లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 10


10వ ప్రకరణము

కొన్ని భాగాలు అంతకు ముందు 1828 వేసవిలో ఇవ్వబడినప్పటికీ, బహుశా 1829 ఏప్రిల్‌, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు ఈ బయల్పాటు ఇవ్వబడెను. దీనియందు ప్రభువు మోర్మన్ గ్రంథములోని లీహై గ్రంథము యొక్క అనువాదము నుండి వచ్చిన 116 చేతివ్రాత పేజీలలో దుష్టులచేత చేయబడిన మార్పులను గూర్చి జోసెఫ్‌కు తెలియజేయును. మార్టిన్ హారిస్ ఆధీనము నుండి ఈ చేతివ్రాత పేజీలు కోల్పోబడినవి, ఈ పేజీలు అతనికి తాత్కాలికముగా అప్పగించబడినవి. (3వ ప్రకరణ శీర్షిక చూడుము.) ఆ చెడు రూపకల్పన ఏమనగా, దొంగిలించబడిన పేజీలలో ఉన్న అంశము యొక్క ఊహించబడిన పునరానువాదం కొరకు వేచియుండి, ఆ తర్వాత మార్పులు చేసి, దాని వలన కలిగిన భేదాలను చూపించుట ద్వారా అనువాదకునికి అపకీర్తి తెచ్చుటయే. ఈ దురుద్దేశము దుష్టుని వలన పుట్టెనని, మోర్మన్ అనబడే ప్రాచీన నీఫై చరిత్రకారుడు తాను సేకరించిన పలకలను సంక్షేపము చేయుచున్నప్పుడే అది ప్రభువుకు తెలియునని మోర్మన్ గ్రంథములో చూపబడినది (మోర్మన్ వాక్యములు 1:3–7 చూడుము).

1–26, ప్రభువు కార్యమును అడ్డగించుటకు సాతాను దుష్టులను పురికొల్పును; 27–33, అతడు మనుష్యుల ఆత్మలను నాశనము చేయుటకు కోరుచున్నాడు; 34–52, మోర్మన్ గ్రంథము ద్వారా సువార్త లేమనీయులకు మరియు అన్ని దేశములకు వెళ్ళవలెను; 53–63, ప్రభువు ఆయన సంఘమును, ఆయన సువార్తను మనుష్యుల మధ్య స్థాపించును; 64–70, పశ్చాత్తాపపడిన వారిని ఆయన తన సంఘములోనికి చేర్చును, విధేయులను రక్షించును.

1 ఇదిగో ఇప్పుడు, నేను నీతో చెప్పునదేమనగా ఊరీము తుమ్మీము ద్వారా అనువదించుటకు నీకు శక్తి ఇవ్వబడిన ఆ వ్రాతలను ఒక దుష్టునికి నీవు అప్పగించితివి గనుక వాటిని నీవు కోల్పోతివి.

2 అదే సమయములో నీ బహుమానమును కూడా నీవు కోల్పోతివి, నీ మనస్సు అంధకారమయ్యెను.

3 అయినప్పటికీ, ఇప్పుడది నీకు తిరిగి పునరుద్ధరించబడినది; కాబట్టి నీవు నమ్మకముగా నుండి, నీవు ప్రారంభించినట్లుగానే మిగిలిన అనువాదపు పనిని పూర్తి చేయువరకు కొనసాగించునట్లు చూడుము.

4 నీకున్న బలము కంటే వేగముగా పరుగెత్తకుము, లేదా నీవు అనువదించుటకు తోడ్పడు వనరుల కంటే ఎక్కువగా పనిచేయకుము; కానీ అంతము వరకు శ్రద్ధ కలిగియుండుము.

5 నీవు అజేయుడవగునట్లు ఎల్లప్పుడు ప్రార్థించుము; తద్వారా నీవు సాతానును జయించవచ్చును, అతని పనిలో సహకరించు సాతాను సేవకుల చేతులలో నుండి నీవు తప్పించుకొనవచ్చును.

6 ఇదిగో, వారు నిన్ను నాశనము చేయుటకు ప్రయత్నించుచున్నారు; నీవు నమ్మిన మనుష్యుడు కూడా నిన్ను నాశనము చేయుటకు ప్రయత్నించెను.

