవరో నాకు తెలుసు నేను దేవుని బిడ్డను. ఆయన సహాయం కొరకు నేను ఎల్లప్పుడూ నా దేవుడిని పిలుస్తాను.”

అయినప్పటికీ, సాతాను మనల్ని మోసం చేయడానికి, మనల్ని దిగజార్చడానికి తన నాశనకర ఉద్దేశాలను అంత తేలికగా వదిలిపెట్టడు. అతడు ఖచ్చితంగా మోషేతో అలా చేయలేదు, అతనెవరో శాశ్వతంగా మరచిపోయేలా చేయాలని కోరాడు.

అతడు చిన్నబిడ్డవలే గట్టిగా అరుస్తూ,“భూమి మీద విరుచుకుపడి, నేనే అద్వితీయ కుమారుడిని, నన్ను ఆరాధించుమని చెప్పుచూ, సాతాను మోషేను ఆజ్ఞాపించాడు.8

మనము సమీక్షిద్దాం. ఇప్పుడే అతడు ఏమన్నాడో మీరు విన్నారా? “నేనే అద్వితీయ కుమారుడిని. నన్ను ఆరాధించుము!”

గొప్ప మోసగాడు, ప్రభావంతో ఇలా అన్నాడు “చింతించకు; నేను నీకు హానిచేయను—నేను ఉడుమును కాను; నలుపు—తెలుపు చారలు గల అమాయకపు పిల్లిని.”

చిత్రం
మోషే సాతానును తరిమివేయుట

అప్పుడు మోషే దేవుడిని ప్రార్థించి, ఆయన దైవిక బలాన్ని పొందాడు. తరువాత సాతాను వణికి, భూమి కంపించినప్పటికినీ, మోషే లొంగిపోలేదు. అతని స్వరం స్థిరంగా, స్పష్టంగా ఉంది. “సాతానా నా నుండి వెళ్ళిపో,” “మహిమాస్వరూపుడైన ఈ ఏకైక దేవునిని మాత్రమే నేను ఆరాధిస్తానని” అతడు ప్రకటించాడు. 9

చివరికి, “అతడు మోషే దగ్గర నుండి … వెళ్ళిపోయాడు.”10

తరువాత ప్రభువు ప్రత్యక్షమై, మోషే విధేయతను బట్టి అతన్ని దీవించి, ఇలా అన్నారు:

“నీవు, ధన్యుడవు మోషే, … నీవు ఈ గొప్ప జలముల కంటే బలంగా చేయబడతావు. …

“మరియు, నీ జీవితకాలమంతా నేను నీతో ఉంటాను.”11

జీవితంలో మన దశ ఏదైనప్పటికీ, మోషే అపవాదిని ఎదిరించుట, మనలో ప్రతీఒక్కరి కొరకు స్పష్టమైన, జ్ఞానోదయమైన ఉదాహరణ. అతడు మిమ్మల్ని మోసగించటానికి ప్రయత్నించినప్పుడు ఏమి చేయాలో తెలుసుకోవడానికి—వ్యక్తిగతంగా ఇది మీకొక శక్తివంతమైన సందేశం. మోషే వలె మీరు కూడా పరలోక సహాయమనే వరముతో దీవించబడ్డారు.

ఆజ్ఞలు మరియు దీవెనలు

మోషే చేసినట్లుగా, మీరు మోసగించబడకుండా, శోధనకు లొంగకుండా ఈ పరలోక సహాయాన్ని ఏవిధంగా పొందగలరు? భూనివాసులపై రాబోవు ఆపదను ఆయన యెరిగియున్నాడని, అందుకే తన సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను పిలిచి, భూనివాసుల పైగ రాగల విపత్తును ఎరిగి ప్రభువైన నేను, పరలోకమునుండి అతనితో మాట్లాడి, అతనికి ఆజ్ఞలనిచ్చారని ఆయన ప్రకటించినప్పుడు, ఈ యుగములో దైవిక సహాయము కొరకు ఒక స్పష్టమైన మార్గము ప్రభువు చేత తిరిగి నిర్థారించబడింది. 12 ఆరంభము నుండి అంతమును ఎరిగియున్న 13 ప్రభువుకు మన రోజులలోని ప్రత్యేకమైన కష్టాలు తెలుసని సరళమైన మాటలను ఉపయోగిస్తూ మనం చెప్పవచ్చు. కాబట్టి సవాళ్ళను, శోధనలను ఎదుర్కోవడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పరిచారు, వాటిలో అనేకము అపవాది మరియు అతని దాడుల యొక్క మోసపూరిత ప్రభావాల ఫలితంగా వస్తాయి.

