లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 110


110వ ప్రకరణము

1836, ఏప్రిల్ 3న కర్ట్‌లాండ్, ఒహైయోలోనున్న దేవాలయములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీలకు ప్రత్యక్షపరచబడిన దర్శనములు. ఈ సందర్భమేమనగా ఒక విశ్రాంతిదిన కూడిక. జోసెఫ్ స్మిత్ చరిత్ర ఇలా వివరించుచున్నది: “మధ్యాహ్న సమయమందు, పన్నెండుమంది నుండి పొందిన ప్రభురాత్రి భోజనమును సంఘమునకు పంచిపెట్టుటలో నేను ఇతర అధ్యక్షులకు సహాయపడితిని, ఈ దినమున పరిశుద్ధ బల్ల యొద్ద బాధ్యత వహించుటకు వారికి విశేషాధికారము ఇవ్వబడినది. నా సహోదరులకు ఈ కార్యక్రమమును నిర్వహించిన తరువాత, తెరలు వేయబడుచున్నప్పుడు, నేను పీఠము యొద్దకు వెళ్ళి, ఆలీవర్ కౌడరీతో కలిసి హృదయపూర్వక మౌనప్రార్థనలో తలవంచితిని. ప్రార్థన నుండి లేచిన తరువాత, ఈ దర్శనము మా ఇరువురికి తెరువబడెను.”

1–10, ప్రభువైన యెహోవా మహిమయందు ప్రత్యక్షమై, కర్ట్‌లాండ్ దేవాలయమును తన మందిరముగా అంగీకరించెను; 11–12, మోషే, ఏలీయాలు ప్రత్యక్షమై వారి తాళపుచెవులను, యుగములను ఇచ్చెను; 13–16, ఏలీయా తిరిగివచ్చి, మలాకి చేత వాగ్దానము చేయబడిన విధముగా అతని యుగపు తాళపుచెవులను ఇచ్చెను.

1 మా మనస్సుల నుండి తెర తీసివేయబడెను, మా మనోనేత్రములు తెరువబడెను.

2 మా యెదుట పీఠపు పతకముపైన ప్రభువు నిలువబడగా మేము చూచితిమి; ఆయన పాదముల క్రింద లేత పసుపురంగులో మేలిమి బంగారముతో చదును చేయబడియుండెను.

3 ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను; ఆయన తలవెంట్రుకలు తెల్లగా శుద్ధమైన హిమమువలే ఉండెను; ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలే ఉండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే, యెహోవా కంఠస్వరమువలే నుండి, ఈలాగు చెప్పుచుండెను:

4 ఆదియు అంతమును నేనే; జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే; తండ్రితో మీ న్యాయవాదిగా ఉన్నాను.

5 ఇదిగో, మీ పాపములు క్షమించబడియున్నవి; మీరు నా యెదుట పరిశుద్ధముగానున్నారు; కాబట్టి, మీ తలలెత్తుకొని సంతోషించుడి.

6 మీ సహోదరుల హృదయాలు సంతోషింపనీయుడి, నా నామమునకు ఈ మందిరమును తమ శక్తినంతటితో నిర్మించిన నా జనులందరి హృదయాలు సంతోషింపనీయుడి.

7 ఏలయనగా ఇదిగో, నేను ఈ మందిరమును అంగీకరించితిని, నా నామము ఇక్కడ ఉండును; కరుణతో ఈ మందిరములో నా జనులకు నన్ను నేను ప్రత్యక్షపరచుకొందును.

8 నా జనులు నా ఆజ్ఞలు పాటించి, ఈ పరిశుద్ధ మందిరమును అపవిత్రము చేయని యెడల నేను నా సేవకులకు ప్రత్యక్షమై, నా కంఠస్వరముతో వారితో మాట్లాడెదను.

9 క్రుమ్మరించబడబోవు దీవెనలకు ఈ మందిరములో నా సేవకులు దీవించబడిన దీవెనకు పర్యవసానముగా వేలు, పదివేల కొలది హృదయాలు మిక్కిలి ఆనందించును.

10 ఈ మందిరపు కీర్తి విదేశాలకు వ్యాపించును; నా జనుల శిరస్సులపై క్రుమ్మరించబడబోవు దీవెనకు ఇది ఆరంభము. అలాగే జరుగును గాక. ఆమేన్.

11 ఈ దర్శనము సమాప్తమైన తరువాత, పరలోకములు మరలా తెరువబడెను; మోషే మా యెదుట ప్రత్యక్షమై భూమి యొక్క నలుమూలల నుండి ఇశ్రాయేలీయులను పోగుచేయుటకు ఉత్తర దిక్కునున్న ప్రదేశమునుండి పది గోత్రములను నడిపించు తాళపుచెవులను మాకు ఇచ్చెను.

12 ఇది జరిగిన తరువాత, ఏలీయా ప్రత్యక్షమై అబ్రాహాము సువార్త యొక్క యుగమును ఇచ్చి, మాయందు మా సంతానమునందు మా తరువాతి సమస్త తరములు దీవించబడునని చెప్పెను.

13 ఈ దర్శనము ముగిసిన తరువాత, మరియొక గొప్ప మహిమకరమైన దర్శనము మాకు చూపబడెను; ఏలయనగా మరణమును రుచిచూడక పరలోకమునకు కొనిపోబడిన ప్రవక్తయైన ఏలీయా మా యెదుట నిలబడి ఈలాగు సెలవిచ్చెను:

14 ఇదిగో, మలాకీ నోటిద్వారా చెప్పబడిన దానికి సమయము ఆసన్నమాయెను—ప్రభువు యొక్క భయంకరమైన ఆ మహాదినము వచ్చుటకు ముందు అతడు (ఏలీయా) పంపబడునని సాక్ష్యమిచ్చెను—

15 తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పుటకు వచ్చును, లేనియెడల ఈ భూమియంతయు ఒక శాపముతో శపించబడును—

16 కాబట్టి, ఈ యుగపు తాళపుచెవులు మీ చేతులకు అప్పగించబడియున్నవి; దీనివలన ప్రభువు యొక్క భయంకరమైన ఆ మహాదినము దగ్గరలో, తలుపు యొద్ద సమీపములో ఉన్నదని మీరు తెలుసుకొందురు.