7 ఈ కారణముచేత అతడు దుర్మార్గుడని నేను చెప్పితిని, ఏలయనగా నీకప్పగించబడిన వాటిని తీసుకొనిపోవుటకు అతడు ప్రయత్నించెను; నీ బహుమానమును కూడా నాశనము చేయుటకు అతడు ప్రయత్నించెను.

8 వ్రాతలను నీవతని చేతులకు అప్పగించితివి గనుక, ఇదిగో, దుర్మార్గులు నీ నుండి వాటిని తీసుకొనిరి.

9 కాబట్టి, పరిశుద్ధమైన దానిని నీవు దుష్టత్వమునకు ఇచ్చివేసితివి.

10 ఇదిగో, నీవు వ్రాయునట్లు చేసిన లేదా నీవు అనువదించిన, నీ చేతులలో నుండి కోల్పోబడిన పదములను మార్చివేయుటకు సాతాను దానిని వారి హృదయాలలో రేకెత్తించెను.

11 ఇదిగో, నేను నీకు చెప్పునదేమనగా, వారు పదములను మార్చివేసిరి గనుక, అవి నీవు అనువదించి, వ్రాయునట్లు చేసిన వాటికి భిన్నముగానున్నవి;

12 ఈ విధముగా, ఈ కార్యమును అతడు నాశనము చేయునట్లు కుట్ర పన్నుటకు అపవాది ప్రయత్నించెను;

13 ఏలయనగా దీనిని చేయవలెనని అతడు వారి హృదయాలలో రేకెత్తించెను; తద్వారా నీవు అనువదించుచున్నట్లు నటించిన పదాలయందు వారు నిన్ను పట్టుకొనియున్నారని వారు అబద్ధము చెప్పుదురు.

14 నేను నిశ్చయముగా నీతో చెప్పునదేమనగా, ఈ విషయమందు సాతాను తన దుష్ట సంకల్పమును సాధించుటకు నేను అనుమతించను.

15 ఏలయనగా ఇదిగో, దానిని తిరిగి అనువదించాలని అడుగుచూ ప్రభువైన నీ దేవుని నీవు శోధించులాగున చేయుటకు అతడు దీనిని వారి హృదయాలలో రేకెత్తించెను.

16 తరువాత వారిట్లు చెప్పుదురు మరియు వారి హృదయాలలో ఇట్లు ఆలోచించెదరు—అనువదించుటకు దేవుడతనికి శక్తినిచ్చెనో లేదో మనము చూచెదము; అట్లైన యెడల, అతనికి ఆయన మరలా శక్తినిచ్చును;

17 ఒకవేళ దేవుడు అతనికి మరలా శక్తినిచ్చిన యెడల లేదా అతడు మరలా అనువదించిన యెడల లేదా మరియొక మాటలో, అతడు అదే పదములను తిరిగి తెచ్చిన యెడల, ఇదిగో, అలాంటి వాటినే మనము కలిగియున్నాము మరియు మనము వాటిని మార్చివేసితిమి;

18 కాబట్టి అవి సరిపోల్చవు మరియు అతడు తన మాటలలో అబద్ధమాడెనని, అతనికి ఎట్టి బహుమానము లేదని, అతనికి ఏ శక్తి లేదని మనము చెప్పెదము;

19 కావున అతడిని, ఆ కార్యమును కూడా మనము నాశనము చేసెదము; తుదకు మనము సిగ్గుపడకుండునట్లు, లోక మహిమను మనము పొందునట్లు దీనిని మనము చేసెదము.

20 వారి హృదయాలపై సాతాను గొప్ప పట్టును కలిగియున్నాడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; మంచికి విరోధముగా పాపము చేయుటకు అతడు వారిని పురికొల్పును;

21 వారి హృదయములు చెడిపోయి, దుర్మార్గము, హేయక్రియలతో నిండియున్నవి; వారి క్రియలు చెడ్డవి గనుక వారు వెలుగు కంటే చీకటినే ప్రేమించెదరు; కాబట్టి వారు నన్ను అడగరు.

22 వారి ఆత్మలను నాశనమునకు నడిపించునట్లు సాతాను వారిని పురికొల్పును.

23 ఆ విధముగా దేవుని కార్యమును నాశనము చేయుటకు ఆలోచించుచు, అతడు ఒక మోసపూరిత ప్రణాళిక చేసెను; కానీ దీనిని వారి చేతులలో నుండి నేను ఆపేక్షించుచున్నాను, అది తీర్పు దినమున వారి అవమానమునకు, నిందకు కారణమగును.

