లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 97


97వ ప్రకరణము

1833, ఆగష్టు 2న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. సమాచారము కొరకు ప్రభువునొద్ద ప్రవక్త చేసిన విచారణకు స్పందనగా ఈ బయల్పాటు ప్రత్యేకముగా జాక్సన్ కౌంటీ, మిస్సోరి, సీయోనులోనున్న పరిశుద్ధుల వ్యవహారములకు సంబంధించినది. మిస్సోరిలోనున్న సంఘ సభ్యులు తీవ్ర హింసకు లోనయ్యిరి మరియు 1833, జులై 23న జాక్సన్ కౌంటీని విడిచిపెట్టుటకు ఒక ఒప్పందముపై సంతకము చేయుటకు బలవంతము చేయబడిరి.

1–2, సీయోను (జాక్సన్ కౌంటీ, మిస్సోరి)లో నున్న పరిశుద్ధులలో అనేకమంది వారి విశ్వాస్యత వలన దీవించబడిరి; 3–5, సీయోనులో నున్న పాఠశాలలో తాను పడిన శ్రమకు పార్లీ పి. ప్రాట్ అభినందించబడెను; 6–9, ఎవరైతే తమ నిబంధనలను గైకొందురో, వారు ప్రభువు చేత అంగీకరించబడుదురు; 10–17, సీయోనులో ఒక మందిరము నిర్మించబడవలసియున్నది, దానిలో హృదయశుద్ధి గలవారు దేవుని చూచెదరు; 18–21, సీయోను అనగా హృదయశుద్ధి గలవారు; 22–28, విశ్వాసముగానుండిన యెడల, సీయోను ప్రభువు ఉపద్రవము నుండి తప్పించుకొనును.

1 నా స్నేహితులైన మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, సీయోను ప్రదేశములోనున్న మీ సహోదరులను గూర్చి నా చిత్తమును నేను మీకు చూపుటకు నా స్వరముతో అనగా నా ఆత్మ స్వరముతో నేను మాట్లాడుచున్నాను, వారిలో అనేకులు యథార్థముగా వినయము కలిగి, జ్ఞానమును నేర్చుకొనుటకు, సత్యమును కనుగొనుటకు శ్రద్ధతో వెదకుచున్నారు.

2 అట్టివారు ధన్యులని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఏలయనగా వారికది దొరుకును; ప్రభువైన నేను సాత్వీకులందరికి, నేను సంకల్పించు వారందరికి కనికరము చూపెదను, తద్వారా నేను వారిని తీర్పునకు తీసుకొని వచ్చినప్పుడు నేను నీతిమంతునిగా యెంచబడుదును.

3 ఇదిగో, సీయోనులోనున్న పాఠశాలను గూర్చి నేను చెప్పునదేమనగా, సీయోనులో పాఠశాల ఉండుటను గూర్చి, నా సేవకుడైన పార్లీ పి. ప్రాట్‌ను గూర్చి కూడా ప్రభువైన నేను మిక్కిలి సంతోషించుచున్నాను, ఏలయనగా అతడు నా యందు నిలిచియున్నాడు.

4 అతడు నా యందు నిలిచియుండుటను కొనసాగించిన యెడల, అతనికి నేను ఇతర ఆజ్ఞలు ఇచ్చువరకు అతడు సీయోను ప్రదేశములో నున్న పాఠశాలకు అధ్యక్షత్వము వహించుటను కొనసాగించును.

5 పాఠశాల యొక్కయు, సీయోనులోనున్న సంఘము యొక్కయు ఆత్మీయాభివృద్ధికి సమస్త లేఖనములను, మర్మములను వివరించుటలో రెట్టింపు దీవెనలతో అతడిని నేను దీవించెదను.

6 ప్రభువైన నేను పాఠశాలలోని శేషమునకు కనికరమును చూపుటకు సమ్మతించుచున్నాను; అయినప్పటికీ, గద్దింపబడవలసిన వారు గలరు, వారి క్రియలు తెలియపరచబడును.

7 గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది; మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి, అగ్నిలో వేయబడును. ప్రభువైన నేను దీనిని సెలవిచ్చితిని.

8 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారిలోనున్న అందరు—తమ హృదయాలు నిజాయితీ గలవని, విరిగినవని, వారి ఆత్మలు నలిగినవని, త్యాగము అనగా ప్రభువైన నేను ఆజ్ఞాపించు ప్రతి త్యాగము వలన వారి నిబంధనలను పాటించుటకు సమ్మతించుచున్నారని యెరిగిన వారందరు నా చేత అంగీకరించబడుదురు.

9 ఏలయనగా ప్రభువైన నేను వారిని సారవంతమైన నేలమీద, శుద్ధమైన నీటికాలువ ప్రక్కన నాటబడి, విలువైన ఫలములను విస్తారముగా ఇచ్చు చెట్టుగా చేయుదును.

10 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నేను మీకు ఇచ్చియున్న విధానములో ఒక మందిరము సీయోను ప్రదేశములో నా కొరకు నిర్మించబడుట నా చిత్తమైయున్నది.