మార్గము సులువైనది. తన సేవకుల ద్వారా దేవుడు ఆయన పిల్లలమైన మనతో మాట్లాడతారు, మనకు ఆజ్ఞలనిస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన మాటలను మనము తిరిగివ్రాసి, “తన సేవకుడైన [అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్]ను పిలిచి, పరలోకము నుండి ఆయనతో మాట్లాడి, ఆయనకు ఆజ్ఞలనిచ్చారు.” ఇది మహిమకరమైన సత్యము కాదా?

అద్భుతమైన మొదటి దర్శనముతో ప్రారంభించి, ప్రభువు నిజంగా పరలోకము నుండి జోసెఫ్ స్మిత్‌తో మాట్లాడారని నేను గంభీరమైన సాక్ష్యమిస్తున్నాను. మన కాలంలో ఆయన అధ్యక్షులు నెల్సన్‌తో కూడా మాట్లాడతారు. దేవుడు గతంలో ప్రవక్తలతో మాట్లాడారని, తన పిల్లలను ఈ జీవితంలో సంతోషానికి, తరువాతి జీవితంలో మహిమకు నడిపించడానికి రూపొందించబడిన ఆజ్ఞలను వారికిచ్చారని నేను సాక్ష్యమిస్తున్నాను.

నేడు జీవించియున్న మన ప్రవక్తకు ఆజ్ఞలనివ్వడాన్ని దేవుడు కొనసాగిస్తాడు. ఉదాహరణలు పుష్కలంగా ఉన్నాయి—సువార్త ఉపదేశంలో మరింత గృహ-కేంద్రీకృత, సంఘ-సహకారమివ్వబడిన సమన్వయము; గృహము మరియు దర్శించి బోధించడానికి బదులుగా పరిచర్య చేయుట; దేవాలయ నియమాలు, విధులలో సవరణలు; మరియు 2020లో ప్రారంభమవుతున్న క్రొత్త పిల్లలు మరియు యువత కార్యక్రమము. తన సంఘాన్ని మరొకసారి భూమిపై పునఃస్థాపించి, మన దినములో ఒక ప్రవక్తను పిలిచిన ప్రియమైన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మంచితనము, దయను చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను. యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన అపాయకరమైన కాలములను కాలములసంపూర్ణత్వము తో ఎదుర్కొంటుంది.

దుర్మార్గము ఎన్నడును సంతోషము కాలేదు.

మన ప్రవక్తకు ఇవ్వబడిన ఆజ్ఞలకు విధేయత చూపడమనేది అపవాది ప్రభావాన్ని, మోసాన్ని తప్పించుకోవడంలోనే కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడంలో కూడా ముఖ్యమైనది. ఈ దైవిక సూత్రము చాలా సులువైనది: నీతియుక్తత, లేక ఆజ్ఞలకు విధేయత, దీవెనలను తెస్తుంది మరియు దీవెనలు మన జీవితాల్లోకి సంతోషాన్ని, ఆనందాన్ని తెస్తాయి.

అయినప్పటికీ, మోషేను మోసం చేయడానికి అపవాది ప్రయత్నించిన అదే విధానములో, మిమ్మల్ని మోసగించడానికి అతను కోరతాడు. అతను ఏదైతే కాదో, ఆ విధంగా ఉన్నట్లు అతడు ఎల్లప్పుడు నటించాడు. నిజంగా అతను ఎవరనే దానిని దాచిపెట్టడానికి ఎల్లప్పుడు ప్రయత్నిస్తాడు. విధేయత మీ జీవితాన్ని దుఃఖపూరితం చేస్తుందని, మీ సంతోషాన్ని దోచేస్తుందని అతడు వాదిస్తాడు.