24 అతడు వారి హృదయాలను ఈ కార్యమునకు వ్యతిరేకముగా కోపమునకు పురికొల్పును.

25 అవును, అతడు వారితో చెప్పును: మోసపుచ్చుము, పట్టుకొనుటకు వేచియుండుము, తద్వారా మీరు నాశనము చేయవచ్చును; ఇదిగో ఇది హానికరము కాదు. ఆ విధముగా అతడు వారిని పొగుడును, ఒకనిని అబద్ధమందు పట్టుకొని, వానిని నాశనము చేయుటకు అబద్ధమాడుట పాపము కాదని వారికి చెప్పును.

26 ఆ విధముగా అతడు వారిని పొగుడును, వారి ఆత్మలను నరకము వరకు ఈడ్చుటకు వారిని నడిపించును; ఆ విధముగా వారు పన్నిన వలలో వారే పడునట్లు అతడు చేయును.

27 అతడు ఆ విధముగా భూమియందు పైకి, క్రిందికి, ముందుకు, వెనుకకు తిరుగులాడుచు, మనుష్యుల ఆత్మలను నాశనము చేయుటకు ప్రయత్నించుచున్నాడు.

28 నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మోసము చేయుటకు అబద్ధమాడువానికి శ్రమ, ఎందుకనగా మోసపుచ్చుటకు ఇతరులు అబద్ధమాడెదరని అతడనుకొనును, అట్టివారు దేవుని న్యాయము నుండి మినహాయింపబడరు.

29 ఇదిగో ఇప్పుడు, వారు ఈ మాటలను మార్చివేసిరి, ఎందుకనగా సాతాను వారితో—అతడు నిన్ను మోసపుచ్చెనని చెప్పును. ఆ విధముగా ప్రభువైన నీ దేవుడిని నీవు శోధించులాగున చేయుటకు, అపరాధము చేయుటకు అతడు వారిని పొగడును.

30 ఇదిగో నేను నీతో చెప్పునదేమనగా, నీ చేతులలో నుండి కోల్పోబడిన ఆ పదములను నీవు మరలా అనువదించకూడదు;

31 ఏలయనగా, ఆ పదములకు వ్యతిరేకముగా అబద్ధమాడవలెననే వారి చెడు ప్రణాళికలను వారు సాధించకూడదు. ఏలయనగా, అలాంటి పదములనే నీవు ముందుకు తెచ్చిన యెడల, నీవు అబద్ధమాడితివని, అనువాదము చేయుచున్నట్లు నటించితివని, కానీ ఆ విధముగా నీవు చేసిన దానికి నీవే వ్యతిరేకముగా మాట్లాడితివని వారు చెప్పుదురు.

32 ఇదిగో, దీనిని వారు ప్రచురించెదరు, సాతాను నీకు విరుద్ధముగా కోపమును రేపుటకు జనుల హృదయాలను కఠినపరచును, తద్వారా వారు నా మాటలను నమ్మరు.

33 ఆ విధముగా ఈ తరములో ఈ కార్యము ముందుకు రాకుండునట్లు, ఈ తరములో నీ సాక్ష్యమును అణచివేయుటకు సాతాను ఆలోచించును.

34 కానీ ఇదిగో, ఇందులో జ్ఞానము కలదు, నేను నీకు జ్ఞానమును చూపించి, ఈ సంగతులను గూర్చి నీవేమి చెయ్యవలెనో ఆజ్ఞలనిచ్చితిని గనుక, అనువాదపు పనిని నీవు పూర్తి చేయువరకు దీనిని లోకమునకు చూపకుము.

35 నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకుము: ఇందులో జ్ఞానము కలదు, దీనిని లోకమునకు చూపకుము—ఇదిగో నేను చెప్పియున్నాను, దీనిని లోకమునకు చూపకుము, తద్వారా నీవు కాపాడబడుదువు.

36 ఇదిగో, నీతిమంతులకు దీనిని నీవు చూపరాదని నేను చెప్పుట లేదు;

37 కానీ అన్నివేళలా నీవు నీతిమంతులను వివేచింపలేవు లేదా అన్నివేళలా నీవు నీతిమంతుల నుండి దుష్టులను గుర్తించలేవు, కాబట్టి నేను నీతో చెప్పునదేమనగా, ఈ అంశమును గూర్చి అన్ని సంగతులను లోకమునకు తెలియజేయుట సరియని నేను చూచువరకు మౌనముగానుండుము.

