సర్వసభ్య సమావేశము
శాంతికరమైన సువార్తను బోధించుట
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


శాంతికరమైన సువార్తను బోధించుట

వినే వారందరితో యేసు క్రీస్తు యొక్క శక్తిని మరియు శాంతిని పంచుకునే పవిత్రమైన బాధ్యత మనపై ఉన్నది.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, సర్వసభ్య సమావేశానికి స్వాగతం! నేను ఈ రోజు కోసం గొప్ప ఆతృతతో ఎదురుచూసాను. మీ కొరకు నేను అనుదినము ప్రార్థిస్తాను. ఈ సమావేశము మీలో ప్రతీ ఒక్కరికి ఆత్మీయ పునరుజ్జీవన సమయం కావాలని కూడా నేను ప్రార్థించాను.

గత సమావేశం నుండి, ప్రపంచంలో కష్టాలు కొనసాగాయి. ప్రపంచ మహమ్మారి ఇప్పటికీ మన జీవితాలపై తీవ్ర ప్రభావం కలిగియుంది. లక్షలాదిమంది అమాయక పురుషులు, స్త్రీలు మరియు పిల్లలపై భయాందోళనలను కురిపించే కలహముతో ఇప్పుడు ప్రపంచం సంక్షోభములోనున్నది.

యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినెదమని, భూమి అంతయు సంక్షోభములోనుండునని ప్రవక్తలు మన కాలాన్ని ముందుగానే చూసారు.1 యేసు క్రీస్తు అనుచరులుగా, దేశాల నాయకులను వారి విభేదాలకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనమని మేము వేడుకుంటున్నాము. అవసరమైన వారి కోసం ప్రార్థించమని, బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి వారు చేయగలిగినదంతా చేయమని మరియు ప్రధానమైన సంఘర్షణలు ఏవైనా ఉంటే వాటిని ముగించడంలో ప్రభువు సహాయం కోరమని మేము ప్రతీచోటా ప్రజలకు పిలుపునిస్తున్నాము.

సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు సువార్త యొక్క అవసరం నేటి కంటే ఎక్కువగా మునుపెన్నడూ లేదు. రక్షకుడు వేటి కోసం నిలిచారో మరియు బోధించారో వాటన్నిటిని కలహము ఉల్లంఘిస్తుంది. నేను ప్రభువైన యేసు క్రీస్తును ప్రేమిస్తున్నాను మరియు శాంతికి ఆయన సువార్త మాత్రమే శాశ్వతమైన పరిష్కారమని సాక్ష్యమిస్తున్నాను. ఆయన సువార్త శాంతికరమైన సువార్త.2

లోకములో చాలామంది భయముతో నిండియున్నప్పుడు, ఆయన సువార్త మాత్రమే దానికి సమాధానము.3 “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి”4 అని ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన సూచనను మనం అనుసరించాల్సిన తక్షణ అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. ఎవరైతే విని, వారి జీవితాలలో దేవునికి ప్రాధాన్యత ఇస్తారో వారందరితో యేసు క్రీస్తు యొక్క శక్తిని మరియు శాంతిని పంచుకునే పవిత్రమైన బాధ్యత మనపై ఉంది.

దేవునితో నిబంధనలు చేసిన ప్రతీ వ్యక్తి ఇతరుల గురించి శ్రద్ధ వహిస్తానని మరియు అవసరమైన వారికి సేవ చేస్తానని వాగ్దానం చేసారు. మనం దేవునిపై విశ్వాసాన్ని ప్రదర్శించవచ్చు మరియు “[మనలో] ఉన్న నిరీక్షణ” గురించి అడిగేవారిపట్ల ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవచ్చు.5 ఇశ్రాయేలును సమకూర్చుటలో మనలో ప్రతీ ఒక్కరూ ఒక పాత్రను పోషించవలసి ఉన్నది.

యోగ్యుడైన, సమర్థుడైన ప్రతీ యువకుడు సువార్తసేవ కోసం సిద్ధపడి, సేవ చేయాలని ప్రభువు కోరారని ఈ రోజు నేను గట్టిగా ధృవీకరిస్తున్నాను. కడవరి దిన పరిశుద్ధ యువకులకు సువార్త సేవ అనేది ఒక యాజకత్వ బాధ్యత. యౌవనులారా, ఇశ్రాయేలీయుల వాగ్దాన సమకూర్పు జరుగుతున్న ఈ సమయం కొరకు మీరు ప్రత్యేకించబడ్డారు. మీరు సువార్తసేవ చేస్తున్నప్పుడు, ఈ అపూర్వమైన సంఘటనలో మీరు కీలక పాత్ర పోషిస్తారు!

యౌవన మరియు సమర్థులైన సహోదరీలారా, మీకు సువార్తసేవ అనేది శక్తివంతమైనదే, కానీ ఐచ్ఛికమైన అవకాశం. మేము సువార్తికురాళ్ళను ప్రేమిస్తాము మరియు వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తాము. ఈ కార్యానికి మీరు అందించే సహకారం అద్భుతమైనది! మీరు సువార్తసేవ చేయాలని ప్రభువు కోరుతున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రార్థించండి మరియు పరిశుద్ధాత్మ మీ హృదయానికి, మనస్సుకు ప్రతిస్పందిస్తుంది.

ప్రియమైన యువ మిత్రులారా, మీరందరూ ప్రభువుకు చాలా ముఖ్యమైనవారు. ఇశ్రాయేలీయులను సమకూర్చడంలో సహాయం చేయడానికి ఆయన మిమ్మల్ని ఇంతవరకు ప్రత్యేకపరచి ఉంచారు. సువార్తను ప్రకటించుటకైనా లేదా సేవా పరిచర్య చేయుటకైనా సరే, సువార్త సేవ చేయాలనే మీ నిర్ణయం మిమ్మల్ని మరియు ఇతరులను ఆశీర్వదిస్తుంది. పరిస్థితులు అనుమతించినప్పుడు సేవ చేయడానికి మేము వృద్ధులైన జంటలను కూడా స్వాగతిస్తాము. వారి ప్రయత్నాలు భర్తీ చేయలేనివి.

సువార్తికులు అందరూ రక్షకుని గురించి బోధిస్తారు మరియు సాక్ష్యమిస్తారు. లోకములో ఉన్న ఆత్మీయ చీకటి, ఎప్పుడూ లేనంత ఎక్కువగా యేసు క్రీస్తు యొక్క వెలుగు అవసరమయ్యేలా చేస్తుంది. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త గురించి తెలుసుకోవడానికి ప్రతీఒక్కరు అర్హులు. “సమస్త జ్ఞానమును [మించిన]” నిరీక్షణ మరియు సమాధానము ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి ప్రతీవ్యక్తి అర్హుడు.6

ఈ సమావేశము మీకు శాంతి సమయముగా మరియు ఆధ్యాత్మిక విందుగా ఉండును గాక. ఈ సభలలో మీరు వ్యక్తిగత బయల్పాటును వెదికి, స్వీకరించెదరు గాకయని యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.