లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 85


85వ ప్రకరణము

1831, నవంబరు 27న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఇండిపెండెన్స్, మిస్సోరిలో నివశించుచున్న విలియం డబ్ల్యు. ఫెల్ఫ్స్‌కు ప్రవక్త వ్రాసిన లేఖ యొక్క సంగ్రహణమే ఈ బయల్పాటు. పరిశుద్ధులు సీయోనుకు వెళ్ళిరి, కానీ వారి ఆస్థులు సమర్పించాలన్న ఆజ్ఞను గైకొనలేదు, తద్వారా సంఘమందున్న ఏర్పాటు ప్రకారము తమ స్వాస్థ్యములను పొందని ఆ పరిశుద్ధులను గూర్చిన ప్రశ్నలకు ఇది జవాబిచ్చును.

1–5, సమర్పణ ద్వారా సీయోనులో స్వాస్థ్యములు పొందబడవలెను; 6–12, బలపరాక్రమములు గలవాడొకడు సీయోనులో పరిశుద్ధులకు వారి స్వాస్థ్యములనిచ్చును.

1 ప్రభువు నియమించిన తన గుమాస్తా యొక్క బాధ్యత యేదనగా సీయోనులో జరుగు అన్ని సంగతులను, ఆస్థులను సమర్పించి బిషప్పు నుండి చట్టరీత్యా స్వాస్థ్యములను పొందిన వారందరిని గూర్చిన చరిత్రను, సాధారణ సంఘ వృత్తాంతమును వ్రాయుట;

2 వారి జీవనశైలి, వారి విశ్వాసము, వారి కార్యములు; తమ స్వాస్థ్యములను పొందిన తరువాత విశ్వాసభ్రష్టత్వము చెందిన భ్రష్టుల గురించి వ్రాయుట. ఆయన నియమించిన ప్రభువు గుమాస్తా యొక్క పనియైయున్నది.

3 పగతీర్చుకొను దినమున కాల్చబడుట కొరకు సిద్ధపరచుటకు ఆయన తన జనులకు దశమభాగ నియమమును ఇచ్చునట్లు ఆయన ఇచ్చియున్న ఆయన ధర్మశాస్త్రము ప్రకారము తమ స్వాస్థ్యమును సమర్పణ ద్వారా పొందనివారి పేర్లు దేవుని జనులతో నమోదు చేయబడుట దేవుని చిత్తముకు, ఆజ్ఞకు వ్యతిరేకము.

4 లేదా వారి వంశావళి ఉంచబడరాదు, లేదా సంఘ చరిత్రలోనైనను, ఏ వృత్తాంతములలోనైనను కలిగియుండకూడదు.

5 వారి పేర్లుయైనను, వారి పితరుల పేర్లుయైనను, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన పిల్లల పేర్లుయైనను కనుగొనబడవని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

6 కాబట్టి, మిక్కిలి నిమ్మళమైన స్వరము ఈవిధముగా చెప్పుచున్నది, అది గుసగుసలాడుచు అన్నిసంగతుల గుండా చొచ్చుకొనిపోవును, అది ప్రత్యక్షపరచునప్పుడు ఈ విధముగా చెప్పుచు తరచు నా ఎముకలు వణకునట్లు చేయును:

7 దేవుడును ప్రభువునైన నేను, బలపరాక్రమములు కలిగి, తన చేతితో రాజదండమును పట్టుకొని, వెలుగును వస్త్రముగా చుట్టుకొనిన ఒకనిని పంపుదును, అతని నోరు మాటలను, నిత్యజీవపు మాటలను పలుకును; దేవుని మందిరమును సక్రమముగా ఉంచుటకు, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో నమోదు చేయబడి, పేర్లు కనుగొనబడిన పరిశుద్ధులు, వారి పితరుల పేర్లు, వారి పిల్లలు, వారి స్వాస్థ్యములను చీట్లు వేయుట ద్వారా అమర్చుటకు అతని హృదయము సత్యపు ఊటగానుండును;

8 దేవుని చేత పిలువబడి, నియమించబడిన ఆ మనుష్యుడు, దేవుని మందసమును సరిచేయుటకు తన చేతిని చాచినప్పుడు, అతడు కాంతివంతమైన మెరుపుతీగ వలన కొట్టబడిన చెట్టువలే, మరణపుముల్లు చేత నశించును.

9 జ్ఞాపకార్థ గ్రంథములో వ్రాయబడని వారు ఆ దినమందు ఏ స్వాస్థ్యమును పొందరు, కానీ వారు నరకబడి, వేషధారులతో వారికి పాలునియమించబడును, అక్కడ ఏడ్పును, పండ్లుకొరుకుటయు ఉండును.

10 ఈ సంగతులను నాయంతట నేను చెప్పుటలేదు; కాబట్టి, ప్రభువు సెలవిచ్చెను గనుక, ఆయనే నెరవేర్చును.

11 ప్రధాన యాజకత్వమునకు చెందినవారు, తమ పేర్లు ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడనివారు లేదా విశ్వాస భ్రష్టత్వమును పొందినవారిగా కనుగొనబడువారు, లేదా సంఘము నుండి కొట్టివేయబడినవారు, అదేవిధముగా లఘు యాజకత్వము కలిగినవారు, లేదా సభ్యులు ఆ దినమందు మహోన్నతుని పరిశుద్ధుల మధ్య స్వాస్థ్యమేదియు పొందరు;

12 కాబట్టి, ఎజ్రా రెండవ అధ్యాయము, అరువది ఒకటి, రెండు వచనాలలో వ్రాయబడియున్నట్లుగా, యాజకుల పిల్లలకు చేయబడిన విధముగా వారికిని చేయబడును.