38 ఇప్పుడు నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీవు వ్రాసి, నీ చేతులలో నుండి కోల్పోబడిన ఆ సంగతుల వృత్తాంతము నీఫై పలకలపై చెక్కబడెను.

39 అవును, ఈ సంగతుల ప్రత్యేక వృత్తాంతము నీఫై యొక్క పలకలపై ఇవ్వబడెనని ఆ వ్రాతలలో చెప్పబడిన దానిని నీవు జ్ఞాపకము చేసుకొనుము.

40 ఇప్పుడు, నీఫై పలకలపై నున్న వృత్తాంతము ప్రత్యేకముగా ఆ విషయములకు సంబంధించినది, కావున నేను నా జ్ఞానముతో దానిని ఈ వృత్తాంతములో జనుల దృష్టికి తెచ్చెదను—

41 కాబట్టి, నీఫై పలకలపైనున్న చెక్కడములను బెంజమిన్ రాజు పరిపాలన వద్దకు నీవు వచ్చువరకు లేదా నీవు అనువదించి, నీ ఆధీనములో ఉంచుకొనిన దానివద్దకు వచ్చువరకు నీవు అనువదించవలెను;

42 ఇదిగో, నీఫై గ్రంథముగా నీవు దీనిని ప్రచురించవలెను; ఆ విధముగా నా మాటలను మార్చిన వారిని నేను భంగపరిచెదను.

43 వారు నా కార్యమును నాశనము చేయుటకు నేను అనుమతించను; అవును, అపవాది యొక్క కుయుక్తి కంటే నా జ్ఞానము గొప్పదని వారికి నేను చూపెదను.

44 ఇదిగో, వారు కొంత భాగమును లేదా నీఫై వృత్తాంతము యొక్క సంక్షేపమును మాత్రమే కలిగియున్నారు.

45 నీఫై పలకలపై చెక్కబడియున్న అనేక విషయములు నా సువార్తను గూర్చి అధిక గ్రహింపును ఇచ్చును; కాబట్టి, నీఫై చెక్కడముల ఈ మొదటి భాగమును నీవు అనువదించి ఈ కార్యము నందు ముందుకు పంపుట నా యందు వివేకమైయున్నది.

46 మరియు ఇదిగో, ఈ జనుల యొద్దకు రావలెనని నా పరిశుద్ధ ప్రవక్తలు, నా శిష్యులు తమ ప్రార్థనల యందు కోరిన నా సువార్త భాగములన్నిటిని ఈ కార్యము యొక్క శేషభాగము కలిగియున్నది.

47 వారి ప్రార్థనల యందు వారికున్న విశ్వాసమును బట్టి అది వారికివ్వబడునని నేను సెలవిచ్చితిని;

48 వారి దినములలో వారు బోధించుటకు నేను వారికిచ్చిన నా సువార్త, వారి సహోదరులైన లేమనీయులకు, తమ కలహముల వలన లేమనీయులుగా మారిన వారి యొద్దకు వచ్చునేమో అనునది వారి విశ్వాసమైయుండెను.

49 ఇప్పుడు అంతయు ఇదియే కాదు—వారి ప్రార్థనల యందు వారికున్న విశ్వాసమేమనగా, ఇతర జనములు ఈ దేశమును స్వాధీనపరచుకొన్నప్పటికీ, ఈ సువార్త వారికి తెలియజేయబడును;

50 కాబట్టి వారు తమ ప్రార్థనలలో, ఈ దేశములో ఈ సువార్తను నమ్మువారెవరైనా సరే నిత్యజీవమును పొందెదరని ఈ దేశముపై ఒక దీవెనను విడిచిపెట్టిరి;

51 తద్వారా ఏ జనము, వంశము, భాష, లేదా ప్రజలకు చెందిన వారికైనను ఇది ఉచితము కావచ్చు.

52 ఇదిగో ఇప్పుడు, వారి ప్రార్థనల యెడల వారికున్న విశ్వాసమును బట్టి నా సువార్త యొక్క ఈ భాగాన్ని నా జనుల దృష్టికి నేను తెచ్చెదను. ఇదిగో, వారు పొందియున్న దానిని నిర్మించుటకే గాని నాశనము చేయుటకు దీనిని నేను తెచ్చుట లేదు.