11 అది నా జనుల దశమభాగముతో త్వరగా నిర్మించబడవలెను.

12 ఇదిగో, ప్రభువైన నేను వారి చేతులనుండి కోరు దశమభాగము, త్యాగము ఇదియే—వారు సీయోను రక్షణ కొరకు నాకు ఒక మందిరము నిర్మించవలెను—

13 అది పరిశుద్ధులందరి కొరకు కృతజ్ఞతను తెలుపు ప్రదేశముగా, అనేకమైన వారి పిలుపులు మరియు స్థానములన్నింటిలో పరిచర్య చేయుటకు పిలువబడిన వారందరి కొరకు ఒక బోధనాప్రదేశముగా ఉండును;

14 తద్వారా వారు వారి పరిచర్యను అవగాహన చేసుకొనుటయందు, సూత్రమందు, నియమమందు, సిద్ధాంతమందు, భూమిమీద దేవుని రాజ్యమునకు సంబంధించిన అన్నివిషయములందు పరిపూర్ణులగుదురు, ఆ రాజ్యపు తాళపుచెవులు మీపైన అనుగ్రహించబడినవి.

15 నా జనులు ప్రభువు నామములో ఒక మందిరమును నిర్మించి, అది పాడుచేయబడకుండునట్లు అపవిత్రమైనదేదియు దానిలో ప్రవేశింపకుండ చేసిన యెడల, దానిపై నా మహిమ నిలుచును;

16 అవును, నా సన్నిధి అక్కడ ఉండును, ఏలయనగా నేను దానిలోనికి వచ్చెదను, హృదయశుద్ధి కలిగి దానిలోనికి వచ్చు వారందరు దేవుని చూచెదరు.

17 కానీ అది పాడుచేయబడిన యెడల నేను దానిలోనికి రాను, నా మహిమ అక్కడ ఉండదు; ఏలయనగా అపవిత్రమైన దేవాలయములలోనికి నేను రాను.

18 ఇదిగో, ఇప్పుడు సీయోను వీటిని చేసిన యెడల ఆమె వర్ధిల్లును, ఆమె వ్యాపించి, చాలా మహిమకరముగా, మిక్కిలి గొప్పగా, చాలా భయంకరముగా అగును.

19 భూలోక జనములు ఆమెను ఘనపరచి ఇలా చెప్పుదురు: నిశ్చయముగా సీయోను మన దేవుని పట్టణము, నిశ్చయముగా సీయోను పడిపోదు, తన ప్రదేశమునుండి కదలదు, ఏలయనగా అక్కడ దేవుడున్నాడు, అక్కడ ప్రభువు హస్తమున్నది.

20 ఆయన తన బలము యొక్క శక్తిచేత ఆమెకు రక్షణగా, ఆమెకు ఎత్తైన గోపురముగా ఉండెదనని ప్రమాణము చేసెను.

21 కాబట్టి, నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోను ఆనందించవలెను, ఏలయనగా ఇది సీయోను అనగా హృదయశుద్ధి గలవారు; కాబట్టి, దుష్టులందరు దుఃఖించుచుండగా సీయోను సంతోషించవలెను.

22 ఏలయనగా, ఇదిగో, దైవసంబంధులుకానీ వారిపైకి సుడిగాలివలె ప్రతీకారము వేగముగా వచ్చుచున్నది; దానిని ఎవడు తప్పించుకొనగలడు?

23 ప్రభువు ఉపద్రవము ప్రతి పగలు ప్రతి రాత్రి వచ్చును, దాని ప్రకటన జనులకు భయము పుట్టించును; అవును, ప్రభువు వచ్చువరకు అది ఆగదు;

24 ఏలయనగా వారి హేయక్రియలకును, వారి దుష్టకార్యములన్నింటికి విరోధముగా ప్రభువు కోపము రగులుకొనెను.

25 అయినప్పటికీ, ఆమెకు నేనాజ్ఞాపించిన సంగతులన్నింటిని గైకొనిన యెడల సీయోను తప్పించుకొనును.

26 కానీ ఆమెకు నేనాజ్ఞాపించిన సంగతులను ఆమె పాటించని యెడల, ఆమె క్రియలన్నింటిని బట్టి కఠినమైన శ్రమలతో, తెగుళ్ళతో, వ్యాధులతో, ఖడ్గముతో, ప్రతీకారముతో, నాశనకరమైన అగ్నితో నేనామెను దర్శించెదను.

27 అయినప్పటికీ, ప్రభువైన నేను ఆమె అర్పణను స్వీకరించితినని, ఆమె ఇకమీదట పాపము చేయకుండిన యెడల ఇవి ఏమియు ఆమె మీదకు రావని దీనిని ఆమె చెవులలో ఒకసారి చదువవలెను.

28 దీవెనలతో నేనామెను దీవించెదను, నిరంతరము విస్తారమైన దీవెనలను ఆమెమీద, ఆమె తరములన్నింటి మీద విస్తరింపజేసెదను. ఆమేన్.