మోసగించడానికి గల అతని కుట్రలలో కొన్నిటిని మీరు ఆలోచించగలరా? ఉదాహరణకు, అక్రమమైన మత్తుమందులు, మద్యపానం యొక్క నాశనకరమైన పర్యవసానములకు తక్కువ ప్రాధాన్యతను ఇచ్చి బదులుగా అది సంతోషాన్నిస్తుందని సూచిస్తాడు. బలహీనమైన పోలికలు మరియు ఆదర్శవంతమైన వాస్తవాలతో కలిపి సామాజిక మాధ్యమంలో ఉండే వివిధ ప్రతికూల అంశాలలో అతడు మనల్ని ముంచివేస్తాడు. దానికి అదనంగా, అశ్లీలత, సైబర్ బెదిరింపుల ద్వారా ఇతరులపై కఠోరమైన దాడులు, మన మనస్సుల్లో భయాన్ని, సందేహాన్ని కలిగించేందుకు తప్పుడు సమాచారాన్ని అందించడం వంటి బాధాకరమైన లేక హానిచేయడానికి ఉద్దేశించబడి ఆన్ లైన్ లో కనుగొనబడు ఇతర నష్టపరచు విషయాలను అతడు మనకు బహిర్గతం చేస్తాడు. “నన్ను అనుసరించండి, మీరు తప్పక సంతోషంగా ఉంటారు,” అని కపటముగా అతడు గుసగుసలాడతాడు.

“దుర్మార్గము ఎన్నడును సంతోషము కాలేదు,” 14 అని అనేక శతాబ్దాల క్రితం మోర్మన్ గ్రంథ ప్రవక్తచేత వ్రాయబడిన మాటలు ప్రత్యేకించి మన రోజులకు సంబంధించినవి. సాతాను మోసాలను అని ఏమిటో మనం గుర్తించాలని నేనాశిస్తున్నాను. మన ఆత్మలను నాశనం చేసి, మన ప్రస్తుత ఆనందాన్ని, భవిష్యత్తు మహిమను దోచుకోవాలని చూసేవాడి అబద్ధాలను, ప్రభావాలను గుర్తించి, మనం ఎదిరించాలి.

నా ప్రియ సహోదర సహోదరిలారా, మనం విశ్వాసంతో జాగ్రత్తగా కొనసాగాలి, ఎందుకంటే సత్యాన్ని తెలుసుకొని, ఆయన సేవకుల ద్వారా ప్రభువు స్వరాన్ని వినడానికి గల ఏకైక మార్గమదే. “ఏలయనగా ఆత్మ సత్యాన్ని పలుకును మరియు అబద్ధమాడదు. … మన ఆత్మల రక్షణ కొరకు, ఈ విషయాలు స్పష్టంగా మనకు ప్రత్యక్షపరచబడ్డాయి. … ఏలయనగా దేవుడు పాతకాల ప్రవక్తలతో కూడా మాట్లాడాడు.”15 మనం సర్వశక్తిమంతుడైన దేవుని పరిశుద్ధులము, ఇశ్రాయేలునకు ఆశ్రయము! మనం తప్పటడుగు వేస్తామా? “మనం పోరాటాన్ని కుదించుదామా, లేక విస్మరిద్దామా? లేదు! … మన ఆత్మ, కోరికలు మరియు క్రియలతో మనం ఎల్లప్పుడు దేవుని ఆజ్ఞకు విశ్వాసంగా, నిబద్ధులమై ఉందాము.” 16

ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడైన—యేసు క్రీస్తు యొక్క నామములో కూడ నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన అనంతమైన, నిత్య త్యాగము వలన సాధ్యపరచబడిన ఆయన నిత్య ప్రేమ, సత్యము, సంతోషము గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ఆజ్ఞలకు మనం విధేయులైనప్పుడు, మనం ఎల్లప్పుడు సరైన మార్గంలో నడిపించబడతాము మరియు మోసగించబడము. మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.