53 ఈ హేతువు చేత నేను సెలవిచ్చితిని: ఈ తరమువారు తమ హృదయాలను కఠినపరచుకొనని యెడల, వారి మధ్య నేను నా సంఘమును స్థాపించెదను.

54 నా సంఘమును నాశనము చేయుటకు దీనిని నేను చెప్పుటలేదు, కానీ నా సంఘమును నిర్మించుటకే దీనిని నేను చెప్పుచున్నాను;

55 కాబట్టి, నా సంఘమునకు చెందిన వారెవరైనా సరే భయపడనవసరము లేదు; అట్టివారు పరలోకరాజ్యమును స్వాస్థ్యముగా పొందెదరు.

56 కానీ, నాకు భయపడకుండా నా ఆజ్ఞలను పాటించని వారు, లాభము పొందుటకు వారికొరకు వారే సంఘములను నిర్మించుకొని, దుష్టత్వము జరిగించుచూ అపవాది రాజ్యమును నిర్మించు వారందరు—అట్టివారిని నేను ఆటంకపరచి, నాభి వరకు కంపించి, వణకునట్లు చేయుదునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

57 ఇదిగో, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే. నేను నా స్వజనుల యొద్దకు వచ్చితిని, కానీ నా స్వజనులు నన్ను చేర్చుకొనలేదు.

58 చీకటిలో ప్రకాశించు వెలుగును నేనే, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను.

59 ఈ దొడ్డివి కానివి వేరొక గొఱ్ఱెలు నాకు కలవని నా శిష్యులకు చెప్పినది నేనే, అక్కడున్న అనేకులు నన్ను అర్థము చేసుకొనలేదు.

60 నాకు వేరొక గొఱ్ఱెలు కలవని, వారు యాకోబు వంశము యొక్క ఒక శాఖ అని ఈ జనులకు నేను చూపెదను;

61 వారు నా నామమున చేసిన అద్భుతకార్యములను నేను వెలుగులోనికి తెచ్చెదను;

62 అవును, వారికి పరిచర్య చేయబడిన నా సువార్తను కూడా నేను వెలుగులోనికి తెచ్చెదను, ఇదిగో, నీవు పొందిన దానిని వారు తిరస్కరించరు, కానీ వారు దానిని నిర్మించి, నా సిద్ధాంతము యొక్క సత్యాంశములను, అనగా నా యందున్న సిద్ధాంతమును మాత్రమే వారు వెలుగులోనికి తెచ్చెదరు.

63 నా సువార్తను స్థాపించునట్లు దీనిని నేను చేసెదను, తద్వారా ఎక్కువ కలహముండదు; అవును, నా సిద్ధాంత అంశములను గూర్చి సాతాను జనుల హృదయాలను కలహమునకు రేపుచున్నాడు; ఈ సంగతులలో వారు పొరపడిరి, ఏలయనగా వారు లేఖనములను వక్రీకరించెదరు మరియు వాటిని అర్థము చేసుకొనరు.

64 కాబట్టి, వారికి ఈ గొప్ప మర్మమును నేను తెలియజేసెదను;

65 ఇదిగో, వారు తమ హృదయాలను కఠినపరచుకొనని యెడల, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో అలాగే నేనును వారిని చేర్చుకొందును;

66 అవును, వారు వచ్చిన యెడల జీవజలములను వారు ఉచితముగా త్రాగెదరు.

67 ఇదిగో, ఇది నా సిద్ధాంతము—ఎవరైతే పశ్చాత్తాపపడి నా యొద్దకు వచ్చెదరో, అట్టివారే నా సంఘమువారు.

68 దీనికంటే ఎక్కువైనను, తక్కువైనను ప్రకటించువాడెవడో, వాడు నా వాడు కాడు, కానీ నా విరోధియైయున్నాడు; కాబట్టి వాడు నా సంఘమునకు చెందినవాడు కాడు.

69 ఇదిగో, ఎవడైనా నా సంఘమునకు చెందియుండి, నా సంఘములో అంతము వరకు సహించినయెడల, వానిని నేను నా బండపై నిర్మించెదను, నరకపు ద్వారములు వారి యెదుట నిలువజాలవు.

70 ఇప్పుడు, లోకమునకు జీవమును, వెలుగునైయున్న నీ విమోచకుడు, నీ ప్రభువు, నీ దేవుడైన ఆయన మాటలను జ్ఞాపకముంచుకొనుము. ఆమేన్.